Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movie Review - Nee Jathaga Nenundali

ఈ సంచికలో >> సినిమా >>

ప‌వ‌న్‌క‌ల్యాణ్ అంటే చాలా ఇష్టం! - ఆది

interview with aadi
న‌వ‌త‌రం కథానాయ‌కులంతా ల‌వ‌ర్‌బోయ్ అనే ఇమేజ్ కోసం పోటీప‌డుతున్నారు. లెక్క‌బెడితే ఆ రేసులో దాదాపు డ‌జ‌నుమంది క‌నిపిస్తారు. అయితే సాయికుమార్ త‌న‌యుడు ఆది మాత్రం వారంద‌రికంటే భిన్నంగా  తెర‌పై మాస్ మంత్రం జ‌పించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. తొలి సినిమాలోనే దేవ్‌గిల్‌లాంటి ఓ పెద్ద విల‌న్‌తో త‌ల‌ప‌డ్డాడు మ‌రి!. ఆ త‌ర్వాత ప్ర‌యాణం కూడా అదే త‌ర‌హా క‌థ‌ల‌తోనే సాగింది. అయితే... ప్రేక్ష‌కుల‌కు అది బోర్ కొట్టిందో ఏంటో న‌చ్చ‌లేదు.  దీంతో  ఆదిని వ‌రుస‌గా  రెండు ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించాయి. `సుకుమారుడు`, `ప్యార్ మే ప‌డిపోయానే` చిత్రాలు ఆయ‌న కెరీర్‌ని వెన‌క్కినెట్టాయి. దీంతో త‌న ప్ర‌యాణంలో కాసింత మార్పు చేసుకొన్నాడు ఆది. `గాలిప‌టం`లాంటి ఓ బోల్డ్ క‌థ‌ని ఎంచుకొని చేశాడు. ఆ ప్ర‌య‌త్నం స‌క్సెస్ అయ్యింది. యువ‌తే లక్ష్యంగా ఎగిరిన `గాలిప‌టం` ఆది కెరీర్‌కి మంచి బూస్ట‌ప్‌ని ఇచ్చింద‌ని చెప్పుకోవాలి. ఇప్పుడు మ‌ళ్లీ `ర‌ఫ్` పేరుతో ఓ మాస్ సినిమా చేస్తున్నాడు. మ‌ద‌న్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేయ‌డానికి ఒప్పుకొన్నాడు. ఈ సంద‌ర్భంగా ఆదితో ముఖాముఖి.

* `గాలిప‌టం` ఎలాంటి ఫ‌లితాన్నిచ్చింది?
- చాలా మంచి ఫ‌లితాన్నిచ్చింది. రెండు ప‌రాజ‌యాల త‌ర్వాత నాకు  ఈ సినిమాతో ఓ మంచి హిట్టు ల‌భించింది.  చెప్పాలంటే నాకు కొత్త అభిమానుల్ని ఇచ్చిందీ సినిమా. ఇదివ‌ర‌కు న‌న్ను, నా సినిమాల్ని ఇష్ట‌ప‌డిన ప్రేక్ష‌కులు `ఆది ఇలాంటి సినిమా చేశాడేంటి?` అని కాస్త  ఆశ్చ‌ర్య‌పోతుంటే... యువ‌త‌రం మాత్రం `ఆది డిఫ‌రెంట్ సినిమా చేశాడు` అంటూ మ‌ళ్లీ మ‌ళ్లీ థియేట‌ర్‌కి వెళ్లారు, వెళుతున్నారు. మ‌ల్లీప్లెక్స్‌ల్లో ఈ సినిమాకి ల‌భిస్తున్న ఆద‌ర‌ణ ఎంతో తృప్తినిచ్చింది. మేం ఊహించిన‌దానికంటే ఎక్కువ వ‌సూళ్లు వ‌చ్చాయి.

* ఇంత బోల్డ్ క‌థ‌తో సినిమా చేయాల‌న్న  ఆలోచ‌న ఎందుకొచ్చింది?
- నిజంగానే నా తీరుకు పూర్తి భిన్న‌మైన సినిమా ఇది. కానీ...  కొత్త‌గా ఉంటుంద‌నే న‌మ్మ‌కంతో చేశా. తొలిసారి ఈ క‌థ విన్న‌ప్పుడు నాకు చాలా బాగా న‌చ్చింది. అయితే ఇలాంటి క‌థ‌లో నేను న‌టించొచ్చా లేదా? అనే సందేహం కూడా క‌లిగింది. అందుకే నాన్న‌కి ఈ క‌థ వినిపించాం. ఆయ‌న క‌థ విని... `ప్ర‌జెంట్ జ‌న‌రేష‌న్ ఆలోచ‌న‌ల‌కి ద‌గ్గ‌ర‌గా ఉంది. నువ్  చేయొచ్చు` అన్నారు. దీంతో ఇంకేం ఆలోచించ‌కుండా సినిమా చేశా.

* ఇక నుంచి ఇలాంటి క‌థ‌ల‌తోనే సినిమాలు చేస్తారా?
- ఎప్ప‌టిక‌ప్పుడు  కొత్త ర‌క‌మైన క‌థ‌ల‌తో ప్ర‌యాణం చేస్తే ఎంత మంచి ఫ‌లితాలుంటాయో `గాలిప‌టం`తో తెలిసొచ్చింది. అందుకే ఇక నుంచి  ఒక‌దానికొక‌టి పోలిక‌లు లేని క‌థ‌ల‌తో ప్ర‌యాణం చేయాల‌ని నిర్ణ‌యించుకొన్నా. ఎప్పుడూ  `గాలిప‌టం`లాంటి సినిమాలే చేస్తే ఇబ్బందులొచ్చే ప్ర‌మాదం ఉందండీ బాబూ (నవ్వు) . నిజానికి ఈ సినిమా చూశాక న‌న్ను ఎంత‌మంది ప్రేక్ష‌కులు అభినందించారో... అంత‌మంది ప్రేక్ష‌కులు ద్వేషిస్తూ మెయిల్స్ పంపించారు. అస‌లు ఇలాంటి సినిమాలో ఎలా న‌టించావ్ అని అడిగారు.

* ఎందుక‌లా?
-  ప‌తాక స‌న్నివేశాలు చాలామందికి న‌చ్చ‌లేదు. మూడుముళ్ల బంధంతో ఒక్క‌టైన జంట విడిపోయి ఎవ‌రి ల‌వ‌ర్స్ వెంట వాళ్లు వెళ్లిపోవ‌డ‌మ‌నేది చాలామంది ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌లేదు. భార్యాభ‌ర్త‌లు క‌లిస్తే బాగుండేదనే అభిప్రాయాలు ఆ మెయిల్స్ లో వ్య‌క్త‌మ‌య్యాయి. కానీ అలా తీసుంటే క‌థ‌లో కొత్త‌ద‌నం ఉండేది కాదు.

*  సినిమాలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభిమానిగా న‌టించారు. ప్ర‌త్యేక కార‌ణాలేమైనా ఉన్నాయా? 
-  క‌థ మేర‌కే అలా న‌టించా. అయితే వ్య‌క్తిగ‌తంగా కూడా ప‌వ‌న్‌క‌ల్యాణ్  అంటే నాకు చాలా చాలా ఇష్టం. అందుకే ఆయ‌న అభిమానిగా చాలా జోష్‌తో న‌టించా. సినిమాలో నా పాత్రయిన కార్తీ స్వ‌త‌హాగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభిమాని. ఆ పాత్ర‌లో ఒదిగిపోయావు అని అంటున్నారు. అది ఎంతో ఆనందాన్నిచ్చింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ నేప‌థ్యంలో డైలాగులు చెబుతున్న‌ప్పుడు థియేట‌ర్లు మార్మోగిపోతున్నాయి. పంచ్‌లు చాలా  బాగా పేలాయి.

*  గాత్రంలో మీ కుటుంబానికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. అయితే పంచ్‌లు ప‌లికేందుకోసం మీరు ప్ర‌త్యేకంగా ఏమైనా జాగ్ర‌త్త‌లు తీసుకొంటుంటారా? 
- అలాంటిదేమీ లేదు. నేను `ల‌వ్‌లీ` నుంచి పంచ్ డైలాగులు చెబుతూన్నా.  కాకపోతే ఆ మోతాదు ఇందులో మ‌రింత ఎక్కువ అని చెప్పాలి.  ఇందులో పంచ్‌లు చాలా చెప్పాను. ప్ర‌తీ సంభాష‌ణా థియేట‌ర్ల‌లో చాలా  బాగా పేలింది.

