Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
26th episode

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ

జరిగిన కథ:వరేణ్య త్రివిక్రం తో పాటు  చాంబర్ లోకి వస్తుంది. ఇద్దరి మధ్య వాదోపవాదాల అనంతరం  వరేణ్య, త్రివిక్రం ను అల్లుకుపోయి నువ్వే నా సర్వస్వం అని ఏడుస్తుంది.

ఈ సమస్యకు పరిష్కారం ఏమిటనేది త్రివిక్రమ్‌కి కనుచూపు దూరంలో ఏదీ కనిపించటంలేదు. ఆమె పూర్తిగా తనకు దగ్గరయిపోయిందని అర్ధమైపోయింది. తను మాత్రం? పైకి ఎంతగా దూరంగా వుండాలనుకుంటున్నా, మనసు ఆమె వశం అయిపోయింది ఎప్పుడో. ఆమె పెదవులు తన ఛాతిమీదచేస్తున్న ముద్దుల ముద్రలకు తన దగ్గర సమాధానం లేదని తెలిసి మానసికంగా నలిగిపోయాడతను. ఇంతలో ఫోన్‌ రింగయి, ఆ విచిత్ర పరిస్థితి నుంచి అతడ్ని రక్షించింది.

''వదులు ఫోన్‌ తీయాలి'' చెప్పాడు.

''ఫోన్‌గదా, రింగవనీ'' అంది అతడ్ని మరింత గాఢంగా అల్లుకుపోతూ.

''ప్లీజ్‌!'' అంటూ చిన్నగా ఆమెను విడిపించుకోబోయాడు.

కాని వదల్లేదామె.

తనే చేయి చాపి రిసీవర్‌ లిఫ్ట్‌చేసింది.

''హలో! ఎవరు కావాలి?'' అడిగింది.

''మీరెవరు?'' అవతలినుంచి మగ గొంతు వినిపించింది.

''వరేణ్య స్పీకింగ్‌.''

''వినోద్‌తో మాట్లాడాలి, అతని ఫ్రెండ్‌ త్రివిక్రమ్‌ని.''

ఓసారి ఫోన్‌వంక, త్రివిక్రమ్‌ వంక చూసి కౌగిలి వదిలేసి, రిసీవర్‌ అతడి చేతికిచ్చింది.

''మీ గుడ్లగూబ ఫ్రెండ్‌ లైన్‌లో వున్నాడు'' అంది.

తృళ్ళిపడ్డాడు త్రివిక్రమ్‌.

అవతల లైన్లో వుంది ఎవరో అర్ధమైపోయింది.

పాపం వినోద్‌, వరేణ్య కామెంట్‌ వినేవుంటాడు, తలను రిసీవర్‌తో కొట్టేసుకుంటాడు, అతడి ముఖం వూహించుకుంటేనే భయం వేసింది.

''హలో'' అన్నాడు

''ఆ అమ్మాయిచేత అన్ని మాటలనిపించడం అస్సలు బాగలేదు. ఎంతయినా నేను ఆమెకు కాబోయే మొగుడ్ని......... అవునా, కాదా?'' అవతలి నుంచి కోపంగా వినబడింది వినోద్‌ గొంతు.

వరేణ్య వంక చూసాడు. ఆమె తన వెనకచేరి కాలర్‌ లాగుతూ, జుత్తు నిమురుతూ అల్లరి చేస్తోంది పొరబాటున తను నోరుజారితే ఆమెకు డౌటు క్రియేటయ్యే ప్రమాదం వుంది.

''ఏమిటి కబుర్లు?'' పొడిగా అడిగాడు.

''ఇద్దరూ ఒకేచోట వున్నట్టున్నారు.''

''అవును......... అయితే?''

''ఏం జరుగుతుందక్కడ?''

''షటప్‌ కం టు ది పాయింట్‌.''

''వరేణ్యనాది. అర్ధమైందా? ఆ పిల్ల చనువుగా వుందని నువ్వు అడ్వాన్స్‌అయితే తర్వాత గొడవలయిపోతాయి ముందే చెప్తున్నాను.''

