Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి


జరిగిన కథ :  విరాట్, చందూ ఇద్దరూ స్నేహితులు. రైల్వేస్టేషన్ ముందు   ఒక అమ్మాయి నడుం మీద గిల్లి దూరంగా తప్పుకుంటాడు చందూ. గిల్లినది విరాట్ యే కాబోలు అనుకుని ఆ అమ్మాయి విరాట్ చేయి పట్టుకుంటుంది, తన పేరు విశాలా అని చెప్పి పరిచయం చేసుకుంటుం ది.... .......................................ఆ తరువాత

‘‘చిలిపి. నా నడుం టచ్చేసి సోవాట్ అంటావేమిటి?’’ అంది కాస్త   సిగ్గుపడుతూ. చేయి మాత్రం వదల్లేదు.

‘‘నడుం టచ్ చేసానా.... నేనా...?’’

‘‘నువ్వే... ఇక్కడ టచ్  చేసావ్’’ అంటూ అతడి చేతిని మరోసారి తన నడుం వంపు మీద ఉంచింది.

అదిరిపడి చేయి వెనక్కి తీసుకున్నాడు విరాట్.  ఆనుమానం వచ్చి చందూ కోసం చూసాడు. అప్పటికే దూరంగా వెళ్ళిపోయి ఫుట్ పాత్ పక్కన రెయిలింగ్  మీద నుంచొని ఇటే చూస్తూ నవ్వుతున్నాడు.  అక్కడికి ఎగ్మోర్  రైల్వేస్టేషన్ ఎంట్రన్స్ స్పష్టంగా కన్పిస్తోంది. విరాట్ కి చందూ కావాలనే తనని ఇరికించి వేడుక చూస్తున్నాడని అర్థమైంది. ఈ కొంటెపని చేసింది వాడే సందేహం లేదు. ఆ అమ్మాయి విశాల వంక చూసాడు.

‘‘ఏమిటి దిక్కులు చూస్తున్నావ్? నువ్వు కాదని మాత్రం అనక. నా చేతికి చిక్కావ్ గదా!‘‘ అంది చిలిపిగా.

‘‘చూడు నిజంగా నాకేం తెలీదు. నీ నడుం టచ్ చేసిన వాడెవడో జనంలో కలిసి పోయుంటాడు. వెళ్ళి వెతుక్కో. నన్నొదిలేయ్’’ అన్నాడు.
‘‘నోనో..  వాడ్ని వదులుకున్నా నిన్ను వదులుకోలేను. నీలాంటి తగిన జోడీ కోసమే ఇంతకాలం ఎదురుచూస్తు వచ్చాను. చూడు నువ్వు ఉద్యోగస్తుడివైనా, నిరుద్యోగివైనా ఐడోంట్ కేర్. దిస్ ఈజ్ మైప్రపోజల్ ఏమంటావ్? అంది ఆశగా.

ఆమె వదలదని అర్థమైపోయింది.

చందూ మీద పీకదాక ముంచుకొచ్చింది కోపం.

‘‘నీ ప్రపోజల్ గుర్తుంచుకుని ఈ సారి కలిసినపుడు నా అభిప్రాయం చెప్తాను. ప్రస్తుతం ట్రైన్ కి టైమవుతుంది. సారీ!’’ అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండానే విరాట్ జనంలోకలిసిపోయాడు. పాపం విశాల పెద్దగా నిట్టూరుస్తూ వెనుతిరిగింది.

‘‘నిన్ను చితగ్గొట్టినా పాపం లేదురా. దుష్టుడా. అనవసరంగా నన్నుఅమ్మాయి దగ్గర ఇరికించేసి వస్తావా. రేపు ఎక్కడన్న కనబడినా ఎప్పుడు పెళ్ళిచేసుకుందామని వెంటపడేలా ఉంది’’ అంటూ కోప్పడ్డాడు విరాట్.

ఫ్లాట్ ఫారం మీదికొచ్చే వరకు విరాట్ చేతికి చిక్కలేదు చందూ. అప్పటికి అతడి కోపం చాలా వరకు పోయింది. స్టేషన్ బయట చిక్కుంటే నిజంగా చితగ్గొట్టే వాడే.

