Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐ.ఏ.ఎస్ పాస్

జరిగిన కథ:
కిట్టు ఇంటర్వ్యూకి హాజరవుతాడు. ఇంటర్వ్యూలో  విభిన్న విషయాలపై అడ్డిగిన ప్రశ్నలకు చకా చకా సమాధానాలిస్తాడు కిట్టు

.....................ఇక చదవండి..............

 

... అనుకుని,

అటజనికాంచె, భూమిసురుడంబర చుంబి
శిరస్స రఝ్ఝరీ పటల, ముహుర్ముహుర్లుఠ
దబంగ తరంగ మృదంగ
నిస్వ నటనాస్పుట, నటనానుకూల
పరిపుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరత్క రేణు
కరకంపిత సాలము శీత శైలమున్"

అంటూ రాగయుక్తంగా ఆలపించాడు.

నిద్రపోతున్నట్టి పంజాబీ ముసలాయన కొంచెం నిటారుగా సర్దుకుని అన్నాడు ఇంగ్లీష్ లో

' ఏదో వాటర్ ఫాల్స్ గురించి చెపుతునట్లుంది.

మంచి అవకాశమిచ్చారీ పండితులవారు అనుకున్నాడు కిట్టు.

పండితులవారు కిట్టు తో అన్నారు ' సమస్యా పూరణం గురించి తెలుసా?

తెలుసు సార్... కానీ సివిల్స్ సిలబస్ లో లేదు అన్నాడు కిట్టు. ఆ విషయం నాకు తెలుసు. అయినా ప్రయత్నించు.. నేను ఒక సమస్య ఇస్తాను... దాన్ని ఒకటో రెండో పదాలో, అక్షరాలో వాడి పూరించు అన్నారు.

కోడి ముక్క కటుక్కున కొరికెను బ్రాహ్మణుండూ దీనిని పూరించు అన్నారు పండితులవారు.

తన ఆరవ, ఏడవ తరగతి లోని తెలుగు క్లాసులు మనసులో మెదిలాయి కిట్టుకి రాముడికి తోక పెట్టేస్తారు వెధవలూ అని మాస్టారు తిట్టడం గుర్తొచ్చింది. రాముడికి తోక ఎలా వచ్చిందంటే... రామునితో.. కపివరుండు ఇట్లనియే అని చదవకుండా రాముని తోక  పివరుండిట్లనియే అని చదివాడు ఒకడు...

అదీ జరిగింది. బ్రాహ్మణుడు కోడిముక్క కొరకడు చచ్చినా .. కానీ వాడితో కొరికించాలి ఎలా.... రాముని తోక.. టెక్నిక్నే ఉపయోగించాలి... కోడి.. కోడి.. కోడి... పకోడి... కోడి పకోడి... ఆ.. బ్రాహ్మణుడితో కోడి కొరికించలేం కానీ పకోడీ కొరికించవచ్చు...

'పకోడి ముక్క కటుక్కున కొరికే బ్రహ్మణుండు సమాధానం చెప్పాడు కిట్టు...

పండితులవారు వదలకుండా మళ్ళీ అన్నారు. ' రాముని భార్యలకు నిందవచ్చెన్ '

'రామునికున్నది ఒకే భార్య ... భార్యలు అంటారేంటీ...? రామాయణం లో తనకు తెలియని అంశాలు చాలా వున్నాయి... అందులో ఇదొక వింతా? విడగొట్టుకోవాలి... ఆలోచిస్తున్నాడు కిట్టు.. గబ గబా... రాము.. " 'నిభార్యా    లకు రామునిభా... ర్యలలకు రాముని భార్యలకు నింద వచ్చెన్. కుదరటంలేదు. రా... ముని భార్యలకు... ఔను... ఇది కావచ్చు... ముని భార్యలు... రాముని భార్యలు కాదు...
కేవలం ముని భార్యలు...

మునుల భార్యలకు నింద .. ఎందుకు రావాలి?

ఇంద్రుడు చేసిన వెధవ పనికి...!

గౌతముడనే ముని భార్య అహల్యకు మోసగించాడు ఇంద్రుడు. ఆమె కనిపెట్టలేకపోయింది.

మోసపోయింది...

మునుల భార్యలు ఇంత వెర్రివాళ్ళా అనే నింద వచ్చేసింది...

ఔరా...! ముని భార్యలకు నింద వచ్చన్ అన్నాడు కిట్టు...

పండితుల వారన్నారు...

శ్రీశ్రీని ప్రముఖంగా ఒక విప్లవ కవిగా పేర్కొంటారు... అది ఎంతవరకు సమంజసం?

సర్...

శ్రీశ్రీ గారు ఒక కవిగా.. విప్లవ గీతాలు రాసారు... విప్లవం రావాలని, బీద ప్రజలకు న్యాయం జరగాలని కోరుకున్నారు. అలాగని కమ్యూనిస్ట్ కవిగానో, కేవలం విప్లవ కవిగానో ముద్ర వేయించుకోవడం ఆయనకు ఇష్టం లేదు. ఆయన రాసిన విప్లవ గీతాలను బట్టి ఆయనను విప్లవకారుడనీ, జోరుగా హుషారుగా షికారుపోదమా... అనే సరదా గీతాలు రాసి, సినిమా వాళ్ళతో కలిసారు కనుక శ్రీశ్రీని క్యాపిటలిస్ ట్లు అనీ, తెలుగు వీర లేవరా... దీక్షబూని సాగరా అని రాసిన శ్రీశ్రీని దేశభక్తునిగా భావించవచ్చు. వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ రాసిన శ్రీశ్రీ ని దైవ భక్తుని గానూ, నా హృదయంలో నిదురించే చెలి అని రాసిన శ్రీశ్రీని ప్రేమికుని గానూ చూడవచ్చు. ఆ విధంగా శ్రీశ్రీని విప్లవకారుడనవచ్చును, కాపిటలిస్టు అనవచ్చు, దైవ భక్తుడనవచ్చు. ఏ 'ఇజం' లూ అనగా కమ్యూనిజం, క్యాపిటలిజం ఆయనను కట్టి పడేయలేవు... ఇజం లకు అతీతుడాయన. ఆయనను ఒక కవి గానే చూడాలి తప్ప... ఆయనపై ఒక ముద్ర వేయడం అంత సమంజసంగా లేదు సర్... అని ముగించాడు  కిట్టు.

ఈ లోగా పండితులవారి ప్రక్కనే ఉన్న మేడం గారు అందుకున్నారు.

జపాన్ కరెన్సీ ఏమిటీ? యెన్ మేడం... కెనడా రాజధాని? అట్టావా...

థాయ్ లాండ్ కరెన్సీ? బహత్ మేడం...

లిరా అనే కరెన్సీ ఏఏ దేశాల్లో వాడతారు.... సైప్రస్, జోర్డాన్, లెబనాన్, మాల్టా, టర్కీ, సిరియా ప్రపంచం లో అతి చిన్న దేశం? మొనాకో మేడం.
ఈస్ట్ టైమర్ అనే దీవి గొడవల్లో వుంది. ఎందుకని?

మేడం పదహారవ శతాబ్ధం లో ఈ దీవిని పోర్చుగీసు వారు ఆక్రమించుకున్న్నారు. చాలా కాలం  పోరాడి, 1975 లో స్వాతంత్ర్యం సంపాదించుకున్నారు. కానీ  , ఈ లోపు ఇండోనేషియా ఈ ద్వీపాన్ని ఆక్రమించి, తన 27వ రాష్ట్రం గా మార్చేసుకుంది. అప్పట్నుంచి ఈస్ట్ టైమర్ ప్రజలు ఇండోనేషియాతో పోరాడుతూనే ఉన్నారు. లక్ష మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఈస్ట్ టైమర్ స్వాతంత్ర్యం కోసం ఐక్యరాజ్య సమితి కృషి చేస్తుంది. త్వరలో వాళ్ళు స్వతంత్రులు కాబోతున్నారు... చెప్పాడు కిట్టు... అజర్ బైజాన్ రాజధాని? బాకూ...
బురుండి రాజధాని ? బుజుంబురా... కామెరూన్ రాజధాని? తెలియదు మేడం.

ఇక మేడం గారు వదిలేసారు కిట్టుని.

సాధారణంగా ఈ పర్సనాలిటీ టెస్ట్ లలో ముందుగా ప్రశ్నించేది బోర్డ్ చైర్మెన్ గారు.

ఇక్కడ మాత్రం చైర్మెన్ గారు అఖరు ప్రశ్న ప్రశ్నించడం మొదలుపెడతారు.

నీకు సంబంధించిన ఫైలు లో నీ వివరాలన్నీ ఉన్నాయి.

ఇంటర్ లో బైపీసీ, దాని తర్వాత ఏదో డాక్టర్ కోర్సుకి, కనీసం హోమియోపతికి వెళ్ళాలని ప్రయత్నిస్తారు కానీ నీవు పాలిటెక్నిక్ కు వెళ్ళావు. పాలిటెక్నిక్ తరువాత ఇంజనీరింగ్ కోసం ప్రయత్నిస్తారు. కానీ నీవు పాలిటెక్నిక్ తర్వాత ...బియ్యే... చదివావు... ఆ తర్వాత ఒక సంవత్సరం 'లా' చదివావు.

ఇలా ఒకదాని తరువాత ఒకటి సంబంధం  లేని చదువులు , 'రోలింగ్  స్టోనె గేదర్స్ నో మాస్ ' అనే సామెతను నిరూపిస్తున్నట్లుగా వుంది. కొంచెం వివరించు. అన్నారు..

సర్...

నేను ఇంటర్ ఫెయిలయ్యాను. ఆ తరువాత కంపార్ట్మెంటల్ గా పాసయ్యాను. ఇక డాక్టర్ కు ప్రయత్నం చేయలేదు. ఉద్యోగం వెంటనే వస్తుందని పాలిటెక్నిక్ చదివాను. సార్.. ఇంజనీరింగ్ మళ్ళీ నాలుగేళ్ళు  చదవాలి. దానికి టైం పడుతుంది. ఈ లోగా డిగ్రీ వుంటే బాగుంటుందని బియ్యే చదివాను. పనికిరాని డిగ్రీ అని అన్నారు బియ్యేని. ఆ డిగ్రీ తోనే ఈ రోజు ఇక్కడకు వచ్చి మీ ముందు కూర్చున్నాను. ఇక దొర్లే రాయికి బరువుండదు. సార్... కానీ దానిలో విషయం అనగా మాస్ అనేది మాత్రం అది దొర్లినా ఒక చోట వున్నా దాన్లోని విషయం విషయమే సార్.... ఇంటర్ బైపీసి చదివినప్పుడు డాక్టర్లే గొప్పవాళ్ళనుకున్నాను. తరువాత పాలిటెక్నిక్ చదువుతున్నప్పుడు ఇంజనీర్లే గొప్పవాళ్ళనుకున్నాను. సర్.. బియ్యే చదివిన తరువాత సమాజ, శాస్త్రజ్ఞుల గొప్పతనం తెలుసుకున్నాను. లా చదువుతున్నప్పుడు లాయర్లు గొప్పవాళ్ళనుకున్నాను. ఇవన్నీ చదవడం వల్ల ఎవరో ఒక్కరే గొప్పవారు అనుకునే మూర్ఖత్వాన్ని పోగొట్టుకున్నాను. .. ఏదో ఒక్కటే చదివిన వాళ్ళ కంటే కూడా మెరుగైన స్థితిలో ఉన్న నేను ఐ ఏఎస్ కావడానికి అర్హత పొందానని అనుకుంటున్నాను సర్. .... అన్నాడు కిట్టు.
చైర్మెన్ గారు అన్నారు.

ఇది కరెస్పాండెన్స్ బియ్యే నా?

సర్.. ఇది కరెస్పాండెన్స్ కాదు సార్...దీనిని ఎక్స్ టర్నల్ బియ్యే అంటారు. కేవలం పరీక్షలు పెడతారు. వెళ్ళి రాసెయ్యడమే.. అయితే ఇందులో అవకతవకలు జరుగుతున్నాయని ఆ తరువాత రద్దు చేసారు. నేను రాసినప్పుడు ఈ డిగ్రీకి గుర్తింపు వుంది. అన్నాడు కిట్టు.

ఇది ఎన్నో సారి? నీవు పరీక్ష రాయడం? ఎన్ని చాన్సులున్నాయో అన్నీ వాడేసాను సర్..

ఇది నా ఆఖరి చాన్స్ అన్నాడు కిట్టు. చైర్మెన్ గారు మళ్ళీ ప్రశ్నించారు.

భీమవరం గురించి కొద్దిగా వివరించు...?

స్వాతంత్ర్య సమర దినాల్లో గొప్ప పాత్ర వహించినది బార్డోలీ అయితే ఈ భీమవరం రెండో బార్డోలి అని మహాత్మా గాంధీ వర్ణించారు. పంచారమాలైన అమరరామ (అమరావతి), ద్రాక్షారామ (ద్రాక్షారామం), సోమరామ (భీమవరం), క్షీరారామ (పాలకొల్లు) భీమారామ (సామర్ల కోట) లలో భీమవరం ఒకటి. ఇక్కడ సోమేశ్వర స్వామి వారి గుడిలో ప్రతిష్టితమైన దేవత శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారు. ఆర్ధికంగా ఈ దేశం లో కీలక పాత్ర వహించేది బొంబాయి అయితే దాని తరువాత రెండో స్థానం భీమవరమే అని కొందరంటారు.  సంక్రాంతి వేడుకలలో భాగం గా జరిగే కోడి పందాలలో పెట్టే ఖర్చును బట్టి అమెరికాలో లాస్ వెగాస్ తో కొందరు భీమవరాన్ని పోలుస్తారు. వెస్ట్ గోదావరి భీమవరం కళాశాల   (ఇప్పటి ప్రతిష్టాత్మక మైన డియ్యెన్నార్ కళాశాల) భామవరం లో ఉంది సర్... చెప్పాడు కిట్టు.

సెంట్రల్ గవర్నమెంట్ లో బుల్లి ఇంజనీర్ గా పనిచేస్తున్నావు కదా... ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఏమేం రూల్స్ పాటించాలి? అన్నారు చైర్మెన్ గారు.

సర్...

నేను సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేసినంత కాలం డ్రాయింగ్ గీయడం, ఎస్టిమేషన్ చేయడం మాత్రమే చేసాను సర్... ఎంత మెటీరియల్ అవసరం, ఎంత ఖర్చు అవుతుంది? ఇలాంటి లెక్కలు కట్టడం తప్ప మున్సిపల్ రూల్స్ నాకు తెలియవు అన్నాడు కిట్టు. మరో ప్రశ్న..
ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్లో కాంట్రాక్టర్ తో పనిచేయిస్తారు కదా... అక్కడ అవినీతికి చోటుంటుదని అంటారు. ఎంతవరకు నిజం ? సర్...
సాధారణం గా కాంట్రాక్టర్ లు పనిచేసేది లాభం కోసం... వీలయితే సిమెంట్ శాతం తగ్గించి, లాభం పొందాలని చూసే కాంట్రాక్టర్లు వున్నారు... వాళ్ళతో కుమ్మక్కయి నాణ్యత తో రాజీపడే ఇంజనీర్లు కూడా వుండవచ్చు. గవర్నమెంట్ వారు కాంట్రాక్టర్కు ఇచ్చే న్యాయమైన లాభ శాతాన్ని ఇవ్వకుండా, నాణ్యమైన పని చేయించుకోవాలని చూస్తే అది జరిగే పని కాదు. న్యాయమైన లాభ శాతాన్ని కాంట్రాక్టర్ కు ఇచ్చి.. కాంట్రాక్టర్ వెనకే బుల్లి ఇంజనీర్ వుండి కాంట్రాక్టర్ తప్పు పనిచేయబోతే అడ్డుపడి, నువ్వెందుకు తప్పు పనిచేస్తావు? అని అతనితో గాంధీ లాగ న్యాయపోరాటం చేస్తే కాంట్రాక్టర్ ఇక ఏమీ చేయలేడు. . ఎందుకంటే ఎవ్వరికైనా మనస్సాక్షి వుంటుంది. అది కూడా లేని వాడు తప్పకుండా గోతిలో పడి తీరుతాడు. మా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్ మెంట్ వారు కట్టిన ప్రతిష్టాత్మకమైన కట్టడాల్లో నాకు ముఖ్యం గా తెలిసినవి రెండు. ఒకటి డిల్లీ లోని పార్లమెంట్ కు అనుసంధానం గా కట్టిన బిల్డింగ్, రెండోది హైద్రాబాద్ లోని బేగంపేట విమానాశ్రాయానికి అనుసంధానం గా కట్టిన ఎయిర్ ఫోర్ట్... మా డిపార్ట్ మెంట్ వారు కట్టిన భవనాల గొప్పతం ఎలాంటిదంటే... 

భూకంపాల ధాటికి వేరే బిల్డింగులు పడిపోయాయి. కానీ మా వాళ్ళు కట్టిన బిల్డింగులు చెక్కుచెదరలేదు. .. ఇది నిజంగానే జరిగిన విషయం .. ముగించాడు కిట్టు.

చైర్మెన్ గారన్నారు..

ఇంకో ప్రశ్న...

మన భారత రాజ్యాంగం కాలానుగుణం గా మారుతూ వస్తున్నది. అవసరాన్ని బట్టి సవరణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాలం మారింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం వచ్చిందని నేను భావిస్తున్నాను. .. ఏమంటావు?

సర్...

అమెరికాలో 50కి పైగా రాష్ట్రాలు వున్నాయి. విస్తీర్ణం లో భారతదేశం కంటే అరడజను రెట్లు పెద్దది. వాళ్ళ రాజ్యాంగం లో కేవలం ఏడు ఆర్టికల్స్ మాత్రమే వున్నాయి. నాలుగు వేల నాలుగొందల పదాలే వున్నాయి.

కేవలం 27 సవరణలు మాత్రమే జరిగాయి. బ్రిటిష్ రాజ్యాంగం, రాయబడినదీ కాదు, రాయబడనిదీ కాదు, ప్రతీ ఒక్క నాగరిక సమాజానికి మూలరాయి వంటిదీ రాజ్యాంగం. నియమనిబంధనలకు, పార్లమెంట్ గొప్పతనానికి మారు పేరు ఈ రాజ్యాంగం. మన భారత రాజ్యాంగం నాలుగొందలనలభైకి  పైగా  ఆర్టికల్స్ డజను షెడ్యూళ్ళు కలిగి లక్షా పదిహేడువేలకు పైగా పదాలతో ప్రపంచంలో కెల్ల అతి పెద్దయిన రాజ్యాంగం. అనగా లిటిగేషన్లు, పేచీలు వుండకుండా చూడాలని మన దేశ ప్రజలు పేచీకోరు తనాన్ని దృష్టిలో వుంచుకుని రాసిన రాజ్యాంగం అది. అదీ చాలక తొంభైకి పైగా సవరణలు చేసారు. మన దేశ ప్రజల లిటిగేషన్లు తరగడం కాదు.. పెరుగుతూనే వున్నాయి. సవరణ సవరణకీ, వివరణ వివరణకీ మళ్ళీ సవరణ, సవరణ సవరణకీ సవరణ.. ఇలా చేసుకుంటూ పోతే దానికి అంతెప్పుడూ? రాజ్యాంగాన్ని కాదు సార్ సవరించాల్సింది మన దేశ ప్రజల బుర్రల్ని.. మనం మారాలి.. అని  ముగించాడు కిట్టు.  

ఒకే.. యుకెన్ గో.. అన్నారు.. చైర్మెన్ గారు.

థాంక్యూ సర్... అంటూ లేచి నిలబడి సిద్ధమవుతున్న కిట్టువైపే చూస్తూ .. చిన్నగా నవ్వారు చైర్మెన్ గారు. అప్పటివరకు గంభీరం గా ఇంగ్లీష్ లో మాట్లాడిన చైర్మెన్ గారు తెలుగులో ఇలా అన్నారు.

ఈ కసరత్తుల కండలు, కుస్తీల సంగతేమిటయ్యా?

తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు కిట్టు...

తన చెవులు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా? అని అనిపించింది కిట్టుకి...

వెంటనే తేరుకుని, తను కూడా నవ్వాడు...

ఆ తరువాత .. సర్... చిన్నప్పుడు సన్నగా, పీలగా, పొట్టిగా ఉన్నానని అందరూ పొట్టోడా, బక్కోడా అనేవారు.

కసరత్తు చేస్తే కొంచెం మెరుగౌతానని వ్యాయామం మొదలుపెట్టాను సర్.. అన్నాడు కిట్టు...
చిరునవ్వుతో తలాడించారు చైర్మెన్ గారు...

నమస్కారం చేస్తున్నట్లుగా కొద్దిగా శరీరాన్ని ముందుకు వంచి బయటకొచ్చాడు కిట్టు.

బయటున్న వాళ్ళు కిట్టును చూసి మూగిపోయారు... ఏమడిగారు.. అంటున్నారు...

కిట్టుకి వాళ్ళ మాటలు వినిపించడంలేదు... ఏదో ఉద్వేగం... ఏదో టెన్షన్...

పరిసరాలను పట్టించుకోలేని స్థితిలో వున్నాడు కిట్టు.. ఆ భవనాన్ని వదిలి రోడ్డు మీదకు వచ్చాడు.

రోడ్డు దాటగానే చిన్న టీ దుకాణం. అందులో కూర్చుని చాయ్ అన్నాడు చాయ్ తాగి, సిగరెట్ వెలిగించాడు. బుర్ర పనిచేయడం లేదు... సిగరెట్ ఎప్పుడు పూర్తయ్యిందో తెలియలేదు...

దాన్ని పడవేసి, ఆటో పట్టుకుని ఆంధ్రాభవన్ చేరుకున్నాడు.. అంధ్రాభవన్ లోకి వెళ్ళే ముందు ఒక టెలిఫోన్ బూత్ వుంది. దాంట్లో కి వెళ్ళి హైద్రాబాద్ కి ఫోన్ చేసాడు... పక్క ఇంటి వాళ్ళు ఫోన్ ఎత్తగానే అనితను పిలవండి అని చెప్పాడు. అనిత వచ్చి హలో అన్నాక ఆమెతో చెప్పాడు..

ఇంటర్వ్యూ బాగానే చేసాను ఏదో ఒక సర్వీస్ వస్తుంది.

హైద్రాబాద్  చేరుకున్నాడు కిట్టు...

ఆఫీసుకు వెళ్ళడం..రావడం...

ఆఫీసులో షరా మామూలే...

ప్రశ్నలు...

ఎలా చేసావు? ఇంటర్వ్యూ?

బాగానే చేసాను...

ఏమడిగారు?

ఏదో అడిగారు బాగానే చెప్పాను.

పాసౌతావా?

పాసౌతాను.

ఏదో ఒక సర్వీస్ వస్తుంది...

ఈ పాసౌతాను అనేమాట చాలా మందికి జీర్ణం కాలేదు.

                                                                                             ముగింపు వచ్చేసంచికలో........

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
27th episode