Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
23rd Episode

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ

జరిగిన కథ     :
అనుకోకుండా వినోద్ కు త్రివిక్రం కోసం వెతుకుతున్న పోలీసులు తారసపడతారు. వారికి తన బాధంతా చెప్తాడు వినోద్. 

''ఈ వెక్కిరింపే వద్దనేది? కథ వింటావా లేదా?''

''తప్పుతుందా.......... చెప్పు. అదేదో కొంచెం అటు జరిగి కూర్చుని చెప్పొచ్చుగదా?''

''అదే నాకు మండుతుంది. ఎంతసేపు మైలపడిపోతున్నట్టు దూరం దూరం అంటావ్‌గాని, అర్థంచేసుకోవేమిటి? కథ విను. ఒకప్పుడు ఒక రాజుగారు వుండేవారు''

''చరిత్రలో లక్షా తొంభై వేలమంది రాజులున్నారు మేడం. నువ్వు చెప్పేది ఏ రాజు గురించి?''

''వాళ్ళలో ఒక రాజు అనుకో నష్టమా?''

''నష్టం లేదులే... చెప్పు.''

''ఆ రాజుగారికి ఒక అందమైన కూతురుంది. యువరాణి అన్న మాట. ఒకసారి ఆమె పుట్టినరోజుకి నీకు రెండు వరాలిస్తున్నాను, కోరుకో బేబీ అన్నాడు రాజు. అప్పుడు యువరాణి నో ఫాదర్‌ ఇప్పుడు కాదు. అవసరమైనప్పుడు కోరుకుంటాను. అంటూ ఆ అమ్మాయి ఆ రెండువరాల్ని ఫాదర్‌ దగ్గర రిజర్వ్‌లో వుంచుకుంది. ఎందుకంటే క్లెవర్‌ యువరాణి గదా.

ఇలా వుండగా ఒకరోజు రాజభటులు ఖైదీని బులక్‌ కార్ట్‌మీద నిలబెట్టి గొలుసులతో కట్టేసి రాజవీధిలో తీసుకుపోతున్నారు. అతను చాలా అందంగా వున్నాడు. వెంటనే యువరాణి కింగ్‌ను పిలిచింది. డాడీ డాడీ, మీరిచ్చిన వరాల్లో ఒకటి ఇప్పుడు కోరుకుంటాను అనడిగింది. ఓ.కె. బేబీ, అడుగు అన్నాడు కింగ్‌గారు.

అప్పుడు యువరాణి అడిగింది. డాడీ డాడీ, నేనా ఖైదీని ప్రేమిస్తున్నాను. అతనితో నా మేరేజ్‌ జరిపించండి. ఇది నేను కోరుకునే వరం అంది.

అయితే డాటర్‌ కోరిక విని కింగ్‌ షాకయ్యాడు. వెంటనే డాటర్‌ని కోపంగా చూసాడు. తప్పమ్మా... అతను హంతకుడు. వాడు ఎవడోకాదు, మన పి.యం. కొడుకు...''

వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకొంటున్నాడు త్రివిక్రమ్‌. ఇంగ్లీషు చదువులతో చిక్కే యిది. బామ్మ చెప్పిన కథను యధాతథంగా తెలుగులో చెప్పటం కూడా రావటం లేదు. నవ్వితే మీదపడి కొడుతుందన్న డౌటుతో బలవంతంగా నవ్వు ఆపుకున్నాడు. ఇక ఆపుకోలేక నవ్వేసాడు.

నవ్వుతూనే అడిగాడు. ''పి.యామ్మా... వాడెవడు?'' అని.

''పి.యం. అంటే తెలీదా? ప్రధానమంత్రి రాజుగారి ప్రధానమంత్రి అన్నమాట'' అవునూ నువ్వెందుకు నవ్వుతున్నావ్‌? అడిగింది.

''ఏం లేదుగాని, కథ చెప్పు.''

''సరి. మన పి.యం. కొడుకు వాడు. ఇద్దరు ఫ్రండ్స్‌ని నరికి చంపేసాడు. అందుకే మరణశిక్ష విధించాను. వాడి పీక కట్‌ చేయటానికి తీసుకెళుతున్నారు. సో, నువ్వు వేరే వరం కోరుకో'' అంటూ నచ్చ చెప్పాడు. అయినా వినలేదా యువరాణి.

