Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐ.ఏ.ఎస్ పాస్

జరిగిన కథ: కిట్టు మళ్ళీ పరీక్షలకోసం తన భార్య, పుట్టబోయే పిల్లడ్ని కూడా చూడకుండా మనోనిబ్బరంతో చదువుతాడు. పరీక్షలు అయిపోగానే వెంటనే వాళ్ళను చూడడానికి భీమవరం వెళతాడు. ఈ సారి రాసిన పరీకషలో కిట్టు విజయాన్ని సాధిస్తాడు. ఇక మిగిలింది... పర్సనాలిటీ టెస్ట్.. ఈ టెస్ట్ కు సంబంధించి విషయాలు అన్నీ తెలుసుకుంటాడు కిట్టు.

పరిస్థితి ఎంత దారుణమంటే ఆ కాలువ నీరు నల్లని తారులాగా తయారైంది. ఆ నీటిలో చెయ్యి పెడితే చెయ్యి అంత మేరకు మాడి మసైపోతుంది. ఎవరు చేసారిలా?ఏమో!

హైద్రాబాద్, బేగం పేట ఫ్లై ఓవర్ దగ్గరకు రాగానే ఏదో ఒక గాఢమైన రసాయనం వాసన మనిషిని కమ్మేస్తుంది. తల తిరుగుతుంది. కళ్ళవెంబడి నీళ్ళొస్తాయి. స్పృహ తప్పినట్టు అవుతుంది.

ఎవరు? ఎవరీ విష వాయువుని ఇంత ఫ్రీగా ప్రజల మీదకు వదులుతున్నారు? ఏమో ! ఎవరికి తెలుసు? మళ్ళీ పర్సనాలిటీ విషయానికొస్తే ఏమి ప్రశ్నలు వేసారు..అని సరిగ్గా వినాలి/విద్యార్థికి ఆ సమయంలో ఆతృత ఆందోళన ఉంటాయి. దానితో ప్రశ్న సరిగ్గా వినక, సమాధానం ఇంకోటి చెబుతాడు. అది మంచిది కాదు. సమాధానం తెలిసింది చెప్పాలి. తెలియకపోతే తెలియదని చెప్పాలి. చూచాయగా తెలిస్తే..అదే విషయం చెప్పి, ప్రయత్నించమంటారా..అని అడిగి, వాళ్ళు ఓకే అంటే అప్పుడు రాయి విసరవచ్చు. అంతే గానీ తెలియకపోయినా తెలిసినట్లుగా మసిపూసి మారేడుకాయ చేసి, ఎదుటి వాళ్ళను ఫూల్ చేద్దామనుకుంటే మనమే ఫూల్స్ అవుతాము.

ప్రశ్నకి సమాధానం తెలుసు కదాని లొడలొడా వాగకూడదు. సరిపడినంత చెప్పాలి. ప్రశ్నించిన వారిని ఎదురు ప్రశ్నించకూడదు.
మనం చదివిన డిగ్రీని ప్రభుత్వ పాలనకు ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుని వెళ్ళాలి. సరే! ఒక పశువుల డాక్టర్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. పశువుల డాక్టర్ తన జ్ఞానంతో ప్రజలకి ఎలా మేలు చేయగలడు? పేద్ద సూది ఉన్న గేదెల ఇంజెక్షన్లు మనుషులకు ఇచ్చేస్తాడా?
పాడి పశువుల అభివృద్ధి శాఖ అనేది ఒకటుంది. అందులో కార్యదర్శిగా నియమించబడవచ్చు.అప్పుడు ఆ పదవికి జ్ఞానం ప్రత్యేకమైనటువంటి హుంద్దాని, విలువను కలిగిస్తుంది. దేశానికి ఉపయోగపడుతుంది. అదీగాక కలెక్టర్ గారు ఒక ప్రదేశంలో పని చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఆ జిల్లాల్లోని గ్రామాల్లో పశు సంపద వృద్ధి మనుషుల అభివృద్ధికి దోహదపడుతుంది. పాలు, పెరుగు, ప్రవహించే పల్లెలే దేశానికి తలమానికం. నేర్చుకున్న విద్య ఏదీ వృధా కాదు.

మనం ఎక్కడ పుట్టి పెరిగామో ఆ ప్రాంతంలోని సమస్యలను గుర్తించాలి. ఆ సమస్యకు తగిన పరిష్కార మార్గం సూచించగలగాలి. మనం పుట్టి, పెరిగిన ప్రాంతం యొక్క ప్రత్యేకతలను గుర్తుంచుకోగలగాలి.

మనం ఏ హాబీ సూచించామో ఆ హాబీ గురించి తెలుసుకుని ఉడాలి.  మనగురించి ఎదుటివాళ్ళకు తెలిసేది మనం నింపిన దరఖాస్తు ఫారం.
దాంట్లో ఏమేం నింపామో అది గుర్తుంచుకుని దానిమీద ప్రశ్నలు ఊహించవచ్చు.

మనం పర్సనాలిటీ టెస్ట్ జరిగే సమయానికి దేశంలోనూ, విదేశాల్లోనూ ఏమేం సంచలనాత్మక, చారిత్రాత్మక ఘట్టాలు నడుస్తున్నాయో తెలుసుకుని వాటికి సాధ్యమైన పరిష్కారాన్ని సూచించగలగాలి.

ఒక అభ్యర్థి పేరు కామరాజు. అతని పేరు గురించి ప్రశ్నించారు. అభ్యర్థి తయారుగానే ఉన్నాడు. వాత్సాయనుడు రచుంచిన కామసూత్రం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.

అదేగాక దర్మార్థ కామమోక్షాలనే పవిత్రమైన నాలుగు ధర్మములలో నాపేరు కూడా చోటు చేసుకుంటుది. అని చెప్పాడు.
చెప్పే సమాధానాలలో స్పష్టత ఉండాలి. అయ్యుండచ్చు, కాకపోయుండచ్చు అనకూడదు.

నసుగుడు పనికి రాదు.

అన్ని ఇంటర్వ్యూల లాంటిది కాదు యూపీయస్సీ పర్సనాలిటీ టెస్ట్. అక్కడ ప్రశ్నలు అడిగేవాళ్ళు బిగిసిపోయి ఉండరు. అభ్యర్థిని భయపెట్టరు. సాధ్యమైనంతవరకు అభ్యర్థిని కూల్ గా ఉంచడానికే ప్రయత్నిస్తారు. అప్పుడప్పుడు జోకులు పేలవచ్చు.

కొంతమంది అభ్యర్థులు జోకుని గుర్తించలేరు. ఆ సందర్భం అలాంటిది. జోకుని గుర్తించి నవ్వగలగాలి. అలాగని హ్హహ్హహ్హ ఏం చెప్పారు సార్ అంటూ పగలబడి నవ్వకూడదు.

ఒక్కోసారి ప్రశ్న వేసేవారు కావాలని తప్పు ఉండేలా ప్రశ్న వేస్తారు. క్షమించండి అని చెప్పి ఆ ప్రశ్నలోని ఫలానా అంశం నాకు సరీయినదిగా అంపించడం లేదు అని మొదలుపెట్టి ఎందుకని మీరు విభేదిస్తున్నారో చక్కగా విశదీకరించాలి.

ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే రాజకీయవేత్తల దగ్గర పనిచేస్తున్న సమయంలో

రాజకీయవేత్తలు వాళ్ళకున్న అవగాహననిబట్టి ఈ పని నాకు చేసి పెట్టండి అని ఆర్డర్లు వేస్తుంటారు.

ఆ పనులు చేయగలిగినవైతే చేయాలి. కానీ రూల్సుకు వ్యతిరేకం అయితే ధైర్యంగా, గౌరవంగా..ఇది రూల్సుకు వ్యతిరేకం కాబట్టి మనం చేయడం మంచిది కాదు అని వివరించగలగాలి. ఈ ధైర్యం, స్థైర్యం లేకపోతే బతుకు బస్టాండే.

బోర్డు మెంబర్లతో మాట్లాడేప్పుడు వాళ్ళవేపు చూస్తూ మాట్లాడాలి. చూపులు తప్పించి దొంగ చూపులు చూడకూడదు. ఇందులో ఒక మెలిక ఉంది.మన భారత దేశంలో  తండ్రితో మాట్లాడేటప్ప్డు, మాస్టార్లతో మాట్లాడేటప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా మాట్లాడం మనం.అది మన దృస్టిలో తప్పే...ముఖ్యంగా పల్లెల నుండి వచ్చిన వాళ్ళకు సూటిగా పెద్దవాళ్ళవైపు చూసి మాట్లాడడం చాలా ఇబ్బందికరం. కానీ తప్పదు.
చూపుల్లో వాడి చూపులు, వేడి చూపులు, సూటిగా చూడడం, మింగేసేటట్టు చూడడం, వేళాకోళంగా చూడడం ఇలా చాలా రకాలున్నాయి. చల్లని చూపు అనేదొకటుంది. అది జ్ఞాపకం తెచ్చుకుని అద్దంలో దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. చూపులు తప్పిస్తే ..వీడికి కాంఫిడెన్స్ లేదు అనుకుంటారు. దొంగవెధవ అని కూడా అనుకోవచ్చు. గవర్నమెంట్ గురించి ప్రశ్నలు వచ్చినప్పుడు ..పంచ ఎగ్గట్టుకుని పొగిడేయవలసిన అవసరం లేదు.సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ పథకాలను మెచ్చుకుంటూ అందులో ఉన్న లోపాలను సున్నితంగా ఎత్తి చూపి, వాటిని సవరిస్తే ఇంకా బాగుంటుందని చెప్పగలగాలి.

ప్రతీ నాణేనికి రెండు వైపులుంటాయి.

అందుకని వేసిన ప్రశ్నని రెండు వైపులా సరిసమానం చేసి సమాధానాలు చెప్పాలి. అని కొంతమంది తప్పుడు సలహాలు ఇస్తారు.
నిజమే.

తక్కెడ సూత్రం మంచిదే. కానీ ఎప్పుడు? వేసిన ప్రశ్న తక్కెడ సమాధానానికి అనువైనది అయితేనే. ఉదాహరణకి కాశ్మీర్ గురించి చాలా గొడవ జరుగుతుంది కదా దాన్ని ఏం చేద్దాం?

కసాబు బాబుని ఉరి తీయాలా? వద్దా?

ఇలాంటి ప్రశ్నలకు తక్కెడ పనికి రాదు.

రాముడి బాణం లాగా సమాధానం రావాలి. బాణం దెబ్బకి తల తెగి తాటిపండులాగా దబ్బున కింద పడాలి. బోర్డు వాళ్ళు కోరుకునేది కూడా అదే.

ఎందుకంటే...

ఒక ఉనంతాధికారిగా ఉండి, చేతిలో కాల్చి పారేసే అధికారం పెట్టుకుని,అల్లరి మూకలు పెట్రేగిపోతున్నా రౌడీలు, గుండాలు రెచ్చిపోతున్నా, అమాయకుల ప్రాణాలు పోతున్నా..తక్కెడ వేసి తూసుకుంటూ కూర్చోకూడదు. తెగువ, తెంపరితనం కావాలి. దుర్మార్గుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేసే...దమ్ముండాలి.

ఆ తర్వాత మనం చదివిన రెండు సబ్జెక్టుల్లో పట్టు ఉండాలి. వాటిల్లో అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పగలగాలి. చదివిన సబ్జెక్టులను ఉపయోగించగలగాలి.

చివరగా..కనీసం నువ్వు ఊహించని ప్రశ్నలు కూడా పడవచ్చు.పిడుగు లాంటి ప్రశ్నలకి సిద్ధంగా ఉండాలి. ఇలా చాలా విషయ సేకరణ చేసాడు కిట్టు.

హస్తినాపురం...

న్యూధిల్లీ...

భారతదేశ రాజధాని...

ఆ రాజధాని నగరంలో " ఆంధ్రా భవన్ "

" ఆంధ్రా భవన్ " లో భోజనం చేస్తుంటే ఏదో సొంత ఊర్లో ఉనంట్టే ఉంటుంది.

అందరూ తెలుగు వాళ్ళే....

ఆనందంగా ఉంటుంది...

