Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
varaha jayanti

ఈ సంచికలో >> శీర్షికలు >>

నో యువర్ ఛైల్డ్ (KYC) - భమిడిపాటి ఫణిబాబు

know your child

ఈ మధ్యన అదేదో వార్తాపత్రిక చదువుతుంటే "Know Your Child" అనే శీర్షిక కింద ఒక వార్త చదివాను. నవ్వొచ్చింది. " మన పిల్లల్ని గురించి " వేరే ఎవడో చెప్తే తెలిసికోవాలన్న మాట! కిందటేడాది బాంకుల వాళ్ళు   Know Your Customer (KYC) అని ఒకటి మొదలెట్టారు. అదేదో బాగానే ఉందనుకొన్నాను. ఈ పిల్లల విషయంకూడా KYC అనే అంటారుట. దీనికో Workshop నిర్వహిస్తారుట. ఈరోజుల్లో ప్రతీ దానికీ ఈ వర్క్ షాప్పులొక ఫాషన్ గా మారేయి.

అందులో తెలిసికొనే విషయాలేమిటయ్యా అంటే 1) మా పిల్లాడు పొద్దుటే లేవడూ 2) స్కూలుకెళ్ళడానికి పేచీ పెడతాడూ 3) అన్నం తినడూ 4)ఎప్పుడూ ఏడుస్తూంటాడూ వగైరా వగైరా..

ఇలాంటివన్నీ మన మోడర్న్ తల్లి తండ్రులు అక్కడున్నవాళ్ళకి చెప్తే  ఆ జ్ఞాన పండితులు ఆ సమస్యలు పరిష్కరిస్తారన్నమాట. దీనికి ఎంతో కొంత ఫీజ్ కూడా వసూలు చేస్తారుగా.ఇప్పటి పేరెంట్స్ కి చేతినిండా కావల్సినంత డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళెంత అడిగితే అంతా ఇస్తారు. Afterall money is no problem!. వీరిలాంటి  ఇంకొందరు తల్లితండ్రులు కూడా వచ్చి, అందరూ చర్చించి ఈ సమస్యని కూకటివేళ్ళతో పీకి పారేయడానికి నడుం కడతారన్నమాట.

భార్య నెల తప్పినప్పడినుంచీ మనవాళ్ళు ఈ రోజుల్లో ముందుగా మార్కెట్ కి వెళ్ళి Dr.Spock’s  Baby and Child Care పుస్తకం లేటెస్ట్ ఎడిషన్ కొని ఇంట్లో పెట్టేస్తారు. అదంతా మంచిదే. నెలలు దగ్గర పడేదాకా తల్లితండ్రులు కానీ, అత్తమామలు గానీ రారు కదా . కారణాలు అనేకం  ఉంటాయి. ఏమైతేనే ఓ బాబో, పాపో పుడతారు. ఇంక అప్పటినుండీ , వాళ్ళమీద ఎవర్నీ చేయి వేయనీయరు, అంతా అపురూపమే .ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, పాపం ఆ పసిపాపలకి కాళ్ళమీద పడుక్కోపెట్టుకొని వళ్ళంతా నూనె రాసి మర్దనా చేసి, శుభ్రంగా తుడిచి, చెవి లోనూ , ముక్కులోనూ తిరి పెట్టి ఆ తరువాత సాంబ్రాణి పొగ వేసి, తల్లికిస్తారు. ఆ పిల్లో, పిల్లాడో తల్లి దగ్గర శుభ్రంగా పాలు తాగేసి గుమ్ముగా నిద్రపోతుంది. మన అమ్మమ్మలూ, నానమ్మలూ ఇవన్నీ ఏ పుస్తకంలోనూ చదవలేదండి బాబూ- తరతరాలనుండీ వస్తున్న కార్యక్రమాలే ఇవన్నీ

ఇదంతా చూస్తూన్న ఆ యంగ్ పేరెంట్స్ కి మాత్రం ఒకటే టెన్షన్, తమ కలల పంటని వీళ్ళు ఇలా నలిపేస్తున్నారేమిటీ అని.మనం అందరమూ ఇలాగే పెద్ద అయ్యాము.ఏడాది దాటే దాకా ఎన్నెన్నో బాలారిష్టాలని దాటుకుంటూ పోవాలి. అందుకే ఈ రోజుల్లో చాలామంది జంటలు వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా  పెద్దవారిని ఇంట్లో పెట్టుకుంటారు. అదే ఏ అమెరికాయో,ఇంగ్లాండో అయితే తల్లితండ్రులనీ, అత్తమామల్నీ చెరో ఆరు నెలలూ ఉండేలా తెచ్చుకుంటారు ( వీళ్ళకి ఆరునెలలకంటే ఎక్కువ వీసా రాదుట). ఇలాంటి విదేశీ ప్రయాణాలకి తల్లులే ఎక్కువ అవసరం. తండ్రనేవాడు  ఓ Occupational hazard . ఒక్కొళ్ళు వస్తే ఇంకోళ్ళు ఫ్రీ అన్నమాట.ఈయన ఉత్తి న్యూసెన్స్ వాల్యూయే. ఆడువారు పాప ఆలనా పాలనా చూస్తూంటే ఈయన మిగిలిన పనులు -- డైపర్లు ఆరేయడం,పాల బాటిళ్ళు కడగడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తాడు.వాళ్ళ ఆరునెలల గడువు పూర్తికాగానే ఇండియా వచ్చేసి కనిపించినవాళ్ళందరికీ, అడిగిన వాడికీ, అడగనివాడికీ ఆ అమెరికా ఖబుర్లు చెప్పడం.

ఇక్కడ మనదేశం లో అయితే ఇంకా కొంతమంది పురిటికి ఆ అమ్మాయి పుట్టింటికి పంపేస్తారు, గొడవేలేదు.కానీ సిటీ ల్లో ఉండేవాళ్ళు " మీ పల్లెటూళ్ళో సౌకర్యాలు లేవు, ఇక్కడైతే మనకి కన్వీనియెంట్ గా ఉంటుందీ" అని వాళ్ళు ఉన్నఊళ్ళోనే తల్లితండ్రుల్ని, అత్తమామల్ని తెచ్చుకుంటారు.పురిటి సమయంలో తల్లి తప్పకుండా దగ్గర ఉంటే, ఆ పిల్లకి కూడా ధైర్యంగా ఉంటుంది.

పరిస్థితుల్ని బట్టి ఎవరో ఒకరు ఉండిపోతారు, కొద్దిగా పసిపిల్ల తల నిలిపేదాకా.కొంతమంది తల్లితండ్రులతో ఉండేవారుంటారు.

ఆ పిల్లకో, పిల్లాడికో నడక వచ్చిన తరువాత ప్రారంభం అవుతాయి తిప్పలు. ఈ తండ్రి అనే "ప్రాణి" కి అన్నీ టెన్షన్లే. ఆ పసిపాప టెలిఫోన్ లాగేయడమో, టి.వీ రిమోట్తో ఆడుకోవడమో చేస్తే

ఈయనగారి బ్లడ్ప్రెషర్ పెరిగిపోతూంటుంది.రోజంతా ఈయనకి అవి కాపాడడంతోటే సరిపోతుంది.ఇదంతా ఆ కొడుకు చూసేడంటే " వదిలేయ్ నాన్నా ఆడుకోనీ " అంటాడు. వాడికేంపోయిందీ, ఇవన్నీ నేను కొన్నవీ అనుకుంటాడు. ఇంక ఇంటావిడైతే " మీకు వయస్సు వచ్చేకొద్దీ చాదస్థం ఎక్కువైపోతూంది వదిలేయొచ్చుగా " అని చీవాట్లేస్తుంది.ఆతావేతా జరిగేదేమంటే ఈయనకి అందరిచేతిలోనూ  అక్షింతలే !

చివరకు తేలిందేమిటయ్యా అంటే ఈ ముసలి తల్లితండ్రులకి పిల్లల్ని పెంచడం రాదు. ఇంకా రాతియుగంలోనే ఉన్నారు.అందుకని ఎటువంటి సమస్య వచ్చినా సరే  గూగుల్ లోకి వెళ్ళి అదేమిటో దానిని ఎలా సాల్వ్ చేయాలో తెలిసేసికుంటారు కానీ, ఇంట్లో ఉండే పెద్దవారి మాటలు వినాలంటే నామోషీ ! ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవడం తప్పకుండా చాలా మంచిది, కానీ అలాగని “పాత “ వాటిని అసలు వినిపించుకోవద్దని ఏ శాస్త్రాలు చెప్పేయిట?

అది అర్ధం అవకపోతే పైన చెప్పిన విధంగా KYC ల దగ్గరకు పోతారు. " ఘర్ కీ ముర్గీ దాల్ బరాబర్" అన్నట్లుగానో, " పెరటి మొక్క వైద్యానికి పనిరాదు" అన్నట్లుగా బయటవాడెవడో చెప్తే అది వేదం. మిమ్మల్ని పెంచింది మీ తల్లితండ్రులే అన్న విషయం మరచిపోకండి.మీ పిల్లల్ని పెంచడం లోనూ వారి సలహాలు తీసికోవచ్చు.వాళ్ళు మీకుగానీ, మీ పిల్లలకి కానీ శత్రువులు కారు. ఒక్కసారి వారికి " ఫ్రీ హాండ్" ఇచ్చి ప్రయత్నించండి, మీకే తెలుస్తుంది.

చివరగా చెప్పేదేమిటంటే పైన చెప్పిన ఆ కన్సల్టెంట్ గారు తన పిల్లల్ని ఎలా పెంచుతున్నారో? చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడూ  లోకువే !!

మరిన్ని శీర్షికలు
Aratikaya Chicken