Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasini pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

జరిగిన కథ : ఎమ్మెల్యే అనుచరులందరితో పాలసీలు కట్టించి ఇంటికి చేరుకున్న ఏకాంబరానికి భొజనం చేయకుండా తనకోసం తండ్రి ఎదురు చూడడం ఆనందాన్నిస్తుంది. తల్లి, తండ్రి, ఏకాంబరం మాటల మధ్యలో ఇల్లు కట్టే ప్రస్తావన, చెల్లెలి పెళ్ళి విషయం వస్తుంది....
......................................ఆ తర్వాత....

" పెద్దాడికి కూడా ఈ విషయం ఫోన్లో చెప్పానే పర్వతం. వాడు కూడా ఎన్నాళ్ళనుంచో ఉద్యోగం చేస్తున్నాడు కదా! ఇంటికి కూడా ఎప్పుడూ సరిగా డబ్బు పంపించలేదు కదా! అందుకే చెల్లి పెళ్ళికి అయిదు లక్షలన్నా నువ్వు సర్దాలిరా అని చెప్పాను " అన్నాడు పీతాంబరం.

" ఏమన్నాడు? సరేనన్నాడా? " ఆశగా అంది పర్వతాలు.

" నా మాటలన్నీ విని సరే నాన్న! ఇంటికొస్తాగా, అప్పుడు మాట్లాడుకుందాం. అంటూ ఫోన్ కట్ చేసాడు." చెప్పాడు పీతాంబరం.

' పెద్ద కొడుకు అంత నిర్లిప్తంగా మాట్లాడాడనేసరికి ఒక్కసారే డీలా పడిపోయింది పర్వతాలు. పెద్దాడే ఇంటిని ఓ దారికి తెస్తాడనుకుంది. వాడే ఓ దారీ తెన్నూ లేకుండా పోయాడు ' మౌనంగా మనసులోనే మధన పడింది.

" అమ్మా ! ఎందుకమ్మా బాధపడతావ్? అన్నయ్య వస్తానన్నాడు కదా! వచ్చాక ఆలోచిద్దాం. ఈలోగా మంచి సంబంధం చూడండి " భోజనం ముగించి డైనింగ్ టేబుల్ దగ్గర నుండి లేచాడు ఏకాంబర్.

" సరేరా ! నువ్వెళ్ళి పడుకో! రేపు మళ్ళీ ఉదయాన్నే లేవాలి కదా! " అన్నాడు పీతాంబరం.

" అలాగే నాన్నా! " అంటూ అక్కడినుండి వెళ్ళి డ్రస్ మార్చుకుని హాల్లోనే ఓ మూలనున్న మంచం వాల్చుకుని మేను వాల్చాడు ఏకాంబర్.

భార్యాభర్తలిద్దరూ కొడుకుకేసి చూస్తూ మురిసిపోయారు.

ఆ వారంలోనే ఏకాంబర్ అన్న నీలాంబర్ ఇంటికొచ్చాడు. పెట్టేబేడా సర్దుకుని మరీ వచ్చేసాడు. పెద్దకొడుకు అలా సామాన్లన్నీ సర్దుకుని రావడం చూస్తూనే తల్లి పర్వతాలు గుండె గుబేల్మంది. నీలాంబర్ వచ్చీరావడంతోనే సామాన్లన్నీ ఇంట్లో పడేసి ఊరిమీదకు పోయాడు. ఆరాత్రి తండ్రి వచ్చి నిలదీసి అడిగితే అసలు విషయం చెప్పాడు. నీలాంబర్ పని చేస్తున్న సాఫ్ట్ వేర్ కంపెనీలో సగం మందికి పని లేదని ఉద్యోగాలు తీసేసారని చెప్పాడు. ఒక్క వాళ్ళ కంపెనీలోనే కాదని, అన్ని కంపెనీల్లోనూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులందరూ ఉద్యోగాలు ఊడి రోడ్డున పడ్డారని చెప్పాడు. పెద్ద కొడుకు చెప్పింది వింటూనే భార్యాభర్తలు ఇద్దరూ అచేతనంగా ఉండిపోయారు. ఎంతో ఉన్నతంగా ఎదుగుతాడనుకున్న పెద్దకొడుకు ఇలా కుదేలై కనిపించేసరికి వాళ్ళు తట్టుకోలేకపోయారు.

" ఈ అయిదేళ్ళ నుండి ఉద్యోగం చేస్తున్నావు కదరా ఆ జీతం అంతా ఏమైంది? " కోపం తట్టుకోలేక అడిగాడు పీతాంబరం.

" ఖర్చయిపోయింది నాన్నా! ఈరోజు ఇలాంటి గడ్డు పరిస్తితి ఎదురవుతుందని తెలిస్తే జాగ్రత్త పడేవాణ్ణి. నెలనెలా వేలల్లో జీతం చేతికందడంతో  కండకావరంతో కిందామీదా ఆలోచించకుండా జల్సాగా తిరిగేసాను. తప్పయిపోయింది మీరు ఫొన్ చేసారు కదా అప్పుడు...అప్పుడు..మీకు సమాధానం చెప్పలేక సిగ్గుతో చచ్చిపోయాను నాన్నా !" బాధగా తల దించుకుంటూ అన్నాడు నీలాంబర్. పెద్దకొడుకు అలా అనేసరికి ఇక వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోయారు. ఏకాంబర్ కూడా సోఫాలో కూర్చుని ఉన్నాడు. అన్న నీలాంబర్ చెప్పిందంతా వింటూనే కూర్చున్నాడు గానీ ఏం మాట్లాడలేదు. " ఏకాంబర్ గాడిలా నేనూ స్కూలు ఎగ్గొట్టి చదువుకోకుండా ఉండి ఉంటే బావుండేది నాన్నా! వాడిలా  నేనూ ఇక్కడే ఏదో ఒకటి చేసుకుని హాయిగా ఇంట్లోనే వుండేవాణ్ణి. " విచారంగా ఏకాంబర్ ప్రక్కనే కూలబడి ఏడుస్తూ అన్నాడు నీలాంబర్.

అన్న అలా అనేసరికి అదిరిపడ్డాడు ఏకాంబర్. పెద్ద కొడుకు అలా అనేసరికి తండ్రి పీతాంబరానికి కోపం తారాస్థాయికి చేరింది. " చదువుకోవడం కాదురా ! నీకు కనీస సంస్కారం లేక ఇలా తయారయ్యావు. ఎదుటివాడ్ని చులకనగా చూడడం మాని నీ ఏడుపు నువ్వు ఏడుచుంటే బాగుపడేవాడివి. ఆడికి చదువు అబ్బకపోయినా సన్స్కారం అబ్బింది. అదే ఈ రోజు వాడికి మాకు తిండి పెడుతోందిరా ! " కోపంగా అన్నాడు పీతాంబరం. " నేనేమన్నానని అలా కోపంగా అరుస్తారు? ఇంత చదువు చదివి మీకు ఏ విధంగా సహాయపడలేక పోతున్నాను కదా అని అన్నాను " అన్నాడు నీలాంబర్. " చాల్చాలు . ఇన్నాళ్ళు నువ్వు మాకు ఉపయోగపడింది చాలు. నెలకు వేలకువేలు సంపాదించడం గొప్ప కాదురా అందులో అర్ధ రూపాయి వెనకేసినవాడు గొప్పవాడు. ఉద్యోగం సద్యోగం లేకపోయినా బాధ్యతైనవాడు బంధాలకు కట్టుబడి బ్రతుకు తాడురా! " అన్నాడు పీతాంబరం. తండ్రి మాటలు వింటూనే చిరాగ్గా లేచి గదిలోకి వెళ్ళిపోయాడు నీలాంబర్. " ఊరుకోండి ! ఉద్యోగం పోయి వాడేదో బాధలో నోటికొచ్చింది అంటే మీరూ రెచ్చిపోతారా? చూడండి, బాధపడి ఎలా వెళ్ళిపోయాడో ! " బాధగా అంది పర్వతాలు. భార్య చెప్పింది విని పీతాంబరం కూడా కోపంలో తానూ వాడ్ని బాధపెట్టేసానని మనసులో మధనపడ్డాడు. అన్న అలా బాధగా గదిలోకి వెళ్ళడంతో ఏకాంబర్ మనస్సు చివుక్కుమంది.

గబాలున లేచి అన్న దగ్గరకు వెళ్ళాడు. " ఎందుకురా ! నీలాంబర్ బాధపడతావ్ ! ఇప్పుడేమయింది ? బోడి ఉద్యోగమేగా పోయింది. నీ టాలేంట్ కి వంద ఉద్యోగాలు నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. " అంటూ అన్న నీలాంబర్ ప్రక్కకు వెళ్ళి భుజం మీద చెయ్యివేసి ఓదార్పుగా అన్నాడు. " లేదురా నేను ఎన్నో ప్రయత్నాలు చేసాను. చేసి ఛెసి విసిగిపోయి ఇలా ఇంటికి వచ్చాను. అసలు విషయం తెలిస్తే అమ్మా నాన్నా ఇంకా బాధపడతారు " దాదాపు ఏడుస్తూనే అన్నాడు నీలాంబర్. గదిలో ఉన్న అన్నదమ్ములిద్దరి మాటలు వింటూ శిలల్లా నిలబడ్డారు భార్యాభర్తలిద్దరూ. అలివేలు మంగ మాత్రం గదిలో మూలనున్న మంచం మీద హాయిగా నిద్రపోతోంది.

" ఏమైందిరా ! ..నాతో చెప్పరా! ఎందుకింత ఆందోళన పడుతున్నావ్ ? " అన్న భుజాలని అనునయంగా నిమురుతూ అన్నాడు ఏకాంబర్.
" నీకు తెలీదురా!.. మీకెవరికీ తెలీదు. నా ఉద్యోగం పోయి ఆర్నెల్లయ్యింది. ఈ ఆర్నెల్లు ఎన్నో కంపెనీల చుట్టూ తిరిగాను. జీతం లేక చేతిలో ఉన్న డబ్బు అయిపోయి ఒకపూట తిని తినక ఎన్ని రాత్రుళ్ళు మిమ్మల్నందరినీ తల్చుకుని ఏడ్చానో నాకు తెలుసు. ఒకోసారి ఎవరికీ చెప్పకుండా ఎటైనా పారిపోదామనుకొన్నాను...ఒకోసారి ఇలా ఇంటికి తిరిగి రాకుండా ఆత్మహత్య చేసుకుందామనుకునేవాడ్ని. కానీ, అంతపనీ చెయ్యడానికి ధైర్యం చాలక ఇలా తల దించుకుని తిరిగొచ్చాన్రా ! తల ఎత్తుకుని వెళ్ళిన వాడ్ని తల దించుకుని వచ్చాను ..." తమ్ముడి ఒళ్ళో తల పెట్టుకుని భోరున ఏడుస్తూ చెప్పాడు నీలాంబర్.

గది బయట నిలబడి నీలాంబర్ చెప్పిందంతా వింటున్న పీతాంబరం, పర్వతాలు అదిరిపడ్డారు. భయంతో బెంబేలెత్తిపోయారు. ఆందోళనగా గదిలోకి వెళ్ళి ఏకాంబర్ ఒడిలో వాలిపోయి ఉన్న నీలాంబర్ ని పట్టుకుని ఇద్దరూ వలవలా ఏడ్చేసారు. " ఒరేయ్ పెద్దా! నీ సంపాదన కోసం మేము నిన్ను పెంచలేదురా ! నువ్వు దర్జాగా ఉంటావని..రాజాలా బ్రతకాలని....కళ్ళల్లో పెట్టుకుని కడుపులో దాచుకుని ముమ్మల్ని పెంచుకున్నమురా ! మీరు మాకు వారసులే కాదురా ! మా యింటి దీపాలు. మీరే లేకపోతే మేము ఏమైపోవాలి ? నేనూ మీ నాన్న ఎవరికోసం బ్రతకాలిరా? " భోరున ఏడుస్తూ నీలాంబర్ ని కౌగిలించుకుంది పర్వతాలు. పీతాంబరం మౌనంగా కొడుకు తల నిమురుతూ నిలబడ్డాడు.

" నీలాంబర్ ! నీకు మేమంతా ఉన్నాం కదరా ! ఈ పిచ్చి ఆలోచనలు మానేయ్. నువ్వే పదిమందికి ఉద్యోగాలు ఇవ్వగల తెలివైన వాడివిరా ! " చిన్నగా నవ్వుతూ అన్నని రెండు చేతుల్తో ఆలింగనం చేసుకున్నాడు ఏకాంబర్. " ఉద్యోగం పోయి ఏం చేయాలో దిక్కు తోచకుండా ఉన్నాన్రా ! నేను ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి ? చిన్నప్పట్నుంచీ నిన్ను హేళన చేసేవాడ్నని ఇప్పుడు నన్ను హేళన చేస్తున్నావా ఏకాంబర ?! " చటుక్కున ఏకాంబర్ చేతుల్లోనుంచి విడివడి తమ్ముడి కళ్ళల్లోకి బేలగా చూస్తూ అన్నాడు నీలాంబర్.

