Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
29th episode

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ

జరిగిన కథ:
త్రివిక్రం, వరేణ్య ఇద్దరూ కలిసి గేలరీ లో క్రికెట్ చూస్తూ వుండగా.. ఇంతలో జైలర్ ఆంజనేయులు త్రివిక్రం ను గుర్తుపట్టి కానిస్టేబుల్లను అతని దగ్గరకు పంపిస్తాడు. ఇంతలో త్రివిక్రం వాళ్ళిద్దరినీ చూసి మనసు రాయి చేసుకుని ఇప్పుడే వస్తానంటూ ఆమె చేయిని మృదువుగా విడిపించుకుని వెళ్ళిపోతాడు......... ఇకచదవండి...

''అబద్దం..............నిన్నటివరకు నేను మీ డాటర్‌నన్న సంగతే అతడికి తెలీదు.''

''కాని వాడు చదివింది ఇంటర్‌ మాత్రమే. ఆ సంగతి నీకు తెలీదు. ఫారెన్‌లో చదివిన ఆటోమొబైల్‌ ఇంజనీర్‌ ఎక్కడ? కనీసం మనకు వాడి పేరు కూడా తెలీని ఈ కుర్రాడు ఎక్కడ........? ఇక వాడ్ని మర్చిపో నీ పెళ్ళి వినోద్‌తోనే జరుగుతుంది.''

''నేను వినోద్‌ని చేసుకోను.''

''చేసుకోవాలి..............చేసుకుంటావ్‌. అంతే ................ఎవడో అనామకున్ని చేసుకోడానికి నువ్వు సిద్దంగా వున్నా, కోట్లఆస్థిని వాడిచేతిలో పెట్టడానికి నేను సిద్దంగా లేను. నీ మనసు మార్చుకో, నీ కాబోయే భర్త వినోద్‌.'' బయటికెళ్ళిపోయాడు సుధాకర్‌ నాయుడు..

ఇక అర్గ్యు చెయ్యలేదు వరేణ్య.

బొమ్మలా అలానే కూర్చుని వుండిపోయింది.

ఎప్పుడూ ఉత్సాహంగా, లేడిపిల్లలా తిరిగే మనవరాలు ఇలా సర్వం పొగొట్టుకొన్నట్టు శోకమూర్తిలా కూర్చోవటం చూస్తుంటే, జయమ్మ మనసు విలవిల్లాడిది. వచ్చి పక్కన  కూర్చుంది.

''నువ్విలా వుండకే, నాకు భయంగా వుంది'' అంది.

''ఇంకెలా వుండగలను...........అంతా పోగొట్టుకున్నాను................'' అంది. బాధగా వరేణ్య.

బుగ్గన వేలేసుకుని

మనవరాల్ని ఆశ్చర్యంగా చూసింది.

''ఏమిటే.............తుఫాను రాత్రి..............గెస్ట్‌హౌస్‌లో మీ ఇద్దరే వున్నారన్నావ్‌. కొంపతీసి ఆ కాస్త

ముచ్చటా. ........ జరిగిపోయిం దా ... .. ..........?'' అని అడిగింది.

''బామ్మా................అతనలాంటివాడు కాదు.''

''అయితే చేతకాని వాడన్నమాట''

''బామ్మా.......... నీ పీకనొక్కి చంపేస్తాను. అసలే ఇంత బాధలోవుంటే నీకు వేళాకోళంగా వుందా.............? అతను మంచివాడు గుణవంతుడు........మగాడు.''

''మగాడు గాకపోతే ఆడపిల్లవు నువ్వెందుకు ప్రేమిస్తావ్‌గాని, ఇంతకీ ఏం పోగొట్టుకున్నావో చెప్పలేదు.''

''నేను త్రికరణ శుద్దిగా వాడినే ప్రేమించాను. నాలోని ఉత్సాహం, సంతోషం, నా శక్తినాప్రేమ అంతా........... సర్వం మూటగట్టుకుని వెళ్ళిపోయాడు. అది పోగొట్టుకున్నట్టు కాదా?''

''అవున్లే.............ఇక ఈ వినోద్‌కేం మిగిలింది గనక, చింతకాయపచ్చడి, ఇంతకీ మనసు..........నీ మనసు, అదన్నా వుంచాడా లేక..........''

''అన్నీ పట్టుకెళ్ళినవాడు ఇది వదులుతాడా? నా మనసు కూడా దోచుకుపోయాడే బామ్మా'' అంటూ బామ్మను కౌగిలించుకొని వెక్కి వెక్కిపడింది.

''ఊరుకో తల్లీ, ఏం చేస్తాం? కొంపాగోడు దోచుకోబడిన వాళ్లక్కూడా ఇంతోటి కష్టం వచ్చుండదు.''

''భామ్మా................. నాకో సాయంచేసి పుణ్యం కట్టుకోవే.''

''చెప్పు తల్లీ, ఏం చేయాలి.''

''నాకి ఆస్థి ఐశ్యర్యం ఏమీ అక్కరలేదు. నా మనోహరుడు ఎక్కడున్నాడోచెప్పి పుణ్యం కట్టుకోవే నేనూ వాడి దగ్గరకే వెళ్ళిపోతాను.''

''నన్నడు గుతావేమిటే. చెప్పాడుగదా, మధుర వెళ్ళిపోతానని, ఎక్కడుంది మధుర?''

''నాకే తెలియదు, నీకేం చెప్పను?'

''ఇంత అమాయకురాలివేమిటే అమ్మాయ్‌, ఏమీ తెలుసుకోకుండా ఎలా వదిలేసావే వాడ్ని...........ఆ అయిడియా..........''

''ఏమిటి బామ్మా.........''

''నువ్వు వాడికోసం బెంగపెట్టుకోకుండా ఎప్పటిలా వుంటానంటే చెప్తాను.''

''ఉంటాను చెప్పు.''

''అసలు ఏం జరిగి వుంటుందో ఒక్కసారి వూహించు.''

''జరిగింది తెలిస్తేగదా వూహించుకోడానికి.''

''తెలిసిన దాంతోనే వూహించవే పిచ్చిమొహమా! నీ హీరో ఆ వినోద్‌ పర్సు, సూట్‌కేస్‌ దొంగతనంచేసి వైజాగ్‌ వచ్చాడుగదా.''

''లేదు. దొంగతనం చేసాడంటే ఒప్పుకోను.''

''కాస్సేపు ఒప్పుకోవే కొంపలేం మునిగిపోవు. ఆ కుర్రాడు వచ్చిన వెనకాలే ఈ వినోద్‌  వచ్చాడు, వాళ్ళిద్దరూ శతృవులేగదా?''

''అవును.''

కానీ గెస్ట్‌హౌస్‌లో వినోద్‌ తన ఫ్రెండని నీకు పరిచయం చేస్తూ అతడి పేరు త్రివిక్రమ్‌ అని చెప్పాడని నువ్వే చెప్పావు.''

ఆ మాటలు వినగానే వరేణ్య ఫోన్‌ చేసినప్పుడు కూడా వినోద్‌ ఫ్రెండు త్రివిక్రమ్‌ అనే చెప్పాడు.

''అంటే వాళ్ళిద్దరూ కాంప్రమైస్‌ అయిపోయారనిగదా అర్థం. కాబట్టి వాళ్ళిద్దరూ ప్లేస్‌లు మారినట్టే పేర్లుకూడా మార్చుకున్నారని ఎందుకనుకోకూడదు?''

''ఓసి బామ్మో.................నీ బుర్ర పోలీస్‌ మ్యూజియంలోపెట్టాలే ఎంత కరక్టుగా చెప్పావు. నా ప్రియుడి పేరు త్రివిక్రమ్‌. అర్థమైపోయింది.'' అంటూ ఉత్సాహంగా బామ్మ బుగ్గమీద ముద్దుఇచ్చేసింది వరేణ్య.

''అప్పుడే సంబరపడిపోకు, వాళ్ళిద్దరూ ఫ్రెండ్సు అయ్యారు. కాబట్టి ఈ త్రివిక్రమ్‌ తన వివరాల్ని వినోద్‌కి చెప్పేవుంటాడు. కాని ఈ సచ్చినోడు నిన్నూ, నీ ఆస్థిని వదులుకోలేక త్రివిక్రమ్‌ వివరాలు చెప్పకుండా దాచేసాడు.

బామ్మగారి అర్గ్యుమెంటు

నూటికి నూరుశాతం నిజమనిపించింది వరేణ్యకి.

ఉత్సాహంగా చూసింది బామ్మవంక.

''కరక్టుగా వూహించావే బామ్మా! వెంటనే వెళ్ళి వినోద్‌ని చితక తన్నమంటావా? త్రివిక్రమ్‌ వివరాలు వాడే చెప్తాడు'' అడిగింది.

''ఛా! అదే తప్పు ఆడపిల్ల మగపిల్లాడ్ని కొడితే అసహ్యంగా వుంటుంది. మార్పు అనేది మనసులోరావాలి. బలవంతంచేస్తే వచ్చేది మార్పుకాదు. ఓ పదిరోజులు ఓపికపట్టు, వాడిచేత నేను నిజం చెప్పిస్తాను. సరేనా?''

''నాకు సరికాదు, అంత ఓపిక నాకులేదు. నాకు త్రివిక్రమ్‌ అడ్రసు వెంటనే తెలియాలి. ప్లీజ్‌ బామ్మ.........ఏదన్నామార్గం చెప్పవే.

''ష్‌!. ... .. ... .. ....తిక్కవేషాలేయకు. నీ బాబు రాక్షసుడికి మనప్లాన్‌ తెలిస్తే మొదటికే మోసం వస్తుంది. ఓపిక పట్టు

అంతే ..... ........ఏ డుస్తూ  కూర్చోకు, వాతలు పెట్టేస్తాను'' అంటూ లేచి కిచెన్‌లోకి వెళ్ళిపోయారు బామ్మగారు.

త్రివిక్రమ్‌ జైలుకు తిరిగొచ్చి వారం రోజులయింది.

నిజానికి ఆ రోజు వైజాగ్‌ స్టేడియంలో ఇతను కానిస్టేబుళ్ళు భద్రం, వీరభద్రంలకు దొరకనేలేదు. స్టేడియంలోంచి బయటపడి తనదారిన రైలు పట్టుకొని హైదరాబాద్‌ వచ్చేసి, తెల్లవారేసరికి జైల్లో వున్నాడు. ఈ విషయం తెలిసాక బయలుదేరి మరునాడు సాయంత్రానికి తిరిగొచ్చారు. భద్రం, వీరభద్రంలు.

అయితే జైలుకు తిరిగొచ్చాడన్న మాటేగాని  త్రివిక్రమ్‌ మనసు వైజాగ్‌లోనే వుండిపోయింది. చాలా తేలిగ్గా వరేణ్యను తను మర్చి పోగలడ నుకున్నాడు. కానీ రోజులు గడిచేకొద్ది అర్థమవుతోంది ప్రేమ ఎంత బలమైందో. తనకు తెలీకుండానే ఆమె తన అణువణువును ఆక్ర మించు కుంది. మర్చిపోదామన్నా సాధ్యం కావటంలేదు. విరహవేదన ఎంత నరకమో ఇప్పుడు అర్థమవుతోంది.

కన్ను మూసినా ఆమె రూపమే,

కన్ను తెరిచినా ఆమె రూపమే.

సరిగా తినలేడు, కంటినిండా నిద్రపోలేడు.

ఎప్పుడూ ఉత్సాహంగా తిరుగుతూ, నవ్వుతూ, నవ్విస్తూ, జోరుగాపందాలు కాస్తూ హుషారుగా తిరిగే యువకుడు ఇప్పుడు మౌనవ్రతం సాగిస్తున్నాడు.  పిలిస్తే పలుకుతాడు, తానుగా ఎవరితోనూ మాట్లాడడు. ఒంటరితనం కోరుకుంటాడు. ఏకాంతంలో వరేణ్యతో గడిపినక్షణాలు గుర్తుచేసుకుని తన దురదృష్టానికి తానే బాధపడుతుంటాడు.

అతడిలో ఈ అసూహ్యమైన మార్పుచూసి తోటిఖైదీలు కొందరు కారణం అడిగినా నవ్వి వూరుకున్నాడేగాని జరిగింది ఎవరికి చెప్పలేదు.   ఇలా వుండగా ఆరోజు

ఎప్పటిలాగే జైల్లో రౌండ్స్‌కి బయలుదేరాడు జైలర్‌ ఆంజనేయులు, ఒకచోట చెట్టుకింద ఒంటరిగా కూర్చున్న త్రివిక్రమ్‌ని చూసి ఆశ్చర్యపోయాడు.

''ఇదిగో సుబ్బారావ్‌! ఇలారా'' అంటూ పిలిచాడు.

''ఏమిటి సార్‌?'' అనడిగాడు సుబ్బారావు.

''ఏంలేదు, అటుచూడు-వాడు త్రివిక్రమ్‌కదూ?''

'అవున్సార్‌.''

''ఏమైంది వీడికి ఇలా తయారయ్యాడు.........? చిల్లంగి తగిలిన వాడిలా.''

''అదే అర్థంగావటంలేదు సార్‌. చూస్తున్నారుగా వైజాగ్‌ నుంచి వచ్చినప్పట్నుంచి ఇంతేసార్‌? ఇంతకీ చిల్లంగి వుందంటారా?''

''అది వుందో లేదో ఇప్పుడు నీకు అవసరమా? వెళ్ళవయ్యా.......కాసేపు వాడ్ని పరామర్శించి వస్తాగాని వెళ్ళి పనులుచూడు'' అంటూ సుబ్బారావుని పంపించేసి లాఠీ వూపుకుంటూ త్రివిక్రమ్‌ వైపు వచ్చాడు జైలర్‌.

యోగనిద్రలో వున్నట్టున్న త్రివిక్రమ్‌.

ఆయన తనకు చాలా దగ్గరకొచ్చేవరకు గమనించలేదు.

''మీరా సార్‌! ఏమిటిలా వచ్చారు?'' అంటూ పలకరించాడు.

''ఏం రాకూడదా? ఈ జైలంతా నా సామ్రాజ్యమోయ్‌! ఇలా ఏమిటి ఎలాగయిన వస్తాను. ఇంతకీ ఏమిటి కథ? ప్రేమలోపడ్డావా?'' అంటూ ఎగాదిగా చూసాడు.

భారంగా నిట్టూర్చాడు త్రివిక్రమ్‌.

''అవున్సార్‌! ఇక్కడికి తిరిగొచ్చాకే తెలిసింది. ప్రేమించానని'' అన్నాడు.

''అంటే.................ముందే తెలిస్తే అట్నుంచి అటే ఆ పిల్లతో కనబడకుండా పోయేవాడివా?''

... ఛా... అదేంకాదు సార్‌.''

''మరింకేమిటి? ఆ పిల్లనే తల్చుకుంటూ ఇలా దేవదాసులా మారిపోవడం బాగుందా? కాస్త నవ్వరాబాబు, ముఖం చూళ్ళేకపోతున్నాం. వైజాగ్‌లో బెంజ్‌కారులో పక్కన ఓ పిల్లని విన్నాను ఆ పిల్లేనా?''

అవునట్టు చిన్నగా నవ్వి వూరుకున్నాడు త్రివిక్రమ్‌.

''ఓ.కె. వైజాగ్‌ పారిపోయి లవర్‌ని సంపాదించుకున్నావు........... హేపీగా నీ అభిమాన క్రికెట్‌ హీరోల్ని చూసావు. అన్నట్టు టి.వి.లో చూసాను. నీ పక్కన కూర్చుంది ఆ అమ్మాయేనా?''

''వూఁ!''

''మీ జోడి అదిరిందిరా! మరి తిరిగొచ్చాక ఎంతో ఉత్సాహంగా ఉండాలిగానీ ఈ మూగనోము దేనికి?''

''జీవితంలో ఆ అమ్మాయి ముఖం నేను చూడలేను సార్‌.''

''ట్విస్ట్‌ బాగుందిగానీ అసలేం జరిగిందో చెప్పు.'' ''సార్‌ మనం రోడ్డుమీదపోతుంటే కొంత డబ్బు దొరికిందనుకోండి. సంతోషమేగదా?''

''సంతోష మేగానీ   ఈ రోజుల్లో డబ్బులు పారేసుకునే పిచ్చి సన్నాసి ఎవడ్రా?'

''మీరే పారేసుకున్నారనుకోండి సార్‌.''

''నేను...............యూ ఇడియట్‌'' అంటూ ఫక్కున నవ్వేసాడు ఆంజనేయులు.  అనుకోకుండా పేలిన ఆ స్మాల్‌ జోక్‌కి ఆయనతోబాటు తనూ నవ్వేసాడు విక్రమ్‌.''నవ్వరా..........నవ్వు. నవ్వుతూ ఎప్పుడూ సరదాగా వుండాల్రా ఫూల్‌! కొన్ని రోజులపాటు నువ్వు జైలునుంచి పారిపోతే నిన్ను కాపాడ్డానికి, మా పరువులు నిలబెట్టుకోడానికి ఎన్ని తంటాలుపడ్డామో నాకు తెలుసు, అంత శ్రమపడింది. నిన్నిలా చూడ్డానిక్కాదు. అసలేం జరిగిందో చెప్పు'' అనునయంగా అడిగాడు.

''అదేసార్‌! రోడ్డుమీద కొంతడబ్బు దొరికిందుకోండి. ఆ సంతోషంలో మనముండగానే ఆ డబ్బు నాది అని దాని తాలూకూ మనిషివస్తే ఇచ్చేయటం ధర్మమా కాదా?''

''నేను మనుషుల గురించి చెప్పమన్నాను. పారేసుకున్న డబ్బు గురించి కాదు. ఎవరా అమ్మాయి, ఏమా కథ?''

ఇక చెప్పక తప్పలేదు త్రివిక్రమ్‌.  అయితే సన్‌ ఆటోమొబైల్స్‌ గురించిగానీ, సుధాకర్‌నాయుడు గురించిగాని పేర్లు చెప్పకుండా జరిగిందంతా ఆయనకి వివరించాడు. అంతా విని సీరియస్‌గా చూసాడాయన.

''తప్పు చేసావ్‌రా. చాలా తప్పుచేసావ్‌. కనీసం నీ అసలు పేరు, వూరు కూడా చెప్పలేకపోవడం నీది చాలా తప్పు'' అన్నాడు.

''పేరు తెలీదుగానీ వూరు తెలుసు సార్‌, మధుర వెళ్ళిపోతానని చాలాసార్లు చెప్పాను.''

''మధుర, అది ఎక్కడుంది?''

''అది ఎక్కడుందో ఏంటి సార్‌. ప్రస్తుతం మనం వుంది మధురే గదా. శ్రీకృష్ణజన్మస్థానం. జైలు.''

''అంతదూరం ఆ అమ్మాయి ఆలోచిస్తుందని నేననుకోనుగాని ఆలోచించి గ్రహిస్తే మాత్రం దేశంలో జైళ్ళన్నీ నీకోసం వెదుకుతూ సంవత్సరము తర్వాత ఇక్కడికి వస్తుంది.''

''రాదు సర్‌, రాకూడదు, ఆమె పరాయిసొత్తు పెద్ద చదువులు చదివిన వినోద్‌ తను అల్లుడు కావాలని ఆమె తండ్రి ఆశ. వినోద్‌ కూడా ఆమెపైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆమె అతడ్ని చేసుకోవటమే న్యాయం అందుకే మధ్యలో వెళ్ళిన నేను మధ్యలోనే వెనక్కివచ్చేసాను.''

''ఆహాఁ, త్యాగశీలివి, అందుకని ఆమెను దానంచేసి వచ్చేసావ్‌. ఏరా ఫూల్‌! నువ్వు త్యాగంచేయటానికి ఆమె వస్తువు కాదురా, ప్రాణం వున్న మనిషి, ఆ అమ్మాయి నిన్నే గాఢంగా ప్రేమిస్తోందని తెలిసికూడా ఆమెను నిలువునా ముంచేసి, నీ దారిన యిలా వచ్చేసావన్నమాట. బుద్దిలేదు. నీకసలు బుద్దిలేదురా, ఆ అమ్మాయిని వద్దనుకుంటూనే ఇక్కడ నువ్వింతగా విరహవేదన అనుభవిస్తున్నావే..............మరి నిన్నే ప్రేమించిన ఆ అమ్మాయి అక్కడ ఎంత బాధపడుతుందో ఆలోచించావా?''

''ఇప్పుడిక జ్ఞాపకాలు తప్ప ఆలోచనలు లేవుసార్‌! మాది ముగిసిపోయిన ప్రేమకథ. ఆమె సుఖంగా వుండాలనే కోరుకుంటున్నాను. అంతే!''

''అంతేలే................ఎచట వున్నా ఏమైనా నీ సుఖమే నే కోరుకున్నా............. అని సినిమాపాట పాడుకుంటూ జైల్లో తిరుగు. ఏం చేస్తాం? కొందరి తలరాతలుమార్చలేం'' అంటూ లేచి వెళ్ళిపోయాడు జైలరు. పోతూపోతూ

''వూరికే కూర్చోకు. పిచ్చి ఆలోచనలొస్తాయి. వెళ్ళి ఏదో పనిచెయ్యి. ఆ పిల్లను మరిచిపోగలుగుతావేమో'' అంటూ ఓ ఉచిత సలహా పారేసి మరీ వెళ్ళిపోయాడాయన.

నిరాహారదీక్ష రెండు రకాలుగా చేస్తారు.

ఆహారపానీయాలు ముట్టకుండా ఉపవాసం చేసేది అసలుసిసలయిన ఒరిజినల్‌ నిరాహారదీక్ష. ఎవరూ, చూడకుండా గప్‌చిప్‌గా తినేసి ఏమీ తిననట్టే నటిస్తూ చేసేది రెండోరకం నిరాహారదీక్ష. ప్రస్తుతం వరేణ్య పాటిస్తున్నది ఈ రెండో రకం నిరాహారదీక్షనే.

బామ్మ సపోర్ట్‌ ఫుల్‌గా వుండటంతో తండ్రి ఇంట్లో లేనప్పుడు చక్కగా తినేసి ముసుగుతన్నేస్తోంది. కొడుకు రాగానే బామ్మగారు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ

''ఇలాగయితే పిల్ల మనకు దక్కదు. ఉదయంనుంచీ పచ్చి మంచినీళ్ళుకూడా ముట్టలేదు'' అంటూ రాగం తీస్తూ ఆయన్ని బెదిరిస్తోంది. రెండు మూడు రోజులు కూతుర్ని బ్రతిమాలి చూసాడు.

వరేణ్య వినలేదు.

''మీరు చెప్పినట్టే నేను వినోద్‌ని యిష్టపడ్డాను. వచ్చినవాడు ఒరిజినలా? డూప్లికేటాని మీరు చెప్పేవరకు నాకు తెలీదు. అంచేత నా డూప్లికేట్‌ వినోద్‌ ముఖం చూసేవరక నేను ఏమీ తినను. తిననుగాక తినను'' అంటూ తెగేసి చెప్పింది.,

''ఎన్ని రోజులు నిరాహాదీక్ష నువ్వు చేపట్టినా నా నిర్ణయంలో కూడా మార్పులేదు, నీ పెళ్ళి ఒరిజినల్‌ వినోద్‌తోనే జరుగుతుంది గాక జరుగుతుంది'' అంటూ తనూ డబుల్‌ తెగేసి చెప్పాడాయన.

ఆఫీసుకు వెళ్ళటం పూర్తిగా మానేసింది వరేణ్య. అసలు ఏదీ పట్టించుకోడంలేదు. దాంతో వచ్చినవాడు వచ్చినట్టే ఆఫీసు పనుల్లో చిక్కుబడిపోయాడు సుధాకర్‌నాయుడు. ఈలోపం రెండుమూడుసార్లు బామ్మగారు వినోద్‌కి ఫోన్‌చేసి అమ్మాయి పరిస్థితి బాగాలేదు. పారిపోయినవాడినే తలుచుకుని కుమిలిపోతుంది. అంతా నీ మూలంగానే'' అంటూ ఇండైరెక్ట్‌గా నువ్వేదో నిర్ణయం తీసుకోపోతే ఈ సమస్య పరిష్కారం కాదన్నట్టు అతడి మనసు మార్చే ప్రయత్నాలు ఆరంభించింది.

ఇలా టెంక్షన్‌గా గడిచిపోయాయి వారం రోజులు. బామ్మగారు నాలుగుసార్లు ఫోన్‌లో మాట్లాడగానే వినోద్‌లో ఆమె కోరుకున్న ఎఫెక్ట్‌ వచ్చేసింది.

స్వతహాగా వినోద్‌ మంచివాడే.

కాదంటే కోట్ల ఆస్థి రంభలాంటి అమ్మాయి అంటే ఎవరికయినా ఆశేగదా.........కాని త్రివిక్రమ్‌ వెళ్ళిపోయాక కూడా అతడ్ని మర్చిపోలేక తిండి తిప్పలులేకుండా ఆ అమ్మాయి కుమిలిపోతోందని తెలీగానే అతడికే అంతరాత్మ ఎదురుతిరిగింది.

సంబంధం గొప్పదే కావచ్చు.

సుధాకర్‌నాయుడుగారు వరేణ్యను తనకే యిచ్చి చేయాలని ఎంతయినా పట్టుదలగా వుండొచ్చు కాని మరొకడికి మనసిచ్చి అతడి ప్రేమలో పిచ్చిదవుతున్న వరేణ్యను చూస్తుచూస్తూ తను ఎలా చేసుకోగలడు? మరీ అంతగా డబ్బుకోసం మనసు చంపుకొని మరొకడ్ని ప్రేమించిన యువతిని పెళ్ళిచేసుకోగలడా? అంతకన్నా.

జరిగిందేమిటో చెప్పి  ఆ జంటని ఒకటిచేస్తే ఆ తృప్తి వేరుగదా. మేనేజరు మధుసూదనరావు కూతురు గుండుమల్లి మమత తనకి తెగలైను వేస్తోంది. ఆమెను లైన్‌లో పెట్టుకుంటే సరి. తనూ జీవితంలో సెటిలైపోవచ్చు. ఒక్కతే కూతురు. ఇంతగాకపోయినా ఎంతో కొంత ఆస్థి అంతస్తూవున్న కుటుంబమే.

ఆ విధంగా మనసు మార్చుకున్న వినోద్‌ సుధాకర్‌నాయుడు ఆఫీసులో బిజీగా వున్న టైం చూసి టాక్సీలో ఇంటికొచ్చాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
28th episode