Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
21st Episode

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాప్ అవుట్ గాడి ప్రేమకథ

జరిగిన కథ: త్రివిక్రం, వరేణ్య అమలాపురం వెళ్తుండగా దారిలో పెద్ద గాలితో కూడిన వర్షం, ఉరుములు, మెరుపులతో వాతావరణమంతా పట్టపగలే చీకటి కమ్మినట్లుగా అవడంతో వరేణ్య భయంతో త్రివిక్రం ను హత్తుకుంటుంది.

''నాకే వ్రతభంగం కాలేదు. ఎందుకంటే నావ్రతమే నువ్వు కదా'' అంటూ కారును ముందుకు దూకించింది. 'తల పట్టుకున్నాడు త్రివిక్రమ్‌.

ప్రశాంతమైన రాజరాజేశ్వరి పేటలోని ఒక వీధిలో వుందాగెస్ట్‌హౌస్‌. చుట్టూ కాంపౌండ్‌వాల్‌ ఆవరణలో చక్కని గార్డెన్‌ మధ్యన అందమైన రెండంతస్తుల చిన్న కట్టడం. ఇంకా చెప్పాలంటే అధునాతనంగా అన్ని వసతులతో కూడిన గెస్ట్‌హౌస్‌.

ఆ గెస్ట్‌హౌస్‌ని నమ్ముకొని నమ్మకమైన నడివయస్సు భార్య భర్తలిద్దరు చాలాకాలంగా అక్కడే పనిచేస్తున్నారు. గెస్ట్‌హౌస్‌ సంరక్షణ బాధ్యతేకాదు, కంపెనీ తరఫున వచ్చిన వాళ్ళకు వంట వార్పు వసతి అన్ని కూడా వాళ్ళే చూస్తారు.

ఆ టైంలో పోర్టికోలోకి వచ్చి ఆగిన కారును చూసి భార్యభర్తలిద్దరూ ఆశ్చర్యపోతూ అవుటవుస్‌లోంచి తడుస్తూనే పరుగెత్తుకొచ్చారు. కారు  దిగిన వరేణ్య చూడగానే వాళ్ళ ఆశ్చర్యం మరింత ఎక్కువయింది.

'అమ్మాయిగారు మీరా.........'' అనడిగాడు నమ్మలేట్టు.

''నేనేగాని..........ఇదిగో అచ్చయ్యా! గొడుగుందా? ఉంటే వెంటనే పట్రా. కారు షెడ్లో పెట్టాలి, తుఫానుగాలికి దీన్ని పోర్టికోలో వదలటం మంచిదికాదు, రంగి.........తియ్యి...........ముందు తులుపులు తియ్యి'' అంది వరేణ్య.

రంగమ్మ గెస్ట్‌హౌస్‌ తాళంతీసి తలుపులు బార్లాతెరిచి లోనకు వెళ్ళి చకచకా లైట్లు ఆన్‌చేసింది. అచ్చయ్య లోపలినుంచి గొడుగు తీసుకొచ్చాడు.

''వెళ్ళి గ్యారెజ్‌ తాళం తియ్యి సార్‌ కారు తీసుకొస్తారు. ఆయన్ని జాగ్రత్తగా గొడుగులో తీసుకురా'' చెప్పింది.

''అట్టనే అమ్మాయిగారు'' అంటూ గొడుగు వేసుకుని వర్షంలో అంతదూరంలోని గ్యారేజ్‌వైపు పరిగెత్తాడు. త్రివిక్రమ్‌ కారు స్టార్ట్‌చేసి అటుతీసుకెళ్ళాడు.

వరేణ్య వేగంగా లోనకు వచ్చి రంగమ్మను పిలిచింది.

''ఏయ్‌! నీకు, నీ మొగుడికి కూడా చెప్తున్నాను. నేను ఎవరనేది నాతో వచ్చిన వినోద్‌సార్‌కి తెలీకూడదు. నీ మొగుడిక్కూడా చెప్పు''. అంటూ హెచ్చరించింది.

''తెలిస్తే ఏమవుతుందమ్మాయిగారు'' అమాయకంగా అడిగింది రంగమ్మ.

''మీ ఉద్యోగం ఊడుతుంది సరేనా? వెళ్ళు. చాలా ఆకలిగావుంది.''

''అలాగేనమ్మా, మీరు రెస్ట్‌ తీసుకోండి, నేరెడీ చేస్తాగదా'' అంటూ హుషారుగా కిచెన్‌లోకి వెళ్ళిపోయింది రంగమ్మ.

కాస్సేపటికి అచ్చయ్య, త్రివిక్రమ్‌లు వెనక్కి వచ్చారు. రంగమ్మ మొగుడ్ని పక్కకుపిలిచి, అమ్మాయిగారు ఆర్డర్‌ని మొగుడి చెవిలో వేసింది. అలా అసలు విషయం త్రివిక్రమ్‌కి తెలీకుండా ముందే జాగ్రత్త పడింది వరేణ్య.

ముందు అర్జంటుగా చెరో కప్పు కాఫీ అందించింది రంగమ్మ. కాఫీ తాగాక పక్కపక్కనున్న రెండు బెడ్‌రూముల్లో ఒకటి త్రివిక్రమ్‌కి కేటాయించి రెండో బెడ్‌రూంలోకి తను వెళ్ళింది వరేణ్య.

రాత్రికి వైజాగ్‌ తిరిగి వెళ్ళిపోతామన్న ఉద్దేశంతోఇద్దరూ స్పేర్‌గా డ్రస్సులేమి తెచ్చుకోలేదు. అయితే అది కంపెనీ గెస్ట్‌హౌస్‌ గాబట్టి అవసరానికి వుంటాయని టవల్స్‌తోబాటు లుంగీలు, నైటీల వంటివి కూడా వుంచారు. అంచేత బట్టలు మార్చుకోడానికి ఇబ్బంది ఎదురు కాలేదు. చక్కగా స్నానంచేసి లుంగీలోకి మారిపోయాడు త్రివిక్రమ్‌. వరేణ్య నైటీలోకి మారిపోయింది. ఈ లోపల వేడి వేడి పకోడి తయారుచేసి తెచ్చింది రంగమ్మ.

అచ్చయ్యను మీల్స్‌ తీసుకురావటానికి హోటల్‌కి పంపించింది వరేణ్య. ఈలోపల పకోడి తింటూ టి.వి. చూస్తూ కాలక్షేపం చేసారు. మొత్తానికి రాత్రి భోజనాలు ముగించేసరికి తొమ్మిది దాటింది టైం. అచ్చయ్య, రంగమ్మలు అవుట్‌ హౌస్‌కు వెళ్ళిపోయారు. ముఖద్వారం మూసి లాక్‌చేసింది వరేణ్య.

బయట కుండపోతగా పడుతూనే వుంది వర్షం. ఆకాశం ఉరుములు, మెరుపులతో భీభత్సంగా వుంది. గాలిశబ్దం భయంకరంగా వుంది.

''ఓ.కె.............గుడ్‌నైట్‌'' అంటూ తన గదిలోకి వచ్చేసాడు త్రివిక్రమ్‌.

అతడి వెనకే తనూ లోనకు వచ్చేసింది వరేణ్య.

''ఇది జంట్స్‌ రూం. లేడీస్‌రూం పక్కనుంది'' గుర్తుచేసాడు త్రివిక్రమ్‌.

''తెలుసు.........కాని....... నాకు భయంగా వుంది. ఒంటరిగా పడుకోలేను'' చిన్నగా చెప్పింది.

''పెళ్ళికాని ఒక అమ్మాయి, అబ్బాయి ఒకే గదిలో నిద్రించటం అపరాధం. ప్లీజ్‌''

అతను నచ్చచెప్పపోయాడు.

అంతలో సమీపంలో ఎక్కడో పిడుగుపడింది, చెవులు పగిలిపోయేశబ్దం అంతే కెవ్వున అరిచి మీదపడి అతడ్ని వాటేసుకుందామె. నిజంగా అవి అతడ్ని పరీక్షకు గురిచేసిన క్షణాలు. ఎంతగా వద్దనుకున్నా ఆమె మరీ యింతగా తనకు దగ్గరయిపోవటం ఆశ్చర్యంగానే కాదు, భయంగా కూడా వుంది. ఆమెను కౌగిలించుకోలేడు, వదిలేయనూ లేడు. అదీ అతడి పరిస్థితి. భయంతో ఆమె సన్నగా వణుకుతోంది. ఆ విషయం అతడికి తెలుస్తూనేవుంది. నచ్చిన మగువ మక్కువగా హత్తుకుపోతుంటే, వెచ్చటి కౌగిలి సుఖం నిలువుగా పులకరించేస్తుంటే తన్మయం చెందుకుండా ఎలా వుండగలడు? ఆమె తనకు నచ్చిన మగువ. అందులో సందేహం లేదు. ఆమెకు తనపైన ఏర్పడినట్టే తనకూ ఆమెపైన ప్రేమ ఏర్పడింది. ఆమె ప్రేమను పొందటం ఒక అదృష్టంగా భావించాలి. కాని తను ఆ ప్రేమను స్వీకరించటానికి అర్హతలేనివాడు. ఇప్పుడు పీకల లోతుకు ప్రేమలో కూరకుపోతే తర్వాత ఆమె ముందు మోసగాడిలా తలవంచుకు నిలవలేడు. అందుకే మనసు రాయి చేసుకున్నాడు.