* యువ క‌థానాయ‌కులంతా ల‌వ‌ర్‌బాయ్ ఇమేజ్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. మీరు మాత్రం భిన్న‌మైన దారిలో వెళుతున్న‌ట్టు అనిపిస్తోంది.
- ల‌వ‌ర్‌బోయ్ అనిపించుకోవ‌డం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే తొలి సినిమా `ప్రేమ‌కావాలి`లోనే నేను బాగా ఫైట్లు చేశాను. దేవ్‌గిల్‌లాంటి విల‌న్‌ని కొడుతుంటే ప్రేక్ష‌కులు చూసి ఆస్వాదించారు. వీడేంటి?  ఇంత పెద్ద విల‌న్‌ని కొట్ట‌డ‌మేంటి? అని ఎవ్వ‌రూ అనుకోలేదు. ఆ త‌ర్వాత `లవ్‌లీ`లోనూ ప్ర‌భాక‌ర్‌లాంటి భారీకాయంతో ఫైట్ చేసినా ప్రేక్ష‌కులు న‌మ్మారు. అందుకే  ప్రేక్ష‌కులు న‌మ్ముతున్న రూట్లోనే ప్ర‌యాణం చేయాల‌నిపించింది. కాక‌పోతే మ‌ధ్య‌లో కొత్త‌ద‌నం కోసం విభిన్న‌మైన క‌థ‌ల్ని కూడా ఎంచుకొని చేయాల‌నుకొంటున్నా. 

* ప్ర‌స్తుతం చేస్తున్న సినిమాలేమిటి?
- `ర‌ఫ్‌` తుదిద‌శ‌కు చేరుకొంది. అంది కంప్లీట్ మాస్ సినిమా. అలాగే మ‌ద‌న్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌బోతున్నా. ఆ క‌థ కూడా పూర్తిస్థాయిలో సిద్ధ‌మైంది. నాకు బాగా న‌చ్చింది. రెండు మాస్ క‌థ‌లే. అయితే.. ఆ రెండు న‌న్ను కొత్త త‌ర‌హాలో తెర‌పై ప్ర‌జెంట్ చేస్తాయ‌న్న న‌మ్మ‌కం నాకుంది.

* ఆమ‌ధ్య కుటుంబమంతా క‌లిసి `మ‌నం`లాంటి సినిమా చేయాల‌నుకొంటున్నాం అని మీ నాన్న‌గారు చెప్పారు...
- తాత‌గారికి న‌టించేంత ఓపిక లేదు. ఆయ‌న‌కి ఆరోగ్యం బాగోలేదు.  నాన్న, నేను క‌లిసైతే ఓ సినిమా చేయాల‌నుకొంటున్నాం. మంచి క‌థ దొరికితే త‌ప్ప‌కుండా  చేస్తాం.

* మీ కుటుంబానికి క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌తోనూ అనుబంధం ఉంది. అక్క‌డ సినిమాలేమైనా చేస్తారా?
- త‌ప్ప‌కుండా క‌న్న‌డ సినిమా చేస్తాను. అయితే దానికి ఇంకా స‌మ‌యం ఉంది. ఇప్ప‌టిక‌ప్పుడు అక్క‌డికి వెళ్లాన‌నుకోండి. ``ఆదికి ఇక్క‌డ అవ‌కాశాల్లేవు, అందుకే క‌న్న‌డ‌కి వెళ్లాడు`` అంటారు. అందుకే ఇంకొన్ని రోజుల‌య్యాక అక్క‌డ సినిమా చేస్తా. మా కుటుంబానికి క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ ఎంత‌గానో సాయ‌ప‌డింది. మా బాబాయ్ గ‌త రెండేళ్లుగా అక్క‌డ 24 సినిమాలు చేశారు. క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ, ప్రేక్ష‌కుల్లోనూ  నాన్న‌కి కూడా మంచి గుర్తింపు ఉంది.

* ఓకే ఆల్ ది బెస్ట్ ఫ‌ర్ యువ‌ర్ ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్స్‌...
- థ్యాంక్యూ

- కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
cinechuraka