‘‘లేకపోతే ఏమిట్రా? కాస్తాస్లోగా నడవరా అంటే నాచేత పరుగులెత్తిస్తావా? అందుకే నిన్నుస్పీడ్ బ్రేకర్ ఎక్కించేలా చేసాను. అయినా ఇది నా తప్పు కాదు’’ అన్నాడు చందు నవ్వుతూ.

‘‘చేసిన వెధవ పనికి సమర్ధింపు వేరేనా?’’

‘‘అదేం కాదురా బాబు. ఇవాళ దినపత్రికలో మన వారఫలాలు చూసాను.  నీ జాతకం ప్రకారం ఇవాళ వూహించని సంఘటనలు చాలా జరుగుతాయని రాసుంది....’’

‘‘నోర్ మూయ్.  వెధవజాతకాల పిచ్చి నువ్వునూ.  కాస్త కూచోడానికి సీటు దొరుకుతుందేమో చూడు.’’ అన్నాడు విరాట్.
ట్రైనొచ్చిఆగింది.

దిగేవాళ్ళు దిగుతున్నారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. అంతకుముందే వెళ్ళిన రైల్లో చాలా మంది క్రిక్కిరిసి వెళ్ళిపోడంతో ఈ ట్రైన్ కి అంతగా రష్లేదు. లోనకు వెళ్ళగానే లక్కీగా యిద్దరికీ సీటు దొరికింది. అప్పటికే ఎదురు సీటు ఖాళీ కాగా ఇద్దరు యువతులు వచ్చి కూచునున్నారు. రైలు కదిలింది.

యధాలాపంగా అటూ చూసాడు విరాట్.

సాధారణంగా`

యధాలాప సంఘటనలే కొన్ని ఒక్కోసారి మనిషి జీవితాన్ని వూహించని మలుపులు తిప్పుతాయి. ప్రశాంతంగా వున్న కొలనులో రాయిపడి తే చెదిరే అలల్లా ఆ చిన్నసంఘటన తర్వాత అనేక సంఘటనలకు దారితీసి మనశ్శాంతికి దూరం చేస్తాయి. ఇపుడా రైలు ప్రయాణంలో అలాంటి సంఘటనే చోటు చేసుకోనుందని ఆ క్షణంలో విరాట్ కు తెలీదు.

యధాలాపంగా చూసిన విరాట్ కు ఎదురు సీట్లో అమ్మాయిలు స్పష్టంగా కన్పించారు. మొదట అమ్మాయి గుండ్రాటి ముఖం. యావరేజ్ డ్రెస్ తో అందరమ్మాయిల్లాగే  సాధారణంగా కన్పించింది. కిటికి పక్కగా కూచునుంది రెండో అమ్మాయి.  ఆమె ముస్లిం యువతి కావచ్చు. ఇద్దరూ చుడీదార్ ధరించి వున్నారు. రెండో అమ్మాయి చున్నిని కళ్ళు మాత్రం కన్పించేలా ముఖానికి చుట్టుకుని ఉంది. ఆమె కిటికి పక్కనున్న విరాట్ కు ఎదురుగా ఉంది.

ముందుగా చూసినప్పుడు మామూలుగా చూసీ చూడనట్టు చూసి ముఖం తిప్పుకున్నాడు విరాట్. కాని ఎందుకో ఎదురుగా ఉన్న అమ్మాయిని మళ్ళీ చూడాలనిపించింది.  ఈ సారి పరిశీలనగా చూసాడు.

అమ్మాయిలిద్దరూ చిన్నగా మాట్లాడుకుంటూ తమ ద్యాసలో వాళ్ళున్నారు.