''నువ్వు అనవసరంగా నా సహనాన్ని పరీక్ష పెట్టకు, మేటర్‌ చెప్పు.''

''ఓ.కె. మేటర్‌ సీరియస్‌, సుధాకర్‌ నాయుడుగారు వస్తున్నారు.'' ''వ్వాట్‌?'' పక్కలో బాంబు పేలినట్టు ఉలిక్కిపడ్డాడు త్రివిక్రమ్‌. అవతల వినోద్‌ జరిగింది చెప్పాడు.

''ఇప్పుడే ఫ్లయిట్‌ దిగి టాక్సీలో ఆఫీసుకే వస్తున్నారాయన ఇక్కడ జగదాంబ సెంటర్‌ దగ్గర నన్ను చూసి ఆగి మాట్లాడారు. ఎలాగో మేనేజ్‌చేసి పంపించాను. నువ్వక్కడ వుండకు, ఆయన కంటబడకుండా వెంటనే జంప్‌ అయిపో.''

''నువ్వు ఎంట్రీ యిస్తున్నావా?''

''లేదు, లేదు. ఆదివారం మేచ్‌ చూసి వెళ్ళిపోయేవరకు మనిద్దరం ఒకేసారి  ఆయన కంటపడకుండా మేనేజ్‌చేస్తే మంచిది. నువ్వు అస్సలు ఆయన కంటపడకు, అదేమంచిది'' అంటూ వెంటనే లైన్‌ కట్‌చేసాడు వినోద్‌.

ఫోన్‌ పెట్టేసి వరేణ్య వంక చూసాడు త్రివిక్రమ్‌.

సుధాకర్‌నాయుడు వస్తున్నారనగానే అతడికి కంగారుగానే వుంది. కాని ప్రేమతో అతడి చుట్టూ తిరుగుతూ, అల్లరిచేస్తున్న వరేణ్య అతడిలో మార్పు గమనించలేదు. అందుకే మామూలుగానే ''ఏమంటున్నాడు మీ ఫ్రెండ్‌?'' అనడిగింది.

''అర్జంటుగా రమ్మంటున్నాడు. చిన్న ప్రాబ్లం. వచ్చాక చెప్తాను, సీ యు'' అంటూ ఇక ఆమె సమాధానంకోసం ఎదురుచూడకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు త్రివిక్రమ్‌. ఉన్నట్టుండి ఏమైందో వరేణ్యకి అర్ధంకాలేదు.

ఆఫీసు బయటికి వచ్చి త్రివిక్రమ్‌ని ఎవరూ గమనించలేదు, అతడు కారు తీసుకోలేదు గేటుదాటి రోడ్‌మీదికి వచ్చి ఆటోలో వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన అయిదో నిముషంలో సుధాకర్‌నాయుడు ప్రయాణిస్తున్న టాక్సీ ఆఫీసు ముందుకొచ్చి అగింది.

ఆయన దిగువన ఆఫీసులో అడుగుపెట్టగానే ఒక్కసారిగా సందడి, మేనేజరు మధుసూధనరావు పరుగులెత్తుకు వచ్చాడు. అక్కడ అందరితో మాట్లాడి, ఆయన పై అంతస్థుకు చేరుకోడానికి మరో పావుగంట అయింది.

సడెన్‌గా తన ఛాంబర్‌లోకి వస్తున్న తండ్రిని చూసి ఆశ్చర్యంతో తలమునకలయింది వరేణ్య.

''బేబీ! నేను వచ్చేసాన్రా. వినోద్‌ని అభినందించాలని, నిన్ను చూడాలని అన్పించి ఒక్కక్షణం కూడా వుండలేక, రెక్కలు కట్టుకుని వచ్చేసాను'' అంటూ చేతులు చాపాడాయన.

