Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
30th episode

ఈ సంచికలో >> సీరియల్స్

కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ

జరిగిన కథ:
వినోద్ , వరేణ్యను కలవడానికి వస్తాడు. వరేణ్య ,బామ్మ చెప్పినట్టు ఎంతో నీరసంగా, బాధగా వున్నట్టు నటించి , వినోద్ మనసు కరిగేలా చేసి త్రివిక్రం గురించి నిజాలు రాబడుతుంది.


రాత్రి చాలా లేటుగా వచ్చింది. ఇంకా నిద్ర లేవ లేదు'' చెప్పింది ఆవిడ.

''ఎక్కడికి వెళ్ళిందట?''

''చెప్పలేదు.''

''సరి, నేను ఈవినింగ్‌ వచ్చేస్తున్నాను. మా అమ్మగారు కూడా వస్తున్నారు. దాన్నెక్కడికీ వెళ్ళకుండా ఇంట్లోనే వుండమను.''

''అది నా మాటవినదు. అయినా చెప్పిచూస్తాను.''

'అమ్మాయి వెంట ఎవరన్నా కుర్రాడు వచ్చాడా? వాడి పేరు త్రివిక్రమ్‌.''

''లేదు..........ఎవరూరాలేదు. అయినా ఎందుకిదంతా అడుగుతున్నారు? అక్కడ ఏమైంది?''

''ఓ.కె.......ఫోన్‌లో చెప్పే విషయాలు కావివి. నేవస్తున్నాగా..............'' అంటూ ఫోన్‌ పెట్టేశాడాయన.

ఆఫీసుకు లేటుగానే వచ్చాడాయన.

ఆయన వచ్చేసరికి ఎకౌంట్‌ సెక్షన్‌లో మేనేజరు మధుసూదనరావు వినోద్‌ కూర్చునున్నారు. ఎదురుగా కంప్యూటర్‌ వుంది. ఆపరేటర్‌ కంప్యూటర్‌లోంచి తీస్తున్న మెసేజ్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్‌లోని హెడ్డాఫీస్‌తోబాటు విజయవాడ, తిరుపతి, నెల్లూరు, కడప, మొదలయిన  చోట్ల వున్న బ్రాంచ్‌ ఆఫీసుల్లోని కంప్యూటర్లతో అనుసంధానం చేయబడిన కంప్యూటర్‌ అది. కాబట్టి ఎక్కడినుంచి అయినా ఇన్ఫర్మేషన్‌ రిసీవ్‌ చేసుకోవచ్చు.

'ఏమిటి అంతగా ఆశ్చర్యపోతున్నారు?'' వచ్చి తనూ కూర్చుంటూ అడిగారు నాయుడుగారు.

''ఆశ్చర్యమే సార్‌! ఆ కర్రాడు జీనియస్‌?'' అన్నాడు మధుసూదనరావు.

''ఏ కుర్రాడి గురించి నువ్వు చెప్పేది?''

''అతనే సర్‌! వినోద్‌ సార్‌ స్థానంలో వచ్చి వెళ్ళిపోయినవాడు. అతడి సలహాలు, సూచనలు పంచసూత్ర మనం ఇంప్లిమెంట్‌ చేసి పదిహేను రోజులయింది. ఈ పక్షం రోజుల్లోనూ మన సేల్స్‌ ఫార్టీ పర్సంట్‌ పెరిగాయి. సేల్స్‌ నెట్‌ కోటిరూపాయలు దాటింది. ఈ చార్ట్‌ చూడండి'' అంటూ కంప్యూటర్‌ నుంచి తీసిన చార్ట్‌ ఆయనకు అందించాడు మధుసూదనరావు.

ఆ చార్ట్‌చూసి ఆశ్చర్యపోకుండా వుండలేకపోయాడాయన.

ఆటో మొబైల్‌ స్పేర్‌పార్ట్స్‌ రంగంలో తమ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి చెప్పటానికి ఈ చార్ట్‌ చాలు.

''మిస్టర్‌ వినోద్‌! నీ అభిప్రాయం ఏమిటి?'' అడిగాడాయన.