సరి నీ ఖర్మ అనుకుని వెంటనే ఆ ఖైదీని పిలిపించి తన డాటర్‌ని అతడికిచ్చి మేరేజ్‌ చేయించాడు రాజు.

తర్వాత సోల్జర్స్‌ అతడ్ని చంపటానికి తీసుకుపోతుంటే, మళ్ళీ అడ్డు పడిందా డాటర్‌. తండ్రి కింగ్‌ను రెండో వరం అడిగింది.

డాడీ. మీరు నాకు రెండు వరాలు యిచ్చారు. ఇప్పుడు నాకు రెండో వరం అవసరం వచ్చింది. నాకు పతిభిక్ష పెట్టాలి. నా భర్తను వదిలేయండి. అతడ్ని రిలీజ్‌ చేయండి అని కోరింది.

ఇచ్చిన వరానికి కట్టుబడి అతన్ని రిలీజ్‌ చేయాలా లేక తను విధించిన శిక్షను అమలు జరిపించాలా? తెలీక దర్బారులోని నీతిశాస్త్రం తెలిసిన లాయర్లతో అర్జంటుగా సమావేశం ఏర్పాటుచేశాట్ట రాజు. అయితే ఈ లోపల అసలు హంతకులు దొరికిపోయి నిజంగానే పి.యం. కొడుకు రిలీజయ్యాడు. పెళ్ళాంతో హేపీగా సంసారం చేసుకున్నాడు. అంచేత ప్రేమ గుడ్డిదంటారు గాని బుద్ధిలేనిది మాత్రం కాదు. ప్రేమ పుట్టాలి గాని చచ్చేవరకు వుంటుంది. అంచేత నువ్వు అనవసరంగా డౌట్లు పెట్టుకుని టైం వేస్ట్‌చేయకుండా నన్ను ప్రేమించు వినోద్‌. ప్లీజ్‌'' అంటూ భుజం మీదకు వాలిపోయింది.

ఆమెను వదిలించుకోవటం అంత సులువుకాదని అర్థమైపోయింది త్రివిక్రమ్‌కి. అంతేకాదు. దూరందూరం  అంటూ తనే ఆమెకు దగ్గరయిపోతున్నాడు. ఇంత గాఢంగా ప్రేమిస్తున్న అమ్మాయి రేపు తను వెళ్ళిపోతే తట్టుకోగలదా? ఏమైపోతుంది? వూహించటానికే బాధగా వుంది.

కబుర్లు చెప్పుకొంటూ జర్నీ హేపీగా సాగింది.

క్రమంగా అనకాపల్లి దాటేసారు.

ఇంకో అరగంట ప్రయాణంలో వైజాగ్‌ సిటీ లిమిట్స్‌ని చేరుకుంటారనగా ఒక సంఘటన జరిగింది.

ఎటునుంచి వచ్చిందోగాని ఒక లారీ కారుని ఓవర్‌టేక్‌ చేస్తూ కొద్దికొద్దిగా లెఫ్ట్‌ కట్‌చేయటం ఆరంభించింది. వాళ్ళు ఎవరోగాని తమ కారుని అడ్డంకోట్టే ప్రయత్నం చేస్తున్నారన్న సంగతి ఆలస్యంగా గ్రహించాడు త్రివిక్రమ్‌. ముందుకు దూసుకుపోయే ఛాన్స్‌ లేకపోయింది. దాంతో లారీకి టచ్‌గాకుండా లారీతోబాటే రోడ్‌ దిగి కొంతదూరంలోని ఖాళీ స్థలంలోకి కారును తీసుకెళ్ళి ఆపక తప్పలేదు. రివర్స్‌లో వెళ్ళిపోకుంటా కవర్‌ చేస్తూ మరో లారీవచ్చి కారుకు వెనక పక్కన అడ్డంగా ఆగింది.

వాళ్ళెవరోగాని తమను ట్రాప్‌ చేసారని అర్థంకాగానే త్రివిక్రమ్‌ ఆశ్చర్యానికి లోనయ్యాడు. వరేణ్య కంగారుపడింది.

''ఏమైంది వినోద్‌! ఎవరు వాళ్ళు? మనల్ని ఎందుకు ఆపారు?'' అనడిగింది భయంగా చుట్టూ చూస్తూ.

