Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Middle Age Acne and Ayurvedic Treatment by Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ay)

ఈ సంచికలో >> శీర్షికలు >>

మూడ్ బాగోలేదండీ...... - భమిడిపాటి ఫణిబాబు

no mood.....

ప్రపంచంలో మనం చేయాలిసిన పని ఎప్పుడైనా ఎగ్గొట్టాలంటే, ' ఏమిటోనండి, మూడ్ బాగాలేదూ....' అనేస్తే సరిపోతుంది. అసలు ఈ మూడ్డేమిటి, బాగోపోడమేమిటీ,వీటన్నిటికీ సరైన సమాధానమూ లేదు, ఓ అర్ధం కానీ పర్ధం కానీ లేదు! అయినా దానంత బ్రహ్మాండమైన escape route ఇంకోటి లేదు. ఈ  మూడ్ అనే స్థితిని క్వాంటిఫై చేయలేము. పోనీ ఏదైనా వైద్యం చేయిద్దామా అంటే అదీ వీల్లేదూ, ఆ  మూడ్ పాడైపోయినవాడి మూడ్ మీద ఆధార పడడం తప్ప ఇంకో దారి లేదు.

ప్రతీవాడూ, మూడ్ బాగోలెదూ అనడానికి వీల్లేదండోయ్. కాల మాన పరిస్థితుల బట్టి మార్చుకోవాలి. ఏదో ఉద్యోగంలో ఉన్నామనుకోండి, ఆ ఆఫీసులో ఉండే బాస్ కి తప్ప ఇంకెవరికీ ఈ "మూడ్ బాగోలేదు" అదృష్టం ఉండదు. ఎక్కడిదాకా వెళ్తుందంటే, ఆ బాసు మూడ్ బాగోపొతే, మనకి ప్రాణం మీదకొచ్చినా శలవు ఇవ్వడు.ఆ బాసు గారి  మూడ్లు ఇంట్లో ఆయన పెళ్ళాం పెట్టే చివాట్లూ, బెల్లం ముక్కలను బట్టీ  మారుతూంటుంది.కొంపలో మూడ్ బావుంటే, ఆఫీసులో మూడ్డూ సరీగ్గానే ఉంటుంది.కర్మ కాలి,ఆయనకి ఆఫీసుకి బయలుదేరేముందు, ఇంటావిడ ఏమైనా కూతురు పెళ్ళి గురించో,ఇంకోదానిగురించో టాపిక్కు వచ్చిందా, అంతే సంగతులు.. కూతురు పెళ్ళి అని ఎందుకు అన్నానంటే, ఆఫీసులో బాస్ అయ్యే టైముకి, కూతురు పెళ్ళీడుకి వస్తుంది. బాస్ కాబట్టి ఆయన ఏం చేసినా చెల్లుతుంది. ఇలాటిదానిని "ప్రివిలేజ్డ్ మూడ్ బాగో పోవడం" అంటారు. ఈ అదృష్టం అందరికీ పట్టదు. ముందర బాస్ అవాలి.మనలాటి ఆంఆద్మీకి అలాటి ఫెసిలిటీస్ ఉండవు ఆఫీసుల్లో.అందుకే ఆఫీసుల్లో చూస్తూంటారు, బాస్ మూడ్ ఎలా ఉందీ అని.ప్రతీ ఫైలు మీదా రాసేస్తాడు

" Please speak" అని !

అంతదాకా ఎందుకూ, చిన్న పిల్లల్ని చూస్తూంటాము, అంతా చేస్తే వేలెడుండడు, వాడిక్కూడా మూడ్లే! అంతా బాగుంటే, హాయిగా టైముకి అన్నీ చేస్తాడు. లేకపోతే అంతా పేచీయే.వాడి ఆయుధం " ఏడుపు". ఏ కారణం లేకుండా ఏడుస్తూంటాడు. ఆఫీసులో బాసు అరుస్తాడు, ఇంట్లో పిల్లాడు ఏడుస్తాడు. కారణం మాత్రం ఒక్కటే "మూడ్"! వాణ్ణి ఎత్తుకునో, వాడిక్కావలిసినవి సమర్పించుకునో, వాడి మూడ్ మార్చాలి. ఏదో ఇంట్లో పెద్దవాళ్ళు అలా చేయాలని చూసినా, వాడి అమ్మా నాన్నా అలా చేయనీయరు, డిసిప్లీన్ పేరుతో. ఈ హడావిడితో చివరకి జరిగేదేమిటంటే ఇంట్లో వాళ్ళ అందరి మూడ్లూ తగలడ్డం! ఇలా అందరి మూడ్లూ పాడైపోయే సరికి జరిగేదేమిటయ్యా అంటే, ముందు హాల్ లో టి.వి. చూస్తున్న ఇంటి పెద్దాయన  టి.వీ,లో వస్తున్నదేదో వినిపించక, సౌండు వాల్యూం పెంఛుతాడు,పెద్దావిడ, " అసలు ఎప్పుడైనా నేనేమైనా చేద్దామనుకున్నా, అందరూ కళ్ళల్లో నిప్పులోసుకుంటారు" అంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఆ పిల్లో/పిల్లాడి ( మూడ్ పాడై పేచీ పెడుతున్న శాల్తీ) అమ్మ, చేయవలసిందంతా చేసేసి,  స్నానం పేరుతో బాత్రూం లోకి దూరిపోతుంది.ఆ పూర్ తండ్రి అంటే పెద్దాళ్ళ పుత్రరత్నం, ఏం చెయ్యాలో తెలియక,  బాల్కనీ లోకి సెల్ ఫోను లో మాట్లాడుతూ జారుకుంటాడు.ఆ ఏడ్చేవాడికి ఓ అక్కో చెల్లెలో ఉందా, అదేదో డ్యూటీ లాగ తనూ ఓ ఏడుపు ( సింపథెటిక్ ఏడుపు)  మొదలెట్టేస్తుంది.

ఈ గోలంతా భరించలేక, పెద్దాయన మూడ్ పాడిచేసేసికుని, టి.వి.ని ఆపుచేసేస్తాడు.ఇంట్లో తిండుందో లేదో తెలియదు. ఈ హడావిడిలో కుక్కర్ ఎవరూ పెట్టలేదుగా, అయినా ఆ పెద్దావిడకి తప్పదుగా, టైముకి ముద్ద పడకపోతే, పెద్దాయనకి ప్రాణం మీదకొస్తుంది! చూశారా ఆ కుర్రకుంక మూడ్ ఎంత పని చేసిందో? చేసిందంతా చేసేసి, హాయిగా నవ్వుతూ ఆడుకుంటారు పిల్లలిద్దరూ!

అసలు ఈ మూడ్లు ఎందుకు పాడవుతాయో, ఎందుకు బావుంటాయో ఆ బ్రహ్మక్కూడా తెలియదు. పని చేయాలని లేకపోతే, మూడ్ బాగో లేదండీ అనేయొచ్చు.ఒక్కోప్పుడు మూడ్ ఎంత బాగుంటుందీ అంటే, రోజంతా మేఘాలమీదే ఉంటారు ( అదేదో cloud 9 అంటారుట! ఆ 9 ఎందుకొచ్చిందో నాకు తెలియదు!). ఈ గోలంతా ఎందుకు వ్రాశానంటే, ఈవేళ ప్రొద్దుటే, మా ఇంటికి బయలుదేరేముందర, మా ఇంటావిడ తో చెప్పాను,మనవణ్ణి చూసి, ఎవరినో కలవడానికి వెళ్ళొస్తానూ అని.కానీ, కారణం ఏమిటో స్పష్టంగా తెలియదూ, ఎక్కడికీ వెళ్ళే మూడ్ లేకపోయింది, బస్సెక్కేసి కొంపకొచ్చేశాను. ఇంటికొచ్చిన తరువాత మూడ్ బాగుపడిపోయింది లెండి, వంకాయ కారం పెట్టిన కూరా, మామిడికాయ పప్పూ, కొబ్బరీ మామిడి పచ్చడీ, మజ్జిగ పులుసూ వేసికుని భోజనం చేసేసరికి!

ఒక్కోప్పుడు ,ఏదో దగ్గరకి తీసికుంటే బాగుంటుందేమో అనుకుని, భార్యతో సరసాలాడ్డం మొదలెట్టామా, అన్నీ బాగుంటే ఫరవాలేదు కానీ, రోజు బాగుండకపోతే ఆవిడా “ మూడ్ బాగోలేదండీ..” అన్నా అనొచ్చు.

 అప్పుడప్పుడనిపిస్తూంటుంది, ఇన్నేసి వెధవ్వేషాలు వేస్తామే, సడెన్ గా ఇంటావిడ " ఈవేళ అన్నం వండడానికి మూడ్ లేదండీ..." అంటే  వామ్మోయ్......తూర్పుకి తిరిగి దండం పెట్టడమే..

మరిన్ని శీర్షికలు
duradrustapu dongalu