Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
24th episode

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ

జరిగినకథ: వరేణ్య, త్రివిక్రం ను లోపలికి రమ్మని ఆహ్వానిస్తుంది. లోపలికెళ్ళగానే ఒక ఫోటో చూసి ఆశ్ఛర్యానికి లోనవుతాడు. అంతేకాక వరేణ్య బామ్మతో త్రివిక్రం మాటామంతీ నడుపుతాడు.అతడ్ని చూస్తూచిన్నగా నవ్వాడు త్రివిక్రమ్‌.''చదువు వేరు, జీవితం వేరు. నువ్వు చదువు మాత్రం నేర్చుకున్నావ్‌. కానీ జీవితంలో నేర్చుకోవాల్సింది చాలా ఉంది బ్రదర్‌. ఎనీహౌ... నేన్నీకు చేసింది మోసమే... ద్రోహమే... ఒప్పుకుంటున్నాను.

కాని నేను మోసగాడ్ని కాను. నాకు తెలీకుండానే అలా జరిగిపోయింది.

జరిగింది వింటే నా తప్పులేదని నువ్వే ఒప్పుకుంటావ్‌...........'' అన్నాడు.'

'చచ్చినా ఒప్పుకోను. ఇప్పుడు నేను పోలీసులకు ఫోన్‌చేస్తే నిన్ను అరెస్ట్‌ చేసి జైల్లో పడేస్తారు తెలుసా?''

''నాకు జైలు కొత్తకాదు, ఎందుకంటే నేను వచ్చిందే అక్కడ్నుంచి, మర్చిపోయావా? నేను జైలు డ్రెస్‌లో వుండగానే మనం మొదట కలుసుకున్నాం.''

''జైలు కెందుకెళ్ళావ్‌...............? చాలామందిని ఇలాగే మోసం చేసావా?''

''లేదు. బ్యాంకు లూటీచేసాను.''

''మైగాడ్‌......... బ్యాంకు.............నువ్వు బ్యాంకు దోపిటీ చేసావా?''

'జస్ట్‌ సెవెన్‌లాక్స్‌''

వినోద్‌కి నోట మాట రాలేదు.

సిగరెట్‌ ఆఖరిదమ్ము లాగి ఆ పెట్టెలో పడేస్తూ పొలైట్‌గా నవ్వాడు త్రివిక్రమ్‌.

భారంగా విట్టూర్చాడు.

''వినోద్‌...............నీలా పెద్ద చదువులు నేను చదవలేదు. అత్తెసరు మార్కులతో ఇంటర్‌ పాసయ్యాను. అక్కడితో చదువుకు పుల్‌స్టాప్‌ పెట్టేసిన లైఫ్‌ నాది. మా డాడీ చాలా మంచివారు.

తమ్ముడి ఇంజనీర్‌ గాను, నన్ను డాక్టర్‌గానూ చూడాలని ఆశ పడ్డాడు. ఒక మనిషి బాగా చదువుకుంటేనే గొప్పవాడు కాగలడని ఆయన నమ్మకం.

చదువు, సంస్కారాన్ని వృత్తిలో నిఫుణతను మాత్రమే నేర్పగలదు. జీవితంలో గొప్పవాడు కావటానికి తెలివితేటలు ముఖ్యం.......'' అంటూ ఆ తార్వాత ఏం జరిగిందో అంతా వినోద్‌కి వివరించాడు త్రివిక్రమ్‌.

''నాకు క్రికెట్‌ పిచ్చి. ఎంత పిచ్చి అంటే జీవితంలో ఒక్కసారైనా స్టేడియంలో గేలరీలో కూర్చుని అభిమాన క్రికెటర్‌ హీరోల ఆటను చూస్తూ ఎంజాయ్‌ చేయాలని ఆశ అందుకే జైల్లోంచి బయటబడ్డాను. బహుశ మనిద్దరి మధ్యా విచిత్ర అనుబంధం ఏదో వుందిగాబట్టే రైలెక్కడానికి ముందే మనం మూడుసార్లు ఎదురుపడ్డాం అనుకంటాను.

నువ్వు ఫోన్‌చేసిన బూత్‌ పక్కనే నేను ఒదిగి కూర్చున్నాను. నా కాలు తొక్కిమరీ బూత్‌లోకెళ్ళావ్‌ అయినా నన్ను చూళ్ళేదు నువ్వు రైలు రాగానే పరుగెడుతూ పర్సు పడేసుకున్నావ్‌. ఆ పర్సు తీసుకుని నీ వెనకే ఎ.సి. కంపార్ట్‌మెంట్‌ వద్దకొచ్చాను. ఎందుకంటే నీ పర్సు నీకివ్వటంకోసం.

కాని అక్కడా చుక్కెదురయింది. మళ్ళీ పర్సుకోసం రైలుదిగుతూ నన్ను గుద్దుకున్నావు. పైగా ఫూల్‌, ఇడియట్‌ అంటూ తిట్టావు. అందుకే నాకు మండింది. కాస్సేపు నిన్ను ఏడ్పించి, నీ పర్సు నీకిద్దామనుకున్నాను. కాని నీ దురదృష్టం, నా అదృష్టం. నువ్వు రైలెక్కలేకపోయావు. నేను ఎ సి కంపార్ట్‌మెంట్‌లో వుండిపోయాను. నువ్వే ఆలోచించు చేతిలో పైసా లేనివాడ్ని ఎ.సి. కోచ్‌లోకి ఎందుకు వెళతాను? కాని నీమూలంగా నేను వెళ్ళి ఇరుక్కుపోయాను, కాబట్టి నీ పర్సు, సూట్‌కేస్‌ తాత్కాలికంగా సొంతం చేసుకొనక తప్పలేదు'' అంటూ ఏం జరిగిందో వివరణ ఇచ్చాడు.

అయినా వినోద్‌ కోపం తగ్గలేదు.

''పర్సు, సూట్‌కేస్‌ పోతేపోయాయి. అవి తీసుకుని అటే వెళ్ళిపోవచ్చుగా మళ్ళీ ఇక్కడ బ్రాంచి ఆఫీసులోకి ఎందుకొచ్చావు? నాలా ఎందుకు నటిస్తున్నావ్‌........బాస్‌ కూతురి కోసమేనా?'' అనరిచాడు.

''నీ బాసు, ఆయన కూతురు నాకు తెలీదు, ఇది కూడా నేను కావాలని చేసిందికాదు. జరిగిందేమంటే, నీకు స్వాగతం చెప్పటానికి మేనేజరు మధుసూదనరావు స్టాఫ్‌తో ప్లాట్‌పారంమీద వున్నాడు ఆ సంగతి వేలాడుతున్న సన్‌ఆటోమొబైల్స్‌ లోగోచూసి నువ్వే నేననుకుని నన్ను పట్టేసారు. తప్పించుకోవటం సాధ్యంకాలేదు. బుక్కయిపోయాను.

''అబద్దాలు చెప్పకు, మనసులో ఏమీలేకుండానే సుధాకర్‌నాయుడు గారి కూతురితో అంత క్లోజ్‌గా వుంటావా?''

''అర్ధం లేకుండా మాట్లాడకు, సుధాకర్‌నాయుడెవరు, ఆయన కూతురు ఎవరు? వాళ్ళని నేను చూడ్డం ఏమిటి? అసలు నీబాధ ఏమిటో చెప్పు నీ ఉద్యోగం నీకే వుంటుంది. నేను వెళ్ళిపోతాను. నీకేమిటి బాధ?''

''వరేణ్యను నువ్వు తీసుకుపోతే, బాధగాక ఇంకేముంటుంది నాకు?'

''ఓమైగాడ్‌! తిక్కతిక్కగా మాట్లాడి విసిగించకు. వరేణ్యను నేను తీసుకుపోవటం ఏమిటి?''

