Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
my documentary on shiva

ఈ సంచికలో >> సినిమా >>

గోదారి ఒడ్డున వోడ్కా బాటిల్

vidka bottle at godavari
నిన్న మధ్యాహ్నం ‘శివ-25 ఏళ్ళ తర్వాత’ డాక్యుమెంటరీ చేసే పనిలో భాగంగా కొన్ని విషయాలు మాట్లాడటం కోసం రామ్‌గోపాల్‌ వర్మని కలవడానికి ఆయనకి ఫోన్‌ చేశాను. ‘ఐస్‌క్రీమ్‌`2’ ప్యాచ్‌ వర్క్‌లో వున్నాననీ, అల్యూమినియం ఫ్యాక్టరీకి రమ్మనీ చెప్పారు. సరే అని వెళ్ళాను. అక్కడికి వెళ్ళే సరికి సీనియర్‌ దర్శకులు వంశీ దర్శనమిచ్చారు. ఆయన ‘గో తెలుగు డాట్‌ కామ్‌’లో వంశీకి నచ్చిన కథలు శీర్షిక రాస్తుండడం, గో తెలుగు డాట్‌ కామ్‌ వ్యవస్థాపకులు బన్నుగారికి ఆయన చాలా ఆప్తమిత్రులు కావడం వల్ల ఆయనతో నాకు పరిచయం గత కొంతకాలంగా ఉంది. ఇంతకీ వర్మ లో-బడ్జెట్ సినిమాలు తీసే విధానాన్ని గమనించడానికని వచ్చారట వంశీ. 
 
కాస్సేపు ఆయనతో ముచ్చటించాను. ఇంతలో వర్మ లంచ్‌కి పిలిచారు. లంచ్‌ చేస్తూ వర్మగారు, వంశీగారు సంభాషణల్లో పడిపోయారు. 80ల నాటి సినిమాల గురించి మాట్లాడుకుంటూ, ఇళయరాజా సంగీతం గురించి చర్చించుకుంటూ ఆనాటి ఆసక్తికర విశేషాలు, అనుభవాలు షేర్ చేసుకున్నారు. అవన్నీ చెప్పాలంటే ఇంకో వ్యాసం రాయాలి. 
 
వంశీగారు తీసిన ‘గోపెమ్మ చేతిలో గోరు ముద్ద..’ పాటని హం చేస్తూ ఆ సాహిత్యం గురించి గొప్పగా చెప్పారు వర్మ.. ఇలాగ అనేక అంశాలతో సంభాషణ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఇంతలో వంశీగారు "అప్పట్లో "అన్వేషణ" సినిమాకి పాతిక లక్షలు బడ్జెట్‌ అయ్యింది".. అన్నారు. దానికి వర్మ క్షణం కూడా ఆలోచించకుండా "ఇప్పుడైతే రెండు లక్షల్లో అయిపోయేది".. అన్నారు. వర్మ ఉద్దేశ్యం ఆ సినిమాని చిన్న చూపు చూడడం కాదు. వంశీ అన్నా, ఆయన సినిమాలన్నా వర్మకి ప్రత్యేక గౌరవం. లో బడ్జెట్‌ ఫార్ములా వర్మగారి నరనరాల్లో ఎలా జీర్ణించుకుపోయిందో అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ.
 
వంశీ వర్మగారికంటే సీనియర్‌. ఆ గౌరవం వర్మగారిలో బాగా కనిపిస్తుంది. అలాగే వంశీగారికి వర్మగారంటే చాలా అభిమానం. ఒక తెలుగువాడై వుండి జాతీయ స్థాయిలో పెద్ద పేరు తెచ్చుకున్నటువంటి దిగ్దర్శకుడిగా పేరుగాంచినందుకు ఆయనకు వర్మ అంటే వాత్సల్యంతో కూడిన అభిమానం. వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఆ సంభాషణ వినడానికి చూడ్డానికి కూడా చాలా సరదాగా అనిపించింది. గోదావరి ఒడ్డున కూర్చుని వోడ్కా బాటిల్‌ ఓపెన్‌ చేసినట్లుగా వైవిధ్యంగా అనిపించింది.
 
ఇక వారి సంభాషణల్లో నేను గమనించిన మరో అంశం ఏంటంటే ఇద్దరికీ కామన్‌గా వున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ ఇళయరాజా. వంశీగారు వర్మగారిని అడిగారు.. ఇళయరాజాతో మీరెందుకు మళ్ళీ పనిచేయలేదు ‘శివ’, ‘క్షణక్షణం’ తర్వాత అని. దానికి వర్మ "నాకిప్పుడు వర్కవుట్‌ అవ్వదండీ.. పిలిస్తే పలికే మ్యూజిక్‌ డైరెక్టర్లు వెంటనే వాట్సాప్‌లో ఐడియా చెప్పగానే వాట్సాప్‌లోనే ట్యూన్‌ పంపించే వాళ్లు కావాలి.. ఇళయరాజాగారికి నా స్పీడ్‌లో పనిచేయడం కష్టం" అని అన్నారు. "ఆ డౌట్ ఉంటే మాకు అప్పజెప్పచ్చుగా మేం చూసుకుంటాం.. ఆ స్పీడ్ లో ఎలా చేయించుకోవాలో మేం చేయిస్తాం.." అన్నారు వంశీ. ఆ రోజు వస్తుందేమో అనిపించింది. వేచి చూద్దాం.
 
-సిరాశ్రీ 
మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam