Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
puttinillu telugu story

ఈ సంచికలో >> కథలు >> పరివర్తన

parivartana telugu story

పావనపురంలో ఉండే శంకరంకి ఇద్దరు కొడుకులు. వారి పేర్లు రాము, సోము. రాము ఎనిమిదవ తరగతి, సోము ఏడవతరగతి చదువుతున్నారు. రాము వినయ విధేయతలు కలిగి బుద్ధిగా చదువుకుంటాడు. సోముది పూర్తిగా విరుద్ధ స్వభావం. పెద్దల మాటని లెక్క చెయ్యడు. అయితే తన ఇద్దరు పిల్లలనీ మంచివాళ్ళుగా చూడాలని శంకరం కోరిక. అందుకే సోము ప్రవర్తనలో తేడా వచ్చినప్పుడల్లా గట్టిగా మందలించేవాడు.
ఒకసారి పిల్లలతో కలసి సరుకులు కొనడానికి అంగడికి వెళ్ళాడు శంకరం. తమకి తెలిసిన సుబ్బయ్యశెట్టి  దుకాణంలో పొట్లాలు కట్టించి వాటిని సంచిలో వేసుకున్న తరువాత పిల్లలని రమ్మని పిలిచాడు. తండ్రి మాట విని పరుగున వచ్చాడు రాము. కాని విననట్టే ఉండిపోయాడు సోము.

అక్కడకి వచ్చిన రాముకి తండ్రి వెనుక వైపు నేల మీద  అయిదు వందల రూపాయల నోటు కనిపించింది. దానిని తీసి తండ్రి చేతిలో పెట్టి   “ఇది కింద దొరికింది. మనదేమో  చూడండి” అన్నాడు.

తన దగ్గరున్న డబ్బు సరిచూసుకున్న శంకరం “పాపం ఎవరిదో కింద పడినట్లుoది. మనది మాత్రం కాదు” అన్నాడు. అప్పుడు రాము “ఇది ఎవరిదో కనుక్కొని ఇచ్చేద్దాము” అన్నాడు.

అప్పుడే అక్కడకి వచ్చిన సోము ఆ మాటలు విన్నాడు. “అన్నయ్యకి దొరికిన డబ్బు కాబట్టి అది మనకే చెందుతుంది. ఎవరికీ ఇవ్వొద్దు. కావాల్సిన సరుకులు కొనుక్కొని వెళదాము. అమ్మ కూడా సంతోషిస్తుంది. మిగిలిన డబ్బులతో చాక్లెట్లు, ఐస్ క్రీములు మాకు కొనిపెట్టండి” అన్నాడు.

దానికి రాము ఒప్పుకోలేదు. “అలా చేయడం తప్పు. డబ్బు పోయినవాళ్ళని వెతికి పట్టుకుని తిరిగి ఇచ్చేద్దాము. మనది కాని దానికి ఆశ పడకూడదు. పరాయివాళ్ళ డబ్బు పాముతో సమానమని మాస్టారు చెప్పారు. పాము కనబడితే  తప్పుకున్నట్టే  డబ్బు కనబడినా తప్పుకోవాలి తప్ప సొంతం చేసుకోకూడదు” అన్నాడు.

దానికి సోము “అన్నయ్యకి ఏమీ తెలీదు. వాడి మాటలు వినొద్దు. మన డబ్బు పడిపొతే ఎవరూ తెచ్చి ఇవ్వరు కదా. మనo మాత్రం ఎందుకివ్వాలి?’ అని  అడిగాడు.

దానికి  రాము “సోముకి కూడా నిజాయితీగా మెలగడం నేర్పాలి. అందుకోసం మనమొక పరీక్ష పెడదాము. ఆ నోటుని రహదారిలో పడేసి పక్కన దాక్కొని అది తీసిన వాళ్ళు తెచ్చిస్తారో ఇవ్వరో పరీక్షిద్దాము. అప్పుడు సోము చెప్పింది సబబో కాదో అర్ధమవుతుంది” అన్నాడు తండ్రితో.

అప్పటికి సుబ్బయ్యశెట్టి దుకాణంలో ఉన్న వాళ్ళలో ఎవ్వరు కూడా డబ్బు పోయిందని అడగకపోవడంతో శంకరo పిల్లలతో “సరే  అలాగే చేద్దాము” అన్నాడు. సుబ్బయ్యశెట్టి దుకాణం నుండి బయటకు వచ్చి  రహదారి మధ్య ఆ  నోటుని పడేసి పక్కన కూర్చున్నారు
    కొంతసేపటి తరువాత ఎవరో  మనుషులు అటు వస్తున్న చప్పుడు వినిబడింది. ముగ్గురూ  చెవులు రిక్కించి జాగ్రత్తగా విన్నారు. ఎవరో ఒక వ్యక్తి ఆ నోటుని తీసినట్లు కొంతవరకు  కనిపించింది. అదెవరో తెలియలేదు. తరువాత జరిగేది తలచుకుంటూ  ఆలోచనలో పడ్డారు ముగ్గురూ.

