Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
meghana

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి...

జరిగిన కథ : రైల్వేస్టేషన్ ముందు విరాట్ చేయి పట్టుకున్న విశాలను విడిపించుకుని ట్రైన్ లో ఎక్కిన విరాట్ కి ఎదురు సీట్లో కూర్చున్న ఇద్దరమ్మాయిల్లో ఒకామె బాగా ఆకర్షిస్తుంది. ఆమెతో మాటలు కలపడానికి ప్రయత్నిస్తాడు....
........ఇక చదవండి.


ఉదయం లేచిన వాడు లేచినట్టే కూచోని ఆలోచిస్తున్నాడు. ఓపక్క తన కార్యక్రమాలు చూసుకుంటూనే విరాట్ ని గమనిస్తూనే ఉన్నాడు చందూ. ప్రేమలో పడ్డ వాడికే ప్రేమికుల బాధలు కష్టాలు ఏమిటో అర్థమవుతుంటాయంటారు. సందేహంలేదు వీడు ప్రేమలో పడిపోయాడు.

పాతాళభైరవి సినిమాలో తోటరామునికి మాంత్రికుడు రాజకుమారి నెక్కడ ఉంచాడో తెలిసింది గాబట్టి వెళ్ళి రక్షించి తెచ్చుకున్నాడు. కాని ఈ విరాట్ కి శత్రువులెవరూ లేరు. ఈ మహానగరంలో తన ప్రేయసి ఏమైందో తెలీదు. అసలు ఈ వూరో కాదో...  పని మీద వచ్చి వెళ్ళిపోతుందేమో తెలీదు. సొంతవూరు ఏదో తెలీదు. ఇన్ని తెలీదులు పెట్టుకొని ఆమె ఆచూకి తెలుసుకోవటం ఎలా...?

ఒక వేళ తెలుసుకున్న ఆమె వీడ్ని ప్రేమిస్తుందో లేదో తెలీదు. ఆల్ రెడీ ఆమెకు బోయ్ ఫ్రెండ్ ఉన్నడేమో తెలీదు. ఒక వేళ ఎంగేజ్ మెంట్  అయిపోయి ఎవడితోనో పెళ్ళి జరగనుందేమోతెలీదు. ఇన్నితెలీయలుండగా ఆ అమ్మాయి మీద పోయిపోయి మనసు పారేసుకున్నాడే ఏమిటి వీడి పరిస్థితి అనుకున్నాడు చందూ.

ప్రస్తుతం ఆ అపరిచిత ధ్యాసలోనే ఉన్నాడు కాబట్టి తనేం చెప్పినా అర్ధంకాదనే ఉద్దేశంతో తనేది కామెంట్ చేయలేదు. ‘‘టిఫిన్ రెడీ, ఆఫీసు టైం అవుతోంది త్వరగా రెడీ కా... ఈ లోపల లంచ్ బాక్స్ లు రెడీ చేస్తాను’’ అంటూ తొందరచేసి విరాట్ ను బాత్రూం లోకి తరిమాడు.

ఇక్కడ నిజానికి...

విరాట్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి.

అప్పటికే ఎలాగయినా ఆమెను వెదికి పట్టుకోవాలనే కృత నిశ్చయానికి వచ్చేసాడు. ఎందుకో గాని ఆమె తనకు కన్పిస్తుందని ఆమె తనదే అనే దృడమైన ఫీలింగ్ మనసులో స్థిర పడిపోయింది. ఖచ్చితంగా ఆ అమ్మాలిద్దరూ ఎగ్మోర్ లోనే ఏదో ఆఫీసులో పని చేస్తుండాలి. తను ఎగ్మోర్  స్టేషన్ లో కాపు వేస్తే తప్పకుండా కనపడాలి.

మిత్రులిద్దరూ రెడీ అయి రైల్లో ఎగ్మోరు స్టేషన్ లో దిగేసరికి ఉదయం తొమ్మిదిన్నర టైము. అక్కడికి పావుగంట నడక దూరం లోనే ఉంది విరాట్, చందూ పని చేసే ఆఫీసు.  రైలు దిగి బయటకు రాగానే ఆగాడు విరాట్.  ఏమిటన్నట్టు చూసాడు చందూ.

‘‘చిన్న పనుంది. గంట లేటుగా వస్తున్నానని ఆఫీసులో చెప్పి మేనేజ్ చేయి. నువ్వు పద’’  అన్నాడు విరాట్.

ఆ చిన్న పనేమిటో...

వూహించాడు చందూ.

‘‘అంత చిన్న పనా?’’  సీరియస్ గా అడిగాడు.

విరాట్ సమాధానమివ్వలేదు.

‘‘అంత చిన్న పనికి గంట సమయం ఎందుకు..? అయిదు నిమిషాలు చాలు. వెయిట్ చేస్తాను. వెళ్ళి పని చూసుకురా.’’

‘‘చందూ...’’ అన్నాడు విరాట్  విసుగ్గా.

‘‘ఒకె,  ఒక్కోసారి చిన్న పనికి కూడ చాలా సమయం పడుతుంది గదూ... పని చూసుకొనేరా.  నేను ఆఫీస్ లో మేనేజ్ చేస్తాలే’’ అంటూ చిన్నగా నవ్వుకొంటూ వెళ్ళిపోయాడు చందూ.

విరాట్ స్టేషన్ ఎంట్రన్స్ లోని పోర్టికో దగ్గరే ఉండి రైలు దిగి వచ్చే వాళ్ళని జాగ్రత్తగా గమనించనారంభించాడు. పుట్ట లోంచి చీమలు బయటకు వచ్చినట్టు జనం వస్తున్నారు. ఆఫీసులకు పరుగులెత్తే వాళ్ళు, స్కూళ్ళు, కాలేజీ స్టూటెండ్స్ తో ఉదయం సాయంత్రాల్లో సిటీ రైళ్ళు చాల రష్ గా పరుగులు తీస్తుంటాయి.

ఆ జన సందోహంలో...

రెప్ప వేస్తే ఆమె ఎక్కడ మిస్సయిపోతోందోనన్న డౌటుతో ఆమె కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాడు విరాట్.   క్షణాలు.. . నిమిషాలు...  గంట అన్నది రెండు గంటలు వెయిట్ చేసినా ఆమె గాని ఆమె ఫ్రెండ్ ఆచూకీ గాని దొరకలేదు. సందేహం లేదు. వాళ్ళు ఎగ్మోరికి రాలేదు. మరీ లేట్ చేయటం బాగుండదని ఆ పూటకి ఆశ వదులుకొని ఆఫీసుకు వెళ్ళిపోయాడు. అయినా కూడా అతడ్ని సందేహం వెన్నంటుతూనే ఉంది.

ఏమో...  ఆ జనంలో వాళ్ళు మిస్సయ్యారేమో.  అదే జరిగితే సాయంకాలం వాళ్ళు తిరిగి రైలుకి రావాలి గదా.  ఆ డౌటు కూడా తీర్చుకొందామనుకున్నాడు. సాయంత్రం పర్మిషన్ తీసుకొని ఆఫీస్  టైమ్ కిముందే బయటికొచ్చేసాడు. తిరిగి స్టేషన్ ముందు కాపు గాసాడు. ప్రయోజనం లేకపోయింది. ఆమె స్టేషన్ కి రాలేదు. అయినా నిరాశ చెందలేదు విరాట్.

ఇవాళ రాకపోతే రేపు ఆమె కన్పిస్తుందనే ఆశ...

చందూ వచ్చి కలవగానే ఇద్దరూ రైలెక్కారు. అయితే టినగర్  స్టేషన్  రాగానే రైలు దిగిపోయాడు విరాట్.

‘‘నువ్వింటికెళ్ళిపోరా.  నేను కాస్త లేటుగా వస్తాను’’ అన్నాడు చందూతో.

‘‘లోకంలో ఎక్కడా ఈక లేని కోడి, తోక లేని కుక్క ఉండదు. అలాగే చందూ లేకుండా విరాట్ కూడ ఉండడు. పదా నేనొస్తా’’ అంటూ తనూ రైలు దిగి పోయాడు చందూ.

ఇద్దరూ సుమారు గంట సేపు టినగర్ స్టేషన్ లో ఆ అజ్ఞాత సుందరి కోసం గాలించారు. ఎగ్మోర్ లో మిస్సయినా ఇక్కడైనా కన్పిస్తుందని విరాట్ ఆశ. కాని ఆ ఆశ కూడ నిరాశయింది.  స్టేషన్ కి సమీపం లోనే ఆమె నివాసమైతే సాయంకాలం షాపింగ్ కి బయటకురావచ్చని మరో ఐడియా తట్టింది.  అంతే...

