Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
24th Episode

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ

జరిగిన కథ: వరేణ్య, త్రివిక్రం లు అరగంటలో వైజాగ్ చేరుతారనగా, ఒక లారీ వీళ్ళ కారుని ఓవర్ టేక్ చేస్తూ కారుని ఢీ కొట్టే ప్రయత్నం చేస్తుంటారు. తమని ట్రాప్ చేసారని త్రివిక్రం ఆశ్చర్యానికి లోనవుతాడు, వరేణ్య భయంతో కంగారుపడుతుంది. 

 

''ఓ.కె. ఇకనుంచి పొరబాట్లు చేయకుండా నీ డ్యూటీ నువ్వు చెయ్యి. నీ జాబ్‌ నీకిచ్చేస్తున్నాను. రేపేవచ్చి డ్యూటీలోచేరు'' అంది పట్టాభితో.

ఆ మాట వినగానే పట్టాభి ముఖం సంతోషంతో వెలిగిపోయింది.

అమాంతం వరేణ్య కాళ్ళమీద పడిపోయాడు.

''నన్ను క్షమించమ్మా! మీది ఇంతమంచి మనసని తెలీక అది ఇది అని అమర్యాదగా మాట్లాడాను. అవేమి మనసులో వుంచుకోకు తల్లీ. మళ్ళీ ఉద్యోగమిచ్చారు అదిచాలు. నా చర్మం ఒలిచి మీకు చ్పొలు కుట్టించినా తీరదు రుణం'' అన్నాడు ఆనందంతో.

''లే పట్టాభీ! నా మనసులో ఏమీలేదు. ఆ వెధవల్ని ఎంతకు మాట్లాడకు తీసుకొచ్చావు?''

''ఐదు వేలు మేడం''

''ఇచ్చి పంపించేయ్‌! ఇంట్లో నీ పెళ్ళాం, పిల్లలు ఏం కష్టపడుతున్నారో ఏమిటో ఈ పదివేలు వుంచుకో'' అంటూ కారులోంచి కరెన్సీకట్ట ఒకటితీసి అతడిచేతిలో పెట్టింది.

పట్టాభి అనందానికి హద్దుల్లేవు.

కొట్టించాలని వచ్చినవాడే కోటి దండాలుపెడుతూ ఇద్దర్నీ సాగనంపాడు.

త్రివిక్రమ్‌ హేపీగా ఫీలయ్యాడు.

''అవునూ... పట్టాభి  అలా అన్నాడేమిటి? యజమాని తర్వాత యజమాని స్థానంలో వున్నావని. అప్పుడే అడుగుదామనుకుని మర్చిపోయాను. ఏమిటా మాటలకి అర్థం?'' దారిలో అడిగాడు.

''ప్రత్యేకించి అర్థమేమీలేదు. గోడౌన్‌ సెక్షనంతా నా ఆధీనంలో వుంటుందిగాబట్టి అలా అన్నాడంతే'' అంటూ అతడి డౌట్‌ని కవర్‌ చేసింది. వరేణ్య.

''ఎనీవే! నా ఉద్దేశం గ్రహించి పట్టాభికి వరాలిచ్చావు థాంక్స్‌'' అన్నాడు.

''నీ దగ్గర నేర్చుకోవలసింది చాలా వుంది.''

''ఏమీ లేదు.''

''ఎందుకులేదు. చూడ్డానికి సీదాసాదాగా కన్పిస్తావు. అమాయకుడిలా కన్పిస్తూనే పదిహేను మందిని చితకతన్నావు. సూక్ష్మంగా ఆలోచించి సమస్యల్ని పరిష్కరించటంలో మాష్టర్‌వి.''

''ఇంకానయం. బూష్టర్‌వి అనలేదు.''

ఇద్దరూ నవ్వుకున్నారు. కారు విశాఖ సిటీలోకి ఎంటరయింది.

