Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cinechuraka

ఈ సంచికలో >> సినిమా >>

సిరాశ్రీ "సైమా" కబుర్లు

వృత్తి పరంగా, వ్యాపార పరంగా విదేశాలు తిరిగినా ఎందుకో ఎప్పుడూ ఆ సంగతుల్ని అక్షరబధ్ధం చేయాలనిపించేంత స్పూర్తి కలుగలేదు. ఒక్కోసారి కలిగినా ఖాళీ దొరకలేదు. ఇప్పుడు మాత్రం ఖాళీ చేసుకుని, స్మృతిపథం నుంచి దూరం కాకముందే తాజాగా ఉన్న నా మలేషియా సంగతులు అక్షర బధ్ధం చేయడానికి పూనుకున్నాను. 
సైమా (సౌత్ ఇండియన్ ఇంటెర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుకలు గత కొన్నేళ్లుగా దక్షిణ భారత సినీ పరిశ్రమలకి ఒక పండుగగా కొనసాగుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమలకు చెందిన దిగ్గజాలందరూ దీనినొక పెద్ద పండుగగా చూస్తున్నారు, పిలవగానే విచ్చేస్తున్నారు, సత్కారాలు స్వీకరిస్తున్నారు, సన్మానాలు చేస్తున్నారు, వేదికపై విశేషమైన ప్రదర్శనలు ఇస్తున్నారు. అనతి కాలంలో ఈ సైమా ఇంత ఖ్యాతి పొందడానికి కారణం ఈ వేడుకలను విదేశాల్లోనే నిర్వహించాలనే ఆలోచన. ఆ ఆలోచనకు రూపశిల్పి విష్ణు ఇందూరి- మన తెలుగువాడు. అందుకే గోతెలుగులో సైమా కబుర్లు చెప్పడం సమంజసం అనిపించింది. 
 
దేశంలో అనేక సినీ పురస్కార మహోత్సవాలు జరుగుతుంటాయి. జాతీయ పురస్కారాలు, నంది వంటి ప్రభుత్వ పురస్కారాలు తీసి పక్కన పెడితే, అత్యంత ఘనంగా జరిపే ప్రైవేట్ అవార్డు మహోత్సవం ఫిల్మ్ ఫేర్. దానికన్నా భిన్నంగా ఏదైనా కొత్తగా చేయాలి, నలుగురి దృష్టీ ఆకర్షించాలి అంటే ముందు ఆలోచన సరైనది పుట్టాలి. ప్రతి ఏడు ఒక్కో దేశంలో సైమా వేడుకలు నిర్వహించుకుంటూ వెళ్లాలనేది గొప్ప ఆలోచన మాత్రమే కాదు, చాలా ఖర్చుతో కూడింది కూడా. ఆలోచన బాగున్నా, ఆచరణలోకి తీసుకురావడానికి మంది, మార్బలం సంగతి ఎలా ఉన్నా మనోబలం కావాలి, స్పాన్సర్స్ ని ఒప్పించే లౌక్యం ఉండాలి, స్టార్స్ ని మెప్పించే తెలివి, తేజస్సు ఉండాలి. అవన్నీ విష్ణు ఇందూరిలో ఉన్నాయి కాబట్టే అప్రతిహతంగా సైమా ఏటేటా విదేశాల్లో ఢంకా మోగిస్తోంది. పోయినేడాది షార్జాలో జరిపారు. అప్పుడు నన్ను తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక గెస్ట్ గా ఆహ్వానించారు. ఈ సారి (సెప్టెంబర్ 12,13,14) మలేషియాలో జరిపారు. మళ్ళీ ఆహ్వానించారు. 
 
 మాటల్లో మాటగా ఈ విషయం చెప్తే నా మిత్రుడు కళామందిర్ అధినేత కల్యాణ్, "అక్కడ మన కారు, డ్రైవరు, బంగళా ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు వాడుకోండి" అని డ్రైవర్ నంబరు కూడా ఇవ్వడం జరిగింది. అన్నట్టు కల్యాణ్ అండ్ కంపెనీ ఈ మధ్య అక్కడొక వ్యవసాయానికి సంబంధించిన పెద్ద వ్యాపారం మొదలు పెట్టారు. 
 
