Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
30th episode

ఈ సంచికలో >> సీరియల్స్

Happy Vinayaka Chavithi

ఏజెంట్ ఏకాంబర్

జరిగిన కథ:
పీతాంబరం తో పర్వతాలు కూతురి పెళ్ళి విషయం చర్చిస్తుంది.  తన ఇద్దరి కొడుకులతో  పెళ్ళిగురించి మాట్లాడి,సంబంధం వాళ్ళకి కబురు చేయమని పీతాంబరంతో చెపుతుంది.

రండి! ఇంట్లోనే వుంటాను. అంటూ ఫోన్ కట్ చేసాడు అవతల ఎమ్మెల్యే.

ఎమ్మెల్యే తో ఫోన్ లో మాట్లడగానే ఎంతో సంతోషం తో ఉప్పొంగిపోయాడు ఏకాంబర్.

రత్నం! ఎమ్మెల్యే గారు ఇప్పుడే రమ్మన్నారు. పద! ఇద్దరం వెళ్దాం ఆనందంగా అన్నారు.పదండి! ఎమ్మెల్యే గారింటికి వెళ్ళి వచ్చేద్దాం అంటూ హుషారుగా బ్యాగ్ భుజాన తగిలించుకుని ఆఫీసులోంచి బయటకు వచ్చాడు ఏకాంబర్.
ఆఫీసులో వున్న అమ్మాయిలకు బాధ్యతలు అప్పగించి నూకరత్నం కూడా ఏకాంబర్ వెంట నడిచింది.

ఇద్దరూ బైక్ మీద బీచ్ రోడ్లో వుంటున్న ఎమ్మెల్యే మేడిపండు అబ్ద్దాలరావు ఇంటికి బయలుదేరారు.
గోపాలపట్నం!

డిపార్ట్ మెంట్ స్టోర్ లో కూర్చున్నాడు పీతాంబరం. కేష్ కౌంటర్ లో కూర్చున్నాడే గాని ఏకాంబర్ వస్తాడా? రాడా? అని ఎదురు చూస్తున్నాడు.
షాపులో వున్న సేల్స్ గర్ల్స్ ఇద్దరూ కస్టమర్లకి సామాన్లు చూపిస్తున్నారు. కేష్ కౌంటర్ లో కూర్చున్న పీతాంబరం ఎవరో ఇద్దరు నడి వయసు వ్యక్తులు వచ్చారు వాళ్ళని చూస్తూనే కస్టమర్లనుకుని ఉత్సాహం గా కుర్చీలోనుండి లేచాడు.

రండి సార్! రండి లోపలకు రండి! ఆదరం గా పిలిచాడు

సార్! ఏజెంట్ ఏకాంబర్ గారి ఆఫీసు ఎక్కడుంది? అంటూ ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి అడిగాడు.

ఏకాంబర్ మా అబ్బాయే నండి అదిగో! ఎదురుగా కనిపిస్తోందే! ఆ అపార్ట్ మెంట్లో మొదటి అంతస్థులోనే  వుంది ఆఫీసు. వెళ్ళండి సార్! ఆనందంగా అన్నడు పీతాంబర్.

ఓహో! అలాగా! మాకు ఏకాంబర్ గారు బాగా తెలుసండి. మీ డిపార్ట్ మెంట్ స్టోర్ లో అన్ని సరుకులు దొరుకుతాయి కదండి.! రెండో అతను అన్నాడు.

అన్నీ దొరుకుతాయి సార్! మా షాపులోకి ఒకసారి రండి సార్! చూడండి సాదరంగా ఆహ్వానించాడు పీతాంబరం.

పీతాంబరం అంత ఆదరం గా ఆహ్వానించేసరికి వారిద్దరూ కాదనలేకపోయారు. డిపార్ట్ మెంట్ స్టోరంతా తిరిగి చూసి తమకి అవసరమైన సరుకులు ఇద్దరూ కొన్నారు.

మీ షాపు బాగుంది సార్.! అన్నీ వున్నాయి. మా ఇంట్లో వాళ్ళకి కూడా చెపతాను. వస్తామండీ! అంటూ కేష్  పే చేసి ఇద్దరూ అక్కడనుండి ఏకాంబర్ ఆఫీసుకు వెళ్ళారు.

వాళ్ళిద్దరికేసి ఆనందం గా చూస్తూ కేష్ కౌంటర్ లో కూర్చున్నాడు పీతాంబరం. తన షాపు బయట గోడకి ఏకాంబర్ నేం బోర్డ్ తగిలించాక వాడికెంత ఉపయోగం జరిగిందో తెలీదు కాని, తన షాపులో బేరం మాత్రం గణనీయం గా పెరిగింది. రోడ్డున వెళ్తున్న వాళ్ళు షాపు గోడకి వున్న ఏకాంబర్ బోర్డు చూస్తూనే షాపులోకి వచ్చి ఏకాంబర్ అఫీసు కోసం వాకబు చేస్తున్నారు. పనిలో పనిగా షాపులోకి దూరి ఏదో ఒక వస్తువు కొనుక్కుపోతున్నారు. మనసులోనే అనుకున్నాడు పీతాంబరం.

అలా ఆలోచిస్తూనే అనాలోచితం గా డిపార్ట్ మెంటల్ స్టోర్స్ గోడకి వ్రేలాడుతున్న బోర్డ్ కేసి చూసాడు పీతాంబరం.

"ఏజెంట్ ఏకాంబర్, ఇన్స్యూరెన్స్ ఏజెంట్ సలహాకి సహాయానికి సంప్రదించండి. మీ క్షేమమే మాకు శ్రీ రామ రక్ష అని రాసి క్రింద సెల్ నెంబర్ రాసి ! వుంది.

పాపం! ఈ బోర్డ్ కోసం ఏకాంబరాన్ని ఎన్ని మాటలన్నాడు తను. ఎంత హేళన చేసాడు? ఎంత చులకనగా మాట్లాడాడు.

ఆ రోజు జరిగిన సంఘటన గుర్తుకు రాగానే పీతాంబరం ఒక్క క్షణం మౌనం గా వుండిపోయాడు. ఆ రోజు ఏకాంబర్ కళ్ళల్లో కదిలిన కన్నీటి పొర ఇప్పటికీ తన కళ్ళముందు కదులుతూనే వుంది.

నాన్న మీరు షాపుకి వెళ్తున్నారా? గబగబా బయటకు వచ్చి స్కూటర్ స్టార్ట్ చేస్తున్న తండ్రిని అడిగాడు ఏకాంబర్.

అవును, తమకి ఎందుకంట? వ్యంగ్యంగా అన్నాడు పీతాంబరం.

ఈ బోర్డు మన షాపు దగ్గర తగిలిస్తారని భయం గా అన్నాడు ఏకాంబర్.

అదేం బోర్డ్? ప్రశ్నార్ధకం గా అన్నాడు పీతాంబరం.

నాదే నేం బోర్డు. కొంచెం ధిర్యం గా అన్నాడు ఏకాంబర్.

నీదా? అదెందుకు షాపు దగ్గర ఊరు మీద పడి తిని తిరుగుతున్నానని ఊఊరందరికి తెలియాలా? చిరాగ్గా అన్నాడు ఏకాంబర్.

ఇంకా నయం నా మెడలో వేసుకుని ఊరేగమన్నారు కాదు. ఈ బోర్డ్ తగిలిస్తే నేనే ఇన్స్యూరెన్స్ ఏజెంట్ నని అడపాదడపా వచ్చే ఆ ఇద్దరు ముగ్గురు కస్టమర్లు కూడా రాకుండా పారిపోతారు. అంటూ ఏకాంబర్ చేతిలో బోర్డు తీసుకుని గుమ్మం దగ్గరికి కోపంగా విసిరికొట్టాడు పీతాంబరం.

అప్పటికే తండ్రీకొడుకుల సంభాషణ విని గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడింది పర్వతాలు.

తల్లి వెనుకే నిలబడి తండ్రికేసి, అన్నకేసి ఆశ్చర్యంగా చూస్తోంది అలివేలుమంగ.

తండ్రి అలా తన నేం బోర్డు గుమ్మానికేసి విసిరికొట్టేసరికి హతాషుడైపోయాడు. ఏం మాట్లాడాలో అర్ధం కక కళ్ళల్లో నీల్లు దించుకుంటూ తల దించుకుని నిలబడిపోయాడు ఏకాంబర్.

కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు నా వ్యాపారం ఇలాగైనా నడవకూడదనా నీ ఉద్దేశం. నీ పాట్లు నువ్వే పడు. నీ ఇన్స్యూరెన్స్ రొచ్చు నాకు అంటించక, నా వ్యాపారానికి చిచ్చు పెట్టక అంటూ చెడామడా నాలుగు తిట్లు తిట్టి స్చూటర్ మీద  వెళ్ళిపోయాడు ఏకాంబర్ తండ్రి పీతంబరం.

తల్లీ, చెల్లిలి ముందు తండ్రి అలా తనని, తన వృత్తిని తూలనాడేసరికి నిలువెల్లా నీరైపోయాడు. ఏకాంబర్ బావురుమని ఏడవలేక దుఖాన్ని గుండెల్లోనే దిగమ్రింగుకుని ఇంట్లోనుండి బయటపడ్డాడు.

కొంత దూరం వెళ్ళిన పీతాంబరం షాపు తాళాలు మర్చిపోవడంతో  వెంటనే వెనక్కి తిరిగి వచ్చాడు.

షాపుకని వెళ్ళిన మొగుడు తిరిగి రావడం చూసి ఆశ్చర్యంగా అంది పర్వతాలు.

ఏం మళ్ళీ కొడుకు మీద జాలి వేసిందా?! బోర్డు పట్టుకెళ్ళడానికి వచ్చారా? అంది గుమ్మం దగ్గర నిలబడి. తండ్రి తిరిగి రావడంతో అలివేలుమంగ పెరట్లోకి పరుగందుకుంది. నూతి గట్టున పెట్టిన బట్టలు తియ్యడానికి వెళ్ళింది. తండ్రి చూస్తే చివాట్లు పెడతాడని భయం. ఉతికిన బట్టలు నూతిలో పడితే ఏం చేస్తావ్? అంటూ ఎన్నోసార్లు తండ్రి కేకలేసాడు. ఆ విషయం గుర్తొచ్చి పరిగెట్టింది అలివేలుమంగ షాపు తాళాలు మర్చిపోయాను అంటూ తన గదిలోకి వెళ్ళాడు పీతాంబరం.

ఇంతలో పెరట్లో నుండి భయం గా పరుగుపరుగున ఇంట్లోకి వచ్చింది అలివేలుమంగ.

ఎమైందే? ఎందుకలా? కంగారుగా వచ్చావ్? ! పెరట్లోనుండి పరుగెత్తుకు వచ్చిన కూతుర్ని చూసి అంది పర్వతాలు.

నూతి దగ్గర... అమ్మో! భయం గా అంది అలివేలుమంగ.

ఏమైంది? గదిలోనుండి షాపు తాళాలు తీసుకుని వస్తూ అన్నాడు పీతాంబరం.

నూతి దగ్గర ఏదో చూసిందటండి. అంటూ పెరట్లోకి వెళ్ళింది పర్వతాలు. భార్యను అనుసరించాడు పీతాంబరం.

నూతి చుట్టూ వున్న సిమెంటు పళ్ళెం మీద పెద్ద జెర్రి పాకుతూ కనిపించింది.

ఓస్!  ఇదేనా ? జెర్రి అంటూ ప్రక్కనే వున్న రోకలితో జెర్రిని కొట్టి చంపేసాడు పీతాంబరం.

ఇది కుడితే ప్రమాదం కాదా!? ఆశ్చర్యం గా అంది అలివేలుమంగ.

అమ్మో ఇంకేమన్నా వుందా? ఇది ప్రమాదకరమైన జెర్రి. కుడితే ప్రాణం మీదకు వస్తుంది. అంటూ ప్రేమతో గట్టిగా కూతుర్ని కౌగిలించుకుంది పర్వతాలు.

పెరట్లో చూసుకుని నడవండి.. అంటూ బయటకు వెళ్ళబోయాడు పీతాంబరం.

వాడేదో ఆశ పడి అడిగితే అంతలా కోప్పడాలా?! ఆ బోర్డేదో షాపు గోడకి తగిలిస్తే మీ సొమ్ము ఏం పోదు కదా? భర్తకి నచ్చజెప్పుతూ అంది పర్వతాలు.

అది మామూలు బోర్డు కాదే! అది చూసినోళ్ళందరూ జడుసుకుని మన షాపుకేసే రావడం మానేసారనుకో! ఇంటిల్లిపాదీ పస్తులతో చావాలి. ఇలాంటి పురుగు కుడితే ఒక్కరికే ప్రమాదం. ఆ బోర్డు పుణ్యమా అని ఇంటిల్లిపాదీ క్షక్షణం పస్తులతో చావలి. అంటూ విసురుగా వెళ్ళిపోయాడు పీతాంబరం.

భర్త మాటలు విని అవాక్కయి నిలబడింది పర్వతాలు.

ఆ రోజు జరిగిన సంఘటన కళ్ళముందు కదిలేసరికి పీతాంబరానికి సిగ్గనిపించింది. ఎంత తప్పుగా ఆలోచించాడు? అదే ఆలోచనతో.. భయం తో చెట్టంత ఎదిగిన కొడుకుని పూచికపుల్లలా తీసిపారేసాడు. పాపం! ఆ క్షణం వాడెంత బాధపడి వుంటాడో?!

ఈ రోజు ఇంటిని ఆదుకున్నది వాడే. కుటుంబమంతా ఇంత సంతోషం గా గడగలుగుతున్నారంటే ఆ ఇన్స్యూరెన్స్ వలనే.ఏకాంబర్ ప్రయోజకత్వం గుర్తించిన రోజే అటక మీద పడేసిన బోర్డు తీసి షాపు దగ్గర తగిలించాడు . అప్పట్నుండి వ్యాపారం పదింతలు పెరిగింది.ఆ బోర్డు కేసి  తృప్తిగా చూస్తూ నగదు పెట్టలో వున్న నోట్లు వేలకు వేలు, అయిదు వందలకు అయిదు వందలు, వందల నోట్లు విడి  చేస్తూ కూర్చున్నాడు పీతాంబరం.

బైక్ మీద రామకృష్ణా బీచ్ కు చేరుకున్నారు ఏకాంబర్, నూకరత్నం. ముందు ఫ్రాంచైజీ ప్రారంభోత్సవానికి పిలవడానికి ఎమ్మెల్యే ఇంటికి రావడం వలన ఎమ్మెల్యే గారి ఇల్లు వెదుక్కునే పని పడలేదు.

మూడంతస్థుల భవనం చుట్టూ విశాలమైన ఆవరణ. ఓమూల వున్న షెడ్డు లో తళతళా మెరుస్తున్న పెద్ద పెద్ద కార్లు రెండు ఉన్నాయి.  ఎమ్మెల్యే గారిని కలవడానికి వచ్చిన వాళ్ళంతా ఓమూల గుంపులు గుంపులుగా నిలబడి వున్నారు.

అక్కడక్కడా పహిల్వాన్ లా వున్న పది, పదిహేను మంది ధృడకాయులు చేతులు కట్టుకుని అన్ని దిక్కులు పరీక్షగా చూస్తూ నిలబడ్డారు.
ఏకాంబర్ నేరుగా ఎమ్మెల్యే గారు వున్న గది దగ్గరకు వెళ్ళాడు . నూకరత్నం బైక్ దగ్గరే నిలబడింది.

సార్! ఎమ్మెల్యేగారున్నారా? వినయం గా తలుపు దగ్గ నిలబడ్డ గన్మేన్ ని అడిగాడు,. లోపలున్నారు. మీరు సార్ ని కలవడానికొచ్చారా? మీరు సార్ ని కలవడానికొచ్చారా? అక్కడ పి.ఎ గారున్నారు. ఆయన దగ్గరకు వెళ్ళండి. చెప్పాడు గన్మేన్.

థేంక్యూ అంటూ ఆ ప్రక్కనే ఓ చిన్న రూం దగ్గర కూర్చున్న పి.ఎ దగ్గరకు వెళ్ళాడు. ఏకాంబర్.

ఏం పని మీద వచ్చారు? పి.ఎ అడిగాడు.

నేను సార్ కి ఫోన్ చేసాను. సారే రమ్మన్నారు సార్. చాలా నమ్రతగా చెప్పాడు ఏకాంబర్.

ఎమ్మెల్యే గారే రమ్మన్నారా/ లోపల ఎవరితోనో మాట్లాడుతున్నారు. వాళ్ళు వచ్చాకా మీరు వెళ్దురుగాని, వేరే ఇతర సమస్యలయితే సార్ని కలవక్కరలేదు. నాతో చెప్తే నేను మీ పని పూర్తి చేస్తాను. చెప్పాడు పి.ఏ

లేదు సార్! నేను సార్ ని పర్సనల్ గా కలవాలని వచ్చాను చెప్పాడు ఏకాంబర్.ఇంతలో లోపల వున్నవాళ్ళు బయటకు వచ్చేసారు.మెరు వెళ్ళండి సార్ ఏకాంబర్ తో పి.ఏ అన్నాడు.

ఎమ్మెల్యే గదిలోకి వెళ్ళబోతూ బైక్ దగ్గరున్న నూకరత్నం కేసి చూసాడు ఏకాంబర్. ఆమె కూడా ఏకాంబర్ ని చూసి వడివడిగా ఎమ్మెల్యే గది దగ్గరకు వచ్చింది.

ఇద్దరూ తలుపులు నెట్టుకుంటూ ఎమ్మెల్యే అబద్దాలరావు లోపలకు వెళ్ళారు.

ఆ గది ఎంత రిచ్ గా అలంకరించి వుంది. గదం తా శీతలీకరణ చేయించడం వలన మంచు గడ్డ మీద  నిలబడ్డట్టు ఒక్కసారే ఇద్దరి శరీరాలు జలదరించాయి. రా.. అమ్మా! నువ్వు.. ఏకాంబర్ కేసి చూస్తూ గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు ఎమ్మెల్యే.
నేను సార్! ఏజెంట్ ఏకాంబర్! మీరే కదా సార్ మా సర్వీస్ సెంటర్ ని ప్రారంభించి ఆశీర్వదించారు చిన్నగా నవ్వుతూ ఆన్నాడు ఏకాంబర్.
ఏకాంబర్ ఏజెంటు ఏకాంబర్ ! గోపాలపట్నం లో కదా! గుర్తుంది. రండి కూర్చోండి.! ఎందుకో నన్ను కలవాలన్నారు కదా! ఇప్పుడే అరగంట క్రితం ఫోన్ చేసినట్టుంది.  గుర్తు చేసుకుంటూ అన్నాడు ఎమ్మెల్యే.

సార్... మీరేమీ అనుకోనంటే.. మీతో మాట్లాడుతాను పర్వాలేదు కదా?! చాలా నమ్రతగా అన్నాడు ఏకాంబర్.

మీరు నా నియోజక వర్గం లో వున్న వాళ్ళు , నాకు ఓటేసి గెలిపించిన వాళ్ళు. మీతో మాట్లాడ్డానికే కదా  నేనిక్కడ వున్నది. నవ్వుతూ అన్నాడు ఎమ్మెల్యే.

చాలా కృతజ్ఞతలు సార్! రెండు చేతులతో దండం పెడుతూ అన్నాడు ఏకాంబర్.

ఈ అమ్మాయి ఆ రోజు సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవానికి వచ్చింది కదూ ! నాకు బాగా గుర్తుంది. ఏమమ్మా బాగున్నావా? నవ్వుతూ నూకరత్నాన్ని పలకరించాడు ఎమ్మెల్యే.

అవును సార్1 మా సర్వీస్ సెంటర్ లోనే ఈమె కూడా తన ఫ్రాంచైజీ నడుపుతోనదని చెప్పాడు ఏకాంబర్.

ఒక ఒరలో రెండు కత్తులన్నమాట. ఎలా? చిన్నగా నవ్వుతూ అన్నాడు ఎమ్మెల్యే.

ఎమ్మెల్యే మేడిపండి అబద్దాలరావు అలా అనేసరికి ఉలిక్కిపడ్డాడు ఏకాంబర్. నిజమే! ఆయన అన్నదాంట్లో గూడార్ధం వుంది. కానీ తామిద్దరూ ఒకటే అని రెండు వ్యాపారాలు కలిసే వున్నాయని గ్రహించలేదు.

మా ఇద్దరిలో ఒకరికి ఒకరం పోటీ కాదు సార్! సార్ ది ఇన్స్యూరెన్స్ వ్యాపారం. నాది చిట్స్, రికవరీస్. ఒకరికి ఒకరం సహాయపడతాం గాని, పోటీ పడం సార్! టక్కున అంది నూకరత్నం..

 

(ఇంకా వుంది!)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్