Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
raviteja, kona very very special

ఈ సంచికలో >> సినిమా >>

Happy Vinayaka Chavithi

'సేవ్‌ టెంపుల్స్‌' షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌!

save temple short  flim celebrations

జీహెచ్‌హెచ్‌ఎఫ్‌ (గ్లోబల్‌ హిందూ హెరిటేజ్‌ ఫౌండేషన్‌) నిర్వహించిన ‘సేవ్‌ టెంపుల్స్‌ ఇంటర్నేషనల్‌ షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌’ హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఆగస్ట్‌ 22, 23, 24 తేఈలలో ఘనంగా జరిగింది. ఈ పోటీల్లో ‘అఆలు’ అనే లఘు చిత్రం స్వర్ణ గోమాత మరియు, ఒక లక్ష నగదు అందుకుంది. రజత గోమాతతోపాటు 75 వేల రూపాయల బహుమతిని ‘దేవాలయం’ అనే లఘు చిత్రం అందుకోగా, ‘ఆత్మ ది సోల్‌’ అనే డాక్యుమెటరీకి కాంశ్య గోమాతతోపాటు 50 వేల రూపాయల నగదు లభించింది.10 చిత్రాలకు 'గొ తెలుగు' తరఫున జ్యూరీ అవార్డ్లు అందించారు.

ఈ కార్యక్రమంలో విజేతలకు అవార్డులను 'శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్‌ స్వామి' చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కె.ఇ. కృష్ణమూర్తి, ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనురాధ, వోలేటి పార్వతీశం, జస్టిస్‌ నూతి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి సూత్రధారి , పాత్రధారి, గాత్రధారి అయిన డాక్టర్‌ గజల్‌ శ్రీనివాస్‌ విచ్చేసిన అందరికీ విశేషమైన స్ఫూర్తిని అందజేశారు. సిరాశ్రీ, మధుర శ్రీధర్‌, దీక్షిత్‌, విఎన్‌ ఆదిత్య, సంతోష్‌, లక్ష్మణ రేఖ గోపాల కృష్ణ ఈ లఘు చిత్రోత్సవానికి జ్యూరీ మెంబర్స్‌గా వ్యవహరించారు.

----------------------------------------------------------------------------------------------------------------------

గోమాత అవార్డులు 

జీవితంలో కొన్ని సంఘటనలు హృదయాన్ని తాకుతాయి. కొన్ని తాకి ఊరుకోవు. గుచ్చి చొచ్చుకుపోతాయి. నా జీవితంలో అటువంటి ఒక సంఘటన "సేవ్ టెంపుల్స్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్". మిత్రులు గజల్ శ్రీనివాస్ ఈ ఆలోచన కొన్ని నెలల క్రితం నాతో పంచుకున్నారు. గెలుపొందిన వారికి "గోమాత" అవార్డులిద్దామన్నారు. 

నిజమే! ఆలయ పరిరక్షణ గురించి ఎన్ని పాంప్లెట్లు వేసినా, ఎన్ని వ్యాసాలు వ్రాసినా, ఎన్ని పుస్తకాలు వేయించినా రాని ఫలితం ఇప్పుడు షార్ట్ ఫిలింస్ ద్వారా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కారణం ఏమిటంటే ఇప్పుడు బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్ వచ్చింది. ఫేస్ బుక్ లో షేర్ అయ్యే యూట్యూబ్ వీడియోలే అందుకు నిదర్శనం. సందేశం వేగవంతంగా నలుగురిని చేరుతుంది. చేసిన షార్ట్ ఫిలింస్ లో విషయం ఉంటేనే అది సాధ్యపడుతుంది. విషయం ఉండాలంటే పోటీ పెట్టాలి. గజల్ శ్రీనివాస్ ఆ పోటీకి తెర లేపారు. ఇంత ఆలోచించి ఆలోచన బాగుందనుకున్నాను తప్ప అప్పటికి గుండెల్లోకి పెద్దగా చొచ్చుకుపోలేదు. నన్నొక జ్యూరీ సభ్యుడిగా నియమించారు. ప్రకటన జరిగింది, ప్రెస్ మీట్ అయింది. 113 సినిమాలొచ్చాయి. ఆలోచన పరంగా అన్నీ బాగున్నా, కాంటెస్ట్ కనుక, ప్రదర్శనకు కొన్నిటినే ఎంపిక చేయవలసి వస్తుంది కనుక 113 లోంచి 40 ఎంపికయ్యాయి. ఆ నలభైలో "ఆలయాల పరిరక్షణ" తో పాటు "గో సమ్రక్షణ" అంశంతో అనేక సినిమాలు, డాక్యుమెంటరీలు ఉన్నాయి. అంతవరకు బాగానే ఉంది. 

ఇక ఆశ్చర్యాన్ని కలిగించి ఆలోచనలోకి నెట్టిన విషయం ఏమిటంటే ఈ కాంటెస్ట్ లో ముస్లిం సోదరులు కూడా పల్గొనడం. వారు తీసిన కొన్ని షార్ట్ ఫిలింస్ గుండెలు పిండాయి. ఆలయాల పునరుధ్ధరణ ఎలా చెయాలో చెప్పినవి కొన్ని, గోవు తల్లివంటిదని గోవధలు ఆగకపోతే సమాజానికి జరిగే కీడు ఎలా ఉంటుందో ఎమోషన్ కి సైన్స్ ని జోడించి చెప్పినవి కొన్ని. మతం కన్నా ఈ ఫెస్టివల్ లో భారతీయత ఉట్టిపడింది. భారతీయ హృదయానికి, ఆత్మకి మతాలకి అతీతంగా గోవు ఎంత దగ్గరగా ఉందో తెలిసింది. దేవాలయాలు మతం పరిమితిలో కాకుండా హెరిటెజ్ గా ఎందరి హృదయాల్లో పదిలంగా ఉన్నాయో అర్థమయ్యింది. 

ఇక ఆ 40 సినిమాల్లోంచి ఉత్తమ చిత్రాలని ఎంపిక చేసే పని. ప్రతి సినిమా చూసి నోట్స్ రాసుకోవడం. జ్యూరీ సభ్యుల మధ్య వాడి వేడి చర్చలు. ఉత్తమ చిత్రాలతో పాటు ఉత్తమ సాంకేతిక నిపుణుల ఎంపిక. పనులన్నీ పక్కన పెట్టి, అదే పనిగా కూర్చుంటే అన్నీ జరిగి ఒక కొలిక్కి వచ్చే సరికి వారం పట్టింది. ఇది సినిమా చూసి రివ్యూ రాసేంత తేలిక కాదని అనుభవమయ్యాక తెలిసింది. 

ఈ కార్యక్రమానికి గోతెలుగు డాట్ కాం వ్యవస్థాపకులు శ్రీ పాలచర్ల శ్రీనివాస్ (బన్ను) గారు, కళామందిర్ కళ్యాణ్, శాంతా బయోటెక్ వరప్రసాద రెడ్డి గారు, న్యాట్స్ ప్రముఖులు శ్రీ మధు కొర్రపాటి వంటి వారు సైనికుల్లా ముందుకొచ్చి వెన్నుదన్నుగా నిలిచారు. ఇంత గొప్ప సంకల్పానికి గ్లోబల్ హిందు హెరిటేజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వెలగపూడి ప్రకాశ రావు గారు ఇంధనం అయితే శ్రీ గజల్ శ్రీనివాస్ ఇంజెను. జీయర్ స్వామి తన అభిభాషణంలో చెప్పినట్టు గుండె లేని వాడికి కూడా గుండెకరిగేలా చేయగల సమర్ధులు శ్రీనివాస్. ఇది పొగడ్త అనిపించొచ్చు. కానీ ప్రసాద్ ల్యాబ్ లో కిక్కిరిసిన జనం మధ్య జరిగిన ఉత్సవంలో గజల్ శ్రీనివాస్ తన ప్రసంగం ద్వారా, తన ఆలోచన ద్వారా, తన పాట ద్వారా ఇచ్చిన స్పూర్తి చూసుంటే ఇక్కడ చెప్పింది తక్కువే అనిపిస్తుంది. నామటుకు నేను ఇన్ని సినిమాలు చూసాక ఆ స్పూర్తికి లోనయ్యి నేను కూడా ఒక గోవుని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. స్వస్తి.
 — సిరాశ్రీ

మరిన్ని సినిమా కబుర్లు
pawer satilite record