Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
25th episode

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

జరిగినకథ:  ఏకాంబర్ తన చిన్ననాటి మిత్రుడైన పైడిరాజుని కలుసుకున్నాడు. మిత్రులిద్దరూ కళ్యాణ మండపంలో కూర్చుని  మాట్లాడుకుంటారు. ఏకాంబర్, రాజనాలకు, మిత్రుడు పైడిరాజును పరిచయం చేస్తాడు.   

"ఏరా! నీకు చాలా వయసుంది కదా! అందుకే, నీ సర్వీసు వరకూ ఒక పాలసీ ఎండోమెంట్ పెట్టి మిగిలిన మొత్తంతో మనీబ్యాక్ పాలసీ పని చేస్తుంది" అని అందరికీ వారి స్థితిగతులను కనుక్కుని పాలసీలు పెట్టానని చెప్పాడు. మరొకతను మనిషిని చూస్తూనే పచ్చి తాగుబోతని గ్రహించి అతడి సర్వీసు చివరకు అందేలా ఎండోమెంట్ పాలసీ రాయించాడు ఏకాంబర్.

ఏకాంబర్ చెప్పిన వివరణ వింటూనే రాజనాల ఆశ్చర్యంతో నోరు అవులించేశాడు. పైడిరాజు, అతడి మిత్రులు నలుగురూ ఆనందంగా "మంచి ఆలోచన చేశారు సార్" అంటూ ఏకాంబరాన్ని అభినందించారు.

"ఏకాంబర్! నీకు తీరిక వున్నా, లేకపోయినా ఈవారం రోజులూ ఉదయం, సాయంత్రం కొండపైకి వచ్చి మా ఉద్యోగుల్ని కలిస్తే పాలసీలు ఎక్కువ వస్తాయి. అందరూ కడతారు. మాతో దిగుతున్నవాళ్లు ఇంకో పదిమంది ఇక్కడకు వస్తారు. వాళ్లచేత రాయించండి. ఎవరైనా రాయనంటే వదిలెయ్ రాసేవాళ్లు బోల్డుమంది వున్నారు" అన్నాడు పైడిరాజు.

"థాంక్సండీ! మీ మేలు మరచిపోలేము" రాజనాల అన్నాడు.

"గొప్పోలే! ఎవరెవరో, ఎక్కడెక్కడినుండి వాళ్ల తాలూకా, వీళ్ల తాలూకా అని చెప్పి మా ఎంప్లాయీస్ దగ్గర పాలసీలు

రాయించుకుపోతున్నారు. నా బాల్యమిత్రుడు ఏకాంబర్ గాడికి సయానం చేయడం కూడా పెద్ద ఉపకారమే" అని నవ్వాడు పైడిరాజు.
వాళ్లలా మాట్లాడే లోపలే మరో పది, పదిహేనుమంది అక్కడకు వచ్చి చేరుకున్నారు.

వాళ్లందరిలో అర్చకులు, వేదపండితులున్నారు. బోయీలి, గుమాస్తాలు కూడా వున్నారు.

ఆ పదిమందిలో ఒకరిద్దరు మాకిప్పటికే బొచ్చుడు పాలసీలున్నాయి. వద్దురా బాబూ! వద్దు జీతం చేతికి రావతం లేదంటూ వెళ్లిపోయారు. అందులో అందరూ ఏకాంబర్ కి తెలిసినవాళ్లే.

"ఏకాంబర్! నువ్వా? పోనీలేరా! ఇప్పటికైనా ఏదో పని పట్టుకున్నావ్! మంచిదే! ఊరూ, పేరూ తెలీని వళ్లెవరికో పాలసీలు కట్టేస్తున్నారు మా ఎంప్లాయీస్ అందరూ. నీకు మేమందరం చేయిస్తాం. రోజూ కనిపించు. మా ఉద్యోగులు నాలుగొందలమంది. అందర్నీ కలిస్తే నీ పంట పండిపోద్ది" గుమాస్తా హోదాలో వున్నతను అన్నాడు.

వాళ్లందరి అభిమానానికి ఏకాంబరే కాదు, రాజనాల కూడా ఆనందంతో పొంగిపోయాడు.

ఆరోజు దాదాపు నలభై పాలసీల వరకూ దండుకోదలిగాడు ఏకాంబర్. అయితే, అందరూ పాలసీలు రాశారు గానీ, ఒక్కరు కూడా డబ్బులు ఎంతివ్వాలని గానీ, ఎప్పుడివ్వాలని గానీ అడగలేదు.

రాజనాల కూడా పెదవి విప్పలేదు.

ఏకాంబరానికి మాత్రం మనసులో అనుమానం దొలిచేస్తోంది. ఈ పాలసీలు ఎలా కట్టాలా? అని.

మధ్యాహ్నం రెండయ్యేసరికి ఇద్దరూ కొండ దిగువకు చేరుకున్నారు. వూళ్లోకి వచ్చాక ఇద్దరూ హోటల్ సిమ్హశైలకు వెళ్లి  కూర్చున్నారు.
ఆరోజు వచ్చిన నలభైమంది పాలసీలకు రెండు వాయిదాల డబ్బు ముందుగా ఎంత కట్టాలో లెక్క కట్టి రాసి చూసి షాకయిపోయాడు రాజనాల.

"ముప్పైవేల పైచిలుకు కట్టాలి!" ఆ లిస్టు రాసి ఏకాంబర్ చేతికిచ్చాడు రాజనాల.

"ఈ ముప్పైవేలు ఎవరు కడతారు?! వాళ్లను అడగాలి కదా!" కుతూహలంగా అన్నాడు ఏకాంబర్.

ఏకాంబర్ అలా అనేసరికి పకాలున నవ్వాడు రాజనాల.

"సాలరీ సేవింగ్ స్కీం పాలసీలంటే తప్పదు. ముందు రెండు వాయిదాలు ఏజెంటు కట్టుకోవాలి. మూడోనేల నుండి వారి జీతాల్లో కట్ అయి కంపెనీకి వెళ్తుంది" చెప్పాడు రాజనాల.

"అదేంటన్నా! పాలసీలు వాళ్లవి కట్టేది ఏజెంటా?" ఆశ్చర్యంగా అన్నాడు ఏకాంబర్.

"నాయనా ఏకాంబర్! నువు కొత్త ఏజెంటువి. ఇది పోటీ వ్యాపారం. వాళ్ల పాలసీల మీద నీకు కమీషన్ ఎంతొస్తుందో అందరికీ తెలుసు. మొదటి ఏడాది 35 శాతం వరకూ ఏజెంటుకి కమీషన్ కింద కంపెనీ ఇస్తుంది. ఎందుకంటావ్?! ఇలాంటివెన్నో ఖర్చులుంటాయని" అన్నాడు రాజనాల.

"ఇస్తే!?... అందరికీ కట్టడంలేదు కదా! చేతో ప్రతి ఏడాదీ కట్టుకునే వాళ్లకు కట్టడంలేదు కదా!" అన్నాడు ఏకాంబర్.

వాళ్ల దగ్గరకు ప్రతి మూడు నెలలౌ ఏజెంట్ వెళ్లి వాయిదాలు వసూలు చూసి ఆఫీసులు కట్టాలి. ఇలా పాలసీ కాలం పాతికేళ్లయినా ఏజెంటు సర్వీసు ఇవ్వాలి. అందువల్ల వాళ్లకు ఏ ఏజెంటు రాయితీ ఇవ్వడు. ఇక్కడ అలా కాదు. ఒక్కసారి పాలసీ కట్టించి సాలరీ రికవరీ పెడితే పాలసీ కాలం మొత్తం రికవరీ అవుతూ నీ ప్రమేయం లేకుండానే పాలసీ ప్రీమియం కంపెనీకి చేరుతుంది. నీకు మాత్రం కమీషన్ ఏ శ్రమా లేకుండా అందుతుంది. పాపం! పాలసీలు కట్టేవాళ్లెప్పుడూ ఈ రాయితీలు కోరలేదు. పాలసీల వెదుకులాటలో ఏజెంట్లే పోటీపడి ముందు మీరు కట్టాల్సిని రెండు వాయిదాలను మేమే కడతామని ఈ ఆచారాన్ని దేశమంతా ప్రచారం చేశారు. ఇప్పుడు ఏజెంట్లంతా ముందు రెండు వాయిదాలు కట్టాలని బలంగా నమ్ముతున్నారు. తప్పదు. ఇంత పెద్ద వ్యాపారం నువ్వు కూడా వదులుకోలేవు కదా!" విడమర్చి చెప్పాడు రాజనాల.

"నిజమేరా! కానీ, నా దగ్గర ఇంత డబ్బు వుండాలి కదా! ఏంచేద్దాం!!" దిగాలుగా అన్నాడు ఏకాంబర్.

