Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

వైరాగ్యాలు... - భమిడిపాటి ఫణిబాబు

dullness

మనం ఉన్న ఊర్లోనే ఉండి ఉండి మొత్తానికి ఇంకో ఊరు చూడ్డానికి వెళ్తాము. ఇంక అక్కడనుంచి మొదలు ఆహా మీఊరెంత బావుందో, ఓహో మీ ఊరెంత బావుందో అంటూ...

ఉంటే ఇలాటి చోట్లోనే ఉండాలండి, గాలెంత బావుందో, అబ్బ ఈ కూర్లేమిటండీ ఎంత తాజాగా ఉన్నాయీ, మాకూ ఉన్నాయి టంకణాల్లా ఉంటాయి. ఎంతసేపు ఉడికించినా సరే మెత్తబడే చావదూ, అబ్బ బియ్యం ఎంత తెల్లగా ఉన్నాయో చూస్తూంటేనే కడుపు నిండిపోతోంది... ఇలా కనిపించిన ప్రతీ దాన్నీ పొగిడేయడం తోటే సరిపోతుంది. ఎప్పుడూ జరిగేదిదేగా, " పొరుగింటి పుల్లకూర...".

అసలు రిటైరయిపోయిన తరువాత ఇక్కడకే వచ్చేస్తాను, ఓ ఇల్లోటి చూపించండి, చవకలో వచ్చేస్తే కొనేద్దాం, ప్రతీ రోజూ కలుస్తూండొచ్చు, మనకీ కాలక్షేపం అవుతుందీ..etc...etc... ఇంక ఆ చెప్పే కబుర్లకి అంతుండదు.  ఇంటాయనా, ఆ గృహస్థూ చెప్పుకునే కబుర్లు విని, ఇంటావిడకి గుండె లో దడ పుట్టుకొచ్చేస్తుంది. ఈ వెర్రిమనిషికి అసలు లౌక్యం తెలియదు, నిజంగా కాపరం పెట్టించినా పెట్టించేస్తాడు కూడానూ, ఈయనో తిక్కశంకరయ్యా ఈ పల్లెటూరులో ఎలా గడపాలో ఏమిటో గోల, ఏదో ముందర బాగానే ఉంటుంది కానీ, కాలం గడిచేటప్పటికి తెలుస్తుంది, ఇక్కడుండే కష్టాలు. అని ఆవిడ టెన్షన్ పడిపోతూంటుంది. అయినా చూద్దాం లే, ఇంకా మూడేళ్ళుందీయనకి సర్వీసు, అప్పటి మాట కదా, అని ఆవిడకూడా కొద్దిగా తేరుకుంటుంది.

ఇలాటి భావాలు, నగరాల్లో ఉండి ఉండి అక్కడి వాతావరణం పడలేక, ఏ చుట్టాలింటికో, ఫ్రెండింటికో వెళ్ళినప్పుడు చెప్పే కబుర్లే ఇవి. నిజంగా వెళ్ళాల్సివచ్చినప్పుడు తెలుస్తుంది అసలు విషయమంతా. పిల్లలుండేదా వీళ్ళుండే ఊళ్ళో, పిల్లల్నీ, మనవళ్ళనీ, మనవరాళ్ళనీ వదిలేసి, అంతంత దూరాలెళ్ళకపోతే వచ్చే నష్టం ఏమిటిటా ఇప్పుడూ, ఏదో మనకి కాలూ చెయ్యీ ఆడుతోంది కాబట్టి మాట్లాడుతున్నారు, రేపు ఏ మంచమో పడితే తెలుస్తుంది. పిల్లల్ని చూడాలనుంటుంది, వాళ్ళకేమో టైముండదూ, మనకా అంతంత దూరాలు ప్రయాణం చేసే ఓపికా ఉండదూ, ఎందుకొచ్చిన గొడవండి బాబూ ఇప్పుడూ, హాయిగా కడుపులో నీళ్ళు కదలకుండా ఇక్కడే హాయిగా ఉండకా, అని ఇంటావిడ రంగం లోకి వస్తుంది.

నిజమే కదూ,అందుకే అంటారు భార్యని "కార్యేషు మంత్రీ.." అని.balanced గా అలోచించే శక్తి స్త్రీలకే ఇచ్చాడు ఆ భగవంతుడు. భార్య మాట విండానికి నామోషీ. just for a change ఇంకో ఊరు వెళ్ళడానికైతే బాగానే ఉంటుంది, కానీ ఉన్న ఊరు  వదులుకుని, ఏదో అభిమానం ఉంది కదా అని ఇంకో ఊరు వెళ్ళి సెటిల్ అవుదామన్న కోరికంత దౌర్భాగ్యపు పని ఇంకోటుండదు.పాతిక సంవత్సరాలు పనిచేసి, పిలిస్తే పలికే స్నేహితులున్న చోటు మంచిదా, లేక మళ్ళీ "రెడ్డొచ్చె మొదలాడ..." అంటూ, ఆ వెళ్ళిన ఊళ్ళో పరిచయాలు మళ్ళీ చేసికోడం మంచిదా? నన్నడిగితే మొదటి ఆప్షనే హాయి.

కొంతమందంటారూ, స్నేహితులతోటే లోకం అంటే ఎలాగా, మన రూట్సూ, చుట్టాలూ,పక్కాలూ ఎవరితోనూ సంబంధాలే లేకపోతే, మీ తరువాత మీ పిల్లలకెలా తెలుస్తుందీ, అందరూ ఇలాగే అనుకోడంతోనే అలా తగలడ్డాయి మన బంధుత్వాలు అంటారు. ఈ రోజుల్లో ఎవరికెవరండి బాబూ, ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరి గోల వాళ్ళదీనూ. పోనీ మనమేమైనా అర్చేవాళ్ళమా, తీర్చేవాళ్ళమా, అంటే అదీ లేదూ. మరీ అంత సంబంధ బాంధవ్యాలు తాజాగా ఉంచుకోవాలంటే, మార్గాలే లేవా? ఏడాదికో, రెండేళ్ళకో ఒకళ్ళింటికి ఇంకొకరు వెళ్ళినా నిలుస్తాయి ఈ  సంబంధాలూ, బాంధవ్యాలూనూ.

ఇదివరకటి రోజుల్లో అయితే సంగతి వేరు. కుటుంబం లో ఉన్న ప్రతీ వారూ, వీలున్నంత వరకూ ఉన్న ఊళ్ళోనే ఉద్యోగాలు చేసేవారు, పెళ్ళి సంబంధాలు కూడా దగ్గరలో ఉన్నవాటికే ప్రిఫర్ చేసేవారు. దానితో family bonding కూడా అదే లెవెల్ లో ఉండేది. ఇప్పుడు కూడా అలాగే ఉండాలంటే, పరిస్థితులు కూడా అనుకూలించాలి కదా. అయినా ఒక్క విషయం చెప్పండి- అన్న దమ్ములు, అక్క చెల్లెళ్ళూ, ఒకే ఊళ్ళోనే ఉంటూ కూడా ఎన్నెన్నిసార్లు కలుస్తున్నారమ్మా? ఓకే ఊరు మాట దేముడెరుగు, పక్క పక్కనే ఉంటూ కూడా కొట్టుకు చచ్చే కేసులు నేను చాలా విన్నాను, చూశాను కూడాను. ఊళ్ళోనే ఉన్న ఒక అత్తయ్యని, బాబయ్యని, ఓ పెదనాన్న ని ఎన్నిసార్లు కలుస్తారు? ఏదో ఏ పెళ్ళిలోనో కలియడం, ఆహా అంటే ఓహో అనుకోడం, మళ్ళీ ఇంకో అకేషన్ కి ఎదురుచూడ్డం.

ఇదివరకటి రోజుల్లో,చుట్టాలందరూ ఒకే జిల్లాలోనో, ఒకే ఫిర్కాలోనో ( sorry, ఇప్పుడు అదేదో " మండలం" అనాలి కాబోలు!) ఉండడంతో, ఇంట్లో ఏ పురుడో, చావో వచ్చినప్పుడు, చుట్టాలకందరికీ కూడా  చెప్పేవారు. ఒకే ఇంటి పేరున్న వాళ్ళు అదేదో మైల, పక్షిణీ పట్టవలసి వచ్చేది. అలాగని వాళ్ళేమీ శ్రమ అనుకునేవారు కాదు, అవతలి వారి బాధలో మనమూ పాలు పంచుకుంతున్నాము కదా అని పైగా ఆనందించేవారు.ఒక్కొక్కప్పుడు, వాళ్ళెవరో ఇంకా రాలేదని, శవాన్ని కూడా తీసికెళ్ళేవారు కాదు మరి అలాటి అనుబంధాలు ఇప్పుడు రమ్మంటే ఎక్కడ వస్తాయీ? ఏదో ఓ ఫోను చేసేయడం లేదా ఏ పేపర్లోనో వేయడం, ఫలానా తేదీని పదో రోజు  అని! ఇప్పుడన్నీ కమ్మర్షియల్ అయిపోయాయి.

ఉన్న ఊళ్ళో మనమేదో మిస్సయిపోతున్నామేమో, అని అనిపించినా

ఉన్న ఊళ్ళోనే ఉంటేనే హాయేమో అనిపిస్తూంటుంది. చూడండి, మనమేదైనా ఏ ప్రవచనానికో వెళ్ళామనుకోండి, అక్కడ విన్నంతసేపూ అనుకుంటాము, “ ఎలాగైనా సరే గురువుగారు చెప్పినట్టు, రేపణ్ణుంచీ మారిపోవాలీ...” అని. అదెంతసేపూ,  బయటకొచ్చేదాకానూ. మళ్ళీ మామూలే.. ఉద్యోగాల్లో ఉండేటప్పుడు ట్రెయినింగులకి పంపేవారు, కొత్తకొత్తవి తెలిసికున్నామూ, వెంటనే మన విభాగంలో అమలు చేసేద్దామూ అని అనుకోని ప్రభుత్వోద్యోగి ఉండడు.తీరా చూస్తే ఎవడూ మన మాట వినేవాడే ఉండడు.

ఈ అత్యోత్సాహమూ, దానితరువాత వచ్చే వైరాగ్యాలనీ అవేవో “పురిటి వైరాగ్యమూ, శ్మశాన వైరాగ్యమూ..” అంటారుట...

మరిన్ని శీర్షికలు
kakoolu