Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటిల్లిపాదీ చూసేది... క‌మ‌ర్షియ‌ల్ సినిమానే- సంతోష్ శ్రీ‌న్‌వాస్‌

interview with santosh srinivas

ప‌రిశ్ర‌మ‌లో యువ ద‌ర్శ‌కుల జోరు ఎక్కువ‌గా ఉంది. అంద‌రూ మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాని న‌మ్ముకొన్న‌వాళ్లే. అంతే కాదు.. తొలి అడుగుల్లోనే స్టార్ హీరోల‌తో సినిమాలు చేసే అవ‌కాశం ద‌క్కించుకొంటున్నారు. అలాంటి ద‌ర్శ‌కుల్లో... సంతోష్ శ్రీ‌న్‌వాస్ ఒక‌రు!   కంద‌రీగ‌తో మాస్‌ని అల‌రించారు. ఆ సినిమా హిట్ట‌వ్వ‌డంతో... ఎన్టీఆర్ దృష్టిలో ప‌డ్డాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌తో ర‌భ‌స చేసేస్తున్నాడు. ''స‌రిగ్గా తీయాలే గానీ.. మాస్‌, క‌మ‌ర్షియ‌ల్‌సినిమాల‌కు ఎదురు లేదు. ఎందుకంటే తెలుగులో సినిమా థియేట‌ర్ల‌లో ఎక్కువ‌గా క‌నిపించేది మాస్ జ‌నాలే. వాళ్ల‌ను మెప్పిస్తే... హిట్టు ఖాయం. అందుకే ఆ త‌ర‌హా క‌థ‌లే రాసుకొంటా..'' అంటున్నాడీ యువ ద‌ర్శ‌కుడు. ర‌భ‌స‌..  వ‌చ్చే నెల 14న విడుద‌ల అవుతోంది. ఈనెల 18న పుట్టిన రోజు జ‌రుపుకొంటున్న ఈ యువ ద‌ర్శ‌కుడితో ముచ్చ‌టించింది గో తెలుగు డాట్ కామ్‌.

* ఏమిటీ ఈ పుట్టిన రోజు స్పెష‌ల్‌..?
- ర‌భ‌స సిద్ధ‌మ‌వుతోంది. ఓ మంచి సినిమా తీశానన్న తృప్తి ప‌రిపూర్ణంగా ఉంది. సినిమా చూసి ప్రేక్ష‌కులూ అదే మాట అంటే... అప్పుడు అస‌లైన పండ‌గ నాకు.

* ర‌భ‌స అనే టైటిల్‌కి జ‌స్టిఫికేష‌న్ ఏమిటి?
- ర‌భ‌స ఓ మాసీ ప‌దం. సినిమా ఎంత మాసీగా ఉంటుందో టైటిల్‌తోనే చెప్పేస్తున్నాం. ఇది ఓ ప‌క్కా  క‌మ‌ర్షియ‌ల్  సినిమా.

* ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పండ‌గే అన్న‌మాట‌!
- క‌చ్చితంగా. వాళ్ల‌కే కాదు. అన్ని వ‌ర్గాల‌కూ, అంద‌రికీ న‌చ్చేలా ఉంటుందీ సినిమా. సినిమాని ఎక్కువ‌గా చూసేది మాస్ ప్రేక్ష‌కులు, ఆ త‌ర‌వాత‌...
యువత‌రం. వీళ్లిద్ద‌రినే కాదు, ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని కూడా థియేట‌ర్ల‌కు తీసుకొచ్చే సినిమా అవుతుంది.

* ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండ‌బోతోంది..?
- ఆ పాత్ర రెండు కోణాల్లో సాగుతుంది. ఒక కోణంలో చూస్తే.. ఓ హుషారైన కుర్రాడి క‌థ‌.  మ‌రో కోణంలో చూస్తే... ప‌రిప‌క్వ‌త నిండిన ఆలోచ‌న‌లున్న ఓ యువ‌కుడి క‌థ‌.

* ఇందులో కూడా భారీ ఫ్లాష్ బ్యాక్‌లు ఉంటాయా..?
- అది లేక‌పోతే ఎలా...??  క‌థ‌ని ఆస‌క్తి క‌రంగా చెప్ప‌డంలో ఫ్లాష్ బ్యాక్ కూడా ఓ సాధ‌న‌మే.

* సినిమా బాగా ఆల‌స్య‌మైన‌ట్టుంది??
- నాకు జాండిస్ కాస్త సీరియ‌స్ అయ్యింది.  మ‌ధ్య‌లో రెండు నెల‌లు షూటింగ్ ఆపేయాల్సివ‌చ్చింది. ఈ టైమ్ వేస్ట్ చేయ‌లేదు. పాట‌ల మీద దృష్టి కేంద్రీక‌రించాం.  180 రోజుల్లో తీయాల్సిన సినిమా ఇది. కేవ‌లం 165 రోజుల్లోనే పూర్తి చేశాం. దానికి కార‌ణం ఎన్టీఆర్ ఇచ్చిన స‌హ‌కార‌మే.

* ఎన్టీఆర్ సినిమా అంటే వెరైటీ స్టెప్పులు ఆశిస్తారు. ర‌భ‌స‌లో వాటి ప్రాధాన్యం ఎంత‌?
- ఈ విష‌యంలో ఏమాత్రం లోటు చేయ‌లేదు. ఎన్టీఆర్ ఎప్పుడూ డాన్సులు, పాట‌ల‌పై ప్ర‌త్యేక‌మైన శ్ర‌ర్థ తీసుకొంటుంటారు. ఈ సినిమాలోనూ అదిరిపోయే స్టెప్పులున్నాయి. ఓ పాట‌కు ఎన్టీఆర్ స్వ‌యంగా స్ట‌ప్స్ కంపోజ్ చేశారు. ఆ పాట‌.. అంద‌రికీ న‌చ్చుతుంది.

* బ్రహ్మానందం ట్రాక్ అదిరిపోయింది అంటున్నారు..
- నిజమే. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ ఈ సినిమాలో ఎంత ముఖ్య‌మో, ఎన్టీఆర్ - బ్ర‌హ్మానందం కెమిస్ట్రీ కూడా అంతే ముఖ్యం. వాళ్లిద్ద‌రూ... ఈసినిమాకి మ‌రో మెట్టు పైకి తీసుకెళ్తారు.

* కందిరీగ‌, ర‌భ‌స‌... రెండూ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే. భ‌విష్య‌త్తులోనూ మీ నుంచి ఇలాంటి సినిమాలే వ‌స్తాయా?
- నాకు క‌మ‌ర్షియ‌ల్‌సినిమాలంటే ఇష్టం. అవే చూస్తా. అందుకే అవే తీస్తున్నా. జోన‌ర్ మారినా... అందులోనూ క‌మ‌ర్షియ‌ల్ పంథానే ఉంటుంది. గ‌జిని సినిమా తీసుకోండి. అది డిఫ‌రెంట్ ఫిల్మ్‌. కానీ క‌మ‌ర్షియ‌ల్ పంథాలోనే సాగుతుంది. నేనూ ఆ త‌ర‌హా సినిమాలే తీస్తా.

* బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో ఓ సినిమా చేస్తార‌ని చెప్పుకొంటున్నారు..?
- క‌థ కుదిరితే త‌ప్ప‌కుండా చేస్తా. బెల్లంకొండ సురేష్ న‌న్నో కుటుంబ స‌భ్యుడిలా చూస్తారు. ఆయ‌న ఇంటి నుంచి వ‌చ్చిన హీరోతో ఎందుకు చేయ‌ను..??  పైగా శ్రీ‌నివాస్ లో స్టార్ హీరోకి ఉండాల్సిన అన్ని ల‌క్ష‌ణాలూ క‌నిపిస్తున్నాయి.

* కందిరీగ హిందీకి వెళ్లింది. మ‌రి ర‌భ‌స మాటేంటి?
- ఈ సినిమా కూడా త‌ప్ప‌కుండా బాలీవుడ్‌కి వెళ్తుంది. కానీ నేను డైరెక్ట్ చేయ‌ను. తెలుగులో నేను చేసిన‌వి రెండు సినిమాలే. ఇంకా చాలా చేయాలి. చాలామందితో ప‌నిచేయాలి. అప్పుడే బాలీవుడ్ గురించి ఆలోచిస్తా.

* ఎన్టీఆర్ ఏమైనా స‌ల‌హాలిచ్చారా?  ఆయ‌న‌తో ప‌నిచేయ‌డం ఎలా అనిపించింది?
-  నా రెండో సినిమానే ఎన్టీఆర్‌తో చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నా. ఆయ‌న ఎన‌ర్జీ లెవెల్స్ సూప‌ర్. సినిమాకి సంబంధించి అన్ని విష‌యాల్లోనూ ఆయ‌న‌కు పూర్తిగా అవ‌గాహ‌న ఉంది. త‌న పాత్రే కాదు.. అన్ని పాత్ర‌లూ బాగా ఉండాల‌ని కోరుకొంటారు. సినిమా కోసం ఏమైనా చేస్తారు. ఎన్టీఆర్ తో మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌నిచేయాల‌నిపిస్తోంది.

* తిక్క‌రేగితే అనే క‌థ సిద్ధం చేశార‌ట‌..
- అవునండీ. ఇది కూడా ఊర మాస్ క‌థే..

* ఎవ‌రికి చెప్పారు?
- అల్లు అర్జున్‌కి వినిపించా. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉంది.

* ర‌భ‌స సూప‌ర్ హిట్ అవ్వాల‌ని ఆశిస్తున్నాం.. మ‌రోసారి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు.
- థ్యాంక్సండీ..

వి.రాజా

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka