Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Vinayaka Vrata Katha

ఈ సంచికలో >> శీర్షికలు >>

Happy Vinayaka Chavithi

పద్య మండపం: పుస్తక సమీక్ష - సిరాశ్రీ

padya mandapam book review
పుస్తకం: పద్య మండపం
రచన: డా||రాళ్లబండి కవితా ప్రసాద్
వెల: 100/-
ప్రతులకు: [email protected], 9949492626

మాట్లాడుతున్నంత తేలిగ్గా పద్యం చెప్పడం, పేపరు చదువుతున్నంత సులువుగా పద్య మాలికలల్లడం, సినిమాకెళ్లోచ్చేంత సమయంలో ఒక శతకం వ్రాసేయగలడం అనేది చదువులమ్మ అనుగ్రహం నూరు శాతం ఉంటే తప్ప సాధ్యం కాదు. అటువంటి వారు అవధానుల రూపంలో మన మధ్య ఉన్నారు. వారిలో రాళ్లబండి కవితా ప్రసాద్ ప్రముఖులు. "అవధాన విద్య ఆరంభ వికాసాలు" పేరుతో వీరు వెలువరించిన సిధ్ధాంత గ్రంథం అవధానం యొక్క విశ్వరూపాన్ని మన ముందుంచితే, ఈ "పద్య మండపం" వారి హృదయ వైశాల్యాన్ని, గాంభీర్యాన్ని చూపిస్తుంది.

పుస్తకం పేరుని బట్టి ఇందులో ఉండేవి పద్యాలని వేరే చెప్పక్కర్లేదు. 400 పైగా పద్యాలున్నాయిందులో. వాటిలో సరదా గొలిపే అవధాన ప్రశ్నలు-పూరణలు ఎన్నో ఉన్నాయి. రాళ్లబండి వారి ధార, చమత్కృతి, విషయ పరిజ్ఞానం, హాస్య చతురత, పాండిత్యం, కవిత్యం ఇలా అన్నీ దర్శనమిస్తాయి ఈ పద్యాల్లో.

"కోతిని పెండ్లియాడెనొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా" అనే సమస్యను మూడవ పాదాంతంలో "మందొ మా" అని వచ్చేలా పూరించుకున్నారు. అంటే ఎమయిందో చూడండి. "మందొ, మాకో తిని పెండ్లియాడెనొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా" అయ్యింది. ఒక కోమలికి ఏదో చర్మ వ్యాధి వచ్చింది. అది తన పెండ్లికి అడ్డమయ్యింది. దాంతో వైద్యుడికి చూపించుకుని మందొ, మాకో తిని తగ్గించుకుని పెళ్లి చేసుకుందిట. అదీ సంగతి (పూర్తి పద్యం పుస్తకంలో చదువుకోండి). ఎంత ఊహాశక్తి ఉంటే రెండు నిమిషాల్లో ఇలా పూరించగలగడం కుదురుతుంది?

అలాగే "సీతా! రాముని గుండె చీల్చితివి రాశీభూత పాపాగ్నివై" అనే సమస్య ఇచ్చారు ఆయనికి ఒక సభలో. సీత ఏవిటి, రాముడి గుండె చీల్చడమేమిటి? దానికి రాళ్లబండి వారి పూరణ 'తారా-శశాంకుల" కథతో సాగింది. బృహస్పతి మహాముని భార్య తార. ఆమె శశాంకుడిపై మోహం పొంది భర్తకు అన్యాయం చేస్తుంది. ఆ కథ చెప్పి చివర్లో "ఓ సీ! తారా! ముని గుండె చీల్చితివి రాశీభూత పాపాగ్నివై" అని పూరించారు. అలా సమస్య సమసిపోయింది!

ఇంకా ఇలాంటివి ఎన్నో.

దోసె, పూరి, వడ, సాంబారు పదాలతో పార్వతీ కళ్యాణ వర్ణన; సాక్షి శివానంద్, రమ్యకృష్ణ, రాజశేఖర్, జగపతి పదాలతో కనకదుర్గా స్తుతి మొదలైన పూరణలు ఎన్నో ఉన్నాయి.

"దుర్గా! భర్గమార్గ ప్రియా"! అనే మకుటంతో వీరు వ్రాసిన 1000 పద్యాల్లోంచి 27 పద్యాలు పొందుపరిచారు ఈ పుస్తకంలో. అలాగే "వరంగల్ పాలికా! కళికా" అనే మకుటంతో వీరు రచించిన 108 పద్యాల్లోంచి ఒక 40 ఉంచారిందులో. ఇంకా "కాదంబినీ శతకం" పూర్తి పద్యాలు ఇందులో ఉన్నాయి.

పద్య ప్రియులని ఈ పుస్తకం పూర్తిగా రక్తి కట్టిస్తుందని ఘంటాపధంగా చెప్పవచ్చు.

-సిరాశ్రీ 
మరిన్ని శీర్షికలు
weekly horoscope (august 29th to  september4th)