ఇక సైమా విషయానికి వస్తే, సెప్టెంబర్ 11 రాత్రి నాలుగు సినీ రంగాలకి చెందిన పురస్కార గ్రహీతలు, నిర్వాహకులు, స్టార్స్, అతిథులు కలిపి సుమారు 450 మందిని మలేషియాకు ఎగరేసుకుని తీసుకుపోయారు. మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానం అంతా ఒక పండుగ వాతావరణం సంతరించుకుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తెలుగు సినీ పరిశ్రమకు చెందినవారమంతా ఉదయం 7:30 కి కౌలా లంపూర్ చేరుకున్నాం. 
 
నాకున్న అలవాటుగా, ఎయిర్ పోర్టులో లోకల్ సిం తీసుకున్నాను. "ఇంటికి ఫోన్ చేసి క్షేమంగా దిగిన వార్త చెప్పుట" అనే ముఖ్యమైన పని పూర్తి చేసి ఎక్సిట్ గేట్ వైపుకు వచ్చాను. ఎయిర్ పోర్ట్ నుంచి ఆతిథ్యం మొదలు. దిగినవారిని దిగినట్టు సైమా టీ షర్ట్స్ వేసుకున్న డ్రైవర్లు కార్లలో ఎక్కించుకుని నేరుగా రినైసాన్స్ హోటల్ కి చేర్చారు. అది మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో అత్యున్నత శ్రేణికి చెందిన స్టార్ హోటల్. మహామహులైన చిరంజీవి గారి దగ్గర నుంచి, దేవీ శ్రీ ప్రసాద్, శివ రాజ్ కుమార్, బ్రహ్మానందం, శింబు, సునీల్ వంటి హేమాహేమీల దగ్గర్నుంచి, తెరమీద దేదీప్యమానంగా వెలిగే శ్రీదేవి, ఖుష్బూ, రాధిక, అమలా పాల్, రెజీనా, త్రిష, ప్రణీత, కృతీ కర్బందా, శ్రీయ, అదా శర్మా, లక్ష్మీ ప్రసన్న వంటి నటీమణుల నుంచి నా బోటి వాడి వరకు అందరికీ ఆ హోటల్ లోనే మకాం. 
 
రిసెప్షన్ దగ్గర ఎంతో మర్యాదగా ఆ హోటల్ సిబ్బంది, సైమా నిర్వాహకులు మాకు కొన్ని పేపర్స్ ఇచ్చారు. ఏ పూట ఎన్ని గంటలకి ఎక్కడకు చేరుకోవాలి, బ్రేక్ ఫాస్ట్ కి, లంచ్ కి అంత పెద్ద హోటల్ లో ఏ ఫ్లోర్ లోకి ఎప్పుడు చేరుకొవాలి వంటి వివరాలతో పాటు, ఏ అవసరమొచ్చినా సంప్రదించడానికి కొన్ని పేర్లు, ఫోన్ నంబర్లు కూడా అందులో ఉన్నాయి. ఆ పేపర్స్ తో పాటు రూం కీ కార్డ్ కూడా ఇచ్చి, కూడా ఒక మనిషిని పంపారు. రూం లోకి వెళ్ళి చూస్తే అందమైన ఇంటీరియర్స్ తో అతి మనోహరంగా ఉంది. కెర్టెన్ తీసి చూస్తే నిలువెత్తు పెట్రొనాస్ టవర్స్ దృశ్యం. ఏ టవర్స్ చూడడానికైతే మలేషియాకి వస్తారో ఆ టవర్స్ కి 5 నిమిషాల నడక దూరంలో ఈ హోటల్. అద్భుతం అనిపించింది. సామాను పెట్టేసి నా కూడ వచ్చినతను "పెంగినపన్ గెంబిరా" అనేసి వెళ్ళిపోయాడు. ఏదో మలయ్ భాషలో అన్నాడని అర్థమయ్యింది. అర్థం అడిగే లోపు వెళ్లిపోయాడు. అతనేమన్నాడో, నాకు ఏమి వినిపించిందో అనుకుంటూనే అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామని నా ఐప్యాడ్ తీసాను. వెంటనే వైఫై కూడా పనిచేసింది. "పెంగినపన్ గెంబిరా" అని గూగుల్ ట్రాన్స్ లేషన్ లో ఎంటర్ చేయగానే "స్టే హ్యాపీ" అని వచ్చింది. సో, అతను అనాల్సిందే అన్నాడు, నేను సరిగ్గానే విన్నాను అని అర్థమయ్యింది. 
 
 
కాసేపు కునుకు తీసాక రెడీ అయ్యి నాకిచ్చిన షెడ్యూల్ పేపర్స్ లో లంచ్ కి ఎక్కడికెళ్లాలో చూసుకుని వెళ్లాను. అక్కడకి కొందరు తానా సభ్యులు, తానాలో కీలక పదవుల్లో ఉన్నవారు కూడా వచ్చారు. అందులో నా కాలేజ్ మిత్రులు కూడా ఉండడంతో నామటుకు నాకు ఈ సినీ వేడుక ఒక కాలేజ్ సంబరంగా కూడా మారింది. లంచ్ పూర్తయ్యాక అఫీషియల్ ఎటైర్ లో సాయంత్రం 5 గంటలకు రెసెప్షన్ దగ్గర అసెంబిల్ అయ్యాం. కార్ కి ముగ్గురు చొప్పున అందర్నీ నెగరా స్టేడియం కు తీసుకెళ్ళారు. ఎన్ని కార్లో, ఎన్ని ట్రిప్పులో ఊహించుకోవడమే తప్ప లెక్క పెట్టే శక్తి ఎవరికీ లేదు.
స్టేడియం కి చేరుకోగానే అంతా కోలాహలం. తెలుగు, మలయాళ సినీ సందడి. ఆ సాయంత్రం ఆ రెండు రంగాల సినిమాలకూ పురస్కార ప్రదానోత్సవం. ఆ వివరాలన్నీ రాయాలంటే ఈ వ్యాసంలో పట్టవు. పైగా నిర్వాహకులు ఆ కార్యక్రమ ప్రసార హక్కులు ఒక టీవీ చానల్ కి ఇవ్వడం జరిగింది. కనుక ఇక్కడ లీక్ చేస్తే నేను ప్రమాదంలో పడొచ్చు. కనుక ఆ రసరమ్యమైన ఘట్టాన్ని దాటేసి ముందుకెళ్తే, వేడుక ముగిసేటప్పటికి రాత్రి 12 అయ్యింది. రెనైసాన్స్ లో 1 గంటకి విందు. నిద్రపోయి ఉదయం లేచేటప్పటికి 11 అయ్యింది. సైమా నిర్వాహకుల్ని సైట్ సీయింగ్ అని అడగడం కంటే కళామందిర్ కళ్యాణ్ ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేయడం బెటర్ అనిపించింది. లేకపోతే కల్యాణ్ ఫీల్ అయ్యే అవకాశం ఉందన్న ఏకైక ఉద్దేశ్యంతో. వెంటనే డ్రైవర్ కరీం కి ఫొన్ చేశా. ఎక్కడున్నానో చెప్పా. అరగంటలో కారుతో ప్రత్యక్షం అయిపోయాడు అతను.
 
