Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
34th  episode

ఈ సంచికలో >> సీరియల్స్

మేఘన

జరిగిన కథ : రాత్రి పడుకున్న దగ్గర్నించి ఉదయం లేచిన తరువాత జరిగే చిత్ర విచిత్రమైన అనుభవాలతో కొంత అయోమయానికి గురవుతాడు డాక్టర్ హరి. హాస్పిటల్ కి వెళ్ళగానే ఎప్పట్లానే నర్సును, మిగతా స్టాఫంతా విషెస్ చెప్తారు..................

...........................................   తరువాత

‘‘ఇందులోనూ వేళాకోళమా..? నేను కూడా నీతో ఏకీభవించి, డాక్టర్సుందర్నీ హరినీ పోల్చి, సుందర్గారిని తక్కువ చేసి ఉంటే సంతోషించి ఉండేవాడివేమో?’’

‘‘అబ్బేబ్బే... అదేం లేదు డేవిడూ.. నా ఉద్దేశం అది కాదు’’ అంటూ చల్లగా జారుకున్నాడు వేణు. వెధవలు... వెధవ బుద్దులు... అనుకున్నాడు డేవిడ్.

మధ్యాహ్నం ఒంటిగంట కావొస్తోంది..పేషంట్లందరినీ చూసి, పంపించేసాడు ‘హరి’..

కడుపులో ఆకలి దహించేస్తుంది... కర .. కర.. మంటూంది.

హమ్మయ్య... కేంటీన్లో భోజనం తెప్పించుకుందా మనుకునే లోపు ఫోన్మోగింది...

‘‘సర్... ఇంకో పేషెంట్ఉన్నారు...’’

‘‘తర్వాత చూద్దాం లెండి..’’

‘‘మిమ్మల్ని చూడాలని మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నారు సర్’’

‘‘అపాయింట్మెంట్తీసుకున్నారా?’’

‘‘లేదు సార్.. ఎక్కువ సేపు తీసుకోనని, ఒక్కసారి కలవాలని అంటున్నారు సర్... కొత్త పేషెంట్’’

‘‘సరే.. సరే... ముందు కేస్పేపర్పంపించండి...’’

‘‘ఓకే సర్..’’

‘‘కూర్చోండి మేఘన గారూ...

చెప్పండి... ప్రాబ్లమేమిటో..’’

కేస్పేపర్చూస్తూ, తలెత్తకుండానే అన్నాడు ‘హరి’

అవతలి నుంచి సమాధానం లేదు...

తలెత్తి పేషంటు వైపు చూసాడు...

సన్నని చిరునవ్వుతో తననే తదేకంగా చూస్తున్నదామె... హరి తన వైపు చూడడంతోనే, ఏం మాట్లాడకుండా... తన కుడి చేతిని ముందుకు చాచిందామె.

‘మణికట్టు’ చుట్టూ, ఎర్రగా కమిలిపోయి, రక్తం కారి, గడ్డకట్టుకుపోయి ఉంది.

ఈలోగా ఎడమచేతిని కూడా ముందుకు చాచిందామె..

ఆ చేయి పరిస్థితి కూడా అలాగే ఉంది.

‘‘తామర తూడులాంటి ఈ కోమల హస్తాలను ఇంత నిర్దాక్షిణ్యంగా నలిపేసినవారు మనుషులా..? రాక్షసులా..? లేక, ఈమే తనను తాను హింసించుకుని ఆనందించే మాసోఖిస్టా..? వాలకం చూస్తే అలా లేదే..?’’ అనుకుంటూ చకచకా సెలైన్ తో శుభ్రం చేసి, ఆయింట్మెంట్ అప్లై చేసేసాడు.

అలవాటుగా నాడీ, బీపీ చెక్చేసాడు.

‘‘కట్టు కట్టాల్సిన పనిలేదండీ.. గాలి తగలనిస్తే త్వరగా తగ్గిపోతుంది’’ అన్నాడు.

ఈలోపు, తను కూర్చున్న స్టీలు రివాల్వింగ్స్టూల్మీద డాక్టర్కు తన వీపు కనబడేలా తిరిగి, మెడ చుట్టూ కప్పుకున్న పమిటను తొలగించిందామె.

ఇంకోసారి షాక్కు గురైయాడు ‘హరి’

ఇదేమిటి?

మెడ చుట్టూ... వలయంలా... ఎవరో తడిగుడ్డతో గొంతు బిగించి, ఉరివేసినట్లుగా... నల్లగా కమిలిపోయి, నలిగి ఉంది చర్మం...‘‘సన్నగా, పొడవుగా... తెల్లగా.. శఖంలాగా ఉన్న ‘మెడ’పై ఇలాంటి గాయమా? ఎవరైనా ఉరి తీసి చంపేయడానికి ప్రయత్నించారా? లేక ఈమె ఆత్మహత్యాప్రయత్నం చేసిందా?’’ అనుకుంటూ, నెమ్మదిగా చేతి వేళ్లతో మెడను స్పృశించాడు.

పేషెంట్ నుండి ‘స్పందన’ లేదు.

ఇంకొద్దిగా చేతివేళ్ల ఒత్తిడి పెంచి ‘‘నొప్పి ఉన్నదాండీ..’’ అన్నాడు.

‘‘లేదు డాక్టర్’’ అన్నదామె.

‘‘నొప్పి లేదంటే, మెడ ఎముకలకేమీ దెబ్బ తగిలి ఉండదు. ఒకవేళ ఎముకలకేమైనా అయి ఉంటే కేవలం ‘టచ్’ చేసినప్పుడే కేకలు పెట్టి ఉండేది. ఇంత ప్రశాంతంగా కూర్చోలేదు’’ అనుకుంటూ తలెత్తి చూసాడు.

ఎప్పుడు ఆమె మళ్లీ ముందుకు తిరగిందో కానీ, హరి వైపు తిరిగి, ముఖంలో ముఖం పెట్టినట్లుగా సూటిగా అతని కళ్లల్లోకి చూస్తున్నదామె.గతుక్కుమన్నాడు ‘హరి’... కొంచం సర్దుకుని, ఆమెతో చూపు కలిపాడు.

అదే చిరునవ్వుతో ఏ మాత్రం తత్తరపాటు లేకుండా తదేకంగా చూస్తున్నదామె.

‘‘ఏమిటి? ఎందుకలా చూస్తున్నదామె?ఆ చూపుల్లో ఏదో ఆర్తి, ఆర్ద్రత వ్యక్తమవుతున్నాయి. ఏమో...! ఆమె మామూలుగానే చూస్తున్నదేమో..? నేనే రకరకాల భాష్యాలు చెప్పుకుంటున్నానేమో..?

కాదు... కాదు... ఏదో ఉంది... ఆ ఆర్తి... ఆర్ద్రత... అబద్దాలు కావు. అయినా ఒక పేషంటు గురించి ఎందుకిలా పరిపరి విధాల ఆలోచిస్తున్నాను నేను?

‘‘తీగలాంటి దేహం కలిగి, చక్కని మేని ఛాయతో, రూపురేఖలతో, తన సమక్షంతో ఎదుటివారిపై వెన్నెల హాయిని కురిపించి, తన చిరునవ్వుతో ప్రపంచాన్ని మరిపింపజేసే... ఈమెపై ఇంత రాక్షసంగా.. కర్కశంగా... కక్షగా.. కృారత్వాన్ని కురిపించిన రాక్షసాధముడెవడు? వాడసలు మనిషేనా? పశువా? కృారమృగమా? బంధువా? భర్తా?’’ ఆలోచనలతో హరి బుర్ర వేడెక్కుతుండగా...

‘‘భర్త... నా భర్త...’’ అన్నదామె వినబడీ వినబడనట్లుగా

‘‘ఏమిటీ... నా ఆలోచనలు ఈమె కళ్లకు కనబడుతున్నాయా..! సరిగ్గా పుస్తకం చదివినట్లుగా నా మనసులోని భావాలు ఎలా చదవగలిగింది?’’

కలవరపాటును కప్పిపుచ్చుకుంటూ... గంభీరంగా... ఆఁ... ఏమన్నారు... మేఘనగారూ... అన్నాడు.

‘‘నా భర్త వల్లనే నాకీ గాయాలయ్యాయని అంటున్నాను డాక్టర్’’ ఏ భావమూ లేకుండా అన్నదామె.

‘‘ఓప్ా... ఐయామ్సారీ.... మీ గాయాలు త్వరగానే మానిపోతాయి. నేనిచ్చిన ఆయింట్మెంట్కంటిన్యూ చేయండి.

ఏంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ రాసాను. కేవలం మూడు రోజులు వాడండి. ఎక్కువ రోజులు వాడకండి.. నొప్పి అనిపిస్తేనే. ఆ తర్వాత కూడా ఒక్క రోజు మాత్రమే పెయిన్ కిల్లర్స్ వాడండి. అంతకీ నొప్పి ఎక్కువైతే డామేజ్ ఆసెస్ మెంట్ కోసం ఎక్స్ రే, మిగిలిన టెస్టులు చేయిద్దామండి. నా ఉద్దేశంలో పెద్దగా డామేజి లేదు. అవసరమైతేనే టెస్టులు... అనవసరంగా మనీ వేస్ట్చేయడమెందుకండీ. వచ్చే వారం ఒక్కసారి కన్పించండి.’’ చెప్పేసాడు హరి.

‘‘థ్యాంక్యూ డాక్టర్...’’ అంటూ అదే చిరునవ్వుతో హంస గమనంతో, మరు నిమిషంలో కనుమరుగయ్యిందామె.

‘‘వెళ్లిపోయిందా? మాయమైపోయిందా?’’ అనుకున్నాడు. కానీ తననే చూస్తూ ఆశ్చర్యంతో నోరు వెళ్లబుచ్చుకున్న నర్సుని గమనించలేదు డాక్టర్ హరి.

సాయంత్రం ఏడు గంటల సమయం...

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్