Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

జరిగిన కథ : సమావేశం లో బ్రాంచ్ మేనేజర్, డివిజినల్ ఆఫీసర్ మాట్లాడుతారు. ఈ ఏడాది టాప్ టెన్ లో మొదటి స్థానం సంపాదించిన ఏకాంబరాన్ని వేదికపైకి పిలుస్తారు. ఇంత మంది సమక్షం లో ఏకాంబర్ కు సన్మానం జరుగుతుంది. తరువాత తల్లి, తండ్రి, చెల్లి తో కలిసి భోజనం చేస్తాడు ఏకాంబర్ .

 

ఏకాంబర్.

"ఒంటిగంట అవుతోంది కదా! భోజనాలు వచ్చేసే వుంటాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్ కెళ్లాలి. పదండి!" ఇక అప్పటికి సమావేశాన్ని ముగిద్దామన్నట్టుగా అన్నాడు ఏకాంబర్.

"సార్! కథ మధ్యలోనే ఆపేశారు!" ఎవరో కుర్రాడు లేచి అన్నాడు.

"కథా...?!" ఆశ్చర్యంగా అన్నాడు ఏకాంబర్

ఆ కుర్రాడికేసి చూసి. "అదే సార్. మీరు అచ్చు సినిమా కథలాగా అద్భుతంగా చెప్పారు. ఆ తర్వాత ఏమైందని...?!" కుతూహలంగా అన్నాడు కుర్రాడు. "ఆ తర్వాతా? ఏమవుతుంది? మీరే చెప్పండి... ఎవరైనా చెప్పగలరా?" అందరికేసి చూస్తూ అన్నాడు

ఏకాంబర్."ఏముంది సార్! అతడో టాప్ మోస్ట్ ఏజెంటవుతాడు. రెండుచేతులా డబ్బు సంపాదిస్తూంటాడు. అది మీరే కదా!" మరో కుర్రాడు నవ్వుతూ అన్నాడు.

"కరెక్టు! మిగతా కథ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఏజెంటు అనేవాడు ఎలా వుండాలనేదే మనకు కావాలి. ఏదైనా సాధించాలనుకుంటే ఏంకావాలో తెలిసింది కదా!" అడిగాడు ఏకాంబర్.

"సార్! మీలా అందరికీ అదృష్టం కలసి రావాలి కదా!" అన్నారు ఎవరో వున్నట్టుండి.

ఆ మాటకు అదిరిపడ్డాడు ఏకాంబర్. ఇంత శ్రమపడి తను చెప్పినదంతా బూడిదలో పోసిన పన్నీరయిందా? కొంపదీసి తను చెప్పింది వీరందరికీ అర్థం కాలేదా?

"అదృష్టం!... అదృష్టం అంటే మీలో ఎవరికైనా తెలుసా?" చాలా తీక్షణంగా అన్నాడు ఏకాంబర్.

"అప్పనంగా వచ్చేది. అడక్కుండా, కష్టపడకుండా అందే ఫలం" అన్నాడు ఎవరో తెలివైన కుర్రాడు. "కదా!

ఇప్పుడు మీ అందరికీ నేను ఉద్యోగమిస్తానన్నది మీ అదృష్టాని బట్టా, మీలో వున్న కష్టపడే గుణాన్ని బట్టా?" అని ప్రశ్నించాడు ఏకాంబర్.

అందరూ ఒక్కసారే అవాక్కయిపోయారు. ఎవరూ గొంతు విప్పి మాట్లాడలేకపోయారు.

"చెప్పండి! పని చేయకుండా మనల్ని అదృష్టం వరిస్తుందా?! కనీసం ఎవరైనా మనల్ని ఇష్టపడతారా?! తల్లిదండ్రులు గానీ, పెళ్లాంగానీ సోమరిపోతులమైన మనల్ని ప్రేమిస్తారా? భరిస్తారా?! చెప్పండి!" గద్దించాడు

ఏకాంబర్

అందరూ అవాక్కయిపోయారు. అదృష్టమంటే గాలిలో దెపం పెట్టి దేవుడా నువ్వే వున్నావని మొక్కినట్టు అవుతుందన్న విషయం వారికి అర్థమైంది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. కృషి వుంటే మనుషులే ఋషులవుతారని తెలుసు అందరికీ. పనిచేసేవాడి వెనకే 'అదృష్టం' కూడా తిరుగుతుందని వారికి స్పష్టంగా అవగతమైంది.