వినోద్‌ ఆశ్చర్యంగా చూసాడు.

త్రివిక్రమ్‌ కావాలని నాటకం ఆడుతున్నాడో లేక నిజంగానే కొన్ని విషయాలు అతడికి తెలీదో అర్దంకాలేదు.

''నాకు కాఫీ కావాలి'' అడిగాడు

''టిఫిన్‌ చేశావా?''

''ఈపూట టిఫిన్‌చేస్తే, మధ్యాహ్నం భోజనానకి లాటరీ, తెచ్చుకున్న డబ్బు అయిపోయింది. లాడ్జికి డబ్బు కట్టాలి కనీసం నా క్రెడిట్‌ కార్డయినా వుంచావా, వాడేసావా?''

''నీకార్డు భద్రంగా వుంది ఇచ్చేస్తాను. అన్నట్లు నాపేరు త్రివిక్రమ్‌. చెప్పానా?''

''ఇప్పుడు చెప్పావ్‌లే.''

త్రివిక్రమ్‌ తలుపు తీసుకుని వెళ్ళి పనిపిల్లతో రెండు ప్లేట్లు టిఫిను ప్లాస్కులో కాఫీ అంతా ట్రేలో పెట్టించుకొని వచ్చాడు. ఆ అమ్మాయి టీపాయ్‌మీద అన్నీ సర్ది వెళ్ళిపోయింది. తలుపుమూసి బోల్ట్‌ వేసేసాడు. త్రివిక్రమ్‌.

''నిజానికి ఇప్పుడు నేను అనుభవిస్తున్న సౌకర్యాలన్నీ నీవి. అంచేత నువ్వు నన్ను క్షమించినా, క్షమించకపోయినా నేను మాత్రం నీకు థాంక్స్‌ చెప్పాలి బ్రదర్‌. టిఫిన్‌ తీసుకో'' అన్నాడు తిరిగి కూర్చుంటూ.

మోహమాటం లేకుండా తినటం ఆరభించాడు వినోద్‌. త్రివిక్రమ్‌మాటలు, ప్రవర్తన చూసాక అతడిమీద తనకున్న కోపం క్రమంగా తరిగిపోనారంభించింది.

తింటూనే చెప్పుకొచ్చాడు వినోద్‌.

''ఫారెన్‌లో చదువుకుని వచ్చిన నాకు సన్‌ ఆటోమొబైల్స్‌లో ఉద్యోగం దొరికింది. బాస్‌ సుధాకర్‌నాయుడుగారు నామీద బాగా ఇంప్రెస్‌ అయ్యారు. ఎంతగా అంటే, తన కూతురుగనక ఇష్టపడితే నన్ను తన అల్లుడ్ని చేసుకుంటానన్నారాయన. కోట్ల ఆస్థి, ఒక్కతే కూతురు, నేను అదృష్టవంతున్నీకదా?''

''ష్యూర్‌........ గొప్ప అదృష్ట జాతకుడివి.''

''నేను విశాఖబ్రాంచికి వచ్చింది కంపెనీ పనులతోబాటు ఆయన కూతుర్ని లైన్లో పెట్టుకోడానికి, ఎందుకంటే, అమ్మాయి ఇష్టపడితేనే అంటూఆయన చిన్నమెలిక పెట్టారుగదా.''

''బాగుంది. మరి అమ్మాయిని కలిసావా?''

''నా స్థానంలో నువ్వు కూర్చున్నావ్‌. ఇంకెలా నేను కలిసేది.''

''ఓ........... సరిసరి. ఇంతకి అమ్మాయి ఎక్కడ వుంటుంది.''

''షిట్‌..............బాస్‌ కూతురు ఎవరో నిజంగా నీకు తెలీదా?''

''తెలిస్తే ఎందుకడుతాను?''

''వరేణ్య ఎవరనుకుంటున్నావ్‌?''