ఆమె వయసు ఇరవై రెండు లేదా ఇరవై మూడేళ్ళు ఉండొచ్చనిపించింది.  రెండోసారి చూడగానే ఆమెను అసాధారణ యువతిగా గుర్తించాడు విరాట్. ఖచ్చితంగా అయిదున్నరడుగుల ఎత్తు ఉంటుంది. అద్భుతమైన ఫిజిక్... చెక్కిన పాలరాతి శిల్పంలాంటి వంపు సొంపుల అంగ సౌష్టవం... లేత గులాబి రంగులో మెరిసే చర్మసౌందర్యం...  వాలుజడ ముందుకేసుకోవడంతో ఆమె జుత్తు కరినాగులా బారుగా ఒడిలో పడినది . సన్నటి నడుం పైన ఎద భారాల పొంగుల హొయలు...   శంఖం లాంటి మెడ... సింహం లాంటి నడుము... మతి పోగొడు తున్నాయి. నిజంగా చాలా చాలా అందగత్తె అయి ఉండొచ్చనిపించింది.  ఆమెనే చూస్తున్నాడు.పక్కన కూచొని ఏదో వాగుతున్న చందూ విరాట్ తన మాటలు వినటం లేదని ఎదురుగా ముసుగు సుందరిని చూస్తున్నాడని గ్రహించి మాటలు ఆపి అలా చూస్తుండిపోయాడు. ఇంతకాలం తమ స్నేహంలో ఎప్పుడూ విరాట్  ఒక అమ్మాయినలా ఆసక్తిగా గమనించటం చూళ్ళేదు. ఏదో విశేషం ఉందనిపించింది.
లో లోపల ఆమెను చూస్తూ ` ఆ వెలుగేమిట్రాబాబూ...  మనిషే ఇంత బాగుంది...  ముఖం ఎంత బాగుంటుందో... ఒక్కసారి ఆ ముసుగు తీసి ముఖం చూపించొచ్చు గదా ఆనుకున్నాడు మనసులో విరాట్.

విచిత్రంగా అతని మనసులో మాట తనకు వినిపించినట్టుగా ఆ యువతి అంతవరకు ముఖం తెలీకుండా చుట్టుకున్న చున్నీని తీసి మెడలో వేసుకుంది. సందేహం తీరిపోయింది. నిజంగానే అద్భుత లావణ్యవతి ఆమె. బ్రీత్ టేకింగ్ బ్యూటీ...  ఈజిప్ట్ రోమన్ సుందరి క్లియోపాట్రా... హెలెన్ ఆఫ్ ట్రాయ్.. రాజస్థాన్ రాజమాత గాయత్రీదేవి.... అందాలన్నీఈమెలోనే  ప్రోదిచేసుకున్నాయా..?!!  స్టనింగ్ బ్యూటీ అనటంలో ఏ మాత్రం సందేహం లేదు...  అంతేకాదు...

ఆమె ముస్లిం యువతి కాదు.

ముఖాన బొట్టు వుంది.  హిందువు యువతి. మెడలోమంగళ సూత్రాలుగాని కాలివేళ్ళకు మెట్టెలుగాని లేవు. అంటే అవివాహిత. కోలముఖం యువతులు అందంగా వుంటారని తెలుసు. కాని మరీ యింత అందగత్తెలుంటారన వూహించలేదు.

నుదురు విశాలంగా వున్న వారికి ఆలోనచాశక్తి ఎక్కువ. చిన్నవిషయాలనైనా ఎక్కువ ఆలోచించిగాని నిర్ణయాలు తీసుకోరు. న్యాయం కోసం పోరాడే స్వభావం... నిశ్చిత పరిశీలన గుణం... సమయానుకూలంగా స్పందించి త్వరిత పరిష్కారమార్గాన్ని అనుసరిస్తారు. ఓ పట్టున ఎవరి నీ నమ్మరు.  ఎవరికీ తలవంచరు.  నమ్మిన వారి కోసం ప్రాణమిస్తారు. ఆమె నుదురు విశాలంగా వుంది. మరీ కోల ముఖం  కాదు. అలా గని గుండ్రని ముఖము కాదు. కుంకుమ అద్దినట్టు ఎర్రని బుగ్గలు... మెరిసే చెక్కుటద్దాలు ... సంపంగి మొగ్గలాంటి ముక్కు... అలాంటి చక్కని నిటారు ముక్కు గల వారికి ముక్కు మీదే ఉంటుంది కోపం. అది కాసేపే.  కుదురుగా ఉండలేరు. ఏదో అన్వేషించి అనవసర గొడవల్లో పడతారు . సమరంలో వీరు అదృష్టవంతులై ఉంటారు. అటువంటి ముక్కు  కలిగిన అకలికి ముక్కున ఒంటి రాయి బేసరి. అందులో పొదిగిన వజ్రం ఆమె అందాన్ని ఇనుమడిరప చేస్తోంది.

ఆమె పెదవులు చక్కగా కొనల్లో వంపు తిరిగి లేత గులాబి రంగుతో తడితో మెరుస్తూ మళ్ళిమళ్ళి చూడాలనిపిస్తున్నాయి. శంఖం లా పొడవాటి మెడలో సన్నటి బంగారు గొలుసు... చెవులకు పచ్చల జువకాలు ఉన్నాయి. యవ్వనపు పొంగులో ఉంది అమ్మాయి.
వాళ్ళని చూస్తుంటే ఇద్దరూ ఏదో కంపెనీలో ఎంప్లాయీస్  అని, తమ లాగే వాళ్ళిద్దరు కూడకలిసే తిరుగుతుంటారని అన్పించింది. ఇంతకీ ఎక్కడ  పని చేస్తున్నట్టు...?  ఎగ్మోర్లో అయితే ఈ అమ్మాయి ఇంతకాలం తన కంట పడకుండా ఎలా ఉంది...? తీవ్రంగా ఆలోచిస్తున్నాడు విరాట్.

రైలు పరుగెడుతూనే ఉంది.

అప్పటికే కొన్ని స్టేషన్లు దాటి పోయాయి. ఆ అమ్మాయి తనను రెండు మూడు సార్లు క్రీగంట గమనించటం విరాట్ కనిపెట్టాడు. ఒకసారి ఆమెను పలకరించాలనిపించింది. కాని ఎలా? ఏమని పలకరించాలి...? పలకరిస్తే తన గురించి ఏమనుకుంటుందో ఏమో... ఆలోచించే లోపు మరో అయిదు నిముషాలు గడిచి రౖౖెలు కోడంబాకం స్టేషన్ లో ఆగింది. సిటీ రైలు ముప్పై సెకన్లు మాత్రమే ఆగుతుంది.  ఆ కాస్త టైమ్ లోనే ఎక్కేవాళ్ళు  ఎక్కాలి దిగేవాళ్ళు దిగాలి. రైలు కదిలింది. కాస్సేపటికి ఎలాగో ధైర్యం తెచ్చుకొని  ‘హలోమిస్’ అంటూ ఆమెను పిలిచాడు విరాట్.
ఆమె తలెత్తిచూసింది...

విశాల నేత్రాలు, నిశితమైన చెవులు...

ఆ కాటుక కళ్ళలో ఎన్నో అనుమానాలు...

‘‘టైమ్ ప్లీజ్ ’’ అడిగాడు.

‘‘మీ దగ్గర వాచీ లేదా?’’ ఎదురు ప్రశ్నించింది.  వీణ మీటినట్టు మృధువైన గొంతు.

‘‘లేదు’’  అన్నాడు పొడిగా

‘‘టెన్ టు నైన్’’ చెప్పింది.

‘‘మీ హేండ్  బ్యాగ్  చాలా బాగుంది.  వెరీనైస్’’  మాటలు పొడగించాలని నోటికొచ్చింది వాగేసాడు.

‘‘బాగుంది కాబట్టే .......... కొన్నాను.’’  కర్ర విరిచినట్టు బదులిచ్చిందామె. వీరి సంభాషణ వింటూ అటు ఆమె స్నేహితురాలు ఇటుచందూ చిన్నగా నవ్వుకుంటున్నారు.

‘ఎక్కడకొన్నారు?’  ఆడుగుదామని నోటి చివరివరకు వచ్చిన ప్రశ్నను అలాగే మింగేసాడు విరాట్. ఎందుకంటే స్లో అయి రైలు టి నగర్ స్టేషన్లో ఆగబోతోంది.  దిగిపోవడానికి యువతులిద్దరూ ఎంట్రన్స్  వైపు కదిలారు. వెళ్తున్న ఆ యువతినే చూస్తూండిపోయాడు విరాట్. ఆమె వెళ్ళిపో తున్నందుకు బాధనిపించింది.  రైల్లోని వెలుగునంతా ఆమె తన వెంటబెట్టుకు పోతున్నట్టు అనిపించింది. ఏమిటీ ఫీలింగ్ ...? అసలేమైంది తనకు...? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ యిదేనా...?

కనీసం  ఆమె వూరు తెలీదు. పేరు తెలీదు. అడ్రస్ తెలీదు. కాని పట్టి వెనక్కి లాగినా తన మనసు ఆమె వెనకే పరుగెత్తటం ఏమిటి...? నిజంగానే చాలా అందమైన యువతి. ఆమె నడక చూస్తే హంసలు సిగ్గుపడాలి. అంత పొందికైన నడక... తను కోరుకునేల క్షణాలన్నీ ఆమెలో నిండుగా ఉన్నాయి.

వాళ్ళిధ్దరూ రైలు దిగిపోయారు.

విరాట్ కి కనీసం ఆమె పేరయినా అడిగి తెలుసుకోవాల్సింది అన్పించింది. అంతే... చటుక్కున లేచాడు. రైలు కదలబోతోంది. మెరుపు వేగంలో డోర్ ని చేరుకొని దిగిపోయాడు.’’ అరే విరాట్... ఎక్కడికిరా... టి నగర్లో దిగిపోతావేమిటి...? ఆగరా...’’ అనరస్తూ వెనకే లేచి వచ్చిన చందూ కదిలిన రైలోంచి దూకేసి తూలి పడబోయి నిలదొక్కుకున్నాడు.

అప్పటికే విరాట్ ఆ యువతులిద్దరి కోసం ఫ్లాట్ ఫారం వెంట గాలిస్తున్నాడు. పిచ్చోడిలా తిరిగి చూస్తున్నాడు. రైలుదిగిన వాళ్ళు కొందరు ఫ్లాట్ ఫారం చివరిదారి వైపు నడచిపోతున్నారు. మరికొందరు మెట్లెక్కి వంతెన పై నుండి అటు ఉస్మాన్ రోడ్ వైపుగల రంగనాథగేట్  వైపు, ఇంకొందరు ఇటు స్టేషన్ రెండో వైపు, ఓల్డ్ మాంబళం పక్క తొందరగా చీలిపోయి వెళ్ళిపోతున్నారు. ఇంతలోనే వాళ్ళిద్దరూ ఎటువెళ్ళిపోయారో గాని తిరిగి విరాట్ కంటపడలేదు వాళ్ళు. ‘‘ఎటోవెళ్ళిపోయింది మనసు... ఎటెళ్ళిందో అది నీకు తెలుసూ...’’ పక్కన ఎవరో పాట పాడుతున్నారు . ఇంకెవరు... తీరిగ్గా తిన్నె మీద కూర్చుని తననే చూస్తూ పాటతో వెక్కిరిస్తున్నాడు చందూ.సాధారణంగా తనను ఎవరన్నా వెక్కిరించినా పరిహసించినా విరాట్ కి సర్రున కోపం ముంచుకొస్తుంది. కాని ఇప్పుడు కోపం రావటం లేదు. చిన్నగా నవ్వుతూ పక్కన కూర్చున్నాడు.

‘‘ఏమిట్రా? అమ్మాయి అంత నచ్చిందా?’’ అడిగాడు చందూ. అవుననట్టు తలూపాడు విరాట్.

‘‘లవ్ ఎట్ ఫస్ట్ సైటా?’’

‘‘ఏమో.......... ఇప్పుడేచెప్పలేను’’.

‘‘నువ్వు చెప్పక్కర్లేదు అర్ధమైపోతోంది.  లేకపోతే రైలుదిగి ఫ్లాట్ ఫారం మీద ఎందుకుంటాం...? ఏమైనా దినఫలాలు కరెక్టని ఇప్పుడైనా ఒప్పుకుంటావా?  నన్నా క్షేపించావ్ చూడు ఇప్పుడేమైందో. ఆవిడెవరో విశాలనీ చేయిపట్టుకొని వెళ్ళి చేసుకోమంది. నువ్వే మో రైల్లో ముక్కు మొఖం తెలీని అమ్మాయి కోసం రైలు దూకేసావ్...’’

‘‘దూకలేదు. దిగాను’’

‘‘అదే లేవోయ్. నువ్వు గాకపోతే నేను దూకలేదా? ఇవన్నీవూహించని సంఘటనలేగదా! వెధవ జీవితాలు ఏమిటో గాని నచ్చని వాళ్ళ వెంట పడతారు. నచ్చిన వాళ్ళు కనిపించకుండా పోతారు. మర్చి పో రా ఈ మహానగరంలో ఆ పిల్ల తిరిగి కనబడొచ్చు,  కనబడకపోవచ్చు, అదో రైలు వస్తుంది పదపోవాలి’’ అంటూ లేచాడు చందూ.

విరాట్  కళ్ళ ముందింకా...

ఆ అమ్మాయి రూపమే కదులాడుతోంది...

ఆ సుందర ముఖారవిందం తన హృదయ ఫలకం మీద ముద్రపడిపోయింది.  చందూ మాటలు నిజమే  అన్పించింది. ఆమె తిరిగి కనబడకపోవచ్చు. అయినా మన ప్రయత్నం మనం చేయాలి గదా... కనీసం పేరైనా తెలుసుకోవాల్సింది.  తీపి బాధతో మనసు వేదనకు గురైంది.

ఇంతలో రైలు ఆగటంతో ఆలోచనలు కట్టిపెట్టి చందూ వెంట రైలెక్కాడు విరాట్.

సాధారణంగా ఒక సంఘటన జరిగినప్పుడు.. అది మంచి గానీ చెడు గానీ...ఆ క్షణాల్లో... లేదా ఆ గంటలో... మరీ అయితే ఆ రోజంతా... ఆ ఫీలింగ్స్ బలంగా ఉంటాయి. తర్వాత రోజులు గడిచేకొద్ది క్రమంగా ఆ ఫీలింగ్స్ బలహీనపడి జరిగింది మర్చిపోతారు . ఇది మానవసహజం. కానీ విరాట్  విషయంలో ఇది పూర్తిగా భిన్నమై పోయింది.

ఆ రోజు ఇంటికి రాగానే తనూ ఇలాగే అనుకున్నాడు. ఎంత నచ్చితే మాత్రం ఇవాళ రేపు తర్వాత ఆమె గుర్తుండదు అని. ఆమె గుర్తుండడమే కాదు గుండెల్లో తీపి గాయం చేసి సలపటం ఆరంభించింది. మర్చిపోదామని ఎంత ప్రయత్నించి నా తలపుల్లో తిష్టవేసి కూచొని మనసుకు నెమ్మది లేకుండా చేయనారంభించింది.

ఈ విషయం మరునాడు ఉదయానికే గ్రహించాడు విరాట్. రాత్రంతా సరిగా నిద్రలేదు. కన్నుమూసినా తెరిచినా ఆ అపరిచిత రూపమే కన్పిస్తోంది... కవ్విస్తోంది... ఎంత ప్రయత్నించినా తన ఆలోచనల్లోంచి ఆమెను చెరిపేయటం సాధ్యమయ్యేలా కనబడలేదు.అసలు ఎందుకింతగా ఈ అమ్మాయి తనను కలిచివేస్తోంది?  అందమా... ఆకర్షణా... మోహమా.... అదే కారణమైతే ఈ చెన్నై మహానగరంలో అందమైన అమ్మాయిలకు కొదువా? తమ ఆఫీసులోనే పెళ్ళిగాని అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. తనంటే పడిచచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతదేనికి సాయంకాలం తన చేయిపట్టి ఆ పి పెళ్ళాడాలన్నవిశాల కూడ చాలా అందంగా ఉంది. తను చెన్నై వచ్చిన ఇన్ని రోజుల్లోనూ ఏ అమ్మాయిని చూసినా స్పందించని తన మనసు ఈ అమ్మాయిని చూడగానే ఇంతగా స్పందించిందంటే దీనికి ఆమె అందం ఒక్కటే కారణం కాదు. కానే కాదు.

అంతకు మించి ఏదో బలమైన బంధం తమ మధ్య ఉంది. ఏమిటది? గత జన్మ బంధమా?... జీవితమనే  తెర మీదకు ఎందరో వస్తుంటారు పోతుంటారు... వారిలో కొందర్ని అకారణంగా ద్వేషిస్తూ, కొందర్ని అభిమానిస్తూ ఇష్టపడతాం... ఇంకొందరితో స్నేహం చేస్తాం... ఇవన్నీ గతజన్మ రుణానుబంధాలంటారు.‘‘ఋణానుబంధరూపేణాంపశుపత్నిసుతాలయా’’  ఆఖరికి భార్యాపిల్లలు కూడ గతజన్మ ఋణానుబంధమేనట. ఈ అమ్మాయికి తనకు అలాంటి గత జన్మ బంధమేదో ఉండే ఉంటుంది. లేకపోతే ఇంతగా తనను కదిలించేది కాదు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
34th  episode