Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
29th episode

ఈ సంచికలో >> సీరియల్స్

కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ

జరిగిన కథ:
వరేణ్య తండ్రితో వినోద్ ను చేసుకోనని వాదించినా, సుధాకర్నాయుడు, వరేణ్యతో ...వినోద్ నీ భర్త అని ఇందులో ఎటువంటి మార్పు రాదు, నీ మనసు మార్చుకో  అని  వార్నింగ్ ఇస్తాడు..............ఇంకా చదవండి .................

 

ఏదో ఒకరోజు అతను వస్తాడని బామ్మగారు వూహించిందే. అందుకే అతను టాక్సీ దిగటం చూడగానే వరేణ్యను హెచ్చరించింది.

వరేణ్య వెంటనే జుట్టు విరబోసుకుని ఎంతో నీరసించినట్టు నటిస్తూ పెరట్లో కూర్చీలో కూర్చుంది. వినోద్‌ని అక్కడకి తీసుకొచ్చింది బామ్మ.

''చూడు నాయనా! ఎలా వుండేపిల్ల ఎలా అయిపోయిందో. ఈ మాయదారి ప్రేమరోగాలు ఎందుకొస్తాయోగాని గిరిగిచ్చకాయలా తిరిగే పిల్లని కాస్తా గిలక్కొట్టి వెన్న తీసేసిన మజ్జిగలా చేసేసింది'' అంటూ అతడ్ని ఇంకో చేర్‌లో కూర్చోబెట్టి తను లోనకు తప్పుకుంది. కాని దూరం వెళ్ళలేదు. వాళ్ళమాటలు వినబడేంత దూరంలోనే ఆగింది.

ఉబికివస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకొంటూ సీరియస్‌గా నేల చూపులు చూస్తూ కూర్చుంది వరేణ్య. నిజాలు రాబట్టడంలో అనేక పద్దతులున్నాయి వాటిలో ఎదుటివారి మనసు కరిగేలా చేసి జాలితో వున్నదంతా చెప్పేలా చేయటం ఒక పద్దతి. బామ్మగారు ప్రయోగించిన పద్దతి ఇదే. వినోద్‌మీద నూటికి నూరుశాతం వర్కవుటయింది అది.

''సారీ వరేణ్యా................ నిన్నలా చూళ్ళేకపోతున్నాను. మీ డాడీ ఎంత పట్టుదలగా వున్నప్పటికీ నేను నిన్ను చేసుకోను, సరేనా?'' అన్నాడు.

''అందువల్ల నాకేం ప్రయోజనం? పారిపోయిన నీ ఫ్రెండు పేరు త్రివిక్రమ్‌ కదూ?'' అనడిగింది వరేణ్య.

''యస్‌. యు ఆర్‌ రైట్‌'' అన్నాడు.

''క్రికెట్‌ మేచ్‌ చూసి మధురకు వెళ్ళిపోతాను అనేవాడు నా త్రివిక్రమ్‌..........నన్ను, నా ప్రేమను మర్చిపోయి అక్కడ ఏ సన్యాసుల్లో కలిసిపోయాడో ఏమిటో'' అంటూ చిన్నగా వెక్కివెక్కి ఏడుస్తూ ముక్కుచీది కళ్ళు తుడుచుకుంది వరేణ్య.

''లేదు లేదు'' అన్నాడు వెంటనే వినోద్‌.

''అతను వెళ్ళింది సన్యాసుల్లో కలవటానిక్కాదు. జైల్లో కూర్చోడానికి'' చెప్పాడు.

జైలు అనగానే ఉలిక్కిపడిందామె.

కంగారుగా చూసింది అతడ్ని.

''జైలుకా..........'' నమ్మలేనట్టు అడిగింది.

''అవును.''

''మరి మధుర పోతానన్నాడు.

''అదే మధుర, అదే జైలు, శ్రీ కృష్ణజన్మస్థానం.''

''ఎక్కడి జైలు?''

''హైదరాబాద్‌..............ముషీరాబాద్‌ జైలు.''

''జైలుకెందుకెళ్ళాడు?''

''మర్డర్‌ చేయలేదు, మోసంచేయలేదు. నాతో అంతా చెప్పాడు. అవతల చెల్లెలిపెళ్ళి దగ్గరకొస్తోంది. తండ్రి మూడు లక్షలు తెస్తేనే ఇంట్లోకి, లేదంటే ఇల్లుఅమ్మి అమ్మాయి పెళ్ళి చేస్తానన్నాడు. వేరే దారిలేని పరిస్థితిలో బ్యాంకులో డబ్బుదోచి, తన ఫ్రెండ్స్‌ద్వారా తండ్రికి పంపించాడు.

