Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
25th episode

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐ.ఏ.ఎస్ పాస్

 జరిగిన కథ: ప్రిలింస్ పాసవడం తో మెయిన్స్ పరీక్ష రాస్తాడు కిట్టు. వాటి ఫలితాల నిరీక్షణ  కిట్టుకు ఒకింత బాధ కలిగించినా, తన పట్టుదల ఇంకా పెరిగి, మళ్ళీ మెయిన్స్ కోచింగ్ ప్రిపేర్ అవుతుండగా, తన భార్య గర్భవతి కావడంతో తనను భీమవరం పంపించి వస్తాడు. ఇంతలో పిడుగు లాంటి వార్త... తన తాతయ్య మరణం.    

ఉద్యోగరీత్యా ముంబయిలో కొంతకాలం, హైద్రాబాదులో కొంతకాలం... పెద్దన్నయ్య హైద్రాబాద్, ఇంకొకళ్లు ఇంకోచోట... ఎప్పుడో ఒకటి రెండుసార్లు పెన్నాడ వెళ్లడం... అంతే! బుల్లోడు... అంటే కిట్టు నాన్నగారు భీమవరం నుండి స్కూటరేసుకుని పెన్నాడకు వెళ్లి కూరలు, నారలు, బియ్యం ఇచ్చి వచ్చేవారు. ఆయన ఉద్యోగం ఆయనది...

శ్మశానానికి వెళ్లి అంత్యక్రియలు పూర్తయ్యేవరకు వుండి, కాలువలో స్నానం చేసి, ఒక్క గంటలో బయల్దేరి, బస్సెక్కి హైద్రాబాదుకి చేరుకున్నాడు కిట్టు.

కిట్టు అన్నదమ్ములు, తల్లిదండ్రులు కిట్టు ప్రవర్తనను చాలా తీవ్రంగా పరిగణించారు.

కిట్టు ప్రవర్తన వాళ్లను చాలా నొప్పించింది. ఏమిటీ, వీడు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు?

కనీసం తాతను ముట్టుకున్నాడా అసలు... కిట్టు ఏం చెప్పినా వాళ్లు అర్థం చేసుకోరు...

ఆ విషయం కిట్టుకు బాగా తెలుసు... వాళ్లతో మాట్లాడ్డం అనవసరం. దుర్మార్గుడనుకుంటే అనుకోనీ! కాలం గడుస్తోంది.

కిట్టుకి కనీసం తేదీలు కూడా గుర్తుండడంలేదు.

సెప్టెంబర్ వచ్చింది... పందొమ్మిదో తారీఖు... కిట్టుకి కబురు వచ్చింది...

ఇంట్లోనే డెలివరీ అయ్యింది, అబ్బాయి పుట్టాడు... తల్లీ, బిడ్డా క్షేమం...

కిట్టు తిరిగి కబురు పెట్టాడు...

చాలా సంతోషం... అంతే...

ఎప్పుడు వస్తావు?

చెప్పలేను.

డిసెంబర్లో పరీక్షలున్నాయి. అయిపోయాక వస్తాను...

ఒక్కసారి వచ్చి వెళ్లవచ్చు కదా...

కుదరదు...

ఇక కామెంట్ల మీద కామెంట్లు... పిల్లవాడి మీద ప్రేమలేదు, భార్యమీద ప్రేమలేదు. కటిక రాక్షసుడు కూడా పుట్టిన పిల్లవాడిని ఒక్కసారైనా చూసి వెళతాడు. ఈ కిట్టుగాడు అంతకంటే దారుణమైనవాడిలా వున్నాడు. వీడేమైనా హైద్రాబాదులో వున్నాడా, లేక అమెరికాలో వున్నాడా? ఒక్కసారి వచ్చి చూసిపోవచ్చు కదా... చాలా ఓవెరాక్షన్ వీడిది...

ఏమ్మా అనితా, నువ్వు ఫోన్ చేసి పిలవచ్చు కదా?

'ఆయనకు పరీక్షలు వున్నాయి. అవి కాగానే వస్తారు. మనం పిలవాల్సిన పనిలేదు ' అనేది అనిత.

ఏంటి అనితా నీకేం బాధగా లేదా?

