Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

మేఘన

జరిగిన కథ : పేషెంట్లను చూడడం పూర్తయిన డా.హరి ఆకలితో భోజనానికి సిద్దమౌతుండగా ఎవరో కొత్త పేషెంట్ వచ్చినట్టు చెబుతుంది రిసెప్షనిస్ట్. రెండుచేతుల మణికట్ల మీదా, మెడ మీదా నల్లని చారలు చూపిస్తుందామె. ఆయింట్ మెంట్ రాసిచ్చి తగ్గిపోతుందని చెప్తాడు ఆమెకు.......................

     ...........................ఆ తర్వాత

ఐనా గానీ, అప్పటికే చీకట్లు కమ్ముకున్నాయి..
ధారగా వర్షం కురుస్తున్నది. వీధి దీపాలు వెలగ డం  లేదు... ఇంతలో ఒక పెద్ద ఇనుపగోళం బడబడా.. దడదడా మంటూ పెద్ద ధ్వనితో ప్రతి ధ్వనితో ఆకాశం నుండి జారుతూ, మేఘాలను చీల్చుకుంటూ... భూమి వైపు ప్రయాణం చేస్తున్నది.

భూమి మీద ఉన్న వారికెవరికైనా ఇట్టే అర్థం అయిపోతుంది. ఆ పెద్ద గోళం కాసేపట్లో భూమిపై పడబోతోందని.

ఆ వాతావరణంలో కారు నడుపుతున్న హరికి ఈ గోళమేదో తననే తరుముతున్నట్లుగానూ, తనపై పగబట్టి, తన కారుపైనే పడబోతున్నట్లు గానూ, అకస్మాత్తుగా అనిపించింది. వెన్నెముకలో నుండి చలిపుట్టుకువచ్చి, శరీరం చిగురుటాకులా కంపించనారంభించింది.

ప్రాణ భయం గుండెను నలిపేసి, గొంతును పిసికేస్తుండగా, అప్రయత్నంగా... పెద్ద గొంతుకతో.. ‘‘అర్జునా... ఫల్గుణా... కిరీటీ... రక్షించు తండ్రీ’’ అంటూ బిగ్గరగా అరిచాడు.

ఈలోపు ఉరుముతో కూడిన పిడుగు పడనే పడిరది.

కనుచూపు మేరలో రోడ్డుపక్కనే ఉన్న పెద్ద భూతాల మర్రిచెట్టు, దేవేంద్రుని వజ్రాయుధంతో బలంగా నిలువునా నరికినట్లుగా నిట్టనిలువుగా చీలిపోయి, భగ్గు భగ్గుమంటూ రావణకాష్టంలా కాలిపోనారంభించింది.

గుండె గుభేలుమంది హరికి.. కొద్దిగా అటూఇటూ అయి ఉంటే..? నాయనమ్మ మాటలు గుర్తొచ్చాయి.

అర్జునుడు ఆకాశంతో రథంపై వెళ్తుండగా అనుకోకుండా రథచక్రం యొక్క చీల (బోల్టు) ఎక్కడో జారి పడిపోతుంది. ఆ సమయంలో అర్జునుని రథచక్రం చేసే శబ్దమే ఉరుము ఆ చీల (బోల్టు) నేల మీద ఎక్కడ పడితే అదే పిడుగు. అర్జునుడికి గల మారు పేర్లు ఫల్గుణుడు, కిరీటి.. ఆ అర్జునుడిని వేడుకుంటే మనలను రక్షిస్తాడు.‘‘నిజంగానే రక్షించావు అర్జునా’’ పైకే గట్టిగా అన్నాడు.

‘‘ఈ రఘుగాడు ‘కరీంనగర్‌’లో ఇల్లు కట్టనేల? ఈ రోజే గృహ ప్రవేశం పెట్టుకోనేల? సాయంత్రం ఏడిరటికి బయల్దేరినా ఫర్వాలేదు పదిగంటలకల్లా వచ్చేస్తావు అని నన్ను పిలవనేల? పిలిచాడు పో.. నేను బయల్దేరనేల? ఈ భయంకర వాతావరణంలో ఒంటిరిగా చిక్కుకోనేల? అసలివ్వాళ చేరగలనా?

ఎంత దూరం వచ్చాను? ఇంకెంత దూరం ఉంది? ఒక మాదిరి వేగంతో కారు నడుపుతూ పరి పరి విధాలా వాపోతున్నాడు హరి.ఇంతలో.. చిత్రవిచిత్రమైన శబ్దాలు చేస్తూ... కుదుపుల మీద కుదుపు లివ్వడం మొదలుపెట్టింది కారు.

