Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష : లౌక్యం

Movie Review - Loukyam
తారాగణం: గోపీచంద్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సంపత్‌, బ్రహ్మానందం, ముఖేష్‌ రుషి, చంద్రమోహన్‌, పృధ్వీ, రాహుల్‌ దేవ్‌, రఘుబాబు, హంసానందిని తదితరులు
చాయాగ్రహణం: వెట్రి
సంగీతం: అనూప్‌ రుబెన్స్‌
నిర్మాణం: భవ్య క్రియేషన్స్‌
దర్శకత్వం: శ్రీవాస్‌
నిర్మాత: వి.ఆనంద్‌ప్రసాద్‌
విడుదల తేదీ: 26 సెప్టెంబర్‌ 2014

క్లుప్తంగా చెప్పాలంటే :
వెంకీ (గోపీచంద్‌) సరదాగా లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తోన్న ఓ మామూలు కుర్రాడు. తొలిచూపులోనే చంద్రలేఖ (రకుల్‌ ప్రీత్‌సింగ్‌)తో ప్రేమలో పడతాడు వెంకీ. అయితే వెంకీ ప్రేమించిన చంద్రలేఖ, పేరుమోసిన విలన్‌ బాబ్జీ (సంపత్‌) చెల్లెలు. బాబ్జీకి ఇంకో సోదరి వుంటుంది. ఆమె, తనకు నచ్చినవాడితో ప్రేమలోపడి, ఇంట్లోంచి పారిపోతుంది. తన చెల్లెల్ని ప్రేమ పేరుతో తనకు దూరం చేసిన వ్యక్తి కోసం వెతుకుతుంటాడు బాబ్జీ. దీనికోసం సిప్పీ (బ్రహ్మానందం) సహాయం తీసుకుంటాడు. బాబ్జీ వెతుకుతున్న వ్యక్తి ఎవరు? చంద్రలేఖను ప్రేమించిన వెంకీ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు? ఒక చెల్లెలు ప్రేమ కారణంగా తనకు దూరమవడం జీర్ణించుకోలేని బాబ్జీ, వెంకీ ` చంద్రలేఖల ప్రేమను అంగీకరించాడా? అన్నవి తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే :
మాస్‌ హీరోగా మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్న గోపీచంద్‌, కొన్నాళ్ళుగా సరైన సక్సెస్‌లు లేక డీలాపడినా, కొత్తగా ఎంటర్‌టైనింగ్‌ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్‌ సీన్స్‌లోనూ రాణించాడు. చాలా ఈజ్‌తో తన పాత్రను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వెంకీ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు గోపీచంద్‌. స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో మంచి టైమింగ్‌తో గోపీచంద్‌ కనిపించాడు.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గ్లామరస్‌గా వుంది. నేచురల్‌ బ్యూటీ ఆమె సొంతం. నటన పరంగానూ మంచి మార్కులే వేయించుకుంటుంది. కావాల్సినంత డోస్‌లో గ్లామర్‌ పండించడంతో ఆమె కన్పించిన మేర యూత్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. సంపత్‌ రాజ్‌ విలన్‌ పాత్రలో రాణించాడు. బ్రహ్మానంద నవ్వులు పూయించాడు. ముఖేష్‌ రుషి, చంద్రమోహన్‌ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. హంసానందిని హాట్‌ హాట్‌గా కనిపించింది. రాహుల్‌ దేవ్‌, పృధ్వీ ఓకే.

సినిమాటోగ్రఫీ బావుంది. సినిమాకి రిచ్‌నెస్‌ తీసుకొచ్చింది. నిర్మాతలు పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. సినిమాని క్వాలిటీతో రూపొందించారు. ఎడిటింగ్‌ ఓకే. మ్యూజిక్‌ బావుంది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంటుంది. పాటలు ఇంకాస్త బావుంటే సినిమాకి ప్లస్సయ్యేవి. సోసోగా వున్నాయంతే. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్స్‌ సినిమాకి హెల్పయ్యాయి. తర్వాతి సీన్‌లో ఏం జరుగుతుందో ముందే ఊహించుకోగలిగే రొటీన్‌ కథాంశంతో సినిమా రూపొందినా చక్కటి స్క్రీన్‌ప్లేతో ఆ లోటు ఎక్కువగా రిజిస్టర్‌ అవదు. డైలాగ్స్‌ చాలా బాగున్నాయి.

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అనగానే, కొత్తదనమేమీ కన్పించడంలేదు. అయితే చెప్పే విధానంలో తెలివిగా వ్యవహరిస్తే ప్రేక్షకులకు బాగానే రీచ్‌ అవుతున్నాయి రొటీన్‌ సినిమాలే అయినా. అలా ఈ సినిమాని ప్రేక్షకులకు రీచ్‌ అయ్యేలా తెరకెక్కించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఫస్టాఫ్‌ అంతా ఎంటర్‌టైన్‌మెంట్‌తో సరదా సరదాగా సాగిపోతుంది. అక్కడక్కడా యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో పేస్‌ తగ్గకుండా వుంటుంది. ఇంటర్వెల్‌కి ప్రామిసింగ్‌గా అనిపిస్తుంది. సెకెండాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ తగ్గకుండా, యాక్షన్‌ని కాస్త పెంచడంతో సినిమా ఓవరాల్‌గా బావుందనిపిస్తుంది. ఫ్యామిలీస్‌ని ఆకట్టుకునేలా సినిమాని క్లీన్‌గా తెరకెక్కించడం వల్ల కమర్షియల్‌గానూ సినిమా బాగా ఫేర్‌ చేసే అవకాశం ఉండొచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే : ‘లౌక్యం’ విత్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

అంకెల్లో చెప్పాలంటే: 3+ / 5

 

మరిన్ని సినిమా కబుర్లు
interview with gopichand