Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with  brahmanandam

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష : అల్లుడు శీను

Movie Review - Alludu Seenu

చిత్రం: అల్లుడు శీను
తారాగణం: బెల్లంకొండ శ్రీనివాస్‌, సమంత, బ్రహ్మానందం, ప్రకాష్‌రాజ్‌ తదితరులు
చాయాగ్రహణం: చోటా కె నాయుడు
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
నిర్మాణం: శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్‌
దర్శకత్వం: వి.వి. వినాయక్‌
నిర్మాత: బెల్లంకొండ గణేష్‌
సమర్పణ: బెల్లంకొండ సురేష్‌
విడుదల తేదీ: 25 జులై 2014

క్లుప్తంగా చెప్పాలంటే :
అల్లుడు శీను (బెల్లంకొండ శ్రీనివాస్‌), అతని మావయ్య (ప్రకాష్‌రాజ్‌) సొంత ఊరి నుంచి చెన్నయ్‌కి పయనమవుతారు. ఈ క్రమంలో చెన్నయ్‌ ట్రెయిన్‌ కాకుండా, హైద్రాబాద్‌ ట్రెయిన్‌ ఎక్కేస్తారు. హైద్రాబాద్‌లో పెద్ద డాన్‌ భాయ్‌ని చూసి షాకవుతాడు అల్లుడు శీను. కారణం ఆ భాయ్‌ తన మావయ్యలా వుండడమే. మరోపక్క భాయ్‌ కూతురు అంజలి (సమంత)తో ప్రేమలో పడిన అల్లుడు శీను, మరో షాకింగ్‌ విషయం తెలుసుకుంటాడు భాయ్‌ గురించి. ఏంటా షాకింగ్‌ న్యూస్‌.. భాయ్‌ కూతురితో అల్లుడు శీను ప్రేమాయణం ఏమయ్యింది? భాయ్‌, అచ్చం తన మావయ్యలా ఎందుకున్నాడు? అన్నది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే :
తొలి చిత్రంతోనే డాన్సులు బాగా చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్‌. హీరోగా ఎంట్రీ ఎంత గ్రాండ్‌గా వుందో, తెరవెనుక హీరో అవడానికి ఆయన్ను అంత గొప్పగా ప్రిపేర్‌ చేశారన్పించింది. డాన్సుల్లోనూ, ఫైట్స్‌లోనూ ఈజ్‌ కనబర్చాడు. నటనలో ఫర్వాలేదన్పించుకున్నాడు. చిన్న చిన్న లోపాలేవన్నా వుంటే నెక్స్‌ట్‌ సినిమాకి కవర్‌ చేసుకునేలానే వున్నాడు. అంతగా సినిమా పట్ల డెడికేషన్‌ ప్రదర్శించాడు. సమంత గ్లామరస్‌ డాల్‌గా అలరించింది. ఎక్కువగా డాన్స్‌ చేసే అవకాశం కూడా దక్కింది సమంతకి ఈ సినిమాలో. నటనలో సమంత ఇప్పటికే తానేంటో ప్రూవ్‌ చేసుకుందిగనుక.. అంజలి పాత్రలో షరామామూలుగానే ఒదిగిపోయింది.

కామెడీ డిపార్ట్‌మెంట్‌ని ఒంటి చేత్తో లాగించేశాడు బ్రహ్మానందం. ‘డాలీ’ పాత్రలో బ్రహ్మానందం కడుపుబ్బా నవ్వించాడు. హీరోతో బ్రహ్మానందం కామెడీకి విజిల్స్‌ పడ్డాయి. ప్రకాష్‌రాజ్‌ ద్విపాత్రాభినయం చేశాడు. రెండు పాత్రలకు మధ్య వేరియేషన్‌ని బాగా చూపించగలిగాడు. విలన్‌గా విలనిజం పండిస్తూనే, ఎమోషనల్‌ సీన్స్‌లో ప్రకాష్‌రాజ్‌ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

మ్యూజిక్‌ బావుంది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాని ప్లస్‌ అయ్యింది. పాటలు ఆకట్టుకున్నాయి సంగీతం పరంగానూ, విజువల్‌గానూ. అవసరమైనదానికన్నా ఎక్కువ ఖర్చుపెట్టారు. సినిమా చాలా గ్రాండ్‌ లుక్‌తో కన్పిస్తుంది. డైలాగ్స్‌ బావున్నాయి. బ్రహ్మానందం కోసం రాసిన డైలాగ్స్‌కి మంచి అప్లాజ్‌ వస్తుంది. గోపీమోహన్‌ స్క్రీన్‌ప్లే బావుంది, సెకెండాఫ్‌లో కాస్త నెమ్మదించినట్లు అన్పిస్తుంది. ఎడిటింగ్‌ ఓకే. 
కథలో కొత్తదనం ఏమీ లేకపోయినా కమర్షియల్‌ వాల్యూస్‌ని దర్శకుడు వినాయక్‌ బాగా మిక్స్‌ చేశాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ అవకుండా, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ బోర్‌ కొట్టించకుండా రూపొందించాడు. కథానాయకుడి తొలి చిత్రానికి వుండాల్సిన క్వాలిటీస్‌ అన్నీ ఈ సినిమాలో వున్నాయి. కొత్త హీరో ‘ఏమేం చేయగలడు’ అనేది దర్శకుడు చూపించేశాడు. ఆ విషయంలో వినాయక్‌ తన మీద నిర్మాత పెట్టుకున్న అంచనాల్ని నిజం చేశాడు.

ఫస్టాఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగిపోతుంది. అక్కడక్కడా యాక్షన్‌ సీక్వెన్సెస్‌, రిచ్‌ లుక్‌తో పాటలు, పాటల నిండా హీరో హీరోయిన్ల డాన్సులతో ఎక్కడా ప్రేక్షకులకు బోర్‌ కొట్టించదు. సెకెండాఫ్‌లో యాక్షన్‌, ఎమోషన్స్‌ కాస్త ఎక్కువయ్యాయి. అయినా ఓవరాల్‌గా సినిమా మంచి అనుభూతినే మిగల్చుతుంది కమర్షియల్‌ సినిమాల్ని ఇష్టపడేవారికి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎలాగూ వుంది గనుక, బోరింగ్‌ ఫిలిం మాత్రం కాదు.

ఒక్కమాటలో చెప్పాలంటే : హీరోగా ఈ ‘శీను’కి పెర్‌ఫెక్ట్‌ ఎంట్రీ లభించింది

అంకెల్లో చెప్పాలంటే : 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka