Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movie Review - Loukyam

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview with gopichand

యాక్ష‌న్ క‌థ‌లకు అతికిన‌ట్టు స‌రిపోతాడు గోపీచంద్‌. ఆర‌డుగులు ఉంటాడేమో.. ఫైట్ చేస్తే తుపానే. అయితే తొలిసారి.. ఎంట‌ర్‌టైన్ మెంట్‌ని న‌మ్ముకొన్నాడు. ఆ సినిమానే లౌక్యం. క‌థ‌ని న‌మ్మ‌డం గోపీచంద్ సెంటిమెంట్‌. మ‌రోటి కూడా ఉంది.. టైటిల్ చివ‌ర సున్నా వ‌చ్చేలా చూసుకోవ‌డం. జ‌యం, య‌జ్ఞం, ర‌ణం, ల‌క్ష్యం, శంఖం, సాహ‌సం... ఇలా సున్నా సెంటిమెంట్ కొన‌సాగింది. ఇప్పుడు మ‌రోసారి లౌక్యంతో ఆ సెంటిమెంట్ పున‌రావృత‌మైంది. ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా గోపీచంద్‌తో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించింది. గో తెలుగు డాట్ కామ్‌. గోపీచంద్ చెప్పిన క‌బుర్లు ఇవీ...

* లౌక్యం.... ఎలాంటి సినిమా?
- ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా అండీ. సినిమా మొద‌లైన ద‌గ్గ‌ర నుంచీ చివ‌రి వ‌ర‌కూ న‌వ్వుతూనే ఉంటారు. గ్యారెంటీ నాది..

* తొలిసారి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని న‌మ్ముకొన్నార‌న్న‌మాట‌..
- అవునండీ. ర‌ణం, శౌర్యం, శంఖం సినిమాల్లో కామెడీ ఉంటుంది. అయితే యాక్ష‌న్ డామినేష‌న్ ఎక్కువ‌. తొలిసారి ఆ ఫార్ములా రివ‌ర్స్ అయ్యింది..

* ఫైట్స్ లేక‌పోతే మీ ఫ్యాన్స్ ఫీల‌వుతారేమో...?
- భ‌లేవారే. ఫైట్స్ లేక‌పోతే ఎలా..?  నేను కూడా ఫీల‌వుతా. ఫైట్స్ ఉంటాయి. కానీ ఫైట్స్ కోసం ఫైట్స్ అని కాకుండా.. ఓ ప‌ర్‌ర్ప‌స్ ఉండేలా డిజైన్ చేశాం. ఇక్క‌డ హీరో విల‌న్‌ని కొడితే బాగుండును...అని ఆడియ‌న్ అనుకొంటే ఆ ఫైట్ హిట్టే. అలాంటి పోరాట స‌న్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి.

* ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్లో ఈ సినిమాని అత్తారింటిటికి దారేదితో పోల్చారు. అంత న‌మ్మ‌కం ఏంటి?
- అయ్ బాబోయ్‌. ఆ సినిమాకీ మా సినిమాకీ పోలిక లేదు. ప‌వన్ క‌ల్యాణ్‌కి అత్తారింటికి దారేది ఎలా మైల్‌ప్టోన్ అయ్యిందో, గోపీచంద్ కి ఈ లౌక్యం అలాంటి సినిమా అవుతుంద‌ని నిర్మాత చెప్పారు. దాన్ని అలా అర్థం చేసుకొన్నారంతే.

* ఈ సినిమాపై ముందు నుంచీ బాగా న‌మ్మ‌కంతో ఉన్నారు. కచ్చితంగా సూప‌ర్ హిట్ అవుతుంద‌న్న రేంజులో మాట్లాడుతున్నారు. అంత న‌మ్మ‌కం ఏమిటి?
- క‌థ అలాంటిదండీ. వింటున్న‌ప్పుడే నేను ప‌డి ప‌డి నవ్వాను. క‌రెక్ట్‌గా తీస్తే... ఈ సినిమా నన్ను మ‌రో లెవిల్‌కి తీసుకెళ్ల‌డం ఖాయం అని ఆ రోజే న‌మ్మా....

* లెవ‌ల్ అంటే..
- ఈ సినిమాతో నాకు ఫ్యామిలీ ఆడియ‌న్స్ కూడా ద‌గ్గ‌ర‌వుతార‌ని బ‌లంగా న‌మ్మా. నిజంగా అదే జ‌రుగుతుంది. అంత న‌మ్మ‌కం ఉంది నాకు ఈ సినిమాపై..

* ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు బాగా వ‌సూలు చేస్తున్నాయి. అందుక‌నే అంత న‌మ్మ‌క‌మా?
- ఈ సీజ‌న్‌లో ఇలాంటి సినిమాలే ఆడ‌తాయ్ అన్న గ్యారెంటీ ఏమీలేదండీ. మాస్ సినిమాలే ఆడ‌తాయ్ అనుకొంటున్న త‌రుణంలో ఈగ లాంటి సినిమాతో రాజ‌మౌళిగారి లాంటి ద‌ర్శ‌కుడు ఓదో ఓ ప్ర‌యోగం చేస్తుంటారు... అది అంద‌రికీ న‌ర్చేయొచ్చు. ఫార్ములాకి దూరంగా వెళ్లారా?  ద‌గ్గ‌ర‌గా వెళ్లారా? అనేది కాదు పాయింట్‌. మీరు అనుకొన్న క‌థ అంద‌రికీ న‌చ్చేలా ఎలా తీశారు అనేది చాలా ముఖ్యం..

* ఏ హిట్ సినిమా తీసుకొన్నా.. అందులో ప‌ది పాత సినిమాలు క‌నిపిస్తున్నాయి. కార‌ణం ఏమిటి?
- కొత్త క‌థ‌లు రావండి. అవి వ‌స్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ‌. అంకెలు తొమ్మిదే ఉంటాయ్‌. వాటిని ఎలా మార్చుకొని సంఖ్య‌లు చేస్తున్నారు?  ఎంత అందంగా రాస్తున్నారు అనేదే ముఖ్యం. క‌థ‌లూ అంతే. ల‌వ్ అనే ఎమోష‌న్ ఎంత కాలం నుంచి చూస్తున్నారు?  అయినా ప్రేమ క‌థ‌లు రావ‌డం లేదా?  వ‌చ్చి హిట్ కొట్ట‌డం లేదా?  ఎమోష‌న్ మార‌న‌ప్పుడు క‌థ‌లు ఎందుకు మారాలి?  పాత క‌థ తీసుకొన్నా ఫ‌ర్లేదు. ట్రీట్ మెంట్ కొత్త‌గా ఉంటే చాలు..

* ర‌చ‌యిత‌లు, క‌థ‌కుల కొర‌త తెలుగు సినిమాకు ఇంకా ఉందా?
- ఉంది. ఉన్న‌వాళ్ల‌తోనే స‌రిపెట్టుకోవాలి..

* గోపీమోహ‌న్‌, కోన‌వెంక‌ట్‌ని తీసుకొచ్చారు. ఈక‌థ‌కు వారు చేసిన స‌హాయం ఏమిటి?
- శ్రీ‌ధ‌ర్ క‌థ చెప్ప‌గానే నాకు న‌చ్చేసింది. అయితే ఏదో మిస్ అయిన ఫీలింగ్‌. పూర్తిగా న‌మ్మ‌లేకపోయా. ఎప్పుడైతే మా టీమ్‌లో గోపీమోహ‌న్‌, కోన వెంక‌ట్ క‌లిశారో అప్పుడు ఈ క‌థ‌పై పూర్తి న‌మ్మ‌కం వ‌చ్చింది. మేం త‌ప్పులెక్క‌డ చేశామో వాళ్లు చెప్పారు. క‌థ‌ని ఎక్క‌డ లేపాలో వాళ్ల‌కి బాగా తెలుసు. వాళ్ల పార్టిస్పేష‌న్ చాలా హెల్ప్ అయ్యింది..

* బ్ర‌హ్మానందాన్ని మీరు కూడా బ‌క‌రాలా వాడుకొన్నార‌ట క‌దా?
- (న‌వ్వుతూ) బ‌క‌రా అని చెప్ప‌లేను. కానీ ఆయ‌న‌దీ కీల‌క పాత్ర‌..

* ఏ సినిమా చూసినా ఒకే ఫార్ములాతో వెళ్తున్నాం. దీన్ని బ్రేక్ చేయ‌లేమా?
- కేవ‌లం ఫార్ములాని న‌మ్ముకొంటే వ‌ర్క‌వుట్ కాలేం. హిట్ ఫార్ములాని వాడుకొన్న ప్ర‌తి సినిమా హిట్ ఎందుకు కావ‌డం లేదు?   ఎందుకంటే.... క‌థ‌లో అది అత‌కడం లేద‌న్న‌మాట‌. క‌థ‌కు అవ‌స‌రం లేని ఫార్ములాలు ఎన్ని పెట్టినా ఉప‌యోగం లేదు.

* క‌థ విష‌యంలో ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొంటారు క‌దా? అయినా మీ కెరీర్‌లోనూ ఫ్లాపులు ఎందుకొచ్చాయ్‌?
- అవి తెలిసి చేసిన పొరపాట్లే. రారాజు, ఒంట‌రి, వాంటెడ్‌.. ఈ మూడు సినిమాల్నీ ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. ఈ సినిమాలు ఫ్లాప్‌ల‌ని ముందే తెలిసిపోయింది. కానీ ఏం చేయ‌లేక‌పోయా. ఇక మీద‌ట ఆ త‌ప్పుల్ని పున‌రావృతం చేయకూడ‌ద‌ని బ‌లంగా నిర్ణ‌యించుకొన్నా.

* భూప‌తి పాండ్య‌న్ సినిమా మ‌ధ్య‌లోనే ఆగిపోవ‌డానికి కార‌ణం ఏమిటి?
- పై సినిమాల విష‌యంలో చేసిన పొర‌పాట్లు పున‌రావృతం అవుతాయ‌న్న భ‌యంతోనే. ఆ సినిమా క‌థ న‌చ్చ‌లేదు. అందుకే నో చెప్పా. ముందే బ‌య‌ట‌ప‌డిపోవ‌డం వ‌ల్ల నిర్మాతని కాపాడుకోగ‌లిగా.

* ఒకేసారి రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. స్పీడ్ పెంచిన‌ట్టేనా?
- క‌థ‌లు అలా కుదిరాయి అంతే. మంచి క‌థ దొరికితే నేను టైమ్ వేస్ట్ చేయ‌ను.

* యువి క్రియేష‌న్స్ సినిమా ఎంత వ‌ర‌కూ వ‌చ్చింది?
- జ‌న‌వ‌రిలో రిలీజ్ చేద్దామ‌నుకొంటున్నాం..

* ఒకే.. ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ.

-కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
cinechuraka