Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with  venkatesh

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - దృశ్యం

Movie Review - Drushyam

చిత్రం: దృశ్యం
తారాగణం: వెంకటేష్‌, మీనా, నదియా, రవి కాలే, నరేష్‌, కృతిక, బేబీ ఎస్తేర్‌, సప్తగిరి, చైతన్యకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు, సమీర్‌ తదితరులు
ఛాయాగ్రహణం:
సంగీతం: శరత్‌
నిర్మాణం: సురేష్‌ ప్రొడక్షన్స్‌, వైడ్‌ యాంగిల్‌ క్రియేషన్స్‌
దర్శకత్వం: శ్రీప్రియ
నిర్మాతలు: సురేష్‌బాబు, రాజ్‌కుమార్‌ సేతుపతి
విడుదల తేదీ: 11 జులై 2014

క్లుప్తంగా చెప్పాలంటే

కేబుల్‌ నెట్‌ వర్క్‌ బిజినెస్‌ చేసే రాంబాబుకి స్వతహాగా మంచి వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం కారణంగానే ఆయనకు సొంత గ్రామంలో మంచి పేరుంటుంది. అందరూ ఆయన్ని గౌరవిస్తారు. భార్య జ్యోతి (మీనా), ఇద్దరు కూతుళ్ళతో హ్యాపీగా సాగిపోతున్న రాంబాబు జీవితంలోకి కానిస్టేబుల్‌ వీరభద్రం రూపంలో ఇబ్బందులొస్తాయి. వీరభద్రంతో విభేదాలతో రాంబాబు లైఫ్‌లో అలజడి పెరుగుతుంది. తన కుమార్తె అంజు (కృతిక) కారణంగా రాంబాబు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌తో తలపడాల్సి వస్తుంది. ఈ క్రమంలో రాంబాబు కుటుంబం ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంది.? అసలు రాంబాబుకి వచ్చిన కష్టమేంటి? అనేవి తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే
నటుడిగా వెంకటేష్‌ గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ఆయన నటన ఈ సినిమాకి హైలైట్‌. రాంబాబు పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు వెంకటేష్‌. సన్నివేశానికి తగ్గట్టుగా హావభావాలు పండించడం ద్వారా ప్రేక్షకుల అటెన్షన్‌ స్క్రీన్‌ పైనుంచి తప్పుకోనివ్వలేదాయన. భావోద్వేగాలు ఆయన అద్భుతంగా పండించారు.

చాలా కాలం తర్వాత వెంకటేష్‌ సరసన నటించిన మీనా, తెరపై తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. వెంకటేస్‌ ` మీనాల మధ్య కెమిస్ట్రీ బాగా పండిరది. కృతిక ఆకట్టుకుంటుంది. వెంకటేష్‌, మీనా తర్వాత ఈ చిత్రంలో అంతగా ఆకట్టుకున్నది నదియానే. రవి కాలే సూపర్బ్‌. నరేష్‌ సహజమైన నటనతో మెప్పించాడు. సప్తగిరి కాస్సేపు నవ్వించాడు. బేబీ ఎస్తేర్‌ తన పాత్రకు సరిగ్గా సూటయ్యింది. చైతన్య తదితరులంతా తమ పాత్రల పరిధి మేర రాణించారు.

రెండు పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మెలోడియస్‌గా వుంది. ప్రేక్షకుల్ని సినిమాలో లీనమయ్యేందుకు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఉపకరించింది. సినిమాటోగ్రఫీ సినిమాకి అదనపు బలాన్నిచ్చింది. ఎడిటింగ్‌ బావుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి సహజత్వాన్నిచ్చేలా వున్నాయి. డైలాగ్స్‌ సినిమాకి ప్లస్‌ అయ్యాయి. రిచ్‌ ప్రెజెంటేషన్‌తో దర్శకురాలు సినిమాని అద్భుతంగా రూపొందించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. స్క్రిప్ట్‌ కన్నా స్క్రీన్‌ప్లేనే సినిమాకి కొండంత బలాన్నిచ్చింది. మామూలు కథకు మంచి కథనం తోడవడం గొప్ప విషయం.

మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్‌. మలయాళంలో మోహన్ లాల్, మీనా నటించారు. మలయాళం నుంచి తెలుగులోకి తీసుకొచ్చిన దర్శకురాలు, ఎక్కడా నేటివిటీ మిస్‌ కాకుండా జాగ్రత్త పడ్డారు. సినిమా స్లోగా మొదలయినా, ఇరవై నిమిషాల తర్వాత వేగం పుంజుకుంటుంది. అక్కడినుంచి సినిమాలో లీనమైపోవాల్సిందే ఎవరైనా. తెలుగులో ఇప్పటిదాకా ఈ తరహా సినిమా రాలేదనే చెప్పొచ్చు. కమర్షియల్‌ అంశాల్ని పక్కన పెట్టి, మంచి సినిమా చూడాలనుకునేవారికి ఇదో మంచి ఆప్షన్‌. వెంకటేష్‌ ఇమేజ్‌, సినిమాలో కంటెంట్‌ ఇవన్నీ సినిమాని సూపర్‌ హిట్‌ స్థాయికి తీసుకెళ్ళే అవకాశం వుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే
నిజంగానే ఉద్వేగభరితమైన  ‘దృశ్యం’ ఇది.

అంకెల్లో చెప్పాలంటే: 3.5/5
మరిన్ని సినిమా కబుర్లు
cine churaka