పిల్లవాడు పుట్టింది సెప్టెంబర్లో... ఇది డిసెంబర్ నెల... ఒక్కసారి వచ్చి నిన్నూ, పిల్లవాడినీ చూస్తే బాగుండును అనిపించడంలేదా?

అనిపిస్తుంది. కానీ, పరీక్షలున్నాయి కదా...

నీ మొగుడొక్కడే రాస్తున్నాడా బోడి పరీక్షలు. ప్రపంచంలో ఇంకెవ్వరూ రాయడం లేదా?

ఏమో, నాకు తెలీదు... (అనిత)

మీకిద్దరు ఏమన్నా గొడవలున్నాయా?

లేవు... (అనిత)

ఇంక నిన్ను వదిలేసినట్టేనా? ఇంక వాడు రాడా...? పిల్లవాడు పుట్టిన నాలుగు నెలలకు కూడా వాడు రాలేదంటే ఏదొ వుందన్న మాటే! అలాంటిది ఏమీలేదు...(అనిత) ఉధృతంగా ఎన్ని పెద్ద పెద్ద బలమైన అలలు వచ్చి కొట్టినా సముద్రంలో వున్న రాయి ఎలా లెక్క చెయ్యక, కదలక మెదలక వుంటుందో... అంత గట్టిగా నిలబడింది అనిత. కామెంట్లన్నీ తమంట తామే సద్దుమణిగిపోయాయి...

పరీక్షలన్నీ అయిన తర్వాత... డిసెంబర్ నెలాఖరున భీమవరం వెళ్లి భార్యనీ, బిడ్డనీ చూశాడు కిట్టు. పిల్లవాడు అచ్చు కిట్టులాగే వున్నాడు అన్నారు కొందరు.

వీడికి పేరేం పెడదాం అన్నారు కిట్టు నాన్నగారు. 'మీరేదో తిథులు, నక్షత్రాలు చూస్తారు కదా... దాని ప్రకారం ఎలా పెట్టాలంటారు...' అన్నాడు కిట్టు. కిట్టుకి తెలుసు వాళ్ల నాన్నగారు మొదటి అక్షరం చెబుతారని... ఆ అక్షరంతో పేరు పెట్టాలని... కిట్టుకి నమ్మకం లేదు, ఈ అక్షరాల పేర్లలో... కానీ నాన్నగార్ని గౌరవించడం కోసం అడిగాడు. 'నేను చూసిన దాని ప్రకారం 'చ 'తో మొదలవ్వాలి. నేను వీడికి 'చూబీ' అని పెట్టాను. అదే ఖాయం చేసేద్దామా? అన్నారు నాన్నగారు. 'ఆముదం తాగినట్టు ముఖం పెట్టాడు కిట్టు. 'చూబియా' అన్నాడు. 'సరే, నీ పాలిటెక్నిక్ ఫ్రెండ్ చందు వున్నాడుగా... వాడికిలాగానే చందు అని పెట్టేయి అన్నారు నాన్నగారు. నా క్లోజ్ ఫ్రెండ్ అయితే వాడి పేరు పెట్టాలా? 'చ ' కలిస్తే చాలా? అనుకున్నాడు కిట్టు. నాన్నగారూ... మొదటి అక్షరం మీరు చెప్పినట్టే వుంచి పేరు పెడతాను. ఇంక ఆ విషయాన్ని వదిలెయ్యండి... అన్నాడు.

ఈసారి ఫలితాల కోసం ఎదురు చూడ్డంలేదు కిట్టు. ముంబయిలో వున్నప్పుడు కనకరాజుగారు, బాషాగార్ల ముఖాల్లో కనిపించిన ప్రశాంతత ఇప్పుడు కిట్టుని ఆవరించుకుని వుంది. కిట్టుకి స్పష్టంగా తెలుస్తోంది తనలోని మార్పు... అలజడి లేదు...

పిల్లవాడినీ, అనితనూ తీసుకు వచ్చేశాడు హైద్రాబాదుకి.

ఆఫీసుకి వెళుతున్నాడు, వస్తున్నాడు.

రోజులు గడుస్తున్నాయి.

పరీక్షా ఫలితాలు వచ్చాయి.

కిట్టు పాసయ్యాడు.

ఇక మిగిలింది ఇంటర్వ్యూ... అదే పర్సనాలిటీ టెస్త్...

పాసయినందుకు ఎగిరి గంతేయలేదు కిట్టు.

