Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
never die bapu!

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam

అల్లసాని పెద్దన విరచిత స్వారోచిష మనుసంభవము

(గతసంచిక తరువాయి)

మనోరమాస్వరోచుల వివాహవేడుకలను మనోహరంగా వర్ణిస్తున్నాడు పెద్దన.


పరిణమించిరి ధరామరపురంధ్రీహస్త / ఘటిత చేలాంచల గ్రంథికలనఁ
బరిపూర్ణనిష్ఠఁ గొల్చిరి ప్రదక్షిణపూర్వ / వినతి నాలుకలార్చు వేఁడివేల్పు
వీక్షించి రుడువీథి నక్షీణ సుస్థితి / స్థాయిఁ దోషిత రమాధవుని ధ్రువునిఁ
బరిణయప్రాప్త సప్తర్షి ప్రియాప్రేక్ష్య / సాక్షా దరుంధతీ సతి కెరఁగిరి

సకల సంయమిగణ నమస్కరణ కృత్య
మాచరించి తదీయ హస్తాభిమంత్రి
తాక్షితలు మౌళిఁ దాల్చి రత్యాదరమున
దంపతులు బంధుకోటి కుత్సవ మెలర్ప

నూతనదంపతులు సంతోషంతో, బంధుకోట్లు మురిసిపోయేలా బ్రాహ్మణస్త్రీలు తమ కొంగులను ముడివేయగా  పరిపూర్ణమైన నిష్ఠతో ప్రదక్షిణ పూర్వకంగా వినయంగా నమస్కరించి అగ్నిదేవుడిని కొలిచారు. లక్ష్మీపతిని మెప్పించి ఆకాశవీధిలో అక్షీణమైన శాశ్వతమైన స్థాయి లోనిలిచిన ధ్రువుని చూశారు. వివాహానికి ప్రత్యక్షంగా వచ్చిన అరుంధతీదేవికి  సాష్టాంగ దండప్రణామాలు చేశారు.  సకల మునులకు ఋషులకు పెద్దలకు నమస్కరించి, వారి చేతులమీదుగా అభిమంత్రించిన అక్షతలను శిరస్సులలో దాల్చారు.   

కూరిమి మంత్రితోడ నలకూబరుఁ డేకత మాడి పెద్ద బం
గారపుఁ గోర గల్పవనికాజని కాంతములైన చీరలున్‌
హార విభూషణావళియు నమ్మిథునంబునకుం బ్రియంబుతో
నారదమౌనిచేత నదనం జదివించెఁ గుబేరుపేరుగాన్‌.

 కుబేరుని కుమారుడైన నలకూబరుడు తనకు ఆప్తుడైన మంత్రితో రహస్యంగా సమాలోచన చేసి, సంప్రదించి  పెద్ద బంగారు పళ్ళెరంలో కల్ప వృక్షం ఉద్భవింపజేసిన చీరలను, వస్త్రములను, హార విభూషణములను ఆ దంపతులకు ప్రేమమీరగా, తన తండ్రి పేరుతో చదివించాడు. ఉత్సవాలు, వేడుకలు జరుగుతున్నపుడు ఆహ్వానపత్రాలను వేయించడం, కానుకలు చదివించడం అన్నీ జీవించి ఉన్న కుటుంబ పెద్దల పేరు తో జరపడం మన సంప్రదాయం. కుబేరుడు పెళ్ళికి రాలేకపోయినట్టున్నాడు పాపం, ఆర్ధిక లావాదేవీల ఒత్తిళ్ళ వలన, బహుశా, అందు కని అయన కొడుకు నలకూబరుడు ప్రతినిధిగా వచ్చాడు వివాహానికి, తన మంత్రిని సంప్రదించి, తండ్రిపేరుతోనే కానుకలు చదివించాడు అని లౌకిక  వివాహవేడుకలను గంధర్వరాజు కుమార్తె వివాహ వేడుకలకు అన్వయించి అచ్చతెలుగు సాంప్రదాయ వివాహవేడుకను   జరిపిస్తు న్నాడు పెద్దన, స్వరోచికి.

కలిమి మెఱయంగ మఱియుం
గల బాంధవులొసఁగి రపుడు కాంచన మణి భూ
షలుఁ జీరలు నరపతికిం
బొలఁతికి నుడుగరలు ముదము పొదలఁగ నంతన్‌.