అప్పటికి బాగా చీకటిపడింది. వీధిలైట్లు వెలుగుతున్నాయి. అంత క్రితమే తడిపొడి చినుకులుపడి వీధులు నల్లగా మెరుస్తున్నాయి.    ''నెక్ట్స్‌? నన్ను గెస్ట్‌హౌస్‌లో దించేసి కారు తీసుకెళ్ళిపోతావా?'' అడిగాడు.

''లేదు. నన్ను మా ఇంటిదగ్గర డ్రాప్‌చేసి నువ్వు గెస్ట్‌హౌస్‌కి వెళ్ళిపో.''

''ఓ.కె.''

సముద్రపు ఒడ్డునున్న చక్కని కాలనీ అది.

ఆ వీధి మొత్తం ఇంచుమించు అన్నీ ఎత్తైన ఫ్లాట్‌లు, కట్టడాలు. వాటిమధ్య విశాలమైన కాంపౌండ్‌ మధ్యలో ఒక పాత పెంకుటిట్లు.

దాన్ని ఈమధ్యనే రిపేరు చేయించి తిరిగి నీట్‌గా తయారుచేసారని చూస్తే అర్థమవుతోంది.

గేటుముందు కారు ఆపించింది వరేణ్య.

''ఇదే మా ఇల్లు. లోనకు రా'' అంది దిగుతూ పిలిచింది వరేణ్య.

''మరోసారి వస్తాలే'' చెప్పాడు.

''ఇక్కడ కూడా ఆర్డరే...........తప్పుతుందా'' అంటూ కారుదిగి లాక్‌చేసి ఆమె వెంట లోనకు నడిచాడు.

చుట్టూపూలమొక్కతో కూడిన చల్లని గార్డెన్‌లో పెద్ద కుటీరంలా వుంది ఆ పెంకుటిల్లు పెరటిగోడనానుకొనే దిగువ నుంచి బీచ్‌ స్టార్టవుతుంది. దూరం నుంచి సముద్రకెరటాల హోరుతోబాటు రివ్వున గాలి వీస్తోంది. దూరంగా సముద్రం మీద ఆగిన ఓడలు, షిప్పింగ్‌బోట్ల లైట్లు చుక్కల్లా మెరుస్తున్నాయి.

చాలా ప్రశాంతంగానూ. ఆహ్లాదంగానూ వుందక్కడ. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది.

గేటుదాటగానే పనిపిల్ల ఎదురయింది.

''వచ్చేసారా అమ్మాయిగారు.................బామ్మగారు మీకోసం కంగారుపడుతున్నారు'' అంది వరేణ్యను చూస్తూనే.

''కంగారెందుకే సాయంత్రం ఫోన్‌చేసి చెప్పాగా వచ్చేస్తున్నానని. రా వినోద్‌! ప్లీజ్‌ కమిన్‌'' అంది హాల్లోకి దారితీస్తూ.

ముఖద్వారం దాటగానే  విశాలమైన హాలు వుంది. లోనకు అడుగు పెట్టగానే అతడ్ని ఆకర్షించింది ఎదురుగా గోడకువున్న పెద్దఫోటో అందులో వరేణ్య వెనక ఇద్దరు భార్యాభర్తలు ఎవరో వున్నారు.

''ఎవరు ఆ ఇద్దరూ'' వరేణ్యను అడిగాడు.

ఆశ్చర్యంగా చూసింది వరేణ్య.

''ఎవరేమిటి? మన కంపెనీ ఓనరు సుదాకర్‌ నాయుడుగారు, ఆయన భార్య భాగ్యవతి, నీకు తెలీదా?'' నమ్మలేనట్టు అడిగింది.

తను చిక్కుల్లో పడినట్టు గ్రహించి వెంటనే సర్దుకున్నాడు త్రివిక్రమ్‌.