" ఆంధ్రా భవన్ " లో " యూపీయస్సీ పర్సనాలిటీ టెస్ట్ " కు వచ్చే విద్యార్థులకు ఒక గది ఇస్తారు.

కిట్టు వెళ్ళేటప్పటికి రూములో నలుగురు ఉన్నారు. ఎక్కడ వీలుంటే అక్కడ సర్దుకుని అదే రూం లో ఉన్నారు. ఈ లోపు ఫోన్లు వస్తున్నాయి. సీనియర్ అయ్యేయెస్, ఐపీ ఎస్ ఇతర ఉన్నతాధికారులు ఫోన్లు చేస్తున్నారు. ఎవరైనా ఫోన్ ఎత్తితే బాబూ..నీ ఇంటర్వ్యూ ఐపోయిందా..? ఏం ప్రశ్నలడిగారు?

అని తెలుసుకుంటున్నారు.ఈ వివరాలు తెలుసుకుని పర్సనాలిటీ టెస్ట్ కోసం రెడీగా ఉన్న తమ పిల్లలకో,చుట్టాలకో చెప్పడానికన్నమాట. ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకోవడానికన్నమాట.

బయల్దేరేముందు బట్టలు,బూట్లు, హైద్రాబాద్ లో కొనుక్కున్నాడు కిట్టు.

కిట్టు అభిప్రాయం ప్రకారం నల్లగా ఉన్నవాళ్ళు లేతరంగు చొక్కాలు వేసుకోవాలి.

లేత నీలం, లేత పసుపు ( లెమన్ కలర్ అంటారు ) లాంటివి వేసుకుంటే ఎండకి అవి మెరిసి, ఆ మెరుపు కొంచెం మొఖం మీద పడి బ్రైట్ గా కనబడే అవకాశం ఉంది.

" నీగ్రో " లాగా ముఖం పెట్టుకుని, ఎర్రటి ఎరుపు, ధగధగలాడే పసుపు, నలుపు వాడితే అసహ్యంగా ఉంటుంది.

కనీ విచిత్రంగా నల్లగా ఉన్నవాళ్ళు ఈ ధగధగలాడే రంగులే వేసుకుంటుంటారు.

దాని వెనక ఉండే సైకాలజీ దానికి ఉండే ఉంటుంది.

ఏది ఏమైనా కిట్టు మాత్రం చక్కని లెమన్ కలర్ చొక్కా, బ్లాక్ కలర్ ప్యాంట్ కొనుక్కున్నాడు. ఆ చొక్కాకి సరిపడేలా కొంచెం పసుపు ఎక్కువ ఉన్న చిన్న చిన్న గళ్ళ టై కొనుక్కున్నాడు.

బాగుందా, లేదా? మ్యాచ్ అయిందా, లేదా?? ఒకళ్ళయితే సరిగా చెప్పరని నలుగురైదుగురినీడిగి వాళ్ళు ఓకే అన్నాక సంతృప్తి పడ్డాడు. నల్లటి బూట్లు మరీ మెరుపు లేకుండా ఉన్నవి సెలెక్ట్ చేసుకున్నాడు.తగిన బెల్ట్, సింపుల గా కంపించే హెయిర్ కట్ " ఫెమినా బ్లీచ్ "కొనుక్కుని బ్యాగ్ లో పెట్టుకున్నాడు. బండెక్కేముందు అమ్మానాన్నలను హైద్రాబాద్ రావాల్సిందేనని పట్టుబట్టి రప్పించి, వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టాడు. కిట్టుకి తల్లిదండ్రుల కాళ్ళకు నమస్కరించడమనే అలవాటు లేదు. ఎప్పుడూ చేయలేదు. కానీ...ఎందుకో తెలియదు, కిట్టుకి బలంగా అంపించింది. నాన్నగారు చిరాగ్గానే ఆశీర్వదించారు. ఈ సివిల్స్...ఇలాంటి పరీక్షలంటే నాన్నగారికి ఒళ్ళుమంట. అమ్మ, జాగ్రత్త నాన్నా అంది. మిగిలిన భార్యా,బిడ్డ, వదిన, మిత్రులు అందరికీ చెప్పాడు.

