Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఒక్కడు చూసినా.... సినిమా తీస్తూనే ఉంటా! - రాంగోపాల్ వ‌ర్మ

interview

వ‌ర్షం కురుస్తుంటుంది. ఎవ‌రిపై?  ఎందుకు? ఎంత శాతం?  అనే లెక్కలెప్పుడూ వ‌ర్షం వేసుకోదు. అయితే అతివృష్టి .. లేదంటే అనావృష్టి. గోపాల్ వ‌ర్మకూడా అంతే. సినిమాలు తీస్తూనే ఉంటాడు. అవి జ‌నానికి ఎక్కుతున్నాయా?  లేదా?  ఎంత‌మంది చూస్తారు?  అవి చూసి వ‌రేం ట్లాడుకొంటారు?  అనేవి మాత్రం ఆలోచించ‌డు.  చిన్న సినిమా?  పెద్ద సినిమా అనే లెక్కలేసుకోడు. సినిమా తీసే ప్రోసెస్‌ని మాత్రం పిచ్చ చ్చగా ప్రేమించేస్తుంటాడు. అందుకే అత‌ని నుంచి నెల‌కో సినిమా వ‌స్తోంది. రౌడీ, ఐస్ క్రీమ్ 1, 2, ఇప్పుడు అనుక్షణం.. ఇలా ఆ ప‌రంప‌ర న‌సాగుతోంది. అనుక్షణం ఈ శ‌నివారం విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ఆర్జీవీతో జ‌రిపిన ముచ్చట్లివి...

* సినిమాల మీద సినిమాలు... మ‌మ్మల్ని ఊపిరి తీసుకోనివ్వరా?
- సినిమా లేకుండా నేను ఊపిరి తీసుకోను.. (న‌వ్వుతూ). సీ... సినిమా అనేది ఓ థాట్‌ని ప్రజెంట్ చేయ‌డం. నాకు పొద్దున లేచిన ద‌గ్గర నుంచి ఎన్నో ర‌కాల ఐడియాలొస్తుంటాయి. ప్రతి ఐడియా సినిమాకి ప‌నిచేయ‌దు. కానీ ఏమాత్రం ప‌నిచేసినా సినిమా తీయాల‌నే చూస్తా.

 మ‌రి అనుక్షణం ఐడియా ఎక్కడి నుంచొచ్చింది?
- నాకు టిపిక‌ల్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. వాళ్లెం చేస్తుంటారు?  వాళ్ల దిన‌చ‌ర్య ఎలా ఉంటుంది?  ఇలాంటి విష‌యాల్ని ఆరా తీస్తుంటా. హాలీవుడ్‌లో సైకోల సినిమాలొచ్చాయ్‌. నేను పుస్తకాల్లోనూ చ‌దివి వాళ్ల గురించి తెలుసుకొన్నా. అదే అనుక్షణం. ఓ సైకో కిల్లర్ హైద‌రాబాద్‌ లాంటి సిటీలో అడుగుపెడితే ఎలా ఉంటుంద‌న్నదే నా ఆలోచ‌న‌.

* సైకో సినిమా అంటున్నారు... ఆ త‌ర‌హా ఆలోచ‌న ఉన్నవాళ్లు. మీ సినిమాతో మ‌రింత‌ ఎడ్యుకేట్ అవుతారేమో?
- సినిమా చూసి జ‌నాలు మార‌తారా?  నాన్సెన్స్‌. లంచాలు తీసుకోవ‌ద్దని శంక‌ర్ త‌న సినిమాలో చెప్పాడు. జ‌నం లంచాలు తీసుకోవ‌డం మానేశారా? స‌మాజంలో జ‌రిగేవే సినిమాల్లో చూపిస్తుమా?  లేదంటే సినిమాల్లో చూశాకే జ‌నం మారుతున్నారా? అన్నది పెద్ద స‌బ్జెక్ట్‌. చెట్టు ముందా?  విత్తు ముందా?  అని లెక్కలేసుకొన్నట్టే. నేనేం జ‌నాల‌కు సందేశం ఇవ్వను. ఓ సినిమా వ‌ల్ల మార్పు తీసుకొస్తామ‌న్న మాట‌ను నేను న‌మ్మను. నేనో క‌థ చెబుతున్నా. అంతే.  

* రౌడీలో విష్ణుకీ, అనుక్షణంలో విష్ణుకీ తేడా ఏంటి?
- అందులో రౌడీ.. ఇందులో పోలీస్‌... (న‌వ్వు)

* క్యారెక్టరైజేష‌న్‌లో తేడా ఏం చూపించారు?  ఈ రెండు పాత్రల్లో మీకు న‌చ్చిందేంటి?
- రౌడీ చేస్తున్నప్పుడు విష్ణులోని సీరియ‌స్ యాంగిల్ నాకు బాగా న‌చ్చింది. అవుట్ అండ్ అవుట్ సీరియ‌స్‌గా ఉండే పాత్రని రాసుకొని విష్ణుతో సినిమా చేస్తే ఎలా ఉంటుంది?  అని అప్పుడే అనుకొన్నా. న‌టుడిగా అనుక్షణంలోని విష్ణు నాకు బాగా న‌చ్చాడు. లుక్ ప‌రంగా... రౌడీలో న‌చ్చాడు.

* హార‌ర్‌, థ్రిల్లర్‌, ఇలాంటి క్రైమ్ క‌థ‌లు ఓ వ‌ర్గానికే న‌చ్చుతాయి క‌దా?
- అవును. ప్రతి సినిమా ప్రతి ఒక్కరికీ న‌చ్చాల‌ని రూలు లేదు. యాక్షన్‌, థ్రిల్లర్ సినిమాలు చూసేవాళ్లకి అనుక్షణం న‌చ్చుతుంది. అలాగ‌ని వాళ్లంతా ఈ సినిమా చూసేస్తార‌ని క‌న్‌ఫామ్‌గా చెప్పలేను. వాళ్లలోనూ కొంత‌మందిని న‌చ్చొచ్చు. న‌చ్చక‌పోవ‌చ్చు. హార‌ర్ సినిమాల్ని ఇష్టప‌డేవాళ్లు కూడా... ఆ సినిమాల్ని పూర్తిగా చూడ‌రు. మ‌ధ్యలోంచి లేచి వెళ్లిపోతుంటారు. వాళ్ల భ‌యాన్ని, వాళ్ల ఇగోల్ని సంతృప్తి ప‌రిస్తేనే సినిమా ఆడుతుంది.

* సినిమాల్ని తీస్తూ పోతున్నారు గానీ, ప్రేక్షకుల ప‌ల్స్ ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నది మీమీద విమ‌ర్శ. మీరేమంటారు?
- సినిమా తీయ‌డం అంటే నాకిష్టం. నాకిష్టమైన ప‌నిని ఇష్టంగా చేస్తుంటా. మ‌రొక‌రి ఇష్టాల్ని నాపై, నా ఇష్టాల‌పై ప్రభావితం చేసుకొని... దానికి త‌గ్గట్టుగా నా ఇష్టాల్ని మార్చుకోను. నా సినిమా ఎవ‌రికి న‌చ్చుతుంది? ఎవ‌రికి న‌చ్చదు ? అనే లెక్కల్ని వేసుకోను.

* కానీ నిర్మాత‌కు కావాలి క‌దా?
- వాళ్ల లెక్కలు వాళ్లకుంటాయి. నా సినిమా ఎంత‌లో తీయాలి?  ఎలా బిజినెస్ చేసుకోవాలి అన్నది వాళ్ల ఇష్టం. నాకో ఐడియా వ‌స్తే, నిర్మాత‌కు చెబుతా. వాళ్లకు న‌చ్చితే అది వ‌ర్కవుట్ అవుతుంది. లేదంటే లేదు. అయినా నా సినిమా హిట్టవుతుంది.. అనుకొని నేనెప్పుడూ సినిమా తీయ‌ను. శివ సినిమా హిట్టవుతుంద‌నుకోలేదు. ఆడింది. స‌త్య కూడా అంతే. హిట్ సినిమా తీద్దామ‌నుకొని, హిట్ సినిమానే తీస్తే.. ఇక ఫ్లాప్‌లు ఎందుకొస్తాయి..?

* వ‌ర్మ త‌న స్థాయికి త‌గిన సినిమాలు తీయ‌డం లేద‌ని మిమ్మల్ని అభిమానించే వ‌ర్గం బాధ‌ప‌డుతుంటుంది. వాళ్లకు మీరిచ్చే స‌మాధానం?-
స్థాయి ఎవ‌రు నిర్ణయిస్తారు?  శివ‌, రాత్రి నేనే తీశా. శివ తీసిన‌ప్పుడు ఎంత‌గా నా ప‌నిని ప్రేమించానో, రాత్రి తీసిన‌ప్పుడూ అంతే ప్రేమించా. రెండింటి విష‌యాల్లో నా స్థాయి ఏం మార‌లేదు. కానీ... ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. రెండిటింటీ వేర్వేరు ఫ‌లితాలొచ్చాయి. జ‌నం ఇవేం ప‌ట్టించుకోరండి. సినిమా న‌చ్చితే చూస్తారు. లేదంటే ప‌క్కన పెట్టేస్తారు. ఇది ఏ స్థాయిలో తీశారు?  అంటూ విశ్లేషించుకొనే టైమ్ వాళ్లకు ఉండ‌దు.

* ఐస్ క్రీమ్ 1, 2... ఈ ప‌రంప‌ర ఎప్పటి వ‌ర‌కూ...
- ప్రేక్షకుల‌కు విసుగొచ్చేంత వ‌ర‌కూ. థియేట‌ర్‌కి ఒక్కడొచ్చినా నా సినిమా తీస్తా. ఎప్పుడైతే ఖాళీ థియేట‌ర్ క‌నిపిస్తుందో అప్పుడు మానేస్తా.

 మోహ‌న్‌బాబుని ఓ సినిమాలో గుండుతో చూపిస్తార‌ట‌..
- అదేం లేదే..

* మోహ‌న్‌బాబు ఇటీవ‌ల ఓ ప్రెస్‌మీట్లో చెప్పారు క‌దా?
- నిజంగానే అలాంటి ప్రయ‌త్నాలేం లేవు. త్వర‌లో ఆయ‌న‌తో ఓ సినిమా చేస్తున్నా. అయితే అందుకోసం నేనేం గుండు కొట్టించ‌డం లేదు. ఆ సినిమా వివ‌రాలు త్వర‌లో చెబుతా.

మరిన్ని సినిమా కబుర్లు
Movie Review - Power