తను పట్టుబడ్డాడు. అతని తండ్రి గోవిందరావు, తల్లి ప్రశాంతి, తమ్ముడు చక్రధర్‌, చెల్లెలు రమ్య. వాళ్ళంతా త్రివిక్రమ్‌ దుబాయ్‌లో వుంటున్నాడనుకుంటున్నారు.''

''ఏ బ్యాంకు? ఎన్ని లక్షలు దొంగతనం చేసాడు?''

''ఏడు లక్షలనుకుంటాను'' అంటూ బ్యాంకు వివరాలు, గోవిందరావు గారు అడ్రసు కూడా వివరించాడు.

''మరి వైజాగ్‌ ఎందుకొచ్చాడు, ఎలా వచ్చాడు.''

''చెప్తాను. జరిగిందంతా వివరంగా చెప్తాను'' అంటూ జరిగిందంతా వివరంగా చెప్పాడు వినోద్‌.

''ఓ.కె. త్రివిక్రమ్‌ ఇప్పుడు ముషీరాబాద్‌ జైల్లో వున్నాడు. అంతేగా?'' ఛైర్‌లోంచి లేచి విరబోసుకున్న జుత్తులాగి ముడేసుకుంటూ అడిగింది.

''అవును మేడం.''

''థ్యాంక్స్‌ వినోద్‌, నీ మేలు మర్చిపోలేను. కాని ఈ విషయాలు నాతో చెప్పినట్టు మా డాడీకి చెప్పకండి. మీరు మమతను పెళ్ళిచేసుకోండి. ఐ విల్‌ బి హేపీ.''

''థాంక్యూ మేడం.''

లేచి వెళ్ళిపోయాడు వినోద్‌.

అతను వెళ్ళిపోగానే పొంగుతున్న ఉత్సాహంతో లోనకు దూసుకొచ్చింది వరేణ్య ''భామ్మా........... దొరికిపోయాడే......... నా త్రివిక్రమ్‌ దొరికిపోయాడు'' అంటూ బామ్మను గిరగిరా తిప్పేసింది.

''ఓసి రాక్షసి, వదలవే కళ్ళు తిరుగుతున్నాయి. ఓలమ్మో, ఈ పిల్లకి సంతోషం వచ్చినా పట్టుకోలేం, విచారం వచ్చినా ఆపలేం. వదులు'' అంటూ మనవరాల్ని వదిలించుకుని సోఫాలో కూలపడింది.

''ఓ గంటలో హైదరాబాద్‌కి ఫ్లయిట్‌ వుంది, నేను అర్జంటుగా బయలుదేరుతున్నాను. నాకో పది లక్షలు కావాలి'' జారిపోయిన పొడవాటి దట్టమైన కరిమబ్బులాంటి జుత్తునులాగి, ముడివేసుకుంటూ ఉత్సాహంగా చెప్పింది.

''జైలుకెళ్ళి ముందు ఆ కుర్రాడ్ని చూడవా?''

''లేదు బామ్మా, నా త్రివిక్రమ్‌ని జైల్లో వుండగా చూసి తట్టుకోలేను. ఆ బ్యాంకువాళ్ళ ముఖాన డబ్బు పారేసి, వాడ్ని రిలీజ్‌ చేయించాకే చూస్తాను.''     ''బ్యాంకుకి ఏడులక్షలు కట్టాలి.''

''నా దగ్గర అయిదు లక్షలుంది. సరి, చెక్కు యిస్తాను, దారిలో మార్చుకుని వెళ్ళు, ఇందులో అసలు విషయం ఏమంటే, మీ మమ్మీకి ఈ విషయాలేమీ తెలీదు.''

''నో ప్రాబ్లమ్‌ బామ్మా, మమ్మీ నా మాట కాదనదు.''

''సరి, నువ్వు బయలుదేరి వెళ్ళావని తెలిస్తే, మీ డాడీ క్షణం కూడా ఇక్కడ వుండడు నువ్వేం చేయాలన్నా వాడు హైదరాబాద్‌ వచ్చేలోపలే చేయాలి.''

''నువ్వు రావా? ఆ తర్వాత నువ్వు కొట్టే ఫోన్లకు సమాధానం చెప్పలేక చావాలి. డాడీతో నువ్వుకూడా బయలుదేరి వచ్చేయి.''

''అదీ నిజమే. మేం వస్తాంలే? నువ్వు బయలుదేరు.''

''నేను స్నానానికి వెళుతున్నాను''

''వెళ్ళు.............. బాగా రుద్ది తోముకో, లేకపోతే ఈ పిల్ల ఎవరో నాకు తెలీదంటాడు వాడు'' అంది కొంటెగా బామ్మగారు.

''బామ్మా.............. ఆగవే, వచ్చాక చెప్తా నీపని'' అంటూ బాత్‌రూంలోకెళ్ళి తలుపు మూసుకుంది వరేణ్య.

వైజాగ్‌లో ఏం జరిగిందో

ఏం జరుగుతోందో

ఆసలు అక్కడి విషయాలు ఏమీతెలీని ఆ కుటుంబ సభ్యులు ఎవరంటే భాగ్యవతి మాత్రమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే సుధాకర్‌నాయుడు వైజాగ్‌ వచ్చాక ప్రతిరోజు ఫోన్‌చేసి భార్యతో మాట్లాడుతూనే వున్నాడుగాని, అక్కడి విషయాలు ఏమీ చెప్పలేదు. ఇక వరేణ్య గాని, బామ్మగారుగాని ఫోన్‌చేయరు.

చేసినా అసలు విషయం చెప్పరు.

ఎందుకోగాని ఆవిడకు కంగారు. వినోద్‌ అంటే మొదటినుంచి ఇష్టంలేదు. తన కూతురు ఆ కుర్రాడ్ని వరించింది అంటే, అవిడకు ఇప్పటికీ ఆశ్చర్యమే.

అతడు పెద్ద చదువులయితే చదివాడుగానీ, చాలా విషయాల్లో అతడు బాగా వెనబడి వున్నాడని, సిసింద్రీలాంటి తన కూతుర్ని చలిమిడి ముద్దలాంటి వినోద్‌ తగిన జోడికాదని ఆమె నమ్మకం.

ఈ పరిస్థితిలోనే

ఆ రోజు

సడెన్‌గా ఇంటికొచ్చేసిన కూతురు వరేణ్యను చూసి ఆశ్చర్యపోకుండా వుండలేకపోయింది భాగ్యవతి.

''ఏమిటే ఒక్కదానివీ వచ్చేసావ్‌. మీ డాడీ ఎక్కడ?'' కంగారు అణుచుకుంటూ అడిగింది.

''డాడీ వైజాగ్‌లోనే వున్నారు?'' చెప్పులు మూలకు విసిరి, ఏర్‌బేగ్‌ సోఫాలో పడేసి కూలబడుతూ చెప్పింది వరేణ్య.

''వినోద్‌?''

''అతను కూడా అక్కడే వున్నాడు.''

''మరి నువ్వు వచ్చేసావేమిటి.''

''త్రివిక్రమ్‌ కోసం.''

''మధ్యలో ఇతనెవడు?''

''నేను ప్రేమించినవాడు, నా కాబోయే మొగుడు.''

''ఆ వినోద్‌ నచ్చాడన్నావ్‌?''

''వచ్చినవాడు వినోద్‌ అనుకుని అలా చెప్పాను.''

భాగ్యవతికి అర్థమైపోయింది. అక్కడ వైజాగ్‌లో ఏదో గడబిడ జరిగిపోయిందని.

''కాస్త అర్థమయ్యేలా చెప్తావా? వినోద్‌ గాకుండా వేరే ఎవడు వచ్చాడక్కడికి?''

''మమ్మీ. డాడి ఏం చెప్పారు? వినోద్‌ని పంపిస్తున్నాను. నచ్చితే పెళ్ళి చెస్తానని చెప్పారా లేదా?''

''చెప్పారు........... ఇంతకీ.........''

''నాకు తెలీదుమమ్మీ. ఈ పర్సుపిచ్చోడు, సూట్‌కేస్‌ పొగొట్టుకుంటే అవి పుచ్చుకొని ఒకడు వైజాగ్‌ స్టేషన్‌లో దిగాడు. మన స్టాఫ్‌ వాడే వినోద్‌ అనుకుని, ఆఫీస్‌లో కూర్చోబెట్టారు.

బ్రిలియంట్‌ యంగ్‌ బాయ్‌, ఐ లైక్‌హిమ్‌, ఐ లవ్‌ హిమ్‌. తీరా నేను ప్రేమలో పడిపోయాక డాడీవచ్చి నువ్వు వినోద్‌ని చేసుకోవాలి, త్రివిక్రమ్‌ని కాదు అంటున్నారు.

ఏం మమ్మీ.......... ఒకడ్ని ప్రేమించి, ఇంకొకడ్ని పెళ్ళిచేసుకోవడం హిందుధర్మ శాస్త్రప్రకారం తప్పా కాదా?''

''శాస్త్రాల సంగతి నాకు తెలీదుగాని, మనసు ఒకడికిచ్చి, పెళ్ళి ఇంకొకడితో జరిగితే ఇబ్బందే, రేపు ప్రేమించినవాడు ఎదురయ్యాడునుకో. వీడ్ని వదిలేసి వాడితో వెళ్ళిపోయే ప్రమాదం వుంది.'' అంటూ కిసుకున్నన నవ్విందావిడ.

వరేణ్య కోపంగా చూసింది.

''మమ్మీ............. మీ అత్తా కోడుళ్ళు ఒకే స్కూల్లో చదువుకున్నారా ఏమిటి? నన్ను వుడికించడమే పనిగా పెట్టుకున్నారు. నేను అరగంటలో బయలుదేరాలి. కారు తీసుకెళతాను'' అంది.

''విషయం పూర్తిగా చెప్పకుండా వెళితే కాళ్ళు విరగ్గొడతాను. త్రివిక్రమ్‌ ఎక్కడున్నాడు?''

''ఇక్కడే వున్నాడు. నాతో చెప్పకుండా వైజాగ్‌ నుంచి వచ్చేసాడు.''

''ఓ................ ఇప్పుడర్థమైంది. మనసిచ్చినవాడ్ని వెదుక్కుంటూ వచ్చావ్‌ మమ్మీని చూడ్డానిక్కాదు. ఓకె. ఈ త్రివిక్రమ్‌ నీకు అంతగా నచ్చాడా?''

''చాలా ..............ఇంతని చెప్పలేను. వండర్‌బోయ్‌, సమస్యల్ని ఎంత ఫాస్ట్‌గా ఆలోచించి పరిష్కారంచేస్తాడో తెలుసా?  అంత దేనికి.. ....... .ఉద్యోగం లోంచి తీసేసానని ఆ పట్టాభి, పదిహేనుమంది రౌడీలను తెచ్చి నన్ను కొట్టించబోయాడు తను ఒక్కడు వాళ్ళందర్నీ చితకదన్ని, ఎంత సింపుల్‌గా సమస్యను పరిష్కరించాడో తెలుసా..........? అతడు చదివింది ఇంటరే. కాని ఎంతో తెలివైనవాడు, సంస్కారం గలవాడు, వాడు దొరకటం నా అదృష్టం.''

''బాగుంది, ఇంతకీ నువ్వు చూస్తే గోల్డెన్‌ స్పూన్‌తో పుట్టి పెరిగావు. ఆ కుర్రాడు మామూలు కుర్రాడనిపిస్తోంది.''

''మమ్మీ, అతను గోల్డెన్‌స్పూన్‌తో పుట్టకపోవచ్చు, స్టీల్‌స్పూన్‌తోనయినా పుట్టినవాడేగదా, అందుకే వాడి బాడి అంత స్ట్రాంగ్‌, వాడి ఆలోచనలు అంత షార్ప్‌.

''ఓ.కె. తల్లీ, మీ తండ్రి కూతుళ్ళు గొడవలోకి నన్ను లాగకుండా వుంటేచాలు. నీకు పెళ్ళవటం నాకు ముఖ్యం. ఇంతకీ కుర్రాడు ఇక్కడే వున్నాడంటున్నావుగా ఓసారి తీసుకురా.''

''అప్పుడే వీలుకాదు మమ్మీ, ఎందుకంటే..............''

త్రివిక్రమ్‌ జైల్లోవున్న సంగతి చెప్పాలని నోటి చివరకు వచ్చిమాటల్ని వెంటనే మింగేసింది వరేణ్య.

మమ్మీతో మొత్తం విషయాలు చెప్పేస్తే తర్వాత డాడీ ఫోన్‌చేస్తే మమ్మీ డాడీకి చెప్పేస్తుంది. అందుకే, త్రివిక్రమ్‌ రిలీజయ్యేవరకు అసలు విషయాలు చెప్పకూడదనుకుని వెంటనే మాట మార్చేసింది.

''వాడ్ని నేనే వెదికిపట్టుకోవాలి. అందుకే వీలుకాదు.''

''ఏమిటే ఇది.............. వెతికిపట్టుకోవడం ఏమిటి? నీతో చెప్పకుండానే వచ్చేసాడా?''

''అవును.  త్యాగమూర్తిగదా........... నేను వినోద్‌ని చేసుకోడమే న్యాయమని చెప్పి, నాతో చెప్పకుండా వచ్చేసాడు. నేను వదలనుగదా..........కావాలంటే ఆస్థి మొత్తం డాడీని ఆ వినోద్‌కి ఇచ్చుకోమను. నేను త్రివిక్రమ్‌తో సెటిలయిపోతాను'' అంటూ ఇక మాట్లాడటానికి ఏమీలేనట్టు ఆ అవసరం లేనట్టు లేచి తన రూంలోకెళ్ళిపోయింది. పావుగంటలోనే రెడీఅయి హెండ్‌బ్యాగ్‌ భుజాన వేసుకుని కార్లో వెళ్ళిపోయింది వరేణ్య.

ఇదే సమయంలో

ఇక్కడ వైజాగ్‌లో వరేణ్య హైదరాబాద్‌ వెళ్ళిపోయిన విషయం సుధాకర్‌నాయుడికి తెలీదు. ఆయన మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు ఇంట్లో వరేణ్య లేని విషయం గమనించాడు.

''అమ్మా! వరేణ్యా................బేబీ ఎక్కడ? అంటూ తల్లిని అడిగాడు.

''ఎవరో రమాదేవి అట. బేబీ ఫ్రెండు, ఆ అమ్మాయి వస్తేనూ ఇద్దరూ బయటకెళ్ళారు. ఇంట్లోనేవుంటే పిల్లకి పిచ్చి పిచ్చిగా వుంటుందని నేనూ వెళ్ళనిచ్చాను'' అంటూ తడుముకోకుండా అబద్దం చెప్పేసింది బామ్మ గారు.

తల్లి చెప్పిందిగాబట్టి నాయుడుగారు నమ్మేసారు.

భోంచేసి ఆఫీసుకు వెళ్ళిపోయాడు.

ఆ రాత్రి పనులు ముగించుకొని తొమ్మిదిగంటలకు ఇంటికి చేరుకునే సరికి అప్పుడూ వరేణ్య ఇంట్లో కనబడలేదు. ఆయనకు డౌటు వచ్చేసింది.

బామ్మగారికి కొడుకు రియాక్షన్‌ తెలుసు. అందుకే ముందుగానే ఆరంభించింది.

''ఫ్రెండుకూడా వెళ్ళినపిల్ల ఇంకా ఇంటికి తిరిగిరాలేదురా అబ్బాయ్‌! నాకేదో డౌటుగా వుంది. ఓసారి హైదరాబాద్‌కి ఫోన్‌చేసి అడుగు, ఈ పిల్ల అక్కడికి వెళ్ళిపోయిందని అనుమానంగా వుంది.'' అంటూ క్లూ యిచ్చింది.

నాయుడుగారు తల్లిమీద విసుక్కుంటూనే హైదరాబాద్‌ ఫోన్‌ చేసాడు.

వెంటనే లైన్‌లోకొచ్చింది భార్య భాగ్యవతి.

''వరేణ్య అక్కడికొచ్చిందా? సీరియస్‌గా అడిగాడు.

''మధ్యాహ్నం వచ్చింది, వచ్చిన అరగంటలోనే కారు తీసుకొని వెళ్ళిపోయింది, ఇంకా రాలేదు. ఇంతక్రితమే ఫోన్‌చేసింది. రావటం లేటవుతుంది కంగారుపడవద్దని చెప్పింది.

''ఇది అక్కడికిరాగానే నాకెందుకు ఫోన్‌ చేయలేదు?''

''బాగుంది. అక్కడేం జరిగిందో నాకేం తెలుసు........... మీరెప్పుడు వస్తున్నారు?''

''ఉదయం ఫ్లయిట్‌కి వస్తున్నాను'' అంటూ లైన్‌ కట్‌చేసాడు.