'ఇక నువ్వు నన్ను వదిలేస్తే బాగుంటుంది. పిడుగుపడి చాలాసేపు అయింది'' అన్నాడు. ఆమె చివ్వున తలెత్తి ముఖంలోకి చూసింది.

''నీకు చేతులున్నాయిగదా...........అవి నన్ను కౌగిలించుకోనంటున్నాయా?'' అనడిగింది.

''వెళ్ళి నీ గదిలో పడుకో'' సీరియస్‌గా చెప్పాడు.

''నా ప్రశ్నకు ఇది సమాధానం కాదు'' కౌగిలి వదలకుండానే దబాయించింది.

విసుగ్గా చూసాగు త్రివిక్రమ్‌.

''కొన్ని ప్రశ్నలకు సమాధానాలుండవు'' అన్నాడు.

''కాని నా ప్రశ్నకు సమాధానం వుంది. అది నువ్వే'' అంటూ చాల వేగంగా అతడి మెడవంచి పెదవులతో పెదవులు చేర్చి బలంగా ముద్దుపెట్టేసుకుంది.

ఒక్క క్షణం దిగ్భ్రాంతికి లోనయ్యాడు త్రివిక్రమ్‌.

''నీ అభ్యంతరాలేమిటో నాకు తెలీదు. కాని నేను మనసావాచా త్రికరణశుద్దిగా ప్రేమిస్తోంది, కోరుకుంటోంది నిన్నే, ఇది నువ్వు తెలుసుకుంటే చాలు. నా గదిలోకి వెళ్ళిపోతున్నాను. బట్‌ తులపులు తీసేవుంటాయి. నీకు నామీద ప్రేమవుంటే తెల్లవారేలోపల ఎప్పుడైనా వచ్చేయొచ్చు నా గదిలోకి. ఒక ఆడపిల్లగా ఇప్పటికే ఎక్కువచెప్పాను సారీ'' అంటూ ఇక ఏం మాట్లాడాలో తెలీక పొంగుతున్న కన్నీళ్ళు తుడుచుకొంటూ అతడ్ని వదిలి గిరుక్కున వెనుతిరిగి తన గదిలోకి వెళ్ళిపోయిందామె.

ఆ షాక్‌ నుంచి అతడుచాలా సేపటివరకు కోలుకోలేకపోయాడు.

పిచ్చివాడి ఆలోచనలకి, సముద్రంమీది తుఫానుకీ అట్టే తేడాలేదు.

రాత్రి పరిస్థితినిబట్టి తుఫాను విశాఖపట్నం ఉత్తర ప్రాంతంలో తీరం దాటుతుందనుకున్నారు. కాని అది అటు తిరిగి, యిటు తిరిగి ఒరిస్సాకు పోయి తెలతెలవారుతుండగా వూరి సమీపంలో తీరం దాటింది. దాంతో ఆంధ్రతీరవాసులు వూపిరి తీసుకున్నారు. తెల్లవారేసరికి మబ్బులు పల్చబడ్డాయి. వర్షం జోరు కూడా బాగా తగ్గిందిగాని జల్లులు పడుతూనే వున్నాయి.

ఉదయం ఏడు గంటలకు నిద్రలేచాడు త్రివిక్రమ్‌. అప్పటికింకా పక్కగదిలో గాఢనిద్రలో వుంది వరేణ్య. తను స్నానంచేసి డ్రసప్‌ అయివచ్చి హాల్లో టి.వి. ముందు తుఫాను వార్తలు వింటూ కూర్చున్నాడు. రంగమ్మ కాఫీ అందించింది.

''గుడ్‌మార్నింగ్‌'' అన్నాడు నవ్వుతూ

''రాత్రంతా నా గది తలుపులు తెరిచే వున్నాయి'' గుర్తుచేసింది.

''నా గది తులుపులు మాత్రం మూసి వున్నాయి. అర్ధమైందిగదా. నాకు నీ మీద ప్రేమ లేదుగాబట్టే రాలేదు. లీవ్‌మి.''

''వూహుం అదే తప్పు. నీకు నా మీద ప్రేమ వుంది. ఉందిగాబట్టే నువ్వు రాలేదు. లాజిక్‌ ఏమిటని అడగకు. ఆలోచిస్తే నీకే అర్ధమవుతుంది. నేను స్నానంచేసి వస్తాను. రెడీఅయి వెళ్ళిపోదాం. తుఫాను పోయింది గాబట్టి మనం ఇక్కడ డీలర్లను కలుసుకొని వెళదాం. వైజాగ్‌ చేరుకునేసరికి లేటయినా ఫరవాలేదు'' అంటూ లేచి లోనకు వెళ్ళిపోయింది.

''ఈ రోజు రాజమండ్రిలో పనులు ముగించుకొని వైజాగ్‌కు తిరుగుప్రయాణం ఆరంభించేసరికి అక్కడే మధ్యాహ్నం రెండు గంటలయింది టైం.

  తుఫాను రాత్రి!

పగబట్టినట్టు విశాఖ నగరంమీద కుండపోతగా కురుస్తోంది వాన, శంకం వూదినట్లు గాలిహోరు. కొన్నిచోట్ల చెట్లు కూలాయి. రాత్రి తొమ్మదింటికే రోడ్లు నిర్మానుష్యమయిపోయాయి.

పగలంతా త్రివిక్రమ్‌ కోసం స్టేడియం పరిసరాల్లోను, సిటీలోను గాలించిన హైదరాబాదు పోలీసులు భద్రం, వీరభద్రంలు యిద్దరూ వర్షం అరంభం కాగానే ఆటోలో హోటల్‌ రూంకి తిరిగి వచ్చేసారు. ఇక బయటకెళ్ళలేదు ఎలాగూ తుఫాన్‌ వుందని పుల్‌బాటిల్‌ తెచ్చుకొని సిటింగులో వుండిపోయారు.

''నాకు డౌటే మామా! ఈ వర్షానికి ఖచ్చితంగా మేచ్‌ కేన్సిలవుతుంది ఎల్లుండి క్రికెట్‌ మేచ్‌ జరగదు''

''జరక్కపోతే పోనీరా అల్లుడూ! మనం ఏమన్నా క్రికెట్‌ ఆడేవాళ్ళమా?''

''కాదనుకో కాని మేచ్‌ చూడాలని వచ్చిన ఆ త్రివిక్రమ్‌ మనకి దొరకడు.''

''కంగారుపడకు. మేచ్‌ కేన్సిలయితే మరో రోజుకు వాయిదా పడుతుంది. ఒకటి రెండ్రోజుల్లో ఏ విషయం తెలుస్తుందిగదా, వాడు మాత్రం మేచ్‌చూడకుండా విశాఖ వదిలి వెనక్కిపోడు మనం పట్టుకొని తీసుకెళ్ళాల్సిందే.''        వీరభద్రం మాట్లాడుతుండగానే  తలుపు చప్పుడయింది.

''ఎవడ్రా ఆడు ఈ టైంలో తలుపు కొడుతున్నాడు బుద్దిలేకుండా. పోలీసులంటావా?'' అనుమానంగా అడిగాడు భద్రం.

''మనమే పోలీసోళ్ళం, మనం పోలీసులకి భయపడ్డం ఏమిట్రా అల్లుడూ! వెళ్ళిచూడు'' ఎగతాళి చేసాడు వీరభద్రం.

''నిజమేననుకో! కానీ ప్రస్తుతం మనం సివిల్‌ డ్రస్‌లో వున్నాం గదా........సరే ఆగు చూస్తాను'' అంటూ తలుపుతీసాడు.

తలుపు తీసీతీయగానే ఫెళ్ళున ముఖానకొట్టింది బలమైన చలిగాలి. ఎదురుగా డోర్‌లో గ్లాస్‌ వూపుకుంటూ ఓ యువకుడు నిలబడున్నాడు.   తలుపు తెరిచిన భద్రాన్ని లోపల కూర్చున్న వీరభద్రాన్ని చూస్తూ ''హలో బ్రదర్స్‌'' అంటూ పలకరించాడు.

''మేం హలో బ్రదర్సుంకాదు బ్రదరూ! మామా అల్లుళ్ళం. ఇంతకీ నువ్వెవరు?'' తాగిన హుషారులో కళ్ళెగరేస్తూ అడిగాడు భద్రం.

''మీరు నన్ను క్షమించాలి. ఆయాం వినోద్‌.......ఈ పక్కరూం నాదే'' కంగారుగా చెప్పాడు వినోద్‌. ఆశ్చర్యంగా ముఖం చిట్లించాడు భద్రం.

''ఓర్నీ........ పక్కరూం నీదయితే మరి మా రూం తలుపుకొట్టినవాడు ఎవడు?'' అనడిగాడు.

''డౌటేవద్దు బ్రదరూ.............నేనేకొట్టాను.''

''నువ్వు కొట్టావా..............నీకు బుద్దిందా.........? పోలీసులనుకుని ఎంత కంగారుపడ్డామో తెలుసా? ఎందుకంటే మేం కూడా పోలీసులమే''

''మైగాడ్‌! మీరు పోలీసులా?'' అంటూ కంగారుపడి వెళ్ళిపోబోయాడు వినోద్‌.

అదిచూసి పక ఫకా నవ్వాడు భద్రం.

''భయపడకు బ్రదరూ! ఇప్పుడు మేం సివిల్‌ డ్రస్‌లో వున్నాం. ఇంతకీ ఎందుకు తలుపుకొట్టావ్‌?'' అనడిగాడు.

''కొంచెం మందుపోస్తారని.''

''ముందు పోసేదికాదు. కొనుక్కునేది.

''తెలుసు. నా బాటిల్‌ అయిపోయింది. తుఫానుకదా, బయటషాపులు కట్టేసారు. మీ గ్లాసుల చప్పుడు విని ప్రాణం లేచి వచ్చింది. ఒక పెగ్గుచాలు''

అంతా వింటున్న వీరభద్రం కసురుకున్నాడు భద్రాన్ని.

''ఒరే అల్లుడూ! పాపం కుర్రాడు ఎంత దాహంతో వున్నాడో ఏమిటో రానీ లోనకురానీ, మనకున్నదే పోద్దాం. నువ్వురా బ్రదరూ'' అంటూ పిలిచాడు.

''థ్యాంక్యు'' అంటూ లోనకొచ్చాడు వినోద్‌.

మనిషి చదువుకున్నవాడుకావచ్చు, మహామేధావి కావచ్చు ఎవరయినాసరే మెంటల్‌బ్యాలన్స్‌ కోల్పోయాడు. తుఫాను కారణంగా వాళ్ళు రాత్రికి ఎక్కడో ఆగిపోతారని వూహించుకోగానే అతడి కళ్ళముందు మెదిలింది రూప్‌తేరా.... మస్తానా...........ప్యార్‌మెరా.............దీవానా సాంగ్‌. ఇద్దరూ వయసులో వున్నారు.  ఈచలికి ఒకటైపోకుండా ఎలా వుంటారనే ఆలోచన రాగానే అతను బాగా అప్‌సెట్‌ అయి తాగుడ్ని ఆశ్రయించాడు. ఎలాగో గెస్ట్‌హౌస్‌ అడ్రసు పట్టుకొని వర్షానికి ముందు ఆటోలో అక్కడికెళ్ళాడు. గేటుదగ్గర సెంట్రీల మూలంగా ఉదయమే వాళ్ళిద్దరూ కారులో వెళ్ళిపోయిన సంగతి తెలిసింది.

''కూర్చో బ్రదరూ! మేముండగా మనకిక్కడ మందుకి లోటులేదు, ఫుడ్‌కి లోటులేదు. కమాన్‌'' అంటూ ముగ్గురి గ్లాసులు నింపాడు వీరభద్రం.

ఒకరౌండ్‌ కాగానే కొద్దిగా చిప్స్‌ నమిలి, సిగరెట్లు ముట్టించుకున్నారు.

వీరభద్రం ఖుషీగా చూసాడు వినోద్‌ వంక.

''నీ పేరు వినోద్‌ అన్నావ్‌కదూ! ఏ వూరు మంది? ఇక్కడికి ఏం పనిమీద వచ్చావు?'' అనడిగాడు.

''ఏం చెప్పను బ్రదర్‌. నాదో దీనగాధ'' అన్నాడు బాధగా వినోద్‌.

''అయ్యో! నీదీ దీనగాధానా మా లాగ'' భద్రం అడిగాడు.

''వూహూం! నా కష్టాలువేరు. ఇవి ఎవరికీ వచ్చుండవు'' అంటూ బాధగా చూసాడు వినోద్‌.

''ఏమిటయ్యా ఈ వయసులో నీకొచ్చిన అంత గొప్ప కష్టాలేమిటి?'' అడిగాడు వీరభద్రం.

''ముందు మీ సంగతి చెప్పండి.''

''ఏం చెప్పమంటావు బ్రదరూ! బ్యాంకు రాబరీ కేసులో ఓ ఫోర్‌ట్వంటీగాడు మా జైల్లోకొచ్చిపడ్డాడు. భలేకిలాడి, మనిషి చాలా మంచోడు. నవ్వుతూ సరదాగా వుంటాడు. వాడికి క్రికెట్‌పిచ్చి. జైల్లోంచి పారిపోయి వైజాగ్‌ వచ్చేసాడు. ఇదిగో వాడ్ని వెదుక్కుంటూ పెళ్ళాం పిల్లల్ని వదిలి మేం వచ్చిపడ్డాం.''

అతని మాటలు వింటుంటే వినోద్‌కి ఆ రోజు జైలుడ్రస్‌లో తనని గుద్దుకున్న యువకుడు గుర్తుకొచ్చాడు. కాసేపట్లోనే వాడు మామూలు డ్రస్‌లో హోటల్లోనూ, ఆ తర్వాత రైల్వేస్టేషన్‌లోనూ తగిలాడు. వాడే ఇప్పుడు తన స్థానంలో తమ కంపెనీలో తనలా చెలామణి అవుతున్నాడు. కొంపదీసి వీళ్ళు వెదుకుతోంది అతడ్ని కాదుగదా!''        ''మీరు ఎక్కడ్నుంచి వచ్చారు!'' అడిగాడు.

''హైదరాబాద్‌ నుంచి.''

''నేనూ హైదరాబాద్‌ నుంచే వచ్చాను. సో..... మనమంతా ఒకవూరివాళ్ళం.''

''అవును బ్రదరూ! ఇప్పుడు వాడ్ని వెదికి పట్టుకుని వెనక్కి తీసుకెళ్ళకపోతే మా జైలర్‌సార్‌ మా ఇద్దర్నీ షూట్‌చేసి పారేస్తాడు..............'' అన్నాడు భద్రం.

''మీరు వెదుకుతున్న ఖైదీ పేరేమిటి?'' అడిగాడు.

''త్రివిక్రమ్‌. ముషీరాబాద్‌ సబ్‌జైలు నుంచి పారిపోయి వచ్చాడు''

''వాడూ.............''    

వాడు ఎక్కడున్నాడో తనకు తెలుసునని చెప్పేయాలని నోటిచివరి వరకూ వచ్చిన ఆవేశాన్ని బలవంతంగా మింగేసాడు వినోద్‌. ఎంత తాగినా వివేకం కోల్పోలేదతను ఇప్పుడు తన ప్రత్యర్థి ఎవరో తనకు తెలిసిపోయింది. వాడి గురించి వీళ్ళకు చెప్పినందువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువ. అంతా గందరగోళమైపోతుందని నిశ్చయించుకున్నాడు.

''మరి నీ సంగతేమిటి బ్రదరూ! నీకొచ్చిన కష్టం ఏమిటి?'' అడిగాడు వీరభద్రం.

సెకండ్‌రౌండ్‌ కూడా గ్లాసు ఖాళీ అయ్యాయి.

''ఏం చెప్పను బ్రదరూ! మా కంపెనీ ఓనర్‌కి నేనంటే అభిమానం. అయన కూతురు ఇక్కడి వైజాగ్‌బ్రాంచి చూస్తోంది. ఒరే వైజాగ్‌ వెళ్ళరా! నా కూతురు ఇష్టపడితే మీకు పెళ్ళిచేసి అల్లుడ్ని చేసుకుంటానని ఆయన నన్ను పంపించాడు. కానీ నా టైం బాగోలేదు. రైల్వేస్టేషన్‌లో పర్సుపోయింది. పర్సుకోసం వెదుకుతుంటే రైలు వెళ్ళిపోయింది. ఆ రైల్లో నా సూట్‌కేస్‌ వుండిపోయింది.''   

