Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
where are you

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఫ్రీగా వచ్చిందేదైనా సరే... - భమిడిపాటి ఫణిబాబు.

enough if get free

అందరికీ తెలిసినదే.. ఏదైనా ఊరికే అంటే ఏ ఖర్చూలేకుండా వస్తే దాని విలువ తెలియదు. పోనీ అలాగని అప్పనంగా దొరికేవి వదులుతామా అంటే అబ్బే  అలా కుదరదు.ఈ అంతర్జాలం వాడుకలోకి వచ్చినప్పటినుంచీ, ఎడా పెడా వెదికేయడమే ఏ సైటులో freebies దొరుకుతాయో,దానికి సాయం కొన్ని బ్లాగులుకూడా కనిపిస్తూంటాయి అదేదో ఫలానా సైటుందీ, అందులో ఉత్తినే రిజిస్టరు చేసికుంటే అదేదో లోషనిస్తారూ, హెయిర్ ఆయిలిస్తారూ, ఇంకో క్రీమేదో ఇస్తారూ అంటూ.ఇంకోళ్ళకి చెప్పడం బాగానే ఉంటుంది, నేనూ ఒకటిరెండు సార్లు కక్కూర్తిపడ్డాననుకోండీ,  అలాగే దీపావళి కీ, దసరాలకీ దుకాణాలవాళ్ళు ఏదో కొంటే ఇంకోటేదో ఉచితం అని, పొలోమని వెళ్ళిపోతూంటాము. ఆ కొట్టువాడికి అమ్మకం అవలేదూ ఓ వస్తువూ అని అనిపిస్తే, ఇంకోటేదో కొంటే దానితో అంటాకట్టేస్తూంటాడు. మనమేమో కొనేస్తూంటాము. చెప్పొచ్చేదేమిటంటే "వస్తువులు" అనేటప్పటికి ఎగరేసికుంటూ వెళ్ళిపోతాము. అదే ఓ సలహా అనో,  జ్ఞానబోధో అనిమాత్రం అనండి, ఛస్తే దాని జోలికి మాత్రం వెళ్ళము.అదేమిటో మనకి సంబంధించింది కాదూ అనేసికుని, పాటిస్తేనే ఏదో పాపం  అనుకుంటాము.

పోనీ ఆ సలహాలూ,  జ్ఞానబోధలూ చేసేవాళ్ళు, మనకేమైనా శత్రువులా అంటే అదీ కాదూ, మన శ్రేయోభిలాషులే, అయినా సరే వీళ్ళు చెప్పేదేమిటీ, మనం వినేదేమిటీ అనే ఓ అభిప్రాయం.దీనితో ఏమైపోతుందీ అంటే, మనం అన్నేళ్ళనుండీ పాటిస్తున్న పధ్ధతులే మంచివీ సరైనవీ,ఆ అవతలివారు చెప్పేది ఏదో కాలక్షేపం కబుర్లూ అని ! ఉదాహరణకి మనకో అలవాటుందనుకోండి, చిన్నప్పుడు తల్లితండ్రులో, స్కూల్లో మాస్టారో పాపం ఆ అలవాటు మాన్పించే ప్రయత్నం చేస్తారు, కానీ ఆ వయస్సులో మన బుర్రకెక్కదు. పెళ్ళైన తరువాత భార్యకూడా ప్రయత్నిస్తుంది,  వీళ్ళంతా మన శత్రువులా, కానే కాదు. చిన్నప్పటి మాట వదిలేయండి, భార్య చెప్పినా కూడా, " నాదారిన నన్నొదిలేద్దూ, నేను చేసేదాంట్లో నాకు సుఖం ఉందీ, దీనివలన నేనెమైనా కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉన్నానా ఎప్పుడైనా, నా సరదా నాదీ, ప్రాణహాని లేనంతకాలం ఫరవాలేదు లెద్దూ, నీకేం కావలిసినా క్షణంలో చేస్తున్నాను కదా.." అంటూ, తనుచేసేదానిలో, తనకే కనిపించే ఏదో ఒకటి చూపించేసి సమర్ధించేసికుంటాడు. పైగా ఇంగ్లీషొచ్చునుకదా అని దానికో ముద్దుపేరు-comfort level/zone  అని కూడా పెట్టుకుంటాడు. ఎందుకొచ్చిన గొడవా, గట్టిగా ఏదైనా అంటే దేశాలట్టుకుపోయినా పోవచ్చూ, అసలే మొండి ఘటం కూడానూ అని ఆవిడా వదిలేస్తుంది !

ప్రస్తుత రోజులు చూడండి, ఇళ్ళల్లో పెద్దాళ్ళు, ఊరికే కూర్చోలేక, ప్రతీ దాంట్లోనూ సలహాలిచ్చేస్తూంటారు, అలా కాదూ, ఇలా కాదూ అంటూ. ఈ సలహాపంపిణీ కార్యక్రమం ధర్మమా అని, ఈ పెద్దాళ్ళంటే, కుర్రకారుకి ఎక్కళ్ళేని చిరాకులూనూ.రిటైరయిన తరువాత పనిలేక చేసే పనులూ అనే కానీ, ఓసారి వింటే ఏంపోయిందిలే అనిమాత్రం అనుకోరు.ఇంట్లో చిన్నపిల్లలుంటారు, వాళ్ళకా చెయ్యీ కాలూ ఊరుకోదు, పోనీ అలాగని ఏ activity  లేదూ అంటే, అదో రోగం  అనుకుంటారు, ఏ వయస్సులో ఆ అల్లరి చెయ్యాలి, కాదనరు ఎవరూ.ఇంట్లో పెద్దాళ్ళకేమో ఈ చిన్న పిల్లల అఘాయిత్యాలు   చూసి గుండె బేజారెత్తిపోతూంటుంది, పోనీ అలాగని ఏదైనా అదిలించారా, ఆ చిన్నపిల్లల తల్లితండ్రులు వెంటనే react  అవుతారు. వాళ్ళదారిన వాళ్ళని వదిలేయండీ, ఓసారి పడితేనే కదా తెలిసేదీ,అప్పుడెప్పుడో నెట్ లో కూడా చదివానూ, అలాగే వదిలేయాలిటా అని ఆ పెద్దాళ్ళకి ఓ క్లాసు పీకుతారు. దానితో ఈ పెద్దాళ్ళు నిస్సహాయంగా ఉండిపోతారు,ఏం చెప్తే ఏం తప్పో అనుకుని. చిన్నపిల్లలకి ఫలానాది పెట్టకూడదని చెప్పకూడదు. వాళ్ళని అంతగా తిండికి  మొహంవాచిపోయేటంతగా చేయాల్సిన అవసరం ఏముందీ ఇప్పుడూ, ఇద్దరం లక్షలులక్షలు సంపాదిస్తున్నాముగా, అని కొట్టిపారేస్తారు!

ఇలా ప్రతీవిషయంలోనూ ఎడ్డెం అంటే తెడ్డెం లాగే జరుగుతూంటుంది. చివరకి ఈ పెద్దాయన భార్య రంగంలోకి దిగి, "మీకెందుకండీ ఊరికే హైరాణ పడిపోతారూ, మీరుమాత్రం నామాటెప్పుడైనా విన్నారా.." అంటూ ఓ కసురు కసిరేసరికి నోరుమూసుక్కూర్చుంటాడు. అదన్నమాట అసలు విషయం- ఒకళ్ళు ఊరికే చెప్పింది ఇంకోళ్లకి నచ్చదూ.. అంటే నచ్చదూ.. Thats the bottom line.

అసలు ఈ సోదంతా ఎందుకూ అంటే, చెప్పానుగా ఆమధ్య పిల్లలు, నన్ను ఓ అర్హోపెడీషియన్ దగ్గరకు తీసికెళ్తే ఆ మోకాలి చిప్పకి అదేదో ఆపరేషను చేయాలీ అనగానే, మేము ఇంకో డాక్టరు దగ్గరకి వెళ్ళడమూ వగైరా..వగైరా, ఆ సందర్భంలో అన్నమాట ఈ వ్యాసం. చెప్పేనుగా, ఆయన ఏవేవో మందులువ్రాసి, ఓ పదిరోజులు తరువాత కనిపించమన్నారు. ఆఅగే అనుకుని వెళ్ళాము. ఆయనేమో simple గా ఓ అరడజను exercise లు చెప్పారు. ఓ పదేళ్ళదాకా ఢోకా( కాలికి) లేదని ఢంకా బజాయించి మరీ చెప్పారు. పోనీ ఆయనచెప్పినవేమైనా కొత్తవా అంటే, అదీకాదు,పోనీ వాటికి ఏమైనా అదనపు ఖర్చా అంటే అదీ లేదూ, పోనీ వాటికోసం కొత్తగా ఏదైనా నేర్చుకోవాలా అంటే అదీ లేదూ, పెళ్ళైన అయిదేళ్ళనుంచీ, మా ఇంటావిడ నెత్తీ నోరూ మొత్తుకుని చెప్తున్నవే. పాతికేళ్ళనుంచీ, మాడాక్టరు స్నేహితుడు చెప్తున్నవే. సులభమైన భాషలో చెప్పాలంటే, నా  body posture లో చిన్న చిన్న మార్పులు తెచ్చుకోమన్నారు. As simple as that-- మొదలెట్టానూ, మార్పు కనిపిస్తోంది. ఈ తెలివితేటలేవో ముందరే ఉంటే, ఇంత గొడవయ్యేదీ కాదూ, Xray లకీ, మందులకీ, డాక్టర్ల ఫీజులకీ ఇంత ఖర్చూ అయ్యెది కాదు. అబ్బాయే పెట్టుకున్నా ఖర్చు ఖర్చే కదా!అరవైఅయిదేళ్ళనుండీ ఉన్న మోకాలి నొప్పి రాత్రికి రాత్రే తగ్గిపోయిందని కాదు కానీ, తగ్గే మార్గంలో మాత్రం పడింది.I can feel it !

పోనీ ఇంతజరిగాకైనా, మన తప్పు ఒప్పుకుంటామా అంటే అదీ లెదూ, " పొనిద్దూ రాసిపెట్టుందీ, ఖర్చయిందీ.." అని ఓ దిక్కుమాలిన వేదాంతమోటీ ! ప్రతీదానికీ వేదాంతమోటి చెప్పేసి, అవతలివాళ్ళ నోరుమూసేయడం. ఇందులో మాత్రం రెడియే.చూడండి, బ్రహ్మశ్రీ చాగంటి  వారు తన ప్రవచనాల్లో ఏం చెప్తున్నారూ, భగవంతుడి దయ ప్రాప్తించాలంటే ఏవిటేవిటో పూజలు చేయఖ్ఖర్లేదూ, ఓ బిళ్వపత్రమో, ఓ తులసాకో భక్తితో ఆ దేవుడికి సమర్పిస్తే చాలూ. ఖాళీ ఉన్నప్పుడల్లా  శ్రీరామ శ్రీరామ అనుకోమంటున్నారు. వీటికేమైనా డబ్బులు ఖర్చుపెట్టాలా ఏమిటీ? పోనీ ఆయన చేసే ప్రవచనాలకి టిక్కెట్టేమైనా కొన్నామా అంటే అదీ లేదూ. ఉచితంగా ఆయనచెప్పే ప్రవచనాలు- వింటున్నంతసేపూ బాగానే వింటాము, ఇదిగో రేపణ్ణించీ మొదలెట్టేయాలీ అనేసికుని, మర్నాటినుంచీ మళ్ళీ మామూలే, చిన్నపిల్లల దగ్గరనుంచీ నోట్లో "శ్రీరామ" మాట దేవుడెరుగు, వినిపించేవి ఏమిటీ-- " షీలాకీ జవానీలూ", "నా వయసింకా పదహారేలూ.." నూ.

అవతలివారు చెప్పేవి రైటూ అని తెలుసు, కానీ వాటిని ఆచరించేసరికి పుణ్యకాలం కాస్తా అయిపోతుంది! ఏది చెప్పండి, " ఇప్పణ్ణుంచీ ఎందుకులెండి, ఇంకా టైముందిగా.." అనేవారే. అందుకనే ఫ్రీగా వచ్చే సలహాలుకూడా సాధారణంగా బాగానే ఉంటాయి. అది గ్రహించే జ్ఞానమే ఈరోజుల్లో కరువైపోయింది....

మరిన్ని శీర్షికలు
duradrustapu dongalu