" అయ్యో లేదన్నయ్యా, నేను ఎందుకు ఎగతాళి చేస్తాను..నిజమే చెప్తున్నాను. ఎవరో పని ఇస్తారని నువ్వెందుకన్నయ్యా వెదకటం ? నువ్వే పని కల్పించుకో ! నువ్వే పదిమందికి పని కల్పించే స్థాయికి ఎదుగుతావ్.." సూటిగా అన్న కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ఏకాంబర్.
" అవున్రా, తమ్ముడు చెప్పింది విను " అంది తల్లి పర్వతాలు.

" ఏం విననమ్మా ! వీడేదో సినిమా డైలాగులు చెప్తూంటే ...నేను పని కల్పించుకోవడమేమిటి? పదిమందికి పని కల్పించడమేమిటి ? " చిరాగ్గా మొహం పెట్టి అన్నాడు నీలాంబర్. " మరి మీ నాన్న చేస్తున్న పనేమిట్రా " ? తల్లి పర్వతాలు సూటిగా నీలాంబర్ కేసి చూస్తూ అంది.తల్లి అలా అనేసరికి ఒక్కసారే ఉలిక్కిపడ్డాడు నీలాంబర్. " నిజమే కదా నాన్నది డిపార్ట్ మెంటల్ స్టోర్. అందులో అయిదుగురు అమ్మాయిల్ని జీతానికి పెట్టి నడిపిస్తున్నాడు తమ్ముడు ఏకాంబర్ చెప్పింది ఇదే సూత్రమా! ప్రతీ ప్రశ్నకి జవాబు ఉన్నట్టే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ప్రతీ లెక్కా ఎలా చెయ్యాలో సూత్రం ఉంటుంది. అలాగే జీవితానికి..జీవించడానికి...బ్రతకడానికి..బ్రతికించడానికి..ఎన్నెన్ని నిజాలు ! ఈ నిజాలు ఇజాలు చదువు సంధ్యలు లేని ఏకాంబర్ ఎలా తెలుసుకోగలిగాడు.. విషయం అర్థమయి ఆశ్చర్యంగా తమ్ముడు ఏకాంబర్ కళ్ళల్లోకి సంతోషంగా చూసాడు నీలాంబర్.

" అవున్రా పెద్దోడా ! అమ్మకే ఈ జీవిత సత్యం అర్థమయిందంటే..చదువుకున్నవాడివి నీకు అర్థం కాదా ? " అన్నాడు పీతాంబర్." నిజమే నాన్నా తమ్ముడూ,  మీరు అన్నట్టు పని కల్పించుకుంటాను. నేనూ మీలా ఎక్కడో చిన్న డిపార్ట్ మెంటల్ స్టోర్ పెడతాను. మరి దానికి డబ్బో?!" అదీగాక అందులో మెలకువలు నాకు తెలియాలి కదా ! " అన్నాడు. " చదివేకొద్దీ ఉన్నమతి పోతుందంటారు. ఎందుకో అనుకున్నాను..ఇదిగో..నిన్ను చూస్తుంటే ఆ సామెత నిజమేననిపిస్తోంది " తల్లి పర్వతాలు చిరాగ్గా అంది.

" నేనేమన్నానమ్మా నాన్నలా వ్యాపారం చెయ్యాలంటే అనుభవం, డబ్బు కావాలన్నానంతే..." అన్నాడు నీలాంబర్.

" నాన్న చేసిన వ్యాపారం నువ్వెందుకు చేస్తావు? నీకు తెలిసిన నీకు అనుభవ ఉన్న వ్యాపారం చేస్తావు కానీ.." అన్నాడు ఏకాంబర్.

అవున్రా ! నువ్వు పూర్తిగా తమ్ముడు ఏం చెప్తాడో విను. ఆ తర్వాత మాట్లాడు. నీ అభిప్రాయం చెప్పు " అన్నాడు తండ్రి పీతాంబరం." అలాగే " అంటూ మంచం మీద బుద్ధిగా సర్దుకు కూర్చున్నాడు నీలాంబర్.

" నీకు తెలిసింది కంప్యూటర్. అదే నీ వ్యాపార వస్తువు. అర్థం కాలేదా ? నీవు నేర్చుకున్నది, నీకు తెలిసింది " కంప్యూటర్ సెంటర్ " పెట్టి పదిమంది పిల్లలకి నేర్పించన్నయ్యా చిన్న ఇన్స్టిట్యూట్ ప్రారంభించు. నీతోబాటు పదిమందికి ఉపాధి ఇవ్వొచ్చు. వందమందికి విద్య నేర్పించొచ్చు. " అన్నాడు ఏకాంబర్.

" ఎస్...నువ్వన్నది కరెక్టేరా..కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెడతాను..నాలా నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళని ఫేకల్టీలుగా తీసుకుంటాను. బావుందిరా నీ ఐడియా...బావుంది..మరి ఇన్స్టిట్యూట్ పెట్టడానికి కంప్యూటర్లూ వగైరా ఎన్నో కొనాలి. దానికి డబ్బెలారా? " ఆందోళనగా అన్నాడు నాలాంబర్.

" ఆ విషయం మాకొదిలెయ్యరా నేనూ తమ్ముడూ చూసుకుంటాం. " అన్నాడు పీతాంబరం. " అదెలా నాన్న ? మీరే ఇప్పుడు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు. చెల్లెలి పెళ్ళి చెయ్యాలి. మీకు డబ్బు ఎలా దొరుకుతుంది ? " తండ్రికేసి బేలగా చూస్తూ అన్నాడు నీలాంబర్.
'పెద్దవాడు పాడైపోయాడనుకొన్నాం చుట్టూ ఉన్న స్నేహితుల వలన అక్కడి పరిస్తితుల వలన పాడైపోయాడు గానీ, బాధ్యత తెలిసిన వాడే...' కొడుకు మాటలు విని మనసులోనే  మురిసిపోయాడు పీతాంబరం. " ఆ విషయాలు అన్నీ నీకెందుకురా ! చెల్లెలి పెళ్ళి ఇంకా కుదరలేదుకదా కుదిరాకా నీ వ్యాపారం కూడా కుదుటపడ్డాక నువ్వు కూడా చెల్లెలి కోసం డబ్బు సర్దవా ఏంటి? " చిన్నగా నవ్వుతూ కొడుక్కి ధైర్యం చెప్పింది పర్వతాలు. " అమ్మా ! బుద్ధొచ్చిందమ్మా ! ఇన్నాళ్ళూ చేతినిండా డబ్బు చూసి కళ్ళు మూసుకుపోయి పబ్ లకీ, పార్టీలకీ తగలేసాను. డబ్బు విలువ ఇప్పుడు అర్థమైందమ్మా ! నేనేం తప్పు చేసానో తెలుసుకున్నాను.." బాధగా అన్నాడు నాలాంబర్.

" సరి సరి చాలా పొద్దుపోయింది. పడుకోండి. ఏమైనా మాట్లాడుకోవాలంటే తెల్లారి లేచాక మాట్లాడుకుందాం ' అంటూ పీతాంబరం తన గదిలోకి వెళ్ళిపోయాడు. మొగుడి వెంట పర్వతాలు కూడా వెళ్ళిపోయింది. " గుడ్ నైట్ నీలాంబర్ హాయిగా పడుకో రెపు ఏం చేయాలో ఎలా చేయాలో ఆలోచిద్దాం ! " అంటూ హాల్లోకొచ్చి తన మంచం మీద వాలిపోయాడు ఏకాంబర్.

ఉదయం లేస్తూనే గబగబా తయారయి బయలుదేరాడు ఏకాంబర్. తల్లి పర్వతాలు లేచి పెరట్లో అంట్లు తోముకుంటోంది. తండ్రి పీతాంబరం వరండాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. బ్యాగ్ భుజాన వేసుకుని ఇంట్లోనుండి బయలుదేరబోయాడు ఏకాంబర్. ఇంతలో గదిలోనుండి నీలాంబర్ నిద్ర కళ్ళతోనే హాల్లోకి వచ్చాడు. " ఏరా ఏకాంబర్ ! బయటకు వెళ్తున్నావా?" అడిగాడు తమ్ముడ్ని. " అవున్రా ! కస్టమర్లని ఇళ్ళ దగ్గర కలిస్తేనే నా పని సులువు అవుతుందని వేగంగా వెళ్దామనుకున్నాను. లేవలేకపోయాను. లేటయిపోయింది. " అన్నాడు ఏకాంబర్. " రాత్రి మనం అనుకున్నది ఏం చేద్దాం ? " అడిగాడు నీలాంబర్.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్