''అదే నాకూ అర్థం కావటంలేదు. పరిస్థితి చూస్తే మన కారుకోసమే వీళ్ళు పధకం ప్రకారం కాపువేసి పట్టుకున్నారనిపిస్తుంది.''

''ఇప్పుడెలా? పోలీసులకి ఫోన్‌ చేయనా?''

''కంగారుపడకు. విషయం ఏమిటో తెలుసుకోకుండా కంగారుదేనికి? అటు చూడు. లారీ దిగి ఎవరో వస్తున్నారు. నీకు తెలిసినవాళ్ళేమో చూడు.''

లారీ దిగుతున్న వాళ్ళని చూడగానే వరేణ్యకి చెమటలు పట్టేసాయి. వాళ్ళంతా సుమారు పదిహేనుమంది వున్నారు. వాళ్ళ చేతుల్లో పొడవాటి ఇనపరాడ్‌లు, హాకీస్టిక్‌లు వున్నాయి. డౌటులేదు వాళ్ళంతా గూండాలు. వాళ్ళను చూడగానే హూషారుగా విజిల్‌ వేసాడు త్రివిక్రమ్‌.

''క్యా సీన్‌హై... మనల్ని కొట్టడానికి ఇంతమంది గూండాలా? వాళ్ళు నీకు తెలుసా?'' అడిగాడు.

''లేదులేదు. నాకు తెలీదు. వాళ్ళు దొంగలు కావచ్చు. డబ్బు కావాలంటే ఇచ్చేద్దాం. మనల్ని వదిలేయమను'' అంది గాభరాపడిపోతూ వరేణ్య.

''బాగుంది. ప్రభుత్వం తరుపున వీరప్పన్‌ తరుపున వీరప్పన్‌తో రాయభారానికి నక్కీరన్‌ ఎడిటర్‌ వెళ్ళినట్టు ఇప్పుడు నీ తరపున నేను రాయబారిగా వెళ్ళాలన్నమాట. సరి ట్రైచేద్దాం'' అంటూ డోర్‌ తెరవబోయాడు. వెంటనే  ''వద్దు వద్దు.. వాళ్ళదగ్గర ఆయుధాలున్నాయి. కొడతారు. నువ్వెళ్ళకు'' అంటూ అడ్డంపడింది వరేణ్య.

ఇంతలో...

చివరగా లారీదిగి వస్తున్న క్యారక్టర్‌ని చూసి ఆమె ఆశ్చర్యంతో తలమునకలవుతూ త్రివిక్రమ్‌ని చూసింది.

''ఎవడు వాడు?'' అడిగాడు త్రివిక్రమ్‌.

''ఇప్పుడర్థమవుతోంది. వాడి పేరు పట్టాభి. మన కంపెనీలోనే గోడౌన్‌ ఇన్‌చార్జీగా పనిచేసేవాడు. స్టాకు అమ్ముకున్న వ్యవహారం బయటపడటంతో వాడ్ని పనిలోంచి తీసేసాను. ఆ కోపం మనసులో పెట్టుకుని నన్ను కొట్టించాలని మనుషుల్ని తీసుకోచ్చినట్టున్నాడు.''

'ఎంతకాలమైంది ఇది జరిగి?''

''కిందటి నెల్లోనే.''

సీన్‌ మొత్తం అర్థమైపోయింది త్రివిక్రమ్‌కి.

''డోండ్‌వర్రీ. నువ్వు కారు దిగకు నేను మాట్లాడతాను'' అంటూ డోర్‌ తెరిచాడు.

''వినోద్‌! నీకసలే భయం. ప్లీజ్‌, వెళ్ళకు'' వెనక్కు లాగింది.

''ఇప్పుడు నాకు భయంలేదు మేడం ఎందుకంటే, వాళ్ళు కొట్టడానికొచ్చింది నిన్ను. నన్ను కాదుగదా'' అంటూ అదే చెరగని చిరునవ్వుతో కారు దిగి డోర్‌ మూసాడు త్రివిక్రమ్‌.

అప్పటికి వాళ్ళంతా కారు సమీపంలోకి వచ్చేసారు.

పట్టాభి పొడుగ్గా, బలంగా దృఢంగా వున్నాడు. మనిషి కోపంతో వూగిపోతున్నాడు. త్రివిక్రమ్‌ కారును చుట్టి అవతలకువెళ్ళి వరేణ్య వున్న డోర్‌కి అడ్డంగా నిలబడ్డాడు. పొడవాటి హాకీస్టిక్‌తో చరచరా త్రివిక్రమ్‌ సమీపంలోకి వచ్చేసాడు పట్టాభీ.

''హాలో మిష్టర్‌ పట్టాభి'' అంటూ పలకరించాడు త్రివిక్రమ్‌.

''అవును నాపేరు పట్టాభి. నువ్వు గుర్తుచేయన్కర్లేదు. నువ్వెవరో నాకు తెలీదు. పక్కకు తప్పుకో. ఇవాళ అదో నేనో తేలిపోవాలి. దాని సంగతి తేల్చుకోవాలి.''

''హోల్డ్‌ యువర్‌ టంగ్‌....'' కూల్‌గా హెచ్చరించాడు త్రివిక్రమ్‌.

''చేయి జారితే తీసుకోవచ్చు. నోరుజారితే తీసుకోలేం. సమస్యలు వుండొచ్చు. స్థాయి దిగజార్చకూడదు. అది ఇది అని అమర్యాదగా మాట్లాడ్డం నాగరీకం కాదు'' అన్నాడు.

''కడుపుమంటతో వున్నాను. నీతులుచెప్పి తన్నులు తినకు. పక్కకు తప్పుకో ముఖం మీద కొడితే తట్టుకునే వాడ్ని. అది నా పొట్టమీద కొట్టింది. ఎలా ఊరుకోగలను?'' అరిచాడు పట్టాభి.

''ఊరుకోమని నేను చెప్పను కాని సమస్యని చేతులతో కాదు, మాటలతో పరిష్కరించుకోవటం బెటరంటాను. నీ ప్రాబ్లం ఏమిటో చెప్పు?''

''చెప్పాలా.... నీకు చెప్పాలా? తప్పుకోమని నీకు మర్యాదగా చెప్తే అర్థం కాదా?'' అంటూ కోపంతో వూగిపోతూ వెనకాముందూ ఆలోచించకుండా చేతిలో హాకీస్టిక్‌ను పైకి లేపేసాడు వేగంగా పట్టాభి.

అది తాకితే తల నిలువునా పగిలిపోతుంది అనటంలో సందేహం లేదు. ఆ భయంతోనే కారులోని వరేణ్య కెవ్వున అరిచింది.

కాని త్రివిక్రమ్‌ మాత్రం ఉన్నచోటునుంచి కదల్లేదు హాకీస్టిక్‌ తనమీదకు దూసుకొస్తున్న చివరి క్షణంలో కదిలాడు చాలావేగంగా. కన్ను మూసి తెరిచేలోగ హాకీస్టిక్‌ త్రివిక్రమ్‌ చేతిలోకొచ్చింది. అతడి పిడికిలి పట్టాభి కుడిభుజాన్ని దారుణంగా తాకింది. బాధతో దారుణంగా అరిచాడు పట్టాభి చేతివెంబడే ఎగిరి వెల్లకిల్లా పడిపోయాడు.

''అరె చూస్తారేంరా... వాడు నన్ను కొట్టాడు. నాచేయి చచ్చుబడి పోయింది. వేసేయండి వాడ్ని. ముక్కలుగా నరికేయండి'' అంటూ అంత బాధలోనూ గొంతుచించుకుని అరిచాడు. దాంతో అతడివెంట వచ్చిన మొనగాళ్ళంతా ఆయుధాలు ఝుళిపిస్తూ దూసుకొచ్చారు.

త్రివిక్రమ్‌ ఉగ్రుడయిపోతూ పట్టాభిని చూసి హెచ్చరించాడు.

''పదిమందిని వెంటేసుకొస్తే ఏమైనా మాట్లాడొచ్చు, ఏమైనా చేయొచ్చని ధైర్యమా నీకు? వచ్చి నీ పనిచెప్తా ఆగు. నీ చెంచాగాళ్ళు ఏం చేస్తారో చూస్తాను'' అంటూ హాకీస్టిక్‌ అక్కడ పడేసి గూండాల మీదకు దూకాడు.