''ఇది నిజంగా అద్బుతమే సర్‌! అతడ్ని మెచ్చుకొనక తప్పదు. నేను క్రియేటర్‌నేగాని సేల్స్‌ పర్సన్‌ని కాదు. ఇతను వ్యాపారవిస్తరణకి పథకరచన చేయటలో జీనియస్‌గా ఒప్పుకుతీరాలి'' అన్నాడు త్రివిక్రమ్‌ని మెచ్చుకుంటూ వినోద్‌.

మధుసూదనరావు ఆనందం నాలుగు అంచెలు పైకివెళ్ళి ఆగింది. ఆ ఉత్సాహంలోనే సుధాకర్‌నాయుడితో అన్నాడు.

''సర్‌! వెళ్ళిపోయిన త్రివిక్రమ్‌ చదివింది ఇంటరే కావచ్చు. కాని అపారమైన తెలివితేటలున్న కుర్రాడు. ఒక మనిషి జీవితంలో చదువు వేరు, వృత్తి వేరు, వ్యాపారం వేరు, కొందరు చదువుతో గొప్పవాళ్ళు అవుతారు. కొందరు వృత్తి నైపుణ్యంతో గొప్పవాళ్ళు అవుతారు. కొందరు వ్యాపారరంగంలో గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి గొప్పవాడు కావటానికి చదువు ఎంతమాత్రం కొలబద్ద కాదు అనేది నా అభిప్రాయం. మీరెలాగూ వరేణ్యను అతనికివ్వరు. మీ లెవల్‌కి అది సరితూగే విషయం కూడా కాదు. అంచేత మీకు తెలిస్తే ఆ కుర్రాడి అడ్రస్‌ చెప్పండి సర్‌, నా కూతురు మమతను యిచ్చి పెళ్ళిచేసి అల్లుడ్ని చేసుకుంటాను'' అనడిగేసాడు ముచ్చటపడిపోతూ.

ఆ మాటలు వినగానే

మొదటిసారిగా సుధాకర్‌ నాయుడిలో త్రివిక్రమ్‌ విషయంలో పాజిటీవ్‌గా ఆలోచనలు ఆరంభమయ్యాయి. అదే సమయంలో పక్కనున్న వినోద్‌ ముఖం చిన్నపోయింది. అటు కంప్యూటర్‌ ఆపరేటర్‌ ముఖం చిటపటలాడింది. ఎందుకంటే ఆ ఆపరేటర్‌ ఎవరోకాదు. గుండుమల్లి మమత. తండ్రి మాటలు వింటూనే 'డాడీ' అనరిచింది.

''ఏమిటమ్మా?'' అడిగాడు మధుసూదనరావు.

''నేను అతడ్ని చేసుకోను.''

''అదేమిటి? మొన్నటిదాకా ఆ కుర్రాడంటే పడిఛస్తానన్నావ్‌.''

''అదంతా వట్టి తమాషా. ఇప్పుడు నేనో కుర్రాడ్ని లవ్‌చేసాను. అతన్నే నేను చేసుకుంటాను.''

''ఎవరతను?''

నోటితో చెప్పలేదు అమ్మాయి.

చేయిచాపి వినోద్‌ని చూపించింది.

''నిజంగానా?'' నమ్మలేట్టు అడిగాడు మధుసూదనరావు.

అవునన్నట్టు తలూపింది మమత.

అంతవరకు వచ్చాక ఇక చెప్పకపోతే బాగుండదిన నోరువిప్పాడు వినోద్‌. సుధాకర్‌ నాయుడ్ని చూస్తూ

''సారీ సర్‌! మీరు నన్ను క్షమించాలి. మీ అమ్మాయి వరేణ్య చాలా తెలివైన యువతి. తనకు ఎవరు కావాలో ఆమెకు తెలుసు. నా వరకు మమతను ఇష్టపడుతున్నాను. మమత కూడా నన్ను ఇష్టపడుతోంది. పెద్దలు, మీరంతా ఆశీర్వదిస్తే మేం ఒకటవుతాం'' అన్నాడు.

