Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

జరిగిన కథ: ఏకాంబర్ పాలసీలకు కావలిసిన డబ్బు ఎలాగా అని ఆలోచిస్తుండగా రాజనాల, పీతాంబరాన్ని అడుగుదామని సలహా ఇస్తాడు. దాంతో మరుసటి రోజు  బ్రాంచి మేనేజరుని వెంట తీసుకుని ఏకాంబర్ ఇంటికి వస్తాడు రాజనాల.

"షాపుకి ఎంత మదుపు పెట్టమంటారు?" రాజనాల కుతూహలంగా అడిగాడు.

"ఎంత మదుపు పెట్టినా ఏముందమ్మా! అమ్మకం వుండాలి గానీ" అయోమయంగా అన్నాడు పీతాంబరం.

'వీళ్లేంటీ, ఇన్ కం టాక్స్ వాళ్లలాగ ఆరాలు తీస్తున్నారు. కొంపదీసి తను టాక్స్ కట్టటం లేదని తెలిసిపోయిందా?'

"నిజమే అంకుల్!... మీరన్నది కరెక్టే! ప్రతి వ్యాపారంలోనూ పోటీ బాగా పెరిగిపోయింది" అన్నాడు రాజనాల.

"కనీసం పది లక్షలకన్నా మీరు షాపులో సామాన్లు మోపు చేసి వుంటారు కదా సార్!" మేనేజర్ సూటిగా పీతాంబరం కళ్లల్లోకి చూస్తూ అన్నాడు.

"అవును సార్! బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నా నెలకి పదివేల వరకూ వడ్డీ వచ్చేది. అంత కూడా మిగలడం కష్టమవుతోంది" దిగాలుగా అన్నాడు పీతాంబరం.

"మీరే కాదు సార్! ప్రతిచోటా అలాగే వుంది. మా ఏజెంట్ల వ్యవహారమే చూడండి! విపరీతమైన పోటీ. ఒక్క పాలసీ కోసం పదిమంది ఏజెంట్లు వెళ్లి తన్నుకు చస్తున్నారు. పాపం! పాలసీ కట్టే పాలసీదారు కూడా ఎక్కడ కట్టాలో, ఎవరికి కట్టాలో అలోచించుకోలేకపోతున్నారు. పైపెచ్చు కొందరు ఏజెంట్లు పాలసీ కట్టే పాలసీదారుకి బహుమతులు పట్టుకెళ్లి ఇస్తున్నారు. వాళ్లు కట్టాల్సిన మొదటి ప్రీమియం ఏజెంట్లే కడతామని చెప్పి మరీ పాలసీలు రాయించుకుంటున్నారు" చెప్తూ ఆగి ఎదర టీపాయ్ మీదున్న మంచినీళ్ల గ్లాసు అందుకున్నాడు బ్రాంచి మేనేజర్.
పీతాంబరం, ఏకాంబర్ ఇద్దరూ అయోమయంగా బ్రాంచి మేనేజర్ కేసి చూస్తూండిపోయారు.

ఈయన ఈ కథంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నట్టు!' ఆలోచిస్తూ అయోమయంగా చూస్తున్నాడు పీతాంబరం.

'ఏజెంటుగా తనకింకా ఇలాంటి కష్టాలింకా ఎదురు కాలేదే! ఇంతకీ వీళ్లిద్దరూ పనిగట్టుకుని తెల్లారక ముందే ఇక్కడకెందుకు వచ్చారు?! రాజనాల కూడా తనకి కనీసం ఎందుకొస్తున్నదీ చెప్పలేదు. వస్తున్నాం, వుండు అని మాత్రం ఆర్డర్ వేశాడు ' ఆలోచిస్తూ గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నాడు ఏకాంబర్.

"కానీ, మాకు మాత్రం మీ అబ్బాయి కూపంలో ఓ మంచి ఆణిముత్యంలాంటి ఏజెంటు దొరికాడు. పాలసీలు దొరక్క ఏజెంట్లంతా జుట్టు పీక్కుంటూంటే మీవాడు కట్టలు కట్టలు పాలసీలు సేకరించి మా మతి పోగొడుతున్నాడు" చిన్నగా నవ్వుతూ ఏకాంబరాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ చెప్పాడు బ్రాంచి మేనేజర్.

బ్రాంచి మేనేజర్ అలా అనేసరికి తండ్రీకొడుకులిద్దరూ ఉబ్బితబ్బిబ్బయిపోయారు. వంటగది గుమ్మం దగ్గర నిలబడి హాల్లో వీళ్ల సంభషణంతా ఓ చెవి పారేసి వింటున్న ఏకాంబర్ తల్లీ, చెల్లెలు కూడా ఆనందంతో పొంగిపోయారు.

"అంతా మీ ఆశీర్వాదం సార్! ఎందుకూ పనికిరాడనుకున్న, వట్టిపోయిన గొడ్డులాంటి మావాడిని పాడి ఆవులా మార్చేశారు. ఈ గొప్పతనమంతా ఈ కుర్రాడిది, మీదే సార్!" వినమ్రంగా అన్నాడు పీతాంబరం.

తనని గొడ్డు ఆవుతో పోల్చేసరికి అదిరిపడి తండ్రి కళ్లలోకి కోపంగా చూశాడు ఏకాంబర్. మళ్లీ చటుక్కున తల దించుకున్నాడు.
"అలా అనకండి సార్! మీవాడు హనుమంతుడిలాంటివాడు. అతని బలం అతనికి తెలీదు. చూడండి! ఈ రంగంలో ఎలా దూసుకుపోతాడో!" గర్వంగా అన్నాడు బ్రాంచి మేనేజర్.

"మీ నోటి వాక్కు ఫలించి మావాడు అంత అందలమెక్కితే అందరం ఆనందిస్తాం కదా సార్!" సంతోషంగా అన్నాడు పీతాంబరం.

"నిజమే సార్!... మీవాడిలో ఆ సత్తా వుంది. కానీ, పునాదే బలహీనమనిపిస్తోంది సార్!" తల దించుకుని ఓరగా పీతాంబరం కళ్లల్లోకి చూస్తూ అన్నాడు బ్రాంచి మేనేజర్.

పునాదే బలహీనంగా వుందనేసరికి తండ్రీకొడుకులిద్దరికీ తల గిర్రున తిరిగిపోయంది. పాలసీలకి... పునాది కట్టాలా?! ఇంటికైతే పునాది అవసరం! ఏజెంటుగా నిలబడాలన్నా పునాది కావాలా?!'

తండ్రీకొడుకులిద్దరూ బుర్రని నేలకేసి కొట్టుకుంటున్నట్టు పిచ్చిపిచ్చిగా ఆలోచించినా బ్రాంచి మేనేజర్ అన్నదాంట్లో అర్థాన్ని గ్రహించలేకపోయారు.

"పు...నా...దా?! దేనికి సార్"!" బలహీనమైన గొంతుతో అన్నాడు ఏకాంబర్.

"మీరుండండి! నేను మాట్లాడుతున్నది మీ నాన్నగారితో..." చిరాగ్గా అన్నాడు బ్రాంచి మేనేజర్.

"మీరన్నది నాకర్థం కాలేదు" సంశయంగా అన్నాడు పీతాంబరం.

"అర్థం కావడానికేముంది సర్!? ఇల్లు కట్టాలంటే పునాది కావాలి. ఏదైనా దుకాణం తెరవాలంటే మదుపు కావాలి. అవునా!" అన్నాడు బ్రాంచి మేనేజర్.

"మరి, మీవాడు ఏజెంటుగా బాగా ఎదగాలంటే మీ సపోర్ట్ వుండాలి కదా సార్!" విషయానికొస్తూ అన్నాడు మేనేజర్.

"లేదని చెప్పాడా మావాడు?" ఆశ్చర్యంగా అన్నాడు పీతాంబరం.

