Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jnaanodayam

ఈ సంచికలో >> కథలు >> దైవం మానుష రూపేణా.

daivam manava roopenaa

ఆ కార్పొరేట్ ఆస్పత్రి నుంచి అడుగు బయటకు  పెడుతుంటే...

నాకు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది.

జైలు నుంచి విడుదలయిన ఖైదీలా ఉంది నా మానసిక స్థితి.  

మూడు నెలలు  ఎలా గడిచిపోయాయో..

డాక్టర్లు,నర్సులు, వైద్యపరీక్షలు, మందులు..

అప్పుడప్పుడు పరామర్శకు వచ్చే బంధుమిత్రులు...

రాత్రింబవళ్లు ఒకటే సందడి.

కొందరు నన్ను అదృష్టవంతుడివి అంటూ మెచ్చుకున్నారు. మరికొందరు ధైర్యవంతుణ్ణన్నారు.  ఇవన్నీ కాదు. నువ్వు క్షేమంగా బయట పడితే అంతే చాలు అన్నారు అమ్మా, నాన్న, చెల్లాయి.

నిజానికి నేను ఈ కాలం కుర్రాడిని.  నా ఈడు కుర్రాళ్లు చాలా మంది  మాదిరిగానే...   జాలీగా జీవితాన్ని గడపాలనేది  నా మనస్తత్వం.  నా అభిమాన నటుడితో కలిసి డిన్నర్ చేయాలని,   ఓ అందమైన అమ్మాయిని ప్రేమించాలని, అమెరికా వెళ్లి బాగా డబ్బు సంపాదించి ఓ పెద్ద కంపెనీకి ప్రొప్రయిటర్ కావాలని, అందులో నా శత్రువు వసంత్ గాడిని ఉద్యోగిగా నియమించి  రోజూ వేధించాలని..  నా సాయం కోసం ఎవరయినా వస్తే...చెక్ బుక్ తీసి వేలల్లో సాయం చేయాలని...ఇలా ఏవేవో పిచ్చిపిచ్చిగా కలలు కంటూండేవాడిని.

అయితే ఇవన్నీ ఒక ఎత్తు...    స్పోర్ట్స్ బైక్ కొనుక్కోవాలని... హైదరాబాద్ అవుటర్ రింగురోడ్డులో  జామ్ అంటూ  వెళ్లాలన్న  కోరిక మాత్రం  నాకు  మనశ్శాంతి లేకుండా చేసేది.  

బైక్ పేరెత్తగానే  మా బాబు ఇంతెత్తున లేచాడు.

‘‘నేను రాజకీయ నాయకుడిని అనుకున్నావా? వ్యాపారస్థుడిని అనుకున్నావా? లక్షలు పోసి అది కొనిచ్చేందుకు..   ? అంత కోరికగా ఉంటే మంచి ఉద్యోగం సంపాదించుకుని కొనుక్కో’’ ... హితబోధ చేశాడు. 

అలాగని మామూలు బైక్ ఏదయినా  కొన్నాడా అంటే అదీ లేదు.

‘‘ ఈ సిటీ రోడ్ల మీద వాహనాన్ని ఎవడు ఎట్టా నడుపుతాడో తెలీదు. రోజూ ఎవరో ఒకరి చావు వార్తలు వింటున్నాం.  ప్రమాదాలతో   కాళ్లూ చేతులు విరగ్గొట్టుకోవటం.. ప్రాణం మీదకు తెచ్చుకోవటం దేనికి?

అసలే మీ కుర్రాళ్లకు   బైక్ చేతికందితే చాలు..  ఒళ్లూ పైన  తెలియదు.’’ అంటూ లెక్చరిచ్చి...

‘‘హాయిగా కాలేజీ బస్సులో వెళ్లు. మంచిది. ’’ అని సలహా ఇచ్చాడు.

దీనితో  ఊరి బయటున్న ఇంజనీరింగ్ కాలేజీకి   రోజూ బస్ లోనే  వెళ్లొచ్చేవాడిని.     ప్రయాణం చేసొచ్చేసరికి నీరసం వచ్చేది.   మిగతా కుర్రాళ్లంతా జామ్ జామ్ మని బైక్ ల మీద వెళుతుంటే  కడుపు తరుక్కుపోయేది.  

‘‘ కాలేజీ బస్సులో వెళితే ఉదయం 9 గంటలకే బయలుదేరాలి. మన పరీక్ష మధ్యాహ్నం రెండు గంటల నుంచి కదా...  ముందెళ్లి ఏం చేస్తాం.  బండి మీద వెళదాం. గంట ముందు బయలుదేరితే సరిపోతుంది.’’  పరీక్షలు మొదలయ్యే ముందు రోజున ఇంటికి  వచ్చి చెప్పాడు భార్గవ.    ‘‘పరీక్షలున్న వారం రోజులూ  బైక్  ప్రయాణమన్నమాట..

అరుదయిన అవకాశం’’. తెగ  సంబరపడిపోయాను.  

‘‘ మీ డాడీకి తెలిస్తే ఊరుకోరు. జాగ్రత్తగా వెళ్లి రండి’’  

అమ్మ  పరోక్షంగా  మద్దతు ఇస్తూనే బోలెడన్ని జాగ్రత్తలు  చెప్పి  పంపించింది.

భార్గవ బండి నడుపుతుంటే... నేను వెనక కూర్చున్నా.

మాతో పాటు ఇంకో బండి మీద బయలుదేరారు రసూల్  , చైతన్య.  మధ్యాహ్న సమయం కావటంతో రోడ్లమీద రద్దీ అంతగా లేదు. వాడు వాయువేగంతో నడుపుతున్నాడు. గాల్లో తేలుతున్నట్టుగా ఉంది.  ‘‘ మామూలు బైక్ మీద వెళుతుంటేనే ఇంత హాయిగా ఉంటే... ఇక స్పోర్ట్స్ బైక్ మీద వెళితేనా?..

యథావిధిగా కలల్లోకి జారాను.

‘‘ఇంజనీరింగ్ పూర్తి కాగానే ... క్యాంపస్  సెలక్షన్లో  జాబ్ సంపాదించుకోవాలి.  టాప్ మోడల్ బైక్ కొనాలి..’’  బలంగా అనుకున్నాను.బైక్ రూపం  కళ్ల ముందు మెదిలింది.  

‘‘ దాని బాడీ బ్లాక్ అయితే బావుంటుందా.. ? మెరూన్ రెడ్డా...? ఈ రెండూ  కాదు... అప్పుడు లేటెస్టుది ఏదయితే అది ఎంపిక చేసుకోవాలి.అమెరికా వీసా వస్తే.. అప్పుడు బైక్ ఏం చేయాలి?

అది చెల్లాయికి ఉపయోగపడదు.  నాన్నకి అసలు ఇలాంటివి నచ్చవు. ఎందుకురా అంత డబ్బులు తగలేసి అని  ముందే కసురుకుంటాడు.ఇక అమ్మ... తన కంటూ ప్రత్యేకమైన ఇష్టాలు లేవు. నాకు ఇష్టమైన పనులు చేయమనే  ప్రోత్సహిస్తుందెప్పుడూ.మరి ఇంట్లో ఉంచాలా? అమ్మేయాలా?

ఇలాంటివి కొనేవాళ్లుంటారా? పెద్దగా మార్కెట్ ఉండదేమో?

అంతగా ఇష్టపడి కొనుక్కున్న వస్తువును అమ్మటం దేనికి? 

ఓ  మంచి జ్ఞాపకంగా ఇంట్లోనే ఉంచుకుంటే పోలా? ... ’’

బండి వెనకే కూర్చుని ...ఇలా ఏదో ఆలోచించుకుంటూ  ఉన్నాను.ఇంతలో  ఏమయిందో తెలీదు..వెనక   నుంచి  ఏదో  వాహనం బలంగా ఢీ కొంది...అని మాత్రం అర్ధమైంది.ఒక్కసారిగా  నా శరీరం గాల్లోకి ఎగిరింది.‘‘ బంతిలా పైకెగిరి .. అంత పై నుంచి దబ్బున నేలమీద పడితే...హమ్మో .. ఇంకేం మిగులుతుంది.

వెన్నెముక విరగటం ఖాయం.. అంత కంటె ముందు మెదడు చిట్లిపోతుంది.భగవంతుడా... ఈ భూమ్మీద నాకు నూకలు చెల్లిపోయాయి.  కోరుకున్న  బైక్ కొనుక్కోకుండానే  ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నాను.

నాన్నా ... నన్ను క్షమించు. నీ మాట వినకుండా బండి పైన వచ్చి... ప్రాణం మీదకు తెచ్చుకున్నా... అక్కడికీ నువ్వు ముందే నన్ను ముందే హెచ్చరించావు కూడా.అమ్మా ... నువ్వు నేను అడిగినవన్నీ చేశావు.. బండి మీద వెళ్లాలన్న నా చివరి కోరిక కూడా తీర్చావు.  ధన్యవాదాలమ్మా .. రేపట్నుంచి చెల్లాయి ఒక్కతే ఉంటుంది. దాన్ని బాగా చూసుకో...అన్నట్టు దానికి ప్రతి చిన్న విషయానికి ఏడిపించేవాడిని.. అదంతా నేను ఇష్టంతోనే చేశానని దానికి చెప్పవూ...’’ కొన్ని క్షణాలు గడిచాయోమో... గాల్లోకి లేచిన శరీరం... తిరిగి కింద పడుతున్నట్టుగా నాకు అర్దమవుతోంది.రెప్పపాటులో  ఏదో  తెలియని అదృశ్యశక్తి నాలో ప్రవేశించింది.

కింద పడినా తల పగలకుండా చేతులు కవచంలా అడ్డంపెట్టుకున్నాను.దబ్బున  కిందకు జారాను ...  రోడ్డుకు కొద్దిగా పక్కగా...    రోడ్డు వేయటానికి కంకర ఉంచినట్టున్నారు . వెనకభాగంలో కసుక్కున గుచ్చుకున్నాయి. శరీరాన్ని అటూ ఇటూ యిటూ కదిపి చూశాను.నా అదృష్టం..  తల పగలలేదు  కుడి మోకాలు ఎముక విరిగినట్టనిపించింది. భరించలేనంతగా  నొప్పి ...    విలవిలలాడిపోతున్నాను.మరో వైపు మగత కమ్ముతున్నట్టుగా అనిపించింది.  అతి కష్టం మీద కళ్లు తెరిచి చూశాను.

నాలుగు చక్రాల వాహనం ఒకటి వేగంగా నా మీదకు దూసుకువస్తోంది.భయంతో  మళ్లీ కళ్లు మూసుకున్నాను.‘ఒక ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన నన్ను వెంటాడుతూమళ్లీ దూసుకొస్తున్న  మృత్యువు ...వణికిపోయాను.కీ... చ్.... ఏదో శబ్దం..కళ్లు తెరిచి చూస్తే..సరిగ్గా నా తల భాగాన్ని ఆనుకుని ఆగింది ఆ  వాహన చక్రం...

అంటే ..వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి ... బాగా నిపుణుడై ఉండాలి. సడన్ బ్రేక్ వేసి వాహనాన్ని నియంత్రించాడు .అతను వాహనం దిగి వచ్చి... కిందపడి ఉన్న  నా వైపు ఆత్రంగా...  ఆందోళనగా ...  చూస్తున్నాడు.   కళ్లు మూతపడుతున్నాయ్..స్పృహ తప్పితే ప్రాణం పోతుందట... అంతకు ముందు ఎక్కడో చదివాను. అందుకే  విపరీతంగా బాధగా ఉన్నా ... బలవంతంగా  కంట్రోల్ చేసుకోటానికి ప్రయత్నిస్తున్నా. చుట్టూ జరుగుతోంది తెలుస్తూనే ఉంది..

ఎవరో వాటర్ బాటిల్ మూత తీసి కొన్ని నీళ్లు ముఖం మీద చిలకరించారు.దాహం.కళ్లు మూసుకునే చేతిలో నుంచి సైగ చేశాను.‘‘వద్దొద్దు..  మంచి నీళ్లు ఇవ్వకండి..’’ అంటున్నారెవరో...ప్రమాదం సంభవించిన ప్పుడు  బహుశా అలా తాగటం సరికాదేమో నాకు తెలీదు..ఇంకెవరో అంటున్నారు. ‘‘ ముందు  108 వాహనాన్ని పిలవండి...’’   అప్పటికే జనం మూగుతున్నట్టున్నారు. వాళ్ల మాటలు నా చెవిన పడుతున్నాయి.  

‘‘ ఎలా జరిగింది.. మనిషి ప్రాణానికి ప్రమాదం ఏం లేదు కదా.?’’‘‘బాగా రక్తం పోతున్నట్టుంది.. ’’‘‘ దెబ్బలు తీవ్రత ప్రమాదం జరగ్గానే తెలీదండి. నాలుగయిదు గంటల తర్వాత గానీ పరిస్థితి అర్ధం కాదు...’’‘‘ అబ్బబ్బ.... ఇక్కడ ప్రమాదం జరగని రోజు లేదు. నిన్న కూడా బైక్ మీద వచ్చిన ఇద్దరు కుర్రాళ్లు పోయారు..’’‘‘ అడ్డం లేవండి... పాపం అతనికి  గాలి ఆడనివ్వండి...’’అరిచారెవరో...  సెల్ మోగింది.‘‘ మా ఓనర్ తొందర చేస్తున్నాడు. నేను వెళ్లాలి బాబూ’’  వాహనం డ్రెయివర్ అనుకుంటా... ఎవరితనో చెబుతున్నాడు. 

అప్పుడు గుర్తుకొచ్చాడు భార్గవ.‘‘ ఏమయిపోయాడు వీడు. బండి వెనక కూర్చున్న నేను కిందపడినా గుర్తించలేకపోయాడా? ...రసూల్, చైతన్య కూడా కాలేజీకి వెళ్లిపోయుంటారు.

నేను మాత్రం ఇలా...ఒళ్లంతా సలపరంగా ఉంది. జీన్స్  ప్యాంటు రక్తంతో తడిచిపోయి కనిపిస్తోంది. బహుశా మోచిప్పలు పగిలి ఉంటాయి. మోచేతులు బాగా కొట్టుకుపోయాయి. మంట పుడుతోంది.   ప్యాంటు, చొక్కా విప్పితేగానీ అసలు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో తెలిసే పరిస్థితి  లేదు.  ఈలోపు 108 వాహనం వచ్చింది. అందులో నుంచి దిగిన నలుగురు వ్యక్తులు మెల్లగా ఎత్తి లోపలకి కూర్చుబోట్టారు.
అప్పుడు కనిపించాడు భార్గవ.

‘‘సారీ రా ...  వెనక నుంచి  నువ్వు జారి పడినా  గుర్తించలేకపోయాను. సరిగ్గా కాలేజీ దగ్గరకు వెళ్లగానే చూసుకున్నా. గబుక్కున  పరిగెత్తుకుంటూ వచ్చా’’... వాడు చెబుతున్నాడు.‘‘ మరి పరీక్ష...’’ ఆందోళనగా అడిగాను.‘‘ నువ్వేం అయిపోయావో నని  భయపడిచచ్చా...పరీక్ష సంగతి ఆలోచించలేదు’’  నాకెందుకో దు:ఖం వచ్చింది.అది వాడన్న మాటలకా? శరీరం పెడుతున్న బాధగా... అన్నది అర్ధం కాలేదు.

ఈ లోగా 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స చేశారు.  దగ్గర్లో ఉన్న ఓ కార్పొరేట్   ఆసుపత్రి పేరు చెప్పి అక్కడకు తీసికెళుతున్నట్టు చెప్పారు.‘‘అప్పుడెప్పుడో రక్తదానం చేద్దామనుకుంటే... ఇదేంట్రా... లోపల ఉన్నదంతా పోతోంది. ఇదంతా సీసాల్లో నింపుకుంటే ఓ పది మందికయినా ఈ రక్తం సరిపోతుంది’’ గంభీరమైన వాతావరణాన్ని మార్చటానికి నవ్వుతూ చెప్పాను.  భార్గవ నవ్వలేదు. నా వంక జాలిగా చూశాడు. జేబులో నుంచి తనమొబైల్ తీస్తుండగా  ....‘‘ఇంతకీ నా మొబైల్  ఏమయినట్టు? అక్కడెక్కడో పడిపోయుంటుంది. ’’అమ్మ నెంబర్ అడిగాడు...

‘‘వద్దు. తను భయపడుతుంది...’’ చెప్పాను.   ‘‘ మరి డాడీకి తెలిస్తే... తిడతాడు కదా... ’’ సందేహంగా అడిగాడు. ‘‘ మనం చేసింది తప్పే కదా.. తిట్టనీ ... డాడీ లేకుండా హాస్పిటల్ కి వెళ్లలేం ...’’నా నిబ్బరం వాడిని ఆశ్చర్యపరిచినట్టుంది.  ఫోన్ కోసం ప్రయత్నిస్తుంటేనా పక్కనే  కూర్చున్న సిబ్బంది   చెప్పారు. ‘‘ భయపడకు... ఓ నాలుగు రోజులు  ఆసుపత్రిలో ఉంటే మామూలయిపోతుంది’’.

నేను నవ్వుతూనే చెప్పాను.‘‘ పోనీలే... వికలాంగుల కోటాలో  ఉద్యోగం సంపాదించుకుంటా... ’’‘‘ అలా అనకు బాబూ...నీకేం కాలేదు..’’  ఊరడించే  ప్రయత్నం చేశాడు 108 వాహనంలో ఉన్న వ్యక్తి ఒకరు.‘‘ మా అబ్బాయిదీ నీ వయసే... ఇలా బండి మీద వస్తూ ప్రమాదానికి గురయ్యాడు.చిన్న సర్జరీ చేసి కాలికి రాడ్  వేశారు. తర్వాత మామూలయిపోయింది.’’‘‘ అంటే.. నాకు కూడా కాలికి రాడ్ వేస్తారన్నమాట. ’’ నాలో నేను అనుకున్నట్టుగా  ఆ మాట పైకే అన్నాను.

అతను జవాబు చెప్పలేదు. మౌనంగా నా వైపు చూశాడు.‘‘... మీ డాడీరా...  లైన్లో  ఉన్నారు. ఏం చెప్పమంటావు’’ - భార్గవ అడుగుతున్నాడు.‘‘ ఆసుపత్రికి రమ్మను...’’అంతకు ముందే నన్ను ఎక్కడికి తీసుకెళ్లాలనేది డ్రెయివర్ కి చెబుతూండగా విన్నాను.  ఆ  కార్పొరేట్  ఆసుపత్రి పేరు చెప్పాను.

‘‘ వాడికి ఏమైనా ప్రమాదమా? పరీక్షకు వెళ్లలేదా? ఇంత సేపు ఎక్కడున్నారు?’’ భార్గవ చెప్పేది పూర్తి కాకుండా డాడీ వరుస ప్రశ్నలతో వాడిని  ఉక్కిరిబిక్కిరి చేశాడు. భార్గవ సమయస్పూర్తిని ఉపయోగించాడు.‘‘ వాడికేం కాలేదు అంకుల్. నాకే చిన్న యాక్సిడెంట్.  మా వాళ్లకు చెబితే తిడతారు. కొంచెం మీరొస్తే...’’‘‘ నువ్వేం భయపడకు. ఆఫీసు పని మీద నేను సిటీలో చాలా దూరం వచ్చాను. ఎవరిదయినా టూవీలర్ అడిగి నీదగ్గర కొస్తాను. గంట, గంటన్నర పడుతుంది’’

‘‘ ఫరవాలేదంకుల్. అంత వరకూ నా కాలేజీ ఫ్రెండ్ స్  తో ఉంటా...’’ చెప్పి ఫోన్ పెట్టేశాడు.’’ఆ తర్వాత నా వైపు తిరిగి కబుర్లు చెప్పటం మొదలుపెట్టాడు.

నా అభిమానటుడి కొత్త సినిమా.. దాని దర్శకుడు, హీరోయిన్లు  ... ఇతర  వివరాలు చెబుతున్నాడు.భార్గవ నేను బాధపడకుండా ప్రయత్నం చేస్తున్నాడని అర్దమయింది. బాధ భరించలేకపోతున్నా ... ఆ విషయం బయటపెట్టకుండా సాధ్యమయినంత  మామూలుగా  ఉంటున్నా  నేను ...కొన్ని గంటల క్రితం నవ్వుతూ ... తుళ్లుతూ... కాలేజీకి బయలుదేరాను. ఇంతలో ఈ ప్రమాదం.. ప్రమాదాలు  అంతేనేమో .. అనుకోకుండా వచ్చి పడతాయి. కన్నుమూసి కన్ను తెరిచేలోగా ఊహించని విధంగా జీవితాన్ని మలుపు తిప్పుతాయి.

నా జీవితం  కూడా ఇలా మలుపు తిరగబోతోందా?... ఆసుపత్రి వచ్చినట్టుంది. వాహనాన్ని ఆపారు. అప్పటికే నా ప్యాంటు మోకాలి దిగువభాగాన్ని కత్తిరించి ఉంచారు. రక్తస్రావం మాత్రం ఆగలేదు.‘‘ యాక్సిడెంటా? పోలీస్  స్టేషన్ కి వెళ్లారా?  కేసు పెట్టారా?... ప్రశ్నల మీద ప్రశ్నలు..  స్ట్రెచర్ ని  తెచ్చి వరండాలో ఉంచారు. లోపలకి అనుమతిచటంలేదు.‘‘ వాళ్ల డాడీ వస్తున్నారు. ఈ లోపు వైద్యం ప్రారంభించండి .’’రిసెప్షన్ దగ్గర బతిమాలుతున్నాడు భార్గవ. చాలా పెద్దవాడిలా, అనుభవం ఉన్న వాడిలా వ్యవహరిస్తున్నాడు.అవన్నీ నా చెవిన పడుతున్నాయి. వాళ్లు ఒప్పుకోవటం లేదు. ఆ విషయం తెలుస్తూనే ఉంది.  ఇంతలో ఎవరికో ఫోన్ చేశాడు.‘‘ మా ఫ్రెండ్.. యాక్సిడెంట్ అయ్యింది... ఆసుపత్రిలో చేర్చుకోనంటున్నారు’’ ఎవరికో చెబుతున్నాడు. ..అవతల వ్యక్తి మాట్లాడింది  అర్ధం కాలేదు. కానీ నన్ను లోపలకి తీసికెళ్లటానికి లోపల నుంచి ఆసుపత్రి సిబ్బంది వచ్చారు.

‘‘ డాక్టర్ చంద్రమౌళి.. టెన్ త్ లో నా క్లాసుమేట్ రోహిణి వాళ్ల నాన్న.  ఆయనతో మాట్లాడా.’’ తనే చెప్పాడు నా దగ్గరకు వచ్చి. అల్లరి చిల్లరిగా ఉండే భార్గవ వ్యవహరిస్తున్న తీరు నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది.నేను లోపలకి అడుగుపెడుతూండగా వచ్చారు  చైతన్య, రసూల్.ఇద్దరూ ఆప్యాయంగా చేతులో చెయ్యి వేశారు. ‘‘ భయపడకురా... అంతా బాగా జరుగుతుంది. అల్లా నీకు మంచి చేస్తారు’’ అన్నాడు రసూల్.‘‘మన హెడ్ తో మాట్లాడా. పరీక్ష గురించి భయపడకు. ’’ చైతన్య చెప్పాడు.‘‘ నీ విషయం తెలిసి పరిగెత్తుకొచ్చాం...  ’’ వాళ్లిద్దరూ కూడా పరీక్ష పక్కన పెట్టేసి.. నా కోసం వచ్చారని అర్దం అయ్యింది.‘‘ ఇంట్లో పెద్దవాళ్లు తిడతారన్న భయం లేకుండా .. స్నేహితుడి కోసం...నిజం చెప్పాలంటే ... వీళ్లంతా రెండు నెల్ల క్రితం ఇంజనీరింగ్ కాలేజీలో పరిచయం అయిన వాళ్లే. ... అయినా నా కోసం... ’’

ఈ లోగా డాడీ వచ్చారు. మొహంలో  ఆందోళన.. భయం స్పష్టంగా కనిపిస్తోంది.ఒళ్లంతా చెమటతో ముద్దయి ఉంది. నన్ను చూడగానే వెక్కివెక్కి ఏడవటం ప్రారంభించారు. అప్పటి వరకూ ధైర్యంగా ఉన్నవాడిని.. గుండెల్లో బాధను  బలవంతంగా అదిమి పెట్టుకున్నవాడిని. .. నేనూ తట్టుకోలేకపోయాను.‘‘ ఊరుకోండి అంకుల్. మీరే అలా అయితే.. వాడి పరిస్థితి ఏమిటి? మీరు ధైర్యంగా ఉండండి. అంతా చక్కబడుతుంది’’ భార్గవ పెద్దమనిషిలా నాన్నను ఊరడిస్తున్నాడు.‘‘ నువ్వేంటిరా? ఇప్పటి వరకూ  పెద్ద హీరోలా ఫోజ్ కొట్టావ్.. ఇప్పడు ఇలా జావగారిపోతున్నావే..’’ కవ్విస్తున్నట్టుగా అన్నాడు.

నా దు:ఖం  ఆగింది. మామూలుగా ఉండటానికి ప్రయత్నించసాగాను. అయితే శరీరం పచ్చిపుండులా ఉంది. కళ్లు మూసుకుంటే యాక్సిడెంట్ గుర్తుకొచ్చి నన్ను కలవరానికి గురిచేస్తోంది.  బలవంతంగా కళ్లు తెరిచే ఉంచుతున్నాను.‘‘ హలో హీరో.. బైక్ తో ఎవరిని ఢీకొట్టావ్? ’’ జోవియల్ గా పలకరించాడు డాక్టర్.నేను నవ్వలేకపోయాను. కళ్లుమూతలు పడ్డాయ్...ఆ తర్వాత ఐసీయూలోకి తరలించారు. రెండు మూడురోజుల తర్వాత అనుకుంటా.. ... ప్రత్యేక గదిలోకి మార్చారు. వేర్వేరు   డాక్టర్లు.. రకరకాల మందులు, . ఎన్నో  వైద్య పరీక్షలు...  పచ్చనోట్లు చకచకా కదిలివెళ్లిపోయాయి. ఇక్కడున్నన్ని రోజులూ  ఇంజనీరింగ్ కాలేజీ స్టాఫ్, స్టూడెంట్స్ ఎవరో ఒకరు వచ్చి  పోతూండేవారు. నాకు  సమయమే  తెలిసేది కాదు. 

ఇప్పుడు ఇంటికి బయలుదేరే సమయం వచ్చింది. . ‘‘ మెనీ హాపీ రిటర్నస్ ఆఫ్ ది డే’’...నా మంచం చుట్టూ చేరి అందరూ కోరస్ గా చెప్పారు.బదులుగా నవ్వాను.మంచానికి అటువైపు అమ్మ, చెల్లి, నాన్న..రెండో వైపు నా స్నేహబృందం.. భార్గవ, రసూల్, చైతన్యతో పాటు మరో ఐదారుగురు... నా పుట్టిన రోజు సందర్భంగా అందరూ ఇంటికి వచ్చారు. అభినందనలతో ముంచెత్తారు. 

ఇది భార్గవ గాడి ఆలోచనే.  ‘‘ దేముడి దయ వల్ల  వీడు బతికి బయట పడ్డాడు. ఇంత త్వరగా కోలుకుంటాడని  అనుకోలేదు’’ గుడ్లలో నీళ్లు కుక్కుకుంటూ అమ్మ చెప్పింది.చెల్లి కళ్లలోనూ నీళ్లు.నాన్న ఎప్పటి మాదిరిగానే గంభీరంగా ఉన్నారు.  ‘‘ బోలెడు రక్తం పోయింది. బిడ్డ విలవిలలాడిపోయాడు.’’ ప్రమాద సంఘటనను గుర్తుచేసుకుంటోంది అమ్మ.ఆ రోజు ధైర్యంగా ఎలా ఉండగలిగానో నాకే అర్ధం కావటంలేదు. బహుశా అదే నన్ను కాపాడిందేమో...   రక్తంతో తడిసిన బట్టలను పక్కన పడేశారు. పక్కనున్న షాపు నుంచి అప్పటికప్పుడు కొత్త బట్టలు తెచ్చారు నాన్న .

తెల్లవార్లూ   ఆస్పత్రి బయటే గడిపారు.మరుసటిరోజు ఉదయానికి గానీ అమ్మకి విషయం తెలియదు.  చెల్లితో కలిసొచ్చింది.నన్ను చూడగానే   శోకాలు ప్రారంభించింది.‘‘ అమ్మా ... ఇలాగయితే నువ్వు రావద్దు’’  గట్టిగా చెప్పాను. ఆ తర్వాత ఆమె కన్నీళ్లు  పెట్టుకోవటం నా కంట పడలేదు.

రాత్రి, పగలు సేవలు చేసింది.    సమయానికి మందులు వేయటం దగ్గర్నుంచి ..  బాత్రూంకి వెళ్లటం వరకూ... అంతే కాదు.. ఎముకలు శక్తిని పుంజుకునేందుకట... రోజూ ఏవేవో వండి పెడుతూనే  ఉంది.   వాకర్ సాయంతో మెల్లగా మంచం మీద నుంచి లేచాను.నేను కేక్  కట్ చేయగానే  ఒకరి తర్వాత మరొకరు  చిన్న ముక్క తుంపి నా నోట్లో పెట్టారు.  ఉక్కిరిబిక్కిరయ్యా.‘‘ దేముని దయ వల్ల బిడ్డ బయటపడ్డాడు.  షిర్డీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవాలి..

ఆ తర్వాత తిరుపతి ...నడిచి కొండెక్కాలి.  శ్రీశైలం కార్తీక మాసంలో వెళ్లాలనుకున్నా.. అటుకూడా వెళ్లిరావాలి..  ..’’‘‘ ముందు వాడు పూర్తిగా కోలుకోనీ.. ఆ తర్వాత ఈ మొక్కుల సంగతి చూద్దాం...’’మధ్యలోనే అడ్డుకున్నారు నాన్న.   దేముడి దయ వల్ల నేను బతికి బయట బట్ట కట్టానని  ఆమె నమ్ముతోంది. నేను కొద్దిగా తిరగగలిగితే పుణ్యక్షేత్రాలకు తీసికెళ్లి మొక్కు చెల్లిద్దామని ఆరాటపడుతోంది.  దు:ఖాన్ని నియంత్రించుకోలేకపోతుందనుకుంటా.  చీర కొంగు అడ్డుపెట్టుకుని... ముక్కు చీదుతూ   మాట్లాడుతోంది.ఆ వాతావరణంలో ఉక్కిరిబిక్కిరవుతున్నాను. 

నాన్న... నేను కోరిన బండి కొనివ్వలేదనే కాదు. ప్రతి విషయానికి కఠినమైన ఆంక్షలు  పెడతారని ఆయనని తెగ విసుక్కునే వాడిని. ద్వేషించేవాడిని కూడా.   నాకు ప్రమాదం జరిగిందని తెలియగానే  ...  ఆయన విలవిలలాడిపోవటం, చిన్నపిల్లాడిలా రోదించటం నిజంగా నన్నుకదిలించింది. ఆయన నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారో అర్ధం చేసుకోగలిగాను.‘‘డబ్బెంతయినా ఫరవాలేదు. మంచి వైద్యం అందించండి’’ అనేవారు డాక్టర్లు ఎప్పుడొచ్చినా...ఆయన ఖర్చుకు  వెరవలేదు. చికిత్సకు వెనకడుగు వేసింది లేదు. ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్న ఆయనకిది మోయలేని భారమని నాకు తెలుసు.  అయినా పరిపూర్ణంగా తన బాధ్యతలు నెరవేర్చారు.నా కళ్లు చెమర్చాయి.అమ్మ వైపు చూస్తూ ..‘నువ్వు చెప్పినట్టే అన్ని మొక్కులు తీర్చుకుందాం. అంతకు ముందు నేను  కొందరికి  కృతజ్గత చెప్పుకోవాలి  ’’ అన్నా.  భార్గవను ఆత్మీయంగా దగ్గరకి తీసుకున్నాను. ఆ తర్వాత రసూల్, చైతన్యల చేతుల్లో చెయ్యి వేశాను.

‘‘ నిజమే.. ఏం చేసినా వీళ్ల రుణం తీర్చుకోలేం. ఈ రోజు మన బిడ్డ మన కళ్ల ముందు తిరుగుతున్నాడంటే.. వీళ్లందించిన సహకారం మాటల్లో చెప్పలేను’’నాన్న నోటివెంట నేను చెప్పాలనుకున్న మాటలే వచ్చాయి.   ‘‘ఈ నలుగురు స్నేహితులు   రేయింబవళ్లు వాళ్లు నా సమక్షం లోనే ఉన్నారు. తమ ఇంట్లో పెద్ద వాళ్లు తిడతారన్న భయం లేకుండా ...నన్ను రోజంతా సంతోషంగా  ఉంచటానికి ప్రయత్నించారు .ఈ రోజుల్లో  ఇలాంటి వారు   అరుదు...’’నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.   ‘‘ వీళ్లే కాదు.. ఆ రోజు  రోడ్డు పైన పడి ఉన్న నాకు..వెంట్రుక వాసి దూరంలో  వాహనాన్ని బలవంతంగా ఆపకపోతే..అప్పుడే నాప్రాణాలు  గాలిలో కలిసి పోయి ఉండేవి..  ఆ  మోటాడొర్  డ్రెయివర్ ఎంత చాక చక్యంగా వ్యవహరించాడు. 108 సిబ్బంది, ఆపరేషన్ చేసిన  డాక్టర్ , నేను మామూలుగా నడవటానికి ప్రయత్నిస్తూ ఫిజియోథెరపీ చేసే వ్యక్తి ... ఇలా  ఎందరో...వీళ్లంతా నన్ను కంటికి రెప్పలా కాపాడలేదూ...   తిరిగి నన్ను మామూలు మనిషిని చేయటానికి ప్రయత్నించ లేదూ...ఏం చేసి వీళ్ల రుణం తీర్చుకోగలను..’’

నా గుండెల్నిండా కృతజ్గత పొంగి పొర్లింది. అదేమిటోగానీ.. ఇప్పుడు నా చుట్టూ ఉన్న వ్యక్తుల్లో దైవాన్ని చూడగలుగుతున్నాను.వాళ్లంతా  దేముళ్లకు ప్రతినిధుల్లా... ప్రేమకు ప్రతిరూపాల్లా ... కనిపిస్తున్నారు.నిజం చెప్పాలంటే.. సరదా సరదాగా గడిపే నాకు ఈ ప్రమాదం జీవితం విలువను తెలియచేసింది.చుట్టూ ఉన్న వ్యక్తుల్ని అర్ధం చేసుకోనేలా చేసింది.  అదే జరగకపోయి ఉంటే ఈ ప్రపంచాన్ని ఇంతలా అర్ధం చేసుకోలేకపోయేవాడినేమో....

అందుకే..  ఈ ప్రమాదాన్ని నా మనసు పొరల్లో భద్రంగా పదిలపరుచుకోవాలనుకుంటా.  జీవితకాలం ఓ మంచి జ్ఞాపకం గా మిగుల్చుకుంటా.   

మరిన్ని కథలు
somarinakka