Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఆ సినిమా నాకు మ‌గ‌ధీర‌లా త‌యారైంది - న‌రేష్

Interview with  Allari Naresh
బోర్ కొట్ట‌ని కామెడీ... అల్ల‌రి న‌రేష్‌ది. తను ఏం చేసినా, ఒక్కోసారి ఏం చేయ‌క‌పోయినా న‌వ్వొచ్చేస్తుంటుంది. అత‌ని బాడీ.. కామెడీకి అంత‌లా మెల్ట్ అయిపోయింది. రాజేంద్ర‌ప్ర‌సాద్ కాస్త సీరియ‌స్ పాత్ర‌ల‌వైపు బోల్డ్ అయిపోయి - అస‌లు కామెడీ చేయ‌డానికి మ‌రో `హీరో` లేడేంటి??  అనుకొంటున్న ద‌శ‌లో అల్ల‌రి న‌రేష్ దొరికేశాడు. స్నూఫ్‌లు, పేర‌డీలు, గార‌డీలు... ఇలా ఏదో ఒక‌టి చేసి - కామెడీ సృష్టించ‌డం న‌రేష్ స్టైల్‌. అత‌ని సినిమాకి వెళ్తే టికెట్లు రేటు, అత‌నితో సినిమా తీస్తే... నిర్మాత‌ల‌కు లాభాలు గిట్టుబాటు అయిపోతాయ‌ని ఓ ఫీలింగ్ బ‌లంగా వ‌చ్చేసి - అత‌నో మినిమం గ్యారెంటీ హీరో అయిపోయాడు. అయితే కొంత‌కాలంగా ఈ అల్ల‌రోడి కామెడీకి కాసులు రాల‌డం లేదు. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. బెడ‌సి కొడుతూనే ఉన్నాయి. ఇక కొత్త దారి చూసుకోవాల్సిందే అన్న నిజం న‌రేష్‌కీ తెలిసిపోయింది. అందుకే - న‌వ్వించ‌డానికి కొత్త మార్గాలు అన్వేషిస్తా... అంటున్నాడు. గో తెలుగుతో మాట్లాడుతూ ఇంకా ఏమేం అన్నాడో మీరే చ‌ద‌వండి.

* హాయ్ న‌రేష్ ... ఎలా ఉన్నారు?
- బిజీగా ఉన్నానంటే ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌నంటాన‌న‌ని పొర‌పాటు ప‌డ‌తారు. అదే ఖాళీగా ఉన్నానంటే సినిమాల్లేవేమో అని అపోహ‌ప‌డ‌తారు. మీతో ఏం చెప్పినా చిక్కే.

* ముందే... పంచేసేశారు...
- లేదంటే జ‌నాలు న‌వ్వ‌డం లేదు క‌దండీ. న‌రేష్ సినిమా ఇలానే టైటిల్ కార్డ్ టు శుభం కార్డ్ న‌వ్వులే ఉంటాయ‌ని ఆశించి థియేట‌ర్ల‌కు వ‌స్తుంటారు. ఇలానే... ఏదో ఓ గార‌డీ చేసి న‌వ్విస్తుండాలి.

* కానీ పంచ్‌లు పేల‌డం లేదు.. ఎందుక‌నో..?
- చూస్తున్నారు క‌దా..?   ఫేస్ బుక్‌లూ, నోట్‌బుక్‌లూ ఎన్నొచ్చేశాయో?  పేజీలు తిప్ప‌కుండానే ఎన్నో జోకులు, పేర‌డీలు..!  వాటిని మించి న‌వ్వించాలి. లేదంటే - ఇది పాత జోకేరా అని లైట్ తీసుకొంటున్నారు. న‌వ్వించ‌డం అంత తేలికైన విష‌యం కాదండీ బాబూ. పులుసుకారిపోతోందిక్క‌డ‌.

* సుడిగాడు త‌ర‌వాత హిట్ కొట్ట‌లేదు..
- నిజ‌మేనండీ. అదో మ‌గ‌ధీర‌లా త‌యారైంది నాకు. ఆ సినిమా త‌ర‌వాత అంద‌రూ ఆ స్థాయిలో కామెడీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.

* మ‌రి మీరేమో ల‌డ్డూబాబులాంటి సినిమాలు తీస్తే ఎలాగండీ..?
- కామెడీ నుంచి కాస్త రూటు మారుద్దామ‌నే ల‌డ్డూబాబు చేశాం. నిజానికి అదో ఫీల్ గుడ్ మూవీ. ఆ సినిమాలోనూ న‌వ్వులు ఆశించే జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌చ్చారు. ఏం చేస్తాం??  అక్క‌డే మా ప్ర‌య‌త్నం బెడ‌సి కొట్టింది.

* పోనీ.. మేం తీసేది ఫీల్ గుడ్ మూవీ అని జ‌నాల్ని ముందే ప్రిపేర్ చేయ‌క‌పోయారా??
- చేద్దూం. కానీ మాకూ కొన్ని ప‌రిమితులుంటాయి. ఇది కామెడీ సినిమాకాదు అంటే బ‌య్య‌ర్లు ఒప్పుకోరు. అందుకే అలా చెప్పొద్దంటారు ప్రొడ్యూస‌ర్స్‌. మేమేం చేస్తాం..??

* పోనీ త‌ప్పులు ఎక్క‌డ జ‌రుగుతున్నాయో గ‌మ‌నించారా?
- పోస్ట్ మార్ట‌మ్ చేసుకొంటే ఫ‌లితాలుండ‌వు. జ‌రిగిందేదో జ‌రిగింది. ఇక రాబోయే సినిమాల‌పై దృష్టి పెట్టాలి. జ‌నాన్ని న‌వ్విస్తేనే సినిమా హిట్టు. ఈ విష‌యం క్లియ‌ర్‌గా అర్థ‌మైపోయింది. ఇక ఎలా న‌వ్వించాం, ఎంత న‌వ్వించాం అన్న‌దానిపైనే విజ‌యాలు ఆధార‌ప‌డి ఉన్నాయి.

* కామెడీ రాసే రైట‌ర్స్ కొర‌తొచ్చేసిందంటారు..
- ఆ మాట నిజ‌మే. కాస్త పేరు తెచ్చుకొన్న‌వాళ్లంతా ద‌ర్శ‌కులైపోతున్నారు. ఇక కొత్త‌వాళ్లు వ‌స్తున్నారు గానీ.. స‌రుకున్న‌వాళ్లు చాలా త‌క్కువ‌. ఎక్కువ‌మంది ప్రాస‌ల్ని న‌మ్ముకొంటున్నారు.

* మీరు పేర‌డీలూ, స్నూఫ్‌ల‌నూ న‌మ్ముకొంటున్న‌ట్టు....
- సుడిగాడు త‌ర‌వాత అస‌లు స్నూఫ్‌లు చేయ‌కూడ‌దు అనుకొన్నా. కానీ కుద‌ర‌డం లేదు. ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌లు `మీరు ఫ‌లానా సినిమాలో ఫ‌లానా హీరోలా డైలాగ్ చెబుతారు..` అంటూ స్ర్కిప్ట్ చెప్పేట‌ప్పుడే న‌న్ను క‌న్వెన్స్ చేసేస్తున్నారు. బీ, సీ ఆడియ‌న్స్ కి ఇలాంటి బాగా ఎక్కుతాయ్‌...అని నాచేత ఒప్పిస్తున్నారు. అయినా ఒక్క‌టి మాత్రం స్ట్రాంగ్ గా నిర్ణ‌యించుకొన్నా. ఇక మీద‌ట‌.. నేను స్నూప్ లు పేర‌డీలూ చేయ‌ను.

* జంప్ జిలానీలో రెండు పాత్ర‌లూ మీరే ఎందుకు చేశారు?  మాతృక‌లో ఆ పాత్ర మ‌రొక‌రు చేశారు. ద్విపాత్రాభిన‌యం వ‌ల్ల ఈ సినిమాకి ఒరిగిందేం లేదు క‌దా..?
- నిజానికి రెండు పాత్ర‌లూ నేనే చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. ఓ పాత్ర కోసం మ‌రో యువ హీరోని ట్రై చేశాం. కానీ పాత్ర ప‌రిధి మ‌రీ చిన్న‌దైపోతుంది... కుద‌ర‌దు అనేశారు. దాంతో గ‌త్యంత‌రం లేక నేనే చేయాల్సివ‌చ్చింది.

* మీ రాబోయే సినిమాలో సంపూర్ణేష్ బాబు కామియో చేస్తున్నాడ‌ట‌..
- కామియో కాదు. ఫుల్ లెంగ్త్ క్యారెక్ట‌రే. 40 రోజుల షెడ్యూల్ ఉంది.

* మీ సినిమాతో క‌థానాయిక‌లుగా ఎంట్రీ న‌టించిన‌వాళ్ల కెరీర్‌.. అంత బాగుండ‌డం లేదు. కార‌ణం ఏంటి?
- మీరింత సాఫ్ట్ గా అడిగారు గానీ. హీరోయిన్ల విష‌యంలో నేనొక ఐరెన్ లెగ్ అని ఘాటుగా రాస్తున్న‌వాళ్లున్నారు. అస‌లు.. నా సినిమాలో నేనెప్పుడూ హీరోయిన్ల గురించి ప‌ట్టించుకోను. ఫ‌లానావాళ్లే కావాలి అని అడ‌గ‌ను. ఎందుకంటే నా సినిమాల్లో క‌థానాయిక‌ల‌కు అంత స్కోప్ ఉండ‌దు. వాళ్ల‌కంటే బ్ర‌హ్మానందం, ఎమ్మెస్ లాంటి వాళ్ల‌తో నాకు ఎక్కువ సీన్స్ ఉంటాయి. పెద్ద హీరోయిన్ల‌ని తెచ్చుకొనేంత బ‌డ్జెట్ ఉండ‌దు. అందుకే ఉన్న‌వాళ్ల‌తో స‌ర్దుకు పోవాల్సివ‌స్తుంది.

* బందిపోటు ఎంత వ‌ర‌కూ వచ్చింది?
- ఈనెల 1న మొద‌లైంది. జులై 17 వ‌ర‌కూ తూ.గో. జిల్లాలో కొన్ని కీల‌క మైన సీన్స్ తీస్తాం. చాలామంచి క‌థ. ఓ తెలివైన దొంగ క‌థ‌. రాబిన్ హుడ్ త‌ర‌హాలో ఉంటుంది.

* 50వ సినిమా విశేషాలేంటి?
- అదేదో ప్ర‌త్యేకంగా ఉండాలి అని డిజైన్ చేయ‌డం లేదు. మిగ‌తా సినిమాల్లానే అది కూడా. 50 అనే నెంబ‌ర్ మీద ఎక్కువ‌గా ఫోక‌స్ పెడితే... ఆ సినిమాపై లేనిపోని అంచ‌నాలు పెరిగిపోతాయ్‌.

* ఓకే.. మీరు అతి త్వ‌ర‌లో ఆ మైలు రాయి చేరుకోవాల‌ని ఆశిస్తున్నాం..
- థ్యాంక్యూ.

వి. రాజా
మరిన్ని సినిమా కబుర్లు
Ra Ra Krishnayya Movie Review