జేబు తడుముకున్నాడు. గిరిధర్ ఇచ్చిన పదివేలు, బొంబాయి నుండి ట్రాన్స్ ఫర్ అయ్యి, హైద్రాబాద్ వచ్చిన ' కనకరాజుగారు ' అడక్కుండానే పిలిచి బలవంతంగా జేబులో కుక్కిన నాలుగు వేలు..వాటితోబాటు ఆయన చెప్పిన మంచి మాటలు..

ఇక బండెక్కేసాడు.

రేపు ఇంటర్వ్యూ ( పర్సనాలిటీ టెస్ట్ ) అనగా ముందురోజు రాత్రి8 గంటలకు " ఆంధ్రా భవన్ " రూం లోని బాల్కనీ లోకి వెళ్ళి బస్కీలు తియ్యడం మొదలు పెట్టాడు. బస్కీలు, గుంజీలు తీయడం, వీళ్ళని చూసి ఇంకోడు రెచ్చిపోయి కరాటే అంటూ హూ..హా అని కాళ్ళూ చేతులూ విసరడం మొదలు పెట్టాడు.

ఇలా ఒక గంట్ గందరగోళం తర్వాత అసలిదంతా ఎందుకు వచ్చింది అని ఎంక్వైరీ చేస్తే...మూల కారణం కిట్టు ...కిట్టుని అడిగారు ఏమిటి సంగతి అని...

కిట్టు మొదలెట్టాడు.

నీ హాబీ ఏమిటని అడుగుతారు కదా! అక్కడ నేను బాడీ బిల్డింగ్ అని రాసాను. అందరూ సాధారణంగా పాటలు వినడం, పుస్తకాలు చదవడం, క్లాసికల్ సంగీతం, సినిమాలు చూడడం లాంటివి రాస్తారు. వీటన్నిటికంటే భిన్నంగా ఉండడం కోసం నేను బాడీ బిల్డింగ్ అని రాసాను. మరి బాడీ బిల్డర్ అంటే చూడగానే మనిషి దిట్టంగా కనబడాలి కదా ..మనం అక్కడ రాసింది నిజమే అని అడక్కుండానే నన్ను చూడకుండానే తెలియాలి కదా..ఎవరైనా కొత్త మనుషులు ఎదురు పడగానే ముందుగా ముఖం చూస్తారు. ఆ తర్వాత కనబడేది ముఖం, చాతీ, భుజాలు..రాత్రి పడుకునే ముందు కసరత్తు చేస్తే చాతీ కండరాలు బిగుసుకుంటాయి...నిద్రలో విశ్రాంతి దొరికి పొద్దుటికి పొంగి..ప్రస్పుటంగా కనబడతాయి.అని వివరించాడు కిట్టు.

కొందరు ఏడిసావులే అన్నట్టు చూసారు. కొందరుయ్ బాగానే ఉందే అన్నట్టు చూసారు.

వీళ్ళని పట్టించుకోకుండా బాత్రూం లో దూరాడు కిట్టు.బాత్రూం లో దూరిన వాడు బయటకు రావడం లేదు. పదినిముషాల పైనే గడిచిపోయింది...

దబ దబ బాత్రూం తలుపులు కొట్టారు కొందరు...

కాసేపటికి బాత్రూం తలుపులు తీసాడు కిట్టు. అందరూ కిట్టు వైపు చూసారు...

కిట్టు ముఖం మీద ఏదో క్రీం రాసుకుని ఉన్నాడు. తెల్లగా సున్నం కొట్టినట్టుగా ఉందా క్రీం.

ఎదురుగా ఫెమినా బ్లీచ్ డబ్బా ఉంది. ఇదేమిటి? ఫెమినా బ్లీచ్ ఏమిటి?? ఆడదాన్లాగా ఈ పిచ్చి పన్లేంటి? అన్నారు. కిట్టు ముఖం కడుక్కుని వచ్చి ఇలా అన్నాడు.

