Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

తెలుగు హీరో అనిపించుకోవ‌డం ఓ వ‌రం - సూర్య

interview with actor surya
సూర్య అంటే వెరైటీకి మ‌రో ప‌దం. ఆయ‌న సినిమాల‌న్నీ వైవిధ్య‌భ‌రిత‌మైన‌వే. గ‌జిని, కాక‌కాక‌, సింగం, మాత్ర‌న్ ... ఒక సినిమాకీ మ‌రో సినిమాకీ పోలిక ఉండ‌దు. ఒక పాత్ర‌కీ మ‌రో పాత్ర‌కీ లింకే లేదు. దేనిక‌దే ప్ర‌త్యేకం. అదే... సూర్య స్సెషాలిటీ. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క తెలుగు సినిమా కూడా చేయ‌లేదు. అయినా తెలుగు హీరోలానే చ‌లామ‌ణి అవుతున్నాడు. గ‌జిని నుంచి సింగ‌మ్ వ‌ర‌కూ సినిమా సినిమాకీ తెలుగులో మార్కెట్ పెంచుకొంటూనే ఉన్నాడు. త‌న సినిమా అంటే త‌మిళంలో ఎంత ప్ర‌చారం చేస్తాడో తెలీదుగానీ, తెలుగులో మాత్రం భారీ ఎత్తున ప‌బ్లిసిటీ ఇస్తుంటాడు. హైద‌రాబాద్ రాగానే ప‌క్కా తెలుగు హీరోలా బిహేవ్ చేస్తుంటాడు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండ‌డం సూర్య‌లో క‌నిపించే ప్ర‌ధాన ల‌క్ష‌ణం. ''ఈ స్థాయి నాకు ఎలా వ‌చ్చిందో తెలుసు. నేనేం గొప్ప‌వాణ్ణి కాదు. సినిమా న‌న్ను గొప్ప‌వాణ్ణి చేసింది..'' అంటుంటారు సూర్య‌. ఇప్పుడు సికింద‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచిస్తున్నాడు. ఈసందర్భంగా సికింద‌ర్ సూర్య‌తో గో తెలుగు ప్ర‌త్యేకంగా సంభాషించింది. ఆ క‌బుర్లు ఇవీ..

* రాజూభాయ్ అనే పేరు, టైటిల్, మీ గెట‌ప్ ఇవ‌న్నీ చూస్తుంటే.. మ‌రో మాఫియా క‌థ సిద్ద‌మైపోయింద‌నిపిస్తోంది. ఇంత‌కీ సికింద‌ర్ లో ఏం ఉంది?
- (న‌వ్వుతూ) మీర‌నుకొన్న‌ట్టు ఇది కేవ‌లం మాఫియా క‌థ మాత్ర‌మేకాదు. అదో పార్ట్ అంతే. స్నేహం, ఎమోష‌న్స్‌, ప్రేమ‌, యాక్ష‌న్‌.. ఇలా అన్నీ ఉన్నాయ్‌. నేను చేసిన సినిమాల్లో ఇదో స్టైలీష్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఇంత‌కంటే స్టైలీష్ గా నేను మ‌రో సినిమాలో క‌నిపించ‌లేదు.

* స్టైల్ కోసం సినిమా చేసేశార‌న్న‌మాట‌..
- అల‌గ‌ని కాదు. లింగుస్వామితో ఎప్ప‌టి నుంచో క‌ల‌సి ప‌నిచేయాల‌నుకొంటున్నా. దాదాపుగా ప‌దేళ్ల ప్ర‌య‌త్నం ఇది. నాకు ఆయ‌న‌తో, ఆయ‌న‌కు నాతో ప‌నిచేయాల‌ని ఉండేది. కానీ కుదిరేది కాదు. `సార్‌.. నా కోసం క‌థ చెప్పండి..` అని ఎన్నోసార్లు అడిగా. పాపం.. ఆయనా స్టోరీ లైన్లు సిద్దం చేసుకొనేవారు. కానీ... నాకు డేట్లు ఖాళీ ఉండేవి కావు. ఇలా.. మా కాంబినేష‌న్ ఆల‌స్య‌మైపోయింది. ఈసారి మాత్రం సికింద‌ర్‌తో వ‌చ్చేస్తున్నాం.

* అంత‌కు ముందు లింగుస్వామి మీకు  నాలుగు క‌థ‌లు చెబితే సికింద‌ర్ ఎంపిక చేసుకోవ‌డానికి కార‌ణం ఏమిటి?
- మిగిలిన మూడు క‌థ‌లూ మంచివే. అయితే మా ఇద్ద‌రి కాంబినేష‌న్ అన‌గానే అంచ‌నాలు పెరుగుతాయి. క‌థ కూడా ఆ స్థాయిలో ఉండాలి అనుకొన్నా. కేవ‌లం మాస్ సినిమా చేస్తే చాల‌దు. నాకు ఫ్యామిలీ ఆడియ‌న్స్ కూడా ఉన్నారు. వాళ్ల‌నీ దృష్టిలో ఉంచుకోవాలి. అందుకే.. కరెక్ట‌యిన క‌థ  దొరికే వ‌ర‌కూ ఎదురుచూశా.  ఇప్పుడున్న టైమ్‌కి, నా ఇమేజ్‌కి సికింద‌ర్ క‌థే బాగుంటుంది.  ఈ క‌థ‌ని లింగుస్వామి తెర‌కెక్కించిన విధానం.. క‌థ‌లో వ‌చ్చే మ‌లుపులు చాలా బాగుంటాయ్. వాటిని తాను డీల్ చేసిన విధానం బాగా న‌చ్చింది.