చందూతో స్టేషన్ బయటకొచ్చి రంగనాథ స్ట్రీట్ లోని షాపుల వెంట గాలించాడు. తర్వాత ఉస్మాన్ రోడ్డులో గాలిస్తూ ఎగువన పానగల్ పార్క్ వరకు వెళ్ళాడు. అక్కడి నుంచి జి.ఎన్. చెట్టి రోడ్డులో కొంతదూరం వెళ్ళి చూసుకొంటూ అడ్డ రోడ్డు లోంచి అవతల పాండీబజార్  చేరుకున్నాడు.

పాండీ బజార్లో కూడా ఆమె జాడ తెలీలేదు. గాని అక్కడే చీకట్లు ముసురుతున్నాయి. ‘‘కాళ్ళు పట్టేశాయినాయనా. స్టేషన్ కు నడిచి రైలెక్కే ఓపిక లేదు!’’ అంటూ చందూ హఠం చేయటంతో తప్పదనీ ఆటోలో ఇంటికి బయలుదేరారిద్దరు.

డేటు మారింది గాని....

సేమ్ ప్లేస్....

సేమ్ లోకేషన్....

ఎగ్మోర్  రైల్వే స్టేషన్...

మూడో రోజు...

ఉదయం వరకు ఆమె జాడ లేదు.  సాయంకాలమైనా కన్పిస్తుదన్న ఆశ. స్టేషన్  ముందు వెయిట్ చేస్తున్నాడు. చందు ఇంకా ఆఫీస్ నుండి రాలేదు. ఓపిగ్గా ఎదురుతెన్నులు చూస్తున్నాడు విరాట్. ఆమె జాడయితే తెలీలేదుగాని ఇంతలో మృదువైన మెత్తని చేయి ఒకటి తన చేతిని పట్టుకోడంతో ఉలిక్కిపడి తిరిగి చూసాడు.

ఎదురుగా విశాల....

ఇవాళ చక్కగా చీర జాకెట్లో`  షోకేస్ లో బొమ్మలా ఉంది.

ఆమెను చూడగానే విరాట్ కి ఎక్కడలేని నీరసం ముంచు కొచ్చింది. రెండోసారి బుక్కయి పోయానేమిట్రా బాబు త్వరగా వదిలించుకోవాలి అనుకుంటూ ఆమెను చూసి ఓ పిచ్చి నవ్వు నవ్వాడు.

‘‘ఏయ్ విరాట్ నా కోసమేనా వెయిటింగ్..?’’ అంది విశాల నవ్వుతూ.

‘‘ఓర్ నాయనో, నా పేరు కూడా శిలాక్షరాలతో రాసి మరీ గుర్తుపెట్టుకున్నట్టుంది.’’ అనుకుంటూ ‘‘లేదు మిస్... మా చందూ కోసం వెయిటింగ్’’ అన్నాడు. చేయి వదిలించు కోవాలనుకున్నాడు.

వదల్లేదామె.

‘‘చందూ ఎవరు?’’ అడిగింది.

‘‘నా ఫ్రెండ్. నిజం చెప్పనా? ఆ రోజు నన్ను ఇరికించాలని నీ నడుంతడిమి పారిపోయిన వెధవవాడే’’ అని నవ్వాడు.

తనో నవ్వు నవ్వింది విశాల.

‘‘అయితేనేం నీ ఫ్రెండు మంచి పనే చేసాడు. నీ పరిచయం దొరికింది నాకు, ఇంతకీ నా ప్రపోజల్ గురించి ఏమాలోచించావ్?’’  అడిగింది.ఇది
వూహించిన ప్రశ్న.

ఖచ్చితంగా అడుగుతుందని తెలుసు.

కాని ముందే అడిగింది.

ఏం చెప్పాలో అర్థంగాక మరోసారి పిచ్చి నవ్వు నవ్వాడు.  చందూ వచ్చేస్తే బాగుండు. లేదంటే ఈవిడ తనని కొంచెం కొంచెం కొరుక్కుతినేసేలా ఉంది.

‘‘ఇంతకీమీ విషయాలేమీ చెప్పలేదు. రైలు కొచ్చి వెళ్తున్నారంటే ఎంప్లాయ్ అయిఉండాలి. ఎక్కడ జాబ్ చేస్తున్నారు..?’’ ఆమె ప్రశ్నకు సమాధానం దాటవేస్తు టాపిక్ మార్చాడు.

‘‘రైల్లో వచ్చినంత మాత్రాన జాబ్ చేస్తున్నానని అర్థమా?’’ తమాషాగా ఎదురు ప్రశ్నించింది.

‘‘మరీ?’’  కుతూహలంగా చూసాడు.

‘‘ మా కంపెనీలో మూడు వందల మంది జాబ్ చేస్తున్నారు’’

‘‘ఓ మైగాడ్ కంపెనీ ఓనరా...?’’

‘‘యస్...  నేను ఫ్యాషన్ డిజైనర్ని,  మా డాడీ హయాంలో రెడీమేడ్ గార్మెంట్ కంపెనీని పదిమంది టైలర్స్ తో ఆరంభించి క్రమంగా విస్తరించారు. ఆయన పోయాక కంపెనీ నా హయాం లోకి వచ్చింది. ప్రస్తుతం మూడు వందల మంది లేడీస్ ఎంప్లాయిస్ తో చెన్నైలోనే అతి పెద్ద కంపెనీ మాది. మా గార్మెంట్స్ ఫారెన్ కీ ఎక్స్ పోర్టవుతుంటాయి. సంవత్సరానికి ఏభైకోట్ల టర్నోవర్’’ ఆమె తన గురించి వివరిస్తుంటే నిజంగానే ఆశ్చర్యానికి గురయ్యాడు. ఏంటీ అంత పెద్ద కంపెనీ అధికారిణి అయి ఉండి యిలా రైలు దిగి సాధారణ అమ్మాయిలా నడిచిపోవటం వింతగా ఉంది.

‘‘హలో ఏమిటి ఆశ్చర్యపోతున్నారు? రైల్లో వస్తున్నందుకా?’’  అంది.

‘‘వూ’’  అన్నాడు.

‘‘నేను ఉండేది వెస్ట్ మాంబళం. మా కంపెనీ ఆఫీసు, గార్మెంట్స్ తయారీ ఫాక్టరీ, గోడౌన్ అన్నీ ఇక్కడ ఎగ్మోర్ లో ఉన్నాయి. నా కారు సర్వీస్ కెళ్ళింది. అప్పుడప్పుడు యిలా రైల్లో వచ్చి ఆటోలో అక్కడకెళ్ళటం సరదా. మా కంపెనీలో అంతా లేడీసే వర్క్  చేస్తారు. మానేజర్, ఆఫీసు స్టాప్ తో సహా’’ అంటూ ఆమె టకటకా చెప్తుంటే కళ్ళుగిర్రున తిరిగినంత పనయింది విరాట్ కి.

అందుక్కారణం ఆమె చెప్పిన ఏభైకోట్ల టర్నోవర్కో లేక ఆఫీసు విషయాల గురించో కాదు. అంత వుండి సాధారణ ఎంప్లాయీలా రైల్లో వచ్చిపోతున్నందుకు. మాటల సందర్భంలో చిన్నగా తన చేయి విడిపించుకున్నాడు.  అపరిచిత కోసం తనిక్కడ పడిగాపులు కాయటం ఏమిటి? ఈ విశాల రెండోసారి తన ముందుకు రావటం ఏమిటి...?

‘‘ఏమిటాలోచిస్తున్నావు?  మా ఫ్యామిలీ గురించి చెప్పలేదనా? మా ఇంట్లో అమ్మ ఉంటుంది. తనతో బాటు నా కుక్కపిల్లలు రెండు. అదే మా ఫ్యామిలీ...!’’ గడగడా  మాట్లాడేస్తోంది విశాల.

ఓపిగ్గా ఆమె గురించి అంతా విన్నాడు విరాట్.

చందూ కోసం ఎదురుచూస్తున్నాయి అతడి కళ్ళు. వాడు వస్తే విశాలకు బై చెప్పి వెళ్ళిపోవచ్చు. తను వూహించినట్టు విశాల సాధారణ యువతి కాదు.

‘‘సో... విశాల... రెండో సారి మనం కటుసుకోవటం సంతోషంగా ఉంది...’’

‘‘అయాం ఆల్సో వెరీ హేపీ..  బట్ నా ప్రపోజల్ గురించి ఏం ఆలోచించావ్?’’ తన ప్రశ్నను రిపీట్  చేసింది.

‘‘నీ ప్రపోజల్  కాస్సేపు పక్కనుంచు. నేనో విషయం అడుగుతాను. ఏమీ అనుకోవుగదా?’’ అన్నాడు.

‘‘నువ్వడిగే విషయం ఏమిటో నాకు తెలుసు’’ అంది.

‘‘చెప్పు చూద్దాం!’’

‘‘నీలాంటి అమ్మాయి కోరితే కోట్ల మంది క్యూ కడతారు. నన్నే ఎందుకిష్టపడుతున్నావ్  అవునా?’’

విరాట్  నిజంగానే షాకయ్యాడు.

చాలా తెలివైన యువతి. అందం చదువు డబ్బు హోదా సొంత కంపెనీ అన్నీ ఉన్న చురుకైన అమ్మాయి. కాని... ఎదుటవాళ్ళు మనసును చదవటమంటే.. ఆలోచిస్తున్నాడు. ‘‘మరీ ఆశ్చర్యపోవద్దు. ఎదురుగా వున్నది ఫ్యాషన్ డిజైనర్ మాత్రమే కాదు. హ్యూమన్ సైకాలజీలో గోల్డ్ మెడలిస్ట్. అయినా మనమిలా పబ్లిక్ లో నిలబడి మాట్లాడటం బాగాలేదు. కమాన్. కేఫ్ లో కూచుని కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం...

’‘‘నోనో...’’‘‘నేను పిలిచింది బార్ కి కాదు. కాఫీకే...’’ నవ్వింది.‘‘విశాల ప్లీజ్. ఇప్పుడు కాదు. నా ఫ్రెండు చందూ వస్తే వెదుక్కొంటాడు.  ఇంతకీ నీ మనసులో మాట చెప్పావు.  దానికి ఆన్సర్  చెప్పలేదు’’ గుర్తు చేసాడు.

ఆమె నిజంగానే హ్యూమన్ సైకాలజీ చదివిన అమ్మాయి. ఇలాంటి వాళ్ళతో అబద్ధం చెప్పి తప్పించుకోవటం కష్టమే అన్పించింది.‘‘ఆన్సర్ వూహించలేదా?’’ అంది గడగడా విశాల.

లేదన్నట్లుగా సంజ్ఞ చేసాడు....

‘‘నాకు నచ్చని వాటి గురించి ఆలోచించను. నచ్చితే వదులుకోను. నాకు నువ్వునచ్చావ్. ఐలవ్ యూ.. దట్సాల్. వెరీసింపుల్ బట్. నా ప్రశ్నకు బదులు చెప్పాలి. నా ప్రపోజల్ ఓకె నా కాదా?’’ చాలా సూటిగా క్లియర్ గా వుందామే ప్రశ్న.

విరాట్ కి గొంతులో ఏదో అడ్డం పడినట్టుంది.  ఏం చెప్పాలి?  ఓరే చందూ ఎక్కడ చచ్చావ్ రా. త్వరగా రారా బాబూ మనసు లోనే ఉడుక్కున్నాడు.

‘‘ఓకే. ఇవాళ గాక పోతే రేపు చెప్పు నిన్ను ఇబ్బంది పెట్టను’’ అంది అతడి మౌనం చూసి.

‘‘విశాలా... సారీ.. నీకో నిజం చెప్పాలి’’ అంటూ సీరియస్ గా చూసాడు.

‘‘ చెప్పు చెప్పు ఏమిటా నిజం?’’

‘‘నువ్వు చీరకడితే చాలా అందంగా ఉన్నావ్.’’

ఫక్కున నవ్వింది విశాల.

‘‘ఏయ్ విరాట్  నువ్వు చెప్పలనుకున్న విషయం ఇది కాదు. సంకోచం అక్కర్లేదు. చెప్పు’’ అంది నవ్వాపుకుంటూ.‘‘ఓకే..  నిజం చెప్తానన్నాను గదూ. ఆ నిజం ఏమంటే నాకు పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సో... నీకు నేను కరక్టుకాదు. మర్చిపో. నీకు నా కన్నా మంచి మొగుడు వస్తాడు. తగిన వాడ్ని చూసుకుని పెళ్ళి చేసుకో. ఆల్ ది బెస్ట్.’’ ఎంతో బాధపడిపోతున్నట్టు ముఖం దించుకొని చెప్పాడు.

ఆ మాటలకు ఆమె నిరాశ చెంది బాధపడి కన్నీళ్ళు పెట్టుకుంటుందనుకున్నాడు . అలాంటిదేమీ జరగలేదు సరికదా ఉబికి వస్తున్న నవ్వుని ఆపుకొంటూ కొంటెగా చూసింది.

‘‘ఏమిటి?  నా మాటల మీద నమ్మకం లేదా?’’ అడిగాడు.

‘‘నువ్వు చెప్పింది నిజం కాదు. ఎలా నమ్మమంటావ్?’’ అంటూ ఫక్కున నవ్వేసింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
agent ekambar