' నా ముఖ కవళికలు అంతంతమాత్రం..దానికి తోడు చక్కని నలుపు. సడన్ గా కొత్తవాళ్ళు చూస్తే సదభిప్రాయం కలగకపోవచ్చు. ముఖ కవళికలను నేను మార్చలేను. నలుపు రంగు కూడా మార్చలేను. కానీ ఫెమినా బ్లీచ్ వాళ్ళు ఇచ్చిన సూచన ప్రకారం వాడితే కొంచెం మెరుపు వస్తుంది ముఖానికి రేపటి నా ఇంటర్వ్యూకి ముఖం పై ఈ కొద్దిపాటి సదభిప్రాయం కలిగినా నాకు రెండు మార్కులు వచ్చినట్టే కదా...ముందుగా శరీర లక్షణాల పరీక్ష ' అనుకోకుండానే ' శర వేగం తో జరిగిపోతుంది.ఆ తర్వాత ' మనసులోని పర్సనాలిటీ ' మాటల్లో తెలుస్తుంది.

ఇంటర్వ్యూ ( పర్సనాలిటీ టెస్ట్ ) జరిగే గది ముందు కుర్చీలు వేసి ఉన్నాయి. చాలామంది విద్యార్థులు కూర్చుని ఉన్నారు.
కిట్టు కూడా వాళ్ళతో కూర్చున్నాడు. మెడదగ్గర టై సర్దుకున్నాడు.

కిట్టుకి టై కట్టుకోవడం రాదు. రూం లోని వాడినొకడిని బ్రతిమాలి వాడితో టై కట్టించుకున్నాడు. వచ్చిన వాళ్ళు కొంతమంది చాలా కాంతిమంతమైన ముఖాలతో, సూట్లు, బూట్లతో గొప్ప ఇంటి బిడ్డల్లాగా మెరిసిపోతున్నారు. ఒకళ్ళకొకళ్ళు బాగా తెలిసిన వాళ్ళలాగా ఇంగ్లీష్ లో ధారాళంగా మాట్లాడుకుంటున్నారు. ఆడవాళ్ళుకూడా రకరకాల వేషధారణతో కాంతివంతంగా మెరిసిపోతున్నారు. చిన్నప్పట్నుంచీ కాన్వెంట్ చదువులు. పెద్ద పెద్ద యూనివర్సిటీల్లోనో, కాలేజీల్లోనో చదివిన వాళ్ళు వీళ్ళు అని చూడగానే చెప్పవచ్చు. ఇంతలో కిట్టు పేరు పిలిచారు.

తలుపు కొద్దిగా తీసి పట్టుకుని, మనిషి సగం పైగా లోపలికి వెళ్ళిపోయి ' మే ఐ కమిన్ సర్ ' అన్నాడు కిట్టు. లోపల వాళ్ళు కిట్టుని పట్టించుకోవడంలేదు...

ఎవరి ధ్యాసలో వాళ్ళున్నారు.

చైర్మన్ సీటులో ఉన్నాయన ఏదో రాసుకుంటున్నాడు.

ఆయన పక్కనే సిక్కు ముసలాయన సీట్లో జారగిలబడి నిద్రపోతున్నట్లున్నారు.

ఆ పక్కనే ఒక లేడీ ..ప్రొఫెసర్ లాగా కంపిస్తుంది.

ఆ తర్వాత ఇంకో ఇద్దరు ఉన్నారు.

ఆఖరికి సిక్కు ముసలాయన కిట్టుని చూసి,

చేత్తో " రారా.. బాబూ..అక్కడేం చేస్తావు? " అన్నట్టుగా సైగ చేసాడు.

కిట్టు తన కోసం వేసిన కుర్చీ దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు.

సరిగ్గా చైర్మన్ గారి ముందున్నదా కుర్చీ.

రాసుకుంటున్నాయన తలెత్తి చూసి, ప్లీస్ బీ సీటెడ్ అన్నారు.

కిట్టు సీట్లో నిటారుగా కూర్చుని, రెండు అరచేతులూ తొడలపై పెట్టుకున్నాడు. రూము చల్లగా ఉంది...ఎయిర్ కండీషనర్ రూము అది. కింద నేల మీద కార్పెట్ వేసి ఉంది..ముందుగా సిక్కు ముసలాయన ఇంగ్లీష్ లో మొదలెట్టాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
26th episode