''ఏమయ్యా! నీ అభిప్రాయం ఏమిటి?'' మధుసూదనరావునడిగాడు నాయుడు. అతను భారంగా నిట్టూర్పాడు.

మేరేజెస్‌ ఆర్‌ మేడ్‌ ఇన్‌ హెవన్‌ అన్నారు ఇందుకే. వినోద్‌కి వరేణ్యతో రాసిపెట్టిలేదు. అందుకే మధ్యలో వచ్చాడు త్రివిక్రమ్‌. మీరు వరేణ్యను యివ్వరనుకుని నా కూతుర్ని యిద్దామనుకున్నాను చూసారుగా, వీళ్ళిద్దిరికీ రాసిపెట్టివుంది. అందుకే లవ్‌లో పడిపోయారు. నా అభ్యంతరం లేదు. వినోద్‌ నా అల్లుడు గావటం నాకు సంతోషమే'' అంటూ తన అంగీకారం తెలిపాడు. ఆయన సమ్మతించటంతో మమత, వినోద్‌లు ఒకరినొకరు చూసుకుని హేపీగా నవ్వుకున్నారు.

''వరేణ్య హైదరాబాద్‌ వెళ్ళిపోయింది. ఆ కుర్రాడు త్రివిక్రమ్‌ అక్కడున్నాడేమోనని నాకు డౌటు. నీకేమన్నా తెలుసా?'' వినోద్‌ని అడిగాడు నాయుడు.

''ఆ కుర్రాడు హైదరాబాద్‌లో వున్నాడా?''

''అవును సార్‌! అతని తండ్రి గోవిందరావుగారు మంచి పొజిషన్‌లో జాబ్‌చేస్తున్నారు. తల్లి తండ్రి తమ్ముడు చక్రధర్‌, చెల్లెలు రమ్య, చక్కటి కుటుంబం. గోవిందరావుగారు పెద్దకొడుకు త్రివిక్రమ్‌ని డాక్టర్‌ని చేయాలని, చిన్నకొడుకు చక్రధర్‌ని ఇంజనీర్‌ను చేయాలని ఆశ పడ్డారు. చక్రధర్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. త్రివిక్రమ్‌ ఇంటర్‌తోనే చదువు ఆపేసి గాలికి తిరుగుతున్నాడని ఆయనకి కోపం. డిగ్రీ అవగానే కూతురు రమ్యకి పెళ్ళిచేసారు. ఆ పెళ్ళి విషయంలోనే సమస్యఎదురై తండ్రి ఇల్లు అమ్మకుండా ఆపటంకోసం తన పరువు నిలుపుకోవటంకోసం బ్యాంకులో ఏడు లక్షలు దోపిడీచేసి తండ్రికి సాయపడ్డాడు. కాని తను పట్టుబడి మూడేళ్ళు జైలుశిక్ష పడి ప్రస్తుతం జైల్లో వున్నాడు. శిక్షపడి ఆరు మాసాలయింది. గోవిందరావుగారి కుంటుంబానికి ఈ విషయం తెలీదు. త్రివిక్రమ్‌ దుబాయ్‌లో వున్నాడనుకుంటున్నారు. అంటూ ఆ తర్వాత ఏం జరిగిందో ఏదీ దాచకుండా అంతా ఆయనకు చెప్పేసాడు వినోద్‌?

''మీరు వరేణ్యను అతనికిచ్చి చేస్తారో లేదో తెలీదుకాని మీ అమ్మాయి మాత్రం అతన్ని చాలా డీప్‌గా లవ్‌చేసింది. ఎందుకంటే క్లోజ్‌గా స్నేహం చేసింది గాబట్టి మనకన్నా అతడి గురించి ఆమెకే ఎక్కువ తెలుసు'' అన్నాడు.