“దేవుడా! అది తీసినవాళ్లకి మంచి బుద్ధి పుట్టించి దానిని తిరిగిచ్చేలా చూడు.  సోముకి నిజాయితీ మీద నమ్మకం కలుగుతుంది” అని లోలోపలే దేవుడిని మొక్కాడు రాము.

“మా అన్నయ్యకి లోకం తీరు తెలియాలంటే డబ్బు తీసినవాడు అక్కడ నుండి వెళ్లిపోవాలి. అదెలాగూ మాది కాదు    కాబట్టి నాన్నకి  నష్టం రాదు. కానీ రాముకి నీతి, నిజాయితీల జబ్బు వదుల్తుంది.” అనుకున్నాడు సోము.

అలా వాళ్ళు అనుకుంటుండగా వాళ్ళని ఒక వ్యక్తి పిలిచాడు. ముగ్గురూ ఒకేసారి చూసారు. అక్కడ ఉన్నది తమ బడిలో పనిచేసే తెలుగు ఉపాధ్యాయుడు. వాళ్ళు ఆశ్చర్యపోయి  ఆయనకి నమస్కారం పెట్టారు.

అప్పుడు మాస్టారు  “ఈ అయిదు వందల నోటు మీదేనా” అని అడిగారు.

మాస్టారి మాటలు వినగానే రాము ముఖం సంతోషంతో వెలిగిపోగా సోము ముఖం చిన్నబోయింది. అప్పుడు  శంకరం తెలుగు మాష్టారితో అంతవరకూ జరిగిన విషయం చెప్పాడు.  “ మీరు నిజాయితీగా ఆ నోటు తెచ్చి రాముని గెలిపించారు. ఇప్పుడు సోముకి నిజాయితీ విలువ తెలుస్తుంది. బడిలోని  పిల్లలకే కాకుండా రహదారిలో కూడా మంచి పాఠం బోధించారు. మీకు అభినందనలు” అన్నాడు ఆనందంగా.

దానికి మాస్టారు “ప్రదేశం ఏదైనా నా వృత్తిధర్మం నిర్వర్తించడంలో తేడాలుండవు. దారితప్పే విద్యార్ధులని సరైన దారిలో  పెట్టడానికి వచ్చే ఏ అవకాశమూ వదులుకోను” అని నవ్వుతూ చెప్పారు.

అప్పుడు శంకరం “ఈ డబ్బు దాని సొంతదారునికి  అందిoచే పని మిగిలింది. ఇప్పుడేమంటావు సోమూ!”అని అడిగాడు.

సోము సిగ్గు పడుతూ “మనం సుబ్బయ్యశెట్టి దుకాణంకి వెళ్లి ఎవరైనా డబ్బు పోయినట్లు చెప్పారేమో కనుక్కుని ఇచ్చేద్దాము”  అన్నాడు.వాళ్ళు వెళ్లేసరికి ఒక వ్యక్తి సుబ్బయ్యశెట్టితో తన డబ్బు పడిపోయిందని బాధపడుతూ చెప్పడం కనిపించింది.ఆ నోటు అతడిదో కాదో నిర్ధారించుకుని దానిని అప్పగించారు. అది జరిగిన తర్వాత సోము ప్రవర్తనలో మార్పు వచ్చింది. లోకంలో కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నంత మాత్రాన అందరినీ అనుమానించకూడదని బోధపడి నిజాయితీగా మెలగడం నేర్చుకున్నాడు. సోములో వచ్చిన మార్పుకి ఎంతో  సంతోషించారు శంకరం కుటుంబ సభ్యులు. అయితే వారికెవరికీ  తెలియని విషయం ఒకటుంది.

తమ ఇంటికి కావాల్సిన సరుకులు కొనడానికి సుబ్బయ్యశెట్టి  దుకాణానికి వెళ్ళిన మాస్టారికి సోము మాటలు వినిపించాయి. పరాయివాళ్ళ డబ్బుకి ఆశ పడుతున్న సోము ప్రవర్తనకి బాధ పడ్డారు. బడిలో చెప్పిన మంచి విషయాలు గాలి కొదిలేసి అతడలా చెడ్డగా  ఆలోచించడం నచ్చక వారిని రహస్యంగా వెంబడించి మిగతా కథ నడిపించారు.  ఆ నోటుని మరొకరు తియ్యక  ముందే తెచ్చి ఇచ్చారు. మొత్తం మీద సోములో నిజమైన  పరివర్తన  వచ్చింది.  దానికి మాస్టారు కూడా సంతోషించారు.

మరిన్ని కథలు
ramanaravu-raasiphalalu telugu story