అంతే

ఒక్కదూకులో వెళ్ళి తండ్రిని కౌగిలించుకొని

చిన్నగా ఏడ్చేసిందామె.

ఆయన అశ్చర్యపోయాడు.

''ఏమిటి తల్లీయిది. చూడలేను, నీకంట్లో కన్నీరుచూసి భరించలేను. ఏమైంది?'' కంగారుగా అడిగాడాయన.

''మమ్మీ ఎందుకు రాలేదు?'' రుద్దకంఠంతో అడిగింది.

''తను వస్తానంది నేను వద్దన్నాను. అంతా ఒకేసారి వచ్చేస్తే అక్కడ ఎవరు చూసుకుంటారు. నిన్నే అక్కడికి తీసుకెళ్ళాలని వచ్చాను. ఇంతకీ ఎక్కడ? వినోద్‌ ఎక్కడ?''

''మీరు వచ్చేముందే వినోద్‌ ఫ్రెండ్‌ ఫోన్‌చేస్తే అర్జుంటుగా వెళ్ళాడు మీరు వస్తున్న సంగతి తెలీదుగదా'' అంటూ తండ్రిని వదిలి కన్నీరు తుడుచుకుంది.

ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు.

''ఎందుకు కన్నీరు, ఏమైందిరా?'' అనునయంగా అడిగాడు.

''ఆయనే............. అతన్ని అర్ధం చేసుకోడం నావల్ల కావటంలేదు'' అంది కొద్దిగా సిగ్గుపడుతూ.

''ఎవరు? వినోదా?''

''హూఁ!''

''కాడు అర్ధంకాడు, నాకు తెలుసు, మనిషి కంగారుగానీ, అతడిలో గొప్ప టాలెంట్‌ వుంది. అది గుర్తించేగా నీకు నచ్చితే పెళ్ళిచేద్దామని ప్రపోజ్‌ చేసాను. నీకు నచ్చాడా?''

''నచ్చాడు, ఐ లైక్‌ హిమ్‌.......... ఐ లవ్‌ హిమ్‌....... కాని అతనే .............ఎటూ తేల్చడు. కాసేపు నేనంటే ప్రాణంలా వుంటాడు. కాసేపు నా గురించే పట్టనట్టుంటాడు. నాకేమి అర్ధంకావటం లేదు. ఈ రోజుకీ నేనంటే తనకిష్టమా కాదా తెలీటంలేదు.''

''నే చెప్తున్నాగా, అతను నిన్ను లవ్‌ చేస్తున్నాడు తల్లీ. ఐ నో యిట్‌. అమ్మాయి నచ్చిందా అంటే ఏమన్నాడో తెలుసా? డబుల్‌ ఓ.కె. అన్నాడు. ఇంత క్రితమే మాట్లాడి వస్తున్నా.''

ఆశ్చర్యంగా చూసింది వరేణ్య.

''డాడీ.....! మీరు వినోద్‌తో మాట్లాడారా................ఎప్పుడు?'' అడిగింది.

''జగదాంబ సెంటర్‌ దగ్గర ఎవరో ఫ్రెండ్‌ కోసం నిలబడుంటే చూసి టాక్సీ ఆపి, పిలిచి మాట్లాడాను! వచ్చి ఆఫీసులో కలుస్తానన్నాడు.''

''అలాగా............. అదే ఫ్రెండు ఫోన్‌ చేస్తేనే అర్జంటుగా వెళ్ళారు ఆయన.

''నువ్వు అనవసరంగా బాధపడుకు బేబీ, అసలు కుర్రాడికి నువ్వు నచ్చటం ముఖ్యంకాదు, నీకు అతడు నచ్చటం ముఖ్యం, మనచేతిలో కుర్రాడు ఎక్కడికిపోతాడు. చూశావ్‌గా అతడి పంచసూత్రం మన కంపెనీని పంచకళ్యాణిమీద పరుగెత్తిస్తోంది. నిన్ను, ఈ ఆస్థిని అతడి చేతిలో పెడితే సంవత్సరం తిరిగే లోపల రెట్టింపు చేస్తాడు.''