''ఓ.కె. వినోద్‌! ప్రతి విషయంలోనూ నువ్వు ఎప్పుడూ లేటే. ఈ విషయాలన్నీ ముందే నాకు నువ్వుచెప్పి వుండాల్సింది, ఎనీవే........నేనింకా ఏ నిర్ణయం తీసుకోలేదు. రేపు హైదరాబాద్‌ వెళ్ళాక డిసైడ్‌ చేస్తాను. మమతను నువ్వు పెళ్ళిచేసుకుంటే నాకు సంతోషమే'' అని చెప్పి లేచి తన చాంబర్‌లోకి వెళ్ళిపోయాడు.

''చెలియా కనరావా.............నిరాశ చేసిపోయితివా....................చెలియా కనరావా...............

''జైలు గోడలమధ్య పాత సినామాపాటలు పాడుకంటూ పాదులకు నీళ్ళుపోస్తున్నాడు త్రివిక్రమ్‌. ఇంతలో మరోసారి అతడి కుడిభుజం బలంగా అదిరింది.

''అమ్మో.................! ఏమిటి? భుజం అదురుతూనే వుంది. ఏమిటి కారణం?'' అనుకుంటూ కంగారుపడ్డాడు.

ఇంతలో అక్కడికొస్తూ కన్పించాడు జైలర్‌ ఆంజనేయులు.

''ఏరా త్రివిక్రమ్‌! నువ్వింకా విరహగీతాలే పాడుకొంటున్నావా?'' అనడిగాడు పరిహాసంగా.

'మరి డ్యూయెట్టు పాడుకోడానికి హీరోయిన్‌ లేదుగా సార్‌. అందుకే ఎంత పాడినా విరహం తీరేదికాదు'' అన్నాడు త్రివిక్రమ్‌.

''అవున్లే.............అయినా అదేమిట్రా... ఆ పిల్లని నిరాశచేసి పారిపోయి వచ్చింది నువ్వు ఇప్పుడు చెలియా కనరావా అంటే కనబడుతుందేమిటి?''

''కనబడదు సార్‌! ఏం చేస్తాం? దేనికయినా రాసిపెట్టివుండాలి సార్‌. మీకు శకునఫలితాలు తెలిస్తే చెప్పి పుణ్యంకట్టుకోండి సార్‌! ఈ రోజంతా నా కుడిభుజం అదురుతూనే వుంది. ఇదేదన్నా జబ్బు అంటారా లేక శుభాశుభ ఫలితాలకు ఇది సంకేతం అంటారా?

''అబ్బో! కుడిభుజమదిరెను, కుడికన్ను అదిరెను అంటూ ఓ పాటే వుంది. మగాడికి కుడిపక్క ఎక్కడ అదిరినా ఫలితం శుభంగానే వుంటుంది కుడిభుజం అదిరింది అంటున్నావ్‌ గాబట్టి కన్యాలాభంరా. శుభవార్త కూడా వింటావ్‌.''

''అయ్య బాబోయ్‌! మీరేదో అనవసరంగా నన్ను కంగారుపెట్టేస్తున్నారు సార్‌. జైలుశిక్ష అనుభవిస్తున్న వాడ్ని, నాకు కన్యాలాభమూ, శుభవార్తలూ ఏముంటాయి సార్‌.''

''కన్యాలాభం సంగతి నాకు తెలీదురా, శుభవార్త మాత్రం నేనే తెచ్చాను. అది చెప్పటానికి యిలా వచ్చాను.''

''మీరు తమాషాచేయటం లేదుగదా!''

''లేదురా, నిజమే చెప్తున్నాను. నువ్విక ఒక్కక్షణం కూడా ఈ జైల్లో వుండటానికి వీల్లేదు వెళ్ళి స్నానంచేసి డ్రస్సు మార్చుకురా, నిన్ను పంపించేస్తున్నాను.''

''ఇదేంన్యాయం సార్‌! ఆక్రమం................ఈ త్రివిక్రమ్‌ ఈ జైల్లోనే వుంటాడు. ఇంకో జైలు నాకు సూట్‌కాదు, వెళ్ళనుగాక వెళ్ళను.''

''వెళ్ళి తీరాలిబాబూ! ఇది నిన్ను జైలుమార్చే సమస్యకాదు. నిన్ను రిలీజ్‌చేస్తున్న వార్త.

''నమ్మను, చచ్చినా నమ్మను. నన్ను రిలీజ్‌ చేయటమేమిటి సార్‌. మూడేళ్ళ శిక్షాకాలంలో మూడోవంతు కూడా ఇంకా కాలేదు.''

''ఏం జరిగిందో నాకు తెలీదు. బ్యాంకువాళ్ళు కేసు వాపస్‌ తీసుకున్నారు. నిన్ను వెంటనే రిలీజ్‌ చేయమని ఇంతక్రితమే కోర్టునుంచి ఆదేశాలు అందాయి. అంచేత నిన్ను రిలీజ్‌ చేస్తున్నాం. ఆఫీస్‌ రూంలో వుంటాను. త్వరగా రెడీఅయిరా'' అంటూ చెప్పాల్సిన మేటర్‌ చెప్పేసి వెళ్ళిపోయాడాయన.

ఆయన మాటల్ని నమ్మలేక కాస్సేపు అలాగే కూర్చుండిపోయాడు త్రివిక్రమ్‌. ఇదేదో అద్భుతం జరిగి వుండాలి. లేకుంటే ఇంత సడన్‌గా  తనను కోర్టు రిలీజ్‌ చేయటం ఏమిటి? ఒకవేళ తను జైల్లో వున్న సంగతి డాడికి తెలిసి ఏదన్నా ఏర్పాటుచేసి వుంటాడా...? ఆయనకు తెలిసే ఛాన్సేలేదు. శివ చెప్పడు. మరి ఏం జరిగివుంటుంది.

ఏం జరిగిందో ఏమోగాని

తనుమాత్రం జైలునుంచి వెళ్ళక తప్పదు. ఎక్కడికెళ్ళాలి..................? ఇంటికా, డాడీ ఎలా రియాక్టవుతారో! మమ్మీ ఖచ్చితంగా తన గురించి బెంగపెట్టుకుంటుంది. మమ్మీని చూడాలని చాలా ఆశగా వుంది. తర్వాత సంగతి ఎలా వున్నా ఓసారి ఇంటికెళ్ళి అందర్నీ చూడాలి.    తోటి ఖైదీలతోను, సెంట్రీలతోనూ తను రిలీజవుతున్న శుభవార్తను చెప్పుకొని సంతోషపడ్డాడు. నీట్‌గా స్నానంచేసి ఆఫీసులోకి వెళ్ళాడు.

జైలుడ్రస్సు తీసేసి తన డ్రస్సు తీసుకొని ధరించి జైలర్‌ ఆంజనేయులు ఎదుటకెళ్ళాడు. అప్పటికి సాయంత్రం అయిదుగంటలు కావస్తోంది సమయం.

''రారా................ఇంద, నువ్వు నా దగ్గర దాచుకుంది ఇతరత్రా కలిపి మొత్తం ముప్పైవేలు. ఇది నీ పర్సు'' అంటూ వాటిని టేబుల్‌ మీద వుంచాడు.

''ఏరా, ఇంటికెళ్ళిపోతావుగా?'' అడిగాడాయన.

''అవున్సార్‌! మమ్మీని, డాడిని చూడాలి, తమ్ముడ్ని చూడాలి, ముఖ్యంగా చెల్లాయి పెళ్ళిచూళ్ళేకపోయాను. చెల్లాయిని, బావగార్ని చూడాలి.''

''ఓ.కె..రా! నువ్వు రిలీజవుతున్న సందర్భంగా ఏదన్నా చిన్న పందెం వేసుకుందామా?''

''ఓ.కె. సార్‌. ఈ డబ్బంతా బెట్టింగ్‌ కాస్తున్నాను అడగండి.''

''అంతలేదు బాబూ! కావాలని ఓడిపోయి డబ్బంతా నాకు వదిలేసి పోతావు నువ్వు. నీ సంగతి నాకు తెలీదా? పందెం వందరూపాయలు మాత్రమే, ప్రశ్ననీది ఆన్సర్‌ నాది.''

''ఓ.కె. మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, ఈ ఇద్దరికి ఒక పోలిక వుంది, ఏమిటది?''

''వెరీసింపుల్‌, ఆయన గాంధీ, ఈవిడా గాంధీ.''

''కాదు కాదు, సింపుల్‌ ఆన్సర్‌,మీకు తెలుసు..............చెప్పండి.

''నాకు తెలీదు, ఓడిపోయాను నువ్వేచెప్పు.............ఇదిగో వందరూపాయలు.''

''ఇద్దరూ హత్యకు గురయ్యారు, మీకు తెలుసు, కావాలనే మీరు ఓడిపోయారు.''

''యస్‌..................కుర్రాడివి, నువ్వు ఓడిపోకూడదు. టేకిట్‌'' అంటూ అప్యాయంగా వందకాగితం చేతిలోపెట్టాడు జైలర్‌.

డబ్బు జేబులో వేసుకుని ఆయన వంక చూసాడు త్రివిక్రమ్‌.

''తెలిసో తెలియకో ఇక్కడ వున్నంతకాలం చాలా అల్లరిచేసి మిమ్మల్ని ఇబ్బందిపెట్టాను. నన్ను క్షమించండి సార్‌'' అంటూ నమస్కరించాడు. ''ఇట్సాల్‌రైట్‌ మైబోయ్‌! హేపీగా వెళ్ళిరా, అప్పుడప్పుడూ వచ్చి చూసి పోతావుండు, ఇంటికిరా, జైలుకి రామాకు.''

''అలాగే సార్‌ థ్యాంక్యూ''

''ఒన్‌మినట్‌! నీకోసం బయట ఒక గెస్ట్‌ చాలాసేపటిదాకా వెయిటింగ్‌లో వున్నారు. పలకరించి వెళ్ళు.''

''ఎవరు సార్‌.''

''వెళ్ళవయ్యా నీకే తెలుస్తుంది.''

త్రివిక్రమ్‌కు అర్థంకాలేదు.

బహుష తన ఫ్రెండు శివ వచ్చాడేమో అనుకున్నాడు.

ఆఫీసులోంచి బయటపడ్డాడు.

జైలు ఆవరణ గేటుదాటి బయటికి అడుగుపెట్టాడు.

తనకోసం ఎదురుచూస్తున్న గెస్ట్‌ ఎవరాని చుట్టూ చూసాడు. ఎవరూ కనబడలేదు. అంతదూరంలో చెట్టుకింద ఒక ఖరీదయిన కారు నిలబడుంది. ఆకుపచ్చరంగులో రాజహంసలా నిలబడుంది బెంజ్‌కారు. లోపల ఎవరన్నా వున్నారోమో తెలీదుగానీ బయట ఎవరూ కనబడలేదు. అయినా తనకోసం కారులో వచ్చేవాళ్ళు ఎవరున్నారని ఆలోచిస్తూనే అడుగులు ముందుకు సారించాడు.

ఆ కారు సమీపంలోంచే అవతలకు వెళ్ళాలి.

కారు సమీపంలోకి వచ్చేసాడు.

అంతలో క్లిక్‌మని చప్పుడు చేస్తూ

కారు డోర్‌ తెరుచుకుంది.

మెరుపుతీగలా కారు దిగుతున్న వరేణ్యను చూడగానే ఎత్తిన పాదాన్ని ఎత్తినట్టే దించి అక్కడే నిలబడిపోయాడు. అతను ఎంతమాత్రం వూహించని, ఎదురుచూడని సంఘటన ఇది ఆరోజు జైలర్‌సార్‌ అన్న మాటలు అక్షరసత్యాలవుతాయని ఆసలు వూహించలేదు.''నువ్వు జైల్లో వున్నానన్న సంగతి తెలిస్తే, ఆ అమ్మాయి రాష్ట్రంలోని జైళ్ళన్నీ గాలిస్తూ ఏదోరోజు ఇక్కడికొచ్చేస్తుంది నీకోసం'' అన్నారాయన. అది నిజమైంది.

ఆమె డోర్‌మూసి అక్కడే నిలబడింది.

ఆమె ముఖంలోకి చూళ్ళేక  ఉన్నచోట నిలబడి ముఖం దించుకున్నాడు.  ఇన్నిరోజుల విరహం గుండెల్లో గూడుకట్టుకున్న ప్రేమ కలిపి ఆమెను అక్కునచేర్చుకోమని తొందరచేస్తున్నాయి. అది దుఃఖమో, ఆనందమో అంతకుమించిన ప్రేమావేశమో అతడికే తెలీదుగానీ కళ్ళలోమాత్రం నీటిపొర చిమ్మింది. తను జైలునుంచి రిలీజ్‌ ఎలా అయ్యాడో అర్ధమైపోయింది.

వరేణ్య గబగబా అతడి ముందుకొచ్చి ఎదురుగా నిలబడింది. ఆమె కళ్ళలో కన్నీరు పొంగుతోంది

''ఎందుకొచ్చేసావ్‌? నన్నొదిలి ఎందుకొచ్చేసావ్‌?'' నా లోపం ఏమిటి? నీ గురించి తెలిస్తే చీదరించుకుంటాననుకున్నావా? అలాచేస్తే అది ప్రేమవుతుందా? నా ప్రేమని ఎందుకు శంకించావు. చెప్పకుండా వచ్చేస్తే నేనేం కావాలనుకున్నావు?'' రుద్దకంఠంతో నోరు పెగల్చి ''సారీ..............సారీ వరేణ్యా'' అన్నాడు.

''నీ సారీలు నాక్కరలేదు. బదులుకావాలి, నాకిప్పుడే చెప్పాలి. ఎందుకిలా చేసావ్‌. ఎందుకు? అంటూ  చిన్నపిల్లలా గుప్పిళ్ళతో ఛాతీమీద కొట్టింది. ఇక అపుకోలేక అలాగే అతడ్ని వాటేసుకుని గుండెల్లో ముఖందాచుకుని చిన్నగా ఏడ్చేసింది.

ఇప్పుడు ఆమెను కౌగిలించుకోడానికి సంకోచింపలేదు త్రివిక్రమ్‌, బిగియార  కౌగిలించుకున్నాడు. ఇక ఇద్దర్నీ మాటలు కరువయ్యాయి. అదే సమయంలో ఎవరో చప్పట్లుచరిచారు.''క్యాసీన్‌హై!'' అంటూ అబినందించారు కూడా.

ఉలిక్కిపడి అటుచూసిన యిద్దరికీ జైలర్‌ ఆంజనేయులు తమవైపు వస్తూ కనిపించాడు.

అదే సమయంలో రివ్వు రివ్వున దూసుకొచ్చిన కార్లు రెండు వాళ్ళకి సమీపంలో ఆగాయి.

వరేణ్య, త్రివిక్రమ్‌లు కౌగిలి విడిపోయి, కళ్ళు తుడుచుకున్నారు. ఆంజనేయులు దగ్గరకొచ్చి ఇద్దర్నీ అభినందించాడు.

''మీ ఇద్దర్నీ యిలా చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. అరే త్రివిక్రమ్‌ ప్రేమకు ఓటమిలేదు. ఆ అమ్మాయి నిన్ను గెలుచుకుంది. హేపీగా వుండండి'' అన్నాడు.

ఈ లోపల ఒక కారులోంచి సుధాకర్‌నాయుడు, భాగ్యవతి, బామ్మ జయమ్మ దిగారు. మరో కారులోంచి మధుసూదనరావు, వినోద్‌, మమతలు దిగారు. వాళ్ళంతా దగ్గరకు వచ్చేసారు.

సుధాకర్‌నాయుడి ముఖం చిటపటలాడుతోంది.

తమ ప్రేమకు అసలయిన పరీక్ష యిదేనని ఇద్దరికీ అర్థమయిపోయింది.

''బేబీ..............నా మాట ధిక్కరించావ్‌, నీకా కుర్రాడు కావాలనుకుంటే ఆస్థిలో చిల్లిగవ్వ కూడా యివ్వను'' వస్తూనే హెచ్చరించాడు

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
meghana