Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope (august 8 to  august 14th)

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam

అల్లసానిపెద్దన విరచిత స్వారోచిషమనుసంభవము

(గత సంచిక తరువాయి)

ఈ ఉపకారమునకుఁ బ్రతి
సేయఁగ శక్యంబె జంభజిన్నిభ! శఫరా
త్యాయతలోచన యైన మ
దీయాత్మజ నీకు నిత్తు దేవీమణిగన్‌.

నీవు చేసిన ఈ ఉపకారానికి ప్రత్యుపకారము చేయడం సాధ్యమవుతుందా! జంభాసురుడిని జయించిన దేవేంద్రునికి సమానుడవు నువ్వు! తళుకులీనే చేపవంటి దీర్ఘములైన కన్నులున్న ఈ చిన్నదాన్ని, నేను కానక కానక కన్నదాన్ని, నా కుమార్తెను నీకు దేవేరిగా ఇస్తాను, గ్రహించు! అంతేగాదు,

ఆయుర్వేదముఁ గైకొని
యీ యింతిం బెండ్లియాడు మెలమి రమా నా
రాయణ పరిణయ గేయ వి
గాయన గంధర్వ మైన కవ్వపుఁగొండన్‌.

‘నేను నేర్చుకున్న ఆయుర్వేద విద్యను కూడా నీకు బోధిస్తాను. దాన్ని కూడా స్వీకరించి, సంతోషంగా,  శ్రీలక్ష్మీ నారాయణుల వివాహ మహోత్సవానికి, ఆ మహోత్సవాన్ని నిరంతరమూ గానం చేసే గంధర్వులకు వేదిక ఐన మంధరగిరి మీద నా కుమార్తెను పెండ్లి యాడ వయ్యా ’ అన్నాడు ఇందీవరాక్షుడు. మంధరగిరిని కవ్వముగా చేసి, వాసుకిని త్రాడుగా చేసుకుని, దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలికారు కనుక మంధరగిరిని కవ్వపుకొండ అన్నాడు. ఆ పాలసముద్రాన్ని చిలికినప్పుడు అందులోనుండి జన్మించిన శ్రీమహాలక్ష్మి శ్రీ మహా విష్ణువును మంధరపర్వతం మీదనే వివాహముచేసుకున్నది, నువ్వు కూడా నా కుమార్తెను ఆ మంధరగిరి మీదనే వివాహం చేసుకుని, నా కుమార్తె, నువ్వు  లక్ష్మీ నారాయణులలాగా వర్ధిల్లండి, ప్రజలను తల్లిదండ్రులవలె పాలించండి అని ధ్వనిస్తున్నాడు ఇందీవరాక్షుని ద్వారా పెద్దన.మంధరగిరిమీద పెండ్లి చేసుకో నా కుమార్తెను అని వివాహ వేదికను సూచించాడు, అంతటితో ఆగకుండా ఆ వివాహవేదిక ప్రాశస్త్యాన్ని, మంధరగిరి ప్రాశస్త్యాన్ని ఇందీవరాక్షుడి ద్వారా ‘లయగ్రాహి’ అనే ఛందో మార్గంలో దివ్యంగా సంగీతమాధుర్యంతో చెప్పిస్తున్నాడు పెద్దన. కుమార్తెల వివాహ ప్రస్తావన చేస్తున్నప్పుడు అమ్మాయి పుట్టింట్లో ఒక వేదికను నిర్ణయించడం, ఆ వేదిక గురించి గొప్పగా చెప్పడం లోక సహజమైన విషయము, వధువు తల్లిదండ్రులకు. దానిని కూడా చమత్కారంగా సూచిస్తున్నాడు పెద్దన. 

అన్నగముపై జరఠ పన్నగపతిస్ఫట ల
న న్నెగసి కోటతుదల న్నెగడుకొమ్మల్‌
మి న్నగల రాయ రుచిఁ జెన్నగు విమానముల
పన్నుగడ పన్నుగఁ బ్రభిన్న గజఘోట
చ్ఛన్న గహనాపణముల న్నిగనిగద్యుతి ర
వి న్నగుమణి ప్రకర మున్న గరిమం బే
రెన్నఁగల యంగడుల వన్నె గని సంపదల
మన్నగరి యొప్పు బలభిన్నగరి ఠేవన్‌.

ఆ పర్వతముమీద వృద్ధుడైన ఆదిశేషుని పడగలా అన్నట్లు ఎత్తుగా తలలులేపి కోటచివరల కనిపించే శిఖరములున్నాయి (ఆ-నగముపై-జరఠ-పన్నగపతి-స్ఫటలనన్-ఎగసి-కోటతుదలన్-నెగడు కొమ్మల్‌) ఆకాశం పగిలి చిల్లులుపడేలా రాసుకుని, ఒరుసుకునేట్లు, కాంతులీనే శిఖరములుకలిగిన ప్రశస్తమైన నిర్మాణచాతుర్యము కలిగిన ఏడంతస్తుల మేడలున్నాయి! (మిన్ను- అగల – రాయ - రుచిన్ - చెన్నగు విమానముల- పన్నుగడ- పన్నుగ) మదించిన ఏనుగులు, గుఱ్ఱాలతో నిండిపోయి, చొరడానికి శక్యముకాని వీథులలో ఉన్న అంగళ్ళు  నిగనిగలతో సూర్యుడిని చూసి పరిహాసంగా నవ్వే, సూర్యుడిని ధిక్కరించే కాంతులీనే మణులున్నవని  పేరుమోసినవి (ప్రభిన్న- గజ- ఘోట - ఛన్న- గహన – ఆపణములన్ -నిగ నిగ ద్యుతిన్ – రవిన్ – నగు -మణి ప్రకరము - ఉన్న గరిమంబు – పేరెన్నగల -అంగడుల వన్నె- కని) ఆ వన్నెలు గని, ఆ సంపదలను చూసి, నా నగరము దేవేంద్రుని నగరమైన అమరావతిలా ప్రశస్తమైనది. ( సంపదలన్ – మత్ – నగరి – ఒప్పున్ – బలభిత్ - నగరి ఠేవన్‌) ఇందీవరాక్షుని రాజధాని మంధర పర్వతం మీద ఉన్నది. ఆ పర్వత నగరి గురించి, తన రాజధాని గురించి పొగుడుతున్నాడు ఇందీవరాక్షుడు, దీన్ని అడ్డు పెట్టుకుని పెద్దన రాయల రాజధానిని వర్ణిస్తున్నాడు!

అని నిజోదంత మావంత యైన దాఁప
కంతయును జెప్ప నద్భుతం బంతరంగ
మంతయును నిండ హర్షించె నా స్వరోచి,
యంత రవి యేఁగెఁ బశ్చిమాశాంతమునకు.

ఆ విధముగా నిజ వృత్తాంతమును ఆవగింజంత కూడా దాచి పెట్టకుండా సంపూర్ణముగా చెప్పాడు ఇందీవరాక్షుడు. స్వరోచి మనసు ఆ అద్భుతమైన గాథతో నిండిపోయి, సంతోషించాడు. ఇంతలో సాయంసమయము ఐంది. సూర్యుడు పడమటి దిక్కుకు మరలాడు ఆకాశంలో. ఇక సాయంసంధ్యా వర్ణన చేస్తున్నాడు పెద్దన. ఇప్పుడు గంధర్వునిలో తమోగుణం, రజోగుణం నశించిపోయాయి, స్వచ్ఛమైన సాత్విక గుణం ప్రకాశిస్తున్నది, ఇక దాపరికాలు, వంచనలు, కల్పనలు ఉండవు, కనుక నిజవృత్తాంతాన్ని ఆవగింజంతకూడా దాచిపెట్టకుండా జరిగినది అంతా జరిగినట్టు చెప్తున్నాడు అంటున్నాడు పెద్దన.

వికసిల్లం బ్రజ చక్రపాలనము గావించెం, గరవ్యాపృతిం
గకుబంతంబుల నాక్రమించెఁ, బొసఁగంగా నేర్చె వర్ణాళిఁ, గాం
తికిఁ బాపెం బెఱరాజకోటిఁ, దుది శాంతిం బొందె, దైవంబు సేఁ
తకుఁ దాపం బిఁక నేలనంగ నినుఁడస్తప్రాప్తుఁ డయ్యెంగడున్‌.

సాయంసంధ్యా వర్ణన చేసిన ఈ పద్యంలో అనన్య సామాన్యమైన చమత్కారాన్ని ధ్వనిగా చూపించాడు పెద్దన. అటు  సూర్యుడిని, యిటు ఒక సామాన్య చక్రవర్తిని ధ్వనించాడు అని మహానుభావులైన పెద్దలు, సంస్కృతాంధ్ర సాహిత్య  సాగరములను మధించినవారు అభిప్రాయపడ్డారు పూర్వము వెలువడిన మనుచరిత్ర వ్యాఖ్యానాలలో. ఆ పెద్దలపాద రజోలేశాన్ని కూడా పోలని అల్పుడిని నేను, కానీ నాకు మరొక ధ్వని, స్వరోచిని సూచించిన ధ్వని కూడా కనిపిస్తున్నది  ఈ పద్యములో!  ఇనుడు అంటే సూర్యుడు అని, రాజు అని కూడా అర్థము. ప్రజలు వికసించేట్లు అంటే సంతోషపడేట్లు చేశాడు సూర్యుడు  పగలంతా, తన కాంతితో, వేడిమితో. ఉత్తముడైన రాజు కూడా అదే చేస్తాడు. చక్రవాక పక్షులను కరుణించాడు సూర్యుడు  (చక్రపాలనము కావించెన్). చక్రవాకపక్షులు చీకటిలో తమతమ జంటపక్షులను ఎడబాసి, తమ గూళ్ళను కనుక్కోలేకుండా  పోయి, రాత్రంతా అలమటించి, ఉదయముతో తమ జంటపక్షులను, తమ గూళ్ళను కనుగొని సంతోష పడు తాయి   అని, చక్రవాక పక్షులు సూర్యుడి రాకకు సంతోషిస్తాయని కవి సంప్రదాయము, చకోర పక్షులు చంద్రుని రాకకు సంతోషిస్తాయని కూడా. మహానుభావుడు మయూరుడు తన సూర్యశతకంలో ‘ ప్రాచి ప్రాగాచారన్త్యోనతి చిరమచలే చారు చూడామణిత్వం. అనే ఒక అద్భుతమైన శ్లోకంలో చక్రవాకపక్షుల గాథను అత్యద్భుతంగా వర్ణించాడు. ఉదయకాలంలో పక్షులు ఆనందంగా  కూస్తాయి, రాత్రుళ్ళు గుబులుగా, భయంగా ముణగదీసుకుని కూస్తాయి, చూస్తాయి! ఇక రాజు చక్రపాలనము చేస్తాడు అంటే భూమండలాన్ని పరిపాలిస్తాడు. కరములు అంటే కిరణములు, చేతులు అని కూడా అర్థము. తన కిరణములతో దిక్కులను ఆక్రమించి సమస్త సృష్టినీ పాలించాడు సూర్యుడు. తన చేతులతో, వీరత్వపు చేతలతో దిక్కులన్నిటినీ జయిస్తాడు చక్రవర్తి.  సూర్యుడు వివిధ రంగులను తేటతెల్లం చేసి వర్ణవైవిధ్యాన్ని ఎరుకపరిచి రంజింపజేశాడు సమస్త సృష్టిని. చక్రవర్తి వివిధ వర్ణములవారిని  సామరస్యంగా ఉండేట్లు, స్నేహంగా, ప్రేమతో మెలిగేట్లు చేస్తాడు, పాలిస్తాడు.  సూర్యుడు తనకు పరాయివాడు ఐన చంద్రుడిని, ఇతర నక్షత్రములను కాంతి లేకుండా చేశాడు తన ప్రచండమైన కాంతులతో. చక్రవర్తి తన ప్రతాపముతో పరాయి, శత్రు రాజుల కాంతిని, వన్నెను, కీర్తిని మాపేస్తాడు.  ఇంతా చేసిన తర్వాత, తన విధిని నిర్వర్తించి, సమస్త సృష్టిని కరుణించినతర్వాత సూర్యుడు శాంతిని పొందాడు, అస్తమించాడు. తన క్షాత్రధర్మాన్ని నిర్వర్తించి, విజయలక్ష్మిని వరించి, ప్రజారంజకంగా పాలించి, శాంతిని సంతృప్తిని పొందుతాడు చక్రవర్తి. యిది దైవాజ్ఞ, ఆ ప్రకారమే ఉదయము, అస్తమయము, దానికి చింత ఎందుకు, చేయవలసింది, చేయగలిగింది చేశాను అన్నట్లుగా సూర్యుడు అస్తమించాడు. నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను, జరిగినదంతా, ఇకముందు జరుగబోయేదంతా భగవంతుని ఆజ్ఞ, ఆయన లీల, ఆ ప్రకారమే జరిగింది, ఇకముందు జరుగుతుంది అని సుక్షత్రియ వీరుడు తన జీవనాన్ని చాలిస్తాడు, శాంతిని పొందుతాడు. ఇదంతా సూర్యుడికీ, ఒక చక్రవర్తికీ అన్వయించుకొగలిగిన విధంగా చెప్పాడు పెద్దన.

స్వరోచి కూడా ప్రజలు సంతోషించేలా భూమండలాన్ని పరిపాలించాడు, నలుదిక్కులనూ ఆక్రమించుకున్నాడు తన భుజబలముతో, సమస్తవర్ణముల వారిని సామరస్యముగా మెలిగేట్లు, అందరికీ సమానముగా అవకాశాలు, ఆనందము కలిగేట్లు పాలించాడు, అంతే కాదు వివిధ వర్ణములవారిని తన వేట అనే ఆటలో ఏర్చి కూర్చి నియోగించాడు,  నలుపు తెలుపులనే రంగులను, పాపము పుణ్యము అనే విచక్షణను తెలుసుకునేట్లు చేసి, పాపాన్ని నివారించి, నాశనము చేసి, ఇందీవరాక్షుడిని, యుద్ధములో తన శత్రువును కాంతిహీనుడిని చేసి పరాజయము పాలుజేశాడు, ఆతనిలో పశ్చాత్తాపము కలిగించాడు, తర్వాత శాంతిని పొంది ప్రసన్నంగా గంధర్వుడి కథను వింటున్నాడు, ఇదంతా భగవంతుడి లీల అని, ఇలా జరగాల్సి ఉంది, జరిగింది, ఇక కోపం తాపం ఎందుకు అని శాంతిని పొందాడు స్వరోచి, ఆతనిలో కోపపు వేడి అస్తమించింది!

అసురవరుఁడైన యిందీవరాక్షుమేన
నంటుకొన్న స్వరోచిబాణాగ్ని వోలె
నంతఁ గనుపట్టె శుకతుండ కాంతిఁ దెగడి
సాంధ్య రాగంబు పశ్చిమాచలమునందు.

రాక్షస రూపములో ఉన్న ఇందీవరాక్షుని శరీరానికి అంటుకున్న స్వరోచియొక్క బాణాగ్నిలాగా, ఆ గాయాల లాగా, చిలుక నోటి రంగులాగా ఎర్రని కాంతి, సంధ్యారాగము అలదుకున్నది పడమటి కొండకు.  స్వరోచి ఆగ్నేయాస్త్రమును ప్రయోగించి  ఆ రాక్షసుడిని దహించి, బూడిద చేశాడు అన్నది తెలిసిందే!

తలచూపె నప్పు డఖిలాశల 
దట్టపు టిరులు చిలువ జవరాలు నభ
స్స్థల మండపకోపరి సీ
మల నిడిన సితాండపటలి మాడ్కిం జుక్కల్‌.

