Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
bhagavaan shree ramana maharshi biography

ఈ సంచికలో >> శీర్షికలు >>

సుశాస్త్రీయం - మహర్షి చలం - టీవీయస్.శాస్త్రి

Maharshi Chalam

(చలంగారి తత్త్వం ఏమిటో కొంతవరకు తెలుసుకోవటానికి దోహదపడే,చలంగారి ఈ క్రింది రెండు లేఖలను మీ కోసం అందిస్తున్నాను.)

శ్రీ చలంగారు శ్రీ నారాయణమూర్తి అనే వారికి 10 -06 -1956 న వ్రాసిన లేఖ-

"నా పుస్తకాలు జాగ్రత్తగా చదివినవారికి నేను అసలు సత్యమేమిటా అనీ ఈ సమస్యలన్నిటినీ తీర్చగల ULTIMATE TRUTH ఉందా, ఉన్నట్లు కనబడుతోంది, అది ఏదా, అనే వెతుకులాట కనబడుతుంది. అందుకనే, మీకు నా ఉత్తరాలలో నా సిద్ధాంతం దొరకలేదు. నేను ఎంత గొప్పవారు గాని వారు చెప్పారు గనుక నమ్మనని, స్వతంత్రంగా బయలు దేరాను. ఆ యాత్రే నా పుస్తకాలలో కథలూ, నాటకాలూ, వ్యాసాల రూపంగా వచ్చింది.సత్యమనేది ఉంటే, బుద్ధితో కాదు, జీవితం అర్పించి అనుష్టిస్తేనే గాని తెలుసుకోలేమని, నమ్మేదానికీ, చేసేదాదానికి వ్యత్యాసముంటే ఆ సత్యం దొరకదని నమ్మి, నమ్మింది అనుష్టించడం వల్ల , మీ ఆంధ్రులనుంచి నా బతుకంతా రొష్టు పడ్డాను.

నా అన్వేషణే నన్ను అరుణాచలం తీసుకొచ్చింది; ఇదేమిటో తెలుసుకుందామని, నేను వెతికే సత్యం ఆధ్యాత్మికంలో ఉందేమోనని. రమణ భగవాన్ కరుణ వల్ల, ఆయన సహాయం వల్ల, ఒక్కరవ్వ తెలుసుకోగలిగాను.ఈశ్వరుడున్నారనీ -- ఈ సాధన, సత్యదర్శనం చేయిస్తుందనీ, కనుక నా జీవిత పధ్ధతి ప్రకారం, నా జీవితం అర్పించేసాను. అదే వారు కోరేదీనీ. అర్పించడం సులభం కాదు. ప్రతి నిముషంలో కాలమూ, అన్ని ఆలోచనలూ, శక్తులూ అర్పించాలి. దానికి తీవ్ర సాధన కావాలి. అదీ నా ప్రయత్నం. అనుభవంలోకి వస్తేనే గానీ, నేనేమీ తెలిసినట్లు మాట్లాడను, వ్రాయను.ఎప్పుడన్నా తెలుసుకోగలిగితే మాటలోనో, మౌనంలోనో చెబుతాను. తెలుకోలేకపోతే అంతే.

అప్పుడదో చిన్న పనికిరాని మౌనం. నేను ఇదివరకు వ్రాసినవన్నీ ఈనాటికీ నాకు సత్యమే, ఆ plane లో! ఇప్పుడు నేనింకో plane లోపనిచేస్తున్నాను. ఈ plane ఆ plane ని అబద్ధం చెయ్యదు. లోకం ఎంత సత్యమో,నా రచనలు అంతే సత్యం. నా పాత రచనలు తప్పుగా తోచిన నాడు, నా సొంత డబ్బుతోనన్నా, పత్రికల్లో అవన్నీ అబద్ధాలు చదవకండి, అని ఒక పేజీ అంతా పెద్ద అక్షరాలతో ప్రకటన చేయిస్తాను....." --- చలం.

***********

చలం గారు చెప్పిన కొన్ని సూక్తులను ఒకచోట కూర్చి శ్రీ చందర్ గారు 'సాహిత్య సుమాలు'అనే ఒక పుస్తకాన్ని వెలువరించారు. ఆ పుస్తకం మీద శ్రీ చలంగారు తన అభిప్రాయాన్ని శ్రీ బి.వి.నరసింహారావు గారికి ఈ క్రింది విధంగా తెలియ జేశారు.

"బి.వి.నరసింహారావు గారికి,
చలం సూక్తులు చదివి ఎంత పొంగిపోతున్నారో మీరు? ఆ సూక్తులను మొదట చదివినపుడు, నేను ఇట్లాంటివి వ్రాయగలిగిన మనిషి పుట్టాడా, వ్రాసాడా, ఉన్నాడా అనిపించింది. ఎవరికి వారు తప్ప subject మీదనేకాని ఇంత range భూమి నుంచి ఆకాశం వరకు cover చేసారా? ఎవరో వ్రాసి వీటిని నేను చదివితే ఎవరు! ఎవరు! అని వెతికివుండనా? వెతికి ఈ జనన మరణ మానవ హృదయ రహస్యాన్ని నాకు విశదం చేయమని ఆయన ముందు కూలబడి ఉండనా? అనుకున్నాను. కాని ఇవి చలం వ్రాయలేదు. అతనిలోని hidden higher self వ్రాసాడు. అతనితో చలానికి ఎప్పుడో కాని, సంబంధం తక్కువ.-- చలం"

***************

"జ్ఞానాన్నిఎక్కడినుంచో, ఎవరి దగ్గరనుంచో ఉపదేశం పొంది తెచ్చుకునేది కాదు. జ్ఞానం తనలోనేవుంది, అజ్ఞానమనే తెరని తొలగించగలిగితే చాలు, జ్ఞాన దర్శనమౌతుంది. గొప్ప జ్ఞానికావాలంటే మనిషి, ముందు అతని దేహానికి యోగం, ఆరోగ్యం కావాలి. పూర్వజన్మల, ఈ జన్మసంస్కారం కాలిపోవాలి. అహం నశించాలి. నిజం మాట్లాడారో అర్ధం కాదు మనుష్యులకి. అబద్ధం మాట్లాడటం ఇష్టంలేదు. అందుకని మౌనులౌతారు జ్ఞానులు. జ్ఞానం ఆంటే మన మనసు తెలుసుకునేదంతా జ్ఞానమే. ఎన్నో విషయాలను విడివిడిగా తెలుసుకొని, చివరకు అవన్నీ ఈశ్వరుడని తెలుసుకోవడం - అదే అసలు జ్ఞానం."---మహర్షి చలం.

మరిన్ని శీర్షికలు
weekly horoscope(may 25-may 31)