''ఆస్థిని చేస్తాడుగానీ నన్నేలా రెట్టింపు చేస్తాడు డాడీ.''

''పిచ్చిబేబీ! మా చేతిలో మనవడ్ని పెట్టి మీ ఇద్దరికి ముగ్గురయ్యారనుకో రెట్టింపు అయినట్టుకాదా?'' అంటూ పెద్దగా నవ్వేసాడాయన.

సిగ్గుతో వరేణ్య బుగ్గలు ఎర్రబారాయి.

''పొండి డాడీ'' అంది ముఖం దించుకుని.

ఆఫీసునుంచి పారిపోయి వస్తున్న త్రివిక్రమ్‌కి ఎక్కడికిపోవాలో అర్ధంగాక బుర్ర చించుకుంటున్నాడు. గెస్ట్‌హౌస్‌కి పోయి ముసుగుతన్ని నిద్రపోతే ఎలా వుంటుందాని ఆలోచించాడు. ఏమో............ఆయన అక్కడిక్కూడా వస్తే ఏమిటి పరిస్థితి. అందుకే ప్రస్తుతం అటువెళ్ళే ఉద్దేశాన్ని విరమించుకున్నాడు. పోనీ లాడ్జిలో వుంటున్న వినోద్‌ వద్దకి వెళ్ళిపోతే.

అంతలో కొంత గుర్తుకొచ్చారు భద్రం, వీరభద్రం.

వాళ్ళిద్దరూ తన పక్కరూంలోనే వుంటున్నారని చెప్పాడు వినోద్‌. అంచేత అటు వెళ్ళటం కూడా సేఫ్‌కాదు అన్పించింది.

దాంతో తాత్కాలికంగా ఒక హోటల్‌ ముందు ఆటో దిగిపోయి డబ్బులిచ్చి పంపించేసాడు త్రివిక్రమ్‌. హోటల్లో కార్నర్‌ టేబుల్‌ చూసి ఒంటరిగా కూర్చుని కాఫీ ఆర్డర్‌ చేసాడు.

ఆ పక్కనే కాయిన్‌బాక్స్‌ వుంది.

ఓసారి ట్రయ్‌చేసి చూద్దామనుకుంటూ వినోద్‌ వుంటున్న లాడ్జికి ఫోన్‌కొట్టాడు.

లక్కీగా వెంటనే దొరికాడు వినోద్‌. అంతక్రితమే లాడ్జికి తిరిగి వచ్చాట్ట. అతడ్ని తనున్న హోటల్‌కి రమ్మని చెప్పి ఫోన్‌పెట్టేసాడు.

అంతలో కాఫీ వచ్చింది..........కాఫీ సిప్‌చేస్తూ ఆలోచనలో పడిపోయాడు.

అతడి అదృష్టమో దురదృష్టమోగాని

సరిగ్గా అప్పుడే

అదే సమయంలో

కానిస్టేబుళ్ళు భద్రం, వీరభద్రంలిద్దరూ టిఫిన్‌కోసం అదే హోటల్‌కి వచ్చారు చేతులు కడుక్కోడానికి సింక్‌వద్దకుపోతుండగా ముందుగా త్రివిక్రమ్‌ని వీరభద్రం చూసాడు.

''ఒరే అల్లుడూ, అటు చూడరా! వాడు త్రివిక్రమ్‌లాలేడూ?'' అన్నాడు.

''అవును మామా! వాడేనా?''

''అదేమామా కన్‌ప్యూజన్‌తో చచ్చిపోతున్నాం. వాడెవడో త్రివిక్రమ్‌లాగే వున్నాడా........బెంజికార్లు, గెస్ట్‌హౌస్‌లు, పక్కన రంభలాంటి పిల్ల. ఇక్కడ వీడుకూడా వాడిలాగే వున్నా వీడూ చాలా హుందాగా, దర్జాగా వున్నాడు. ఇంతకీ అసలు త్రివిక్రమ్‌ ఏమయ్యాడో అంతుచిక్కటంలేదు.''

''కంగారుపడకు, ఇలాంటి విషయాల్లో అనుభవం వుండాలిరా! కుర్రకుంకవి నీకేం తెలుసని, నాతోరా. వాడిముందే కూర్చుని టిఫిన్‌తింటూ వాడి నిజస్వరూపం కనిపెట్టేద్దాం. తొందరపడి నోరుజారకు, అసలు వాడయితే మనకళ్ళలో దుమ్ముకొట్టి పారిపోతాడు. పెద్ద ఫోర్‌ట్వంటీగాడు త్రివిక్రమ్‌. ఆ సంగతి మర్చిపోకు.''

''సరి మామా పద.''

మామా అల్లుళ్ళు ఇద్దరూ గుసగుసలాడుతూపోవటం అనుకోకుండా త్రివిక్రమ్‌ కంటపడింది. ఉలిక్కిపడ్డాడు.

''ఓరి దేవుడో..........పులిపోయి భూతం పట్టుకున్నట్టయిందేమిటి? ఇవాళ లేచిన టైం బాగునట్టుగా లేదు. పొద్దునే వినోద్‌ తగులుకున్నాడు. ఆఫీస్‌లో వుంటే సుధాకర్‌నాయుడు ఎంట్రీ ఇస్తున్నాడు. ఇటు పారిపోయివస్తే యమకింకరుల్లా వీళ్ళిద్దరూ చూసేసారు ఏం చేయాలి?

లేచి పారిపోదామన్న కోరిక అతడి మనసులో ఒక్క కుదుపుకుదిపి వదలింది. కానీ వివేకం వెంటనే హెచ్చరించింది. మరీ ఇంత క్లోజ్‌గా ఎదురుబొదురు అయిపోయాక ఫేస్‌ చేయాలిగాని పారిపోతే డౌటు క్లియరయిపోయి వెంటపడే ప్రమాదముంది.

అందుకే

వాళ్ళిద్దరూ ఎవరో తనకు అసలు తెలీనట్టే నటిస్తూ గంబీరంగా పోజుపెట్టి తాపీగా కాఫీ సిప్‌చేయసాగాడు.

అతన్నే గమనిస్తూ వచ్చి

ఎదురుగా కూర్చున్నారు ఇద్దరూ.

''హలో'' పలకరించాడు వీరభద్రం.

''హలో'' అంటూ ఓపిచ్చినవ్వు నవ్వి ఖాళీకప్పు పక్కనపెట్టి సిగరెట్‌ ముట్టించుకున్నాడు త్రివిక్రమ్‌. ఇప్పుడు లేచి వెళ్ళిపోదామన్నా తనకు వీలుకాదు.

అనవసరంగా ఫోన్‌చేసి వినోద్‌ని ఇక్కడికి రమ్మని చెప్పాడు. సో........... ఈ మామా, అల్లుళ్ళకి తను బుక్కయిపోయినట్టే.

''మీరు టిఫిన్‌ చేయరా?'' అడిగాడు.

''ఇప్పుడే కాఫీ తాగాను'' చెప్పాడు త్రివిక్రమ్‌.

''మీ పేరు?''

''వినోద్‌..''

''మీరేం చేస్తుంటారు? జాబా? వ్యాపారమా?''

''ఇంతకీ మీరు టిఫిన్‌కోసం వచ్చారా, ఎంక్వయిరీకోసం వచ్చారా? మీరు పోలీసులా?''

ఎక్కడా తొణక్కుండా చక్కగా మాట్లాడుతున్న త్రివిక్రమ్‌ని చూసి జుత్తు పీక్కున్నాడు భద్రం, వీరభద్రం అయితే తన మెదడులో కుమ్మరి పురుగులు ఏవో పరగెడుతున్నంతగా గజిబిజి అయిపోయాడు.