అప్పుడు ఆ సంధ్యారాగపు అరుణిమ కనిపించిన వెంటనే, అన్ని దిక్కులలో దట్టమైన చీకటి పాములాగా ప్రాకింది. ఆకాశము అనే మంటపము మీద, వేదికమీద ఆ చీకటి అనే పాము పెట్టిన తెల్లని గుడ్లేమో అన్నట్లు తెల్లని చుక్కలు పొడిచాయి! ఎంతటి అద్భుతమైన, వినూత్నమైన వర్ణన చేశాడు పెద్దన! 

సాంధ్యనటన చండ చండీశ పద హతిఁ
ధరణిచక్ర మొరగి శరధిఁ గ్రుంగ
దోరగల్లువడియె భూ రథేతర భాగ
చక్రమనఁగ నపుడు శశియుఁ దోఁచె.

ఇంతలోనే చంద్రుడు ఉదయించాడు, మామూలుగా ఉదయించలేదు, సంధ్యా సమయములో శివుడు తాండవము చేస్తున్నపుడు ఆ పాదతాడనపు తాకిడికి, భూమి ఒరిగిపోగా, భూమికి ఉన్న రెండు చక్రములలో సూర్యుడు అనే చక్రము ( తరణి చక్రము) కృంగిపోగా, పైకి లేచిన రెండవ చక్రమేమో అన్నట్లు చంద్రుడు పైకి లేచాడు, చంద్రోదయం అయ్యింది. త్రిపురాసుర సంహార సమయములో భూమిని రథముగా, సూర్యచంద్రులను రథచక్రాలుగా చేసుకున్నాడు శివుడు, కనుక ఆ పోలిక సమంజసమైంది. ఏ రథమైనా ఒక చక్రము క్రుంగిపోతే ఆ చక్రమున్న వైపు ఒరిగిపోతుంది, రెండవ ప్రక్కనున్న చక్రము పైకిలేస్తుంది, యిది లోకానుభవ పరిచయము, వెరసి తులలేని పెద్దనపద్య సుమచయము, కవనవన పుష్పాపచయము!

తమ మను కాలాహి ప్రపం
చము నెరగొని యోషధీశ సద్యఃకృత దం
డమున మగుడంగఁ గ్రక్కెడు
క్రమమున నొయ్యొయ్య విచ్చి కడలకుఁ దొలఁగెన్‌.

చంద్రోదయము జరగడంతో చీకట్లు క్రమక్రమముగా తప్పుకున్నాయి, ఎలా తప్పుకున్నాయీ అంటే, చీకటి అనే నల్లత్రాచు ఎరగా పట్టుకున్న ప్రపంచమును చంద్రుడు అనే ఓషధీశుడు వెంటనే చేసిన దండనముతో, తిరిగి కక్కినట్లు నెమ్మది నెమ్మదిగా చీకట్లు తప్పుకున్నాయి. చంద్రుడు ఓషధీశుడు కనుక వైద్యుడిగా, పాము కాటుకు చికిత్స, దండనము చేసేవాడిగా రమ్యముగా వర్ణింపబడ్డాడు. ఒక రసమయమైన, అపూర్వమైన వర్ణనను ఇలా చంద్రుడిపరముగా ఇక్కడ పెద్దన చేస్తే, మయూరుడు తన సూర్య శతకములో ఒక శ్లోకములో ‘..కాల వ్యాళా వలీఢం  జగదగద ఇవోత్థాపయన్ ప్రాక్ప్రతాపః ‘ కాలము అనే నల్లత్రాచుచే కరవబడి, కళ్ళు తేలేసి,  సమస్త అవయవాలు, ఇంద్రియాలు పనిచేయకుండాపోయి, ఉండీ లేనట్టున్న శ్వాస మాత్రమే మిగిలి ఉన్న జగత్తు అనే చీకటిసర్పదష్టుడిని మరలా మామూలుగా చేసి లేపి నిలబెట్టే వైద్యునిలా లేపుతున్నాడు సూర్యుడు అని చెప్పాడు. తన ప్రబంధ ప్రారంభములో పెద్దన ప్రస్తుతి చేసినవారిలో ‘మయూరుడు’ కూడా ఉండడం గమనార్హము, మయూరుని వర్ణనల ప్రేరణతో విభిన్నమైన వినూత్నమైన వర్ణనలు చేశాడు అనడానికి యివి ఆధారాలు, ఎంత విస్తృతముగా చదివితే అంత విభిన్నముగా, విలక్షణముగా వ్రాయగలిగే నేర్పు అబ్బుతుంది , మహాకవులందరూ తమ పూర్వీకులను, సమకాలికులను క్షుణ్ణంగా చదువుకున్నవారే!