''నువ్వు నా ప్రశ్న అర్ధంచేసుకోలేదు. వారు నాకు తెలీకపోడం ఏమిటి? ఫోటోలో నీ వెనక ఆ ఇద్దరూ వున్నారేమిటి అంటున్నాను'' అంటూ సమర్ధించుకున్నాడు. ఇ్పుడు వరేణ్య సమర్ధించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

''చెప్పాగదా. మా ఫాదరూ, నాయుడుగారూ క్లోజ్‌ఫ్రెండ్స్‌ అని. అందుకే................కలిసి అలా ఫోటో దిగామన్నమాట. రా కూర్చో'' ''బామ్మా అతడ్ని కూర్చోబెట్టు అంటూ లోనకు వెళ్ళింది వరేణ్య.

'అవును, సుధాకర్‌ నాయుడు దంపతులతో ఈ అమ్మాయి ఫోటో దిగితే మరి ఈ అమ్మాయి తల్లిదండ్రుల ఫోటో ఎక్కడ?' సోఫాలో కూర్చోగానే చుట్టూ చూస్తూ అనుకున్నాడు త్రివిక్రమ్‌.

అంతలో వరేణ్య తన బామ్మగారితో అక్కడికొచ్చింది సుమారు డెబ్బై సంవత్సరాల వయసులో కూడా ఎంచక్కా దబ్బపండు రంగులో గుండ్రాయిలా వుంది బామ్మగారు. చూస్తే అర్థమైపోతుంది. ఆవిడ చాలా హుషారయిన ఓల్డ్‌లేడీ అని.

''బామ్మా, నే చెప్పానే, ఇతనే మిస్టర్‌ వినోద్‌...............మా బామ్మగారు జయమ్మ'' ఒకరినొకరు పరిచయం చేసింది.

''నమస్తే బామ్మగారు...........'' అంటూ లేచి నమస్కరించాడు. అంతే కాదు

''ఆహాఁ త్రివేణిసంగమంలో స్నానంచేయనక్కర్లేదు మిమ్మల్ని చూడగానే గంగా, యమునా, సరస్వతి నదుల్లో స్నానంచేసినంత పుణ్యం దక్కింది. అవును వరేణ్యా, బామ్మ బోలెడు కథలు చెప్పేది. ఒడిలో తలపెట్టుకుని పడుకునేదాన్ని అన్నావ్‌, ఈ బామ్మగారేనా?'' అడిగాడు.

 బామ్మగారు నవ్వేసింది.

''ఆ బామ్మ నేనేనయ్యా. డౌటేవద్దు. నేను కథ చెప్పేదాన్ని, ఇది వినకుండానే నిద్రపోయేది'' అంది ఎదురుగా కూర్చుంటూ.

''ఆ అలవాటు ఇప్పటికీ అలాగే కంటిన్యూ చేస్తోందాండి..............''

''అవును నాయనా''

''బామ్మా................. కాస్త ఆపుతావా?'' అంటూ కసురుకుంది వరేణ్య.

''అమ్మాయి నీ  గురించే చెప్తూంటుంది'' అందావిడ.

''చెడ్డవాళ్ళ గురించి అలాగే చెప్తుంటారు. మనం నమ్మకూడదు బామ్మగారు.''

మరోసారి ఫక్కున నవ్వేసిందావిడ

''చుట్టూ పెద్దపెద్ద కట్టడాలయిపోయాయి. ఇంకా ఈ పాత పెంకుటిల్లు ఏమిటండీ? బిల్డింగ్‌ వేసేయొచ్చుగా?'' మాటలమధ్య బామ్మగారిని అడిగాడు.

''వేసేయొచ్చు నాయనా. బిల్డింగేం ఖర్మ, నేను ఒప్పుకుంటే నా కోసం పెద్ద రాజమహలే కట్టిస్తానంటాడు నా కొడుకు. కాని నాకే ఇష్టం లేదు'' అందావిడ.

''అదేమిటి? ఎందుకు యిష్టంలేదు?'' అడిగాడు.

''ఆ విషయం నేను చెప్తాను'' అంది వరేణ్య.

''మా తాతయ్య, మా బామ్మ ఇద్దరిదీ లవ్‌మేరేజ్‌'' అంది.

''అదీ సంగతీ..... మీ ఫ్యామిలీకి ప్రేమ వివాహాలు బాగా కలిసివచ్చినట్టున్నాయి.''

''వింటావా..................? అప్పట్లో మా తాతగారు కష్టపడి కట్టిన ఇల్లు, కాబట్టి ఈ కట్టె ఈ ఇంట్లోనే పోవాలి. ఆ తర్వాత మీరేమైనా చేసుకోండి అంటుంది బామ్మ.''

''ప్రేమంటే ఉదయం పుట్టి సాయంత్రం అస్తమించే సూర్యునిలాంటిది కాదు. మనిషి వున్నా, లేకపోయినా ఎప్పుడూ గుండెలో ప్రకాశించే జ్యోతి ప్రేమ. ఆయన జ్ఞాపకాలే నన్నింకా బ్రతికిస్తున్నాయి. మొదటిసారిగా మా యింటికొచ్చావు. నువ్వు భోంచేసి వెళ్ళాలి'' అంది వరేణ్య.

అయితే త్రివిక్రమ్‌ భోజనంవరకు ఆగలేదు. లైట్‌గా టిఫిన్‌చేసి, కాఫీతాగి వెళ్ళిపోయాడు. త్రివిక్రమ్‌ను సాగనంపి లోనకు రాగానే బామ్మ పక్కన కూర్చుంటూ. ''ఇప్పుడు చెప్పవే బామ్మా! వినోద్‌ ఎలా వున్నాడు?'' అని అడిగింది.

''కుర్రాడికేమిటే బంగారంలా వున్నాడు'' అందావిడ.

''బంగారంలా ఏమిటి? బంగారమే.''

''అయితే గిల్లి చూసావన్నమాట.''

''పో బామ్మ'' అంటూ సిగ్గుపడిపోతూ బామ్మ ఒడిలో వాలిపోయింది వరేణ్య.

మనిషికి టైం బాగుంటే పట్టిందల్లా బంగారు అవుతుంది. తప్పు చేసినా అది ఒప్పవుతుంది. అదే టైం బాగాలేదంటే పట్టింది బంగారం అయినా మట్టి అయిపోతుంది. ఒప్పుచేసినా అది తప్పవుతుంది. ఈ టైం సిద్దాంతం రైటా రాంగా అనేది పక్కనపెడితే

ప్రస్తుతం త్రివిక్రమ్‌ అదృష్టం పూలరధంలో పరుగుతీస్తోంది. అందుకే మరునాడు ఉదయం అతడు ఆఫీసులో అడుగుపెట్టగానే ఘనస్వాగతం లభించింది. మేనేజరు మధుసూదనరావు అతడ్ని కౌగిలించుకొని మరీ అభినందించాడు.

ఎందుకంటే 

త్రివిక్రమ్‌ ప్రతిపాదించిన పంచసూత్ర పథకాన్ని ఓనర్‌ సుధాకర్‌నాయుడుగారు ఓకె చేయటమే కాదు, వెంటనే అమలుపరచటానికి ఫండ్స్‌ కూడా రిలీజ్‌ చేసాడు. వినోద్‌కి తన అభినందనలు చెప్పమని ఫోన్‌లో చెప్పాడు.

నిజానికి ఆటోమొబైల్‌ రంగం గురించిగాని, ఈ  బిజినెస్‌ గురించిగానీ తనకు ఏమీ తెలీకపోయినా తన గుట్టు కాపాడుకోడానికి ఆ రోజు కాన్ఫరెన్స్‌లో నోటికొచ్చిన పథకాలు ఏవో వాగేసాడు. అవి ఇంతగా వర్కవుటవుతాయని వూహించలేదు. ఏమైతేనేం? తన రొట్టె విరిగి నేతిలోను, తర్వాత తేనెలోను పడినట్టయింది. దాంతో కంపెనీ పనుల్లో బిజీ.......బిజీ...........బిజీ....................

కాని ఇవేమీ త్రివిక్రమ్‌ సంతోషం కలిగించటంలేదు.

ఎందుకంటే భయపడినట్టే వర్షంపడి పిచ్‌ పాడయిన కారణంగా క్రికెట్‌మేచ్‌ కాన్సిలయింది. వచ్చే ఆదివారంకి మేచ్‌ను పోస్ట్‌ఫోన్‌ చేసారు. ఫలితంగా వారం రోజులు ఇక్కడే వుండిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈలోపల అసలు వినోద్‌ వచ్చినా, లేక పోలీసులకు దొరికిపోయినా తను ఆశపడినట్టు స్టేడియంలో కూర్చుని మేచ్‌ చూడలేడు. అదీ అతడి బాధ.

ఈ లోపల

హైదరాబాద్‌నుంచి అతడికోసం వచ్చిన భద్రం, వీరభద్రం యిద్దరూ అతడికోసం సిటీ మొత్తం పిచ్చిపట్టినట్టు తిరుగుతూ గాలిస్తున్నారు. ఎందుకంటే అక్కడ జైలర్‌ ఆంజనేయులునుంచి వస్తున్న ఫోన్‌కాల్స్‌కి బదులుచెప్పలేక జుత్తు పీక్కోవాల్సి వస్తోంది.

మరోపక్క ఒరిజినల్‌ వినోద్‌ వున్నాడు.

పోలీసులు గాలిస్తోంది త్రివిక్రమ్‌ కోసమని అతడికి తెలిసిపోయింది. పోలీసులకు అతడు దొరికితే పట్టి తీసుకెళ్ళిపోతారు. తన డౌట్లు క్లియర్‌కావు. అంచేత తనే ముందుగా త్రివిక్రమ్‌ని కలుసుకోవాలన్న పట్టుదలతో త్రివిక్రమ్‌ సన్‌ ఆటోమొబైల్స్‌ ఆఫీసులో వున్న సంగతి పోలీసులకు చెప్పలేదతను. తనే గెస్ట్‌హౌస్‌కి, ఆఫీస్‌కి తిరుగుతున్నాడు. కాని సడెన్‌గా పంచసూత్ర అమలు కార్యక్రమాల్లో త్రివిక్రమ్‌ బిజీ అయిపోడంతో అతడ్ని పట్టుకోడం వీలుకావటంలేదు.

ఈ పరిస్థితిలోనే ఒక క్రాస్‌రోడ్స్‌వద్ద సిగ్నల్‌పడి ఆగిపోయిన కార్లలో ఒక బెంజ్‌కారులో వరేణ్య పక్కనున్న త్రివిక్రమ్‌ని ముందుగా భద్రం చూసి షాకుతింటూ వీరభద్రంకి చూపించాడు.

''ఛ! నీకు మతిలేదురా'' అన్నాడు వీరభద్రం.

''నాకు మతిలేదా?''

''బుద్దికూడా లేదు. లేకపోతే ఎవర్నో చూసి త్రివిక్రమ్‌ అని ఎందుకనుకుంటావ్‌. జేబులో చిల్లిగవ్వ లేకుండా దొంగలబండి ఎక్కి త్రివిక్రమ్‌ వైజాగ్‌చేరి వారం రోజులు కాలేదు. సూటు బూటు వేసుకొని దొరబాబులా బెంజికారులో ఎలా వస్తాడనుకున్నావ్‌? పైగా పక్కన అప్సరసలా అందమైన అమ్మాయి. ఇది సాధ్యమేనా?''

''అంతేనంటావా?''

''అంతే............... ఇతనెవరో త్రివిక్రమ్‌లాంటి రూపం కలిగిన కోటీశ్వరుడు. పొరబాటున పలకరిస్తే మనం రిస్క్‌లో పడతాం పద'' అన్నాడు.