తండ్రి అలా అనేసరికి అదిరిపడ్డాడు ఏకాంబర్. 'తనెప్పుడలా అన్నాడు?' మనసులోనే అనుకుంటూ బ్రాంచి మేనేజర్ కేసి, రాజనాలకేసి మార్చి మార్చి చూస్తూ ఎదో అనబోయాడు. ఏకాబర్ వాలకాన్ని గమనిస్తూనే బ్రాంచి మేనేజర్ చేత్తోనే మాట్లాడవద్దని వారించాడు.

"మీవాడు చెప్పడం కాదు సార్! నేనే అంటున్నాను. మీ ఏకాంబర్ టాప్ గేర్ లో పాలసీలు చేయించుకుపోతున్నాడు. కాదనను. కానీ, ఇక్కడే చిన్న చిక్కొచ్చిపడింది. ఈ మధ్య ఏకాంబర్ చేస్తున్న పాలసీలన్నీ సాలరీ సేవింగ్స్ స్కీములే. వాటికి ఏజెంట్ రెండు వాయిదాలు కట్టాల్సి వస్తోంది. తప్పదు. పోటీ అలా వుంది. కానీ, మీవాడు ఇప్పుడిప్పుడే ఏజెంటుగా కెరీర్ స్టార్ట్ చేశాడు. డబ్బు ఎలా వస్తుంది? అయితే, ముందు మదుపు పెడితే ఆరునెలల్లో మీవాడికి ఆ మదుపు కమీషన్ రూపంలో వసూలయిపోతుంది. ఇకపై వచ్చేదంతా ఆదాయమే!" విడమర్చి చెప్పాడు మేనేజర్.

మేనేజర్ మాటలు విన్నాక అసలు విషయం అర్థమై ఆనందంగా రాజనాలకేసి చూశాడు ఏకాంబర్.

దేవుడు వరాలిచ్చినట్టు చెయ్యెత్తి ఏకాంబర్ ని ఆశీర్వదిస్తున్నట్టు సైగ చేశాడు రాజనాల.

'నిజమే కదా! మొన్నటికి మొన్న తను తెచ్చిన పాలసీలకు రాజనాలే డబ్బు సర్దాడు. మళ్లీ తన దగ్గర పోగైన ఈ నలభై పాలసీలకు ఎలా సర్దగలడు? ఆ డబ్బు రికవరీ కావాలంటే కనీసం ఆరునెలలైనా కమీషన్ అంతా పోగు చేసి ఇవ్వాలి. ఆ తర్వాత వచ్చే కమీషనంతా పాతికేళ్లపాటు అప్పనంగా ఆరగించవచ్చు. కానీ, ఇప్పుడు మదుపు ఎవరు పెడతారు?' మనసులోనే తర్జనభర్జన పడ్డాడు ఏకాంబర్.

"ఎంతుండాలంటారు?" విషయం అర్థమై అడిగాడు పీతాంబరం.

"ఓ ఏభైవేల వరకు అవసరమవుతుంది సార్!" అంటూ ఠక్కున అందుకున్నాడు రాజనాల.

"అమ్మో! ఏభైవేలా?! అంత నేనెక్కడ సర్దగలను సార్! ఓ మూడువేలో, ఐదువేలో అయితే అప్పుగా తేగలను" నసుగుతూ అన్నాడు
పీతాంబరం.

'ఈ వెధవవల్ల పైసా రాబడి లేదు. వస్తుందో, రాదో తెలీదు. కానీ తిరిగి మదుపు పెట్టాలంట! ఇప్పటికే షాపులో కూర్చోబెట్టి తప్పు చేశాను. అప్పులపాలైపోయాను. మళ్లీ ఇదో దండగా?!' లోలోనే కారాలు మిరియాలు నూరుకుంటూ కసితో రగిలిపోయాడు పీతాంబరం.

"అదేంటి సార్! తండ్రి మీరే అలా అంటే మీ అబ్బాయి భవిష్యత్తు ఏంకాను చెప్పండి" తన ఎత్తుగడ వీగిపోతోందని గ్రహించగానే దీనంగా అన్నాడు బ్రాంచి మేనేజర్.

"వాడికి ముందే చెప్పాను సార్! ఇన్స్యూరెన్స్ ఏజెంటు అంటే అల్లాటప్పా కాదురా! నువ్వు చెయ్యలేవు. ఏదైనా పొరపాటు జరిగితే మన ఇంటి మీదకు వచ్చి వెంట తరిమి తంతారని చెప్పాను. విన్నాడా!? అదిగో... మీరిచ్చని జోలిని తగిలించుకు తిరుగుతున్నాడు" వ్యంగ్యం మేళవించి కోపంగా అన్నాడు పీతాంబరం.

"సార్....!" ఇంకా ఏదో అనబోయాడు బ్రాంచి మేనేజర్.

"క్షమించండి సార్! ఇంతకంటే నేనేం చెప్పలేను. అడ్డగాడిదలా వీధులు పట్టుకు తిరిగినా పట్టించుకోలేదంటే... ఉన్నదేదొ తిని తిరుగుతున్నాడులే అని వదిలేశాను. ఇప్పుడు వీడి కోసం నేను కూడా అప్పులు చేసి రోడ్డుమీద పడలేను" నిక్కచ్చిగా అన్నాడు పీతాంబరం.

"వాడికి ముందే చెప్పాను సార్! ఇన్స్యూరెన్స్ ఏజెంటు అంటే అల్లాటప్పా కాదురా! నువ్వు చెయ్యలేవు. ఏదైనా పొరపాటు జరిగితే మన ఇంటి మీదకు వచ్చి వెంట తరిమి తంతారని చెప్పాను. విన్నాడా!? అదిగో... మీరిచ్చని జోలిని తగిలించుకు తిరుగుతున్నాడు" వ్యంగ్యం మేళవించి కోపంగా అన్నాడు పీతాంబరం.

"సార్....!" ఇంకా ఏదో అనబోయాడు బ్రాంచి మేనేజర్.

"క్షమించండి సార్! ఇంతకంటే నేనేం చెప్పలేను. అడ్డగాడిదలా వీధులు పట్టుకు తిరిగినా పట్టించుకోలేదంటే... ఉన్నదేదొ తిని తిరుగుతున్నాడులే అని వదిలేశాను. ఇప్పుడు వీడి కోసం నేను కూడా అప్పులు చేసి రోడ్డుమీద పడలేను" నిక్కచ్చిగా అన్నాడు పీతాంబరం.

తండ్రి మాటలను వింటూనే ఏకాంబర్ హతాశుడైపోయాడు. కన్నతండ్రే తనను ఇంతలా వాజమ్మను చేసి మాట్లాడతాడనుకోలేదు. గుండెల్లో నుండి ఏడుపు పెల్లుబుకుతున్నా బయట పడకుండా పకపకా నవ్వేస్తూ "సార్! మా నాన్న అలాగే అంటాడు. నేను మాట్లాడతాను. మీరు వెళ్లండి సార్!" రాజనాలా, ప్లీజ్ ఏమీ అనుకోవద్దు" గబాలున నిలబడి బ్రాంచి మేనేజర్ చెయ్యి పట్టి క్షమించమన్నట్టుగా చూస్తూ అన్నాడు ఏకాంబర్.

బ్రాంచి మేనేజర్, రాజనాల ఒకరి వంక ఒకరు మొహామొహాలు చూసుకుని, చేసేది లేక వస్తామని వెళ్లిపోయారు. వాళ్లు అలా వెళ్లగానే ఏకాంబర్ కూడా తన బ్యాగ్ తీసుకుని బయలుదేరబోయాడు.

అరగంటనుండీ వంటగది ద్వారం దగ్గరే నిలబడి జరిగినదంతా చూస్తున్న పర్వతాలు గబాలున వచ్చి మౌనంగా వెళ్లిపోతున్న ఏకాంబర్ ని అడ్డుకుంది.

"వుండరా! మీ నాన్న కాదంటే నేను లేనా? ఇదిగో, ఇది తీసుకో! దీన్ని అమ్మేసి ఆ పాలసీలన్నీ కట్టెయ్" అంటూ తన మెడలో వున్న బంగారం చైను చేతిలో పెట్టేసరికి అంతవరకూ అదిమిపెట్టిన ఏడుపు ఒక్కసారే పెల్లుబికేసరికి గొంతునైతే నొక్కేశాడు గానీ కళ్లల్లో కన్నీళ్లని మాత్రం అదిమిపట్టలేకపోయాడు ఏకాంబర్.

"అమ్మా!" అంటూ తల్లిని పట్టుకుని వలవలా ఏడ్చేశాడు.

తల్లీకొడుకులు అలా కావలించుకుని ఏడవడం చూసి పీతాంబరం మరేం మాట్లాడలేకపోయాడు. 'ఎలా పోతే అలా పోనీ, నాకుందుకు!' అనుకుంటూ విసురుగా పెరట్లోకి వెళ్లిపోయాడు.

"ఏడవకురా! ఎవరైనా చూస్తే నవ్వుతారు. ఏడ్చే మగాడిని, నవ్వే ఆడదాన్ని నమ్మకూడదంటారు తెలుసా?! నీమీద నాకు నమ్మకముంది. వెళ్లు! వెళ్లి ఇది అమ్మేస్తే అరవై వేలైనా వస్తాయి కదా! నీకు ఎలా తోస్తే అలా వాడుకో! నువ్వు బాగా సంపాదిస్తే, అదంతా నాకే ఇస్తావు కదరా! వెళ్లు!" కొడుకు భుజం తడుతూ అంది పర్వతాలు.

ఏకాంబర్ కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తల్లి తనమీద వుంచిన నమ్మకానికి గుండె అంతా బరువెక్కిపోయింది.

తల్లి ఇచ్చిన బంగారు గొలుసుని భద్రంగా జేబులో దాచుకుని గుండెల్నిండా గాలి పీల్చుకుని అమ్మ నమ్మకం వమ్ము కాకూడదనుకుంటూ ఎనలేని ఆత్మవిశ్వాసంతో ఇంట్లో నుండి బయటపడ్డాడు ఏకాంబర్.

ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు ఏకాంబర్.

ఇన్స్యూరెన్స్ కంపెనీవాళ్లు ఏ పోటీ పెట్టినా అందులో ఏకాంబర్ ముందుండేవాడు. బ్రాంచి పరిధిలోనూ, ఏజెంట్ల పోటీలోనూ, డివిజనల్ పరిధి, జోనల్ పరిధిలో పోటీ పెట్టినా ఎక్కువ పాలసీ, ఎక్కువ వ్యాపారం చేసి బహుమతులతో పాటు అవార్డులు, రివార్డులను చేజిక్కించుకునేవాడు.
ఇన్స్యూరెన్స్ కంపెనీవాళ్లు పెట్టే ప్రతి పోటీలోనూ విజేతలైన వారికి ఒక స్టార్ హోటల్లో మీటింగ్ ఏర్పాటు చేసి బహుమతులనిచ్చి ప్రోత్సహించేవారు. ఆ మీటింగులవల్ల మిగతా కొత్త ఏజెంట్లు కూడా ప్రేరణ పొందుతారని అలా చేసేవారు.

ఏకాంబర్ ఏజెంటుగా జీవితాన్ని ప్రారంభించిన ఏడాదికే ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. ఆ ఏడాది చివరలో తల్లికి అయిదు తులాల బంగారు గొలుసు తెచ్చి తన చేతిలో పెట్టాడు ఏకాంబర్.

అంతవరకూ ఇంట్లో ఏవేవో వస్తువులు తెచ్చి పెడుతున్న కొడుకు ఏజెంటుగా బాగానే వున్నాడనుకుంది. అయిదు తులాల బంగారు గొలుసు తెచ్చి తన చేతిలో పెట్టేసరికి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది పర్వతాలు.