''వరేణ్య.............. ఆమె కూడా కంపెనీలో ఎంప్లాయ్‌....... సేల్స్‌ ఎగ్జిక్యూటీవ్‌.''

''అంతేకాదు, సుధాకర్‌నాయుడు గారి ఏకైక కూతురు ఆమె. నూరుకోట్ల ఆస్థికి ఏకైక వారసురాలు.''

''బాప్‌రే!''

శిలావిగ్రహంలా సోఫాకు జేరపడి కాస్సేపు అలాగే ఉండిపోయాడు త్రివిక్రమ్‌. నమ్మలేకపోయాడు. అస్సలు నమ్మలేకపోతున్నాడు. వరేణ్య బాస్‌ కూతురన్న నిజం అతడ్ని షాక్‌కి గురిచేసిందంటే ఆశ్చర్యంలేదు. కనీసం వరేణ్య కూడా తనతో చెప్పలేదు.

ఆ పట్టాభి యజమాని తర్వాత యజమాని స్థానంలో వుండి కూడా తనకి న్యాయం చేయలేదన్నప్పుడు కూడా తనకి తట్టలేదు. తనోఫూల్‌. నిజంగానే ఫూల్‌.

''నమ్మలేకపోతున్నావా?'' నవ్వుతూ అడిగాడు వినోద్‌.''

''అవును తన బామ్మ జయమ్మతో పాతకాలం పెంకుటింట్లో వుంటోంది. ఆ అమ్మాయి బాస్‌కూతురా? ఆశ్చర్యంగా వుంది'' అన్నాడు. ఆటాచ్‌మెంట్‌ ఎక్కువ. అందుకే బామ్మకు తోడుగా ఇక్కడుంటూ, విశాఖబ్రాంచి చూసుకుంటోంది వరేణ్య'' చెప్పాడు వినోద్‌.

నమ్మక తప్పలేదు త్రివిక్రమ్‌.

కాని తల్లిదండ్రులతో దిగిన ఫోటోచూసి అడిగినప్పుడయినా తనతో నిజం చెప్పాలి కాని చెప్పలేదు. సుధాకర్‌నాయుడు తన తండ్రికి క్లోజ్‌ఫ్రెండ్‌ అని మాత్రమే చెప్పింది. తనంటే వినోద్‌లా నిటిస్తున్నాడు గాబట్టి అబద్దాలు చెప్పాడు. కాని ఆమె తనతో ఎందుకు అబద్దాలు చెప్పింది, ఆ అవసరం ఏమొచ్చింది.

'ఏమిటింకా ఆలోచిస్తున్నావు?'' టిఫిన్‌ ముగించి చేయి కడుక్కునివచ్చి కూర్చుంటూ అడిగాడు వినోద్‌.

టిఫిన్‌ మధ్యలోనే ఆపేసి చేయి కడుక్కుని, ప్లేట్లు పక్కన పెట్టేసాడు త్రివిక్రమ్‌ రెండు కప్పుల్లో కాఫీ పోసాడు.

''వరేణ్య నాతో అబద్దం చెప్పింది. మాటవరసక్కూడా తను బాస్‌ కూతురని నాతో చెప్పలేదు. అదే అర్ధంగావటంలేదు'' అన్నాడు కాఫీ సిప్‌చేస్తూ.

''నేను అర్ధం చేసుకోగలను.''

''ఎలా?''

''వెరీసింపుల్‌ నాయుడుగారు నేను ఎందుకు ఇక్కడికి వస్తున్నానో ఆ అమ్మాయికి ఫోన్‌లో చెప్పివుంటారు కాని అసలు విషయం తెలీక నువ్వు ఆమెను గుర్తించలేకపోయావు. సో.. నీకు విషయం తెలిసి కూడా నాటకం ఆడుతున్నావనుకుని పొరపాటుపడి తనూ ఆ నాటకాన్ని కంటిన్యూ చేసింది. అవునూ మరీ ఆమెతో రాసుకుపూసుకు తిరుగుతున్నావు. మీ ఇద్దరిమద్య ఏమన్నా జరిగిందా? ఆమె నేను పెళ్ళిచేసుకోబో అమ్మాయి. నిజం చెప్పెయ్‌.''

''అందులో నా తప్పులేదు. తనే నాతో రాసుకుపూసుకు తిరుగుతోంది. నేనుకాదు.''

''తుఫాను రాత్రి ఎక్కడున్నారు?''

''రాజమండ్రి కంపెనీ గెస్ట్‌హౌస్‌లో.''

''ఏం జరిగింది?''

''ఏం జరగలేదు బ్రదర్‌ జస్ట్‌ కిస్‌..........అంతే. అదీ తనే ఇచ్చింది.''

''మైగాడ్‌..... చంపేస్తాను.............నిన్ను చంపేస్తాను. నేను పెళ్ళిచేసుకోబోయే అమ్మాయిని కిస్‌ చేస్తావా? దుర్మార్గుడా.......'' అంటూ ఆవేశంతో గుప్పిళ్ళు బిగించేసాడు వినోద్‌.

పకపకా నవ్వేసాడు త్రివిక్రమ్‌.

''కూల్‌డౌన్‌ బ్రదర్‌! ఆవేశపడకు, సమస్యకి పరిష్కారం ఆలోచించాలిగానీ ఆవేశం పనికిరాదు. నువ్వే నేననుకుని ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తోంది. కానీ నేను నువ్వుకాదని తెలిసాక నన్ను అసహ్యించుకుని ఖచ్చితంగా నిన్ను ఇష్టపడుతుంది. జస్ట్‌ ఫోర్‌డేస్‌ ఓపికపట్టు. క్రికెట్‌ మేచ్‌చూసి నేను జైలుకెళ్ళిపోతాను. నా అడ్రసు కూడా ఇక్కడెవరికీ తెలీదు. ఆ తర్వాత మీరిద్దరూ హేపీగా వుండండి'' అన్నాడు.

''నువ్వు వరేణ్యను ప్రేమిస్తున్నావా?'' అనుమానంగా అడిగాడు వినోద్‌.

పెదవి విరిచాడు త్రివిక్రమ్‌.

''నాకే తెలీదు. చందమామని అందరూ ఇష్టపడతారు. కాని ఆర్మ్‌స్ట్రాంగ్‌లా వెళ్ళిచందమామలో కూర్చోటం అందరికీ సాధ్యంకాదు. వరేణ్య నిన్ను చేసుకోడమే న్యాయం అంచేత ఇందులో పోటీలేదు. కోపతాపాల్లేవు. ఓ పనిచెయ్యి నువ్వు లాడ్జి ఖాళీచేసి ఇక్కడికే వచ్చెయ్యి నా బ్రదర్‌వని చెప్తాను. నేవెళ్ళిపోయాక జరిగింది చెప్పి నీ జాబ్‌లో నువ్వు చేరు'' అడిగాడు.

''లేదు లేదు నేను ప్రస్తుతానికి దూరంగానే వుంటాను. అదే మంచిది.''

''మంచిదికాదు. వరేణ్యతో పరిచయం పెరగాలంటే ఇక్కడే వుండి నాతో తిరగాలి. నాకు తెలీని సమస్యల్ని నువ్వు పరిష్కరించవచ్చు. నిన్ను నా బ్రదర్‌గా పరిచయం చేస్తాను. నేనెళ్ళిపోయేవరకు నా పేరు వినోద్‌, నీ పేరు త్రివిక్రమ్‌ ఓ.కె.

''ఓ.కె......''

''అయితే సాయంకాలం ఇక్కడికొచ్చెయ్యి. బట్‌........! ఆ పోలీస్‌ బ్రదర్స్‌కి మాత్రం ఇప్పుడే నిజం చెప్పకు.''