"మీ నాన్ననే అడుగుదాం!" ఏకాంబర్ కళ్లల్లోకి చూస్తూ అన్నాడు రాజనాల.

"అమ్మో! ఇప్పుడు వద్దు. పైపెచ్చు తిడతాడు. గొడ్డు ఆవుకు గడ్డి మేతే దండగంటూ సామెతలు సంధిస్తాడు" భయంగా అన్నాడు ఏకాంబర్.
"చూద్దాంలే! నువ్వు నీ ప్రయత్నం వదలకు. ముందు పాలసీలు సేకరించు. మిగతా విషయం నేను చూసుకుంటాను" అంటూ ఏకాంబరానికి ధైర్యం చెప్పి, ఆరోజు సేకరించిన పాలసీలన్నింటినీ పట్టుకుపోయాడు రాజనాల.

ఆ వారంలోనే తన దగ్గరున్న పాలసీలన్నింటికీ డబ్బు కట్టేసి రశీదులు తెచ్చి ఏకాంబర్ చేతిలో పెట్టాడు రాజనాల.

ము;;ఐవేల రూపాయలు తనే కట్టి రశీదులు ఇస్తున్న రాజనాలకేసి చూస్తూ "ఇంత డబ్బు నువ్వే కట్టావా?" ఆనందాశ్చర్యాలతో అన్నాడు ఏకాంబర్.

"బ్రాంచి మేనేజరుగారూ, నేనూ కలసి మాట్లాడుకుని కట్టాం. ఆలస్యం చేస్తే మూడో నెల రికవర్కీ రాకపోతే మీ మిత్రులు ఇవే పాలసీలు వేరొకరికి కట్టేసినా కట్టేస్తారు. ఆలస్యం అమృతం కూడా విషమే అవుతుంది" అన్నాడు రాజనాల.

"ఇంత డబ్బు ఇప్పటికిప్పుడు నాజెలా వస్తుంది?" సంశయంగా అన్నాడు ఏకాంబర్.

"నీకొచ్చే కమీషన్ లో తీసుకుందామని చెప్పారు మేనేజర్ గారు. అందుకే నా జీతం అందగానే నీ పాలసీలకి డబ్బు సర్దేశాను. ఈ పాలసీల మీద ఎలాగూ పదిహేను రోజుల్లో పదివేల వరకూ కమీషన్ వస్తుంది. మిగతాది కమీషన్ వచ్చినప్పుడల్లా తీసుకుంటాను" అన్నాడు రాజనాల.
"చాలా థాంక్సన్నా! నేనైతే ఇంత సాహసం చెయ్యలేను. ఇంత డబ్బు పెట్టలేను" అంటూ ఆనందంగా రాజనాలని ఆలింగనం చేసుకున్నాడు ఏకాంబర్.

అదే వారాంతంలో మరో నలభై పాలసీలను సేకరించాడు ఏకాంబర్. దేవస్థానం ఉద్యోగులు ఎక్కడెక్కడ పని చేస్తున్నారో అక్కడకు వెళ్లి వాళ్లను కలసి కట్టించాడు.

స్వామివారి పూలతోటలో పదిమంది మాలీలు పని చేస్తున్నారని తెలిసి ఉదయం ఆరో గంటకు అక్కడకు వెళ్లి వాళ్లను కలిశాడు. అలాగే విజయనగరంలో సిమ్హాచలం దేవస్థానానికి చెందిన విద్యార్థి భోజన సత్రంలో పదిహేనుమంది ఉద్యోగులున్నారని తెలిసి ఆ వూరికి వెళ్లి మరీ పదిహేనుమందిని కలిశాడు ఏకాంబర్.

ఇప్పుడు రాజానల్ సహాయం లేకుండానే తనొక్కడే పాలసీదారులను కలసి బొధపర్చగలుగుతున్నాడు ఏకాంబర్.

ఇన్స్యూరెన్స్ పాలసీ చేయించగల ధైర్యాన్నీ, తెలివినీ, మాటకారితనాన్నీ అలవర్చుకున్నాడు. ఇన్స్యూరెన్స్ పాలసీ వద్దన్నవాళ్లను కూడా వదలకుండా నాలుగైదుసార్లు కలసి తనదారికి తెచ్చుకోగలుగుతున్నాడు.

