Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

జరిగిన కథ:
జగదాంబ థియేటర్ ఓనర్ రంగారావు గారు ఎట్టకేలకు రెండు చెక్కులు రాసి సంతకం చేసి నూకరత్నం చేతికి ఇస్తారు. నూకరత్నం ఆనందంతో ఉబ్బితబ్బిబవుతుంది.  

ఆనందోత్సాహాలతో తేలిపోతూ కూర్చుంది నూకరత్నం. రాబోయే రెండు లక్షల కమీషన్ కళ్ళముందు కనిపిస్తోంది నూకరత్నానికి

ఆ రోజు ఎప్పటిలాగే తెల్లారేసరికి తయారయ్యి బయలుదేరాడు ఏకాంబర్. ఆ నెలంతా సరిగ్గా ఇన్స్యూరెన్స్ బిజినెస్ జరగలేదని కంగారుగా వున్నాడు ఏకాంబర్.

పై పెచ్చు జోనల్ లెవల్ లో కాంపిటీషన్ ఒకటి అనౌన్స్ చేసి ఏజెంట్లకు బహుమతులు, విదేశాలకు ట్రిప్స్ ప్రకటించారు. ఆ నెలం తా కాస్త డల్ గా వుండేసరికి ఏకాంబర్ రెండో స్థానానికి పడిపోయాడు. దాంతో బ్రాంచి మేనేజర్, డెవలప్ మెంట్ ఆఫీసర్ రాజనాల కూడా ఏకాంబర్ కు క్లాసు తీసుకున్నారు.

"ఏకాంబర్ నీ వ్యాపారం దెబ్బ తింటోంది. ఎవరికో సాయం చేద్దామని నీ వునికిని  నువ్వు కోల్పోతున్నావ్ జాగ్రత్త! ఈ కేంపెయిన్ లో ఫెయిల్ అయితే తర్వాత తర్వాత వెనుకబడిపోతావ్.! అంటూ మిత్రుడు,  డెవలప్ మెంట్ ఆఫీసర్ రాజనాల చాలా సున్నితం గా ఏకాంబరాన్ని హెచ్చరించాడు.

ఏకాంబరానికి కూడా పంతంగానే వుంది. ఐదేళ్ళలో ఇదే మొదటిసారి రెండోస్థానానికి దిగజారడం. తన ఏకాగ్రత సడలిపోతుందేమోనని భయపడిపోయాడు.

బ్యాగ్ భుజాన తగిలించుకుని బయలుదేరుతూ తల్లిని కేకేసి పిలిచాడు ఏకాంబర్.

అమ్మా! నేను వెళ్తున్నాను.! తలుపువేసుకో ! అని గట్టిగా కేకేసేసరికి తండ్రి పీతాంబరం లేచివచ్చాడు.

మద్యాహ్నం ఇంటికొస్తావా? అని అడిగాడు. పీతాంబరం.

ఏమో! టైం ను బట్టి వస్తాను. లేదా బయట భోజనం చేస్తాను చెప్పాడు ఏకాంబర్.

"పోనీ మధ్యలో ఎప్పుడైనా షాపు దగ్గరకు వస్తావా? అడిగాడు తండ్రి పీతాంబరం

ఎందుకు నాన్న? నా కసలే వ్యాపారం జరగక చాలా చిరాగా వుంది. నాతో ఏమన్నా పని వుందా? అసహనం గా అడిగాడు ఏకాంబర్.

ఇంటికోసం ప్లాన్ వేయించమన్నావు కదా! ఆ ఇంజనీర్ గారు నిన్నేమన్నా కలవమన్నారా? చెప్పాడు తండ్రి.

అంతే కదా! సాయంత్రం వేగంగా వస్తాను. ఇద్దరం కలిసి ఆయన దగ్గరకు వెళ్దాం. సరేనా?" అన్నాడు ఏకాంబర్.

అలాగే నువ్వెళ్ళిరా! అంటూ ఏకాంబరాన్ని సాగనంపి తలుపులు వేసాడు పీతాంబరం.

ఇంతలో పర్వతాలు నిద్ర కళ్ళతో లేచివస్తూ ఏంటండీ? దేనికి పిలిచారు? అంటూ హాల్లోకొచ్చింది.

నేను కాడు, నీ కొడుకు వెళ్ళిపోయాడు. అంటూ గదిలోకి వెళ్ళి మంచం మీద బద్దకంగా వాలిపోయాడు పీతాంబరం.

వంట గదిలోకి వెళ్ళి స్టవ్ వెలిగించి టీ పెట్టింది పర్వతాలు.

టీ మరిగించి గ్లాసులో పోసి భర్త పీతాంబరం దగ్గరకు వచ్చింది . గదిలో మంచం మీద బోర్లా పడుకున్న మొగుడ్ని తట్టి గట్టిగా లేపింది.

ఈ రోజు ఎందుకో నీరసం గా వుంది. కాస్త పడుకోనివ్వవే చిరాగ్గా  అన్నాడు పీతాంబరం.

పడుకోండి ఎవరొద్దన్నారు. కాస్త ఈ టీ త్రాగేసి పడుకోండి. అంటూ గ్లాసు చేతికందిచ్చింది.

మంచం మీదే టీ సిప్ చేస్తూ కూర్చున్నాడు.

పర్వతాలు కూడా తనకోసం ఒక గ్లాసులో టీ తెచ్చుకుని మొగుడు ప్రక్కనే మంచం మీద కూర్చుంది.  ఏంది విషయం? పనుంటేగనీ పక్కకు రావుకదా! ఎదైనా చెప్పాలా?! పెళ్ళాన్ని అడిగాడు పీతాంబరం.

"కూతురి విషయం మర్చిపోయారా? అడిగింది పర్వతాలు.

లోపల గదిలో పడుకుంది కదా! అడిగాడు.

మీ తెలివి సంతకెళ్ళా, దాని పెళ్ళి సంగతి నిలదీసింది.

చూసెళ్ళారు కదా! వాళ్ళడిగినంత ఇచ్చుకోవద్దా? ఆలోచిస్తూ అన్నాడు పీతాంబరం.

ఎంతడిగారండీ? అదేదో ఇద్దరు పిల్లలముందు పెడితే వాళ్ళే ఏదో చెప్తారు. కాస్త మీరు చెయ్యేస్తే అడేమంత కట్నం? అంది పర్వతాలు.
చిన్నోడు ఏం చెప్పినా సరే అంటాడు. పెద్దోడి పరిస్థితి అర్థం కాదు. జీతం పంపడు? ఎంతో చెప్పడు.? ఇవ్వగలదో లేదో తేల్చడు! చూద్దాం కష్టమంతా చిన్నోడి మీద నెట్టేయడం భావ్యం కాదు. అన్నాడు పీతాంబరం.

కష్టాలు, నష్టాలు సంగతి సరేనండి. ఆలస్యం చేస్తే మనకే ఇష్టం లేదని పెళ్ళివారు వేరేదారి వేరే సంబంధాలు వెదుకుతే సంసయే కదా! అంది పర్వతాలు.

నిజమేలేవే తెల్లారనీ  , పెళ్ళిళ్ళ పేరయ్యకి కబురు చేద్దాం. ఈ వారం లో మంచిది చూసి మనమూ పెళ్ళివారింటికీ వస్తామని కబురు పెట్టమని చెప్తాం . అన్నాడు పీతాంబరం.

పిల్ల పెళ్ళయ్యేవరకూ ఇళ్ళు కట్టే ప్రయత్నం మానుకోండి. అటో కాలు ఇదో కాలు అయిపోతుంది. సీరియస్ గానే అంది పర్వతాలు.
ఇంకా లేదే! ప్లాన్ గట్రా అయ్యాక చిన్నోడు వాళ్ళ ఇన్స్యూరెన్స్ కంపెనీలో ధరఖాస్తు చెయ్యాలి కదా! అది ఆమోదం పొంది రావాలి. ఆ తర్వాత కదా ఇంటి నిర్మాణం. ఈ లోగా పిల్ల పెళ్ళయిపోతుంది. అన్నాడు పీతాంబరం.