తమ సంపదకు తగినట్లుగా, తమ ఐశ్వర్యాన్ని తెలిపేట్లుగా బంధువులందరూ బంగారు ఆభరణాలు, వస్త్రములు స్వరోచి మహారాజుకు, మనోరమకు సంతోషం కలిగేట్లు కానుకలు ఇచ్చారు. పొగడపూవంటి కంపుల మదాంబువులును / మధువర్ణ దంతశంబములు మెఱయభీకర స్వర చారు బృంహితంబులు ఘనాం / గారకగ్రహ కాంతి కన్నులమరనిలఁ జుట్టువడు తొండముల మించు పూర్వాంగ / మెత్తరంబై పిఱుం దత్తమిల్లఁ గటము లుత్కటములై నిటలముల్‌ బటువులై / సిబ్బెంపు మొగముల నుబ్బుమీఱ

స్వర్ణ క క్ష్యాంకుశ ప్రాస శరధి శార్ఙ్గ
ఖేట కుథ ఘంటి కాద్యలంకృతులఁ జెలువ
మెసఁగు గంభీరవేది భ ద్రేభ శతము
నల్లునకు నిచ్చె గంధర్వ వల్లభుండు.

పొగడపూల పరిమళమును కలిగిన మదజలాన్ని స్రవిస్తున్నవి, తేనెరంగులో వజ్రాయుధంలాగా మెరుస్తున్న కోరలు కలిగినవి, భీకరమైన ఘీంకార నాదములను చేస్తున్నవి, కుజుని రత్నమైన పగడాల్లాగా ఎర్రని కాంతులతో మెరుస్తున్న కన్నులు కలిగినవి, నేలమీదికి చుట్టలుగా పడుతున్న దీర్ఘములైన తొండములు కలిగినవి, ముందుభాగం ఎత్తుగా, వెనుకభాగం దింపుగా ఉన్న దేహములను కలిగినవి, విశాలమైన చెక్కిళ్ళు, గుండ్రని నుదుళ్ళు, పొడలు కలిగిన ముఖములను కలిగిన మదించిన ‘గంభీరవేది’ యనే  పేరుకలిగిన ‘భద్రము’ అనే జాతికి చెందిన వంద ఏనుగులను,బంగారు పట్టాలతో, అంకుశము, ఈటె, అమ్ములపొదులు, శార్ఙ్గము వంటి ధనుస్సులు, కంబళ్ళు, ఘంటలు మొదలైనవాటితో అలంకరింపబడిన వంద ఉత్తమజాతి ఏనుగులను మామ ఇందీవరాక్షుడు అల్లుడైన స్వరోచికి  కానుకగా ఇచ్చాడు. ఏనుగులు ‘భద్ర, మంద, మృగ’ జాతులు అనే మూడు జాతులకు చెందినవి అని, (‘సంకీర్ణ’ జాతి అనే నాలుగవ జాతి కూడా) ఆయాజాతులకు విశిష్టమైన, ప్రత్యేకమైన శరీర లక్షణాలు, నడవడిక, గుణాలు ఉంటాయని ఏనుగులకు చెందిన లక్షణశాస్త్రాలు తెలుపుతాయి. ఆ సంగతిని ఇక్కడ చెప్తున్నాడు పెద్దన.ఉర్వీజానికి మామ యిచ్చె శిఖిపింఛోద్భాసివర్ణంబుచే

నర్వాచీనఘనాళి రోహితసహస్రాకీర్ణగా మింటఁ బూ
షార్వస్తోమముఁ జిత్రయానముల నూటాడించు గాంధర్వగం
ధర్వవ్యూహము దీప్తిచండమణికాండస్వర్ణసన్నాహమున్‌.

తన అల్లుడైన స్వరోచి మహారాజుకు మామ శిఖిపింఛవర్ణంలో వంకరటింకరలు లేని తిన్ననైన అనేకఇంద్రధనుస్సులతో కూడిన తొలకరి మబ్బులలాగా ప్రకాశిస్తున్నవి, తమ నడకలతో సూర్యుని గుఱ్ఱములను కూడా ధిక్కరిస్తున్నవి, దట్టమైన మణికాంతులను వెలువరిస్తున్నవి ఐన గుఱ్ఱముల సముదాయాన్ని కానుకగా ఇచ్చాడు.

తళతళని తరణి మెఱుఁగులఁ
దలతల మను మణుల మెఱసి తలఁచినచోటన్‌
నిలుచు విమానము ఖేచర
కుల తిలకుఁడు కూర్మి పెండ్లికొడుకున కొసఁగెన్‌.

సూర్యుని కాంతులను కూడా ‘తప్పుకోండి తప్పుకోండి’(తరణి మెఱుఁగులఁ ‘దలతల’మను) అనే తళతళ మెరిసిపోయే కాంతులతో అనుకున్నచోటికి మెరుపులాగా తీసుకువెళ్ళే విమానాన్ని గంధర్వ శ్రేష్ఠుడైన ఇందీవరాక్షుడు తన అల్లుడైన స్వరోచికి కానుకగా ఇచ్చాడు. అల్లుడికి ఈ విధముగా కానుకలిచ్చి, తన కుమార్తెకు వెండి బంగారు గృహోపకరణములను,వివిధ రత్నాభరణములను, పట్టు జలతారు వస్త్రములను, బట్టలు నగలు దాచుకోడానికి రత్నాలతో పొదిగిన పెట్టెలను, కర్పూరము మొదలైన పరిమళ ద్రవ్యములను, యవ్వనవతులు, మదవతులు, గడసరులు, సొగసరులు, జాణలు ఐన, వాక్చాతుర్యము కలిగిన పరిచారికలను అరణముగా ఇచ్చాడు. 

అవన తాంగుష్ఠాగ్ర హార్య నిర్య ద్రత్న, ఖని ఘనాంతరిత శృంగాటకములు
ముద ముదావహదివ్య మైరేయ ధౌరేయ, గోత్రభి ద్విటపి నిష్కుట యుతములు
మహిళాకదంబ డింభ గ్రాహ్య గృహచరన్‌, మృగనాభి సౌరభ్య నిర్భరములు
ప్రఖరాఖు నఖర ధారా విదీర్ణోద్గీర్ణ, సౌవర్ణమృత్కీర్ణ జాంగలములు

కోక కలహంస ముఖరితాబ్జాకరములు
సిద్ధ చారణ గంధర్వ సేవితములు
మందర ద్రోణిఁ గొన్ని గ్రామములు కూర్మి
తనయ పసువున కొసఁగె గంధర్వవిభుఁడు.

కాలి బొటనవేలితో కొంచెం పెళ్ళగించినా బయటపడే రత్నముల గనులున్న వీధులకు నిలయమైనవి, మత్తును సంతోషాన్ని కలిగించే మేలైన మద్యమునిచ్చే, దేవేంద్రుని  కల్పవ్రుక్షములవంటి  వృక్షములు కలిగిన ఇంటి తోటలు కలిగినవి , స్త్రీలు,పిల్లలు కూడా తేలిగ్గా తీసుకుని, అలంకరించుకుని, పరిమళములను వెలువరిస్తున్న, కస్తూరిని కలిగిన మృగములు విచ్చలవిడిగా సంచరిస్తున్న ఇళ్ళు కలిగినవి, ఎలుకలు గోళ్ళతో ముట్టెలతో త్రవ్వినా బంగారపు మట్టి గుట్టలు గుట్టలుగా వెలువడే మెట్ట భూములున్నవి,  చక్రవాకాలు, కలహంసలు చేస్తున్న ధ్వనులతో నిండిన కొలనులు కలిగినవి, సిద్ధులు, చారణులు, గంధర్వులు నివసిస్తున్నవి ఐన మంధరగిరి లోయలోని కొన్ని గ్రామాలను తన కుమార్తెకు ప్రేమతో ‘పసుపు కుంకుమకింద’  ఇచ్చాడు గంధర్వరాజైన ఇందీవరాక్షుడు. 

పౌరయాత్రిక సుర సిద్ధ చారణాహి
యక్ష గంధర్వ సాధ్య విద్యాధరులను
నిజపురంబుల కనిచె నిందీవరాక్షుఁ
డుడుగర లొసంగి విభవంబు గడలుకొనఁగ.

ఆ తర్వాత తమతమ పురములకు ప్రయాణమైన దేవతలకు, సిద్ధులకు, చారణులకు, నాగులకు, యక్షులకు, గంధర్వులకు, సాధ్యులకు, విద్యాధరులకు తన వైభవం ప్రసిద్ధికెక్కేలా కానుకలనిచ్చి పంపాడు ఇందీవరాక్షుడు. 

అతులక్షాంతిగభీర! భీరహితచిత్తాంభోజ! భోజక్షమాపతివిద్యాపరిపాక!
పాకరిపుశుంభద్భోగ! భోగాశిపత్రితరస్స్ఫూర్త్యను
భావ! భావభరిత శ్రీకాంత! కాంతారపా
తితకాళింగకులేశ! లేశతరవృత్తి క్షీణవైరివ్రజా!

సాటిలేని క్షమాగుణంతో లోతైన హృదయమును కలిగినవాడా, భయములేని హృదయ కమలము కలిగినవాడా, భోజమాహారాజులా విద్యా ప్రౌఢి కలిగినవాడా, దేవేంద్రునిలా భోగములను కలిగినవాడా, సర్పాహారి ఐన గరుత్మంతునివంటి స్ఫూర్తి, వడి, ఓజస్సు, తేజస్సు కలిగినవాడా, శ్రీ కాంతునితో చింతనతో నిండిన మనసు కలిగినవాడా, కళింగ రాజును అడవులపాలు చేసినవాడా, శత్రువులకు బ్రతుకుతెరువు లేశము కూడా లేకుండా చేసిన శత్రుభీకరా! శ్రీకృష్ణ దేవరాయా!

నాగాంబాసుత! జితకద
నాగత మదనాగ సంగమానూప గృహా
భోగా! భోగ పురందర!
భోగీంద్ర శయాన పురుష పూజా ప్రవణా!

నాగాంబా కుమారుడా!  యుద్ధాలలో జయించి తెచ్చిన ఏనుగులు స్రవించిన మదజలముతో ఊటనేలగా మారిన గృహభాగము కలిగినవాడా! (జితకదనాగత మదనాగ సంగమానూప గృహాభోగా! మదనకదనానికివచ్చిన ‘మదనాగ’ అంటే మదించినస్త్రీలనుసంగమించి రతికేళిలో జయించిన, మదజలంతో నిండిన, చిత్తడి ఐన గృహమును కలిగినవాడా అని కూడా ధ్వనిస్తున్నాడు పెద్దన అని వ్యాసకర్త అభిప్రాయం)  భోగములలో ఇంద్రునివంటి వాడా! శేషశయ్యపై పవ్వళించే విష్ణువును పూజించడంలో దురంధరుడా,

వైష్ణవాగ్రేసరుడా! శ్రీకృష్ణ దేవరాయా! 
సరభస జయసరభస జయధాటీ చండ వేదండకోటీ
కరవమథు హిమానీ కంపితాశా వధూటీ
పరమహిత హసంతీ భావ భాగ్భూరితేజః
పరుష దహనకీలా ప్రస్ఫుర చ్ఛక్రవాళా!

జయకాంక్షా ధాటితో వేగముగా జైత్రయాత్రకు వెళ్తున్న ఏనుగుల తొండపు తుంపరలకు తడిసి వణుకుతున్న నలుదిక్కులు అనే స్త్రీల ‘చలి’ని నీ ఆరని ప్రతాపాగ్ని అనే కుంపటి వెచ్చదనంతో దూరం చేసినవాడా!  దిక్కులకు వ్యాపించిన ఆరని ప్రతాపజ్వాలలను కలిగినవాడా! శ్రీకృష్ణ దేవరాయా!  ‘ఇది శ్రీమదాంధ్ర కవితా పితామహుడు, సర్వాతోముఖవిద్యావిలాసుడు, పంకజాక్ష పాదారవిందమునకు అధీనమైన మానసుడు, నందవరపుర వంశపావనుడు, శఠకోపముని దయాప్రసాదంగా లభించిన వెన్నెలలు కురిసే చతుర్విధ కవితారీతుల పూల తీగ, అల్లసాని చొక్కయామాత్రుని పుత్రుడు, అల్లసాని పెద్దనార్యుడు అని పిలువబడే నాచే విరచితమైన ‘స్వారోచిష మనుసంభవము’ అనే మహాప్రబంధమునందు పంచమాశ్వాసము’ అని సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణ దేవరాయలను శ్రోతగా చేసుకుని వినిపిస్తున్న పెద్దన మనుచరిత్రములో ఐదవ ఆశ్వాసాన్ని ముగించాడు.  

  (కొనసాగింపు వచ్చేవారం)

***వనం వేంకట వరప్రసాదరావు 

మరిన్ని శీర్షికలు
Curd Rice