ఇలా రెండుమూడు సార్లు త్రివిక్రమ్‌ని చూసి కూడా పోలీసులు ఎవరో అనుకుంటూనే వచ్చారు. భద్రంకి మాత్రం డౌటుగానే వుంది. ఈ ఫోర్‌ ట్వంటీగాడు ఏదో చేసి బెంజ్‌కారులో తిరుగుతున్నాడు. సందేహంలేదు. వాడువీడే అని గాఢంగా నమ్ముతున్నాడు. ఆ నమ్మకంతోనే ఆటోలో కారును ఫాలోచేసి గెస్ట్‌హౌస్‌ను, కంపెనీ ఆఫీస్‌ని కూడా చూసాడు. లోనకెళ్ళి పలకరించటానికి ధైర్యం చాలటంలేదు. ఖరీదైన బంగళాలో నివాసం, పెద్ద కంపెనీ ఉద్యోగం, కాలుదింపితే ఎ.సి. కారు. ఎలా పలకరించటం, ధైర్యం చాలటంలేదు.

ఇదే సమయంలో

తనకోసం గాలిస్తున్న భధ్రం, వీరభద్రంలను త్రివిక్రమ్‌ కూడా గుర్తించాడు. వాళ్ళ అవస్థచూసి నవ్వుకునేవాడు.

వినోద్‌ కూడా సిటీలో వుండి కలిసే ప్రయత్నం చేస్తున్నాడని త్రివిక్రమ్‌కి తెలీదు. అన్నిటికీమించి మరో అయిదురోజులు ఏ గొడవా లేకుండా గడిచిపోతే హేపీగా ఆదివారం క్రికెట్‌మేచ్‌ చూసి, రాత్రి బండికి వెళ్ళిపోవచ్చని అలా చేయమని దేవుళ్ళకు మొక్కుకుంటూనే వున్నాడు.

ఇదే సమయంలో మరో సమస్య ఎదురైంది. వినోద్‌తో మాట్లాడాలని హైదరాబాద్‌నుంచి సుధాకర్‌నాయుడుగారు ట్రయ్‌ చేస్తున్నారు. ఆయనతో మాట్లాడటం అంటూ జరిగితే, తన గుట్టు బయట పడిపోతుందని త్రివిక్రమ్‌కు తెలుసు.

అందుకే ఫోన్‌లో ఆయనకు అందకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.

ఈ గందరగోళ పరిస్థితిలోనే

ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు జరిగిందా సంఘటన, ఎంతకీ త్రివిక్రమ్‌ని కలవటం సాధ్యం గాకపోవటంతో, విసిగిపోయిన వినోద్‌ ఆరోజు ఉదయం ఎనిమిది గంటలకే గెస్ట్‌హౌస్‌ చేరుకున్నాడు. సెంట్రీలు, పనివాళ్ళ కళ్ళుగప్పి ఎలాగో లోనకు వచ్చేసాడు.

త్రివిక్రమ్‌ గదిలో జొరబడి

తలుపుమూసి బోల్ట్‌పెట్టేసాడు.

త్రివిక్రమ్‌ వూహకి అందని సంఘటన అది.

వినోద్‌ విశాఖ వచ్చాడనిగాని,  తనను కలుసుకునే ప్రయత్నంలో వున్నాడనిగాని అతడికి ముందుగా తెలీదు. వినోద్‌ లోనకొచ్చే సమయానికి అతను బయలుదేరటానికి డ్రస్‌ చేసుకుంటున్నాడు. అలికిడి విని తిరిగి చూసాడు.

డోర్‌ దగ్గర నిలబడి వినోద్‌ని చూడగానే కరెంట్‌షాక్‌ కొట్టినట్టు తృళ్ళిపడుతూ

''నువ్వా?'' అనరిచాడు.

''నేనే............వినోద్‌ని.................నీ మోసానికి తెర దించడానికే వచ్చాను. నువ్వు నాకు చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోకుండా వెళ్ళను'' అంటూ చటుక్కున డాగర్‌తీసి వాటంగా పట్టుకున్నాడు.

''మైగాడ్‌..............పొడిచి చంపేస్తావా ఏమిటి?'' కంగారుగా అడిగాడు త్రివిక్రమ్‌.

''చంపటానికే తెచ్చా. నీ నెత్తురు తాగుతా''

''ఛ...............నువ్వేమన్నా పులివా, సింహానివా నెత్తురు తాగటానికి? జీర్ణంగాక ఛస్తావ్‌. అనవసరంగా గోలచేయక అలా కూర్చో. సమస్యని సామరస్యంగా స్నేహవాతావరణంలో పరిష్కరించుకుందాం.''

''షటప్‌, స్నేహమా, సామరస్యమా, నీలాంటి చీటర్‌తోనా...............ఆ వేశం తెచ్చుకోడానికి పొద్దుటే మందుకొట్టి మరీ వచ్చాన్రా. నువ్వు అయిపోయావ్‌'' అంటూ డాగర్‌ వాటంగా పట్టుకొని మీదికొచ్చాడు పొడవటానికి.

లాఘవంగా వాడిచేయి పట్టుకుని, ఈ చెంప ఆ చెంప డప్పుల్లా వాయించాడు త్రివిక్రమ్‌.

డాగర్‌లాగి అవతల పడేశాడు.

''డాగర్‌ పట్టాలన్నా, పొడవాలన్నా దమ్ముండాలి బ్రదర్‌. అది నీకు లేదు. జరిగినదానికి ముందుగా నీకు సారీ చెపుతున్నాను. నీ దృష్టిలో నేను మంచివాడ్ని కాకపోవచ్చు. చెడ్డవాడ్ని మాత్రంకాదు. ముందలా కూర్చో.................'' అంటూ అతడ్ని సోఫాలో కూలేసి ఎదురుగా కూర్చున్నాడు.

ఇక ఆపుకోలేక.

రెండు చేతులతో ముఖం కప్పుకుని ఏడ్చేసాడు వినోద్‌. మానసికంగా ఎంతో నలిగిపోతేతప్ప, ఒక మగాడు ఇలా సిగ్గువిడిచి ఏడవలేడు. అతడి బాధను త్రివిక్రమ్‌ అర్ధం చేసుకోగలుగుతున్నాడు.

అతడి ఎదురుగా మరో సోఫాలో కూర్చున్నాడు.

''ఏడ్చిందిచాలు, సిగరెట్‌ తీసుకో'' అంటూ ఒక సిగరెట్‌ అందించాడు.

''లేదు. నేను చాతగానివాడ్ని, పగ తీర్చుకోడానిక్కూడా పనికిరాని చవటని. నేను బ్రతకటం అనవసరం'' అన్నాడు ఏడుస్తూనే.

''షటప్‌!'' కోపంతో గద్దించాడు త్రివిక్రమ్‌.

''పగ తీర్చుకోవటం అంటే కత్తితో పొడిచేయటమేనా? నేనంటే ఫూల్‌ని, ఇడియట్‌ని. పెద్ద పెద్ద చదువులు చదివావ్‌. నీకేమైంది? ఇంత ఫూలీష్‌గా ఎందుకు ఆలోచిస్తున్నావ్‌...........?'' మందలిస్తున్న దోరణిలో కోప్పడ్డాడు.

తలెత్తి అదే కోపంతో చూసాడు వినోద్‌.

''నీతులు చెప్పకు, నువ్వు మోసగాడివి. నువ్వు నాకెంత ద్రోహం చేసావో నీకు తెలీదా?'' అనడుగుతూ సిగరెట్‌ తీసుకున్నాడు. కళ్ళు తుడుచుకుని సిగరెట్‌ ముట్టించుకున్నాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్