కలయ వెల్లువగట్టి జలజలఁ బ్రవహించు, శశికాంతవాంత నిర్ఝరముజలము
మలయానిలముచే దుమారంబు రేఁగు సౌ, గంధికంబు రజంబు కఱకుదుమ్ము
నిండార విరిసిన బొండుమల్లెల నుండి, వడియు మరందంబు గుడరసంబు
తొలఁకి మింటికిఁ బొంగు దుగ్ధపాథోరాశి, కరడులమీఁది మీఁగడల మెఱుఁగు

తనకు రసవర్గములుగా సుధాకరుండు
సారె సారెకుఁ గరములు సాఁచి చాఁచి
యచ్చ తెలుపుగ నపుడు బ్రహ్మాండ మండ
పంబు వెన్నెల సన్నసున్నంబు సేసె

ఇక్కడ మరొక అద్భుతమైన వర్ణన చేశాడు పెద్దన. దీనిలోనూ మయూరుడి ప్రేరణ కనిపిస్తుంది. సుధాకరుడు అంటే చంద్రుడు అని మాత్రమే కాక, సున్నపు బట్టీ, గచ్చు చేసే పనివాడు అని కూడా అర్థం. పాలగచ్చును నీరు, గండ్ర ఇసుక, బెల్లపు పాకము, తెల్ల మీగడ లేదా సున్నము వీటన్నిటినీ తగిన పాళ్ళలో కలిపి రంగరించి చేస్తారు. ఇక్కడ చంద్రుడు అనే ‘పాలగచ్చు పనివాడు’ తన(చంద్ర)కిరణ స్పర్శచే ద్రవిస్తున్న చంద్రకాంత శిలల ద్రవాన్ని నీరుగా, మలయపవనాలకు రేగుతున్న పుప్పొడి రేణువులనే గండ్ర ఇసుకగా, నిండుగా విరబూసిన బొండుమల్లెల మకరందమునే బెల్లపు పాకముగా, చంద్ర కాంతికి ఉవ్వెత్తున ఎగసిపడే పాల సముద్రపు అలల నురుగును మీగడగా, వీటన్నిటినీ తనకు రసవర్గములుగా, సాధనములుగా తీసుకుని మాటిమాటికీ కరములను అంటే చేతులను, కిరణములను సాచి సాచి ప్రసరించి ‘అచ్చమైన తెల్లని రంగులో’ బ్రహ్మాండము అనే మండపాన్ని తన వెన్నెలతో రంగరించి పాలగచ్చు చేసిపారేశాడు! మయూరుడు ‘ జ్యోత్స్నాంశాకర్ష పాండు ద్యుతి..’ అనే శ్లోకములో ‘ సూర్యుడు అనే చిత్రకారుడు అప్పుడప్పుడే కనుమరుగు అవుతున్న వెన్నెలను తెల్ల రంగుగా, మాయమవుతున్న నల్లని చీకట్లను నల్ల రంగుగా, సరస్సులలోని విచ్చుకుంటున్న కమలముల పుప్పొడి రేణువులను పసుపు పచ్చని రంగుగా, ఉదయకాలపు సంధ్యా వర్ణమును ఎర్రని రంగుగా ఉపయోగించి జగత్తు అనే వర్ణ చిత్రాన్ని రచిస్తున్నాడు’ అని అద్భుతముగా వర్ణించాడు. శ్రీనాధుడు తన ‘కాశీ ఖండము’లో యిదే శ్లోకాన్ని పూర్తిగా అనువాద రూపకముగా ‘ తరసి వెన్నెలలోని ధావళ్యమొక కొంత..’ అనే పద్యములో రచించాడు, శ్రీనాధుడు మయూరుడిని విపరీతముగా ఆరాధించాడు, అనుసరించాడు, కాశీ ఖండములో అనేక పద్యాలను మయూరుని సూర్యశతకములోని శ్లోకాలకు అచ్చు అనువాద రూపకములుగా రచించాడు! 

తనుఁ బాసి శశి దవ్వు చనిన నెవ్వగఁ బోలెఁ, దొలిదిక్కు జవరాలు వెలుకఁ బాఱెఁ
బ్రథమాద్రిసభయందుఁ బఱిచిన కెంబట్టు, జముకాణ మనఁగ రాగము జనించె
ధవుఁ గూర్మి కొసరుచున్నవి వోలె ముఖరాళి , వనరుహాస్యములఁ బద్మినులు తెఱచె
భానూష్మభీతి మున్పడిన చుక్కలభంగి, దొరలె వేకువగాలిఁ దరుల మంచు 

కాలగుణయుక్తి మింటి చక్కటికి నెగయ
వాసవునిపట్టి పొడవుగా వైచి యాడు
గచ్చు చమరిన దారు చక్రంపు బిళ్ళ
వోలె నొయ్యనఁ బ్రాచి లేఁ బ్రొద్దు పొడిచె. 

క్రమక్రమముగా రాత్రి గడుస్తున్నది. తనను విడిచిపెట్టి తన ప్రియుడు ఐన చంద్రుడు దూరముగా  వెళ్ళిపోతున్నాడు 

అనే దిగులుతో అన్నట్లుగా తూర్పుదిక్కు తెల్లబారుతున్నది. తూర్పుకొండపై జరుగబోయే సభలో పరచిన పెద్ద, ఎర్రని, 

పట్టు‘జంపఖానా’ అన్నట్లు ఉదయసంధ్యారాగం  తూర్పున  అలుముకుంటు న్నది. తామర తీగలు అనే ప్రియురాళ్ళు 

తమ నాథుడైన సూర్యుడిని గారంగా కొసరుతున్నట్లు ధ్వనులు చేస్తున్న తుమ్మెదల రొదలతో పద్మములు మెల్లగా 

తెరుచుకుంటున్నాయి, విచ్చుకుంటున్నాయి. సూర్యుడు రాబోతున్నాడు అనే భయముతో, ఆతని వేడిమికి భయపడి 

ముందుగానే రాలిపడిన చుక్కలేమో అన్నట్లు ఉదయకాలపు గాలికి చెట్లమీది మంచుబిందువులు రాలిపడుతున్నాయి. 

వాసవుడు అంటే ఇంద్రుడు. తూర్పు దిక్కుకు అధిపతి ఐన ఇంద్రుని కుమారుడైన జయంతుడు బాల్య లక్షణముతో 

ఆడుకోడానికి కాలము అనే దారానికి కట్టి ఎత్తుగా ఎగరేసిన రంగు రంగుల కొయ్య చక్రపు బిళ్ళ అన్నట్లు ఇంతలోనే 

తూర్పుదిక్కున సూర్యుడు ఉదయించాడు, పొద్దు పొడిచింది. 

ఈ గతి నత్తఱిఁ దెలతెల
వేఁగిన గంధర్వపతికి వేగుట విని తా
రాగమున కేఁగి కాంచిరి
రాగమ్మునఁ గొలిచి మను పురాతన ఖచరుల్‌.     

ఈవిధముగా ఆ సమయములో తెలతెలవారగా, గంధర్వపతికి శాపవిమోచనము కలిగింది అని తెలుసుకున్నవారు, 

ప్రేమగా అతడిని కొలుచుకుంటూ బ్రతికే (రాగమ్మునఁ గొలిచి మను) పురాతన సేవకులైన ఖేచరులు, గంధర్వులు ఆ 

వెండికొండకు, మంధరపర్వతానికి వెళ్లి (తారాగమున కేఁగి) తమ ప్రభువైన ఇందీవరాక్షుడిని చూశారు. 

(కొనసాగింపు వచ్చే వారం)   

***వేంకట వరప్రసాదరావు

తనుఁ

మరిన్ని శీర్షికలు