కష్టానికి ఫలిగాన్ని దేవుడే ఇస్తాడనే నమ్మకమే అది!

తర్వాత ఏంచేయాలి? అనేదే ప్రశ్న.

ఎలా చేయాలి?

ప్రముఖ కోచింగ్ సెంటర్లన్నీ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాయి ఇంటర్వ్యూకి. విద్యార్థులు అన్ని కోచింగ్ సెంటర్లకీ వెళ్లి, పర్సనాలిటీ టెస్ట్ ఎలా చేయాలో నేర్చుకుంటారు. వెళ్లిన ప్రతిచోటా ఫోటో ఇచ్చి సంతకం చేస్తారు. ఎవరికైనా ర్యాంక్ వస్తే, అన్ని కోచింగ్ సెంటర్ల వాళ్లూ... తమ ఘనతే అది... అని పేపర్లలో వేసుకుంటారు.

పర్సనాలిటీ టెస్టుకి సంబంధించి చాలా విషయాలు తెలుసుకున్నాడు కిట్టు.

ఒకడు పర్సనాలిటీ టెస్ట్ గదిలోకి వెళ్లి, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అంటూ అక్కడున్న వాళ్లందరి చేతులనూ లాక్కుని మరీ షేక్ హ్యాండ్ ఇచ్చాడట... ఇలా ఊరందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు.

అక్కడ కూర్చున్న వారిని బోర్డు అంటారు. బోర్డులో ఐదారుగురు సభ్యులు వుంటారు.

ఆ బోర్డుకో ఛైర్మన్ వుంటారు. ఆయంకు గుడ్ మార్నింగ్ చెబితే చాలు.

ఛైర్మన్ గారు సాధారణంగా 'సీనియర్ సివిల్ సర్వెంట్ ' అయి వుంటారు.

దున్నపోతులాగా తలుపు తోసుకుని లోపలికి కొమ్ములతో, గిట్టలతో టటకలాడుకుంటూ వెళ్లకూడదు. తలుపు కొద్దిగా తీసి 'మే ఐ కమిన్ సర్ ' అనాలి. వాళ్లు రమ్మన్నట్టు సైగ చేయడమో, రమ్మనడమో చేస్తారు. దాన్నిబట్టి లోపలికి వెళ్లాలి. ఇక గిట్టల శబ్దమంటే... టకటకలాడే బూట్లు వేసుకోకూడదు. అడుగు మెత్తగా పడాలి.చిత్రవిచిత్రమైన ఫ్యాషన్లతో వెళ్లకూడదు.

ఆడవాళ్లైతే చక్కగా చీర కట్టుకోవచ్చు. పంజాబీ డ్రస్ వేసుకోవచ్చు. ఏదన్నా వాళ్లకి నచ్చింది వేసుకోవచ్చు. కానీ, ఆ డ్రస్ హుందాగా వుండేటట్లు చూసుకోవాలి. మరీ, ఎత్తు హీల్స్ వేసుకోకూడదు...

ఒక మాదిరి హీల్స్ ఓకే. జుట్టు విషయంలో... విరబోసుకున్న జుట్టు అటూ యిటూ కదిలి, మాట్లాడే సమయంలో అడ్డుగా వస్తే చేతులతో దాన్ని అటూ యిటూ తోసుకుంటూ వుంటూంటే లేనిపోని గొడవ. అందుకే జడ వేసుకుని వెళ్తే మంచిది. బాబ్డ్ హెయిర్ కదలకుండా చూసుకోవాలి.

ఆడవాళయినా, మగవాళయినా సరే, ముదురు రంగులు వేసుకోకూడదు. గాఢమైన, కంపుకొట్టే సెంట్లు వాడరాదు. ఈ కంపుకి గదిలో వున్నవాళ్లు ఉక్కిరిబిక్కిరై చచ్చిపోతారు. ఇక ఇంటర్వ్యూ గోవిందా...

లోపలికి వెళ్లాక బర్రుమని కుర్చీని లాగి... ఇరానీ చాయ్ దుకాళనంలో లాగా కూర్చోకూడదు... కుర్చీకి దగ్గరగా నిలబడి బోర్డువాళ్లు కూర్చోమనేదాకా కొద్దిగా ఆగాలి.

నాది దరిద్రగొట్టు ముఖం, ఇదింతే అనుకున్నవాడైనా సరే చచ్చినట్టు నవ్వు ముఖం పెట్టుకోవాలి. రాకపోతే, అద్దంలో చూసి ప్రాక్టీస్ చేసుకోవాలి. చిరునవ్వు... ఎలాంటి ముఖానికైనా అందాన్నిస్తుంది.

హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకోవాలి. తుమ్మొస్తే అది అడ్డంగా పెట్టుకుని, ఎక్స్ క్యూజ్ మీ అంటూ దర్జాగా తుమ్ముకోవచ్చు. గోళ్లు పెంచుకుని గోళ్ల లోపల నల్లగా మట్టిగొట్టు8కుని వెళ్లకూడదు. ఆడవాళ్లు గోళ్లని పొడవుగా పెంచేసి, వాటికి చిత్ర విచిత్రమైన రంగులు వేయకూడదు. ఒక మాదిరి పొడవు గోళ్లు వుండవచ్చు.

సింపుల్ గా వుండే గోళ్ల రంగు వేసుకోవచ్చు. మహంకాళమ్మ వారిలాగా నగలు దించేసుకుని వెళ్లకూడదు. సింపుల్ గా ఒక గొలుసు చాలు. రకరకాల ఉంగరాలు, మోడర్న్ గా వుండే చిత్రవిచిత్రమైన ఆకారాల్లో వుంటే బ్రేస్ లెట్లు వాడకూడదు.

కుర్చీలో కూర్చున్నప్పుడు ఉసూరుమంటూ దేవుడా నన్నెందుకు పుట్టించావురా అన్నట్లుగా జావగారిపోయి చేరబడిపోకూడదు.
అలాగని యుద్ధానికి వెళుతున్న సైనికుడిలాగా బోరవిరుచుకుని రారా దమ్ముంటే... అన్నట్లుగా కూర్చోకూడదు. కొంతమంది ఆడవాళ్లైనా, మగవాళ్లైనా వాల్లకో అలవాటుంటుంది...

ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చేతులతో భరతనాట్యం చేసేస్తూంటారు. చేతులను అటూ యిటూ తెగ తిప్పేస్తారు. భరతనాట్యం, కషాకళి వంటి కళలను ప్రదర్శించరాదు.

నిజంగా భరతనాట్యం, కథాకళి కళాకారులై వుంటే... ఆ విషయాన్ని తమ హాబీగా బోర్డుకు తెలియపరచి వుంటే వాళ్లు ఆ విషయమడిగితే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయంలో అవసరాన్ని బట్టి ఈ ముద్ర ఇలా, ఆ ముద్ర అలా అంటూ విశదీకరించవచ్చు.

మగవాళ్లైనా, ఆడవాళ్లైనా వేసుకున్న బట్టలు తమను ఇబ్బంది పెట్టకుండా వుండేలా చూసుకోవాలి. మనం వేసుకున్న బట్టలు మనల్ని నొక్కేస్తుంటే ఆ ఇబ్బంది ఎదుర్కొంటామా, లేక ప్రశ్నల్ని ఎదుర్కొంటామా?

మండుటెండలో కోటు వేసుకుని ఇబ్బందిగా వెళ్లకూడదు. ఇబ్బంది లేదనుకుంటే కోటు వేసుకోవచ్చు, టై కట్టుకోవచ్చు.

ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయంలో నిజాయితీగా వుండాలి. ఇక నిజాయితీ వుండాలన్నారు కదా అని, ముగ్గురు వెధవలు హిందీ సినిమాలో లాగా చేసిన వెధవ పనులన్నీ ఏకరవు పెడితే... సినిమా కాబట్టి వాడికేదో ఉద్యోగమిచ్చారు. నిజజీవితంలో బెడబట్టి గెంటుతారు.
ఈ మధ్యన మనవాళ్లు ఐఐటీలు, ఐఐయంలలో చేరి నిక్కర్లేసుకుని క్యాంపస్ లో తిరుగుతూ...

కార్పోరేట్ కబుర్లలో పడి... య్యా... ఇట్స్ ఓకేయ్... సో వాట్... ఒహ్... నో... యూ సీ... అఫ్ కోర్స్. సీక్రెట్ ఏమిటంటే...

కార్పోరేట్ ఉద్యోగాలకు వెళ్లినప్పుడు ఇంటర్వ్యూలో (వాళ్లది పర్సనాలిటీ టెస్ట్ కాదు) వాళ్లు నీకు టీ ఇచ్చి, సిగరెట్ కూడా తాగమంటారు. వాళ్లకు కావలసింది డబ్బు. వీడు ఐఐటీ, ఐఐయం కదా... మనకు ఉపయోగపడతాడా, లేదా! మన లాభాలను ఎంత పెంచగలడు? ఇదీ వాళ్ల దృక్పథం... నీకు వెనకాల దురద పెడితే గోక్కుంటూ మాట్లాడవచ్చు. వాళ్లేం పట్టించుకోరు. నా కంపెనీ గురించి నీకెంత తెలుసు? ఈ కంపెనీలో వున్న లొసుగులేంటి? వాటిని ఎలా తీర్చి లాభాలు పెంచగలవు? వీటికి సరైన సమాధానమిస్తే లక్షల జీతంతొ నీకు ఉద్యోగం గ్యారంటీ... ఆ కార్పొరేట్ కల్చర్ ఇక్కడ పనికిరాదు.

ఉదాహరణకు ఒక జిల్లా కలెక్టరో, ఎస్పీయో... కలెక్టర్, ఎస్పీదాకా ఎందుకు? పోస్టల్ డిపార్ట్ మెంటులో కొన్ని లక్షల మంది ఉద్యోగులుంటారు. ఆ పోస్టల్ సర్వీస్ వచ్చినవాడు... వాళ్లకు అధికారి. ఆఫీసులో గానీ, బయటగానీ నేను పిచ్చికోతిని అని రాసి వున్న టీషర్ట్ వేసుకుని తిరిగితే... ఎంత అసహ్యంగా వుంటుంది? అందరూ ముక్కున వేలేసుకుంటారు. ఇలాంటి టీ షర్ట్ ప్రైవేట్ వాడు వేసుకుని తిరగవచ్చు. వాడిని ఎవరూ పట్టించుకోరు.

ఏదన్నా ఘోర ప్రమాదం జరిగిందనుకోండి... కలెక్టర్ గారు హుటాహుటిన చేరుకుంటారు ప్రమాదస్థలానికి. ఐదువందల శవాల్ని కలెక్టర్ స్వయంగా లెక్కపెడతారు. మీడియా వాళ్లు కలెక్టర్ గారిని అడుగుతారు. ఎంతమంది చనిపోయు వుండవచ్చుగాక... అంటారు... అంతేగానీ, పుసుక్కున ఐదొందల మంది చచ్చారు. ఇంకెంతమంది చచ్చారో అనరు. మే... బీ... లాంటి పదాలు వాడరు. ఎందుకంటే, వున్న నిజాన్ని ఒక్కసారిగా చెబితే దేశం ఉలిక్కి పడుతుంది.

ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడిన ప్రతిమాటా శిలాశాసనంలాంటిది. రాతిమీద రాయబడుతుంది. దాన్ని మార్చడం, చెరపడం కష్టం.
నిజం చెప్పాలి. సత్యం ;అలకాలి. కరెక్టే... కానీ, అది వినాశనానికి కారణం కాకూడదు. నిజం ఎలాగైనా బయటకు వస్తుంది. రాకుండా ఆగదు. అందుకని, కొద్దికొద్దిగా ప్రజలకు అందించాలి. ఒక ప్రభుత్వ అధికారి వేసుకున్న బట్టలు, మాట్లాడే మాటలు, హావభావాలను ప్రజలందరూ క్షుణ్ణంగా గమనిస్తారు. ఎందుకంటే, ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య వారధి (బ్రిడ్జి) లాంటివాడు ప్రభుత్వాధికారి. అందుకనే సివిల్స్ కి పెట్టే పర్సనాలిటీ టెస్టులకు ఇన్ని జాగ్రత్తలు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలెక్టర్లనూ, ఎస్పీలనూ మాయ్ బాప్ అంటారు. అంటే తల్లివి నీవే, తండ్రివి నీవే అని అర్థం. అంత ప్రాముఖ్యత కలిగినవి ఈ ప్రభుత్వోద్యోగాలు. బాధ్యతాయుతమైన ఉద్యోగాలివి.

ఒకావిడకు కలెక్టర్ గారు సరియైన సమయంలో పట్టించుకోనందువల్ల తీవ్రమైన నష్టం కలిగింది. విచారణ చేయగా, కలెక్టర్ గారు సెలవులో వున్నారు. ఆయన తప్పేమీ లేదు. ఇంకా విచారించగా తెలిసిందేమిటంటే... కలెక్టర్ గారు సెలవు చీటీ ఇచ్చారు, అది ఫైలులోనే వుంది. ఆయన పై అధికారి దాన్ని శాంక్షన్ చేయ్యలేదు. అంటే కలెక్టర్ గారు డ్యూటీలో వున్నట్లే లెక్క. ఆమెకు జరిగిన నష్టానికి కలెక్టరే బాధ్యుడు అని నిర్ణయించారు. కలెక్టర్ గారి జీతం నుండి నెలనెలా డబ్బులు కత్తిరించి, నష్టం పూడేంత వరకు బాధితురాలికి ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చేశారు. కలెక్టర్ గారు ఆ ఆర్డరుని శిరసావహించారు.

ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇరవై నాలు గంటలూ డ్యూటీలో వున్నట్లే లెక్క. తప్పించుకోవడానికి లేదు. సాయంత్రం ఆరైపోయింది. నాకు సంబంధం లేదు అనడానికి వీలులేదు.

ఒక రైల్వే ఉన్నతాధికారి రైలులో ప్రయాణిస్తున్నారు. ఆ రైలుకి యాక్సిడెంట్ అయ్యింది. సహాయక బృందాలు రంగలోకి దిగాయి. ఈలోపు ఆ రైల్వే అధికారి తనకేమీ కాలేదు గదా, ఇక్కడుంటే టైం వేస్ట్ అని చల్లగా జారుకున్నాడు. ఆ తర్వాత ఎంక్వైరీలో అదే రైలులో ఫలానా అధికారి ప్రయాణించినట్టు తెలిసింది.

రైల్వే నిబంధనల ప్రకారం ఆ రైల్వే అధికారి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఎందుకు పాల్గొనలేదు? నువు డ్యూటీలో వున్నట్లే లెక్క అని అతడిపై డిపార్ట్ మెంటల్ కేసు పెట్టి తాట తీశారు.

ప్రభుత్వ ఉన్నతాధికారులకు కారు, డ్రైవర్, బంగళా ఇస్తారు. కొన్ని రాయితీలు వుంటాయి. కొన్ని వందల మందికి అధికారిగా వుండి, ప్రభుత్వ పనిని నడిపించాలి. బాధ్యత కూడా అలాగే వుంటుంది.

ప్రజలకు సేవ చేసి, వాళ్ల ఆశీర్వాదాలు, మన్ననలను పొందితే ఆ సంతృప్తి జీవితాంతం వుంటుంది.

ఆనకట్ట కట్టిన కాటన్ దొరని ప్రజలు దేవుడిలా కొలుస్తారు. కలెక్టరుగా పనిచేసిన మన్రో... రైతులను మధ్యవర్తుల కబంధ హస్తాల నుండి విడుదల చేశాడు. ఆ కృతజ్ఞతతో రైతుల పిల్లలకు మన్రోలమ్మ, మన్రోలయ్య అని పేర్లు పెట్టుకున్నారు.

ప్రైవేటులో లక్షల జీతం, ఇల్లు ఇస్తారు. అవన్నీ లెక్కగట్టి  అంతకు డబుల్ లాభాలు తెస్తేనే ఆ ఉద్యోగం వున్నట్టు. లేకపోతే, వూడినట్టే. 'ప్రైవేటులో బాధ్యత వుండదు ' ' కోట్లకోట్ల విలువ వున్న కంపెనీలు రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసి, వాళ్లమీద ఆధారపడిన కుటుంబాలను రోడ్లమీద పడవేస్తాయి '

భీమవరాన్ని రెండుగా వెనిస్ నగరంలా విభజించే కాలువ నీరు స్వచ్చంగా వుండేది. పిల్లలు ఈత కొట్టేవారు. ప్రజలు స్నానాలు చేసేవారు. పల్లపు ప్రాంత ప్రజలు లాంచీలో ప్రయాణించి భీమవరానికి చేరుకునేవారు. ఆ నీటితోనే ప్రయాణీకులు ముఖం కడుక్కునేవారు.

ఇప్పుడు...  

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
24th episode