"ఇంత ఖరీదుది ఎందుకు కొన్నావురా!" గొలుసును చేత్తో పట్టుకుని మురిసిపోతూ అంది పర్వతాలు.

"నీకే కదమ్మా! బావుంటుంది! ఈ ఏడాదిలో మిగిలిన కమీషన్ తో కొన్నానమ్మా! చెప్పడం మరిచాను ఈ ఏడాది మన బ్రాంచి ఏజెంట్లందరిలో నేనే ఎక్కువ ఇన్స్యూరెన్స్ చేయించానని సన్మానం ఏర్పాటు చేశారమ్మా! నాలా మన బ్రాంచిలో ఎక్కువ వ్యాపారం చేసిన పదిమందిని ఎంపిక చేసి డాల్ఫిన్ హోటల్లో పార్టీ పెడుతున్నారు. భోజనాలు కూడా అక్కడే! మనందరం వెళ్దామమ్మా!" అన్నాడు ఏకాంబర్.

"అంతకన్నానా! నాన్నకు చెప్పు. అన్నయ్య కూడా ఈరోజు వస్తున్నాడు కదా! అందరం వెళ్దాం" అంది పర్వతాలు.

"షాపు దగ్గరకు వెళ్తే చెప్తాలే అమ్మా! రేపు సయంత్రమే! అయిదు గంటలకు బయలుదేరాలి" ఆనందంగా అన్నాడు ఏకాంబర్.

"అలాగే! అన్నయ్యని తీసుకు రావడానికి రైల్వేస్టేషన్ కి వెళ్తావా?" అని అడిగింది తల్లి.

"అలాగేనమ్మా! ట్రైను వచ్చేది రెండున్నరకి కదా! మా ఆఫీసుకు వెళ్లి అలా వెళ్తాను" అన్నాడు ఏకాంబర్.

"ఈరోజుకి నాన్నగారి బండి అడిగి తీసుకోలేకపోయావా?" అంది పర్వతాలు.

"అక్కర్లేదమ్మా! ఆటోలు భొల్డన్ని. ఇట్నుంచి బస్సులో వెళ్తాను. అట్నుండి అన్నయ్యా, నేనూ ఆటోలో వచ్చేస్తాం. సరేనా?" అన్నాడు ఏకాంబర్.

"సరేలే! నాన్నగారికి రేపటి విషయం చెప్పు. అరే! మరచిపోయాను. నువ్వు స్టేషనుకి వెళ్తావో, వెళ్లవో అని నాన్నగారు కంగారు పడతారు. ఆ విషయం కూడా చెప్పు. జాగ్రత్తగా వెళ్లిరా!" అంటూ కొడుకు తెచ్చిచ్చిన బంగారు గొలుసును చూస్తూ మురిసిపోయింది పర్వతాలు.
ఇంతలో పెరట్లో అంట్లు తోమి వచ్చిన అలివేలుమంగ తల్లి మెళ్లో ధగధగా మెరిసిపోతున్న గొలుసును చూసి ఆనందంతో ఎగిరి గెంతులేస్తూ వచ్చింది.

"అమ్మా! ఎక్కడిదే? ఓసారి ఇవ్వవా! వేసి చూసుకుంటాను. నాన్న చేయించారా! నాకు చూపించలేదే!" అని గలగలా మాట్లాడుతూ తల్లి తీసిచ్చేలోపలే తనే తల్లి మెళ్లో గొలుసు తీసి చూసి మురిసిపోతూ మెళ్లో వేసుకుంది.

"అబ్బ! ఎంత బావుందో! అమ్మా! నా గొలుసు బాగా చిన్నదైపోయిందే! ఇది నేను తీసుకుంటాను" అంటూ మురిపెంగా తల్లిని పట్టి కుదిపేస్తూ అంది కూతురు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
26th episode