"అర్థమైంది సార్! అర్థమైంది. తొందర్లో ఆకతాయిగా అనేశాను" అంటూ తల దించుకున్నాడో కుర్రాడు లేచి నిలబడి... అతడే వునకనుండి 'అదృష్టం' వుండాలని అరచిందని అందరూ గ్రహించారు.

"సరిసరి! మీతొ నేను వాదించటం లేదు. సోమరిపోతులు వాడే పదం 'అదృష్టం' అందుకే అంతలా స్పందించాను. పదండి! కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మీ అందరి కోసం ఆహార పదార్థాలు కుతకుత ఉడుకుతూ ఎదురు చూస్తున్నాయి. వేడివేడిగా లాగించేద్దాం. అర్ధగంట విశ్రాంతి తీసుకున్నాక మధ్యాహ్నం మన తదుపరి కార్యక్రమాల్లోకి వెళ్దాం" అంటూ నూకరత్నంకేసి చూశాడు ఏకాంబర్.

అమ్మాయిల్నందర్నీ తీసుకుని కిందకు దిగింది నూకరత్నం. అబ్బయిలతో మాట్లాడుతూ దిగాడు ఏకాంబర్.

అప్పటికే ఏకాంబర్ మిత్రులు నలుగురూ గ్రౌండ్ ఫ్లోర్ లో భోజనాల ఏర్పాట్లలో తలమునకలై వున్నారు. డెవల్ప్ మెంట్ ఆఫీసర్ రాజనాల కూడా ఏకాంబర్ వెంటే నడుస్తున్నాడు.

వున్నది పాతికమందైనా ఆదివారం కావడంవల్ల ఎవరికి నచ్చింది వారు తింటారని వెజ్, నాన్ వెజ్ కూరలు ఆర్డరిచ్చాడు ఏకాంబర్. తినేవాళ్ళు తక్కువగా వున్నా పదార్థాలు మాత్రం ఎక్కువైపోయాయి.

మార్కెటింగ్ లో ప్రధానమైనది ఆకట్టుకోవడం, తమవద్ద పని చేయడానికి వచ్చిన యువతీ యువకుల్లో మొదటి ఘట్టంలోనే ఇక్కడే పని చేయాలన్న ఆశని, ఆలోచనని కలిగించాలన్నదే ఏకాంబర్ ఊహ!

అందుకే ఖర్చుకు వెనుకాడకుండా ఏర్పాట్లు చేశాడు. ఒక విధంగా ఇది అందరికీ మోటివేషన్ క్యాంపెయిన్ లాంటిది.

నూకరత్నం అమ్మాయిలందరితో గలగలా మాట్లాడుతూ ఓరకంట ఏకాంబర్ నే గమనిస్తోంది. తనకోసం అతడు తీసుకున్న ప్రతిచర్యనీ నిశితంగా గమనిస్తోంది. తన ఉన్నతి కోసం పడుతున్న శ్రమని, అతనిలోని ప్రేమని పసిగడుతూనే వుంది. ఏకాంబర్ ప్రతి అడుగూ ఆమె మనసు దరి చేరుతూనే వుంది. నూకరత్నం కూడా పరవశిస్తూనే వుంది. ఆమె హృదయం పరిమళిస్తూనే వుంది.

ఏకాంబర్ ఊహించినట్టే నూకరత్నం తన పేర తీసుకున్న ఫ్రాంఛైజీలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతోంది.

రోజూ ఉదయం ఎనిమిదో గంటకల్లా ఆఫీసుకు వచ్చేస్తోంది. అందరికంటే, ముందు తనే రావడం, ఆరోజు ఎవరు, ఏ పని చేయాలో చార్ట్ తయారు చేసుకుని ఏరియాల వారీగా తనవద్ద అసిస్టెంట్లుగా పనిచేస్తున్న యువకుల్ని ఒకో ఏరియాకి పంపిస్తోంది.

ఆఫీసులో వున్న అమ్మాయిలతో పాలసీల వివరాలను ప్రింట్లు తీయిస్తూ ఆ నెలలో వాయిదాలు చెల్లించాల్సిన పాలసీదారుల జాబితా కూడా రెడీ చేయిస్తోంది.

ఏకాంబర్ తెల్లారగట్లే నగరం మీదపడి పాలసీదారులను కలసి పదో గంటకల్లా ఆఫీసుకి చేరుకుంటున్నాడు. ఆఫీసులో ఓ అరగంట వుండి తిరిగి వైజాగ్ ఇన్స్యూరెన్స్ కంపెనీకి వెళ్లిపోతున్నాడు.

ఇప్పుడు నూకరత్నం కూడా ఒంటరిగా తనకి తెలిసిన కస్టమర్ల దగ్గరకు వెళ్లి చిన్నా చితకా చిట్స్ సేకరించగలుగుతోంది.

కస్టమర్లను కలసి వారి అవసరాలకు తగ్గట్టు చిట్స్ కట్టించగలుగుతోంది.

ఆరోజు

ఉదయాన్నే ఫ్రాంఛైజీ ఆఫీసుకు హడావిడిగా బయలుదేరుతోంది నూకరత్నం. అప్పటికే తల్లితో కలసి వంట తయారుచేసి తనకోసం మధ్యాహ్నానికి క్యారేజీ కట్టేసుకుంది.

రోజూ తన క్యారేజీలో తనతోపాటు మరో వ్యక్తికి కూడా సరిపోయేలా భొజనం తెస్తుంది నూకరత్నం. ఒకరోజు అనుకోకుండా భొజనం వేళకి ఏకాంబరం వస్తే ఇద్దరూ కబుర్లాడుకుంటూ తింటూంటారు.

రోజూ ఏకాంబరం మధ్యాహ్నం వేళకి రాకపోయినా క్యారేజీ మాత్రం నిండుగా తెచ్చి ఏకాంబరం కోసం

రెండుగంటల వరకూ ఎదురుచూసి ఈ తర్వాత భొజనం చేస్తోంది నూకరత్నం. ఒంటిగంట నుండి ఏకాంబరాన్ని ఏక్కడున్నావంటూ వాకబు చేసి ఆ తర్వాతే తను క్యారేజీ విప్పుకుని తింటుంది. ఏకాంబరం రాని రోజు బిగిలిన అన్నం, కూరలు తమ అపార్టుమెంట్ బయట రోడ్డు మీద చెప్పులు కుట్టుకునే కుర్రాడికి తీసికెళ్లి ఇచ్చేస్తుంది.

ఆరోజు

ఎప్పటిలాగే క్యారియర్ సర్దుకుని ఫ్రాంఛైజీ ఆఫీసుకు బయలుదేరింది నూకరత్నం.

ఇంతలో ఏకాంబర్ ఫోన్. చంద్రనగర్లో నుండి నడుస్తూ రైల్వేస్టేషన్ పైనున్న వంతెన మీదకు చేరుకోగానే కాల్ వచ్చింది. క్యారియర్ చేతబట్టి వ్యానిటీ బ్యాగ్ చంకలో తగిలించుకు నడుస్తోన్న నూకరత్నం బ్యాగులో నుండి సెల్ రింగ్ వినగానే ఠక్కున నిలబడి సెల్ బయటకు తీసింది.

ఫ్రాంఛైజీ ప్రారంభించిన దగ్గర నుండీ ఎలాంటి ఫోన్ కాల్ కూడా నిర్లక్ష్యం చేయడం లేదు నూకరత్నం. ఏ కస్టమర్ ఏ సమయంలో కాల్ చేస్తాడో! ఎవరికి ఎలాంటి అవసరం ఏర్పడుతుందోనన్న ఆలోచనతో ఎప్పుడూ అలర్ట్ గా వుంటుంది.

సెల్ తీసి డిస్ ప్లే చూడగానే 'ఏజెంట్ ఏకాంబర్ ' అన్న పేరు చూడగానే ఆతృతగా కాల్ రిసీవ్ చేసుకుంది నూకరత్నం.

హలో! చెప్పండి!" చిన్నగా నవ్వుతూ అంది నూకరత్నం.

"ఎక్కడున్నావు?" ఆతృతగా అడిగాడు ఏకాంబర్.

"మన ఆఫీసుకే బయలుదేరాను. దార్లో ఉన్నాను" చెప్పింది.

"దార్లో అంటే..?" అడిగాడు ఏకాంబర్.

"రైల్వేస్టేషన్ బ్రిడ్జి మీద నడుస్తూ అంది నూకరత్నం.

ఓఖ్! నేను స్టేషన్ ఎంట్రన్స్ గేటు దగ్గర వుంటాను. అర్జెంటుగా రా!" అంటూనే అవతల ఫోన్ కట్ చేసాడు ఏకాంబరం.

ఏకాంబర్ అంత గాబరాగా ఫోన్  చేసేసరికి నూకరత్నం ఆశ్చర్యపోయింది. ఫ్రాంచైజీ ఆఫీసు తెరచి రెండు నెలలు కావస్తోంది. ఏ రోజు ఎక్కడున్నావ్? అని అడగలేదు. ఈ రోజు ఏమిటో?! ఆశ్చర్యపోయింది.

ఉదయాన్నే పదో గంటకి ఆఫీసుకు రావడం ఒకసారి అందర్నీ పలకరించడం వెంటనే వెళ్ళిపోవడం, మధ్యాహ్నం ఆఫీసులో పనుంటే గాబరాగా రావడం,భోజనం వేళయితే తనతో రెండు ముద్దలు గబ గబా మింగేయడం మళ్ళీ పరుగు పరుగున పారిపోవడం, సాయంత్రం పూట ఆఫీసు మూసే వేళకి వస్తే రావడం లేకపోతే మర్నాడే పుందర్శనం కలిగించే ఏకాంబరం ఈ రోజు ఇంత ఉదయాన్నే ఇంత హఠాత్తుగా తనను కలవాలనే సరికి ఆశ్చర్యం కలుగుతోంది. ఏం1 పనబ్బా ఈ రెండు రోజులు నెలలుగా తను చేసే ప్రతి పని చాలా సునిశితం గా పరిశీలిస్తున్నాడే!?!

ఏ రోజుకారోజు వాయిదా వసూళ్ళు ఆయా కంపెనీలకి సొమ్ము వసూలు అయిన మర్నాడే ఆయా కంపెనీల ఖాతాల్లో జమ చేస్తోందే! మరి, తనతో ఇంత అర్జెంటు పన్నేటబ్బా?!

ఆలోచిస్తూనే గబగబా రైల్వే బ్రిడ్జ్ కిందకు దిగింది నూకరత్నం.

బ్రిడ్జి దిగుతూండగానే కొద్ది దూరం లో బైక్ మీద కూర్చుని తన కోసమే ఎదురుచూస్తున్న ఏకాంబరాన్ని చూసింది నూకరత్నం.

ఒక్క కషణం ఎందుకో మనసులో ఆందోళన కలిగింది. కాళ్ళూ చేతులూ ఒణుకు పుట్టాయి నూకరత్నానికి.

"కొంపదీసి తనెక్కడన్నా తప్పు చేసిందా?! ఈ రెండు నెలల్లో ఏ కంపెనీ కలెక్షన్ ఆ కంపెనీకి అణా పైసలతో సహా ఆ కంపెనీ అకౌంట్లకు బ్యాంకుల్లో డబ్బు కట్టేసిందే?! పొరపాటున ఒకరికి కట్టాల్సింది మరొకరికి కట్టేసిందా?! ప్రతి రోజు ప్రతి ఉద్యోగి తెచ్చిన రోజువారీ కలెక్షన్ మనీ సరిగ్గానే నమోదు చేసుకునేది కదా! అలాగే ఏ కంపెనీకి ఆ కంపెనీ డబ్బు వేరు చేసేసి కట్టేసింది.కదా! తప్పు ఎలా జరిగిందబ్బా!? ఏమంటాడో!" రకరకాలుగా ఆలోచించుకుంటూ భయం భయం గా మనసులో జడుసుకుంటూ నెమ్మదిగా ఏకాంబర్ దగ్గరకు వెళ్ళి ఆలోచించుకుంటూ భయం భయం గా మనసులో జడుసుకుంటూ నెమ్మదిగా ఏకాంబర్ దగ్గరకు వెళ్ళి నవ్వడానికి ప్రయత్నిస్తూ విష్ చేసింది నూకరత్నం.

