Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
first episode

ఈ సంచికలో >> సీరియల్స్

Happy Vinayaka Chavithi

కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ

జరిగిన కథ :
 మొదటిసారిగా సుధాకర్ నాయుడిలో త్రివిక్రం విషయం లో పాజిటివ్ గా ఆలోచనలు  ఆరంభమవుతాయి. జైలు గోడల మధ్య పాత సినిమా పాటలు పాడుకుంటూ పాదులకు నీళ్ళు పోస్తుంటాడు త్రివిక్రం. జైలర్ ఆంజనేయులు త్రివిక్రం తో  జైలు నుండి రిలీజ్ అవుతున్నావని  చెబుతాడు.


నాయుడు, వెంటనే కారుతాళాలు తండ్రి చేతిలో పెట్టింది వరేణ్య.

''నాకు త్రివిక్రమ్‌ కావాలి డాడి. ఆస్థి అక్కర్లేదు'' అంది.

''అతనుంటే చాలు, ఆస్థి అక్కర్లేదు, మేం అక్కర్లేదు, ఈ ప్రేమలు ఎందుకు పుడతాయోగాని, కళ్ళలో పెట్టుకుని పాతికేళ్ళు పెంచిన మమ్మీ డాడీలను కాదని ప్రేమించినవాడితో వెళ్ళిపోతాం అంటారు. హలో మిస్టర్‌ త్రివిక్రమ్‌, నీ సంగతి ఏమిటి? ఆస్థి లేకపోయినా నా కూతుర్ని చేసుకుంటావా?'' సీరియస్‌గా అడిగాడాయన.

   ''నేను మగాడ్ని సార్‌, ఆస్థి సంపాధించుకోగలను, వరేణ్య నా పక్కనుంటేచాలు. మాకు మీ ఆశీర్వాదం చాలు.........'' అన్నాడు త్రివిక్రమ్‌.

''ఓహో!...............కూడబలుక్కుని సమాధానాలు చెప్తే  

ఒప్పుకుంటాననుకున్నారా................నేను ఒప్పుకోను..........''

సుధాకర్‌నాయుడు సీరియస్‌గా మాట్లాడుతున్నాడు, ఆయన వెనక నిలబడి బామ్మగారు మాత్రం మనవరాలికి సైగలుచేసి సూచిస్తోంది. అదంతా ఉత్తుత్తి కోపం. నువ్వు నమ్మకు అన్నట్టు

''అమ్మా..................ఏమిటి సైగలు చేస్తున్నావ్‌.................?'' తల్లిని అడిగాడు నాయుడు.

''సైగలా? అదేంలేదే. అయినా నువ్వేమిట్రా వాళ్ళిద్దర్నీ చూడగానే రివర్సయిపోయావ్‌.........? వరేణ్యా! డాడీ ఉత్తినే బెదిరిస్తున్నాడు. మీ పెళ్ళి అందరికీ యిష్టమే, డాడీ కూడా ఒప్పుకున్నాడు'' అంటూ అసలు విషయం బయట పెట్టేసిందావిడ.

వరేణ్య తండ్రివంక చూసింది.

చిరునవ్వుతో ఆయన చేతులు చాపగానే డాడీ అంటూ వెళ్ళితండ్రి కౌగిట ఒదిగిపోయింది.

త్రివిక్రమ్‌ని దగ్గరకు పిలిచాడాయన.

ఇద్దర్నీ చెరోచేత్తో అక్కున చేర్చుకొని అభినందించాడు.

''దొంగలా వచ్చి దొరలా నా కూతురి ప్రేమను దోచుకున్నావ్‌. నిన్ను అభినందిస్తున్నానోయ్‌ త్రివిక్రమ్‌.''

''చూడు బేబీ! మిమ్మల్ని దూరం చేసుకుని ఎలా వుండగలంరా? హేపీగా వుండండి. త్రివిక్రమ్‌ ఏమిటో నాకు అర్ధమైందిగా, మీ పెళ్ళి జరిపించేస్తాను'' అన్నాడు ఉత్సాహంగా.

''చిన్న రిక్వెస్ట్‌'' అన్నాడు త్రివిక్రమ్‌.''

''అడగవయ్యా. ఏం కావాలి?''

''మీలాగే మా ఫ్యామిలీలో కూడ సంతోషించాలి. మీరు ఒకసారి మా డాడీని కలిసి మాట్లాడి, లాంఛనంగా అందర్నీ పెళ్ళిచూపులకి ఆహ్వానించండి.''

''అర్ధమైందయ్యా, మీలాగే వెళ్ళివాళ్ళ సమ్మతితో అందర్నీ సంతోషపరచి పెళ్ళిచేసుకోవాలని ఆలోచిస్తే ప్రేమ వివాహాల్లో సమస్యలు రావు.    ఓ.కె.  ఆ పనికాస్త జరిగిపోవాలి పద. మీ యింటికే వెళుతున్నాం. మీరంతా కారులోనే వుండండి. నేను వెళ్ళి మాట్లాడతాను ఓ.కె.''    జైలర్‌ ఆంజనేయుల్ని అందరికీ పరిచయం చేసాడు త్రివిక్రమ్‌. ఆ తర్వాత త్రివిక్రమ్‌, వరేణ్యల కారు ముందు బయలుదేరగానే మిగిలిన రెండు కార్లు ఆ కారును అనుసరించాయి.

అప్పటికే వీధిలైట్లు వెలిగాయి.

గోవిందరావుగారి యింట్లో పట్టపగల్లా దీపాలు వెలుగుతున్నాయి. అరగంట క్రితమే ఇంటికొచ్చిన గోవిందరావు హాల్లో పేపరు చూస్తూ కూర్చున్నాడు.

అంతలో

వీధిలో ఏవో కొన్ని కార్లు ఆగిన అలికిడి వినబడింది. వీధి అన్నాక వాహనాలు తిరుగుతూనే వుంటాయి గాబట్టి ఆయన పట్టించుకోలేదు.    కాస్సేపటికి డోర్‌ మీద టక్‌టక్‌మని చప్పుడయింది.

ఆ వెంటనే ''ఎవరండీ లోపల?'' అంటూ హుందాగా ఓ గొంతు తలెత్తిచూస్తే''

షూస్‌ బయటనే వదిలి

ఒక ఆజానుబాహుడు లోనకొస్తూ కన్పించాడు.

''పిలవకుండా లోనకోస్తే ఎవరు మీరని అగుతారు. అందుకే పిలిచాను'' చిరునవ్వుతో చెప్పాడాయన.

''నేనే పిలిచాను. అయినా అడుగుతున్నాను. ఎవరు మీరు? ఏం కావాలి? రండి. కూర్చోండి'' తనూ చిరునవ్వుతో ఆహ్వానించాడు గోవిందరావు.

''నమస్కారం.''

''నమస్కారం.''

''నా పేరు సుధాకర్‌ నాయుడు.''

''నా పేరు గోవిందరావు.''

''థ్యాంక్యూ........మిమ్మల్ని కలవాలనే వచ్చాను'' అంటూ ఎదురుగా సోఫాలో కూర్చుని ఓసారి చుట్టూ చూసాడు.

చాలా ప్రశాంతంగా వుంది ఇల్లు.

''ఏమిటలా చూస్తారు? మా ఆవిడపేరు ప్రశాంతి. అందుకే ఇక్కడ ప్రశాంతంగా వుంది. అది చిన్నమ్మాయి రమ్య. ఆయన మా అల్లుడు గణేష్‌. మా చిన్నబ్బాయి చక్రధర్‌ ఇంజనీర్‌ చదువుతున్నాడు. ఇక మా పెద్దబ్బాయి త్రివిక్రమ్‌ దుబాయిలో వున్నాడు. మా   

ఆవిడ...........అదో........ కిచెన్‌లోంచి బయటికొస్తోంది.

పాపం వంటలు చేసిచేసి అలసిపోయిందావిడ. ఒక్క కొడుక్కయినా పెళ్ళయితే కిచెన్‌లోంచి బయట పడొచ్చని ఆవిడ ఆశ. అందుకు ఇంకా టైముందంటాను నేను. చెప్పండి. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది చాలా పెద్దమనుషులని ఏం పనిమీద వచ్చారు?'' చాలా సరదాగా, కలుపుగోలు తనంగా గోవిందరావుగారు మాట్లాడుతుంటే, సుధాకర్‌ నాయుడు హేపీగా ఫీలయ్యాడు.

''నిజం చెప్పాలంటే చాలా ముఖ్యమైన పనిమీదే వచ్చాను. సంబంధం మాట్లాడ్డానికి'' అన్నాడు.

''ఓ.............మీరు మేరేజి బ్రోకరా?''

''లేదండి, మీరు సన్‌ ఆటోమొబైల్స్‌ స్పేర్‌పార్ట్స్‌ కంపెనీ గురించి వినే వుంటారు. కనీసం మా పబ్లిసిటీ అయినా మీరు చూసివుంటారు.''    ''అవును. చాలా పెద్ద కంపెనీగదా?''

''అవునండి. ఆ కంపెనీ ఓనర్ని, ఛైర్మన్‌ని నేనే. సుధాకర్‌నాయుడ్ని.''

''మైగాడ్‌...........మీరు.............మా యిల్లు వెతుకుంటూ మీరు రావటం చాలా ఆశ్చర్యంగా వుంది. చెప్పండిసార్‌...............ఏదన్నా మీ కంపెనీలో ప్రాబ్లమ్‌.

''ప్రాబ్లం కంపెనీలో కాదండి. ఇంట్లోనే. మీరలా సర్‌ అని పిలవకండి. బాగుండదు. విషయం ఏమంటే, మాకు ఒక్కగానొక్క కూతురు. పేరు వరేణ్య మనలో మనమాట. ఎవరికీ తెలీని సీక్రెట్‌, నా ఏడువందలకోట్ల ఆస్థికి ఏకైక వారసురాలు. మా అమ్మాయి మీ అబ్బాయినే చేసుకుంటానని పట్టుపడుతోంది. ఆ విషయం ఒకసారి మీతో మాట్లాడాలని వచ్చాను.''

ఆ మాట వినగానే

గోవిందరావు ముఖంలో సంతోషం కన్పించింది.

''వాడు అదృష్టవంతుడు. నాకు తెలుసు. మంచి చదువులు చదివితే ఇలాంటి గొప్ప సంబంధాలే వస్తాయి. కాదంటే..............ఈ సంవత్సరం ఆగితే వాడికి ఇంజనీరింగ్‌ అయిపోతుంది. ఆ తర్వాతనే పెళ్ళిచేయాలనుకుంటున్నాం.'' అన్నాడు.

''గోవిందరావుగారు, మీరు పొరబడుతున్నారు. నేను మాట్లాడుతోంది మీ చిన్నబ్బాయి గురించి కాదు. మీ పెద్దబ్బాయి త్రివిక్రమ్‌ గురించి.''    ''త్రివిక్రమా..........ఆశ్చర్యంగా వుంది. వాడు పెద్ద చదువులు చదవలేదు. గాలికి తిరుగుతూ పరువు తీసాడు. చివరకు ఎలాగో చెల్లెలు పెళ్ళికి కొంత డబ్బు సర్దుబాటుచేసి, ప్రస్తుతం దుబాయ్‌లో వున్నాడు. వాడ్ని మీ అమ్మాయి ఎప్పుడు చూసింది. ఎలా ఇష్టపడింది?'' నమ్మలేనట్లు అడిగాడు గోవిందరావు.