అలా అయితే పర్లేదు చూస్కోండి.! పెళ్ళికి ఎటువంటి ఆటంకం కలుగకూడదు. అంది పర్వతాలు

చిన్నోడు ఈ రోజు ఎందుకో చిరాగ్గా వున్నాడు. ఎప్పుడూ వాన్ని అలా చూడలేదు. ఏదో ఆలోచిస్తున్నాడు పీతాంబరం.

పాలసీలేవో తక్కువయ్యాయట., రాత్రి చెప్పాడు. ఈ నెలాఖరులోగా తన టార్గెట్ ఏదో పూర్తి చెయ్యాలట, వివరం గా చెప్పాడు అంది.
ఈన్నాళ్ళయింది ఏనాడూ ఇంత దిగులు పడలేదు. కొత్తలోనే ఉత్సాహం గా తిరిగాడు. ఇప్పుడు ఏం కష్టమొచ్చిందే? అడిగాడు పీతాంబరం.
వీడి వీడు చేసుకుంటే బాగుండేది. మధ్యలో ఆ పిల్లకెవరికో ఆఫీసు పెట్టిమహాడు కదా! రోజంతా ఆ పిల్లకి సహాయం చేయడం కోసం తిరిగితే మరి వీడు వెనుకపడడా?! అడిగితే బాధపడుతాడని అడగలేదు నిష్టూరం గా అంది పర్వతాలు.

అవునవును నేను చూస్తున్నాను. మొదట వీడి ఆఫీసులో పనికి కుదిరించుకున్నాడు. కాదని అక్కడున్న అమ్మాయిలు చెప్పారు. ఆ పిల్లకి కూడా ఏదో ఏజెన్సీలు వీడే ఏర్పాటు చేసాడట. పెళ్ళానికి చెప్పాడు పీతాంబరం.

ఆ విషయం మీ కొడుకే నాకు చెప్పాడు. పోనీలేరా నలుగురికి దారి చూపించడం మంచిదేలే అని నేనే అన్నాను. నా మతిమండ దారిచూపిస్తాడనుకున్నాను గాని, దారి పొడవునా తోడుంటాడనుకోలేదు. నిన్నటికి నిన్న ఎక్కడో జగదాంబ జంక్షన్ దగ్గరకెళ్ళి రెండు కోట్లు చిట్ లు కట్టారట. ఇంటికొచ్చి ఆనందం గా నాకు చెప్పాడు. కమీషన్ అమ్మాయికి కష్టం వీడికి కష్టం వీడికి అంది పర్వతాలు కోపంగా..
"వాడు నీతో అన్నాడా?" ఆశ్చర్యంగా అన్నాడు పీతాంబరం.

వాడెందుకంటాడు? వాడు ఆనందంగానే వున్నాడు. నేనే అంటుమ్న్నాను. రెండు లక్షలు.... రెండు లక్షలు  కమీషనొస్తోందట. అందులో సగమన్నా ఆ పిల్ల వీడికివ్వాలి కదా! అంది పర్వతాలు.

ఏమో! ఇస్తుందేమో నీ కొడుకు అంత తెలివితక్కువ వాడు కాదు కదా? అన్నాడు పీతాంబరం.

ఆ పిల్ల ఇచ్చినా వీడు పుచ్చుకుంటాడో లేదో ? కదా!  రోకు మీద వున్నాడు. ఆ పిల్ల రోకలి మింగమన్నా మింగేసేలా వున్నాడు విచారంగా అంది పర్వతాలు.

పోనీలేవే ? కక్కిన కూడుకు ఆశ పడకూడదు. మన వాడి డబ్బేం ఇచ్చెయ్యటం లేదు కదా! ఆ పిల్ల కూడా అనువైనదే! మనవాడికి అంతకన్నా మించిన దాన్ని తేగలమా!? ఎవరి తలరాత వాళ్ళది? నువ్వూ నేనూ మార్చగలమా చెప్పు" భార్యకు బోధపరుస్తూ అన్నాడు.
సరి సరే! లెండి తెల్లగా తెల్లారిపోయింది. బోలెడన్ని పనులు అంటూ లేచి వంట గదిలోకి వెళ్ళిపోయింది పర్వతాలు.

పెళ్ళాం పర్వతాలు రుసరుసగా వెళ్ళడం చూసి ముసిముసిగా నవ్వుకున్నాడు పీతాంబరం.