"బైక్ మీద కూర్చో!" గంభీరం గా అన్నాడు ఏకాంబర్.

మౌనం గా మారు మాట్లాడకుండా ఏకాంబర్ బైక్ మీద ఒద్దికగా ఎక్కి కూర్చుంది నూకరత్నం.

'ఆఫీసు తాళాలు వాచ్మెన్ భార్య దగ్గర ఉన్నాయి కదా?" బైక్ ని ముందుకి ఉరికిస్తూ అడిగాడు ఏకాంబర్.

ఒక సెట్ తాళాలు పద్మక్క దగ్గర వున్నాయి  అని అంది నూకరత్నం.

ఈ రెండు నెలల్లో వాచ్మెన్ భార్యని పద్మక్క అని పిలవడం అలవాటయింది నూకరత్నానికి. ఆమెనే కాదు అందర్నీ అన్నా, అక్కా, తమ్ముడు, చెల్లని సంభోదిస్తూ పిలవడం అలవాటయింది నూకరత్నంకి.

ఫ్రాంచిజీ ఆఫీసులో పనిచేస్తున్న యువతీ యువకులందరినీ అలాగే పెద్దవాళ్ళందరినీ అన్న, అక్క,అని చిన్నవాళ్ళందరినీ తమ్ముడు, చెళ్ళి అని ఆప్యాయం గా పిలుస్తోంది నూకరత్నం..

పద్మక్క దగ్గర తాళాలు ఉన్నాయి కదా! నాతో ఇప్పుడు రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదు కదా!" అడిగాడు ఏకాంబర్.

లేదు లేదు ఈ రోజు ఎవరు ఏ ఏరియాకెళ్ళాలి, ఏ కస్టమర్లని కలవాలో కంప్యూటర్లో "బాకీల జాబితా' తీసి రెడీగా టేబుల్ మీద వుంచాను. మనవాళ్ళు వచ్చి లిస్ట్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. వర్క్ ఏం సఫర్ కాదు" అంది నూకరత్నం.

"ఓకే! జాగ్రత్తగా కూర్చో!" అంటూనే బైక్ ని స్పీడుగా పరుగులు పెట్టించాడు ఏకాంబర్.

"మహానుభావుడు! ఏదీ చెప్పకుండా ఎక్కడికి లాక్కుపోతున్నాడో! దేనికో అర్ధం కావడం లేదు" అనుకుంటూనే ఒక్కసారి వాచీకేసి చూసుకుంది నూకరత్నం.

తొమ్మిది గంటలు దాటిపోయింది. ఈ సరికి తను ఆఫీసులో ఏదో పని మీద వుండేది, పని పూర్తి అయ్యాక శ్రీ రాం చిట్స్ ఆఫీసుకు బయలుదేరేది. ఈ రోజు ఓన్లేక్ చిట్స్ రెండు కట్టాల్సినవి ఉన్నాయి.

కస్టమర్ల దగ్గర చిట్ మొత్తం కూడా వసూలు చేసింది. ఆ చిట్స్ రెండిటి డబ్బు కట్టి చిట్స్ పాస్ బుక్ రాయించుకుని ఆ చిట్స్కి కంపెనీ వాళ్ళిచ్చే ప్రోత్సాహక బహుమతులు తీసుకుని పార్టీలకు అందజేయాలి. ఈ రోజు ఇదే చాలా ఇంపార్టెంట్ వర్క్ పార్టీ దగ్గర డబ్బు తీసుకున్నాకా ఒక్క రోజు కూడా తన దగ్గర ఉంచుకోకూడదు. వారికి రశీదు, పాస్ బుక్ వాటితో పాటు చిట్ గిఫ్ట్స్ అందజేయాలి. అప్పుడే వారికి తన మీద నమ్మకం కలుగుతుంది.

ఈయన చూస్తే ఏమీ చెప్పకుండా బైక్ మీద టౌన్ లాక్కుపోతున్నాడు. ఎందుకో! ఏమో! చూద్దాం!" మనసులోనే పరి పరి విధాల ఆలోచిస్తోంది.

జగదాంబ థియేటర్ దగ్గరకు రావడంతోనే నూకరత్నం ఒక్కసారే అదిరిపడింది.

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
26th episode