చెప్పాలంటే చాలా పెద్ద కథ వుంది, మీకు  తెలీని కథ, చదువుకుంటేనే గొప్పవాళ్ళు కానక్కర్లేదు. పట్టుదల, విశ్వాసం వున్న మనిషి చదువులేకపోయినా పైకి రాగలడు. గొప్పవాడు కాగలడు. నా విషయమే తీసుకోండి. ఆ రోజుల్లో నేను చదివింది ఎనిమిదో తరగతి. ఆపైన చదువుసాగక ఒక గ్యారేజ్‌లో మెకానిక్‌గా నా జీవితం ఆరంభించాను. ఆ తర్వాత స్పేర్‌పార్ట్స్‌ మనం ఎందుకు తయారుచేయకూడదు అనే పట్టుదల ఏర్పడింది. ఆనాడు నలుగురు                 పనివాళ్ళు, ఏడువేల రూపాయల పెట్టునబడితో ఆరంభించిన చిన్న కార్ఖాణా...............వూహించగలరా? ఈ రోజు ఏడు వందల కోట్లు. ఎందుకు చెప్తున్నానంటే, త్రివిక్రమ్‌ విషయంలో మీరు పూర్తిగా పొరబాటు పడ్డారు.

చెల్లాయి పెళ్ళి ఆగకూడదని బ్యాంకు దోపిడీచేసి మీకు సర్దుబాటుచేసి తను జైల్లో వున్నాడు, ఆ విషయం మీకు తెలీదు. క్రికెట్‌ మేచ్‌ చూడాలని జైలునుంచి పారిపోయి వైజాగ్‌ వచ్చాడు. కథ అక్కడ ఆరంభమైంది'' అంటూ సుధాకర్‌నాయుడు జరిగింది చెప్తూంటే గోవిందరావుకి ఆశ్చర్యంతో నోటమాట రాలేదు.

''పదిహేను రోజుల్లో నా కంపెనీ సేల్స్‌ కోటి రూపాయలుదాటింది. అతను జీనియస్‌. ఎలా వదులుకుంటాను? నేను వదిలినా, నా కూతురు వదలదు. తనే బ్యాంకుకి డబ్బు కట్టేసి అతడ్ని రిలీజ్‌ చేయించుకుంది.'' అంటూ వివరించాడు.

''ఎక్కడ? వాళ్ళిద్దరూ ఎక్కడ? ఇప్పుడే చూడాలి'' సోఫాలోంచి లేస్తూ అడిగాడాయన.

''రండి. అంతా బయట కార్లలోవున్నారు'' అంటూ తనూ నడిచాడు సుధాకర్‌నాయడు.

ఇద్దరూ వీధిలోకి వచ్చేసరికి

కార్లు మూడు అక్కడే వున్నాయి. కాని వాటిలో వుండాల్సినవాళ్ళు ఒక్కరూ లేరు. కాబోయే మామా అల్లుళ్ళు మధుసూదనారావు, వినోద్‌లు మాత్రం సిగరేట్‌ దమ్ముకొడుతూ దూరంగా కన్పించారు. పిలవగానే సిగరెట్లు పారేసి వేగంగా దగ్గరకొచ్చారు.

''ఎక్కడయ్యా, వీళ్ళంతా ఎక్కడ?'' విసుగ్గా అడిగాడు నాయుడు.

''ఈ పక్క గేట్లోంచి వాళ్ళంతా లోనకొచ్చారు సార్‌! మీరు చూడలేదా?'' అనడిగాడు మధుసూదనరావు.

సీన్‌ అర్థమైపోయింది సుధాకర్‌ నాయుడికి

''మీరు క్షమించాలి బావగారూ! మా అమ్మాయికి అంతా తొందరే. కాబోయే అత్తగార్ని చూడాలని త్రివిక్రమ్‌ని ముందుకునెట్టి వుంటుంది. అతని వెనకే లేడీస్‌ అంతా లోనకెళ్ళిపోయారు. మనకి పరిచయాల శ్రమ తప్పింది. రండయ్యా! మీరు మాత్రం ఎందుకు బయట? లోనకు రండి అంటూ గోవిందరావుతో లోనకు అడుగులేసాడు సుధాకర్‌నాయుడు. నలుగురూ లోనకు వస్తుండగానే మేడ పైనుంచి అందరి నవ్వులు కిందకు ఆహ్లాదంగా వినిపించాయి.

ఆ నెల్లోనే

అతి వైభవంగా

వరేణ్య వెడ్స్‌ త్రివిక్రమ్‌ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదనుకుంటా.

శుభం!

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
31 episode