''తర్వాత?''

''నా సూట్‌కేసు ఎవడికో దొరికింది, నేనిక్కడికొచ్చేలోపలే వాడు నా పేరుతో కంపెనీ ఆఫీస్‌లో పాగా వేసాడు. నేను చేసుకోబోయే అమ్మాయితో డ్యూయెట్లు పాడుకుంటున్నాడు. మీరే చెప్పండి వాడు నా పర్సు కొట్టేసాడు, సూట్‌కేస్‌ కొట్టేసాడు, నా ఉద్యోగం కొట్టేసాడు. ఆఖరికి కాబోయే నా పెళ్ళాన్నిక్కూడా....... బాధ తట్టుకోలేకపోతున్నాను...........వాఁ...........'' అంటూ ఏడ్చేసాడు వినోద్‌.

''అరరె......ఎంతకష్టం బ్రదరూ'' అంటూ ఇద్దరూ వినోద్‌ కళ్ళు తుడిచి ఓదార్చారు.

''అయినా ఇంత జరిగితే ఎలా వూరుకున్నావు?అసలు వినోద్‌ నువ్వేనని కంపెనీలో చెప్పేయొచ్చుకదా? వాడ్ని బొక్కలో వేసేస్తారు'' అడిగాడు వీరభద్రం.

''నిజమే.............కానీ అసలు వినోద్‌ నేనేనని చెప్పుకోడానికి నా దగ్గర ఒక్క ఆధారం కూడా మిగల్లేదు. అన్నీ వాడిదగ్గర వుండిపోయాయి''

''అయ్యో పాపం. ఇంత బాధను ఎలా భరిస్తున్నావ్‌ బ్రదరూ. నువ్వు గాబట్టి సహించావ్‌ నేనయితే కత్తి పట్టుకెళ్ళి ఆ మోసగాడ్ని కసకస పొడిచి చంపేసేవాడ్ని'' అన్నాడు ఆవేశంగా భద్రం.

''ఒరే. చచ్చు సలహాలివ్వకు. ఈ కుర్రాడు కత్తి పట్టుకెళ్ళి వాడ్ని వేసినా వేసేస్తాడు'' అంటూ వారించాడు వీరభద్రం.

ముగ్గురూ ఫుల్‌గా లోడయిపోయారు.

వినోద్‌ థ్యాంక్స్‌చెప్పి తూలుతూ, తన గదిలోకిపోయి పడుకున్నాడు. మామా అల్లుళ్ళు ఇద్దరూ తలుపు మూసుకుని అడ్డంగా పడిపోయారు.

అంతే

ఎలా తెల్లవారిందో వాళ్ళకే తెలీదు.

రాజమండ్రి వదిలిన చాలాసేపటివరకూ త్రివిక్రమ్‌, వరేణ్యల మధ్యన మాటల్లేవు, సింపుల్‌గా అతడి భుజంమీద తలవాల్చుకుని కళ్ళు మూసుకుంది. మబ్బులు పూర్తిగా తొలగిపోయి సూర్యుడు కన్పిస్తున్నాడు. నేషనల్‌ హైవేలో విమానంలా దూసుకుపోతుంది కారు. చాలాసేపటి తర్వాత కళ్ళుతెరిచి  అతడి ముఖంలోకి చూసింది వరేణ్య.

''నువ్వలా సీరియస్‌గా వుండకు, నాకు భయమేస్తోంది. మామూలుగా వుండొచ్చుగదా!'' గోముగా అడిగింది.

''ఎలా వుండమంటావ్‌? నీ వరస చూస్తే నాకు భయం వేస్తుంటేను'' అన్నాడు పొడిగా.

వెంటనే నిటారుగా కూర్చుంటూ కోపంగా చూసింది.

''ఎందుకంత భయం? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐలవ్‌యూ..... బిగ్గరగా అరిచి చెప్పమంటావా?'' అడిగింది.