వాళ్ళిధ్దరూ ముఖముఖాలు చూసుకోడం చూసి

చిన్నగా నవ్వుకున్నాడు త్రివిక్రమ్‌.

ఇక ఆపుకోలేక ఓపెన్‌ అయిపోయాడు భద్రం.

''నీ డ్రామాకట్టిపెట్టు. నీ పేరు త్రివిక్రమ్‌, జైలు నుంచి పారిపోయి వచ్చావు. మా కళ్ళు కప్పలేవు'' అన్నాడు.

ఫోర్స్‌గా ఏదో విచిత్రమైన వార్త వింటున్నట్టు నొసలు విరిచి సీరియస్‌గా చూసాడు త్రివిక్రమ్‌.

''వాట్‌ ద హెల్‌ ఆర్యూ, టాకింగ్‌ నాన్సెన్స్‌? యు మీన్‌ ఐయామ్‌ ప్రిజనర్‌..........జైల్‌ సే మై బాగ్‌గయా? నాయార్‌ తెరియుమా? తెరియుమాన్ని కేక్కిరేన్‌? నన్ను హెసరు త్రివిక్రమ్‌నల్లరే...........మై హూ వినోద్‌ మెహ్రా.............''

    ''ఓర్నాయనో........... ఇదేమిట్రా వీడు? మనకి ఒక్కబాషే సరిగా వచ్చిచావదు. వీడు అన్ని బాషలు కలిపి కొడుతున్నాడు. వీడు త్రివిక్రమ్‌ కాదనుకుంటారా? కంగారుపడిపోతూ భద్రం చెవికొరుకుతూ గుసగుసలాడాడు. వీరభద్రం, కాని ఒప్పుకోడానికి భద్రం సిద్దంగా లేడు.

''నువ్వూరుకోమామా! నీకు తెలీదు ఈ ఫోర్‌ట్వంటీగాడికి దేశంలో సంగం భాషలు వచ్చు. ఇదిగో త్రివిక్రమ్‌. నువ్వు ఎన్ని వేషాలేసినా తప్పించుకోలేవు.మాతో వచ్చేస్తున్నావ్‌, అంతే'' అంటూ హెచ్చరించాడు.

''వస్తాను బ్రదర్‌! నన్ను భరించే శక్తి మీకుంటే ఎక్కడికయినా వస్తాను. హోంమినిస్టర్‌ మా బావగారు. హెల్త్‌ మినిస్టర్‌ మా బాబాయి, సన్‌ ఆటోమొబైల్స్‌లో పనిచేసే వినోద్‌ నా తమ్ముడు. ఎవడో అనుకుని మీరు నన్ను తీసుకెళితే తర్వాత మీ బతుకు బస్టాండ్‌ అయిపోతాయి. ఆలోచించుకోండి'' అంటూ సిగరెట్‌ ఆఖరిదమ్ములాగి ఆష్‌ట్రేలో పడేసాడు.

త్రివిక్రమ్‌ ఉపయోగించిన చివరి ఆస్త్రం వాళ్ళిద్దరిపైన బాగా వర్కవుటయింది. ఆలోచనలోపడి గింజుకొంటూ ముఖముఖాలు చూసుకున్నారు మళ్ళీ. ఎందుకంటే పక్కన చక్కనిచుక్కలాంటి అమ్మాయితో బెంజికారులో తిరుగుతున్న ఒక త్రివిక్రమ్‌ని చూసారు. వాడి పేరు వినోద్‌ అని తెలిసింది. వాడ్ని సమీపించటం కూడా ఇంతవరకు తమకు సాధ్యంకాలేదు. ఇప్పుడు ఇక్కడో త్రివిక్రమ్‌ తగిలాడు. వీడు ఆ బెంజికారు వినోద్‌ తన తమ్ముడంటున్నాడు. వీళ్ళ దుంపతెగ, అసలు ఈ త్రివిక్రముడిలాగ దేశంమీద ఎంతమంది పుట్టిచచ్చారో అర్ధంగావటంలేదు. పైగా హోం మినిస్టర్‌, హెల్త్‌ మినిస్టర్‌ క్లోజ్‌ రిలేషనంటున్నాడు. అందుకే వీరభద్రం ఖంగుతిన్నాడు. కాని భద్రం ఇంతటితో విడిచిపెట్టే ఉద్దేశంలో లేడు.

''హలో! మా చెవుల్లో నీ కంటికి పెద్ద సన్‌ఫ్లవరో, కాలిఫ్లవరో కనబడుతోందా? నీ పేరు వినోదా........పైగా నీ తమ్ముడి పేరు కూడా వినోదేనా.......'' అనడిగాడు.

''వినోద్‌ నంబర్‌ టూ'' సరిచేసాడు త్రివిక్రమ్‌.

''ఒకే పేరును నంబర్‌ వన్‌, నంబర్‌ టు అని ఎవరన్నా పెట్టుకుంటారా?''

''వైనాట్‌?'' దబాయించాడు త్రివిక్రమ్‌.

''వినోద్‌ నంబర్‌ త్రి కూడా వున్నాడు. చూస్తారా? వాడు కూడా ఇక్కడే ఇదే విశాఖలో వున్నాడు. ఫ్యామిలీ కులాచారం ప్రకారం పుట్టిన మగపిల్లలకి వినోద్‌ అని ఆడపిల్లలకు విశాలి అని పేర్లు పెట్టుకుంటాం.''

''కావచ్చు. కాని అచ్చుగుద్దినట్టు అంతా ఒకేలా ఎలా వుంటారు?''

''మేం వుంటాం. ఒరిజినల్‌ ప్రింటుకి జెరాక్స్‌ కాపిల్లా అందరం ఒకేలా వుంటాం. మేం నలుగురం అన్నదమ్ములం. వినోద్‌ నంబర్‌ ఫోర్‌ ప్రస్తుతం హాంకాంగ్‌లో ఫైటింగ్‌ నేర్చుకుంటున్నాడు,  మహా కోపిష్టి, మీరిలా వెధవప్రశ్నలతో నన్ను విసిగించారని తెలిస్తే, రాత్రి ఫ్లైట్‌కి వచ్చి మీ ఇద్దర్ని ఒంటిచేత్తో మర్డర్‌ చేసి మార్నింగ్‌ ఫ్లైయిట్‌కి తిరిగి హాంకాంగ్‌ వెళ్ళిపోతాడు. మీ వినోద్‌ ఎక్కడున్నాడో మరోచోట వెదుక్కోండి.''

''మాక్కావలసింది వినోద్‌ కాదు. త్రివిక్రమ్‌.

''అలాగా..............అయితే అదో నా ఫ్రెండు వినోద్‌ వస్తున్నాడు. వాడికి ఏమన్నా తెలుసేమో అడుగుదాం.''

''ఇదిన్యాయం, నీ పేరు వినోద్‌. నీ ఫ్రెండు పేరు వినోదేనా?'' పిచ్చిపట్టినట్టు అరిచాడు భద్రం.

''ఉండకూడదా? నా పేరు వినోద్‌ గాబట్టి ప్రపంచంలో ఇంకెవరికీ ఆ పేరు వుండకూడదా? నాకు డజనుమంది ఫ్రెండ్స్‌ వున్నారు. వాళ్ళందరి  పేర్లూ వినోదే. మీకేమన్నా అభ్యంతరమా?''

అప్పుడే అక్కడికి వస్తున్నాడు వినోద్‌.

త్రివిక్రమ్‌ ఎదురుగా ఉన్న వాలిద్దర్ని చూడగా ఏదో గడబిడ జరుగుతోందని అర్ధమైపోయింది.

''అరేయార్‌, క్యా కహాఁ..........కైసే కహాఁ..............యే దోనో మేరే దిమాక్‌ ఖరాబ్‌ కర్తాహైవే, పూచో...........యే క్యాహోరహహై.''

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్