Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
27th episode

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

జరిగిన కథ:  రాజనాల బ్రాంచి మేనేజర్ ను తీసుకుని ఏకాంబర్ ఇంటికి వస్తాడు. ఏకాంబర్ తండ్రి వాళ్ళతో అన్ని విషయాలు చర్చిస్తాడు. ఏజేంటు  కావాలంటే మీసపోర్ట్ కావాలి, కొంత డబ్బు  కావాలి అని బ్రాంచి మేనేజర్ అనగానే పీతంబరం తన దగ్గర లేవని చెపుతాడు. ఇదంతా వింటోన్న పర్వతాలు తన దగ్గర వున్న బంగారాన్ని ఏకాంబర్ కు ఇచ్చి నువ్వు పాలసీలు కట్టు అని ధైర్యం చెపుతుంది. "చిన్నన్నయ్య తెచ్చాడమా! ఇప్పుడే ఇచ్చాడు. రెండు రోజులు పోయాక నువ్వే తీసుకుందువులే! ఈ రెండు రోజులన్నా నా మెడలో లేకపోతే వాడు బాధపడుతాడు" అంది పర్వతాలు.

"చిన్నన్నయ్య!... నిజమే !..." ఆశ్చర్యం గా అంది అలివేలుమంగ.

"అవును! అంత ఆశ్చర్యమెందుకు! ఇంట్లో ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ వాడు తెచ్చినవే కదా! గర్వంగా అంది పర్వతాలు.

"అవంటే ఏదో పోటీలో వచ్చాయన్నాడు కదా! ఇదీ అలాగే బహుమతిగా వచ్చిందా?!" ఆశ్చర్యంతో కళ్ళింత చేసుకుని అంది అలివేలుమంగ.

"పోటీలో కాదు, ఏడాది పొడుగునా వచ్చిన 'కమీషన్ కూడబెట్టి కొన్నాడట" సంతోషంగా చెప్పింది పర్వతాలు.

"నీ చైను ఇచ్చావు కదమ్మా! అందుకే కొన్నాడేమో?!" ఎలాగైతేనేం అన్న కొన్నదేగా! అది నాకే!" ఆశగా అంది అలివేలు.

"అలాగేలేవే తల్లీ! రేపు చిన్నన్నయ్యకి ఏదో హోటల్లో సన్మానం వుందట కదా! అప్పుడు నువ్వేసుకుందువుగానీ' కూతురుని ఆప్యాయం గా దగ్గరకు తీసుకుని అలివేలుమంగ మెడలో వున్న కొత్త గొలుసు తడిమి చూస్తూ అంది ఆమె.

"పెద్దన్న ఇన్నాళ్ళ నుండి ఉద్యోగం చేస్తున్నాడు. ఒకటీ కొనలేదు. రానీ అడుగుతాను" మురిపెం గా అంటూ తల్లి మీద గోముగా వాలిపోయింది అలివేలుమంగ.

"పెద్దన్నకేమే ! పెద్ద ఉద్యోగం. వస్తున్నాడు కదా! నీకూ నాకూ మంచి ఖరీదైన వస్తువులు కొని తెస్తాడు చూస్తుండూ" ఆనందంగా అంది పర్వతాలు.

"నిజమేనమ్మా! చిన్నన్నే అయిదు తులాల బంగారం కొన్నాడంటే పెద్దన్న అంతకు రెట్టింపుదే కొంటాడు" ఆశగా అంది అలివేలుమంగ.
"అ..వు..ను.." కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్న ఆమె కళ్ళల్లో ఏదో అవ్యాజమైన ప్రేమాభిమానాలు ద్యోతకమయ్యాయి.

"అన్న వెళ్ళి ఎన్నాళ్ళయిందో?! ఏడాది కానవస్తోంది. మళ్ళీ ఇదే కదా రావడం!" పెద్దన్నని గుర్తు చేసుకుంటూ అంది అలివేలుమంగ.

"నెలా నెలా నాన్నకి కూడా పైకం పంపటం లేదు కదా! అంతా కూడేసి ఒక్కసారే ఇస్తాడేమో కదా!" కళ్ళల్లో వెలుగులు నింపుకుంటూ అంది పర్వతాలు/

"అవునమ్మా! నువ్వన్నది నిజమే! నాకూ ఏదైనా కొనే వుంటాడు" ఉప్పొంగిపోతూ అంది అలివేలుమంగ.

"సరిసరీ.. రేపు చిన్నన్నకి సన్మానం కదా! మంచి బట్టలు తీసి వుంచు. నేను పండక్కి మీ నాన్నగారు కొన్న చీర తీసి కట్టుకుంటాను. అన్నయ్య వస్తే ఇక తీరిక వుండదు. వాడితో కబుర్లతోనే రోజంతా గడిచిపోతుంది. వెళ్ళు" కూతురితో అంటూనే అలివేలుమంగ మెడలో వున్న గొలుసు తీసుకుంది పర్వతాలు.

"ఉండనియ్యామా!... ప్లీజ్!" మారాం చేస్తూ మెళ్ళో గొలుసు తీసింది.

"చిన్నన్న ఇచ్చాడని నాన్నగారు చూసేవరకైనా నా మెడలో వుండనివ్వవే తల్లీ! పెద్దన్న నీ   కోసం తెస్తాడు కదా! తొందరెందుకు?!" అంటూ పెద్ద కొడుకు కోసం ' ఏం కూర వండాలో ' అని ఆలోచిస్తూ వంట గదిలోకి వెళ్ళిపోయింది పర్వతాలు.

"పెద్దన్నయ్య సాఫ్ట్ వేర్ ఇంజనీర్. లక్షల్లో జీతం. రెండేళ్ళయిపోతోంది జాబ్ లో జాయిన్ అయి.

అమ్మకి, తనకి తప్పకుండా బంగారం వస్తువులే తెస్తాడు ... తప్పకుండా తెస్తాడు."

మనసులోనే అన్న రాక కోసం ఆశగా ఎదురుచూస్తూ అతను తీసుకురాబోయే వస్తువుల్ని ఊహించుకుంటూ గదిలోకి వెళ్ళింది అలివేలుమంగ.

విశాఖపట్నం లోనే పేరొందిన స్టార్ హోటల్.

సాయంత్రం అయిదవుతోంది. ఇన్స్యూరెన్స్ ఏజెంట్లంతా బైక్ల మీద, కార్లలోనూ వస్తున్నారు. హోటల్ ప్రవేశ ద్వారం దగ్గరే బ్రాంచి మేనేజర్, బ్రాంచిలో పని చేస్తున్న డెవలెప్ మెంట్ ఆఫీసర్లంతా తమ తమ ఏజెంట్లను సాదరం గా ఆహ్వానిస్తూ నిలబడ్డాడు.

ఒక్కో డెవలెప్ మెంట్ ఆఫీసర్ అండర్ లో ఏభై, అరవై మంది దాకా ఏజెంట్లు వుంటారు. అందులో సీనియర్లు, జూనియర్లు అయిన కొత్త, పాత ఏజెంట్లందరూ వస్తున్నారు.

రాజనాల రాజేంద్ర కొత్తగా ఉద్యోగం లో జాయిన్ కావడం వలన పదిహేను మందిని ఏజెంట్లను చేర్చుకోలేకపోయాడు. అయితే అందరిలో ముందున్న ఏకాంబర్ ఒక్కడే రాజనాల టర్గెట్ ని పూర్తి చేసేస్తున్నాడు. పైపెచ్చు అన్ని పోటీల్లోనూ ముందుంటున్నాడు.

సమావేశానికి వస్తున్న ఏజెంట్లందరికీ నవ్వుతూ ఆహ్వానం పలుకున్నారు బ్రాంచ్ సిబ్బంది. హోటల్లోనే ఓ మూలగా ఉన్న మీటింగ్ హాల్ చూపిస్తూ ఏజెంట్లందరికీ అందంగా ఉన్న గులాబీ పువ్వు అందిస్తున్నారు.

హాలంతా నిండిపోయింది. బయట ఉన్న బ్రాంచ్ మేనేజర్, డెవలప్ మెంట్ ఆఫీసర్లంతా హాల్లోకి వచ్చి కూర్చున్నారు.

ప్రత్యేక ఆహ్వానితులు, అతిథులు, కూడా వచ్చేసారు. జోనల్ మేనేజర్, డివిజనల్ స్థాయి అధికారులు అందరూ వచ్చి ముందు వరసలో కూర్చున్నారు.

సమావేశం ప్రారంభించడానికి బ్రాంచ్ మేనేజర్ వేదికనెక్కి మైక్ చేతిలోకి తీసుకున్నాడు.

" మై డియర్ ఫ్రెండ్స్ ! ఈరోజు మనందరి ఆనందోత్సవ దినం మీ అందరి విజయం. అయితే, అందులో కొందరు ముందుంటారు.కొనదు వెనకుంటారు ఇది పరుగుల పందెం. ఒకసారి ఒకరు, మరొకసారి మరొకరు అతన్ని దాటి ఒకడుగు ముందుకేస్తారు. ప్రతి ఒక్కరి ధ్యేయం ఒక్కటే కావాలి. తన మున్ దున్న వారిని దాటి మనం ముందుండాలి. అప్పుడు మీరు ఎదుగుతారు. మన ఇన్స్యురెన్స్ కంపెనీ కూడా అనుకున్న ఫలితాలను సాధిస్తుంది.

మీకు తెలుసు. ఒకప్పుడు మనమే ఈ రంగంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు ప్రభుత్వ సరళీకృత విధానాల వలన ఎన్నో ప్రైవేటు ఇన్స్యురెన్స్ కంపెనీలు ఈ రంగంలో అడుగుపెట్టాయి. పోటీ పెరిగింది. ఒకర్నొకరు నెట్టుకు పరిగెట్టాలనే కసి పెరిగింది. రోజుకో కొత్త ఇన్స్యురెన్స్ కంపెనీలు వస్తున్నాయి. అయితే అన్నిటి ధ్యేయం ఒక్కటే ! ప్రతి పౌరునికీ జీవిత బీమా కల్పించడం, ప్రతి కుటుంబానికీ ఆర్ధిక రక్షణ తద్వారా జీవిత భద్రత అందివ్వడం.

ఇది ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే! ఇలాంటి పోటీ వాతావరణంలో మన బ్రాంచి ఏజెంట్లకు ప్రోత్సాహకరమైఅన పోటీలు పెట్టి మూణ్ణెల్లకోసారి ఇలా స్మావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నదే మన కంపెనీ ఆలోచన. ఏడాది చివరలో ఇలాంటి స్టార్ హోటల్లో విందు వినోదాలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ ఏడాది అత్యధికంగా ఇన్స్యూరెన్స్ వ్యాపారం చేసిన ఏజెంట్లలో టాప్ టెన్ క్యాటగిరీలో ఉన్న పది మందికి సముచిత రీతిలో సన్మానించాలని మన కంపనీ నిర్ణయం. వారితోపాటు పోటీ పడి చేయించిన ఏజెంట్ మిత్రులందరికీ అభినందన పురస్కారాలు అందజేయబడుతుంది "

అంటూ వేదిక మీదకు జోనల్ మేనేజర్ ని, డివిజనల్ స్థాయి అధికారులైన మార్కెటింగ్ మేనేజర్ ని పరిపాలనాధికారులను ఆహ్వానించాడాయన.

అతిథులందరూ వేదిక మీద ఆసీనులు కాగానే సభ ప్రారంభమైంది.

ఇన్స్యూరెన్స్ అధికారులంతా జీవిత బీమా పాలసీల గురించి చెప్తూ ఏజెంట్లు పాలసీదారులతో ఎలా మెలగాలో, ఎలా ఎదగాలో చెప్తూ ఏజెంట్లందరినీ కార్యోన్ముఖులను చెయ్యడానికీ ఎన్నో రకాలుగా ఉపన్యాసాలు దంచేసారు.

చివరగా ఆ ఏడాది బాగా ఇన్స్యూరెన్స్ చేసిన టాప్ టెన్ ఏజెంట్ల గురించి చెప్తూ ప్రసంగించాడు బ్రాంచ్ మేనేజర్.

" మీ అందరకీ తెలుసు. మన బ్రాంచ్ లో కొత్తగా జాఇనయిన ఒకే ఒక ఏజెంట్ రాకెట్ లా దూసుకుపోతున్న విషయం. నిన్న మొన్నటి వరకూ మన బ్రాంచికే టాప్ ఏజెంట్లయిన ఏజెంటు గోపాలరావు, ఏజెంటు శంకర్రావు లాంటి వాళ్ళందరితో పోటీ పడి ముందు వరుసలో నిలబడ్డ ఏజెంటు ఎవరో కాదు" అంటూ ఏజెంట్లతోనూ, వాళ్ళ బంధువులతోనూ కళ కళలాడుతున్న సభకేసి చూసాడు నవ్వుతూ.
అప్పటికే ఆయన ప్రసంగిస్తుంటే సభలో కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. అందరూ ఆనందంగా ఆగకుండా చప్పట్లు కొడుతూనే వున్నారు. సభలో వున్న ఏజెంట్ల తాలూకా బంధువులందరూ ఆశ్చర్యంగా ఎవరా ఏజెంటు?" అన్నట్టు సభలో కూర్చున్న అందరికేసి మార్చి మార్చి చూస్తూ చప్పట్లు కొడుతున్నారు.

'అవును, ఈ ఏడాది టాప్ టెన్ లో మొదటి స్థానం కైవసం చేసుకున్న ఏజెంటు ఏకాంబర్ .. ప్లీజ్ వెల్కం టు ది డయాస్!" గట్టిగా అరిచి చెప్పాడు బ్రాంచి మేనేజర్.

అంతే!

హాలు హాలంతా చప్పట్లతో మారుమోగిపోయింది. వెనుక ఎక్కడో ఓ మూల తల్లితండ్రులతో పాటు కూర్చున్న ఏకాంబర్ బెరుకు బెరుకుగా లేచి నిలబడి బిడియం తో రివటలా ఒంగిపోతూ నడిచి వెళ్ళాడు వేదిక వద్దకు.

ఏకాంబర్ అమ్మ, నాన్న, అన్న, చెల్లి నలుగురూ ఆనందంగా చప్పట్లు కొడుతూ పొంగిపోయారు. ఏకాంబర్ తల్లితండ్రులు పీతాంబరం, పర్వతాలు సంతోషం పట్టలేకపోతున్నారు. వేదిక వద్దకు వెళ్తోన్న కొడుకును చూస్తూనే ఉన్నారు. కళ్ళు మసకబారిపోయాయి. వారికి తెలీకుండానే కళ్ళల్లో ఆనందబాష్పాలు కట్టలు తెంచుకుంటున్నాయి.

"అమ్మా!.. నువ్వెందుకు ఏడుస్తున్నావ్? ఎవరైనా చూస్తే నవ్వుతారు. చూడు నీ బుగ్గల మీద కన్నీరెలా జారుతోందో" కూతురు అలివేలుమంగ తల్లిని చేత్తో గుద్దుతూ అంది.

'నేనా? ఏడుస్తున్నానా?!" అంటూ గబాలున బుగ్గలు తుడుచుకుంది పర్వతాలు.

స్టేజి మీద ఏకాంబర్ ని రాజా చైర్ లో కూర్చోబెట్టి సన్మానం చేసారు. జోనల్ మేనేజర్ శాలువా కప్పి మొమొంటో ఇచ్చాడు. డివిజనల్ మేనేజర్ మెళ్ళో దండ వెసాడు.

ఇతర ఇన్స్యూరెన్స్ సిబ్బంది ఏకాంబర్ కి సన్మానం చేస్తూ పూల రెక్కలు అక్షింతలుగా జల్లారు.

"మీ అందరికీ తెలుసా? ఈ రోజు ఏకాంబర్ ఈ స్థాయికి చేరుకోవడానికి వాళ్ళ అమ్మానాన్నలే కారణం.

ఇన్స్యూరెన్స్ పాలసీ సంపాదించడమే దుర్లభమైన ఈ రోజుల్లో ఏకాంబర్ ఒకే వారం లో దాదాపు వంద పాలసీలు సంపాదించాడు. అయితే అవి అన్నీ సేలరీ సేవింగ్స్ పాలసీలు మీకు తెలుసు, అవి సాధించడం ఒకెత్తయితే.. వాటి పాలసీ బాండ్లు కోసం, వాటి నెల వారీ రికవరీ కోసం ఎన్ని వ్యయ ప్రయాసలు పడాలో ...! అయితే, వీటన్నింటికీ కొండంత అండగా అతని తల్లితండ్రులతో పాటు మన డెవలప్ మెంట్ ఆఫీసర్ రాజనాల రాజేంద్ర కృషి కూడా మెచ్చుకోదగ్గది.

ఇక మున్ముందు కూడా ఏకాంబర్ ఇంతకంటే గొప్పగా ఎదగాలని కోరుకుంటూ అతన్ని అభినందిస్తున్నాను." అన్నాడు మేనేజర్.

ఆ తర్వాత వరుసగా ఏజెంట్లందరినీ  పిలిచి సన్మానించి అందర్నీ పేరు పేరున పొగడ్తలతో ముంచెత్తారు.

సమావేశం అయిన తరువాత భోజనాలు కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాటు చేసారు. అందరూ బారులు తీరి "ఐ ఫే" కౌంటర్ల ముందు నిలబడ్డారు.

"ఇలాంటి హోటల్ కి మనం రాగలమా    పర్వతం!" 'ఐ ఫే ' కౌంటర్ దగ్గరకు వెళ్తూ భార్య చెవిలో గుసగుసగా అన్నాడు పీతాంబరం.

"అవునండి, భోజనాలు చూడండి. ఎన్ని రకాలు, ఎవరు ఏం తింటే అది , మీరు ఈ రోజు నీచు తినేస్తారు కదా!" మొగుడ్ని మోచేత్తో గుద్దుతూ అడిగింది పర్వతాలు.

"అమ్మా! నేను ఈ రోజు చికెన్ తినేస్తాను. స్టార్ హోటల్ కదా! ఎలా వుంటుందో!" తల్లి పక్కనుండి ప్లేటు పట్టుకుని ఎన్వీ సర్వ్ చేస్తున్న ఐ ఫే కౌంటర్ దగ్గరకు నడిచింది అలివేలుమంగ. పెద్దన్న నీలాంబర్ కూడా చెల్లితోనే వెళ్ళాడు.

ఏకాంబర్ తనకి ఇచ్చిన మెమెంటో,పూలదండ, శాలువా పట్టుకుని ఒక పక్కన నిలబడ్డాడు.

తండ్రి పీతాంబరమే కొడుక్కి,తనకి రెండు ప్లేట్లలో బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ వడ్డించుకుని పట్టుకువచ్చాడు.

పర్వతాలు మాత్రం వెజిటేరియన్ కర్రీస్, బిర్యానీ వడ్డించుకుని వచ్చింది.

" ఒరేయ్ చిన్నా! అవి ఆ ప్రక్కనున్న బల్లమీద పెట్టరా! ఇదిగో ఈ పళ్ళెం తీసుకో ! " అంటూ తండ్రి తన దగ్గరకు భోజనం తెచ్చేసరికి ఏకాంబరం ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు.

తండ్రి చెప్పినట్టే ప్రక్కనే ఉన్న బల్లమీద దండ, బొకే, షీల్డ్, శాలువా పెట్టి తండ్రి ఇచ్చిన ప్లేటు అందుకున్నాడు.

ఈలోగా తల్లి, చెల్లి, అన్న అక్కడకు చేరుకున్నారు. అయిదుగురు కలిసి మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నారు.

ఏజెంట్లు, వారి బంధువులు అటుగా వస్తూ ఏకాంబర్ ని చూస్తూనే నవ్వుతూ పలకరిస్తూ కంగ్రాట్స్ చెప్తున్నారు.

భోజనం చేస్తున్న పీతాంబరం, పర్వతాలు చిన్నకొడుకుని అందరూ వచ్చి పొగుడుతూంటే మురిసిపోతూ భోజనం చేస్తున్నారు.
ఏకాంబర్ చెల్లి, అన్న పరిసరాలను గమనిస్తూ నెమ్మదిగా భోజనం చేస్తున్నారు. అలివేలుమంగ భోజనం చేస్తుందేగానీ కొంచెం దూరంలో ఐస్క్రీం కౌంటర్ దగ్గర ఉన్న క్యూకేసి, అక్కడ నిలబడి ఐస్క్రీం లు తింటున్న పిల్లలకేసి లొట్టలేసుకుంటూ భోజనం చేస్తోంది.

ఏకాంబర్ చెప్తున్నది శ్రద్ధగా వింటూ కూర్చున్నారు అందరూ. ఏ ఒక్కరూ తలలు దించలేదు. తలలు వాల్చలేదు. ఎంతో ఉత్సుకతతో చూస్తూ కూర్చున్నారు. ఏకాంబర్ గొంతు ఒక్కసారే ఆగిపోయేసరికి అందరూ ఏదో మత్తులో నుండి బయటకు వచ్చినవాళ్ళలా ఉలిక్కిపడ్డారు.

" ఏం సార్ ! ఏమైంది ? ఆపేసారు? " చటుక్కున అంది నూకరత్నం.

చిన్నగా నవ్వి అందరికేసి చూసాడు ఏకాంబర్.వాచీకేసి చూసాడు. ఒంటిగంట అయిపోతోంది. ఉదయం పదిన్నర నుండి అతను చెప్పుకు వస్తున్నాడు. ఒక కథలాగా చెప్పడం వలన అందరూ ఎంతో ఆతౄతగా ఉత్కంఠతో విన్నారు. ' తను చెప్పింది అందరి బుర్రల్లోకి దూరి టంకంలా అతుక్కుపోయే ఉంటుంది ' మనసులోనే అనుకున్నాడు

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
25th episode