''నేనూ వస్తున్నాను. నాక్కూడా కలిపి రెండు టికెట్లు బుక్‌చెయ్యి'' అంది పక్కన వుండి అంతా వింటున్న బామ్మగారు.

''నువ్వెందుకు..............? అసలే మీ అత్తాకోడళ్ళకు పడదు. యిక్కడే వుండు.''

''నేనొచ్చేది అక్కడ వుండిపోడానిక్కాదు. నాలుగురోజులుండి వచ్చేస్తాను.''

నుదురు రుద్దుకున్నాడు నాయుడు.

''నాకు అర్థంగావటంలేదు. ............... ఇంత సడెన్‌గా ఎవరికీ చెప్పకుండా వరేణ్య హైదరాబాద్‌ ఎందుకెళ్ళింది?'' తల్లిని అనుమానంగా చూస్తూ అడిగాడు.

''బాగుందిరా అబ్బాయ్‌! కృష్ణా రామా అంటూ మూలన కూర్చున్నదాన్ని, బేబి మనసులో ఏముందో నాకేం తెలుసు?''

''నీకు తెలీకుండా అది వెళ్ళిందంటే నాకు నమ్మకంలేదు. మనవరాలు నువ్వూ ఒకటేగదా.''

''అదంతా నాకు తెలీదుగానీ నువ్వడుగుతుంటే గుర్తొచ్చింది. అమ్మాయిని చూడ్డానికి పొద్దుట వినోద్‌ వచ్చాడు ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. బహుశా త్రివిక్రమ్‌ ఆచూకీ ఏమన్నా తెలిసి ఇలా సడెన్‌గా వెళ్ళిపోయిందోమో!''

నాయుడుగారు అశ్చర్యం మరోమెట్టు పైకిపోయింది.

వినోద్‌ వరేణ్యను కలిసిన సంగతి తనకు తెలీదు. పైగా త్రివిక్రమ్‌ ఆచూకీ అంటోంది. ఎవడు వాడు?''

''త్రివిక్రమ్‌ ఎవరు?'' అడిగాడు.

''అదేమరి................నీ కూతురు ప్రేమించిన వాడి పేరు కూడా నీకు తెలీదు.''

''అంటే ఆ పారిపోయిన వాడిపేరు త్రివిక్రమ్‌ అంతేనా?''

''అనే విన్నాను.''

''ఇంకా ఏమేటి విన్నావు?''

''అంతకుమించి నేనేమీ వినలేదు. రేపుమాత్రం నేనూ నీతోవస్తున్నానంతే'' అంటూ అక్కడేవుంటే కొడుకు మరిన్ని ప్రశ్నలేస్తాడన్న భయంతో లోనకెళ్ళిపోయిందావిడ.

బాగా పొద్దుపోయింది గాబట్టి వినోద్‌తో మాట్లాడటం వీలుకాదు. ఉదయం వినోద్‌ని నిలదీస్తే ఏమన్నా కొంత సమాచారం తెలియొచ్చు అన్పించింది. అందుకే ఇక ఆ టాపిక్‌ వదిలేసి నిద్రకుపక్రమించాడాయన.

మనిషి నిమిత్తమాత్రుడు అంటారు.

చాలా సంధర్బాల్లో ఇది నిజమేనేమో అన్పిస్తుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నది అనుకున్నట్టు చేయటం సాధ్యంకాదు. ఆ రాత్రి సుధాకర్‌ నాయుడు ఉదయం ఫ్లయిట్‌కే హైదరాబాద్‌ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు ట్రావెల్‌ ఏజెంట్‌కి ఫోన్‌చేసి రెండు టికెట్లు కూడా చెప్పాడు. కానీ అప్పటికే మార్నింగ్‌ ఫ్లయిట్‌కి టికెట్లు బుక్కయిపోడంతో సాయంత్రం ఫ్లయిట్‌కి దొరికాయి టికెట్లు.

ఇక చేయగలిగిందిలేదు గాబట్టి మామూలుగానే ఉదయం ఆఫీస్‌కు బయలుదేరాడు. వెళ్ళేముందు హైదరాబాద్‌ ఇంటికి ఫోన్‌చేసాడు.    భార్య భాగ్యవతి లైన్‌లోకొచ్చింది.

''ఏమైంది? అమ్మాయి లేచిందా?'' అడిగాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
30th episode