''నువ్వు చెప్పింది బాగానేవుంది కానీ................నువ్వు వెళ్ళిపోయాక ఇదంతా కావాలని నేనే నాటకం ఆడించానని సుధాకర్‌ నాయుడుగారు నన్ను అనుమానించే ప్రమాదం వుందికదా!'' వద్దులే బయటే వుంటానుగానీ ఆదివారం మేచ్‌ చూడగానే వెళ్ళిపోతున్నావ్‌ ఓ.కో..''

''ఓ.కె.''

''అయితే నా క్రెడిట్‌ కార్డుఇచ్చెయ్‌.''

''బట్టలు మాత్రం అడక్కు. కార్డు ఇచ్చేస్తాను.''

క్రెడిట్‌ కార్డు ఇచ్చేసాడు త్రివిక్రమ్‌.

తనూ ఆఫీసుకు రెడీ అయ్యాడు.

బయటకు బయలుదేరుతూ తలుపు తెరిచాడు.

అదే సమయంలో చరచరా ఆ గదివైపు వచ్చేస్తూ కన్పించింది వరేణ్య.

ఈ సమయంలో వరేణ్య వస్తుందని అసలు వూహించలేదు త్రివిక్రమ్‌. డైరెక్ట్‌గా ఆఫీస్‌కు వస్తుందనుకున్నాడు. కానీ ఆమె యిక్కడికే వచ్చేసింది.

లైట్‌ గ్రీన్‌కలర్‌ శారీ బ్లౌజ్‌లో వనకన్యలా మెరిసిపోతోందామె. వరేణ్యనుచూసి రెప్పవేయటం మర్చిపోయాడు వినోద్‌.

ఆమె ఎవరో ఇప్పుడు తనకు తెలిసిపోయింది. అయినా తెలీనట్టే డ్రామాని కంటిన్యూ చేయదల్చుకున్నాడు త్రివిక్రమ్‌. ఎందుకంటే తను ఎలాగూ నాలుగురోజుల్లో వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆమె తనను ఎంతగా అసహ్యించుకున్నా బాధలేదు.

'గుడ్‌ మార్నింగ్‌ వరేణ్యా!'' అంటూ విష్‌ చేసాడు.

''వెరీ బేడ్‌మార్నింగ్‌! నేనేం చెప్పాను, నువ్వేం చేసావ్‌? నీకోసం వెయిట్‌ చేస్తుంటాను. ఎనిమిది గంటలకి మా ఇంటికొచ్చి పికప్‌చేసుకోమని చెప్పానా లేదా? ఇంకా ఇక్కడేం చేస్తున్నావ్‌?'' వస్తూనే ఫైర్‌బ్రాండ్‌లా దబాయించింది వరేణ్య.

అప్పటిగ్గాని రాత్రి వరేణ్య చెప్పిన మాటలు గుర్తురాలేదు త్రివిక్రమ్‌కి.

వినోద్‌ రావటంతో ప్రోగ్రామంతా ఆప్‌సెట్‌ అయింది.

''ఓ...........సారీ మేడం................అయాం సారీ. లేటయింది'' అన్నాడు నొచ్చుకుంటూ.''ఓ.కె. ఇతనెవరు? గుడ్ల గూబలా అలా చూస్తాడు. ఇతనికి రెప్పలు మూయటం రాదా? కళ్ళు పత్తికాయల్లా అలా విచ్చుకొనే వుంటాయా?'' వినోద్‌ని చూస్తూ కామెంట్‌ చేసింది.

''అయ్యో!'' అంటూ తల పట్టుకున్నాడుత్రివిక్రమ్‌.

ఆమె మాటలకు ఉలిక్కిపడి

కంగారుపడుతూ ముఖం దించుకున్నాడు వినోద్‌.

''మరీ గుడ్లగూబ అంటూ ఇతన్ని అలా తీసిపడేయటం బాగుండదు వరేణ్యా! హీ ఈజ్‌ మై ఫ్రెండ్‌ త్రివిక్రమ్‌.

''మీ ఫ్రెండు అమ్మాయిల్ని ఎప్పుడూ చూళ్ళేదా....? మరీ అసహ్యంగా చూడొద్దని చెప్పు.''

''ఓమైగాడ్‌!'' అంటూ తల పట్టుకున్నాడు త్రివిక్రమ్‌.

పాపం వినోద్‌!

అతడికి ఏడుపు ఒక్కటే తక్కువ.

ఫస్ట్‌ ఇంప్రెషన్‌ బేడ్‌ అయి కూర్చుంది.

అందుకే మరింత కంగారుపడ్డాడు.

''అవునా..........ఇక్కడ నీకో ఫ్రెండ్‌ వున్నాడని చెప్పలేదు. ఎవరితను?'' మరోసారి వినోద్‌ని ఎగాదిగా చూస్తూ అడిగింది.

''ఇతను ఇక్కడివాడుకాదు, హైద్రాబాద్‌ ఫ్రెండు. ఇంకా చెప్పాలంటే డెట్రాయిట్‌ ఫ్రెండ్‌. నాతో  కలిసి అక్కడ ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ చేసాడు.''

''ఓహో! అయితే ఇతను కూడా ఆటోమొబైల్‌ ఇంజనీరన్నమాట. కానీ చూడ్డానికి అదేమిటి? ఒట్టి కంగారుజంతువులా వున్నాడు.''

''అయ్యబాబోయ్‌! వరేణ్యా..................ప్లీజ్‌.........ప్లీజ్‌! అతను నా అతిధి. అతిధిని అగౌరవించటం బాగుండదుగదా. నీ కామెంట్లతో పాపం వీడ్ని బెదరగొట్టకు.''

''సర్లే ఉద్యోగం కోసం వచ్చాడా.............? బాస్‌ హైదరాబాద్‌లో వుంటారు. ఆయన్ని కలవమను. పేరేమిటన్నావ్‌?''

''నేనేమీ అనలేదు. వీడిపేరు త్రివిక్రమ్‌.''

''నైస్‌నేమ్‌! సాహసం పేరులోనేకాదు, మనిషిలోనూ వుండాలి. నీలా....... టైమవుతోంది కమాన్‌.''

''వినోద్‌! నేవెళతాను'' అన్నాడు ముఖం ముడుచుకుంటూ వినోద్‌.

''అదేమిటి........కార్లో డ్రాప్‌చేస్తాను ఆగు బ్రదర్‌...'' అడిగాడు త్రివిక్రమ్‌.

''వద్దులే ఆటోలో వెళ్ళిపోతాను'' అంటూ ఇంకా అక్కడుంటే తన గురించి ఆమె ఇంకా ఏమేమి కామెంట్లు విసురుతుందోనన్న భయంతో వడి వడిగా వీధిలోకి వెళ్ళిపోయాడు వినోద్‌.

త్రివిక్రమ్‌ కార్లో కూర్చున్నాడు.

ఆమె కారు స్టార్ట్‌ చేసింది

కారు గేటు దాటుతుండగానే

వినోద్‌ ఆటో ఎక్కి వెళ్ళిపోతూ కన్పించాడు.

''ఏమైనా నీకు మరీ నోటదురుసు ఎక్కువ. పాపం వాడ్నెందుకలా బెదరదగొట్టేసావ్‌?'' సీట్‌కి జేరబడుతూ అడిగాడు.

''లేకపోతే పానకంలో పుడకలా మనినద్దమధ్యన అతనెందుకు? ఆటోలో వెళ్ళిపోయాడుగా'' అంటూ కొంటెగా నవ్వింది వరేణ్య.

'మనిద్దరిమధ్యన ఏముందని నువ్వలా ఫీలయ్యావ్‌'' అడిగాడు.

ఓసారి చురచురా చూసింది.

ముఖం తిప్పుకుంది వరేణ్య.

 

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్