Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

తొలిసారి నాకు నేను న‌చ్చాను - శ‌ర్వానంద్‌

Interview with Sharwanand

''మంచి హీరో...'' అనిపించుకోవ‌డం కంటే, ''మంచి న‌టుడు...'' అని పిలిపించుకోవ‌డ‌మే క‌ష్టం. తొలి సినిమాతోనే అలా అనిపించుకొన్నాడు... శ‌ర్వానంద్‌. వెన్నెల‌, అమ్మ చెప్పింది, గ‌మ్యం,  ప్ర‌స్థానం, అంద‌రిబంధువ‌యా... - నో ఛాన్స్ - న‌టుడిగా ఎక్క‌డా ఫెయిల్ కాలేదు. కావ‌ల్సిన దానికంటే ఎక్కువ మార్కులే తెచ్చుకొన్నాడు. కానీ ఒక్క‌టే లోటు.. క‌మ‌ర్షియ‌ల్ హిట్ ద‌క్క‌లేదు. ఎన్నిర‌కాలుగా ప్ర‌య‌త్నించినా.. దాన్ని అందుకోవ‌డం సాధ్యం కాలేదు. చివ‌రికి కో... కోటి అనే మాస్ సినిమా చేసి, త‌న‌ది కాని దారిలో వెళ్లినా వ‌ర్క‌వుట్ కాలేదు. ఇన్నాళ్ల‌కు  అత‌ని ఆశ‌లు నెర‌వేరాయి. త‌న కెరీర్‌లోనే తొలి క‌మ‌ర్షియ‌ల్ హిట్ ద‌క్కించుకొన్నాడు. అదీ...సోలోగా. ర‌న్‌రాజా ర‌న్‌తో బాక్సాఫీసు ద‌గ్గ‌ర కాసుల గ‌ల గ‌ల‌లు విన్నాడు. ఈ హ్యాపీ మూడ్‌లో ఉన్న శ‌ర్వానంద్‌తో ముచ్చ‌టించింది గో తెలుగు. ఆయ‌న చెప్పిన `స‌మ్` గ‌తులు...

* ర‌న్‌రాజా ర‌న్ ని బాక్సాఫీసు ద‌గ్గ‌ర ప‌రుగులు పెట్టిస్తున్నందుకు కంగ్రాట్స్‌....
- థ్యాంక్సండీ. అయితే నేనొక్క‌డినే ప‌రుగులు పెట్టించ‌డం లేదు. మా టీమ్ అంతా ప‌డిన క‌ష్ట‌మిది. దానికి ఓ అద్భుత‌మైన ప‌లితం ఇచ్చారు ప్రేక్ష‌కులు.. వాళ్ల‌కంద‌రికీ స్పెష‌ల్ థ్యాంక్స్‌..

* మొత్తానికి కెరీర్‌లో మొద‌టి క‌మ‌ర్షియ‌ల్ హిట్ చూశారు..
- అవునండీ. హిట్ అనే మాట కోసం ప‌రిత‌పించిపోయా. ఏ సినిమా చేసినా శ‌ర్వా బాగున్నాడు, బాగా చేశాడు.. అంటుంటారు. కానీ సంతృప్తి దొర‌క‌లేదు. అది ఎలా ఉంటుందో ర‌న్ రాజా ర‌న్ చూపించింది.

* ఇది వ‌ర‌కు శ‌ర్వానంద్ అంటే సీరియ‌స్ రోల్స్. ఈ సినిమాతో పంథా మార్చిన‌ట్టేనా?
- అదేంటోనండీ. ముందు నుంచీ నాకు అలాంటి పాత్ర‌లే వ‌స్తుండేవి. నేను కూడా వాటికి అల‌వాటు ప‌డిపోయానేమో అనిపించింది. కానీ సుజిత్ న‌న్ను ఈసినిమాతో పూర్తిగా మార్చేశాడు. నా బాడీ లాంగ్వేజ్‌, మాట తీరు పూర్తిగా మారిపోయాయి. తెర‌పై న‌న్ను నేను చూసుకొంటే న‌మ్మ‌లేక‌పోయా. ఓ హుషారైన సినిమా చేయ‌రా బాబూ.. అని ఇంట్లో వాళ్లు గోల పెడుతుండేవాళ్లు. ర‌న్ రాజా ర‌న్ ట్రైల‌ర్ వ‌చ్చిన వెంట‌నే.. ఈ సినిమాని వాళ్ల‌కు చూపించాలి అనిపించింది. తొలి సారి నాకు నేను న‌చ్చా.. (న‌వ్వుతూ)

* ఏ విష‌యంలో...
- ఏ సినిమా చేసినా.. ఆర్టిస్టుగా సంతృప్తి పొందేవాడిని కాదు. అరె.. ఇలా చేసుంటే బాగుండేది, ఇంకాస్త బాగా చేయాల్సింది అనిపించేది. కానీ... ఈ సినిమా  మాత్రం పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చింది.

* ర‌న్ రాజా ర‌న్ క్రెడిట్స్ ఎవ‌రికిస్తారు?
- మొద‌టి క్రెడిట్ ద‌ర్శ‌కుడికే. ఓ మంచి క‌థ రాసుకొని, ఈ క‌థ‌ని నేనైతే న్యాయం చేస్తాన‌ని  నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. దానితో పాటు పాటు టీమ్ కూడా బాగా కుదిరింది. నాతో... ఇంత భారీ స్థాయిలో సినిమా తీసిన నిర్మాత‌ల‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి.  మ‌రో మాట‌.. మీడియా అంతా ఈ సినిమాని బాగా స‌పోర్ట్ చేసింది. శ‌ర్వాకి ఒక్క హిట్ ప‌డితే బాగుణ్ణు అని కోరుకొన్నారు వాళ్లంతా. సినిమా విడుద‌లైన రోజునుంచీ ఒక్క‌టే ఫోన్లు. అందులో మీడియావాళ్లూ ఉన్నారు. వాళ్ల అభిమానం చూస్తే.. క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయి. ప‌దేళ్ల నుంచీ న‌న్ను కాపాడుకొంటూ వ‌స్తున్నారు. నిజంగా అది చాలా చాలా గొప్ప విష‌యం. అందుకే ఈ సంద‌ర్భంగా మీడియాకీ థ్యాంక్స్ చెబుతున్నా.

* ఇక జోన‌ర్ మార్చిన‌ట్టేనా?
- ఇక్క‌డ మీకో విష‌యం చెప్పాలి. అస‌లు నేను ఇలాంటి జోన‌ర్‌కి స‌రిపోతానా?  అని ఎప్పుడూ ఊహించ‌లేదు. ద‌ర్శ‌కుడు న‌మ్మి.. నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. ఈ సినిమా చేశాక‌.. ఇంత స్పంద‌న చూశాక నాకిప్పుడు అనిపిస్తుంది. ఓహో.. న‌న్ను ఆడియ‌న్స్ ఇలా కూడా రిసీవ్ చేసుకొంటారా..??  అనిపిస్తోంది.  త‌ర‌వాతి సినిమా ఏం చేయాలో అర్థంకానంత క‌న్‌ఫ్యూజ‌న్‌లో ఉన్నా. కాక‌పోతే ఒక్క‌టి మాత్రం నిజం. నా ప‌నిని నేను ఎంజాయ్ చేస్తా. క‌థ‌కి ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుంటాను. మున్ముందు కూడా క‌థ‌నే న‌మ్ముకొని ప్ర‌యాణం చేస్తా. కాక‌పోతే నా క్యారెక్ట‌ర్లో ఈ మాత్రం జోష్ ఉండేలా జాగ్ర‌ర్త ప‌డ‌తా.

* ఇండ్ర‌స్ట్రీ నుంచి వ‌చ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమి??
- సినిమా చూశాక ర‌మేష్ ప్ర‌సాద్ గారు కాల్ చేశారు. `శ‌ర్వా.. ఈమ‌ధ్య సినిమాలు చూడ‌డం లేదు. కానీ పోస్ట‌ర్ బాగుంది క‌దా, ఓ ఐదు నిమిషాలు... చూద్దామ‌ని థియేట‌ర్‌కి వెళ్లా. సినిమా మొత్తం చూసొచ్చా. నీ వ‌ల్ల నేను లంచ్ కూడా చేయ‌లేదు. హిట్ వ‌చ్చింది క‌దా, అని క‌ళ్లు నెత్తికి ఎక్కించుకోకు... కాస్త ఆలోచించి అడుగేయ్‌` అన్నారు. ఆ ఫోన్ కాల్ ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను.

* ఇక మీద‌టా కొత్త ద‌ర్శ‌కుల‌కు అవకాశాలిస్తారా?
- త‌ప్ప‌కుండా. నాకు మంచి పేరు తీసుకొచ్చిన సినిమాల్నీ దాదాపుప‌గా కొత్త ద‌ర్శ‌కుల‌తో తీసిన‌వే. వాళ్లు మంచి ఫైర్‌తో వ‌స్తారు. నాకూ కావ‌ల్సింది అదే.

* మ‌ళ్లీ సొంత బ్యాన‌ర్‌లో సినిమా ఎప్పుడు?
- అమ్మో.. అంత రిస్క్ ఇప్పుడు తీసుకోను. ఒక‌సారి చేతులు కాలాయి.. ఇంకా ఆ అనుభవాలు గుర్తున్నాయి.

* పెళ్లెప్పుడు?
- ఇప్పుడిప్పుడే నా జీవితంలో మంచి విష‌యాలు జ‌రుగుతున్నాయి. దానికీ ఓ టైమ్ వ‌స్తుంది. నా పెళ్లి బాధ్య‌త పూర్తిగా అమ్మానాన్న‌కే వ‌దిలేశా. వాళ్లేం చెబితే అదే..

* త‌ర‌వాతి సినిమా ఏమిటి?
- చెప్పానుక‌దా, ఇప్పుడు కొంచెం క‌న్‌ఫ్యూజ‌న్‌లో ఉన్నా. ఎలాంటి సినిమా చేయాలి అన్న‌ది ఆలోచించుకోలేక‌పోతున్నా. సుజిత్ కూడా మ‌రో సినిమా చేద్దాం అంటున్నాడు. చూద్దాం ఏమ‌వుతుందో..??

* ఒకే ఆల్‌ది బెస్ట్‌..
-
థ్యాంక్యూ.

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
Movie Review - Galipatam