''అరిస్తే గొంతు పోతుంది కాని సమస్య పరిష్కారం దొరకదు''

''అసలు నీ అభ్యంతరం ఏమిటి? నీ లెవల్‌కి తగ్గట్టుగా మా వాళ్ళు కట్నం ఇచ్చుకోలేరనా? లేకపోతే మన బాస్‌ సుధాకర్‌నాయుడుగారు నీకేమన్నా తన కూతుర్నిచ్చి పెళ్ళిచేస్తానన్నారా? ఐ వాంట్‌ టు నోది రీజన్‌. నా ప్రేమనెందుకు తిరస్కరిస్తున్నావ్‌........?'' డైరెక్ట్‌గానే అడిగేసింది. ఓసారి ఆమె ముఖంలోకి చూసి  చిన్నగా నవ్వి వూరుకున్నాడు.

''ఆ నవ్వుకి అర్ధం ఏమటి?'' దబాయించింది ఉడుక్కొంటూ.

''నన్ను చూస్తే కట్నంకోసం అమ్ముడుపోయే మనిషిలా కనబడుతున్నానా?''

''అయితే బాస్‌ నాయుడుగారు నీకేదో ప్రామిస్‌ చేసుండాలి.''

''నథింగ్‌ అలాంటిదేమీలేదు ఒకవేళ చేసినా  తీసుకోడానికి నేను సిద్దంగాలేను. ఎందుకంటే నేను సర్వ స్వతంత్రుడ్ని, ఏ నిర్ణయమైనా నేను తీసుకుంటాను. ఒకరికి చెప్పి తీసుకోను.'' 

అతడ్ని ఎలా అర్ధం చేసుకోవాలి ఆమెకు అర్థంకాలేదు. డాడీ ఫోన్‌చేసి క్లియర్‌గా చెప్పారు. అమ్మాయికి నచ్చితే నీకిచ్చి పెళ్ళిచేస్తానని వినోద్‌కి చెప్పాను అన్నారు.

అంత చెప్పినప్పుడు తన పేరు వరేణ్య అని చెప్పకుండా ఉంటారా? ఒక వేళ తన గురించి, తన పేరు గురించి తెలీదేమో అనుకుని ఒక రాయి విసిరి చూసింది.  అయితే అంత ఈజీగా దొరికిపోయే మనిషికాదు త్రివిక్రమ్‌. అంటే అంటనట్టు సమాధానం చెప్పి తప్పించుకున్నాడు.

   ''ఓ.కే... నేనంటే ఎందుకిష్టంలేదు?'' తిరిగి అడిగింది.

''ఇష్టంలేదని ఎప్పుడు చెప్పాను'' ఎదురు ప్రశ్నించాడు.

''మరి ప్రేమించవెందుకు?''

''ప్రేమ, పెళ్ళి ఈ రెంటికి నేను దూరం.'' 

''పోనీ పెళ్ళి చేసుకుని ప్రేమించు.''

''రెంటికీ పెద్ద తేడాలేదు నా దృష్టిలో. ఓ మాటడుగుతాను. చెప్తావా?''

''నువ్వు అడగాలేగాని, వందమాటలకయినా చెప్తాను..''

''వంద అక్కర్లేదు. ఒక్కటి చెప్పుచాలు. ఒక వేళ నేను ఫోర్‌ట్వంటీగాడ్ని, మోసగాడ్ని అనుకో అప్పుడు కూడాఇలాగే ప్రేమిస్తావా?

అసహ్యించుకోవా?''

''నాకు తెలుసు, నువ్వటువంటివాడివి కాదు.''

''ఒక వేళ అలాంటివాడ్నే అనుకో, అప్పుడు?''

''ప్రేమిస్తాను నా అంచనా తప్పిందని బాధపడతానేమోగాని, ప్రేమించకుండా ఎలా వుండగలను.....? నువ్వంటుంటే నాకో కథ గుర్తుకొస్తోంది.''

''ఏమిటి? నీకు కథలు కూడా వచ్చా?''

''అబ్బో బోలెడు కథలు వచ్చు వినోద్‌, నా చిన్నప్పుడు మా నాయనమ్మ ఒళ్ళో పడుకోబెట్టుకుని, ఎంచక్కా ఎన్ని కథలు చెప్పేదో తెలుసా?''

'నాకు తెలీదు గాని, ఆవిడ ఇప్పుడు వుందా పోయిందా?''

''ఉంది. అది నా పెళ్ళి చూడకుండా ఎక్కడికి పోదు.''

''అయితే బామ్మకోసమన్నమాట ఈ పెళ్ళితొందర.''

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్