Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Aditya Hrudayam

ఈ సంచికలో >> సినిమా >>

రాజా మ్యూజిక్ ముచ్చట్లు

పకడో పకడో
ఈ 'పూజాఫలం' డీవీడీ కవర్ మీద ఉన్న ఫొటోలలో జమున ('పగలే వెన్నెల' పాట నుంచి), సావిత్రి ( 'ఎందుదాగి వున్నావో బృందావిహారి' పాట నుంచి), గుమ్మడి, జగ్గయ్య, రమణారెడ్డి, రేలంగి ఫొటోలు ఆ సినిమాకి సంబంధించినవే.. కానీ మెయిన్ గా చెప్పుకునే హీరో ఆక్కినేని ఫొటో మాత్రం ఆ సినిమా నుంచి తీసి జతపరిచినది కాదు. 'డాక్టర్ చకవర్తి' సినిమా నుంచి తీసి కలిపినది. పక్కనే వున్న 'డాక్టర్ చక్రవర్తి' సినిమాలోని ఓ సన్నివేశంలో అక్కినేని వేసుకున్న కోటు, టై, విగ్గు తో పోల్చి చూసుకోండి. మీకే తెలిసిపోతుంది
 


ఈ పాటను స్వరపరించిందెవరు?
'శభాష్ రాముడు' (1959) సినిమాలోని 'జయమ్ము నిశ్చయమ్మురా - భయమ్ము లేదురా - జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా - సాగిపొమ్మురా'  పాట వినగానే రిక్షా తొక్కుతూ ఎన్టీఆర్, థియేటర్లో విజిల్సేస్తున్న ప్రేక్షకులు గుర్తొస్తాయి ఆ తరం వాళ్ళకి.  ఏదైనా ఓ పనిలో విజయం సాధిద్దామని వెళ్ళే ఈ తరం వాళ్ళకి కూడా ఈ పాట ఇచ్చిన కిక్కు మరే పాటా ఇవ్వదు. అంతలా చొచ్చుకుపోయి చిరస్థాయిగా నిలబడిపోయిందీ పాట.

ఇంతకీ ఈ పాటను స్వరపరించిందెవరు? ఇంకెవరు ... మన ఘంటసాలే ... అంటారంతా ... ఎందుకంటే 'శభాష్ రాముడు' టైటిల్స్ లో సంగీత దర్శకుడిగా ఘంటసాల పేరు వుంది కాబట్టి. ఆ పాటని తనే స్వరపరిచానని ఘంటసాల గారు ఎప్పుడూ ఎక్కడా చెప్పుకోలేదు. ఆయన అసిస్టెంట్లూ కూడా ఎటువంటి స్టేట్ మెంట్లూ ఇవ్వలేదు. నిజం తెలియని కొందరు అభిమానులు మాత్రం నెట్ లలో నిర్ధారించేస్తూ వుంటారు.

అసలు విషయం ఏమిటంటే - 'శభాష్ రాముడు ' సినిమాని హిందీలో విడుదలైన 'బడాభాయ్' (1957) అధారంగా పాటలతో సహా హక్కుల్ని కొనుక్కుని తెలుగులో తీశారు. ఆ హిందీ 'బడాభాయ్' లో వున్న 'కదమ్ బఢాయె జా - న డర్ - కదమ్ బడాయె జా'పాట ట్యూన్ నే 'జయమ్మునిశ్చయమ్మురా'  పాటకు వాడుకున్నారు. ఆ హిందీ సినిమాకి సంగీత దర్శకుడు నాషాద్.

సినీ సంగీతాభిమానులందరూ ఇక్కడ గ్రహించాల్సిన మరో విషయం ఏమిటంటే చాలా మంది 'నాషాద్' కి 'నౌషాద్' కి తేడాతెలియక 'బడాభాయ్' కి సంగీతం నౌషాద్ అని డిక్లేర్ చేసేస్తూ వుంటారు. ఈ సంప్రదాయం బాంబే లో కూడా కొనసాగే సరికి నాషాద్ పాకిస్థాన్ వెళ్ళిపోయాడు. 1981 లో చనిపోయాడు.
 


ఇష్టం - సిస్టమ్
దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు షాట్ ని తీసే విధానం గురించి,  పాటల చిత్రీకరణ గురించి ఎంతో గొప్పగా చెప్పుకునే వారు ఆ రోజుల్లో. 'దొంగ రాముడు' సినిమా తర్వాత కె.వి రెడ్డి గారు తిరిగి విజయా సంస్థ కి వెళ్ళిపోవడంతో 'తోడికోడళ్ళు' సినిమాకి దర్శకుణ్ణి వెతుక్కోవలసిన పరిస్ఠితి వస్తే - 'ఈయన్ని ప్రయత్నించి చూడండి .. చిత్రీకరణలో కొత్తదనం చూపిస్తున్నాడు' అంటూ ఆదుర్తి గారిని రికమెండ్ చేశారు అక్కినేని. అటువంటి ఆదుర్తి పాటలలో సన్నివేశాలలో షాడో ప్లే గా నీడలతో ఆడుకున్న ఉదాహరణలు ఎన్నో కనబడతాయి.  అవన్నీ ఆ తరహా చిత్రీకరణ పట్ల ఆయనకు గల మక్కువకి సాక్ష్యంగా నిలబడతాయి.  అందుకు ఈ ఫొటోలే నిదర్శనం.


అలా రాజమౌళికి కూడా పాటల చిత్రీకరణ లో పైటని ఎగరేసి పట్టుకుని గాల్లోకి తేలినట్టుగా షాట్ తీయడం అంటే ఇష్టంలా వుంది. ఈ మాట ఆయన ఎక్కడా చెప్పకపోయినా ఫొటోలు ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.
 

మరిన్ని సినిమా కబుర్లు
Pawan Kalyan Car