ఇదేదో చతికిలబడేలా ఉందే... అని అనుమానించి, వెనుక వచ్చే వాహనాలకు అడ్డు లేకుండా డ్రైవ్‌చేయడం మొదలుపెట్టాడు. ఊహించినట్టుగానే కాస్త దూరం పరిగెట్టి ఒక పెద్ద జర్క్‌ఇచ్చి ఆగిపోయింది కారు.

కురుస్తున్న వర్షంలోనే కారు దిగి, బోనెట్‌తెరచి, తోచిన మంత్రాలన్నీ వేసాడు. ఎన్నిసార్లు స్టార్ట్‌చేసినా స్టార్ట్‌కాకుండా మొరాయించింది కాదు. నువ్వెన్ని మంత్రాలు వేసినా నేను లొంగను అన్నట్టుగా బైఠాయించింది.

‘‘పొద్దునే కదా షెడ్‌కు వెళ్లి వచ్చింది? వోల్క్స్‌వేగనో, ఫోల్క్స్‌వేగనో... దీని పేరు తగలెయ్య.. జర్మన్‌కారంట, టెక్నాలజీకి జర్మనీ పెట్టింది పేరంట.. పైగా కొత్త కారు... దీనికేం పోయేకాలం? ఈ సర్వీసింగ్‌సెంటర్ల వాళ్లని నమ్మకూడదు.. అంతా పర్‌ఫెక్ట్‌అంటారు, వేలకు వేలు బిల్లు వేస్తారు..

తీరా చూస్తే కారు బాగుపడిరదో లేదో ఆ దేవుడికే ఎరుక.

అందుకనేమో... ఈ సర్వీసింగ్‌సెంటర్‌వాళ్ల బాధ పడలేక ఒళ్ళుమండి, విసిగిపోయి, కోటి రూపాయలకు పైగా విలువచేసే కొత్త కారును పబ్లిగ్గా పెట్రోలు పోసి తగలబెట్టాడంట ఒక చైనా వాడు. ఈ మధ్యనే హైదరాబాద్‌లో ‘బెంజ్‌’ కంపెనీ వాళ్ళు కూడా సర్వీసింగు పొడిచింది లేకపోగాఅన్యాయంగా వేలకు వేలు సర్వీసింగు పేరుతో గుంజుతున్నారని పేపర్లన్నీ కోడైకూసాయి. వెధవలు... వెధవలు’’ తిట్టుకుంటూనే గ్లోవ్‌బాక్స్‌లోంచి ఆల్‌రెడీ మిక్స్‌చేసి ఉన్న విస్కీ బాటిల్‌తీసి నాలుగు గుక్కలు గుటుక్కున మింగి, సిగరెట్‌వెలిగించాడు. కొంచం వెచ్చగా, కంఫర్టబుల్‌గా అనిపించింది. మనసులోని ఆందోళన కొద్దిగా నెమ్మదించింది. వర్షం సన్నగా, ధారగా కురుస్తూనే ఉన్నది. అసలు ఈ ఏరియా ఏమిటి? ఎక్కడ వరకూ వచ్చానో తెలుసుకుందామని అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టాడు.

అంతలోనే ఏదో బురదలో కాలు పెట్టి పీకలదాకా కూరుకుపోయినట్లనిపించింది. బట్టలనీ బురద.. తల తడవకుండా కాపాడుకుంటూ వేసుకున్న జర్కినుకున్న టోపీని బైటికి లాగి నెత్తిమీద కప్పుకున్నాడు. ఏదో జరిగింది... ఏం జరిగిందో తెలియడం లేదు... ఏదో ఆందోళన... మళ్లీ కారు దగ్గరకు వచ్చి, విస్కీ బాటిల్‌తీసి గొంతులోకి వంపుకున్నాడు... అంతకు ముందు వెలిగించిన సిగరెట్‌పూర్తిగా తాగిన గుర్తు లేదు... వర్షానికి తడిసిపోయిందేమో అనుకుంటూ మళ్లీ సిగరెట్‌వెలిగించి గుండెల నిండా దమ్ములాగాడు. విస్కీ బాటిల్‌ను జేబులోనే పెట్టుకున్నాడు. వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తూనే ఉంది.

ఏవైనా వెళ్లే పోయే వాహనాలను ఆపుదామని రోడ్‌మీదకు వచ్చి ఎంతసేపు చూసినా లాభం లేకపోవడంతో కారు దగ్గరకు తిరిగి వస్తూ చుట్టూ చూసాడు... మసక మసకగా ఉంది. ఏమీ కనబడటం లేదు.