నేను, నా తానా మిత్రులతో కలిసి "బటు కేవ్స్" కి తీసుకెళ్లమన్నాను. అక్కడ పెద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉంటుందని మాత్రమే నాకు తెల్సు. చాలా సినిమాల్లో చూసాను కనుక. అక్కడకు వెళ్లి, ఆకాశన్నంటే ఆ విగ్రహం చూసి, ఆనందం తీరేలాగ ఎండలో మెట్లు ఎక్కడం మొదలు పెట్టాం. దార్లో కోతులు. వాటిని చూసాక భయంతో కూడిన సరదా వలన వచ్చిన ఆయాసంతో మొత్తానికి 272 మెట్లు ఎక్కి పై దాకా చేరాం. కింద షార్ట్స్ లో కనిపించిన చాలా మంది విదేశీ మహిళలు పైన నడుముకి లుంగీ లాంటిది చుట్టుకుని కనిపించారు. ఎందుకో అర్థం కాలేదు. ఇక బటు కేవ్స్ ఒక ప్రాకృతిక అద్భుతం.
అది చూసి అనుభవించాలి తప్ప వివరిస్తే అర్థమయ్యేది కాదు. కాసేపు అక్కడ అలసట తీర్చుకుని మళ్లీ కిందకు బయలుదేరాం. ఈ సారి కోతుల్ని కాస్త జాగ్రత్తగ కనిపెట్టుకుంటూ...! కింద దాకా వచ్చాక అక్కడ షార్ట్స్ లో ఉన్న మహిళలకి లుంగీలు అద్దెకిస్తున్నారు. అద్దె 1 రింగిట్. ఆ మెట్ల పైకి షార్ట్స్ లో ఎక్కకూడదని అక్కడి నియమం. అదన్నమాట సంగతి అనుకున్నాం. 
అక్కడి నుంచి జెంటింగ్ చాలా బాగుంటుందని, అక్కడకు వెళ్దామన్నాడు మాలో ఒకడు. అది చాలా దూరమని, వెళ్తే రాత్రి ఈవెంట్ కి చేరుకోలేరని చెప్పాడు డ్రైవర్ కరీం. మరి ఎక్కడికి వెళ్దాం అనుకునే లోపు హోటల్ లో ఉన్న కొందరు మిత్రులు ఫలానా చోటుకి రమ్మనమని నా తానా మిత్రుడు జయ నారాయణ్ కి ఫోన్ చేసి చెప్పారు. ఎక్కడికో మాకు చెప్పకుండా డ్రైవర్ ని అక్కడికి తీసుకెళ్లమని చెప్పాడు జయ. అందరం బయలు దేరాం. ఒక అరగంట ప్రయాణం అయ్యాక కారు ఆగింది. అదొక సినిమా హాల్. పవర్ సినిమా పోస్టర్ కనిపించింది. ఆ రోజే ఆ సినిమా అక్కడ రిలీజ్. మేమందరం, సుమారు 11 మంది లోపలికి వెళ్లాం. థియేటర్ ఫుల్. మాతో పవర్ లో ఒక హీరోయిన్ రెజినా కూడా ఇంటర్వెల్ టైం కి చేరుకుంది. థియేటర్లో మలేషియా తెలుగు ప్రేక్షకులంతా ఆమెను చప్పట్లతో స్వాగతించారు. రెజినా తనకు తానుగా ముందున్న స్టేజ్ ఎక్కి రెండు నిమిషాలు ప్రేక్షకులతో ముచ్చటించింది. చాలా డైనమిక్ అండ్ ప్రో ఆక్టివ్ అనిపించింది. సెకండ్ హాఫ్ చూసింది. ఏదేమైనా మలేషియాలో తెలుగు సినిమా చూడడం- అదో అనుభూతి. 
 
ఇక నెమ్మదిగా హోటల్ చేరుకుని రెండో రోజు వేడుకకి సిధ్ధం అయ్యాం. అంతా షరా మామూలే. అదే వేదిక. అయితే కన్నడ, తమిళ ప్రముఖులతో, ప్రేక్షకులతో కళకళలాడిపోయింది స్టేడియం. మలేషియాలో తెలుగు వారి కంటే తమిళులు ఎక్కువుండడం వల్ల థియేటర్ లో ఇసుకేస్తే రాలని జనం. ఆహ్వానితులు తప్ప, మిగతా అందరూ పాస్ లు కొనుక్కుని వచ్చినవారే. 
 
ఆ వేడుక కూడా రాత్రి 12 కి ముగిసింది. అక్కడి నుంచి, పెట్రోనాస్ కి ఆనుకును ఉన్న కె ఎల్ సి సి టవర్లో 57 వ అంతస్తులో పార్టీ, విందు. తెల్లవారు జాము ఐదింటిదాకా నడిచింది. ఇక మేము నడిచే టైం అయ్యిందని అర్థమయ్యింది. కిందకు దిగి, సర్దాగా నడుచుకుంటూ హోటల్ కి వెళ్ళాం. నిద్రపోయి మధ్యాహ్నం 1 కి నిద్ర లేచాం. 
 
అది 14 వ తేదీ. ఇక తిరుగు ప్రయాణం అయ్యే రోజు అన్నమాట. రెడీ అయ్యి నేరుగా బ్రంచ్ (బ్రేక్ ఫాస్ట్ + లంచ్) పార్టీ కి వేళ్లాం. 4 వ ఫ్లోర్ లో స్విమ్మింగ్ పూల్  లో ఏర్పాటు చేసారు. అది 4 గంటల వరకూ సాగింది. ఆ కార్యక్రమం ముగిసాక మిత్రులతో కలిసి కాసేపు చైనా టౌన్ లో తిరిగాం. అది ఒక పెద్ద షాపింగ్ ఏరియా. సంతకి ఎక్కువ, సుల్తాన్ బజార్ కి తక్కువ అన్నట్టు ఉంటుంది. విదేశం కాబట్టి అలాంటి చోటు కూడా గొప్పగానే ఆనుతుంది. అది చూస్తే తప్ప తెలీదు. ఒక గంట తిరిగి మళ్లీ క్యాబ్ లో హోటల్ కి వచ్చాం. 7 గంటలకి ఎసెంబుల్ అయ్యాం. నేను, దర్శకులు శ్రీ మారుతి, తానా ప్రముఖులు శ్రీ వాసుదేవ రెడ్డి బయలుదేరితే గంటలో ఎయిర్ పోర్ట్ లో దించారు. యధా ప్రకారం కాసేపు ఎయిర్ పోర్ట్ షాపింగ్ కూడా జరిగింది. ఫ్లైట్ లో రాణా, నవదీప్, సునీల్, సందీప్ కిషన్, భూపాల్ రాజు, ఉయ్యాల జంపాల హీరో రాజ్ తరుణ్, అనంత్ శ్రీరాం, సుధీర్ బాబు, నిర్మాత శరద్ మరార్ అందరం ఒకే చోట కూర్చుని ఫ్లైట్ దిగే వరకు కబుర్లతో, జోకులతో సందడి చేసుకున్నాం. భారత కాలమానం ప్రకారం 12 కి అందరం హైదరాబాద్ చేరాం. 
 
 ఎంతటి సినీ ప్రముఖులకైనా ఇది చాలా అపురూపమైన, అరుదైన అవకాశం. నేను చెప్పిన విషయాలు నాకు అనుభవంలోకి వచ్చినవి మాత్రమే. ఇలా 450 మంది ఆహ్వానితుల అనుభవాలు ఇంకెన్నో. ఇలా ఈ సైమా కి వచ్చి కౌలాలంపూర్ నుంచి చెన్నై వెళ్లిన తమిళ సినీ ప్రముఖుల కబుర్లు, కొచ్చిన్ చేరిన మలయాళ సినీ జనుల సంగతులు, బెంగళూరులో దిగిన కన్నడ కళాకారుల విశేషాలు ఇంకెన్ని ఉంటాయో. అందరూ అన్నీ రాస్తే ఒక గ్రంథం అవుతుంది. అనుభవాల్ని ఇలా అక్షరాల్లో పెట్టడంలో ఒక తాదాత్మ్యం తప్పకుండా ఉంటుంది. 
 
ఈ సైమా కి వచ్చిన ఎవరికైనా ప్రస్తుతం మనసులో మెదిలే ప్రశ్న ఒక్కటే- "వచ్చే ఏడు సైమా ఎక్కడో?!" 
 

-సిరాశ్రీ

మరిన్ని సినిమా కబుర్లు
current