ఉదయాన్నే కస్టమర్లందర్నీ కలిసి పదో గంటకి గోపాలపట్నం చేరుకున్నాడు ఏకాంబర్.

అప్పటికే ఆఫీసు తెరచి వుంది. నూకరత్నం కంప్యూటర్ లో ఆ రోజు వాయిదాలు కట్టవలిసిన వారి జాబితా మరోసారి సరిచూసుకుంటూ కూర్చుంది. అమ్మాయిలిద్దరూ ముందు రోజు వసూలు అయిన కలెక్షన్ జాబితా రాసుకుంటూ కూర్చున్నారు.

బైక్ అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టి నేరుగా ఆఫీసులోకొచ్చి తన కేబిన్ లో కెళ్ళి కూర్చున్నాడు. మనసంతా ఆందోళంగా వుంది. ఉదయం నుండి తిరిగినా ఒక్క పాలసీ రాయించలేకపోయాడు. కేంపైన్ గడువు చూస్తే దగ్గర పడిపోయింది.

ఆలోచిస్తూ కూర్చున్నాడు. మనసంతా చిందరవందరగా వుంది. ఇంతలో కలెక్షన్ కుర్రాళ్ళు, అమ్మాయిలు పదిమంది వచ్చారు. ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు.

ఏకాంబర్ అలా విచారం గా ఉండడం ఎప్పుడూ చూడలేదు నూకరత్నం. ఎప్పుడూ ఇంత హుషారుగా నవ్విస్తూ, కవ్విస్తూ వుండే వ్యక్తి ఈ రోజు ఎంత డల్ గా వున్నాడా? అనుకుంది.

ఇంతలో వాచ్ మెన్ భార్య పద్మక్క అందరికీ ,టీ పట్టుకువచ్చింది. ఆఫీసులో వున్న యువతీయువకులందరికీ ఇచ్చింది. నూకరత్నానికి కూడా టీ ఇచ్చింది. తన గ్లాసుతో పాటు ఏకాంబర్  కోసం కూడా టీ తీసుకుని కేబిన్ లోకి వెళ్ళింది నూకరత్నం.

టీ త్రాగండి అంటూ టీ గ్లాసు ఏకాంబర్ ముందు టేబుల్ మీద పెట్టింది నూకరత్నం.

ఏదో ఆలోచనలో వున్న ఏకాంబర్ ఒక్కసారే నూకరత్నం కేసి చూసి అన్యమన్స్కంగానే టీ గ్లాసు అందుకున్నాడు.

ఏమైంది? ఈ రోజు చాలా డల్ గా వున్నారు. ఏకాంబర్ కి ఎదురుగా కూర్చుంటూ అంది నూకరత్నం.

ఏం లేదు ఏదో చిన్న సమస్య అంటూ టీ గ్లాసు నోటి దగ్గర పెట్టుకుంటూ అన్నాడు.

చిన్నదయినా, పెద్దదయినా సమస్యే కదా! చెప్పండి పరిష్కారం ఆలోచిద్దాం. అంది చిన్నగా నవ్వుతూ.

నూకరత్నం అలా అనేసరికి చురుగ్గా ఆమె కళ్ళల్లోకి చూసాడు. అత్మవిశ్వాసంతో తొణికిసలాడుతున్న ఆమె మోము లో మెరుస్తున్న చిరునవ్వు గమణించి నిర్మలం గా అన్నాడు ఏకాంబర్.

ఇన్స్యూరెన్స్ కేంపేయిన్ టార్గెట్ కంప్లీట్ కాలేదు. ఎప్పుడూ బ్రాంచి లో మొదటి స్థానం లో వుండే నేను రెండో స్థానం లో వున్నాను చెప్పాడు.ఓస్ అంతేనా? దానికేముంది. నాలుగు పాలసీలు ఎక్కువ చేస్తే మల్లీ మీరే ముందుంటారు. అంది.   తేలిగ్గా,ఎలా వారం రోజుల్నుండీ తిరుగుతున్నాను. అంతా డల్ గా వుంది. విచారం గా అన్నాడు ఏకాంబర్.

మీరే ఇలా డీలా పడితే ఎలా? మాకందరికీ మోరల్... మోడల్ మీరేకదా! ఆలోచిస్తే  ఏ సమస్యా ఓ కొలిక్కి రాదు. కొంచెం ప్రశాంతం గా ఆలోచించండి. అంది నూకరత్నం. అలా అందే గానీ, ఏకాంబర్ వెనుకబడడం తను కూడ తట్టుకోలేకపోతోంది.డివిజన్ లెవల్ లో టాప్ ఏజెంటు గా ప్రశంసలందుకున్న ఏకాంబర్ ఇంతలా డీలా పడి కూర్చోవడం చూడలేకపోతోంది నూకరత్నం.రత్నం! టైం అంతగా లేదు.. ఏటూ అంతగా లేదు ఎటూ పాలుపోవడం లేదు. కస్టమర్లందరినీ కలిసాను. కొత్తవారిని కలుస్తున్నాను. కానీ ప్రయోజనం కనిపించలేదు. ఈ రెండు రోజుల్లో కోటి రూపాయలు వరకూ పాలసీలు సంపాదించాలంటే జరిగే పని కాదు. పాలసీలే కాదు కస్టమర్ల సంఖ్య కూడా ముఖ్యం. నలభై పాలసీలు వుండాలి. కోటి రూపాయలు ఇన్స్యూరెన్స్ చేయించాలి.  ఇదెలా సాధ్యం?! విచారం గా అన్నాడు ఏకాంబర్.

రెండు రోజులు ! నూకరత్నం కూడా ఒక్కసారే డీలా పడిపోయింది. నలభై మంది కస్టమర్ల దగ్గర కోటి రూపాయలు పాలసీలు సేకరించాలి  ఎలా? ఆమె మెదడు పాదరసం లా పనిచేస్తోంది.ఏకాంబర్ .. మన ఎమ్మెల్యే .. అదే మన ఫ్రాంచైజీ ని ప్రారంభించారే మేడిపండు అబద్దాల రావు ఎమ్మెల్యే గారిని కలిస్తేనో? ఆనందం గా అంది నూకరత్నం.

ఎందుకు చేయరు. ఎమ్మెల్యే గారికి ఎందరో పరిచయస్థులు వుంటారు. మనకి ఆయన తప్పక సహాయం చేస్తారు.  అంది నూకరత్నం.ఎస్! పద ఇప్పుడే వెళ్దాం. అంటూ గబాలున లేచి నిలబడ్డాడు ఏకాంబర్.ఎమ్మెల్యే గారికి ఇప్పుడే ఫోన్ చేయండి. ఆయన ఉన్నారో లేదో తెలుస్తుంది. అంది నూకరత్నం.

కరెక్టే! ప్రయాసపడి వెళ్ళాక ఆయన లేకపోతే బీచ్ రోడ్ లో నుండి తిరిగి రావాలి. అంటూ సెల్ లో వున్న ఎమ్మెల్యే నెంబర్ కి కాల్ చేసాడు ఏకాంబర్.అట్నుండి వెంటనే ఫోన్ రిసీవ్ చేసుకున్నారు.

"సార్1 నమస్తే! మర్యాదగా పలకరించాడు ఏకాంబర్.ఎవరూ? అటునుండి ఎమ్మెల్యే గొంతు.సార్! నేను సార్ ఏజెంటు ఏకాంబర్ ని అన్నాడు ఏకాంబర్.

హలో ఏకాంబర్ ఎలా వున్నారు? మీ పాలసీల వేట బాగా సాగుతోందా?! మీ అఫీసు బాగా నడుస్తోందా?! నవ్వుతూ పలకరొంచాడు ఎమ్మెల్యే.బాగానే వుంది సార్! మిమ్మల్ని ఈ రోజు కలవాలనుకుంటుం న్నాను రమ్మంటారా1 వినయం గా అడిగాడు ఏకాంబర్.

రండి! రండి! ఏకాంబర్. నేను రోజం తా ఇంట్లోనే వుంటాను. నవ్వుతూనే ఆహ్వానించాడు ఎమ్మెల్యే మేడిపండు అబద్దాలరావు.థేంక్యూ సర్! ఇప్పుడే బయలుదేరుతున్నాను సార్! అన్నాడు ఏకాంబర్.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
29th episode