అదే సమయంలో... ఆకాశలో ఒక్కసారిగా ఉరుముతో కూడిన మెరుపు మెరిసింది.

ఆ మెరుపు వెల్తురులో...

క్షణకాలం ఒక స్త్రీ ఆకారం తళుక్కుమని మెరిసి మాయమైపోయింది.

భ్రమా... నిజమా...? నిశ్చేష్టుడైపోయాడు హరి.

వర్షానికి తడిసిపోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ పీలుస్తున్న సిగరెట్‌ని విసిరిపారేసాడు హరి. లైటు కావాలి... తనకు కనిపించింది నిజమేనా..? కళ్ళు చికిలించి చూసినా ఏమీ కనబడటం లేదు. ఇంతలో గుర్తొచ్చింది... సెల్‌ఫోన్‌... అరే.. అనవసరంగా ఇన్ని తిప్పలు పడకపోతే, ఒక్క కాల్‌చేసి ఉంటే రఘు వచ్చి పికప్‌చేసుకునే వాడు కదా... తనకు తానే తిట్టుకుంటూ జేబులోంచి సెల్‌ఫోన్‌తీసాడు. సెల్‌టవర్‌‘జీరో’ చూపిస్తున్నది... అదృష్టవశాత్తూ సెల్‌ఫోన్‌ఆన్‌అయ్యి లైట్‌వస్తున్నది. ఆ లైటు వెల్తురులోనే చుట్టూ చూడటానికి ప్రయత్నించాడు.

దూరంగా ఒక లైటు... బాటరీ లైట్‌లా ఉంది...

నిదానంగా... తనవైపే వస్తున్నది...

ఇంతలో సెల్‌లైట్‌ఆగిపోయింది. మళ్లీ ఆన్‌చేసాడు... సెల్‌ఫోన్‌వెల్తురులో కళ్ళు చికిలించి చూసాడు...

ఎవరో... బాటరీ లైట్‌పట్టుకుని తనవైపే వస్తున్నారు... మనిషి కనబడటం లేదు పూర్తిగా... కానీ... చూచాయగా... ఆడ మనిషి అని తెలుస్తున్నది... కొరివి దయ్యం కాదు కదా...?

నెమ్మదిగా... ఆ ఆకారం హరిని సమీపించింది...

లైటు హరి మీదకు ఫోకస్‌చేస్తూ...

‘‘ఎవరండీ మీరు? ఈ సమయంలో, ఇక్కడ ఏమి చేస్తున్నారు?’’ అంటూ ప్రశ్నించింది.

ఈ స్వరమెక్కడో విన్నట్టుందే... అనుకుంటూ ఆరిపోయిన సెల్‌లైట్‌ని మళ్లీ వెలిగించి ఆ ఆకారం మీదకు ఫోకస్‌చేసాడు...

‘‘మేఘన గారూ... మీరా...?’’

‘‘డాక్టర్‌గారూ... మీరా...?’’

‘‘ఈ సమయంలో మీరిక్కడ..?’’

ఆశ్చర్యంతో ఒకరినొకరి పలకరించుకున్నారు. తను ఏ విధంగా ఆ ప్రాంతంలో చిక్కుకున్నాడో ఆమెకు వివరించాడు హరి.

‘‘మీరెలా..? ఇక్కడ? వెరీ సర్‌ప్రైజింగ్‌..!’’ అన్నాడు

‘‘మా ఇంటికి మీరొచ్చి సర్‌ప్రైజింగ్‌అంటారేమిటి?’’

‘‘మీ ఇల్లా...! ఇక్కడా..!’’

‘‘డాక్టర్‌గారూ... మీరెక్కడున్నదీ మీకు తెలియడం లేదు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్లున్నారు... అదిగో... కూతవేటు దూరంలో కరీంనగర్‌... ఊరి చివర మా ఇల్లు... అంటే... మా పిన్నమ్మ గారిల్లు... మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో కరీంనగర్‌వెళ్లలేరు... కరెంటు కూడా లేదు... ఎప్పుడొస్తుందో తెలియదు.. వర్షం కురవడం మొదలుకాగానే కరంటు తీసేస్తారు... ప్రమాదాలు జరుగుతాయనే భయమో లేక నెపమో...? మీరీపూట ఇక్కడే ఉండి, రేపు ఉదయాన్నే వెళ్లడం మంచిది... బాగా తడిసి ఉన్నారు... తరువాత మీ ఇష్టం...’’ అంటూనే గిరుక్కున వెనుదిరిగి, వడి వడిగా అడుగులు వేయడం ప్రారంభించింది మేఘన.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti