Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
27th episode

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

జరిగిన కథ:
ఏకాంబర్ , నూకరత్నానికి ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడుగుతాడు. తను ఆఫీసుకు బయలుదేరానని చెప్పుతుంది.  తనను అక్కడే వుండమని చెప్పి. ఏకాంబర్ తనని కలుసుకుని బండిపై జగదాంబ థియేటర్ కు తీసుకెళతాడు

              .....................ఇకచదవండి... 

ఎప్పుడూ లేనిది చెప్పా పెట్టకుండా తిన్నగా సినిమా హాలుకి తీసుకువచ్చాడేమిటబ్బా! అనుకుంది మనసులోనే.

బైక్ ఆగుతూనే వెనక్కి తిరిగి దిగు అన్నాడు ఏకాంబర్.

బైక్ దిగి ఓ పక్కగా  నిలబడింది నూకరత్నం.

పది గంటలు కావస్తోంది. అప్పటికే జగదాంబ థియేటర్ కేసి తేపారా చూసింది నూకరత్నం.

మూడు థియేటర్ల తాలూకా సినిమా పోస్టర్లూ ప్రక్కప్రక్కనే దర్శనమిస్తున్నాయి. జగదాంబ లో ఏదో ఇంగ్లీష్ సినిమా ఆడుతోంది. వాల్ పోస్టర్ చూస్తుంటే శరీరం అంతా జలదరించింది నూకరత్నానికి. ఆడామగా ఇద్దరూ నగ్నం గా వున్న పోస్టర్ అది.  పోస్టర్ చూస్తూ గబుక్కున తల దించుకుంది. రెండో థియేటర్ శారదలో ఏదో హిందీ సినిమా. అదీ అలాగే వుంది. కాక పోతే చిన్న గుడ్డ పీలికలు చుట్టుకుని వుండడంవలన కొంత నయం. ఇక మూడో థియేటర్ రమాదేవి లో మలయాళ సినిమా ఆడుతోంది.

మూడు పోస్టర్లు ముక్కున వేలేసుకుంది నూకరత్నం. ఈ మహానుభావుడికి మతి గానీ పోలేదు కదా! చెప్ప పెట్టకుండా సినిమాకి తీసుకువచ్చాడు. పోనీ అదేదో మంచి సినిమాకి తీసుకువెళ్ళొచ్చు కదా! అయినా ఎప్పుడూ పనీ, మనీ, కస్టమరు , సర్వీసు అని తిరిగే ఈ మహానుభావుడికి ఈ రోజు ఇంత తెల్లారగట్లే ఇటు కేసి మనసు మళ్ళిందేమిటబ్బా!

బైక్ ప్రక్కనే తల దించుకుని నిలబడి పరిపరివిధాల ఆలోచిస్తోంది నూకరత్నం. అందరూ తానే వింతగా చూస్తున్నట్టున్నారేమో! అనుకుంది నెమ్మదిగా తల ఎత్తి చూసింది.

అందరూ ఎవరి గోల్లో వారున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు చెట్టాపట్టాలేసుకు వచ్చారు. ఎవరూ ఎవరినీ పట్టించుకునే పరి స్థితిలో లేరు. అందరూ ఎవరి జంటలతో వాళ్ళు ఏ సినిమా హాల్లో దూరేద్దామా? అన్న ఆతృతతో టిక్కెట్టు బుకింగ్ లైన్లో తోసుకుంటన్నారు.

ఇంతలో బైక్ దగ్గర నూకరత్నాన్ని విడిచి పెట్టి గాబరాగా లోపలకు వెళ్ళిన ఏకాంబరం పరుగున వచ్చాడు.

రా! రత్నం ! సార్! లోపలే వున్నారు. అర్ధగంటలో బయటకు వెళ్ళాలట" అంటూనే నూకరత్నాన్ని

చెయ్యి పట్టి దాదాపు లాక్కుపోతున్నట్టే లాక్కుపోయాడు ఏకాంబర్.

మర బొమ్మలా ఏకాంబర్ వెంట నడిచింది నూకరత్నం. సార్! ఎవరు? అరగంటలో వెళ్ళిపోవడమేమిటీ? అనుకుంటూనే వెళ్ళింది.

జగదాంబ థియేటర్ లోపల ఓ మూల విసిరేసినట్టు వున్న ఓ గది దగ్గరకు నూకరత్నాన్ని తీసుకువెళ్ళాడు ఏకాంబర్. ఆ గది ముందు బయట నాలుగైదు చెప్పులు విడిచి వున్నాయి. ఆ చెప్పుల్ని చూస్తూనే అప్రయత్నం గా ఏకాంబర్, నూకరత్నం కూడా చెప్పులు అక్కడే విడిచిపెట్టేసారు.

గది తలుపులు తోసుకుని లోపలకు అడుగు పెట్టారు ఏకాంబర్, నూకరత్నం. ఆ గదిలో ఎవరో ఇద్దరు ముగ్గురు నిలబడి ఎదురుగా రివాల్వింగ్ చైర్ లో కూర్చున్న అతనితో మాట్లాడుతున్నారు.

ఏకాంబర్ ని, నూకరత్నాన్ని చూస్తూనే ఆయన వాళ్ళని వెళ్ళిపొమ్మని  సైగ చేసి వీళ్ళిద్దరికేసి తిరిగి చూసాడు.

"నమస్తే సార్!" అన్నాడు ఏకాంబర్. ఏకాంబర్ అలా అతనికి నమస్కారం చేయడం చూస్తూనే నూకరత్నం కూడా అప్రయత్నం గా రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది.

గదం తా ఏసి తో నిండిపోయి వుందేమో ఎండనపడి వచ్చిన నూకరత్నం మనసుకి ఎంతో హాయిగా వుంది.

ఎంతో ఆహ్లాదం గా వున్న ఆ గదిని ఓ కంట నిశితం గా పరిశీలించింది. గది అంతా సినిమాల తాలూకా షీల్డ్ ల తోనే నిండిపోయింది.
"కూర్చోండి "  హుందాగా అన్నాడతను.

ఏకాంబర్ ఆయన ఎదురుగా వున్న కుర్చీలో కూర్చున్నాడు. నూకరత్నం కేసి చూసి తన ప్రక్కనే వున్న కుర్చీలో కూర్చోమని సైగ చేసాడు.
"ఏకాంబర్ గారు! ఈ అమ్మాయి గురించేనా మీరు చెప్పింది?" నూకరత్నం కేసి చూస్తూ అన్నాడు అతను.

అవును సార్! ఈమె పేరు నూకరత్నం. అంటూ నూకరత్నం కేసి చూసి చిన్నగా నవ్వుతూ అన్నాడు ఏకాంబర్.

'నీకు ముందే చెప్పాను కదా సార్! ఈ థియేటర్ల యజమాని. రంగారావుగారు. నాకు బాగా కావలిసిన వారు. మా గురువు గారు. అంటూ ఆయన గురించి చెప్పి నూకరత్నానికి పరిచయం చేసాడు ఏకాంబర్.

ఏకాంబర్ అలా అనేసరికి ఏం మాట్లాడాలో అర్ధం కాక నవ్వుతూ అవునండి అనేసింది నూకరత్నం.

మీరు ఈ సహాయం చేసి పెట్టండి చాలు! రెండు, మూడు నెలల్లో డబ్బు చేతికందితే చాలు రంగారావుగారన్నారు.

అలాగే సార్! ఆ విషయం ఈమె తోనే మీకు చెప్పిద్దామని తీసుకువచ్చాను. అన్నాడు ఏకాంబర్.

నూకరత్నానికి తల గిర్రున తిరిగిపోతోంది.. ఏం చెప్పాడు?! ఏం చేయాలి? రెండు మూడు నెలలు ఏమిటీ?! నేను ఈయనకి సహాయం చేయడమేమిటీ? అంతా అగమ్య గోచరం గా వుంది. నూకరత్నానికి

ఇంతలో జగదాంబ థియేటర్ యజమాని రంగారావు గారికి ఫోన్ వచ్చింది.

"మీరు కూర్చోండి! నేను పది నిముషాల్లో వచ్చేస్తాను" అంటూ సెల్ఫోన్ లో మాట్లాడుకుంటూ రంగారావు గారు బయటకు వెళ్ళిపోయారు. గది తలుపులు దబ్ మని మూసుకున్న శబ్ధం విని ఒక్కసారే వెనక్కి తిరిగి చూసింది నూకరత్నం. ఆ గదిలో తామిద్దరే మిగిలారు.
ఏంటండీ! ఏదీ చెప్ప చెయ్యకుండా బైక్ మీద లాక్కొచ్చేసారు. తీరా ఇక్కడకొచ్చాక నాకు చెప్పనంటుంన్నారు. ఈ గోలంతా ఏంటండీ బాబూ!"  తలమీద చెయ్యేసుకుని ఎదురున వున్న టేబుల్ మీద ముడుకు ఆంచి విచారంగా అంది నూకరత్నం..చెప్పాలనే అనుకున్నాను. ఈయన ఉదయాన్నే ఫోన్ చేసి తనకి డబ్బు అవసరమని చెప్పి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? అని అడిగితే నిన్ను గాబరాగా లాక్కు వచ్చాను" అన్నాడు ఏకాంబర్.

అతని అవసరం నేనెలా తీర్చగలను. మీకు మతిపోయిందా?" చిరుకోపం గా అంది నూకరరత్నం.

రత్నం! నేను చెప్పింది విను. ఈయన మీ శ్రీ రాంచిట్స్ లో  కోటి రూపాయల చిట్ కడతాడట. రెండు నెలల్లో నువ్వు ఇప్పించేలా కమిట్ మెంట్ ఇస్తే వెంటనే కడతానంటాడు." నూకరత్నం కళ్ళల్లోకి చూసి చెప్పాడు ఏకాంబర్.

ఏకాంబర్ మాట వింటూనే అదిరిపడింది నూకరత్నం. ఒక్క క్షణం తన చెవులను తానే నమ్మలేకపోయింది. ఏకాంబర్ చెప్పింది నిజమేనా?!" నమ్మలేని నిజం వింటున్నట్టూ మొహం పెట్టి ఆశ్చర్యం,, ఆనందం, ఆతృత కలగలిపి అంది నూకరత్నం.

నేనైతే అబద్దం ఆడతాను. విన్నావుగా?! సారే అడుగుతున్నారుగా!" నూకరత్నం మొహం లోకి సూటిగా చూస్తూ అన్నాడు ఏకాంబర్.

"కొ...టి...?! ఒక్క చిట్టీ   కోటి రూపాయలు... ఎస్! విన్నాను. మా బ్రాంచి మేనేజరు ఎవరికో చెప్పగా విన్నాను. ఆయన్నే అడుగుదాం?! అంటూనే ఎన్.ఎ.డి బ్రాంచి మేనేజరు కరీం కి ఫోన్ చేసింది నూకరత్నం.

"చెప్పండి మేడం అడుగుదాం/" అట్నుండి ఎంతో మర్యాదగా అడిగాడు కరీం.

సార్! మన శ్రీ రాం కంపెనీలో కోటి రూపాయల చిట్ వుందా?!" ఆతృతగా అడిగింది నూకరత్నం.

కోటి రూపాయల చిట్టా?! ఇక్కడెక్కడా లేదు. ఈ నెల్లోనే హైద్రాబాద్ జోన్ లో స్టార్ట్ చేస్తున్నారు ఉండండి. నేను రీజనల్ మేనేజర్ గార్ని కనుక్కుంటాను" అంటూనే ఫోన్ కట్ చేసాడు బ్రాంచిమేనేజర్ కరీం.

"సార్ ఆర్.ఎం గార్ని కనుక్కుని చెప్తానన్నారు. నిజంగా ఈయన మన దగ్గర కోటి రూపాయల చిట్ కడతారంటారా??" ఆశ్చర్యం గా అడిగింది నూకరత్నం.

"కడతాననే నాకు ఉదయాన్నే ఫోన్ చేసి ఎవరైనా ఏజెంటు నీకు తెలిసుంటే తీసుకురా ఏకాంబర్ అని పిలిచారు. ఈయన నా దగ్గర ఇన్స్యూరెన్స్ ఎంత కట్టారో తెలుసా? ఏభై లక్షల రూపాయల పాలసీ! వాళ్ళ ఇంట్లో అందరి పేర పాల్సీలున్నాయీ చెప్పాడు ఏకాంబర్.
నాకు ఆశ్చర్యంగా వుంది. నా చెవుల్ని నేనే నమ్మలేకపోతున్నాను. నేనింతవరకూ పాతిక, ఏభై వేలు, లక్ష రూపాయల వరకే చిట్లు కట్టగలిగించాను. నువ్వే మొన్న ఐదు లఖ్షల రూపాయల చీటీ కట్టావ్! అదే ఎంతో గొప్పగా ఫీలయ్యాను. కానీ ఇది నిజంగా.. మనం కట్టించగలిగితే.. ఎంత బాగుంటుందో?!"

ఆనందం గా అంది నూకరత్నం.

"కట్టడం.. కట్టకపోవడం అంత మీ చేతుల్లోనే వుంది. ఎందుకైనా మంచిది మీ బ్రాంచి మేనేజర్ ని రమ్మను. సార్ కి ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతారు. అవి నీవు తీర్చలేవు." అన్నాడు ఏకాంబర్

"ఎస్! అలాగే!" అంటూ సెల్ తీసి రింగ్ చేద్దామనుకునేంతలోనే బ్రాంచి మేనేజరే ఫోన్ చేసాడు.

చెప్పండి సార్! సెల్ చెవి దగ్గర పెట్టుకుంటూ అంది.

"మేడం! మీరిప్పుడు ఎక్కడున్నారు? నేనూ, మన ఆర్. ఎం గారు కూడా అక్కడకు వస్తాం  . మీరు చిట్ కోసం వస్తాం  ఎక్స్ ప్లైన్  చెయ్యలేరు" అంటూ అడిగాడు కరీం.

ఆనందం గా జగదాంబా థియేటర్ అడ్రస్ చెప్పింది నూకరత్నం. కోటి రూపాయల చిట్ అంటే మాటలా? ఆర్. ఎం గారే స్వయం గా వచ్చేస్తున్నారు. మనసులోనే సంబరపడింది నూకరత్నం.

"ఏమైంది? వస్తున్నారా?" ఆతృతగా అడిగాడు ఏకాంబర్.

'ఆర్.ఎం గార్ని తీసుకుని వస్తున్నారట. పది నుఇముషాల్లో ఇక్కడ వుంటామన్నారు. సంతోషం గా అంది నూకరత్నం.

"పది నిముషాల్లోనా? ఎలా రాగలరు? చూద్దాం? అని ఏకాంబర్ అంటున్నంతలోనే ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ బయటకు వెళ్ళిన జగదాంబ థియేటర్ యజమాని రంగారావు గారు లోపలకు వచ్చారు.

"ఏమమ్మా! నేను చెప్పింది అర్ధమయ్యిందా?" అంటూ లోపలికి వస్తూ రివాల్వింగ్ చెయిర్ లో కూర్చుంటూ అడిగాడు ఆయన. సార్! మీతో మాట్లాడ్డానికి మా బ్రాంచి మేనేజరు, రీజనల్ మేనేజర్లు ఇద్దరూ వస్తున్నారు సార్! నేను కమిట్ మెంట్ ఇవ్వలేను కదా! వాళ్ళయితే మీకూ నమ్మకం వుంటుంది" నమ్రతగా అంది నూకరత్నం.

చాలా కరెక్టుగా చెప్పావమ్మా! కొందరు ఏజెంట్లు అంతా తమ చేతుల్లోనే వున్నట్టు లేనిపోని వాగ్ధానాలు  చేసేస్తారు. తీరా చిట్టీ కట్టాక మాట నిలబెట్టుకోరు. చిట్ కట్టాక మానెయ్యలేము కదా! మానేస్తే మొదట కట్టిన దాంట్లో ఒక్క రూపాయి కూడా రాదు. ఇలా చాలా మంది దగ్గర దెబ్బ తిన్నాను. అందుకే ఏకాంబర్ మీద నమ్మకం తో తనకు తెలిసిన వాళ్ళను తీసుకురమ్మాన్నాను. అంటూ చిన్నగా నవ్వాడాయన.
నిజమే సార్! మోసం చేసి ఎంత దూరం పారిపోగలం సార్! అంది నూకరత్నం.
ఎదిగేవాడు ఎదరే హుందాగా నిలబడతాడమ్మా. ఎగరాలనుకునేవాడు ఎవరికీ కనిపించకుండా పోతారు. ఎవరైనా ఎవర్నైనా ఒక్కసారే మోసం చెయ్యగలరు. అంతే! నవ్వుతూ అన్నాడాయన.
చాలా బాగా చెప్పారు సార్ అన్నాడు ఏకాంబర్.
"వాళ్ళు ఎంతసేపట్లో వస్తారో? కాఫీ, టీ ఏం తీసుకుంటారు?" అడిగాడు థియేటర్ ఓనర్ రంగారావు గారు.
సార్! అవేం వద్దు సార్! ఇంటి దగ్గర తీసుకునే బయల్దేరాం" అన్నాడు ఏకాంబర్.
"పోనీ ఒక పని చెయ్యండి. వాళ్ళు వచ్చేవరకూ థియేటర్లో కూర్చుని సినిమా చూస్తారా? అడిగారు రంగారావు గారు.
అయ్యే! వద్దండి. అలా బయట తిరిగి వస్తాం" అంది నూకరత్నం గాబరాగా.
"అలాగే చెయ్యండి. నేనీ లోపల నా కోసం ఒకరిద్దరు బయట వెయిట్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి పంపించేస్తాను." అన్నారాయన.
అలాగే సార్ అంటూ కుర్చీలోనుండి లేచి వెలుపలకు వచ్చారు ఇద్దరు. జగదాంబ సెంటర్ అంతా వచ్చీపోయే వాహనాలతో మహా రద్దీగా వుంది.
"ఎక్కడికీ వెళ్దాం?" ఆలోచిస్తూ అన్నాడు ఏకాంబర్.
"ఎక్కడికి వెళ్దాం అదిగో! ఆ బస్సు స్టాండులో కూర్చుందాం. మా బ్రాంచి మేనేజరు రాగానే నాకు ఫోన్ చేస్తారు కదా! అంది నూకరత్నం.
"అక్కడ్డొద్దులే" ఎవరనా చూస్తే మనల్ని కూడా పనీ పాటు లేని పోరంబోకులో జమకట్టేస్తారు. ఈ ప్రక్కనే ఆర్య భవన్ హోటల్ వుంది. లైట్ గా ఏదైనా తిని వద్దాం." అంటూ అటుకేసి నడిచాడు ఏకాంబర్.
ఏకాంబర్ ని అనుసరించింది నూకరత్నం.
ఇద్దరూ ప్రక్క ప్రక్కనే నడుస్తూ జగదాంబ నాలుగు రోడ్ల జంక్షన్ లో వున్న ఆర్యభవన్ హోటల్ కేసి వెళ్తున్నారు. ఇంతలో ఎదురుగా బైక్ మీద వస్తున్న ఓ వ్యక్తిని చూస్తూనే గబుక్కున ఏకాంబర్ వెనక్కి వెళ్ళి నక్కి దాక్కుంది నూకరత్నం. ఏకాంబర్ చేయి పట్టుకుని తల ఏకాంబర్ భుజం మీద వాల్చేసి నక్కి నక్కి నడుస్తూ ఏకాంబర్ ని అంటుకుపోయింది నూకరత్నం.
ఏమైంది? అలా దాక్కుని నడుస్తున్నావ్?  నూకరత్నం అలా తనని హత్తుకుపోయేసరికి ఏకాంబర్ శరీరం జలదరించింది. నెమ్మదిగా ఆమె బుజాల మీద చెయ్యి వేసి ఆప్యాయం గా పట్టుకుంటూ అన్నాడు ఏకాంబర్.
" మా మామయ్య గారి అబ్బాయి, బైక్ మీద వెళ్తున్నాడు. ఇలా చూస్తే చంపేస్తారు. భయం గా అంది నూకరత్నం.
"నువ్వేం తప్పు చెయ్యటంలేదు కదా! అయినా నువ్విప్పుడు సంపాదిస్తున్నావ్ కదా! నీ ప్రొఫేషన్ లో ఇలాంటివి తప్పు కాదు కదా" నవ్వుతూ అన్నాడు.
సంపాదిస్తే సాంప్రదాయాన్ని సంస్కారాన్ని వదిలెయ్యాలా?! సంపాదన కోసం గౌరవ మర్యాదల్ని చంపేసుకోవాలా?" కొంచెం దూరం వెళ్ళాక ఏకాంబర్ చేయి విడిచిపెట్టి నడుస్తూ అంది నూకరత్నం.   

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్