కొత్తగా ఏకాంబర్ సాధించిన నలభై పాలసీలు చూస్తూనే రాజనాలకి ఆనందం కలిగింది. కానీ, అంతలోనే ఆందోళన కలిగింది. ముందు కట్టిన ముప్పైవేలలో పదివేలు కమీషన్ రూపంలో వచ్చేసింది. మిగతా ఇరవై వేలు రావాలంటే ఇంకా మూడు నాలుగు నెలలు పడుతుందేమో! మళ్లీ నలభై పాలసీలకు మరో ముప్పై నలభైవేలు సర్దడం తనవల్ల కాదు. బ్రాంచి మేనేజర్ ని కలసినా మాట సహాయం చేస్తాడు గానీ, మూట సహాయం చేయడు. ఏకాంబర్ బాగా ఇన్స్యూరెన్స్ వ్యాపారం చేస్తే, తనకు లాభంగానీ మేనేజర్ కి ఏం లాభం? బ్రాంచికి పేరొస్తుంది, మేనేజర్ కి ప్రశంసలు లభిస్తాయి. కానీ, పైసలు రావు. తనకైతే ఏకాంబర్ లా తనకింద పనిచేసిన ఏజెంట్లు అందరి బిజినెస్ మీద ఏడాదికి ఓసారి ఇన్సెంటివ్ అందుతుంది. అదీ లక్షల్లో. ప్రమోషన్ వస్తుంది. అంతేకాదు. ఇంకా ఎన్నో లాభాలున్నాయి.

అయినా, తనిప్పుడు ఈ లనభై పాలసీలకు అంత డబ్బు ఎలా తేగలడు? తను కూడా ఈ ఉద్యోగానికి కొత్తే కదా! ఏకాంబర్ కి కూడా అంత డబ్బు కట్టే స్థొమత లేదు.

'ఏం చేయాలి? ఏం చేస్తే ఈ పాలసీలకు అవసరమైన డబ్బు దొరుకుతుంది ' అని పరిపరి విధాల ఆలోచిస్తూ రెండు రోజులు గడిపేశాడు రాజనాల.

ఏకాంబర్ ఇవేమీ పట్టించుకోవడంలేదు. తన మానాన తను రోజూ ఉదయాన్నే వూరిమీద పడి పాలసీలను సేకరించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. వాటిని తీసుకువచ్చి రాజనాల చేతిలో పెడుతున్నాడు. వాటిని నింపడం, రశీదులు రాయడం అంతా రాజనాల చూసుకుంటున్నాడు.

పాలసీలకి, పాలసీదారులకు సర్వీసు అంటే చేయగలడు గానీ, ఆర్థిక సహాయమంటే మాటలా? అదీ పదేపదే మదుపు పెట్టడానికి వుండొద్దా?
ఆరోజు...

బ్రాంచి మేనేజర్ ని తీసుకుని ఏకాంబర్ ఇంటికి కారులో వచ్చాడు రాజనాల. కొత్త కారు. తళతళలాడిపోతోంది. బ్రాంచి మేనేజర్ కి ఇన్స్యూరెన్స్ కంపెనీ ఇచ్చిన కారది.

ఆ వీధిలోకి పడవలాంటి పెద్ద కారు వచ్చేసరికి వీధిలో తిరుగుతున్న పిల్లలంతా ఆ కారు వెంట పరిగెడుతూ వచ్చారు.

పీతాంబరం వీధి అరుగుమీద కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. ఏకాంబర్ ఇంటికి బ్రాంచి మేనేజర్ తో సహా వస్తున్నట్టు రాజనాల ముందుగానే ఫోన్ చేసి ఏకాంబరానికి చెప్పాడు.

ఏకాంబర్ రెడీ అయి ఇంట్లో తల్లితో మాట్లాడుతూ వంటగదిలోనే తచ్చాడుతున్నాడు. పర్వతాలు ఆశ్చర్యపోయింది. రోజూ ఈపాటికి వూరి మీదకు వెళ్లిపోయే చిన్నకొడుకు ఇంట్లోనే వున్నాడేమిటా అనుకుంది గానీ, ఏకాంబరాన్ని అడగలేదు. తన వెనకే తోకలా తిరుగుతూ టిఫిన్ అయిందా అంటూ ఆ కబురు, ఈ కబురు చెప్తున్న కొడుకుతో ముచ్చటిస్తూ పని చేసుకుంటోంది పర్వతాలు.