* ఇందులో డ్యూయ‌ల్ రోల్ అంటున్నారు. రెండు పాత్ర‌లా..??  లేదంటే రెండు గెట‌ప్పులా?
- అదేంట‌న్న‌ది తెరపై చూడాలి. చెబితే స‌స్పెన్స్ పోతుంది..

* అయినా మీకు గెట‌ప్పుల‌మీద ఈ మోజేంటి?  ప్ర‌తీ సినిమాలోనూ ఏదో ఓ గెట‌ప్‌లో కనిపిస్తూనే ఉంటారు?
- సినిమా సినిమాకీ కొత్త‌గా ఆలోచించాలి. గ‌జినిలో చూసిన సూర్య‌, సికింద‌ర్ సినిమాలో చూసిన సూర్య ఒకేలా ఉంటే.. ప్రేక్ష‌కులు ఎలా చూస్తారు?  చూసిన మొహ‌మే మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తే బోర్‌కొడుతుంది. అందుకే గెట‌ప్పులు మారుస్తుండాలి. అయితే క‌థ‌ని దాటి మ‌నం ఎలాంటి ప్ర‌యోగాలూ చేయ‌కూడ‌దు. నా ప్ర‌తీ సినిమాలోనూ ఇలా గెట‌ప్పులు వేయ‌డం లేదు క‌దా..??  క‌థ డిమాండ్ చేస్తేనే వాటి గురించి ఆలోచిస్తా.

* మీరు చేసిన ప్ర‌యోగాలు కొన్నిసార్లు బెడ‌సి కొట్టాయ్‌. కంగారు ప‌డ‌లేదా?
- ఓ కొత్త‌ర‌కం ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్పుడు ఎలాంటి ఫ‌లితం వ‌స్తుంద‌న్న‌ది ముందు ఊహించ‌డం క‌ష్టం. క‌చ్చితంగా సినిమా ఫ్లాప్ అవుతుంద‌ని తెలిస్తే... డ‌బ్బులు పోయ‌డానికి ఎవ‌రూ సిద్దంగా ఉండ‌రు క‌దా. కొన్ని ఆడ‌తాయ్ అనుకొంటాం. కానీ ఆడ‌వు. అలాంటి సినిమాల విష‌యంలో ఏం చేయ‌లేం.

* మిమ్మ‌ల్ని బాగా డిస‌ప్పాయింట్ చేసిన ప్ర‌యోగం ఏమిటి?
- అలాగ‌ని కాదు గానీ, సెవెన్త్‌సెన్స్ పై చాలా న‌మ్మకాలుండేవి. చాలామంచి క‌థ‌. అయితే అనుకొన్నంత ప్ర‌తిఫ‌లం ద‌క్క‌లేదు.

* క‌మ‌ర్షియ‌ల్ ఫార్మెట్‌కి దూరం వెళ్ల‌డం రిస్క్ అనిపించ‌దా?
- నేనెప్పుడూ క‌మ‌ర్షియ‌ల్ ఫార్మెట్‌కి దూరంగా వెళ్ల‌లేదు. కొన్ని సినిమాలు ఆడ‌లేదంతే. అందులోనూ క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్ ఉంది. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా నిర్మాత సేఫ్ అవ్వాలి. ఆ విషయం మ‌ర్చిపోకూడ‌దు.

* తెలుగులో ఓ సినిమా చేస్తాన‌ని ఎప్ప‌టి నుంచో చెబుతున్నారు?  ఆ మాట ఏం చేశారు?
- (న‌వ్వుతూ) మ‌ర్చిపోలేదు. న‌న్ను ఇక్క‌డి ప్రేక్ష‌కులు ఆద‌రించిన విధానం కూడా ఎప్ప‌టికీ మ‌ర్చిపోను. గ‌జిని నుంచి నా సినిమాల్ని ఆద‌రిస్తూనే ఉన్నారు. వాళ్ల రుణం తీర్చుకోలేనిది. నేనిప్పుడు తెలుగు హీరోనే. ఇలా పిలిపించుకోవ‌డానికి ఎంతో అదృష్టం ఉండాలి. అందుకే నేను కూడా ఈ పిలుపుని ఓ బాధ్య‌త‌గా తీసుకొన్నా. మంచి కథ దొరికిన‌ప్పుడే డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తా. అప్ప‌టి వ‌ర‌కూ ఎదురుచూడాల్సిందే.

* ఈమ‌ధ్య తెలుగు ద‌ర్శ‌కులు ఎవ‌రూ క‌థ‌లు చెప్ప‌లేదా?
- రెండు మూడేళ్ల నుంచి తెలుగు క‌థ‌లు వింటూనే ఉన్నా. అయితే అన్నీ కుదిరిన‌ప్పుడే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది.

* ఇక్క‌డి హీరోల్లో మిమ్మ‌ల్ని బాగా ఆక‌ట్టుకొన్న‌వాళ్లెవ‌రు?
- ఒక‌ర‌ని కాదు. ప్ర‌తి ఒక్క‌రిలో ఏదో ఓ మంచి గుణం నేర్చుకొంటూనే ఉన్నా. నాగార్జున సార్ ని చూస్తుంటే ఆశ్చ‌ర్యం వేస్తుంటుంది. ఈ వ‌య‌సులో కూడా అంత అందంగా ఎలా క‌నిపిస్తారో...?  చిరు సార్  గురించి చెప్ప‌క్క‌ర్లెద్దు. గొప్ప స్టార్‌. ఆయ‌న చేసిన సేవాకార్య‌క్ర‌మాలు మాలాంటి వాళ్ల‌కు స్ఫూర్తి. యంగ్ హీరోలంతా బాగా రాణిస్తున్నారు. వాళ్లూ నాకు స్ఫూర్తినిస్తూనే ఉంటారు .

--కాత్యాయని
 
మరిన్ని సినిమా కబుర్లు
Sikandar telugu movie review