Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

మేఘన

జరిగిన కథ :   గోడ గడియారం గంటల శబ్దానికి నిద్రలోంచి మేల్కొంటాడు హరి  .. హాల్లోకి రాగానే కుర్చీపై ఒక ముసలావిడ ఆకారం కనిపిస్తుంది... దాంతో  నిలువునా కొయ్య బారి పోతాడు .
 ....................................ఆ తరువాత


......................................................

ఇంతలోనే ఏదో ఆలోచన వచ్చిన వాడిలాగా, తలుపు తీసి చూసాడు.

ఎవ్వరూ లేరు...

కారిడార్‌ మొత్తం శూన్యంగా... ఖాళీగా ఉంది.

నర సంచారం లేదు...

అంతా నిశ్శబ్దం... నిర్మానుష్యం...

ఈ ఫ్లాట్‌లు తగలెయ్య... ఎవడికి ఏం జరిగినా... ఎవడు ఎవడిని చంపేసినా, పక్కవాడికి ఎంత మాత్రం తెలియదు. ఏళ్ల తరబడి పక్క ఫ్లాట్‌లోనే ఉంటున్నా వాడెవడో తెలియని పరిస్థితి. ఏదో కమిటీలంటారు, మీటింగులంటారు, లాగ్‌ బుక్కు లంటారు... ఛ.... అనుకుని, ఈసారి భద్రంగా తలుపు మూసుకున్నాడు. సరిగ్గా అదే సమయం లో ఆకాశాన ఛళ్ళున ఉరుముతో పాటు కొన్ని లక్షలవేల వాట్లతో తళుక్కున మెరుపు మెరిసింది.

ట్రిమ్‌గా తయారయ్యి, ఫ్లాట్‌ నుండి బయటకు వచ్చి, థర్డ్‌ఫ్లోర్‌ నుండి లిఫ్ట్‌లో కిందికి దిగి కారువైపు నడుస్తున్న హరికి ఎదురుపడ్డాడు వాచ్‌మన్‌ జైరాజు.

డాక్టర్ననే గర్వం లేకుండా, ఎదుటి వ్యక్తి చిన్నవాడైనా, పెద్దవాడయినా ప్రేమతో పలకరిస్తాడు. అందుకనే చిన్న వయసులోనే పెద్ద పేరు గడిరచాడు అనుకుంటూ, ‘‘నమస్కారం డాక్టర్‌ గారూ...’’ అన్నాడు.

‘‘గుడ్‌ మార్నింగ్‌ జైరాజ్‌’’ నవ్వుతూ మనస్ఫూర్తిగా బదులిచ్చాడు హరి.

‘‘ఔనూ... జైరాజ్‌, ఎవరో ముసలమ్మ పొద్దున్నే నా ఫ్లాట్‌లోకి చొరబడిరది. నువ్వసలు డ్యూటీ సరిగ్గా చేస్తున్నావా? ఎవరుబడితే వాళ్లు ఫ్లాట్లలోకి ఎంటరైపోతున్నారు’’ అన్నాడు మొత్తగా.

నివ్వెర పోయాడు జైరాజ్‌...

ఆ నివ్వెరపాటుని స్పష్టంగా గమనించాడు హరి.

‘‘సార్‌... నేను ఉదయం మూడు గంటల నుంచే పని ప్రారంభిస్తాను. తెల్లవారు ఝామునే వచ్చే పేపర్ల వాళ్లూ, పాల వాళ్లూ, ప్రొద్దు పొడవకముందే డ్యూటీలకెళ్లేవాళ్లూ, రాత్రి నైట్‌ డ్యూటీలు చేసి తెల్లవారకముందే గూళ్లకు చేరుకునే వాళ్లూ, పనిమనుషులూ... ఇలా ఎంతోమంది వస్తుంటారు..  వెళ్తుంటారు... అందర్నీ గమనిస్తాను నేను. నాకు తెలియకుండా... ఒక ముసలమ్మ మీ ఫ్లాట్‌లోకి వచ్చిందా..? ఆశ్చర్యంగా ఉంది డాక్టర్‌ గారూ... ఇంతకాలమయ్యింది మీరీ ఫ్లాట్‌లోకి వచ్చి... నన్నెప్పుడూ డ్యూటీ సరిగ్గా చేస్తున్నావా? అనలేదు మీరు... సడెన్‌గా మీరీ మాట అంటుంటే నమ్మలేకపోతున్నాను సార్‌’’ అన్నాడు జైరాజ్‌.

‘‘నిజమే... జై రాజ్‌... కానీ జరిగిందాన్ని బట్టి ఆ మాట అనాల్సివచ్చింది, డోంట్‌ మైండ్‌...’’ అంటూనే తన ‘వోక్స్‌వేగన్‌’ కారులో బయల్దేరిపోయాడు హరి.

ఆకాశం రోదించినట్లుగా రోడ్లన్నీ తడిసి, జలమయమైపోయి ఉన్నాయి. ఏదో విచారాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా వాతావరణమంతా ‘డల్‌’గా ‘గ్లూమీ’గా ఉంది.

హరి నడుపుతున్న కారు ఒక్కసారిగా గుంతలో పడి ‘దబ్‌’ మని సౌండ్‌ చేసింది.

‘‘ఈ హైదరాబాద్‌ డ్రైనేజీ వ్యవస్థను బాగుచేసే నాథుడు ఉన్నాడా? ఎప్పుడు వర్షం వచ్చినా రోడ్లనీ మునిగిపోతాయి. ఏ గుంతలోపడి కారు నాశనమై పోతుందో తెలియదు. పోయినసారి వర్షాలకి కారు రిపేర్లకి ముప్పైఐదు వేలు ఖర్చయ్యాయి. ఈ ‘జీహెచ్‌ఎంసీ’ మీద కేసు వేసి, ఆ బిల్లు వాళ్లతో కట్టిస్తే గానీ తెలిసిరాదు. ఏదో ‘మాస్టర్‌ ప్లాన్‌’ అన్నారు... అంతా బాగయిపోతుందని అన్నారు. ఇంతవరకూ దానికి అతీగతీ లేదు’’ అనుకుంటూ నెమ్మదిగా డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్తున్నాడు...

ఇంతలో.... పెద్ద గోతిలో పడి, ఎవరో పట్టి విసిరేసినట్లుగా ఒక్కసారిగా కారు ముందు భాగం పైకి లేచింది. స్టీరింగ్‌ని జాగ్రత్తగా కంట్రోల్‌ చేస్తూ... బలమంత వినియోగించి, బ్రైకుపై కాలు అదిమిపెట్టి తొక్కేటప్పటికి... ఫెళ ఫెళమని శబ్దంతో... బ్రేకు వైరు తెగిపోయినట్టుగా అనిపించింది హరికి.

ఒక్కసారిగా.... కారు అడ్డంగా తిరిగి, రోడ్డు మధ్యలో ఆగిపోయింది. గుబగుబ లాడుతున్న గుండెలతో ఏమీ చెయ్యాలా... అని ఆలోచించేలోపే, పదిమందీ చేరడం, కారును రోడ్డు పక్కకి తోసేయడం, ‘ఆటో’లో హరిని ‘డ్యూటీ’కి పంపడం, చకచకా జరిగిపోయాయి.

గుడ్‌ మార్నింగ్‌ డాక్టర్‌...

గుడ్‌ మార్నింగ్‌..

మార్నింగ్‌ సార్‌...

మార్నింగ్‌...

విష్‌ చేస్తున్న వారికందరికీ చిరునవ్వుతో బదులిస్తూ తన ఛాంబర్‌ వైపు అడుగులేస్తున్నాడు ‘హరి’ ఆరడుగులకు రెండంగుళాల తక్కువ హైటు, రన్నింగ్‌, ఏరోబిక్స్‌లతో కండిషన్‌లో ఉన్న బాడీ, తెల్లని దేహచ్ఛాయ, ప్రపోర్షనేట్‌గా ఉన్న ముఖం, ఆ ముఖానికి సరిపోయే ఎత్తయిన నాసిక, చక్కని ముఖ కవళికలు, వర్చస్సు వాటిని ద్విగుణీకృతం చేసే చిరునగవు గౌరవాన్ని మరింత పెంచుతుండగా.. ముందుకు సాగుతున్నాడు.

ఎదురూగ్గా వచ్చి స్టిఫ్‌గా నిలబడి మిలటరీ సాల్యూట్‌ కొట్టాడు సెక్యూరిటీ డేవిడ్‌. డేవిడ్‌ మిలటరీ నుంచి వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకుని, ఈ మధ్యనే సెక్యూర్టిగా చేరాడు.

కొద్దిగా తలవంచి, కుడిచేతికి ఏటవాలుగా పైకిలేపి, మిలటరీ జనరల్‌ సాల్యూట్‌ స్వీకరించిన విధంగా సాల్యూట్‌ చేస్తూ తన ఛాంబర్‌లోకి వెళ్ళిపోయాడు ‘హరి’

ఈలోగా, నెమ్మదిగా ‘డేవిడ్‌’ పక్కన చేరాడు వార్డుబాయ్‌ ‘వేణు’. ‘‘డాక్టర్‌ ‘హరి’ని చూడగానే వెలిగిపోతున్న మొహాలతో పోటీలు పడి మరీ ‘విష్‌’ చేస్తారీ నర్సులు. మరి డాక్టర్‌ ‘సుందర్‌’ కనబడితే ఏదో తప్పదన్నట్లుగా విష్‌ చేస్తారెందుకు’’ డేవిడ్‌కి మాత్రమే వినబడేలా గొణిగాడు.

సాలోచనగా ‘వేణు’ వైపు చూసాడు ‘డేవిడ్‌’

‘‘నువ్వన్నది నిజమే.. డాక్టర్‌ హరి అందగాడు... అందంగా ఉన్న వాళ్లని చూస్తే ఆనందంగానే ఉంటుంది అందరికీ... ‘అందమె ఆనందం’ అన్నారు. అందంగా ఉన్నవాళ్లకి బ్రహ్మరథం పట్టి, మీరు అందంగా ఉన్నారని ఆడవాళ్లకైనా, మగవాళ్లకైనా సరే... పదే పదే చెప్పి, వాళ్లతో ఫ్రెండ్‌షిప్‌ చెయ్యడానికి ముందుకొస్తారు. ఇదే మనుషులు, అందంగా లేనివారిని చూసి అసహ్యించుకుంటారు. అనాకారులు ఎంత మంచి వాళ్లయినా సరే వాళ్లతో సూటిపోటీ మాటలతో అవకాశం దొరికినప్పుడల్లా వికారితనాన్ని ఎత్తిచూపి, పైశాచికమైన ఆనందం పొంతుతారు. ఉదాహరణకు... డాక్టర్‌ ‘సుందర్‌’ వెనకాల పేరుకే ‘సుందర్‌’ కానీ మనిషికి సుందరత్వం ఏమాత్రం లేదు అని ఆయనకు వినబడేలా కామెంట్‌ చేస్తారు.

ఈ విధమైన అవహేళనలను జీర్ణించుకోలేక, ఈ ప్రపంచమంతా తమకు వ్యతిరేకత చూపిస్తుందని అందంగా లేని వాళ్లు అర్థం చేసుకుని, తమ లోని మంచి తనాన్ని గుర్తించలేని ఈ వికృత సమాజాన్ని ఎదుర్కోవడానికి ‘ఇరిటేటింగ్‌’గా ప్రవర్తిస్తారు. అంటే, మనం మన దుష్ప్రవర్తనతో ఎదుటివారిని చెడ్డవాళ్లుగా మార్చడమే కాక, పైగా వాళ్లపై రకరకాల ముద్రలు వేస్తున్నాము.మా మిలటరీ లో ఇలా ఉండదు. ఎదుటివాడి శక్తి సామార్థ్యాల బట్టే గౌరవ మర్యాదలుంటాయి. ఎత్తిపొడుపు మాటలు, ఎకసెక్కాలూ, కించ పరచటాలూ ఉండవు.  పని... పని ముఖ్యం.. ఎవడు బాగా పనిచేస్తే వాడికే గౌరవం. పేరుకే ‘సివిల్‌ సొసైటీ’ మీది. మీ సొసైటీలో ఉన్న జాఢ్యాలూ, రుగ్మతలూ  మా మిలటరీలో ఉండవు. పేరుకు ‘సివిల్‌ సొసైటీ’ కాని నిజానికి ‘మోస్ట్‌ అన్‌ సివిలైజ్డ్‌ సొసైటీ’ మీది అన్నాడు డేవిడ్‌.

‘‘ఏం చెప్పావ్‌ డేవిడూ..’’ అన్నాడు వేణు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
33 episode