కారులో కూర్చున్న వరేణ్య ఇంకా షాక్‌నుంచి కోలుకోలేదు. పట్లాభీ చేతిలో వినోద్‌ తల పగిలిపోతుందని భయపడి, పెద్దగా అరిచి కళ్ళు మూసుకుంది. కాని కళ్ళు తెరిచిచూస్తే పట్టాభి కిందపడి అరుస్తున్నాడు. చిరుతపులిలా భయమనేది లేకుండా, కనీసం చేతిలో ఆయుధం కూడా లేకుండా గూండాలమీదికి పోతూ కన్పించాడు విక్రమ్‌.

తన కళ్ళను నమ్మలేకపోతోంది. భయం భయం అంటూ ఒదిగిపోయే పెద్దమనిషిలో ఇంత టాలెంట్‌ వుందని వూహించనేలేదు. త్రివిక్రమ్‌లోని మరో సరికోత్తకోణాన్ని ఇప్పుడు చూస్తోందామె. చూస్తూ కారులో కూర్చోలేకపోయింది. కారుదిగి డోర్‌ నానుకుని నిలబడి సంభ్రమాశ్చర్యాలతో చూస్తోంది.

అప్పటికే అక్కడ అరుపులు, కేకలతో హోరెత్తిపోతోందా ప్రాంతం. అంతమంది మధ్యన బొంగరంలా తిరుగుతూ, వాళ్ళ ఆయుధాలకు దొరక్కుండా చక్కర్లుకొడుతూ, సందుచూసి కొడుతున్న త్రివిక్రమ్‌ దెబ్బలకు కిందపడ్డవాడు తిరిగి లేవటం లేదు.

''బాప్‌రే!'' అనుకుంది వరేణ్య.

వట్టిచేతులతోనే అంతమందిని విరగదీస్తున్నాడంటే, ఆయుధం ఉంటే వీళ్ళలో ఎంతమంది ప్రాణాలతో అవతలకుపోతారో తెలీదు మాట వరసక్కూడా వినోద్‌ తనతో చెప్పలేదు తను మార్షల్‌ ఆర్ట్స్‌ యోధుడని, అసలు చదువు చదువు అంటూ దేశవిదేశాల్లో తిరిగిన పెద్దమనిషి అయిదునుంచి ఆరునిమిషాలలోపే ఆ ఫైటింగ్‌ ఓ కొలిక్కి వచ్చేసింది.

అంతవరకు వట్టిచేతులతో పోరాడిన త్రివిక్రమ్‌ చివరలో అందుకున్నాడు హాకీస్టిక్‌. అతడు స్టిక్‌ తిప్పుతున్న తీరుచూడగానే కిందపడుతున్న పట్టాభికి కళ్ళు గిర్రున తిరిగాయి.

గూండాల్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టి హూనం చేసాడు త్రివిక్రమ్‌. ''ఎక్కండి. మీరంతా లారీ ఎక్కండి. ఒక్కడు అడుగు కిందపెట్టినా చంపేస్తాను. క్విక్‌ అంటూ ఆర్డర్‌ చేసాడు.

వాళ్ళకి ఇక రెండోసారి చెప్పించుకునే ఉద్దేశం లేదు. వదిలిందే చాలన్నట్టు కోతులమూకలా దూకేసారు లారీలోకి. వెనక్కి వస్తూనే అదే ఫోర్స్‌తో హాకీస్టిక్‌ పట్టాభిని బలంగా నాలుగు పీకి వదిలాడు త్రివిక్రమ్‌. బాధతో గావుకేకలు వేసాడు వాడు.

''బుద్ధి వచ్చిందిసాబ్‌. ప్లీజ్‌... వదిలేయండి. వెళ్ళిపోతాను'' అనరిచాడు.

''వెళ్ళిపోతే చచ్చుబడిన నీ చేయి తిరిగిరాదు'' అంటూ అతడి భుజం మీద బలంగా మరోదెబ్బ వేసాడు. అంతే.. చిటికెలో కండరాలు సర్దుకుని చేయి ఎప్పటిలా అయిపోయింది.

బొమ్మలా నిలబడి సూస్తోంది వరేణ్య.

పట్టాభిని లాగి కూర్చోబెట్టాడు.

''చెప్పు బ్రదర్‌! నీ సమస్య ఏమిటి?'' అనడిగాడు పొలైట్‌గా.

అంతే ...

పట్టాభీ కళ్ళనుంచి బటబటా పొంగింది కన్నీరు. మోకాళ్ళమధ్యన ముఖం దాచుకుని బోరున ఏడ్చాడు.

చికాగ్గా చూసాడు త్రివిక్రమ్‌. అవతల పొద్దుగూకే వేళయింది టైం అంతా వీడే తినేసేలా వున్నాడు.

''ఎందుకు ఏడుస్తావ్‌? చదువు, సంస్కారం వుండి ఏమిటి లాభం? ఒక ఆడపిల్లను కొట్టించడానికి గూండాల్ని తీసుకొస్తావా. సిగ్గులేదూ? కంపేనీ స్టాకు అమ్ముకోడం నేరమని తెలీదా?'' ఘాటుగానే అడిగాడు త్రివిక్రమ్‌.

వాడు తలెత్తి చూసాడు.

''తెలుసు సార్‌. నేను స్టాకు అమ్ముకున్నదే తెలుసుగాని, అంతకు ముందు ఏం జరిగిందో తెలీదు...'' అన్నాడు ఏడుపు ఆపుకుంటూ పట్టాభీ.

''ఏం జరిగింది? ఇప్పుడు చెప్పు.''

''పదేళ్ళుగా కంపెనీని నమ్ముకొని బతుకుతున్నాను సార్‌. నామీద ఒక్క బేడ్‌ రిమార్క్‌ కూడా లేదు. ఆ నమ్మకంతోనే నన్ను గోడౌన్‌ ఇన్‌ఛార్జిగా వేసారు.

నా భార్యకు ఆరోగ్యం బాగాలేదండి. ఆస్పత్రిలో వుంది. ఆపరేషన్‌ చేయాలన్నారు. యాభైవేలు ఖర్చవుతుంది, మూడు రోజుల్లో కట్టమన్నారు. లేటయితే ప్రాణానికి ప్రమాదమన్నారు. నాబాధ ఆఫీసులో చెప్పుకున్నాను. మెడికల్‌ లోన్‌ అప్లయ్‌ చేసాను. అయితే కేషియర్‌ లీవ్‌లో వున్నాడని, హెడ్‌క్లర్క్‌ రాలేదని యిలా లోన్‌ శాంక్షనయినా నాకు సమయానికి డబ్బు సర్దుబాటు చేయలేదు ఆఫీసువాళ్ళు. నాకు వేరే దారి తోచలేదు. స్టాకు తప్పించి అమ్ముకొని, నా ఆపద గడుపుకున్నాను. నా భార్యని రక్షించుకున్నాను సార్‌. కాని నా ఉద్యోగాన్ని కాపాడుకోలేక పోయాను. సార్‌.. మీరు  కొత్తగా చేరిన డ్రయివరా?'' అనడిగాడు చివరిగా.

'అవును'' అన్నాడు త్రివిక్రమ్‌.

''ఆ!'' అంటూ నోరు తెరిచింది వరేణ్య.

మళ్ళీ అదే ఫోజు.

నోరు సున్నాలావుంచి, కళ్ళు పెద్దవిచేసి త్రివిక్రమ్‌ని చూస్తూ నొసలువిరిచి మరీ బోలెడు ఆశ్చర్యపోతున్న ఫోజు. ఆమె అలా అమాయకంగా ఆశ్చర్యపోవడం త్రివిక్రమ్‌కి చూడముచ్చటగా వుంటుంది. అదే సమయంలో నవ్వు కూడా వచ్చేసింది.

''అదేమిటి మేడం నేను డ్రయివర్‌నేగదా. నువ్వు చెప్పు బ్రదర్‌'' అన్నాడు నవ్వాపుకొంటూ.

''ఏం చెప్పను సార్‌! నా భార్యంటే నాకు ప్రాణం. ప్రేమించుకుని పెళ్ళిచేసున్నాం. నాకోసం ఆస్థిని, అయినవాళ్ళను వదులుకుని వచ్చేసిన ప్రేమదేవత సార్‌ నా భార్య. అలాంటి భార్యని రక్షంచుకోలేకపోతే నేను బ్రతికినా చచ్చినా ఒకటేకదా సార్‌...! యజమాని తర్వాత యజమాని స్థానంలో వున్న మేడంగారే మా బాధను అర్థంచేసుకోలేకపోతే ఏం చేయాలి? అందుకే స్టాకు దొంగిలించాను. వీళ్ళు డబ్బున్నవాళ్ళు సార్‌! డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన మేడంలాంటి వాళ్ళకి మన బాధలు ఏం తెలుస్తాయి సార్‌. ఎన్ని జన్మలెత్తినా ప్రేమవిలువ తెలీదు'' అంటూ కన్నీరు తుడుచుకున్నాడు.

వాడి మాటల్లో చివరి పదాలు...

వరేణ్యను చురుక్కుమనిపించాయి.

''ఆ మాటంటే వూరుకోను. నాకు ప్రేమ విలువ తెలుసు'' అనరిచింది.

''లేదు మేడం! మీకు తెలీదసలు'' అన్నాడు అసలు విషయం తెలియని పట్టాభి.

''పట్టాభీ! నిన్ను ఉద్యోగంలోంచి తీసేసానని నాకు ప్రేమ విలువ తెలీదనటం నాకసలు నచ్చలేదు. నువ్వేమిటి వాడి మాటలు విని నా వంక చూసిమరీ వంకరనవ్వు నవ్వుతావ్‌'' అంటూ ఉడుక్కుంది.

''ఓ.కె. ఓ.కె లీవిట్‌! మేడంగారికి ప్రేమ గురించి తెలుసు.... ఒప్పుకో నష్టంలేదు. ముందు నీ సమస్య చెప్పు. తర్వాత ఏమైంది?''

''బ్రతిమాలుకున్నాను సార్‌. కాళ్ళావేళ్ళాపడ్డాను. లోన్‌ డబ్బులు కట్టేస్తానన్నాను. నెలనెలా జీతంలో కట్‌చేసుకోమన్నాను. అయినా నా గోడు పట్టించుకోలేదు.

సెటిల్‌మెంట్‌చేసి నన్ను జాబ్‌లోంచి తీసేసారు. ఎలా బతకాలి? అప్పులుచేసి పెళ్ళాం పిల్లల్ని ఎంతకాలం పోషించగలను? మరో జాబ్‌ అంత త్వరగా దొరుకుతుందా? అందుకే... మేడంగారి టూర్‌ సంగతి తెల్చి దారి కాచాను. బెదిరించి ఎంతోకొంత సొమ్ము తీసుకుంటే నా కష్టాలు తీరతాయన్న ఆశతో తొందరపడ్డాను. కష్టాలు తీరకపోగా దెబ్బలు మిగిలాయి. ఇక ఆ దేవుడే మా కుటుంబాన్ని కాపాడాలి'' అంటూ కన్నీరు పెట్టుకున్నాడు.

''ఆ తర్వాతయినా మరోసారి మేడంగార్ని కలిసి నీ సమస్యలు చెప్పుకున్నావా?'' అడిగాడు త్రివిక్రమ్‌.

''లేదండి.''

''అదే నువ్వుచేసిన పొరబాటు. నువ్వు కంపెనీ స్టాకు అమ్ముకోడం ఘోరమైన తప్పు. ఎవరయినా మేడంగారిలాగే స్పందిస్తారు. జాబ్‌ లోంచి తీసేస్తారు. కానీ కోపం తగ్గాక ఆలోచిస్తారు. నువ్వు మేడంగార్ని కలిసి చెప్పుకునుంటే తిరిగి ఉద్యోగం ఇచ్చేవారేమో! ఆ పని ఎందుకుచేయలేదు? మేడం వాడు చాలా కష్టాల్లో వుండి ఈ వెధవపని చేసాడు. సాటి ఎంప్లాయిల కష్టాల్ని, సమస్యల్ని అర్థం చేసుకుని వాళ్ళని దయగా చూడాలి. అప్పుడే వాళ్ళుకూడా పై అధికారులమీద, కంపెనీమీద విధేయత కలిగి వుంటారు. ఆ సమస్య మీ చేతిలోవుంది. పట్టాభికి మీరే న్యాయంచేయాలి. తప్పదు'' అంటూ సూచించాడు త్రివిక్రమ్‌.

అతడి ఆంతర్యం వరేణ్యకి అర్థమైంది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్