Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ప్ర‌యోగాల వ‌ల్ల ఎవ్వ‌రికీ ఉప‌యోగం లేదు - విశాల్‌

VIshal interview

యువ హీరోలు అన‌గానే.... మాస్‌, యాక్ష‌న్‌, రివైంజ్ డ్రామాలు...
విశాల్ ఇవ‌న్నీచేశాడు. నిజానికి ఇవే చేశాడు. కానీ.. వాటిలోనే కాస్త కొత్త‌ద‌నం చూపించాడు. పందెం కోడి, భ‌ర‌ణి, సెల్యూట్‌, ప్రేమ చ‌ద‌రంగం, పిస్తా,  వాడు వీడు, ఇంద్రుడు.. ఇలా ఏ సినిమా చూసుకొన్నా `ఏదో కొత్త‌గా చెప్పాలి..` అన్న త‌ప‌న క‌నిపిస్తుంది. ఆ సినిమా హిట్టా, ఫ‌ట్టా?  అనే విష‌యాలు ప‌క్క‌న పెట్టండి. ఆ సినిమాల కోసం విశాల్ ఎంతో హార్డ్ వ‌ర్క్ చేశాడ‌న్న విష‌యం ప్ర‌తి ఫ్రేములోనూ అర్థ‌మ‌వుతుంది.  త‌నపై సినిమా రిస్క్అన్న సంగ‌తి త‌న‌కు తెలుసు.. అందుకే త‌న బ్యాన‌ర్‌లోనే సినిమాలు తీస్తుంటాడు. త‌న వ‌ల్ల లాభ‌మొచ్చినా, న‌ష్ట‌మొచ్చినా... త‌నే భ‌రిస్తాడ‌న్న‌మాట‌. మార్కెట్ స్ట్రాట‌జీ పూర్తిగా ఒంట‌బ‌ట్టించుకొన్న విశాల్‌.. పూజ (త‌మిళంలో పూజై) సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ సంద‌ర్భంగా గో తెలుగుతో విశాల్ పంచుకొన్న క‌బుర్లు ఇవీ.

* పూజ ఎందుకోసం
- మంచి ప‌ని చేసేట‌ప్పుడు పూజ చేస్తాం.. శ‌త్రువుని దండించ‌డం, వాడ్ని స‌న్మార్గంలో పెట్ట‌డం కూడా మంచి ప‌నే. అందుకు చేసిన పూజ‌... ఈ సినిమా.

* మొత్తానికి ఆయుధ పూజ అంటారు..
- అలాంటిదే. పోస్ట‌ర్ చూస్తే... ఓ క‌త్తి క‌నిపిస్తుంటుంది. కాబ‌ట్టి.. ఆయుధ పూజ అనుకోవ‌చ్చు.

* దీపావ‌ళికి గ్యారెంటీనా?
- వంద‌శాతం. అందులో డౌటు లేదు...

* ఐ లాంటి పెద్ద సినిమాలొస్తున్నాయ్‌.. కంగారు వేయ‌డం లేదా?
- మా ప్లానింగ్స్ మాకున్నాయి. ఈ సినిమాని దీపావ‌ళికి విడుద‌ల చేయాల‌ని కొబ్బ‌రికాయ్ కొట్టే ముందే నిర్ణ‌యించుకొన్నాం. అప్పుడు నాకు ఐ లాంటి పెద్ద సినిమాలొస్తున్నాయ‌ని తెలీదు. తెలిశాక వెనుక‌డుగు వేయ‌ను..

* సినిమాకి విడుద‌ల తేదీ కూడా ముఖ్య‌మే క‌దా..?  ఈ విష‌యంలో కాస్త జాగ్ర‌త్త‌గా ఉండ‌డం మంచిది క‌దా?
- అవును. మీర‌న్న‌ది క‌రెక్టే. ఎంత మంచి సినిమా తీసినా స‌రైన స‌మ‌యంలో విడుద‌ల చేసుకోవాలి. దీపావ‌ళికి నాపూజ సినిమా క‌రెక్ట్ అనుకొంటున్నా. అందుకే తేదీ మార్చే ఆలోచ‌న లేదు.

* ఇంత‌కీ పూజ‌లో ఏముంటాయ్‌.. ఎప్ప‌ట్లా యాక్ష‌న్ చిత్ర‌మేనా?
- హ‌రి సినిమాలు తీసుకోండి. అన్నీ యాక్ష‌న్ నేప‌థ్యంలో సాగేవే. సినిమా ప్రారంభం నుంచి.. శుభం కార్డు వ‌ర‌కూ ప‌రుగెడుతూనే ఉంటుంది. ఎంత యాక్ష‌న్ సినిమా అయినా.. కుటుంబ బంధాల‌కూ ప్రాధాన్యం ఇస్తారాయ‌న‌. ఇవన్నీ మా పూజ సినిమాలోనూ క‌నిపిస్తాయ్‌.

* మీ కెరీర్‌లో హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువ‌. బ్యాలెన్స్ చేసుకొనేదెప్పుడు?
- నాకైతే అన్నీ హిట్లే కొట్టాల‌ని ఉంటుంది. సినిమా మొద‌లెట్టేముందు... అంద‌రి ఆలోచ‌నా ఇలానే ఉంటుందేమో..?  క‌థ‌ల విష‌యంలో నేనెప్పుడూ త‌ప్పు చేయ‌లేదు. మంచి క‌థ‌ల‌నే తీసుకొన్నా. అయితే అవ‌న్నీ వ‌ర్క‌వుట్ కాలేదు.

* వాడు వీడు లాంటి ప్రయోగాలు ఎప్పుడు?
- బాలాసార్ పిలిచిన‌ప్పుడు. య‌స్‌.. ఈమ‌ధ్య ఆయ‌న కాల్ చేశారు.. `క‌థ రెడీ చేస్తున్నా..` అన్నారు. ఆయ‌న క‌థ సెట్ అయితే.. నా సినిమాల‌న్నీ వ‌దులుకొని ఆయ‌న ద‌గ్గ‌ర వాలిపోతా?

* ఇలాంటి ప్ర‌యోగాలు రిస్క్ క‌దా?
- ప్ర‌తి దారిలోనూ రిస్క్ ఉంటుంది. అస‌లు సినిమా వ్యాపార‌మే పెద్ద రిస్క్‌. కోట్లు పెట్టి సినిమా తీస్తాం. వ‌స్తే ప‌దింత‌లు వ‌స్తుంది. లేదంటే మొత్తం పోతుంది. ఇంత కంటే పెద్ద సాహ‌సం ఎక్క‌డ ఉంటుంది?  అటు న‌టుడికీ, ఇటు ద‌ర్శ‌కుడికీ ప్ర‌యోగం వ‌ల్ల ఎంతో కొంత మాన‌సిక సంతృప్తి దొర‌కాలి. అలా దిరికితే ఎంత రిస్క్ అయినా చేయొచ్చు. న‌టీన‌టుల‌కు సంతృప్తి దొర‌క్క‌, నిర్మాత‌లకు డ‌బ్బులు రాకుండా చేసిన ప్ర‌యోగాలెందుకు?  వాటి వ‌ల్ల ఎవ్వ‌రికీ ప్ర‌యోజ‌నం ఉండ‌దు.

* మీ సినిమాలు దాదాపుగా మీ బ్యాన‌ర్‌లోనే వ‌స్తుంటాయ్‌..
- అవునండీ. ఆ రిస్క్ ఇంకొక‌రి మీద వేయ‌డం ఎందుకు?  అందుకే విశాల్ ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ స్థాపించా. క‌థ‌కు త‌గిన‌ట్టుగా ఖ‌ర్చు పెడితేనే మంచి ఫ‌లితం వ‌స్తుంది. సినిమాకి రూ.40 కోట్లు ఖ‌ర్చు పెట్టాల‌నుకోండి. నా మార్కెట్ స‌హక‌రించదు. ఇలాంటి క్లిష్ట‌ప‌రిస్థితుల్లో నిర్మాత ముంద‌డుగు వేయ‌డు. అందుకే నిర్మాత‌గా మారాల్సి వ‌చ్చింది.

* విల‌న్ పాత్ర చేయాల‌నివుంది అన్నారు. ఆ కోరిక తీరేదెప్పుడు?
- నేనూ దాని కోస‌మే ఎదురుచూస్తున్నా. ప‌వ‌ర్ ఫుల్ విల‌నిజం అంటే చాలా ఇష్టం. ఆ సినిమా చూసి హీరోని మ‌ర్చిపోయినా విల‌న్ గురించి మాట్లాడుకొంటూనే ఉంటారు. అలాంటి పాత్ర చేయాల‌ని వుంది. అందుకోసం పారితోషికం త‌గ్గించుకోవ‌డానికి, వీలైతే ఫ్రీగా చేయ‌డానికి కూడా రెడీనే.

* తెలుగు సినిమా ఎప్పుడు?
- ఈ డిసెంబ‌ర్‌లో మొద‌ల‌వుతుంది. క‌థ రెడీ అయిపోయింది...

* క‌థానాయ‌కుడిగా మీకు స్ఫూర్తి ఎవ‌రు?
- చిరంజీవిగారంటే చాలా ఇష్టం. ఆయ‌న క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి చేరుకొన్నారు. నాగ్ సార్ చేసే ప్ర‌యోగాలన్నా ఇష్ట‌మే. కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌డంలో ఆయ‌న త‌ర‌వాతే ఎవ‌రైనా..

* త‌ర‌వాతి సినిమా ఏంటి?
- సుంద‌ర్ సి ద‌ర్శ‌క‌త్వంలోఓ సినిమా చేస్తున్నా. ఇందులో ఏడుగురు క‌థానాయిక‌లు. ర‌మ్య‌కృష్ణ‌, సిమ్రాన్‌ల‌తో తొలిసారి న‌టిస్తున్నా..

ఓకే... ఆల్ ది బెస్ట్‌. త్వ‌ర‌లోనే ఓ మంచి విజ‌యం అందుకోవాల‌ని కోరుకొంటున్నాం...

- థ్యాంక్యూ వెరీమ‌చ్‌.   

మరిన్ని సినిమా కబుర్లు
cinechuraka