పడవలాంటి ఖరీదైన కారు వచ్చి ఇంటిముందు ఆగేసరికి పీతాంబరం గాబరా పడిపోయాడు. గబాలున కుర్చీలో నుండి లేచి గేటు దగ్గరకు పరుగందుకున్నాడు. అప్పటికే కారు డోర్ తీసుకుని రాజనాల దిగాడు. తనే కారు డ్రైవ్ చేస్తూ వచ్చిన ఇన్స్యూరెన్స్ బ్రాంచి మేనేజర్ ఓ పక్కగా కారుని పార్క్ చేసి నెమ్మదిగా కారు దిగి రాజనాల దగ్గరకు వచ్చాడు.

గేటు దగ్గర ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డ పీతాంబరం కారు దిగి వస్తోన్న రాజనాలని చూస్తూనే హాయిగా వూపిరి పీల్చుకున్నాడు.

అంతవరకూ ఆందోళనగా ఎవరై వుంటారన్న ఆత్రుతతో పరిగెత్తుకు వచ్చి గేటు దగ్గర నిలబడ్డ పీతాంబరం తేరుకుని నవ్వుతూ రాజనాలని పలకరించాడు.

"రా అమ్మా రా! మీ మిత్రుడి కోసమేనా వచ్చారు?" అని అడిగాడు.

"లేదంకుల్! మీతో మాట్లాడాలనే నేనూ, మా బ్రాంచి మేనేజర్ గారూ వచ్చాము" నర్మగర్భంగా అన్నాడు రాజనాల.

"నాతోనా?... మొన్నే కదా... ఏకాంబరానికి అవసరమంటే మొదటి పాలసీ కట్టాను..." సంశయంగా వారికి లోపలకు తీసుకువెళుతూ అన్నాడు పీతాంబరం.

వంటగదిలో తల్లితో సంభాషిస్తున్న ఏకాంబర్ వాళ్లను చూస్తూనే ఉత్సాహంగా ఎదురుగా వచ్చి పలకరించాడు.

"నమస్తే సార్!... రండి! రండి!" అంటూ హాల్లో వున్న సోఫాల్లో కూర్చోబెట్టాడు. వాళ్లిద్దరికీ ఎదురుగా పీతాంబరం కూర్చున్నాడు.
ఏకాంబర్ తల్లి దగ్గరకు వెళ్లి తమ ఇన్స్యూరెన్స్ బ్రాంచి మేనేజర్ గారొచ్చారని ఆనందంగా చెప్పాడు. ఆయనతోపాటు తన మిత్రుడు రాజనాల కూడా వచ్చాడనీ, ఇద్దరికీ కాఫీ పెట్టమనీ పురమాయించి తిరిగి హాల్లోకొచ్చేశాడు.

ముగ్గురూ మౌనంగా కూర్చున్నారు. ఏకాంబర్ నేరుగా వచ్చి తండ్రి పక్కనే కూర్చున్నాడు.

"మీరు ఏదో షాపు నడుపుతున్నారుట కదా సార్?" మేనేజర్ గారే పీతాంబరాన్ని కదిపారు.

"అవునండీ! డిపార్ట్ మెంటల్ స్టోర్స్!" ముక్తసరిగా చెప్పాడు.

"బాగానే సాగుతోందంటారా?!" మళ్లీ మేనేజరే అడిగాడు.

"ఏం బాగు సార్! ఎక్కడ చూసినా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, బిగ్ బజార్ లు పోటాపోటీగా వచ్చేస్తున్నాయి. ఇక మాలాంటి చిన్న చిన్న డిపార్త్ మెంటల్ స్టోర్స్ కి వ్యాపారం ఎలా సాగుతుంది చెప్పండి! ఏదో అలా నడుస్తోంది. షాపు అద్దె, వర్కర్ల జీతాలు ఇవ్వడమే కష్టంగా వుంది. ఇక పెట్టిన పెట్టుబడికి వడ్డీ లెక్కేస్తే నష్టమే!" నిర్లిప్తంగా అన్నాడు పీతాంబరం.

'వీళ్లు ఎందుకొచ్చారో అర్థం కావడం లేదు. వచ్చినవాళ్లు తనతో మాట్లాడకుండా తండ్రితో అనవసర ప్రసంగం చేస్తున్నారెందుకో!' మనసులోనే అనుకున్నాడు ఏకాంబర్.

ఏకాంబర్ ఆలోచిస్తూ కూర్చున్నాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
23rd episode